తెలంగాణకు ఇదే తరుణం

రాష్ట్రంలో ఒక సందిగ్ధావస్థ, ఒక అనిశ్చితి తలెత్తి ఇప్పటికి మూడేళ్లు. నిజానికి పదేళ్లు. తెలంగాణ ఉద్యమం అవతరించిన రోజు నుంచి ఎంతోకొంత ఈ పరిస్థితి ఉంది. 2009లో కేసీఆర్ దీక్ష, తెలంగాణ ప్రకటన, ఉపసంహారం తర్వాత ఈ పరిస్థితి తీవ్రమైంది. ఈ సందిగ్ధం  ఇంకా ఎంతకాలం కొనసాగాలి? పరకాల, పదిహేడు నియోజకవర్గాల ఉప ఎన్నికల తర్వాతయినా రాజకీయ పక్షాలు తెలివిడి తెచ్చుకుని వ్యవహరిస్తాయని ప్రజలు ఆశించారు. కానీ ఎప్పటి వేషాలే కొనసాగుతున్నాయి. తెలంగాణ విషయం తేలితే ఈ ఆరుమాసాల్లో తేలాలి. లేకపోతే ఇక 2014లోపు పరిష్కారమయ్యే అవకాశం లేదు. ఇప్పుడు పరిష్కారం కాకపోతే 2014 తర్వాత రాముడెవరో కృష్ణుడెవరో! 2014లో మొత్తం తెలంగాణవాదులే గెలవచ్చుగాక, కేంద్రంలో సమీకరణలు ఎలా ఉంటాయో? ఎవరు ఎవరిమీద ఆధారపడతారో? ఎవరు ఏ షరతులు పెడతారో? మన బలం ఎవరికయినా అవసరం అవుతుందో లేదో కచ్చితంగా చెప్పలేం. ఈ మూడేళ్ల అనిశ్చితి రెండు ప్రాంతాల్లో అభివృద్ధిని, ఇతర సమస్యలను తెరమరుగు చేశాయి. మరో రెండేళ్లు ఈ సమస్య ఇలాగే కొనసాగితే పరిస్థితి ఇంకా ఎలా విషమిస్తుందో చెప్పలేం. అందుకే ఇది చాలా కీలకమైన సమయం. 2014 ఏప్రిల్-మేలలో జరిగే సాధారణ ఎన్నిలకు ఇక మిగిలింది ఒకటిన్నర సంవత్సరాల కాలమే. 2014 జనవరి నుంచి ఎన్నికల సందడే ఉంటుంది. మిగిలేది 2013 మాత్రమే.

తెలంగాణపై ఈ రెండు మూడు నెలల్లో నిర్ణయం జరిగితేనే అది అమలు కావడానికి కొంత సమయం చిక్కుతుంది. రాష్ట్ర విభజనపై ఏవైనా ఆవేశకావేశాలు చెలరేగినా చల్లారడానికి, రాజకీయాలు కుదుటపడడానికి సమయం సరిపోతుంది. 2013లో తీరా ఎన్నికలు సమీపించేవేళ కేంద్రం లేక కాంగ్రెస్ తెలంగాణపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. కాంగ్రెస్‌కు ఇది నౌ ఆర్ నెవర్ పరిస్థితి. ఇప్పుడు నిర్ణయం తీసుకుంటేనే ఆ పార్టీకీ ప్రయోజనం. తెలంగాణలో నూకలు మిగిలి ఉంటాయి. కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి పొందడానికి వీలవుతుంది. టీడీపీకీ ఇదే అదను. తెలంగాణపై తన నిజాయితీని నిరూపించుకోవడానికి. జగన్‌మోహన్‌రెడ్డి అయినా సరే ఇప్పుడు తెలంగాణపై తేల్చకుండాఈ ప్రాంతంలో బాపుకునేదేమీ ఉండదు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లు ఆలోచించుకోవలసింది ఒక్కటే- తెలంగాణలో శాశ్వతంగా ‘ద్రోహముద్ర’ను మూటగట్టుకోవడమా? లేక తెలంగాణపై తమ వైఖరిని  స్పష్టంగా ప్రకటించి కొత్త చరిత్రను రాసుకోవడమా? పార్టీలు అంటే జెండాలు, ఆఫీసులు కాదు. వందల మంది రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారం. అధినేతలు అనుసరించే విధానపరమైన దివాళాకోరుతనం ఇంతమంది నాయకులను బలితీసుకుంటుందంటే అంతకంటే విషాదం లేదు. మూడు పార్టీల అధినేతలు ఇప్పుడు మాట్లాడకుండా తీరా ఎన్నికల వేళ మళ్లీ తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చినా, ప్రకటనలు చేసినా జనం రాళ్లతో కొడతారు. ఎన్నికల వేళ చేసే ప్రకటనలను ఓట్ల సముద్రాన్ని దాటడానికి ఉపయోగించే తెప్పలాగానే చూస్తారు. మళ్లీ మళ్లీ మోసపోవడానికి తెలంగాణ ప్రజలు ఇష్టపడడం లేదు.

