గోల్…సెల్ఫ్‌గోల్

అవినీతికి కొత్త నిర్వచనాలు పరిచయం చేసినవాడు అమాయకత్వం ప్రదర్శిస్తుంటాడు. అధికారమే ఏకైక లక్ష్యంగా రాజకీయాలు మొదలు పెట్టినవాడు విలువలు, విధానాలను గురించి ఉపన్యాసాలు ఇస్తుంటాడు. అనతికాలంలోనే అంతస్తులు మార్చేసినవాడు ఇప్పుడు ప్రజల మనిషినని ప్రచారం చేస్తుంటాడు. స్వయంగా యుద్ధం మొదలు పెట్టినవాడు ఇప్పుడు తొండి జరుగుతోందని వాపోతున్నాడు. వాడెవడూ వీడెవడూ అని ధిక్కారస్వరాన్ని వినిపించినవాడు ఇప్పుడు వాడూ వీడూ కుట్రలు చేస్తున్నారని ఫిర్యాదులు చేస్తుంటాడు.  అధికారాన్ని ఆటబొమ్మగా ఉపయోగించుకున్నవాడు ఇప్పుడు అదే ఆటబొమ్మను చూసి భయపడుతుంటాడు. జగన్ రాజశేఖర్‌రెడ్డికి కొనసాగింపు. రాజశేఖర్‌రెడ్డి పుణ్యాలకే కాదు, పాపాలకూ ఆయనే వారసుడు. పుణ్యాల సోపానంపై సింహాసనం ఎక్కాలనుకోవడం తప్పు కాదు,  మధ్యలో పాపాల పాములూ మింగేయవచ్చు. ఇది జగన్ మోహన్‌రెడ్డి సృష్టించుకున్న సమస్య. ఆయనే అనుభవించవలసిన సమస్య. ఆయనే పరిష్కరించుకోవలసిన సమస్య. అధికార పీఠాలను సవాలు చేయనంతవరకు మీరు ఎంతకొల్లగొట్టినా మిమ్మల్ని ఎవరూ ఏమీ అనరు. ఎన్ని గనులు, ఎన్ని వనరులు, ఎన్ని రాష్ట్రాల్లో ఎంతమంది కార్పొరేట్లు కొల్లగొట్టలేదు. కానీ వాళ్లు సోనియాగాంధీని సవాలు చేయలేదు. కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎదిరించలేదు. ప్రతిపక్షం మనుగడకు ముప్పుగా పరిణమించలేదు. జగన్ తప్పులూ చేశాడు, ఆ వెంటనే అధికారమూ ఆశించాడు. వ్యవస్థలు ఎలా ఊరుకుంటాయి?

*****

ఇదో కొత్త చరిత్ర. అరుదైన సందర్భం. రాష్ట్రంలో తొలిసారి అధికారపక్షం, ప్రతిపక్షం ఒకే గొంతుతో మాట్లాడుతుంటాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడు ఒకే లక్ష్యంతో మాట్లాడుతున్నాయి. కాంగ్రెస్ వ్యతిరేకతను బాహాటంగా ప్రకటించుకున్న పత్రికలు, చానెళ్లు సైతం కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా రాతలుకోతలు చేస్తున్నాయి. ఒకటే తేడా. కిరణ్‌కుమార్‌రెడ్డి రాజశేఖర్‌రెడ్డిని పొగడుతూ జగన్‌ను తెగడుతున్నాడు. చంద్రబాబునాయుడు,  పత్రికలు, చానెళ్లు రాజశేఖర్‌రెడ్డి, జగన్ వేర్వేరు కాదని తిట్టిపోస్తున్నాయి. ఒక మిత్రుడు పంపిన ఎస్‌ఎంఎస్ గురించి ఇక్కడ ప్రస్తావించడం సందర్భోచితంగా ఉంటుందేమో-‘ఈరోజు ఒక ప్రధాన దిన పత్రిక 6వ పేజీలో జగన్ పేరును 50 సార్లు, 14వ పేజీలో 59 సార్లు,  వైఎస్ పేరును 33 సార్లు-మొత్తంగా అన్ని పేజీలలో కలిపి ఇద్దరి పేర్లూ 11 సార్లు రాశారు. ఆ పత్రికల జగన్నామస్మరణకు జోహార్లు’ అని అందులో ఉంది. ఇది అక్కసుతో చేస్తున్నారా? నీతికోసం చేస్తున్నారా? అక్కసు ఎక్కువయితే నీతి కనిపించదు. ఇది
భావసారూప్యత కాదు. లక్ష్య సారూప్యత. ఆపరేషన్ డిమాలిష్ జగన్‌లో భాగం! అక్కసుతో చేసే పని ప్రతికూల ఫలితాలకూ దారితీయవచ్చు, జగన్‌పై మరింత సానుభూతి పెరగనూ వచ్చు. ఇప్పుడు మైసూరారెడ్డి, ఆళ్ల నాని, రేపు మరికొందరు టీడీపీ, కాంగ్రెస్ నేతలు జగన్ బాట పట్టనూ వచ్చు. జగన్ చట్టం ముందు ఓడిపోయి, రాజకీయంగా గెలవనూ వచ్చు.

*****

లక్ష్యాన్ని కొట్టడానికి ఉండాల్సింది కసి కాదు. గురి. కసితో కొట్టే బాణాలు లక్ష్యాన్ని చేరవు. నిజాయితీ లేని యుద్ధం ఫలితాలు సాధించదు. అవినీతి గొంగడిలో కూర్చుని నీతిబోధలు చేస్తే ఎవరూ వినిపించుకోరు.  కోర్టు సాక్షిగా మద్యం కుంభకోణం కేస్ డైరీలో నిందితునిగా స్థానం సంపాదించుకున్న మంత్రిని పక్కన కూర్చోబెట్టుకుని,
జగన్ అవినీతిని ఉతకాలని చూస్తే లాభం లేదు. సెలెక్టివ్ విక్టిమైజేషన్, టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ అధికారంలో ఉన్న నాయకులకు సాధ్యం కావచ్చు. చేతిలో అధికారం ఉంటే దర్యాప్తు అధికారులను అర్ధరాత్రి బదిలీ చేయవచ్చు. ఒక పెద్దగీతను పక్కన గీసి అప్పటికే ఉన్నగీతను చిన్నదిగా చూపించవచ్చు. కానీ కోర్టులకు, ప్రజలకు కష్టం. వాళ్ల సంగతేమిటి? వీళ్ల సంగతేమిటి? అని కోర్టులు, ప్రజలు వెంటపడి అడుగుతాయి. ఒకడిని తీసుకొచ్చి వీడే దోషి అంటే అంగీకరించవు. మిగతావాళ్ల సంగతి తేల్చండి అంటాయి. చివరకు వాళ్ల తీర్పులు వాళ్లకు ఉంటాయి. కిరణ్ బాణాలు పనిచేయకపోవడానికి కారణం అదే.

