గారపాటికి జోహార్

అది 1991. హైదరాబాద్ ఆంధ్రజ్యోతిలో ఒకరోజు ఒక కొత్త పర్సనల్ ఆఫీసరు సెలవుల చీటీపై ఏదో తిరకాసు పెట్టి పై అంతస్తుకు కింది అంతస్తుకు రెండు సార్లు తిప్పాడు. అది గమనించిన గారపాటి నరసింహారావుగారు ఏం జరిగిందని అడిగారు. చెప్పాను. ఉన్నఫళంగా ఆ పర్సనల్ ఆఫీసరును గుర్రపు నాడా బల్లవద్దకు పిలిచి చెడామడా చీవాట్లు పెట్టి జర్నలిస్టులంటే తమాషాగా ఉందా? ఇంకోసారి ఇలా చేస్తే బాగుండదని హెచ్చరించి పంపాడు. జర్నలిస్టులపై ఈగ వాలనిచ్చేవారు కాదు. మరోసారి ఒక చోటా నాయకుడు ప్రెస్‌నోటు సార్ అంటూ ఒక కవరు ఆయన చేతిలో పెట్టి వెనుదిరిగాడు. కవరు తీసి చూసి ఆయన ఆగ్రహోదగ్రుడయ్యారు. అందులో ప్రెస్‌నోటుతోపాటు 500ల నోటు ఉంది. సెక్యూరిటీకి చెప్పి ఆ మనిషిని వెనుకకు పిలిచి మరోసారి ఈ ఆఫీసు మెట్లెక్కవద్దని హెచ్చరించి పంపాడు. ఒంటినిండా దర్పం, ఇస్త్రీ చెదరని తెల్లని చొక్కా, గంభీరమైన మాటతీరు, ఎవరినీ లెక్క చేయనితనం, జేబులో ఎంత ఉంటే అంత ఖర్చు చేసే లెక్కలేని తనం, రాసేవాళ్లను ప్రోత్సహించే సహృదయం…నరసింహారావు నిరంతరం ఒక సందడి. కాల్చుకు తినే న్యూస్ ఎడిటర్లను చూశాం. ఏమీ తెలియకపోయినా పెత్తనాలు చేసే వాళ్లను చూశాం. కానీ ఆయన మంచి నాయకుడు. పనిచేయించుకోవడం తెలిసిన నాయకుడు. విజయవాడ నుంచి కొత్తగా వచ్చిన మా బృందంపై ఆయన చూపిన ప్రేమను ఎప్పటికీ మరువలేము. పంజాగుట్ట ఆంధ్రజ్యోతి చుట్టూ సంసారాలు ఉండడం వల్ల ఒకరి కష్టనష్టాలు మరొకరికి తెలియడం, పరుగెత్తుకెళ్లడం, ఒకరికి ఒకరు సాయపడడం… ఉద్యోగాలు, జీవితాలు కలగాపులగంగా సాగిపోయేవి. 2000లో ఆంధ్రజ్యోతి మూత తర్వాత తలా ఓ దిక్కు వెళ్లిపోయాం. ఆయన అక్కడక్కడా ఉద్యోగాలు చేస్తూ ఎప్పుడయినా ప్రెస్‌క్లబ్‌లో కలిసేవారు. ఎప్పుడు కలిసినా అదే వాత్సల్యం. అదే పలకరింపు. ఇవ్వాళ చితిపై పెడుతున్నప్పుడు కూడా ఆయన ముఖంలోకి చూశాను. చనిపోయినట్టుగా లేదు. నిద్రపోతున్నట్టుగా అనిపించింది. ఉన్నప్పుడు ఎక్కడో ఒకచోట ఉన్నారులే అనుకుంటాం. వెళ్లిపోయినప్పుడు ఆయనకు సంబంధించి మనలో ఒక ఖాళీ ఆవరిస్తుంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ….