గొంగట్లో పాశం

People standing in long queues

 

గొంగడి లాంటి వ్యవస్థలను సంస్కరించకుండా జనం దగ్గర సొమ్ము లాగేసుకోవడం వల్ల నల్లధనం నిర్మూలన జరుగదు. కొత్తగా విడుదల చేసిన నోట్లు ప్రజల వద్ద ఎన్ని ఉన్నాయో, పెద్దల దగ్గర ఎన్ని ఉన్నాయో మరోసారి బ్యాంకు లెక్కలు చూస్తే తెలిసిపోతుంది. నరేంద్ర మోదీ జబ్బొక చోట ఉంటే మందొక చోట వేశారు. నేరస్తులు ఒకరయితే శిక్ష మరొకరికి వేశారు.

దేశం డిజిటల్ యుగంవైపు అడుగులు వేయడం మంచి పరిణామమే. లావాదేవీల్లో పారదర్శకత వస్తుంది. దందాలు తగ్గుతాయి. వినిమయతత్వం బలహీనపడుతుంది. దేశమైనా, రాష్ట్రమైనా, చివరికి కుటుంబమైనా ఏరోజు లెక్కలు ఆరోజు చూసుకోవడానికి వీలు కలుగుతుంది. ప్రపంచమంతా అటు ప్రయాణం చేస్తుంటే మనం మాత్రం చేతులు కట్టుకుని కూర్చోలేము. ఇవ్వాళ కాకపోయినా మరికొన్నాళ్లకయినా అందరూ అటువైపు మారాల్సిందే. ఇప్పుడు ప్రతిపైసా చూసుకుని ఖర్చుపెట్టుకోవలసి వస్తున్నది. వంద రూపాయలు అపురూపంగా కనిపిస్తున్నాయి అని మిత్రుడు చెబుతుంటే నోట్ల రద్దు కలిగించిన సానుకూల ప్రభావాన్ని కాదనలేము. లంచం అడిగే వారికీ ఇబ్బంది. ఇచ్చేవారికీ ఇబ్బం ది వచ్చింది. ఇవ్వడానికి నగదు లేదు. లంచం కింద చెక్ ఇస్తే తీసుకోడు అని మరో మిత్రుడు చెప్పారు. పెళ్లిళ్లు ఎలా చేయాలా అన్న భయం ఉండే. ఇప్పుడు ఆడంబరాలు అనివార్యంగా తగ్గిపోయాయి. నాకయితే సంబురంగా ఉంది. ఇంతింత ఖర్చు పెట్టి పెళ్లిళ్లు చేస్తుంటే దిగులు గా ఉండేది.

ఖర్చులే కాదు. కట్నాలు ఎలా లెక్క చెబుతారు? అడిగేవాళ్లు ఎలా అడుగుతారు? ఇచ్చేవాళ్లు ఎలా ఇస్తారు? అని ఒక పెద్దమనిషి ఒక పెళ్లి పందిరిలో వ్యాఖ్యానించారు. ఇది సామాన్యుల వద్ద ప్రధాని నరేంద్ర మోదీ సాధించిన విజయం. ఈ సానుకూల ప్రభావాలు కూడా నిజమే. ఇందులో అబద్ధమేమీ లేదు. కానీ నోట్ల రద్దును కేవలం ఈ ఫలితాలతో తూచలేము. ఎందుకంటే అది సృష్టించిన సంక్షోభం పెద్దది. దాని పర్యవసానాలు ఇంకా పెద్దవి. ముప్పై ఒకటో రోజు కూడా కోట్లాదిమంది ప్రజలు ఏటీఎంల వద్ద, బ్యాంకుల వద్ద గంటల తరబడి క్యూలలో నిలబడి అందరికీ డబ్బులు అందీ అందక అవమానాలపాలు కావలసి రావడం దారుణం. దేశంలో ఈ పరిస్థితి ఇంకా చాలాకాలం ఇలాగే ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మొత్తం ముద్రించిన 15.44 లక్షల కోట్ల పైచిలుకు వెయ్యి, ఐదొందల నోట్లలో నోట్ల రద్దు ప్రకటించే నాటికే బ్యాంకుల్లో లక్ష కోట్లు పైచిలుకు ఉందని చెబుతారు. నోట్ల రద్దు ప్రకటించే నాటికి మార్కెట్లో 14.17 లక్షల కోట్ల విలువజేసే వెయ్యి, ఐదొందల నోట్లు బయట ఉన్నాయి. బుధవారం నాటికి దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు, అన్నివర్గాల ప్రజలు 11.55 లక్షల కోట్లు బ్యాంకులలో జమ చేశారు. అంటే 80 శాతం నోట్లు వెనుకకు వచ్చేశాయి.