*****

సిబిఐలో, కోర్టుల్లో ఆట మొదలు పెట్టడం వరకే మన పని. ముగించడం మన చేతిలో ఉండదు. ఎక్కడ మొదలవుతుందో, ఎక్కడ తేలుతుందో, ఎక్కడ అంతమవుతుందో లక్ష్మీనారాయణుడు కూడా చెప్పలేడు. సిబిఐ శిఖరాన్ని చూపిస్తే కోర్టు కొండను తవ్వమంటోంది. సిబిఐ తోకను మాత్రమే చూపించాలనుకోవచ్చు, కోర్టు తలకాయను కూడా చూపించమంటుంది.  సిబిఐ సెలెక్టివ్‌గా ఉండాలనుకోవచ్చు, కోర్టు కలెక్టివ్‌గా దోషులను గుర్తించాలనుకుంటుంది. తన మన పర భేదం ఉండదు. అయ్యోపాపం అనడానికి ఏమీ మిగలదు. ఇది ఏసీబీ కాదు డీజీలను, డీఐజీలను మార్చేయడానికి, ఏమార్చేయడానికి. ఇక్కడ లోకల్ టాలెంట్ పనిచేయదు, సిఐతో సిబిఐపైన పిటిషన్ వేయించడానికి, ఆరోపణలు చేయించడానికి.

గోల్ కొట్టడం సంగతి దేవుడెరుగు….కాంగ్రెస్‌వాళ్లు సెల్ఫ్‌గోల్ చేసుకోవడంలో దిట్టలు. ‘అరెస్టైనంత మాత్రాన దోషి కాదు. ఆయనపై(మంత్రిపై)  దోష నిరూపణ జరుగలేదు. ఆయన తప్పనిసరిగా నిర్దోషిగా బయటికివస్తారు’ అని మోపిదేవి వెంకటరమణకు మద్దతుగా మంత్రులు సెలవిచ్చారు. ఇదే సూత్రం జగన్‌తో సహా నిందితులందరికీ వర్తిస్తుంది కదా? మంత్రి ఎటువంటి ప్రతిఫలం పొందలేదని చెబుతున్నారు. కానీ వాన్‌పిక్‌కు వ్యతిరేక పోరాటం చేసినవారిపై మోపిదేవి చేసిన ఆరోపణలు, దాడులు అందరూ మరిచిపోయి ఉండవచ్చు. కానీ నాకైతే గుర్తున్నాయి. వాన్‌పిక్‌కోసం సముద్ర తీరాన్ని, భూములను స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ మత్స్యకారులు, స్థానికులు చేస్తున్న ఉద్యమాలకు సంఘీభావం ప్రకటించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణపై దుర్మార్గమైన ఆరోపణలు చేశారు మోపిదేవి. వాన్‌పిక్ వ్యతిరేకులు అభివృద్ధి నిరోధకులని తిట్టిపోశారు. అరెస్టులు చేయించారు. అప్పుడంతా ఏ ప్రతిఫలం లేకుండానే, అమాయకంగానే ఆయన ఆ భారమంతా మోశారా?

*****

తోడేళ్లను పట్టుకోవడానికి మేకలను బలి వేస్తారు. పెద్ద చేపను పట్టడానికి చిన్న చేపను ఎరవేస్తారు. మోపిదేవి ఎంత ప్రతిఫలం పొందాడు? ఎంత తీవ్రమైన తప్పు చేశారన్నది ముఖ్యం కాదు. జగన్‌పై చేస్తున్న దర్యాప్తునకు జస్టిఫికేషన్ రావాలంటే, జగన్‌ను బోనులోకి తీసుకు వస్తే జరిగే పరిణామాలను ఎదుర్కోవాలంటే ప్రభుత్వానికి
ఒక మోరల్ పొజిషన్ అవసరం. తాము నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయిస్తున్నామని బిల్డప్ ఇవ్వడం అవసరం. అందుకు ఒక బలిపశువు కావాలి. అతడు బలహీనుడు కావాలి. పెద్దగా ఫాలోయింగ్ లేనివాడు కావాలి. కులసమీకరణల్లో అధికార కులాలకు చెందనివాడు కావాలి. ప్రభుత్వానికి ఇక్కట్లు తేనివాడు కావాలి. ప్రభుత్వంలో
ఏకైక మత్స్యకారుడు మోపిదేవి.  ప్రాజెక్టులు పొంది ప్రతిఫలం చేకూర్చింది వాన్‌పిక్ ఒక్కటేనా? డజన్ల కొద్దీ కంపెనీలు ఉన్నాయి. కానీ సిబిఐ వాన్‌పిక్‌నే ముందుగా ముందేసుకుంది.

*****

చంద్రబాబు తిట్టే కొద్దీ జగన్ పెరిగిపోతున్నాడా? పరిస్థితి అలాగే కనిపిస్తోంది. అగ్ని పరీక్షకు నిలబడి పునీతుడైనవాడు నీతిబోధలు చేస్తే జనం వినిపించుకుంటారు. చేసిన తప్పులు ఒప్పుకున్నవాడినీ క్షమిస్తారు. కానీ అన్ని దర్యాప్తులు, విచారణలను తప్పించుకున్నవాడిని ఎలా నమ్మడం? ఏ పరీక్షకూ నిలబడని మనిషిని ఎలా పరిశుద్ధుడని విశ్వసించడం? చంద్రబాబునాయుడుతో ఇదే సమస్య. చంద్రబాబునాయుడుపై విచారణలన్నీ స్టేలతో ఆగిపోయినవే తప్ప, నిర్దోషిత్వ తీర్పులతో ముగిసినవి కాదు. అందుకే ఆయన ఎంత గట్టిగా మాట్లాడినా, ఎన్ని వాడి బాణాలు విసిరినా పనిచేయడం లేదు. పైగా ఆయన సేనలు బలహీనపడిపోతున్నాయి. భవిష్యత్తుపై
ఆశలు సన్నగిలుతున్నాయి. యోధులు చెదరిపోతున్నారు. మైసూరారెడ్డి బాటవేశారు. ఆ బాటలో ఎంతమంది నడుస్తారో! నిన్నమొన్నటి దాకా జగన్‌పై ఆరోపణలు గుప్పించిన మైసూరా, ఇప్పుడు జగన్ పంచన ఎలా చేరతారని టీడీపీ వకీళ్లు వాదిస్తున్నారు. 2003లో చంద్రబాబునాయుడుపై ‘బిగ్‌బాస్’ కుంభకోణాన్ని బట్టబయలు చేసింది మైసూరానే. కానీ ఆ తర్వాత కొద్ది కాలానికే చంద్రబాబునాయుడు మైసూరాను పచ్చకండువా కప్పి సాదరంగా పార్టీలో చేర్చుకున్నారు. అప్పుడు తప్పయితే, ఇప్పుడూ తప్పే! అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి తప్పొప్పులు మారతాయి.

