తెలంగాణ. చోదకశక్తి

తెలంగాణ రాష్ట్ర సమితి పదకొండేళ్లు పూర్తిచేసుకోవడం ఒక చారిత్రక విశేషం. ఈ పదకొండేళ్లలో తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర రాజకీయాల్లో తెచ్చిన మార్పు అసాధారణం. ‘తెలంగాణ’పదం ‘ఉచ్చరించడానికి వీలులేని’ పరిస్థితి నుంచి తెలంగాణ పదం ‘ఉచ్చరించకుండా ఉండలేని’ పరిస్థితి రావడం ఈ పదకొండేళ్లకాలంలో వచ్చిన గొప్ప మార్పు. ఒక్కరు ఇద్దరు ముగ్గురు పదుగురై ఒక మహా ఉద్యమంగా పరిణమించిన సందర్భం. తెలంగాణ ఇవ్వడమో లేక రాజకీయంగా చావడమో తప్పని పరిస్థితిని కాంగ్రెస్ ముందుంచిన రాజకీయ ప్రస్థానం ఇది. తెలంగాణపై స్పష్టమైన తీర్మానాన్ని చేయడమో లేక శాశ్వతంగా తెలంగాణ విద్రోహులుగా మిగిలిపోవడమో-ఏదో ఒకటి తేల్చుకోవలసిన కీలకదశకు తెలుగుదేశంను నెట్టిన విశిష్ట ఘట్టం ఇది. తెలంగాణ సమాజం అంతా ఒకవైపు, మిగిలిన తెలంగాణ ద్రోహులంతా ఇంకోవైపు మోహరించబడిన ప్రత్యేక పరిస్థితి ఇది. ఒక్క దశాబ్దకాలంలో ఇంత మార్పు, ఇన్ని పరిణామాలు ఎలా సాధ్యమయ్యాయి? ఈ మార్పులకు చోదక శక్తి ఎవరు? ఎన్ని కష్టాలు పడితే ఇది సాధ్యమైంది? ఎన్ని ఎదురుదెబ్బలు, ఎన్ని కష్టనష్టాలు, ఎన్ని బాధలు, కన్నీళ్లు, త్యాగాలు, విద్రోహాలు చవి చూసింది తెలంగాణ ఉద్యమం?

తెలంగాణ ఉద్యమంపై జరిగినన్ని రాజకీయ దాడులు ఏ ఉద్యమంపైనా జరగలేదేమో! తెలంగాణ ఉద్యమ సారథి కె.చంద్రశేఖర్‌రావుపై జరిగినంత దుష్ప్రచారం, విమర్శలదాడి రాష్ట్రంలో ఏ నాయకుడిపైనా జరగలేదు. కేసీఆర్ వ్యక్తిగత జీవితంపై జరిగినంత చర్చ ఏ నాయకుడి జీవితంపై జరుగలేదు. చాలా సార్లు సీమాంధ్ర నాయకత్వంలోని రాజకీయ పక్షాలు, పత్రికలు, చానెళ్లు విడివిడిగా, జమిలిగా ఒక పథకం ప్రకారం దాడి చేశాయి. కానీ అవేవీ కాలపరీక్షకు నిలబడలేదు. దూదిపింజల్లా తేలిపోయాయి. తొలుత చంద్రబాబునాయుడు, తర్వాత రాజశేఖర్‌రెడ్డి టిఆరెస్‌పై, కేసీఆర్‌పై ఎన్ని కుట్రలు చేశారని? చంద్రబాబు కొందరు తెలంగాణ నాయకులను కొనుగోలు చేస్తే, రాజశేఖర్‌రెడ్డి ఏకంగా తెలంగాణ ఎమ్మెల్యేలనే కొనుగోలు చేశారు. చంద్రబాబు ఉద్యమాన్ని ఆగంపట్టించాలని చూస్తే, రాజశేఖర్‌రెడ్డి టీఆరెస్‌ను పాతరేయాలని చూశారు. కేసీఆర్ ఉద్యమాలు, త్యాగాల పునాదులపై ఒక్కొక్క మెట్టే నిర్మించుకుంటూ వస్తే, మరోవైపు అడుగడుగునా విద్రోహాల ముళ్ల కంచెలు పరిచి తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయాలని చూశారు బాబు, వైఎస్. తరచూ అసత్యాలు, అర్ధసత్యాలు కుమ్మరించి, అవే పత్రికల్లో రాయించి తెలంగాణ ప్రజలను గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేశారు. కొన్ని సార్లు విజయం సాధించారు కూడా.

