తరగతి గదిని సజీవంగా మార్చిన ఆచార్యుడు


ప్రొఫెసర్ రామయ్యకు శ్రద్ధాంజలి

C.Ramaiah
తత్వశాస్ర్తాన్ని ఎవరికీ అర్థం కాని జడ పదార్థంగా పరిచయం చేయడం కాకుండా దానిని ప్రేమించి, శ్వాసించి, బోధించిన వారు అరుదు. ప్రొఫెసర్ చిట్ల రామయ్య అటువంటి అరుదైన ఆచార్యుల్లో ఒకరు. ఆయనే కాదు వడ్డెర చండీదాస్, ప్రొఫెసర్ వీరయ్య వంటి వారు మాకు గురువులుగా ఉండడం మా భాగ్యం. చండీదాస్ నీతిశాస్త్ర బోధ న చేసేవారు.వీరయ్య షడ్దర్శనాలను బోధించేవారు. రామయ్య సారు భారతీయ తత్వశాస్ర్తాన్ని, ప్రత్యేకించి విశిష్టాద్వైతాన్ని తన ఇష్టమైన అంశంగా బోధించేవారు. తత్వాన్ని జీవితానికి అన్వయించి బోధించేవారు. వివిధ తత్వాల మధ్య ఉన్న వైరుధ్యాలను ఆయన స్వేచ్ఛగా విద్యార్థులతో చర్చించేవారు. ఎంత తత్వశాస్త్ర ఆచార్యులైనా ఆయనకు భారతీయ తత్వం గొప్పదనే ఒక భావన ఉండేది. తత్వశాస్త్ర చర్చలన్నీ.. దేవుడున్నాడా లేడా, ఆత్మలున్నాయా లేవా, భౌతిక, అధిభౌతికాల్లో ఏది ప్రథమం, ఏది మంచి ఏది చెడు ఎలా నిర్ణయించడం వంటి అంశాల చుట్టూ హోరాహోరీగా చర్చలు జరిగేవి. కమ్యూనిస్టు తత్వశాస్త్ర ప్రభావంలో యూనివర్శిటీలో ప్రవేశించిన మాకు తత్వశాస్త్ర అధ్యయనం మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఆచార్య రామ య్య, చండీదాస్, వీరయ్యలు తీసుకునే తరగతులు ఎప్పు డూ ఓ పట్టాన ముగిసేవి కాదు. తదుపరి తరగతి చెప్పే ఆచార్యులు తరగతి గది బయటికి వచ్చి పచార్లు చేసి పోయేవా రు. అంటే తరగతిలో అంతగా చర్చను ప్రోత్సహించేవారు. తాత్విక జిజ్ఞాసను అంతగా ఆస్వాదించేవారు.

రామయ్యగారు ఒకరోజు ఆత్మలు, దేహాలకు అతీతంగా వాటి అస్తి త్వం గురించి బోధిస్తున్నారు. ఆత్మలు లేవని, అవి వెంటాడే భావాలు మాత్రమేనని వాదించాను. భావాలు దేహసంబంధమైనవని, ఒక మనిషికి సంబంధించిన రూపలావణ్యాలు, జ్ఞాపకాలు, భావాలు మాత్రమే అతని మరణానంతరం కొనసాగుతాయని, వాటిని మనిషి ఆత్మలుగా భావించేవారని వాదించాను. కానీ ఆత్మ సత్యం, ఆత్మనిత్యం అన్న భారతీయ తత్వమూలాలను ఆయన సుదీర్ఘంగా వివరించారు. ఆత్మ పరమాత్మను చేరినప్పుడు మనిషి జీవన్ముక్తుడవుతారని చెప్పేవారు. అయినా ఆయన అజమాయిషీ చేసేవారు కాదు. ఒప్పించాలని చూసేవారు కాదు. గంటలు గడచిపోయేవి. ప్రజాస్వామిక వాదిగా అభిప్రాయాలను గౌరవించేవారు. తత్వశాస్త్ర తరగతి గది సజీవంగా నడుస్తున్నందుకు ఆనందించేవారు. ఆయన పిల్లల్లో పిల్లవాడిలా, పెద్దల్లో పెద్దవాడిలా ఉండేవారు. భారతీయ తత్వపరిశోధనా మండలిలో చాలా కాలం సభ్యునిగా పనిచేశారు. అనేక మం ది ని పరిశోధనలకు ప్రోత్సహించి డాక్టరేట్లను చేశారు. నా ఎంఫిల్‌కు కూడా ఆయనే మార్గదర్శన చేశారు. క్యాన్సరు వచ్చిన తర్వాత కూడా ఆయన ధైర్యాన్ని చెదరనివ్వలేదు. ఇరవైనాలుగేళ్ల తర్వాత మాజీ విద్యార్థుల సమావేశం జరిగితే ఆయన ఉత్సాహంగా మాతో రోజంతా గడిపారు. తలకోన కొండకోనల్లో కలిసి నడిచారు. ఏర్పేడు ఆశ్రమ స్వామీజీ వ్యాఖ్యాన సహిత భగవద్గీతను తెనిగించే పనిని పెట్టుకున్నట్టు ఆ సందర్భంగా చెప్పారు. ఆయన చివరిదాకా చదవడం, రాయడం మానలేదు. ఆయన గొప్ప ఆచార్యుడు, తాత్విక జిజ్ఞాసి. గొప్ప మనిషి. ఆయన బుధవారం బెంగుళూరులో మరణించారు. తిరుపతిలో ఆయన అంతిమ సంస్కారాలు జరిగాయి. ఆయన విద్యార్థులపై చూపించిన ప్రేమ, వాత్సల్యం ఎప్పటికీ మరువలేనిది. ఆయనకు హృదయపూర్వక నివాళి.

Author: kattashekar

Former Editor, Namasthe Telangana Daily

Leave a comment