*****

కాయ పండడానికి, రాలడానికి కొంత సమయం పడుతుంది. గుడ్డు పొదిగి పిల్లలు బయటికి రావడానికి సమయం తప్పనిసరి. వ్యక్తి ఒక సమూహంగా ఎదగడానికి, సామాన్యుడు అసామాన్యుడు కావడానికి పరిణతి కావాలి. లక్ష్మీదేవి వరించినంత తేలికగా అధికారం వరించదు. ధనాన్ని అడ్డదారిలో దొడ్డిదారిలో సంపాదించే
వీలుండవచ్చు. ప్రజాస్వామ్యంలో అధికారాన్ని అమాంతంగా సంపాదించడం కష్టం. చాలా కష్టపడాలి.  కొంచెం ఓపిక పట్టాలి. డబ్బులు ఉన్నంతమాత్రాన డైరెక్టు టిక్కెట్లు దొరకవు. కోరిక ఉన్నంత మాత్రాన అనుకున్నంతనే అధికారసౌధాల ద్వారాలు తెరుచుకోవు. జగన్ డైరెక్టు దారి వేసుకోవాలనుకున్నారు. అది ఇన్ని మలుపులు
తిప్పుతోంది. ఇంకెన్ని మలుపులు తిప్పుతుందో తెలియదు.

*****

ఒకటి మాత్రం నిజం! ప్రకృతిలో ఒక లయ, నియమం ఉన్నాయేమో అనిపిస్తుంది. ఆకాశాన్ని ధిక్కరించినవాడిని ఎప్పుడో ఒకప్పుడు పిడుగులు ముట్టడిస్తాయి. భూమిని చెరబట్టినవాడిని పకృతి దండిస్తూనే ఉంది. తానే శాశ్వతమని విర్రవీగినవాడిని కాలపాశం వాటేసుకుని ఎటో తీసుకెళ్లిపోతుంది. అన్ని కాలాలనూ కబ్జా
పెట్టినవాడిని ఏదో ఒక కాలం ధిక్కరించి వెక్కిరిస్తూనే ఉంది. పాపమంటూ చేశాక అది ఎప్పుడో ఒకప్పుడు కాటువేసే తీరుతుంది. మనం వాటికి సాక్షులం!

 

నైతిక విధ్వంసకాండ

రాష్ట్రంలో నీతి ఒక పగిలిన అద్దం. విచలిత దృశ్యం. ఒక విభ్రమ. నైతిక విధ్వంసం పరిపూర్ణమైన చోట నీతులు వేయినాల్కలు చాస్తాయి. ఏది నీతి? ఏది అవినీతి? ఏది పత్రికా స్వేచ్ఛ? ఏది అవినీతి దర్యాప్తు? ఒకరికి నీతి అయినది మరొకరికి అవినీతి అవుతుంది. ఒకరికి పత్రికాస్వేచ్ఛ అయినది మరొకిరికి అవినీతి దర్యాప్తు అవుతుంది. ప్రతి సంఘటనా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్నది ప్రయోజనాల సంఘర్షణ. అధికారంకోసం సాగుతున్న యుద్ధం. ఈ సంఘర్షణలో, ఈ యుద్ధంలో పత్రికాస్వేచ్ఛ కూడా ఒక ఆయుధమే. పత్రికలు, చానెళ్లు కూడా సాధనాలే. ఇక ఎవరూ ఇంకా వేషాలు వేయలేరు. విలువల మహోద్ధారకుల్లా నటించలేరు. పత్తిత్తులమని, పవిత్రులమని చెప్పుకోలేరు. సాక్షి దినపత్రిక, చానెల్‌ల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం పత్రికాస్వేచ్ఛపై దాడి అవుతుందా కాదా? కొందరికి దాడి అవుతుంది. ఇంకొందరికి దర్యాప్తు అవుతుంది. ఇలా కనిపించడానికి కారణం- చూసే వారికి వేర్వేరు రాజకీయ లక్ష్యాలు ఉన్నాయి. వేర్వేరు ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. పత్రికలు, చానెళ్లు తమ రాజకీయ లక్ష్యాలను ఎప్పుడూ దాచుకోలేదు. ప్రయోజనాలు, లక్ష్యాల దృష్టితోనే చుట్టూ జరిగే పరిణామాలను విశ్లేషిస్తుంటాయి. పత్రికాస్వేచ్ఛ సాపేక్షమైనది. అందిరికీ ఒకే విధంగా కనిపించదు. అందరికోసం, అన్ని వార్తలు ఇచ్చే నిష్ఠాగరిష్టత కలిగి, ఇష్టమైన పత్రికలు లేవు. రాజకీయ అభిప్రాయాలకు దూరంగా పత్రికను, చానెల్‌ను నిర్వహించాలని చూసే జర్నలిస్టులు కూడా ఇప్పుడు బహకొద్ది మంది. అటువంటి వారు మనుగడ సాగించడం కూడా కష్టంగా ఉంది. ఎక్కడ వెలితి ఉంటే అక్కడ ఒక పత్రిక, ఒక చానెల్ పుట్టుకొస్తున్నది. ఒక విధంగా ఇది మంచి పరిణామమే. పత్రికలు పెట్టినవాళ్లంతా పుట్టుకతో పత్రికాధిపతులు కాదు. జర్నలిస్టులు పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూసి పత్రికల్లో చేరరు. ఏదో ఒకటి చేసి, ఎవరో ఒకరిని ఒప్పించి పెట్టుబడులు తీసుకొచ్చి పత్రికలు పెడతారు. పత్రికాధిపతులు పరిశుద్ధులు, యోగులు అయి ఉండాలని అంటే అసలు పత్రికలే రావు. యజమానుల అభిప్రాయాలను ప్రతిబింబిస్తూనే మనమూ కొన్ని అభిప్రాయాలు చెప్పుకోవడానికి స్వేచ్ఛ ఉంటుందన్న నమ్మకంతోనే జర్నలిస్టులంతా పత్రికల్లో చేరతారు. నూటికి నూరు పాళ్లు వారి కాండక్ట్ సర్టిఫికెట్ చూసి కాదు. ‘ఒక చిరుద్యోగి రామోజీ ఇన్ని వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారు?’,  ‘నిన్నమొన్నటిదాకా ఒక మామూలు విలేఖరి…అనతి కాలంలోనే పత్రికాధిపతి ఎలా అయ్యారు?’, ‘2004 ఎన్నికలకు ముందు అప్పుల్లో ఉన్నామని చెప్పిన రాజశేఖర్‌రెడ్డి ఆరేడేళ్లలో  ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎలా ఎదిగారు?’….ఈ అన్ని ప్రశ్నల్లోనూ ధ్వనించే సందేహం ఒక్కటే. ఇదంతా నీతిమంతంగానే జరిగిందా అన్నదే ఆ సందేహం. ఈ సందేహాలు జర్నలిస్టులకున్నాయి. మామూలు ప్రజానీకానికి ఉన్నాయి. నీతిలో, అవినీతిలో డిగ్రీల తేడా ఉండవచ్చు. అయినా ఆ పత్రికలూ నడవడానికి అవేవీ ప్రతిబంధకాలు కాలేదు. కారాదు.