భారతీయ రిజర్వు బ్యాంకు కేవలం 4.27 లక్షల కోట్లు విలువ జేసే 2000, ఐదొందల నోట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. అంటే బ్యాంకుల్లో జమ అయిన విలువలో ముప్పై శాతం నోట్లను మాత్రమే విడుదల చేసింది. నగదు కొరత ఉంటేనే ప్రజలు నగదు రహిత లావాదేవీలవైపు మొగ్గుతారన్న ఉద్దేశపూర్వక వ్యూహంతోనే కేంద్రం ఇలా చేస్తున్నట్టు చెబుతున్నారు. త్వరలో మరికొన్ని నోట్లు వస్తాయి. నగదు కొరత తీరుతుందని చెబుతున్నదంతా అబద్ధం. నగదు కొరత తీరబోవడం లేదు. ప్రజల దగ్గర నుంచి తీసుకున్నదంతా తిరిగి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశం లేదని ప్రభుత్వం స్పష్టంగానే చెబుతున్నది.
demonetisation_queue_pti1
అంతర్జాతీయ ఆర్థిక అధ్యయనాల ప్రకారం మనదేశం 60 శాతం నగదు లావాదేవీలపై ఆధారపడుతున్న దేశం. బ్యాంకులు, ఏటీఎంలు అందుబాటులో లేని గ్రామాలు లక్షల్లో ఉన్నా యి. ఇప్పటికీ బ్యాంకు ఖాతాలు లేని జనాభా కూడా సగానికి పైగా ఉంది. ఇంకా 26 శాతం నిరక్షరాస్యులు ఉన్న దేశం మనది. ఇవన్నీ గాక నగదు లావాదేవీలు ప్రజలకు సులువు. తేలికగా జరుపుకునే అలవాటు ఉంది. ఇప్పుడు వారి డబ్బులు బ్యాంకుల్లోకి లాగి, వారిని వీధు ల్లో నిలబెట్టింది నోట్ల రద్దు నిర్ణయం. నల్లడబ్బు బయటికి తీస్తామని చెప్పిన ప్రభుత్వం సామాన్యుల డబ్బు ఠంచనుగా బ్యాంకులకు చేరేట్టు చూసింది కానీ ముందూ వెనుకా తీసుకోవలసిన చర్యలేవీ తీసుకోలేదు. దేశంలో నల్లడబ్బు కలిగినవారి శాతం అప్పుడయినా ఇప్పుడయినా ఒక శాతమో రెండు శాతమో ఉంటుంది. రెక్కల కష్టంతో సంపాదించుకుని పడకల కిందనో, పోపు డబ్బాల్లోనో, మొలతాడు సంచుల్లోనో దాచుకున్న డబ్బు నల్లడబ్బు కాదు.

వ్యవసాయాదా యం ఆదాయపు పన్ను పరిధిలో లేదు. కానీ మోదీ అప్రకటితంగానే వ్యవసాయాదాయాన్ని కూడా పన్ను పరిధిలోకి తెచ్చాడు. రెండున్నర లక్షలకు మించి ఏ రైతయినా బ్యాంకులో వేస్తే అతనికీ నోటీసు వెళుతుంది. అంటే మోదీ ఎవరిని లక్ష్యంగా పెట్టుకోవాలో వారిని పెట్టుకోలేదు. నల్లధనం పోగేస్తున్నవారిని, బ్యాంకులకు అప్పులు ఎగవేసి బలాదూరుగా తిరుగుతున్నవారిని, విదేశాల్లో డబ్బు దాచుకున్నవారిని ఏమీ చేయలేకపోయారు. వీరిని శిక్షించడానికి భారతీయ శిక్షాస్మృతిలో సెక్షన్లు చాలవా? అయినా అవేవీ ఉపయోగించుకోలే దు. బ్యాంకులను ముంచినవారు, ఆర్థిక నేరస్థులు ఆయన పక్కనే ఉన్నప్పుడు ఇవన్నీ ఎలా చేయగలడు? ఆయన ప్రకటించిన స్వచ్ఛంద ఆదాయ ప్రకటన పథ కం కూడా ఉత్త బోగస్ అని తేలిపోతున్నది. నరేంద్ర మోదీ నోట్లరద్దు పైకి ఉదాత్తంగా కనిపిస్తున్నా, ఇదంతా గొంగట్లో పాశం పోసి తాగమన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆయన చెప్పిన లక్ష్యాలేవీ నెరవేరే సూచనలు కనిపించడం లేదు. నోట్లను రద్దు చేస్తూ ఆయన ప్రధానం గా మూడు అంశాలను నొక్కి చెప్పారు.

