మీరు జీవ వైవిధ్యం గురించి మాట్లాడుతున్నారు
మేం జీవన వైరుధ్యాల గురించి మాట్లాడుతున్నాం!
మీరు మొక్కలు కూలిపోతున్నాయని ఆరాటపడుతున్నారు
మేం భూములనే కోల్పోతున్నామని ఆందోళనపడుతున్నాం!
మీరు పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు
మేం పరాయీకరణ నుంచి విముక్తి కోరుతున్నాం!
మీరు ఊరపిచ్చుకలు అంతరిస్తున్నాయని ఊదరగొడుతున్నారు
మేము మనుషులే రాలిపోతున్నారని రగిలిపోతున్నాం!
మేం మా హక్కులను గురించి మాట్లాడుతున్నాం
మీరు అణచివేతకు సిద్ధమవుతున్నారు!
మీరు అంతర్జాతీయ ప్రతిష్ఠల గురించి చింతిస్తున్నారు
మేము అస్తిత్వ ప్రకటనకోసం తపిస్తున్నాం!
మీరు విద్రోహాల విజయకేతనాలెగరేస్తున్నారు
మేం పరాజయాల అగ్నిపర్వతంపై నిలబడి ఉన్నాం!
మీది కాస్మెటిక్ కన్వెన్షన్, కన్సాలిడేషన్ ఆఫ్ హెజిమొనీ!
మాది కడుపుమండిన కవాతు!
చలో తెలంగాణ మార్చ్!
కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండువులు ధృతరాష్ట్రుడిని పరామర్శించడానికి వస్తారు. ధృతరాష్ట్రుడు భీముడిని ఆలింగనం చేసుకోవాలనుందంటాడు. దుర్యోధనుడిని చంపిన భీముడిని తన పరిష్వంగంలో బంధించి నలిపి వేయాలన్నది ధృతరాష్ట్రుడి ప్రణాళిక. కృష్ణుడు ఆ విషయం ముందే గ్రహంచి, అంధుడైన ధృతరాష్ట్రుడికి భీముని బదులుగా ఒక స్తంభాన్ని చూపిస్తాడు. ధృతరాష్ట్రుడి ఆగ్రహ పరిష్వంగానికి ఆ స్తంభం నుగ్గునుగ్గవుతుంది. ధృతరాష్ట్ర కౌగిలికి అంత శక్తి ఉంటుంది. కాంగ్రెస్‌కు తిరిగి అంతటి శక్తి ఉంది. నమ్మించి పరిష్వంగంలోకి తీసుకుని నలిపి పారేయడం ఆ పార్టీకి మొదటి నుంచి అలవాటు. కాంగ్రెస్ కౌగిలి నుంచి తప్పింపించుకున్నవారు క్షేమంగా ఉన్నారు. శరద్‌పవార్, మమతా బెనర్జీ, మాయావతి, జయలలిత, ములాయంసింగ్, లాలూప్రసాద్, జగన్మోహన్రెడ్డి….ఇలా చాలా మందే ఆ కౌగిలికి దొరకకుండా రాజకీయంగా మనుగడలో ఉన్నారు. ఆ కౌగిలిలో చేరిపోయినవారు నలిగిపోయి, స్వయం ప్రకాశం కోల్పోయి కీలు బొమ్మలుగా మిగిలిపోయారు. గుంపులో గోవిందయ్యలయ్యారు. ఈ రెండు స్థానాల్లో ఏ స్థానం ఎంచుకుంటారో కేసీఆర్ నిర్ణయించుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం కేసీఆర్ చేయవలసినదంతా చేశారు. అన్ని రకాల పరీక్షలకూ నిలబడ్డారు. మంత్రిపదవులు వదిలారు. అనేకసార్లు పదవులను తృణప్రాయంగా వదిలేసి తెలంగాణ ఆకాంక్షను చాటి చెప్పే ప్రయత్నం చేశారు. పన్నెండేళ్ల పోరాటాలు, త్యాగాలు, దీక్షల తర్వాత తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వానికి ప్రతీకగా ఎదిగారు. కాంగ్రెస్ ఎన్నిసార్లు, ఎంత దగా చేసినా మరోసారి త్యాగం ద్వారానే జయించాలన్న ప్రయత్నంతో ఢిల్లీలో చర్చలకు వెళ్లారు. ఇన్నేళ్లుగా పెంచి పెద్ద చేసిన స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని కాంగ్రెస్‌కు అప్పగించడానికి కూడా సిద్ధపడ్డారు.