వార్తలపై, విశ్లేషణలపై ఏకచ్ఛత్రాధిపత్యం(మోనోపలి) ధ్వంసమై లక్ష భావాలు వర్ధిల్లాలి. అభిప్రాయాలను, సమ్మతిని తయారు చేసే, మలిచే అధికారం కొద్ది మంది చేతుల్లో ఉండడం కంటే, ఎంత ఎక్కువ మంది చేతుల్లో ఉంటే అంత మంచిది. ప్రజలకు ఇష్టమైనది కొనుక్కుని చదివే స్వేచ్ఛ ఉంటుంది. ఇష్టంలేని దానిని తిరస్కరించే అవకాశమూ ఉంటుంది. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే వేదికలు అనేకం అందుబాటులో ఉంటాయి. సాక్షిలో వచ్చే వార్తలు, అభిప్రాయాలు జగన్‌ను సమర్థించేవే కావచ్చు, కానీ వాటినీ తెలుసుకునే స్వేచ్ఛ ప్రజలకు ఉండాలి. జగన్‌మోహన్‌రెడ్డి ఆర్థిక నేరాలు వేరు, పత్రిక, చానెల్‌లు వేరు. ఆర్థిక నేరాలపై దర్యాప్తు, విచారణ పూర్తి చేసి, దోష నిరూపణ చేసి ఆయనను జైళ్లో పెడితే ఎవరికీ అభ్యంతరం ఉండక్కరలేదు. కానీ పత్రిక, చానెల్‌ల నిర్వహణకు ఆటంకం కలిగించే చర్యలకు పాల్పడితే మాత్రం అది ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడిగానే పరిగణించాలి. బ్యాంకు ఖాతాలు ఇప్పుడు ఏమాత్రం రహస్యం కాదు. నిరంతరం ఆర్‌బిఐ డేగకన్నుల్లో(స్కానర్) ఉంటాయి. ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్, ఇన్‌కం ట్యాక్స్ వంటి విభాగాలకు ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటాయి. సిబిఐ కూడా ఏ రోజయినా ఆ ఖాతాలను చూసే అవకాశం ఉంది. ఆ ఖాతాల్లోకి అక్రమంగా వచ్చి చేరిందన్న డబ్బు కూడాఇప్పుడు వచ్చింది కాదు. ఆ డబ్బు ఎప్పుడో రావడమూ, పోవడమూ జరిగిపోయింది. అటువంటప్పుడు ఖాతాలను స్తంభింపజేయడం ఏదో ఒక దురుద్దేశాన్ని సూచిస్తున్నదే తప్ప, సదుద్దేశాన్ని తెలియజేయదు. ఒక వేళ ఆ ఖాతాలపై జగన్ పెత్తనాన్ని నిలువరించాలనుకున్నప్పుడు కూడా సత్యం కుంభకోణంలో వ్యవహరించినట్టుగా, ఒక స్వతంత్ర అధికారికి ఆ ఖాతాల నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని కోర్టు ద్వారా ఉత్తర్వులు పొంది ఉండవచ్చు. అటువంటి ఆలోచనలేవీ చేయకుండా ఖాతాలను స్తంభింపజేయడం, ఆ మరుసటి రోజే ప్రభుత్వం ఆ పత్రికకు ప్రకటనలు ఆపివేయడం…పత్రికా స్వేచ్ఛపై దాడి కాక ఏమవుతుంది?  ఇటువంటి దాడి ఈనాడుపై జరిగినా, మరో పత్రికపై జరిగినా ప్రతిఘటించి తీరవలసిందే. ఏ పత్రికకయినా ప్రత్యేక రాజకీ య అభిప్రాయాలు ఉండవచ్చు. అయినా అది కూడా స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఉండాల్సిందే.

పత్రికలు తమ రాజకీయ ఎజెండాలను ఎప్పుడూ దాచుకోలేదు. ఈనాడు ఏనాడూ తన రాజకీయ స్వభావాన్ని దాచుకోలేదు. తెలుగుదేశం పుట్టుక, ఎదుగుదల, పతనాలన్నింటిలోనూ ఆ పత్రిక పాత్ర ఉంది. కాంగ్రెస్ మాత్రమే ఉన్నకాలంలో ఆ పత్రిక కొన్ని గ్రూపులను వెనుకేసుకొచ్చింది. ఇంకొన్ని గ్రూపులను టార్గెట్ చేసి వారిని రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేసింది. ఈనాడు వెంగళరావును ఎంతగా ప్రేమించిందో, చెన్నారెడ్డిని ఎంతగా వెంటాడిందో ఆకాలంలో ఆ పత్రికను తీసి చూస్తే స్పష్టంగానే అర్థమవుతుంది. ఆ తర్వాత ఎన్‌టిఆర్‌ను తీసుకురావడంలోనూ, ఆయనను పెంచడంలోనూ, కాపాడడంలోనూ ఈనాడు ఏనాడూ రహస్యంగా వ్యవహరించలేదు. ఉపన్యాసాలు రాసివ్వడం మొదలు అభ్యర్థుల ఎంపిక, పత్రికలో అసాధారణ కవరేజీ ఇవ్వడం వరకు తన సర్వశక్తులనూ ఎన్‌టిఆర్‌ను నిలబెట్టడానికి ఒడ్డింది. రామోజీరావు తన కాంగ్రెస్ వ్యతిరేకతను ఎప్పుడూ రహస్యంగా ఉంచుకోలేదు. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఆయన స్వయంగా ఈ విషయం పేర్కొన్నారు. అందువల్ల ఆయన ఎవరి అవినీతిని చూస్తారో, ఎవరి అవినీతిని కన్వీనియంట్‌గా చూసీ చూడనట్టుగా ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చీ రాగానే ఆయనలోని అవినీతి మచ్చలను చూడడం మొదలు పెట్టారు, తొమ్మిదేళ్లు పరిపాలించిన చంద్రబాబులో మాత్రం ఏనాడూ మచ్చలను కనిపెట్టే ప్రయత్నం చేయలేదు. మహా రాయాల్సివస్తే చంద్రబాబు మంచివాడే, కానీ ఆయన చుట్టూ ఉన్నవారే వెధవలు అని రాసేవారు తప్ప, ఆయనమీద వచ్చిన ఆరోపణలేవీ ఈనాడులో పతాక శీర్షికలు కాలేదు. ఒకటి కాదు వంద పరిణామాలు చెప్పవచ్చు.  194లో ఎన్‌టిఆర్‌ను పదవీచ్యుతుడిని చేయడం అప్రజాస్వామికం అయింది. ఈనాడు పెద్ద ఉద్యమమే చేసింది. 1995లో అదే ఎన్‌టిఆర్‌ను దించితే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అయింది. నాదెండ్ల చేసింది నేరమయింది, చంద్రబాబు చేసింది ఉద్ధరణ అయింది. అప్పుడు ఈనాడు ఏ రాసినా చెల్లింది. చంద్రబాబు అధికారంలోకి రావడం ఈనాడుకు వాంఛనీయ పరిణామం. అది ఆయన ఫిలాసఫీ. రామోజీ పత్రికా స్వేచ్ఛ. ఆయనను ఇష్టపడేవారి పత్రికా స్వేచ్ఛ.