ఎన్నికలను ఎలా మేనేజ్ చేయాలో, ఎన్నికల్లో డబ్బులు ఎలా ఖర్చు చేయాలో నేర్పించినవాడు చంద్రబాబునాయుడు. ఎన్నికల సమయంలో కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ దాకా అందరినీ ఎలా గుప్పిట్లో పెట్టుకోవాలో ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చినవాడు చంద్రబాబునాయుడు. రాజకీయాల్లో క్విడ్ ప్రో క్వో పద్ధతిని ప్రవేశపెట్టినవాడు చంద్రబాబునాయుడు. కంపెనీలకు మేలు చేసి, వారి నుంచి ఆర్థిక మేళ్లు పొందడం చంద్రబాబుతోనే మొదలైంది. అయితే ఈ విద్యల్లో చంద్రబాబు, వైఎస్‌ల బడి ఒక్కటే. డిగ్రీల తేడా! చంద్రబాబు డిగ్రీ చదివితే, రాజశేఖర్‌రెడ్డి పీజీ చదివారు. పీహెచ్‌డీ కూడా చేశారు. బడా కంపెనీల నుంచి వందల కోట్ల ఎన్నికల నిధులు సేకరించడం, టిక్కెట్ల పంపిణీలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, ఇతరపార్టీల నాయకులను కొనుగోలు చేయడం, ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో తిరుగుబాట్లు చేయించడం….బాబుకు, వైఎస్‌కు వెన్నతో పెట్టిన విద్య. బాబు, వైఎస్-ఇద్దరూ కుటుంబ రాజకీయాలపై ఆధారపడినవారే. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా తమ కుటుంబ సభ్యులను గెలిపించుకున్నవారే. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించినవారే.  ఏ నీతిని, ఏ విలువలనూ గౌరవించని నాయకులు వీరు.  కానీ వీరి నీతిబాహ్య రాజకీయాల గురించి గానీ, వీరి వ్యక్తిగత జీవితం గురించి గానీ ఏరోజూ ఏ నాయకుడూ, ఏ పత్రికా, ఏ చానెల్ మాట్లాడిందీ, రాసిందీ, ప్రసారం చేసిందీ లేదు. ‘చంద్రబాబు రాత్రి ఏమి తింటారు? ఎక్కడికి వెళతారు? ఎవరిని కలుస్తారు? వైఎస్ రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఏం చేస్తారు? ఏం మద్యం సేవిస్తారు? ఎవరిని కలుస్తారు?’ అని ఏ పత్రిక అయినా, ఏ నాయకుడయినా మాట్లాడారా? లేదు.