నిజానికి ఇవ్వాళ తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ గర్జు. తెలంగాణ ఇవ్వడమో చావడమో తేల్చుకోవలసింది కాంగ్రెస్సే. తెలంగాణ ప్రజల అవసరం కాంగ్రెస్‌కు ఉంది తప్ప, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అవసరం లేదు. సీమాంధ్రులకు కాంగ్రెస్ అవసరం లేదని, అక్కడి ప్రజలు జగన్ వెంట వెళ్లిపోతున్నారని ఇప్పటికే తేలిపోయింది. అందువల్ల ఇది కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్య కానీ టీఆరెస్‌కు కాదు. తెలంగాణ ప్రజలు శాసించే స్థితిలో ఉన్నారు తప్ప యాచించే స్థితిలో లేరు. టీఆరెస్ శాసించే శక్తిగా ఎదిగింది తప్ప, దేబిరించే స్థితిలో లేదు. సొంత రాజకీయ ప్రయోజనాలకోసం తెలంగాణ వచ్చే అవకాశాలను వమ్ము చేయరాదన్న ఒకే ఒక్క లాజిక్‌తో కేసీఆర్ ఢిల్లీ చర్చలకు వెళ్లారు. బేషరతుగా తెలంగాణ ఇస్తే బేషరతుగా తన రాజకీయ ప్రయోజనాలను కాంగ్రెస్ చేతిలో పెట్టడానికి సిద్ధపడ్డారు.కానీ కాంగ్రెస్ మరోసారి మోసం చేసింది. తన ధృతరాష్ట్ర స్వభావాన్ని వదలలేదు. సీమాంధ్ర పెత్తందారులపై తన ప్రేమను దాచుకోలేదు. నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్ ఇప్పుడే అమరిన విద్య కాదు. దగ్గరకు తీసినట్టే తీసి, గాలితీసేయడం కాంగ్రెస్‌కు మొదటి నుంచీ ఉంది. ఏడేళ్లుగా తెలంగాణ ప్రజలను ఆ పార్టీ మోసగిస్తూనే ఉంది. కాంగ్రెస్ స్వభావం అటువంటిది. ఇంత మంది ఎంపీలను గెలిపించిన రాష్ట్రానికి ఈ ఏడేళ్లలో కాంగ్రెస్ ఏం ఒరగబెట్టింది? కరువులు, కరెంటుకోతలు, రైతుల ఆత్మహత్యలు ఏమి ఆగిపోయాయి? ఎన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయి? పైగా తెలంగాణకు జరిగిన అన్యాయాల్లో సుమారు నలభైఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌దే పెద్ద వాటా! 194 తర్వాత కమ్యూనిస్టుల ఊచకోతలు, 1969 ఉద్యమంలో తెలంగాణవాదుల హత్యలు, ఆ తర్వాత నక్సలైట్ల కాల్చివేతలు….అనేక ఉద్యమాలపై ఉక్కుపాదం మోపిన పాపం కాంగ్రెస్‌దే. గత పన్నెండేళ్లుగా తెలంగాణ ప్రజలను కనీవినీ క్షోభకు, గుండెకోతకు గురిచేస్తున్నది కూడా కాంగ్రెస్సే. కాంగ్రెస్‌కు రాజకీయ అవసరాలు తప్ప, ప్రజల హృదయాలతో నిమిత్తం లేదు. తెలంగాణలోని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తాము ఎటువైపో నిర్ణయించుకోవలసిన తరుణం ఇప్పుడు ఆసన్నమైంది. 1969లో దాదాపు ఇటువంటి పరిస్థితుల్లోనే, ఇదే కాలంలో కొండా లక్ష్మణ్ బాపూజీ, గురుమూర్తి, వి.బి.రాజు తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా మంత్రివర్గానికి రాజీనామా చేశారు. తెలంగాణ మంత్రులు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతారా, సీమాంధ్ర ప్రభుత్వంలో సీలు బొమ్మలుగా కొనసాగుతారా నిర్ణయించుకోవాలి.