ఈనాడును అనుసరించే ఇతర పత్రికల విషయమూ అంతే. బాబు రావాలి. మిగతా అందరూ పోవాలి. రెండో పత్రికాధిపతి కూడా తన ఆరాటాన్ని పాపం దాచుకోలేదు. ‘‘తెలంగాణలో ఓడిపోయినప్పటికీ తెలుగుదేశం ఈ ఎన్నికల్లో గణనీయంగా పుంజుకుంది. 2010 ఉప ఎన్నికల్లో(12 నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో) ఆ పార్టీకి ఏడున్నర శాతం ఓట్లు వస్తే ఇప్పుడు(ఆరు నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో) 12 శాతం పెరిగి 20 శాతం ఓట్లు వచ్చాయి. వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో పంచముఖి పోటీలు జరుగుతాయి. 25 శాతం ఓట్లు  ఎవరికి వస్తాయో వారినే విజయం వరిస్తుంది. చంద్రబాబు మరో ఐదు శాతం ఓట్లు సాధించగలిగితే అధికారంలోకి రాగలరు.’’ అని తన కాలమ్‌లో బాహాటంగానే పలికారు. అదేరోజు, అదే కాలమ్‌లో ‘‘ ఇప్పుడు కోవూరులో జగన్‌కు వచ్చిన ఓట్లు 42 శాతమే. అంటే 60 శాతం మంది ప్రజలు జగన్‌ను వ్యతిరేకిస్తున్నారని అర్థమైంది. ఆరు నెలల్లో ఆ పార్టీ 25 శాతం  ఓట్లను కోల్పోయింది’’ అని అదే పత్రికాధిపతి హెచ్చరించారు. 20 శాతం వచ్చినవాడికి అధికారాన్ని రాసివ్వాలని ఆరాటం. 40 శాతం వచ్చినవాడు నాశనమైపోతాడని శాపం. డిపాజిట్లు కోల్పోయినవారు, పంచెలు తడుపుకున్నవారు భవిష్యత్తులో బ్రహ్మాండం బద్దలు కొడతాడని ఉవాచ. అన్ని సీట్లూ గెలిచి 45 శాతం ఓట్లు సంపాదించిన తెలంగాణవాదులు భవిష్యత్తు గురించి వణుకుతున్నారని, ఆందోళన చెందుతున్నారని రాతలు, కోతలు! చానెళ్లూ అంతే.  తమ ప్రత్యర్థులకు సంబంధించి ‘గోరంతలను కొండంతలు చేయడం’, తమకు ఇష్టమైనవారైతే, తమ వారైతే వారు చేసిన ‘అవినీతి కొండలను, గోలకొండలను’ దాచడం ఒక నీతిగా చెలామణి అవుతున్నది. ఏ పత్రికలూ లేని కాలంలో ఆ రెండు పత్రికలదే హవా, ఆ చానెళ్లదే రాజ్యం. వారు రాసిందే వార్త, వారు ప్రసారం చేసిందే విశ్లేషణ. అక్షరాలను రక్షణ కవచాలుగా చేసుకుని ఆ పత్రికలు, చానెళ్లు, ఆ పార్టీ చెలరేగిపోయాయి. దీనిని బద్దలు కొట్టడానికే రాజశేఖర్‌రెడ్డి సాక్షిని ప్రవేశపెట్టాడు. ఏ పత్రికా స్వేచ్ఛను అడ్డంపెట్టుకుని ఈనాడు, మరికొన్ని పత్రికలు, చానెళ్లు తమ రాజకీయ లక్ష్యాలను బతికిస్తున్నాయో కనిపెట్టి, అదే పత్రికా స్వేచ్ఛను సాధనంగా చేసుకోవాలనుకున్నాడు. అప్పటిదాకా ఈనాడు, ఇతర పత్రికలు, చానెళ్లు తొడుకున్న నీతిముసుగులను తొలగించి నగ్నంగా నిలబెట్టాడు. అదీ నీతి కాదు, ఇదీ నీతి కాదు, అసలు ఏదీ నీతి కాదు…అన్న ఒక నైతిక విధ్వంసకాండను పూర్తి చేశారు. అధికారంకోసం జరిగే యుద్ధంలో నీతి ఉండదని గెలుపే ముఖ్యమని చంద్రబాబు రుచి చూపిస్తే, రాజశేఖర్‌రెడ్డి దానిని పరాకాష్ఠకు తీసుకెళ్లారు. ఒకరు మొదలు పెట్టారు, మరొకరు పూర్తి చేశారు. మీడియాపై ఒక కొత్త చూపు మొదలైంది అప్పుడే. ఒక్క  రాజకీయాధిపత్యం విషయంలోనే కాదు. తెలంగాణ విషయంలోనూ ఈ పత్రికలు, ఈ నేతలదీ ఇదే తంతు. తెలంగాణవాదాన్ని ఎగతాళి చేయడానికి, కించపర్చడానికి, దెబ్బకొట్టడానికి చేయని ప్రయత్నం లేదు. పైకి వేషాలు వేయవచ్చు. తెలంగాణ మద్దతుదారులుగా నటించవచ్చు. కానీ మోకా వచ్చినప్పుడల్లా తెలంగాణవాదాన్ని దెబ్బకొట్టేందుకు ఈ పత్రికలు, చానెళ్లు చేసిన ప్రయత్నాలు అందరికీ అర్థమవుతూనే ఉన్నాయి. తెలంగాణ రాకూడదు. వచ్చినా తెలుగుదేశం పోకూడదు. ఆంధ్రప్రదేశ్ కొనసాగాలి. అందులో బాబుగారే వర్ధిల్లాలి. రాజశేఖర్‌రెడ్డీ ఇదే పనిచేశారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన చేయని ద్రోహం, తీయని దెబ్బ లేదు. కానీ వ్యక్తులకంటే, రాజకీయాలకంటే వాదం బలమైనది. అందుకే అది అన్ని పరీక్షలకు నిలబడి, కలబడి గెలిచింది.

అక్కడ సీమాంధ్రలో జగన్‌మోహన్‌రెడ్డి సొంత పార్టీ పెట్టి అసలు సమీకరణాలే(ఈక్వేషన్సే) మార్చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంకోసం ఆబగా ప్రయత్నించకుండా ఉండి ఉంటే, అధిష్ఠానాన్ని సవాలు చేయకుండా ఉండి ఉంటే, సొంత రాజకీయ పార్టీ పెట్టకపోయి ఉంటే, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రాణ సంకటంగా మారకుండా ఉండి ఉంటే, ఒక సామాజిక వర్గం రాజకీయ అధికారానికి ముప్పుగా పరిణమించకుండా ఉండి ఉంటే ఇవ్వాళ కేవీపీ రామచంద్రరావులాగా హాయిగా, ప్రశాంతంగా, అనేక కార్యక్రమాలకు అతిథిగా ఉండి ఉండేవారు. అధికారంకోసం అర్రులు చాచకపోతే అవినీతికి ఆత్మవంటివాడు నిక్షేపంగా పార్లమెంటులో కాలక్షేపం చేసి ఉండవచ్చు. అధికారానికి విధేయుడుగా ఉంటే అవినీతి సూత్రధారులు దేశానికి మంత్రులుగా కూడ కొనసాగవచ్చు. ఎంత అవినీతికి పాల్పడినా వాడు మనవాడయితే చూసీ చూడనట్టు వదిలేయవచ్చు. సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్. సజెస్టివ్ ఇంటరాగేషన్. ప్రయోజనాల సంఘర్షణ, అధికారంకోసం జరిగే యుద్ధం ముదిరిపాకాపడుతున్నది. పాపం-ఈ యుద్ధ సీనులో కాంగ్రెస్ ఉండదు. ఎందుకంటే వారికి పత్రిక లేదు. భవిష్యత్తు మీద, ప్రయోజనాల మీద పెద్దగా శ్రద్ధా లేదు. తన్నుకోవడంలోనే వారి కాలమంతా గడచిపోతున్నది. కాంగ్రెస్‌ను చెడగొట్టవలసింది ఏమీ లేదు. దాని అంతం అదే చూసుకుంటున్నది. ఇక మిగిలింది, బలమైన శక్తిగా ముందుకు వస్తున్నది జగన్‌మోహన్‌రెడ్డి. అందుకే తెలుగుదేశం కానీ, ఆ రెండు పత్రికలు కానీ జగన్‌ను చూసి ఎక్కువగా ఆందోళన చెందుతున్నాయి. భవిష్యత్తులో తమ ప్రయోజనాలకు, తమ అధికారానికి జగన్ నుంచి  ఉన్న ముప్పు, కాంగ్రెస్ నుంచి లేదని వారు భావిస్తున్నారు.  2009లోనే చిరంజీవి కారణంగా దారుణంగా దెబ్బతిన్నామని, 2014లో కూడా జగన్ వల్ల సీమాంధ్రలో,  టిఆరెస్ వల్ల తెలంగాణలో దెబ్బతింటే ఇక ఆ తర్వాత పార్టీని బతికించడం కష్టమని, తమ సామాజిక వర్గం ప్రయోజనాలను కాపాడుకోవడం కష్టమని తెలుగుదేశం, ఆ రెండు పత్రికలు భావిస్తున్నాయి. అందుకే తెలుగుదేశం, ఆ రెండు పత్రికలు జగన్‌ను, టిఆరెస్‌ను ధ్వంసం చేయడానికి చేయని  ప్రయత్నం లేదు. విషాదం ఏమంటే, ఒక పార్టీని ధ్వంసం చేసే నైతిక శక్తిని తెలుగుదేశం ఎప్పుడో కోల్పోయింది. నీతి మంతులు చెప్పే మాటలకు విలువ వుంటుంది. అవినీతిపరులు మంచి మాటలు చెప్పినా ఎవరూ వినిపించుకోరు. ఏ విలువలకూ కట్టుబడని వారు, ఏ న్యాయపరీక్షలకూ నిలబడనివారు, ఏ దర్యాప్తులనూ ముందుకు సాగనివ్వనివారు ఇవ్వాళ ఎంతగోల చేసినా ఎవరు నమ్ముతారు?

నీతిలేక పోతే నీడలేదు

రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలుండవు అంటారు రాజకీయ పండితులు. ఒకరిని ఒకరు ఫినిష్ చేయడం అంటూ ఉండదు. అలా ఫినిష్ చేయాలని చూసినవారే ఫినిష్ అయిపోయిన సందర్భాలు మన అనుభవంలో కూడా ఉన్నాయి. నాయకులు చేసే తప్పులే, నాయకులకు వచ్చే మెప్పులే ఏ పార్టీనయినా ముంచేది, పెంచేది. నాయకులపై ఉండే నమ్మకం, నాయకుడు ఒక విధానానికి కట్టుబడి ఉండే నీతిబద్ధత ఆ పార్టీకి డ్రైవింగ్ ఫోర్సు అవుతాయి. ఏదో ఒక కొత్త నీతిని, ఏదో ఒక కొత్త విధానాన్ని, ఏదో ఒక వినూత్న నినాదాన్ని అందిపుచ్చుకుని ముందుకు వచ్చిన నాయకులనే జనం నెత్తికెత్తుకుంటూ వచ్చారు. చరిత్ర నిండా ఇటువంటి పాఠాలు కొల్లలు.

కాంగ్రెస్ కుళ్లిపోయి, పుచ్చిపోయి బుర్రలు కాస్తున్న కాలంలో ఎన్‌టిఆర్ తెలుగుజాతి ఆత్మగౌరవం, బడుగులకు అధికారం, స్వచ్ఛమైన పాలన నినాదాలతో ఎటువంటి ఉరుములూ మెరుపులూ లేకుండానే తెలుగునాట విజయ దుందుభి మోగించారు. ఒక దివాలాకోరుతనం ఓడిపోయింది. కొత్త ఆశ, ఆశయం విజయం సాధించింది. కానీ ఏడేళ్లు తిరిగే సరికి ఆ ఆశ, ఆశయాలపై భ్రమలు తొలగిపోయాయి. ముఖ్యమంత్రులు మారలేదు. ఎన్‌టిఆర్ ఒక్కరే నాయకుడు. కానీ అహం అతిశయించి, అన్ని రకాల వెర్రితలలూ ప్రదర్శించారు. కొత్త వేషాలు, కొత్త విధానాలు, నియంతృత్వ పోకడలు, మూఢ నమ్మకాలు…ఎన్‌టిఆర్ తనను తానే ప్రజల దృష్టిలో

హీనపర్చుకుంటూ వచ్చారు. రాజకీయ ఆత్మహత్యలు జరిగేది ఇలాగే. ఆయననుంచి ఏ విధానాలు ఆశించారో అవి నెరవేరలేదు. ఆయనలో ఏ నీతిబద్ధతను కోరుకున్నారో అది నిలబడలేదు. అందుకే 199లో అంతకు ముందు ఛీకొట్టిన కాంగ్రెస్‌నే తిరిగి గెలిపించారు. అయినా కాంగ్రెస్ గుణం మారలేదు. అష్టవంకరలు మానలేదు. ముఖ్యమంత్రులను మార్చడం, కీచులాటలు, నిత్య పంచాయతీలు నిరవధికంగా కొనసాగాయి.  ఆ తర్వాత అయిదేళ్లకు 1994 ఎన్‌టిఆర్ మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో పాత నినాదాలకు పదునుపెట్టి, కొత్త నినాదాలను జోడించి, మద్య నిషేధాన్ని హామీ ఇచ్చి కనీవినీ ఎరుగని విజయం సాధించారు. కానీ ఆయన రెండో పెళ్లి చేసుకున్నారని, ఆయన భార్య లక్ష్మీపార్వతి ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నారని పనిగట్టుకుని ప్రచారం చేసి, పత్రికల్లో అదేపనిగా రాయించి, వేధించి, ఎన్‌టిఆర్ నైతికతమీద దెబ్బకొట్టారు చంద్రబాబునాయుడు, ఆయన సహచరులు. ఎన్‌టిఆర్, లక్ష్మీపార్వతిలవల్ల రాష్ట్రానికి మహాపాపమేదో జరిగిపోతున్నదని ఊదరగొట్టారు. మెజారిటీ ఎమ్మెల్యేలను కూడగట్టుకుని ఎన్‌టిఆర్‌ను పదవీచ్యుతుడిని చేశారు.

విచిత్రం ఏమంటే, ఎన్‌టిఆర్‌ను నైతికంగా దెబ్బతీసిన చంద్రబాబు, తాను నీతిమంతుడిగా ప్రజల మెప్పును పొందలేకపోయారు. ఎన్‌టిఆర్‌ను అన్యాయంగా గద్దెదింపారని, వెన్నుపోటు పొడిచారని, ఆయన అకాల మృతికి కారణమయ్యారని చంద్రబాబునాయుడు విమర్శలు ఎదర్కొన్నారు. అనైతిక చర్యకు ప్రతీకగానే ఆయనను జనం చూశారు. ఆ అనైతిక ముద్రనుంచి బయటపడడానికి ఆయన చాలా పాట్లు పడ్డారు. ప్రజల వద్దకు పాలన, ఆకస్మిక పర్యటనలు, ప్రభుత్వ యంత్రాంగాన్ని పరిగెత్తించడం…వంటివి ఆయనపై పడిన ముద్రను కొంతమేరకు తగ్గించాయి. కానీ ఆయన పూర్తిస్థాయిలో ప్రజల విశ్వాసాన్ని మాత్రం పొందలేకపోయాయి. 1994లో 44.5 శాతం ఓట్లు సాధించిన తెలుగుదేశం ఇక ఆ వైభవాన్ని ఇంతవరకు చూడలేదు. 1996, 199 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా 32.59, 31.97 శాతం ఓట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. చంద్రబాబు నైతిక పతనం బిజెపికి ఉపయోగపడింది. రాజకీయాల్లో ఒక కొత్త నీతితో, కొత్త సందేశంతో బిజెపి ముందుకు వచ్చింది. 199 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఒంటరిగా 1.3 శాతం ఓట్లు సంపాదించింది. నాలుగు లోక్‌సభ స్థానాలను గెల్చుకుంది.

చంద్రబాబు పతనం నుంచి తనను తాను కాపాడుకోవడానికి 1999 ఎన్నికల్లో 24 గంటల్లో విధానాలను, నినాదాలనూ మార్చి బిజెపి పంచన చేరాడు. కార్గిల్ విజయం, వాజ్‌పేయిని అన్యాయంగా దించేశారన్న మధ్యతరగతి ఆగ్రహం, టిడిపి-బిజెపి కూటమికి ఉపయోగపడ్డాయి. ‘నువ్వు మంచివాడివి కాకపోయినా
పర్వాలేదు, మంచివాళ్లతో ఉంటే కొంత కీర్తి నీకువస్తుంది’ అని లోకనీతి. చంద్రబాబుకు అదే ఉపయోగపడింది. మళ్లీ అధికారంలోకి వచ్చారు. అయినా ఆయనకు వచ్చింది 39.5 శాతం ఓట్లు మాత్రమే. ప్రతి ఎన్నికలోనూ ఒక నీతి గెలిపిస్తూ ఉంటుంది. ఒక బలహీనత, ఒక అనైతికత, ఏ నీతీ లేనితనం ఓడుతూ ఉంటుంది. 1999 ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్‌కు ఒక చోదక శక్తి ఎవరూ లేరు. బహునాయకత్వం, తన్నులాటలు, సీట్ల పంపకంలో లాలూచీలు, టికెట్ల అమ్మకాలు….ఇక ఆ పార్టీ ఏం నీతిని చెబుతుంది? ప్రజలకు ఎలా విశ్వాసం కలిగిస్తుంది? అందుకే కాంగ్రెస్‌ను ప్రజలు క్షమించలేదు. 2004కు వచ్చే సరికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌కు ఒక చోదక
శక్తిగా, ఒక నైతిక శక్తిగా రాణించారు. చంద్రబాబునాయుడు ప్రచారం మాయలో పడి నేలవిడిచిన సాము మొదలు పెట్టారు. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోకుండా స్టార్ ఆఫ్ ఏసియా అనిపించుకోవడానికి ఉబలాటపడ్డారు. పత్రికలు, వందిమాగధులు, ప్రపంచబ్యాంకు ఆయనను మునగచెట్టు చివరికొమ్మ మీదికి తీసుకెళ్లాయి. మరోవైపు రాజశేఖర్‌రెడ్డి అంగన్‌వాడి కార్మికులు మొదలు కాంట్రాక్టు టీచర్ల వరకు ఎక్కడ ఏ సభ జరిగినా వాలిపోయి, కలిసిపోయి, జనంలో విశ్వాసాన్ని పెంచుకుంటూ వచ్చారు. ఆయన పాదయాత్ర ఆయనను ఒక త్యాగశీలిగా, ఒక పోరాట యోధునిగా జనం ముందు నిలబెట్టింది. రాజశేఖర్‌రెడ్డికి సంబంధించి అంతకుముందున్న ముద్రలన్నింటినీ ఆయన చర్యలు తుడిపేశాయి. ఆ కొత్త ముద్రే ఆయనను విజేతగా నిలబెట్టింది. ఆ తర్వాత ఐదేళ్లూ రాజశేఖర్‌రెడ్డి తాను స్వయంగా ఎన్ని అనైతిక చర్యలకు పాల్పడినా, చంద్రబాబు నైతికత మీదనే దాడిని కొనసాగిస్తూ వచ్చారు. చంద్రబాబుకు మద్దతుగా వచ్చిన ఆ రెండు పత్రికలు ఎన్ని కుంభకోణాలు, ఎన్ని అక్రమాలు బయటపెట్టినా ప్రజలు నమ్మకుండా ఉండడంకోసం, వాటి నైతికతపైనా దాడి చేశారు. చంద్రబాబు నమ్మదగిన మనిషి కాదు అన్న వాదాన్ని ఎప్పటికప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తూ పోయాడు. చంద్రబాబు చేసిన తప్పులన్నీ రాజశేఖర్‌రెడ్డి కూడా చేస్తూ పోయారు. తన తప్పులు ఎత్తిచూపినప్పుడల్లా ఎదురుదాడిని ఆయుధంగా చేసుకుని ప్రచారం చేశారు. చంద్రబాబును గతం పీడలాగా వెంటాడుతూ వచ్చింది. చంద్రబాబు నైతికంగా తిరిగి ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి పెద్ద ప్రయత్నమేదీ చేయలేదు.