కానీ కేసీఆర్ గురించి మాట్లాడని అంశం లేదు. టికెట్లు అమ్ముకుంటారని, చందాలు వసూలు చేస్తారని, కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, మద్యం సేవిస్తారని…ఇంకా అనేకానేక విమర్శలను అదేపనిగా కుమ్మరించారు. సీమాంధ్ర పార్టీలు, సీమాంధ్ర మీడియా పనిగట్టుకుని కేసీఆర్‌కు ఒక చెడుముద్రను ఆపాదించే పని చేశాయి. కానీ తెలంగాణ  విషయంలో ఆయనకున్న నిబద్ధత కారణంగా ఆ విమర్శలు ఎక్కువకాలం నిలవలేదు. నిజానికి విమర్శలు చేసే వారి టార్గెట్ కేసీఆర్‌ను వ్యక్తిగతంగా కించపర్చడం కాదు, తెలంగాణవాదాన్ని నైతికంగా దెబ్బతీయడం. కేసీఆర్‌ను బలహీన పర్చితే తెలంగాణ వాదాన్ని బలహీనపర్చవచ్చన్నది వారి అసలు ఉద్దేశం. కానీ తెలంగాణ ఉద్యమం, టీఆరెస్ చాలా పరిణతితో ఆ దాడులన్నింటినీ తిప్పికొడుతూ వచ్చింది.  పది మంది టీఆరెస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయినప్పుడు, 200 ఉప ఎన్నికల్లో పార్టీ కొన్ని స్థానాల్లో పరాజయం పాలైనప్పుడు, రాజశేఖర్‌రెడ్డి తిరిగి గెలిచినప్పుడు తెలంగాణవాదం పని అయిపోయిందని, కేసీఆర్ ఇక ఇంట్లో కూర్చోవలసిందేనని సంబరాలు జరుపుకున్నవారు ఉన్నారు. సీమాంధ్ర పత్రికలు, చానెళ్లు తన్మయత్వంతో ఊగిపోయాయి. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన రాజశేఖర్‌రెడ్డిని ధీరునిగా, ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోవడం కేసీఆర్ ఓటమిగా కుప్పలుతెప్పలుగా విశ్లేషించాయి. కానీ వారి సంబరం ఆవిరికావడానికి, తన్మయత్వం వదిలిపోవడానికి ఎంతోకాలం పట్టలేదు. తాత్కాలిక విరామాలు, పరాజయాలు ఎదురయి ఉండవచ్చు, కానీ కేసీఆర్ ఎప్పటికప్పుడు వారి అంచనాలను తలకిందులు చేస్తూ వచ్చారు. దెబ్బతిన్న ప్రతిసారీ ఫీనిక్స్ పక్షిలాగా మరింత బలంతో పైకి లేస్తూ వచ్చారు. ఉద్యమపతాకాన్ని ఎగరేస్తూ వచ్చారు. ఆయన పంతం, ఓర్పు, నేర్పు తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు సజీవంగా, గతిశీలంగా కొనసాగిస్తూ వచ్చాయి. ఉద్యమ శక్తులన్నింటికీ ఆయనే ఒక చోదక శక్తిలాగా పనిచేస్తూ వచ్చారు. తెలంగాణవాదాన్ని జాతీయ రాజకీయ గగనతలంపై సమున్నతంగా ఎగరేశారు. రాష్ట్రంలోని రాజకీయ శక్తులన్నీ తెలంగాణావాదం చుట్టూ ఒకే కక్ష్యలో పరిభ్రమించేట్టు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఇంకా అనేక శక్తులు చురుకుగా పాల్గొన్న సంగతి నిజమే, కానీ వారిలో చాలా మంది ప్రేరక శక్తుల పాత్రలోనే ఉండిపోయారు. తెలంగాణకోసం యుద్ధం చేయాలని, మిలిటెంట్ పోరాటాలు చేయాలని, సీమాంధ్రుల ఆర్థిక మూలాలపై దాడులు చేయాలని పిలుపులిచ్చే వారే తప్ప, ఆచరణలో వారు పెద్దగా పురోగతి సాధించలేకపోయారు. ఎటుచూసినా ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ ఒక్కరే పెద్ద దిక్కుగా మిగిలారు.

‘మన ఓట్లతో మన సీట్లను మనమే గెల్చుకుని’ తెలంగాణ అస్తిత్వ పతాకాన్ని ఢిల్లీలో ఎగరేయాలన్న కాంక్ష ఇప్పుడు తెలంగాణ నలుచెరగులా పరుచుకుంటున్నది. రాష్ట్రాన్ని ఎవరో ఇవ్వడం కాదు, మనమే తెచ్చుకునే పరిస్థితి రావాలని, యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి ఎదగాలని తెలంగాణ అంతరంగం కోరుకుంటున్నది. తెలంగాణవాదం ఇవ్వాళ జనజీవనంలో ఎంతగా ఇంకిపోయిందో రెండు రోజుల క్రితం ఒక డాక్టర్ మాట్లాడిన తీరు చూస్తే అర్థమవుతుంది-‘‘మన పార్టీలకు, నాయకులకు వివేకం లేదు. దూరదృష్టీ లేదు. అంతా మరుగుజ్జులు. తక్షణ లక్ష్యాలపైనే(షార్ట్ గోల్స్) మక్కువ. తెలుగు ప్రజల మేలుగోరే పార్టీలేవైనా తెలంగాణ సమస్యను ఇంతకాలం నాన్చుతారా? సందిగ్ధంతో రాష్ట్రం నాశనమవుతుంటే ఇలాగే నాటకాలాడతారా? తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాల్లో ఉంటే కొంపలు మునుగుతాయా? ముందంతా ఒప్పుకుని ఇప్పుడు ఈ కుప్పిగంతులు దేనికి? ఒకసారి అవునని, మరోసారి కాదని ఎన్నిరకాలుగా పిల్లిమొగ్గలు వేస్తారు? ఇవి ప్రజల బాగోగులు కోరే రాజకీయ పార్టీలేనా? వీళ్లు రాష్ట్రాన్ని ఉద్ధరించే నాయకులేనా? వీళ్లను ‘సన్నాసులు, దద్దమ్మలు’ అని కేసీఆర్ విమర్శించడంలో తప్పేముంది? దేశాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియాగా పునర్వ్యవస్థీకరించాలి. పెద్ద రాష్ట్రాలను పాలనాసాధ్యమైన, నిర్వహణాసాధ్యమైన  భాగాలు(మేనేజియబుల్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్)గా విభజించాలి. ఇది దేశానికీ మంచిది. ప్రజలకూ మంచిది’’. ఆయన గొప్ప రాజకీయ పండితుడు కాదు. మహా జర్నలిస్టూ కాదు. రాజకీయ మనోవిశ్లేషకులూ అంతకంటే కాదు. ఇరవై నాలుగు గంటలూ వృత్తిలో తలమునకలై ఉండే ప్రముఖ వైద్యుడు. ఆయన తెలంగాణా ప్రాంతానికి చెందినవారు కూడా కాదు. కేవలం కామన్ సెన్స్‌తో ఆయన మాట్లాడారు. ఈ కామన్ సెన్స్ కాంగ్రెస్, టీడీపీ నాయకత్వాలకు లేకపోవచ్చు, కానీ ప్రజలకు ఉంది. నాయకుల పదవీరాజకీయాలు, రెండుకళ్ల సిద్ధాంతాలు ఇప్పుడు జనానికి చాలా తేలిగ్గా అర్థమవుతున్నాయి. ఈ చైతన్యానికి చుక్కాని టీఆరెస్.
ఒక మండలంలోని స్థానిక పత్రిక నుండి న్యూయార్క్ టైమ్స్ దాకా, లండన్ థేమ్స్ నది ఒడ్డునుండి వాషింగ్టన్ వైట్‌హౌస్ వీధి వరకు తెలంగాణ చిరపరిచితమయింది. ఫేస్‌బుక్, ట్విటర్‌లలో నిత్య తెలంగానం విశ్వజనీనమయింది. వీధి ధర్నాలనుండి విదేశాల్లో ర్యాలీల వరకు విరాజిల్లుతోంది.
ఇదంతా కేవలం పదకొండేళ్లలో ఒకే ఒక వ్యక్తి వల్ల.
ఇది అందరికీ తెలుసు. తెలంగాణవాదులనుండి తెలంగాణ ద్రోహుల వరకు. ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం ఇప్పుడిక అనవసరం.
kattashekar@gmail.com

Advertisements

కేసీఆర్ ఏం చేశారు?

సమైక్యవాదులు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు
అనునిత్యం కేసీఆర్‌ను ఆడిపోసుకుంటుంటారు.
టిజి వెంక సాకే శైలజానాథ్‌లూ కేసీఆర్‌నే దుయ్యబడుతుంటారు.
దేవినేని ఉమ, పయ్యావుల కేశవ్‌లూ కేసీఆర్‌నే విమర్శిస్తుంటారు.
తెలంగాణ బిడ్డలు మోత్కుపల్లి, ఎర్రబెల్లి కూడా కేసీఆర్‌పైనే
ఒంటికాలుమీద లేస్తుంటారు.
తెలంగాణకోసం ఉద్యమాలు చేస్తున్నామని చెప్పే కొన్ని సంఘాలవాళ్లూ
కేసీఆర్‌పైనే దాడి చేస్తుంటారు.
తెలంగాణకు హక్కుదారులుగా చెప్పుకునే డికె అరుణ, రేణుకాచౌదరి
వంటి వాళ్లూ కేసీఆర్‌పైనే విసుర్లు ఎక్కుపెడుతుంటారు.
ఎందుకిలా జరుగుతోంది? వేర్వేరు పార్టీలు, వేర్వేరు ప్రాంతాలకు చెందిన అంద రి ఉమ్మడి లక్ష్యం కేసీఆర్ ఒక్కరే కావడంలోని అంతరార్థం ఏమిటి? ఇంతమందికి కేసీఆర్ శత్రువు ఎందుకయ్యారు? కేసీఆర్ నిజంగా ఇటువంటి విమర్శలకు పాత్రుడేనా? ఇంతమంది దీవెనలతో కేసీఆర్ బలపడుతున్నారా? బలహీనపడుతున్నారా? తెలంగాణ ఆకాంక్షలకు కేంద్రబిందువు కావడమే ఆయనను విమర్శలకు కేంద్రబిందువును చేసిందా? ఇటీవల జరిగిన ఒక మిత్రగోష్టిలో సీమాంధ్ర ప్రాంతానికి చెంది న సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ కేసీఆర్‌పై చేసిన విశ్లేషణ ఈ సందర్భంగా గుర్తు చేయదల్చుకున్నాను. ఆయన రాష్ట్ర రాజకీయాలను గురించి, వివిధ పార్టీల అగ్రనేతలను గురించి వర్ణిస్తూ, ఇంతమంది విమర్శలకు కేసీఆర్ ఎందుకు కేంద్రబిందువు అయ్యాడో వివరించాడు.
‘‘కేసీఆర్ ఏం చేశాడని పదే పదే మాట్లాడతారు టీడీపీ వాళ్లు. కేసీఆర్ తెలంగాణ కు పది తరాలకు సరిపోను నాయకులను తయారు చేశారు. తెలంగాణ సమాజాన్ని ఒక అస్తిత్వ కేతనంగా తీర్చిదిద్దారు. మా(సీమాంధ్ర) నాయకులూ ఉన్నారు. ఒక్కడు అరగంట కూడా సరిగా మాట్లాడలేడు. చాలా మందికి నోరే పెగలదు. అసలు మా నాయకులు రెండో తరం నాయకులను తయారు చేయరు సరికదా, ఉన్నవారిని ఎదగనీయరు. కానీ కేసీఆర్ ఊరూరా వేలాదిమంది ఉపన్యాసకులను, ఉద్యమకారులను తయారు చేశారు. ఒక సామాన్య గ్రామీణ కార్యకర్త, ఒక మామూలు యూనివర్సిటీ విద్యార్థి, ఒక పణికెర మల్లయ్య కూడా ఇవ్వాళ తెలంగాణపై గణగణా గంటసేపు మాట్లాడగలరు. చంద్రబాబు వంటి వారిని పొలంగట్టుపై నిలదీసి అడగగలరు. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, అస్తిత్వకాంక్షల స్పృహను సార్వజనికం చేయడమే కాదు, తెలంగాణ పేరెత్తకుండా ఇవ్వాళ ఏ నాయకుడూ మనలేని పరిస్థితిని తీసుకొచ్చారు. ఒక జాతి నిర్మాణానికి ఇంతకంటే ఏం కావాలి? సమకాలీన రాజకీయ చరివూతలో ఇంతటి కృషి, ఇంతటి ప్రభావం కలిగించిన నాయకుడిని చూపించండి? ఆయనకొక నినాదం ఉంది. తెలంగాణ నినాదాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా, వరంగ ల్ నుంచి వాషింగ్టన్ దాకా విస్తరింపజేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనను ఇంటింటి నినాదంగా మార్చారు. మా నాయకులకు అసలు ఏ నినాదమూ లేదు. ఉన్నదంతా డొల్లతనమే. కేసీఆర్ పదకొండేళ్లు ఏ అధికారం లేకున్నా, ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా పార్టీని, ఉద్యమాన్ని పట్టు సడలకుండానడుపుకుంటూ వస్తున్నారు. ఇటీవల మనం చూడడం లేదా-చంవూదబాబు ఏడేండ్లు అధికారం లేకపోయేసరికి విలవిల్లాడుతున్నారు. విచక్షణ, సోయి మరిచిపోయి మాట్లాడుతున్నాడు. ఏ లక్ష్యం, ఏ విధానమూ లేనప్పుడే ఇటువంటి అసహనం, దురావేశం వస్తాయి. కేసీఆర్‌కు ఒక విధా నం ఉంది. లక్ష్యం ఉంది. ఎవన్ని రకాలుగా ప్రచారం చేసినా, ఎన్ని అబద్ధాలను పత్రికల్లో కుమ్మరించినా తెలంగాణ కోసం మొక్కవోకుండా పోరాడున్నది ఒక్క కేసీఆరేనన్న నమ్మకం తెలంగాణ ప్రజల్లో ఉంది. వరుస ఉప ఎన్నికలన్నీ అదే విషయం రుజువు చేశాయి. అది ఆయన సంపాదించిన విశ్వసనీయత. నాయకులు బలపడినా, బలహీనపడినా విశ్వసనీయతపై ఆధారపడే జరుగుతుంది. చంద్రబాబుకు లేనిది అదే. ఆయన ప్రజల విశ్వసనీయతను పదే పదే కోల్పోతూ వస్తున్నారు. మాటమీద నిలబడనితనం ఆయనను జనం నుంచి దూరం చేస్తున్నది’’ అని ఆయన వివరించారు.
‘‘తెలంగాణ విషయంలో చంద్రబాబు చేసింది పెద్ద తప్పు. ఆయన ఇప్పటికీ సరిదిద్దుకోకపోగా బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. తనకెలాగూ విశ్వసనీయత లేదు కాబట్టి కేసీఆర్‌కు కూడా విశ్వసనీయత లేకుండా చేస్తే పోతుంది కదా అని ఆయన అనుకుంటున్నారు. చిన్న గీత పెద్దది కానప్పుడు, పెద్ద గీతను చెరిపేసి చిన్నదిగా చేయాలన్న కురుచబుద్ధి ఇది. అందుకే కేసీఆర్‌మీద, తెలంగాణ ఉద్యమం మీద మలినం కుమ్మరించడానికి, అబద్ధాలను ప్రచారం చేయడానికి ఒక మూకను  అదేపనిగా ప్రయోగిస్తున్నాడు. చంద్రబాబు రాజకీయ విజ్ఞతపై కాకుండా ఇప్పటికీ, ట్రిక్కుల మీద, టక్కుటమార విద్యలమీద ఆధారపడుతున్నాడు. అది చంద్రబాబు ను ఇంకా డ్యామేజ్ చేస్తున్నది. మొన్నటి ఉప ఎన్నికల్లో నామినేషన్లు పూర్తయ్యే సమయానికి తెలుగుదేశం పరిస్థితి కొంత మెరుగుగా ఉండింది. అన్ని చోట్ల డిపాజిట్లు వస్తాయని సర్వేలు అంచనా వేశాయి. తెలుగుదేశానికి అన్ని నియోజకవర్గాల్లోనూ 15 నుంచి 25 శాతం ఓట్ల దాకా వస్తాయని సర్వేలు సూచించాయి. కానీ పోలింగ్ సమీపించే కొద్దీ చంద్రబాబుతోపాటు మోత్కుపల్లి, ఎర్రబెల్లి మరీ రెచ్చిపోయి మాట్లాడారు. పర్యవసానం ఏమంటే, మూడు చోట్ల డిపాజిట్లు పోయాయి. మిగిలి న మూడు చోట్ల ముందు ఊహించిన దానికంటే తక్కువ ఓట్లు వచ్చాయి. కడియం శ్రీహరికి ఎర్రబెల్లి ప్రచారం మేలుకంటే కీడే ఎక్కువ చేసింది. తెలంగాణలోని ఇతర తెలుగుదేశం నాయకులు కూడా చంద్రబాబు ప్రయోగించిన మూకను చూసి భయపడుతున్నారు. వాళ్లు వాగే కొద్దీ తాము మరింత ఇరుకున పడతామని భావిస్తున్నా రు’’ అని ఆయన విశ్లేషించారు.