నల్లధనాన్ని, అవినీతిని అరికట్టేందుకు, ఉగ్రవాదులకు నిధులు అం దకుండా చేసి, దేశ సరిహద్దులను కాపాడేందుకు, ఆర్థిక స్వచ్ఛత కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ప్రకటించారు. ఈ మూడు అబద్ధాలేనని తేలిపోయింది. నల్లధ నం, అవినీతి అరికట్టడం ఎలా ఉందో బ్యాంకుల నుం చి వందలు, పదుల కోట్లు ఎలా దారిమళ్లుతున్నాయో గమనిస్తే అర్థమయిపోతున్నది. ధన శేఖర్‌రెడ్డి అనే ఓ మామూలు కాంట్రాక్టరే ఇంత ధనం కొత్త నోట్లు పోగేశాడంటే ఇక ఈ దేశంలోని బడా పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, మాఫియా లీడర్లు ఎంత మార్చి ఉండాలి?

దేశం కోసం ఎంతసేపయినా క్యూలో ఉండటానికి సిద్ధం అని సోషల్ మీడియాలో ప్రగల్భాలు పలికిన తమిళనాడులోని ఓ బీజేపీ నాయకుడు 20.55 లక్షల కొత్త నోట్లు, అవి కూడా 2000 నోట్లు బయటికి తెచ్చాడంటే, ఈ ప్రభుత్వం నల్లధనం అరికడుతున్నట్టుగా ఎలా భావించేది. ఇలా వందలాది ఉదాహరణలు బయటికి వస్తున్నాయి. వీళ్లు దొరికిన దొంగలు. దొరక ని దొంగలు ఎంతమందో? ఇవి ప్రకటన వచ్చిన తర్వా త జరిగిన పరిణామాలు. ప్రకటన రాకముందు తెల్లవి గా మారిన నల్లధనం ఎంతో లెక్క తెలియదు. గత ఆగస్టు-సెప్టెంబరు మాసాల్లో బ్యాంకుల్లో గత ఆరేళ్లలో ఎన్నడూ లేని విధంగా 3.67 లక్షల కోట్ల నిధులు అన్ని బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి. మునుపెన్నడూ ఇం త అసాధారణ రీతిలో నిధులు డిపాజిట్ కాలేదు. ఒక్క సెప్టెంబరు చివరి పదిహేను రోజుల్లోనే డిపాజిట్లు 3.55 కోట్లు పెరిగినట్టు ఆర్బీఐ డేటా విశ్లేషణ ద్వారా తెలుస్తున్నది. ఏడవ వేతన సంఘం వేతన బకాయీలు ఇందు లో ఉంటాయని భావించినా అవి లక్ష కోట్లకు మించవని కేంద్రమే చెబుతున్నది.

అంటే దేశంలోని కొన్ని వర్గాలకు నోట్ల రద్దు గురించి ముందుగానే సమాచారం ఉండి బ్యాంకుల్లో వేసేశారా? బెంగాల్ బీజేపీ ఖాతాలో మూడు కోట్లు ప్రకటనకు ముందు వరకు జమవుతూనే ఉన్నట్టు పూర్తి వివరాలు బయటికి వచ్చాయి. పంజాబ్ బీజేపీ నాయకుడొకరు మోదీ ప్రకటనకు మూడు రోజు ల ముందే తన ఫేస్‌బుక్ వాల్‌పై రెండు వేల నోట్ల కట్ట తో ఫొటో పోస్టు చేశాడు. ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత కూతురు రెండు వేల నోట్ల కట్ట పట్టుకుని ఫొటో దిగిన ట్టు వార్తలు వచ్చాయి. అంటే కొన్ని వర్గాలు ముందుగానే నల్లధనం మార్చుకోవడం(ప్రీమానిటైజేషన్) జరిగింది. రెండో వర్గం డీమానిటైజేషన్‌లో భాగంగా దేశంలోని సమస్త ప్రజానీకం తమ దగ్గ ర దాచుకున్న పదీ పరకా బ్యాంకుల్లో వేయడం. వీరంతా తేలికగా భయపడిపోయే వాళ్లు. ఏ చట్టాలూ, ఏ న్యాయవ్యవస్థలూ, ఏ రాజకీయ వ్యవస్థల అండాలేని ప్రజలు. ఉన్నదంతా బ్యాంకుల్లో వేసి రోజువారీ ఖర్చుల కోసం ఏటీఎంల వద్ద, బ్యాంకుల వద్ద క్యూలలో నిల్చుంటున్నవాళ్లు.

వీరుగాక పోస్టుమానిటైజేషన్ చేసుకున్న వర్గం ఒకటి కనిపిస్తున్నది. అంటే పరపతి, పలుకుబడి, అధికారాన్ని ఉపయోగించి కొత్త నోట్లను మధ్యలోనే ఎగరేసుకుపోయిన వాళ్లు. వీళ్లు ఆర్బీఐకి, బ్యాంకులకు, పోస్టాఫీసులకు వచ్చిన కొత్త నోట్లను లంచాలు, కమీషన్లు ఇచ్చి కోట్లకు కోట్లు మార్చుకున్నారు. మొత్తంగా కనిపించేదేమంటే సమాజంలో ప్రబల వర్గాలుగా ఉన్నవాళ్లంతా బాగానే ఉంటారు. కేంద్రం లేక ఆర్బీఐ విడుదల చేసిన ధనం ఎప్పటిలాగే బలవంతుల వద్దకు చేరుతుంది. ఎటొచ్చీ బలహీనులు, ఏ అండాలేని సామాన్యులు మాత్రం క్యూలలో ఉంటారు. నోట్లు బ్యాంకుల్లో వేసి చిల్లర లెక్కపెట్టుకుంటారు. ప్రతి పనికీ ఇబ్బంది పడతారు. కొందరు క్యూలైన్లలోనే కన్నుమూస్తారు.
నోట్ల రద్దు ప్రకటనతో ఉగ్రవాదులు విలవిలలాడుతున్నారని, వెంటనే సరిహద్దుల్లో కాల్పులు ఆగిపోయాయని, ఇంకా ఏవో కాకమ్మ కథలు నోట్ల రద్దు ప్రకటించిన మూడు రోజులకే ఓ కేంద్రమంత్రి చెప్పారు. కానీ అవేవీ ఆగలేదు. సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికు ల తలలు తెగిపడటం నిలిచిపోలేదు. ఉగ్రవాదులు మన భూభాగంలోకి వచ్చి మారణకాండ జరుపడం తగ్గలేదు. అయినా చోటా మోటా వ్యాపారులు, నాయకులు సైతం లక్షలు కోట్లు మార్చగాలేనిది ఉగ్రవాదు లు, నక్సలైట్లు నగదు పోగేయడం ఒక లెక్కా.

మన ఆర్బీఐ అధికారులు, మన బ్యాంకుల సిబ్బంది, పోస్టాఫీసు సిబ్బంది కమీషన్లు తీసుకుని ఉగ్రవాదులకు కూడా పెద్ద మొత్తాల్లో ఇవ్వరన్న గ్యారెంటీ ఏముంది? పెద్దమొత్తాల్లో బ్యాంకులను ముంచిన విజయ్ మాల్యా కు, ఇతర బడా పారిశ్రామిక వేత్తలకు లేని భయం బ్యాంకింగ్ సిబ్బందికి మాత్రం ఎందుకుంటుంది? ఆర్థి క నేరాలు చేస్తూ ప్రత్యక్ష ప్రసారాలకు దొరికిన నాయకులు సైతం పరిశుద్ధులుగా బయటపడుతున్నప్పుడు ఎవరైనా ఎందుకు భయపడతారు? నరేంద్ర మోదీ గొంగట్లో పాశం పోశారని చెప్పడం అందుకే. లక్ష్యం మంచిదే కావచ్చు కానీ తన రెక్కల కింద ఒక పెద్ద అవినీతి ప్రపంచాన్ని పెట్టుకుని దేశాన్ని ఉద్ధరిస్తానని చెప్పడమే నమ్మబుద్ధి కాదు. గొంగడి లాంటి వ్యవస్థలను సంస్కరించకుండా జనం దగ్గర సొమ్ము లాగేసుకోవ డం వల్ల నల్లధనం నిర్మూలన జరుగదు.

కొత్తగా విడుదల చేసిన నోట్లు ప్రజల వద్ద ఎన్ని ఉన్నాయో, పెద్దల దగ్గర ఎన్ని ఉన్నాయో మరోసారి బ్యాంకు లెక్కలు చూస్తే తెలిసి పోతుంది. నరేంద్ర మోదీ జబ్బొక చోట ఉంటే మందొక చోట వేశారు. నేరస్తులు ఒకరయితే శిక్ష మరొకరికి వేశారు. ఆయన ఫకీరు కాదు. ఆయన పార్టీ సన్యాసుల మఠం కాదు. బీజేపీ ఇవ్వాళ అత్యంత సం పన్నమైన రాజకీయ పార్టీ. అందుకే మా నిధుల లెక్క లు బయటికి చెప్పాల్సిన పనిలేదని ఆ పార్టీ నాయకులు ప్రకటిస్తున్నారు. దేశమంతా లెక్కలు చెప్పాలి. వారు మాత్రం లెక్కలు చెప్పం అంటారు. అందుకే ఆయన ఫకీరు కాలేడు. కోట్లాది మందిని మాత్రం ఫకీర్లను చేసి వీధుల్లో నిలబెట్టగలడు.