అసలు తాను తప్పులే చేయలేదన్నట్టు, తనను ఓడించి ప్రజలే తప్పు చేశారన్నట్టు ఆయన మాట్లాడుతూ వచ్చారు. సాధారణంగా ప్రజాతీర్పు చూసిన తర్వాతయినా నాయకులు తప్పులు ఒప్పుకుంటారు. చెంపలేసుకుంటారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కానివ్వబోమని తిరిగి ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. దూరమైన వారికి తిరిగి నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తారు. కానీ చంద్రబాబు మొదటి నాలుగేళ్లూ ఏనాడూ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయలేదు. తప్పులు తెలుసుకోవడం, ఒప్పుకోవడం నామూషీగా ఫీలయ్యారు. అయినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం తెలంగాణలో ఆయన పాత తప్పులన్నింటినీ
తెరమరుగుచేసింది. మహాకూటమి ఏర్పాటు చేయడానికి అది దోహదం చేసింది. ఆయనకు ఒక నైతిక సమర్థన రావడానికి,  రెండు ప్రాంతాల్లోనూ ఊపురావడానికి, పార్టీ ముక్క చెక్కలు కాకుండా చూడడానికి ఇది ఉపయోపడింది. కానీ తీరా ఎన్నికల వేళ చంద్రబాబు మళ్లీ నీతితప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. టిఆరెస్ పొత్తు ధర్మాన్ని పాటించి టిడిపికి ఓట్లేస్తే, టిడిపి చాలా చోట్ల వెన్నుపోటు పొడిచింది. చంద్రబాబు అతితెలివి అసలుకే మోసం తెచ్చింది. తెలంగాణలో మరో 25-30 సీట్లు తేలికగా వచ్చేవి. తెలంగాణలో మహాకూటమికి 35.4 శాతం ఓట్లు వస్తే, కాంగ్రెస్‌కు 33.3 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓట్ల బదిలీ నిజాయితీగా జరగకపోవడమే మహాకూటమి ఓటమికి కారణం అని ఈ అంకెలు తెలియజేస్తాయి. మరోవైపు చిరంజీవి కల్పించిన కొత్త ఆశలు, కొత్త విధానాలు కొన్ని ఓట్లను చీల్చాయి. రాష్ట్ర ప్రజలు ఏది నీతి, ఏది అవినీతి అని తేల్చుకోలేని ఒక పరిస్థితిని రాజశేఖర్‌రెడ్డి సృష్టించగలిగారు. అందుకే 2009 ఎన్నికలు అంత సంక్లిష్టంగా ముగిశాయి. రాజశేఖర్‌రెడ్డి అవినీతిపై ఆగ్రహం నిజమే. చంద్రబాబు నీతిమంతుడుగా,
నమ్మదగిని నాయకుడుగా విశ్వాసం కలిగించకపోవడం నిజమే. చిరంజీవి కొత్త నీతితో ముందుకు వచ్చినా ఆయన కూడా పూర్తిస్థాయిలో ప్రజల్లో విశ్వాసం కలిగించలేకపోయారు. ఓట్ల చీలిక రాజశేఖర్‌రెడ్డిని గెలిపించింది. కేవలం 36.5 శాతం ఓట్లతో రాజశేఖర్‌రెడ్డి తిరిగి అధికారంలోకి వచ్చారు. చరిత్రలో ఇంత తక్కువశాతం ఓట్లతో ఒక పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఇదే మొదలు. ఈ పరిణామాలన్నీ చెబుతున్నది ఒక్కటే. పార్టీలను గెలిపించినా ఓడించినా నాయకుల చేతుల్లోనే ఉంది. వారి మంచి చెడులే గీటురాయి అవుతాయి. వారు ఇచ్చే నినాదాలే చోదక శక్తులవుతాయి. కాంగ్రెస్ తెలంగాణపై తన వైఖరి ప్రకటించి, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు పాటుపడిఉంటే తెలంగాణ ప్రజలు ఆ పార్టీని నెత్తిన పెట్టుకునే వారు. చంద్రబాబునాయుడు తెలంగాణపై మాటమార్చకుండా ఉండి ఉంటే తెలంగాణలో ఆయనకు ఈ గతి పట్టి ఉండేది కాదు.

విషాదం ఏమంటే, నీతిలేని ఇటువంటి విధానం వల్ల కాంగ్రెస్, టీడీపీలను అటు ఆంధ్రలో కూడా జనం నమ్మని పరిస్థితి వచ్చింది. జగన్‌మోహన్‌రెడ్డిని ఎందుకు నమ్ముతున్నారంటే, ఆయనను జనం ఇంకా అధికారంలో చూడలేదు. రాజశేఖర్‌రెడ్డి చేసిన కొన్ని సంక్షేమ పథకాలు, ఆయన అకాల మరణం జగన్‌మోహన్‌రెడ్డి పట్ల కొన్ని వర్గాల ప్రజల్లో ఒక ఆబ్లిగేషన్ సృష్టించాయి. నీతి అవినీతిలతో నిమిత్తం లేదు. ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ
అన్నదే తేడా. చంద్రబాబు జగన్‌మోహన్‌రెడ్డి మీద వేస్తున్న బాణాలు పనిచేయకపోవడానికి కారణం అదే. చంద్రబాబు లేక కాంగ్రెస్ నేతలు నైతికంగా తిరిగి తమను తాము రుజువు చేసుకునేదాకా వారిని ప్రజలు క్షమించరు. నైతికంగా రుజువు చేసుకోవడం అంటే ప్రత్యర్థులపై ఆరోపణలు, బురద కుమ్మరించడం కాదు.అది బుకాయింపు అవుతుంది.బుకాయింపులను, దొంగదెబ్బలను జనం ఇంకా ఛీత్కరిస్తారు. మనం ఎంత నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తున్నామో, ఎంత సూత్రబద్ధంగా ఉన్నామో రుజువుచేసుకోవాలి. కేసీఆర్ అలా ఒక సూత్రబద్ధతకు కట్టుబడి నిలబడ్డారు కాబట్టే ఇవ్వాళ ఆయన బలపడుతున్నారు. ఆయన బలం తెలంగాణ నినాదం. ఆయన నైతిక శక్తి తెలంగాణ. తెలంగాణలో ఇవ్వాళ ఏ పార్టీ బతికి బట్టకట్టాలన్నా మళ్లీ ఒక నీతిబద్ధమైన నిర్ణయం(మోరల్ పొజిషన్) తీసుకోవాల్సిందే. రెండు కళ్లు, మూడు కళ్లు, అనేక నాలుకలను జనం సహించరు.