‘‘ఎవన్ని చెప్పినా, తిట్టినా తెలంగాణవాదానికి ఇప్పటికీ చోదకుడు కేసీఆర్ ఒక్కరే. ఆయన వల్ల కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు. కానీ తెలంగాణవాదాన్ని కేసీఆర్ ఎన్నడూ లెట్ డౌన్ చేయలేదు. మొదట చంద్రబాబు, ఆ తర్వాత రాజశేఖర్‌డ్డి, మళ్లీ చంద్రబాబు వంటివారు ఎన్నిసార్లు ఎన్ని ఎదురుదెబ్బలు, దొంగదెబ్బలు కొట్టినా ఆయన తెలంగాణ జెండాను మాత్రం కింద పడేయలేదు. కేసీఆర్ రాజకీయంగా బలపడేకొద్దీ తెలంగాణవాదం బలపడుతుంది. తెలంగాణవాదాన్ని కొట్టాలంటే కేసీఆర్‌ను కొట్టాలి. కేసీఆర్‌ను  రాజకీయంగా బలహీనపర్చితే తెలంగాణవాదం బలహీనపడుతుంది. అందుకే తెలంగాణ వ్యతిరేకులకూ (సమైక్యవాదులకు), తెలంగాణ ద్రోహులకూ, తెలంగాణ రావడం కంటే రాజకీయంగా బతకడం ముఖ్యమ ని భావించే కొందరు తెలంగాణ మిత్రులకూ(?) ఉమ్మడి లక్ష్యం అయ్యారు కేసీఆర్. కేసీఆర్‌ను రాజకీయంగా ఫినిష్ చేస్తే తెలంగాణ కథ ముగిసిపోతుందని వారి ఆలోచన. కానీ కేసీఆర్ సక్సెస్ అయింది అక్కడే. ఆయన వందలాది మంది కేసీఆర్‌లను తయారు చేసి పల్లెపప్లూకూ వదిలారు. తెలంగాణ వ్యతిరేకులు, ద్రోహుల పాచికలు పారకుండా నిలువరించగలిగారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే చాలాసార్లు ఆ విషయం రుజువు చేశారు. తెలంగాణవాదం ఇవ్వాళ ఈ ప్రాంత ప్రజల జీవనాడుల్లో ఇంకిపోయింది. తెలంగాణ తెచ్చిన వాళ్లను, ఇచ్చిన వాళ్లను మాత్రమే తెలంగాణ సమాజం అంగీకరిస్తుంది. గోడమీది పిల్లులను, ఊసర గబ్బిలాలను ఇక్కడి ప్రజలు ఇంకేమాత్రం భరించే అవకాశం లేదు’ అని ఆయన అన్నారు.