ఆ తర్వాత అంతే వాటా టీడీపీది. తెలంగాణను ఒక పద్ధతి ప్రకారం సీమాంధ్ర కాలనీగా మార్చిన ఘనత టీడీపీ, వైఎస్సార్లదే. అందువల్ల కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్…ఈ పార్టీలేవీ తెలంగాణ పార్టీలు కాదు. ఈ పార్టీలకు తెలంగాణ ఆత్మ లేదు. ఉండదు. తెలంగాణ సమస్యలు ఆ పార్టీలకు ప్రాధాన్యం కాదు. వారికి డెల్టా ఎండిపోతే కన్నీళ్లొస్తాయి. శ్రీరాంసాగర్ ఎండిపోవడం, మహబూబ్‌నగర్ వలసపోవడం, నల్లగొండ బీటలువారడం ఆ పార్టీలకు, వారి పత్రికలు, చానెళ్లకు కనిపించవు. నూజివీడులో కొందరు కల్తీ సారాతాగి చనిపోతే చంద్రబాబు ఓదార్చివస్తాడు, ఇక్కడ తెలంగాణకోసం కాల్చుకుని చనిపోతే, రైలుకింద తలపెట్టి బలైపోతే వారిని కనీసం పలకరించనయినా పలకరించడు. కిరణ్‌కుమార్‌రెడ్డి, జగన్మోహన్రెడ్డి కూడా అంతే. వీళ్లు మనుషులే ఇక్కడ. ఆత్మలు అక్కడ. ఆ పార్టీలు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేవు. కేంద్రంలో కాంగ్రెస్ ఆడుతున్న ఆటే ఇక్కడ చంద్రబాబు ఆడుతున్నాడు. ఇదిగో స్పష్టత, అదిగో స్పష్టత అని ఊరడించి ఊరడించి, చివరకు కూనిరాగం తీశారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తూ 200లో చేసిన తీర్మాణానికి కట్టుబడి ఉన్నాం. మీరు నిర్ణయం తీసుకోండి’ అని రెండు మాటల్లో స్పష్టంగా చెప్పాల్సిన విషయాన్ని వందమాటలు జతచేసి మరింత గందరగోళం సృష్టించారు. తప్పును కాంగ్రెస్ మీదకు, ఇతర పార్టీల మీదకు నెట్టే ప్రయత్నం చేశారు తప్ప, 2009 ఎన్నికల్లో తమ పార్టీ టీఆరెస్తో ఎందుకు పొత్తు పెట్టుకుందో, డిసెంబరు9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు చిదంబరం ప్రకటించగానే ఎందుకు ప్లేటు ఫిరాయించవలసి వచ్చిందో, సీమాంధ్ర ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామా పత్రాలను ఎన్టిఆర్ భవన్‌లోనే ఎందుకు తయారు చేయించవలసివచ్చిందో, సీమాంధ్ర తెలుగుదేశం నాయకులు ఎందుకు కృత్రిమ ఉద్యమాలు నడిపించవలసి వచ్చిందో చంద్రబాబు ఆలేఖలో రాయలేదు. ఇక ముందయినా సీమాంధ్ర తెలుగుదేశం ఎమ్మెల్యేలు తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉండేవిధంగా కట్టడి చేస్తామన్న హామీ కూడా చంద్రబాబు నుంచి లభించలేదు. లభించదు. ఎందుకంటే చంద్రబాబు తెలంగాణ విషయంలో ఎప్పటికీ నిజాయితీగా వ్యవహరించే అవకాశమే లేదు. ఆ పార్టీ స్వభావం అటువంటిది. ఆ పార్టీ మూలాలు సీమాంధ్ర ప్రయోజనాల్లో ఉన్నాయి.