‘మోత్కుపల్లి నరసింహులు ఆంధ్రా ప్రాంతంలో పెద్ద హీరో అయ్యారు’ అని ఒక రాజకీయ పరిశీలకుడు ఇటీవల ఒక సందర్భంలో చెప్పారు. ఈ మాట స్వయంగా నర్సింహులు కూడా కొంతకాలంగా చెబుతున్నారు. కేసీఆర్‌ను విమర్శించడం మొద లు పెట్టిన తర్వాత తనకు అనూహ్యంగా, అసాధారణంగా అభినందనలు వచ్చాయ ని చెప్పారు. ‘అభినందించేవాళ్లంతా ఎవరు?’ అని అడిగితే స్పష్టంగా సమాధానం చెప్పలేదు. కానీ కాసు బ్రహ్మనందాడ్డి పార్కులో మోత్కుపల్లి రోజూ ఉదయం వాకింగ్‌కు వస్తారు. అక్కడ ఆయనకు ఎదురుపడే వాళ్లంతా ఆయనను అహో! ఒహో! అని కీర్తించడం నాకు కూడా తెలుసు. కానీ వాళ్లంతా ఎవరు? సమైక్యవాదం సుభిక్షంగా ఇలాగే ఉండాలని కోరుకునే ఆంధ్రా ప్రాంతానికి చెందిన పారిక్షిశామిక, ఉద్యోగ, మేధావి వర్గాల కు చెందిన మిత్రులు. తెలంగాణ రావద్దని కోరుకుంటున్నవాళ్లు. తెలంగాణకు అడ్డంపడుతున్నవాళ్లు. ‘తెలంగాణ రాకపోయినా ఫర్వాలేదు, కానీ మా రాజకీయ ప్రాబల్యం తగ్గకూడద’నుకునేవాళ్లు. బయటివాళ్లు నిన్ను పొగడుతున్నారం నువ్వు ఇంటివాళ్లకు దూరమవుతున్నావని అర్థం. సమైక్యవాదులకు హీరోవయ్యావం తెలంగాణవాదులకు విలన్ వు అవుతున్నావని అర్థం. సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న మోత్కుపల్లి నర్సింహులుకు ఈ లెక్కలన్నీ తెలియవని అనుకోలేం. కానీ ఆయన తెలంగాణవాదం నీడలో తనకు రాజకీయ అస్తిత్వం లేదనుకుంటున్నట్టున్నాడు. అందుకే క్యాలిక్యులేటెడ్ రిస్కుకు సిద్ధపడ్డాడు. ఈ పాత్రను స్వీకరించాడు.
చాలా ఏళ్ల కిందటి ముచ్చట. యూనివర్సిటీ లో స్టూడెంట్ యూనియన్ చైర్మన్‌కు పోటీ చేయాలని మా విద్యార్థి సంఘం అప్పట్లో నన్ను ఆదేశించింది. ‘నీకు విద్యార్థుల అందరి పేర్లు కంఠతా వచ్చు. నువ్వయితే గెలుస్తావ్’ అన్నారు. సరే అన్నాను. నాపై పోటీ చేయడానికి ఎవరూ ఉత్సా హం చూపించలేదు. ప్రత్యర్థులంతా చివరకు ఒక మిత్రుడిని ఒప్పించారు. ఆయన నామినేషన్ వేయగానే విద్యార్థినులంతా కట్టగట్టుకుని వచ్చా రు. ‘మీరు ఇక ప్రచారం చేయవలసిన అవసరం లేదు. నిశ్చింతగా ఉండండి. ఆయనకు ఎంత గొప్ప పేరు ఉందో మీకు తెలుసు’ అని చెప్పిపోయారు. నిజంగానే ఎక్కువగా కష్టపడకుండానే ఎన్నికల్లో గెలిచాం. మా ప్యానెల్‌కు 197 ఓట్లు వస్తే, ప్రత్యర్థికి 92 ఓట్లు వచ్చాయి. మన సుగుణమే కాదు, ఎదుటివారి దుర్గుణా లూ రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. కేసీఆర్ ఏ సుగుణాల కోసం, ఏ లక్ష్యాల కోసం నిలబడ్డాడు?  చంద్రబాబునాయుడు, మోత్కుపల్లి, ఎర్రబెల్లి, లగడపాటి, రాయపాటి… ఏ దుర్గుణాలను, ఏ అప్రతిష్ఠను మోస్తున్నారు? ఏ లక్ష్యంతో పనిచేస్తున్నారు? ఈ సూకా్ష్మన్ని గ్రహిస్తే మంచిది. తెలంగాణ ప్రజలకు ఇవన్నీ ఇప్పటికే బాగా తెలుసు.