జగన్మోహన్రెడ్డి ఇందుకు భిన్నం కాదు. ఆయన బయటికి ఏమి చెబుతున్నా, లోపల ఏం చేస్తున్నారో రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తూనే ఉంది. తెలంగాణ ఇవ్వకుండా ఉంటే 2014 ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిపించుకువచ్చి యూపీఏకు మద్దతు ఇస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ అధిష్ఠానంతో జరిగిన రాజీ చర్చల్లో ప్రతిపాదించారని పెద్ద ఎత్తు ప్రచారమే జరిగింది. రాజశేఖర్‌రెడ్డి వారసునిగా రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి జగన్మోహన్రెడ్డిని తెలంగాణ వ్యతిరేకిగానే చూడవలసి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణకు వ్యతిరేకంగా రాజశేఖర్‌రెడ్డి చేసినన్ని కుట్రలు మరెవరూ చేయలేదు. తుదికంటా తెలంగాణకు అడ్డమూ నిలువూ నిలబడ్డవారిలో ఆయన ప్రముఖుడు. తెలంగాణ ఉద్యమాన్ని నాశనం పట్టించడానికి నిస్సిగ్గుగా ఎమ్మెల్యేలు, నాయకుల కొనుగోళ్లకు తెగబడ్డ నేత ఆయన. తన తండ్రికంటే తాను భిన్నమని జగన్ బహిరంగంగా ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు కూడా జగన్ పైకి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తున్నామని చెబుతున్నా, తెరవెనుక ఆయన ఆలోచనాధార మారలేదని అర్థమవుత్నుది. తెలంగాణపై ఒక స్పష్టమైన వైఖరి చెప్పే దాకా ఏ పార్టీనీ తెలంగాణ ప్రజలు ఇక నమ్మబోరు. సీమాంధ్ర ప్రభుత్వాన్నే కాదు, సీమాంధ్ర పార్టీలను, సీమాంధ్ర ప్రచార ప్రసార సాధనాలను వదిలించుకున్నప్పుడే తెలంగాణకు నిజమైన విముక్తి.
ఈ అనుభవాలన్నీ చెబుతున్నదేమంటే మన కొట్లాట మనదే. మన పోరాటం మనదే. మనకన్న చిన్న ప్రాంతాలు, మనకన్న తక్కువ జనాభా ఉన్న ఉత్తరాఖండ్, చత్తీస్ఘడ్, నాగా, మిజో, త్రిపుర ప్రజలు పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాలు సాధించుకున్నారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ సాధించుకోలేరా? మన పోరాటాన్ని, మన ఎజెండాను ముందుకు తీసుకుపోవడానికి తెలంగాణకే ప్రత్యేకమైన ఒక పార్టీ మనకు ఎప్పుడూ ఉండాలి. ఆ పార్టీ టీఆరెస్సే కావాలి. స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకాన్ని ముందుకు తీసుకెళ్లే చుక్కాని కావాలి. తెలంగాణలో రాజకీయ శక్తుల ఏకీకరణకు వేదిక కావాలి. ఢిల్లీలో కేసీఆర్‌కు ఏదయినా అవమానం జరిగితే అది తెలంగాణ ప్రజలకు అందరికీ అవమానమే. ఇప్పటివరకు జరిగింది చాలు. కేసీఆర్ ఇక ఢిల్లీలో ఉండవలసిన అవసరం లేదు. ఆయన ఎవరి దయాదాక్షిణ్యాలకోసం ఎదురుచూడవలసిన అవసరం లేదు. ఆయన తెలంగాణ ఉద్యమంతోనే ఉండాలి. తెలంగాణ మార్చ్‌కు ఆయనే నాయకత్వం వహించాలి. కేసీఆర్‌తో నిమిత్తం లేకుండానే తెలంగాణ ఉద్యమం జరుగుతోందన్న సంకేతాలు తెలంగాణకు మంచివి కాదు, కేసీఆర్‌కూ మంచివి కాదు.ఉద్యమం ఆయనతో లేదనుకుంటే ఢిల్లీ కూడా పట్టించుకోదు. కేసీఆర్ ఉద్యమ శక్తిగా ఉన్నప్పుడే ఢిల్లీ మాట్లాడుతుంది. అప్పుడు ఢిల్లీయే కేసీఆర్ వద్దకు వస్తుంది. ఒకనాడు దేశ రాజకీయాలపై ఏకచ్ఛత్రాధిపత్యం చేసిన ఇందిరాగాంధీనే హైదరాబాద్‌కు రప్పించింది తెలంగాణ ఉద్యమం. ఇన్ని పార్టీల మద్దతుపై ఆధారపడి రాజకీయ మనుగడ సాగిస్తున్న సోనియాగాంధీ ఎంత? మన ఐక్యత, మన సంఘటితబలం, మన మార్చ్ ఢిల్లీని వంచాలి.