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇప్పటికీ ఈ సోయి వచ్చినట్టు కనిపించడం లేదు. వారిలో అనేక గుంపులు. వేర్వేరు ప్రాధాన్యాలు. వారికి తెలంగాణ ప్రాధాన్య అంశం కాదు. ద్వితీయ ప్రాధాన్యాంశం మాత్రమే. చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులకు తెలంగాణ సోయే లేదు. కొందరు తెలంగాణ రాదేమో జగన్‌వైపు దూకితే పోలేదా! అని లెక్కలు వేస్తున్నారు. సంప్రదింపులు జరుపుతున్నారు. అవకాశం కోసం, సందర్భంకోసం ఎదురుచూస్తున్నారు. నిజాయితీగా తెలంగాణకోసం పోరాడదామన్న స్పృహలేదు. ఇక్కడి ప్రజల విశ్వాసం చూరగొందామన్న ధ్యాసలేదు. పక్కదారుల్లో రాజకీయంగా ఎలా బతికి బట్టకడదామా అన్న ఆలోచన తప్ప. రాజమార్గంలో కొట్లాడే తెగింపు లేదు. ఇంకొందరు నేతలు, మంత్రులు ఉన్నారు. వారి ధ్యాసంతా నాయకత్వ మార్పుపైనే. ముఖ్యమంత్రిని మార్చితే తమకు అవకాశం వస్తుందా రాదా అన్న ఆరాటం తప్ప, అసలు తెలంగాణ సంగతి తేల్చుతారా లేదా అన్న పట్టింపు లేదు. ఢిల్లీ వెళతారు. రోజుల తరబడి ఢిల్లీ పెద్దలను కలుస్తారు. వీరేం చెబుతారో. వారేం వింటారో. ఇక్కడ జనానికి మాత్రం తెలంగాణ గురించి ఏమాత్రం భరోసా లభించదు. ఇంకొందరున్నారు-గల్లీలో వీరోచితంగా మాట్లాడతారు. ఢిల్లీలో పిల్లుల్లా వ్యవహరిస్తారు. గత రెండేళ్లుగా ఈ బాణీ మారడం లేదు. ప్రణబ్ ముఖర్జీ విషయంలో కనీసం బెట్టు చేయాలన్న ప్రయత్నమూ జరుగలేదు. ఇక్కడ తెలంగాణ వాదులు తుపాకులు, ట్రిగ్గర్లు అని మాట్లాడుతూ ఉంటే, బుల్లెట్లుగా మారాల్సినవారు మాత్రం బేషరతుగా ప్రణబ్ పంచన చేరిపోయారు. ‘ఇంత చేవచచ్చిన నేతలను ఎప్పుడూ చూడలేదు. ఎటు చూసినా సన్నాసితనమే. ఎంపీలు కాస్త నయం. అప్పుడప్పుడయినా మొనగాళ్లు అనిపించుకోవడానికి ప్రయత్నించారు. మంత్రుల పరిస్థితి మరీ అన్యాయం. పదవులు, పైరవీలు, మనకేమొస్తదన్న యావ తప్ప తెలంగానను ఏం చేద్దామన్న శ్రద్ధ ఎప్పుడూ కనబర్చలేదు. మనవాళ్లు అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. ఒక వేళ కేంద్రం అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చినా ఈ సన్నాసులకు ఓట్లు వేయడం నాకైతే కష్టమే’నని నల్లగొండ జిల్లాకు చెందిన ఒక అధ్యాపకుడు యాష్టపడ్డాడు. తెలంగాన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇప్పుడు కూడా సమయం మించిపోలేదు. తమ మీద ఏర్పడిన ఈ అపనమ్మకాన్ని తొలగించుకోవడానికి ఇప్పుడయినా వారు జనంలోకి రావాలి. ఈ ఆరుమాసాలు ముఖ్యం. ఈ సమయం గడచిపోతే ఇక చేయగలిగేది ఏమీ ఉండదు.

మరో విడ్డూరం ఏమంటే- పరకాలలో కొండా సురేఖ ఇచ్చిన పోటీని చూసి తెలంగాణ కాంగ్రెస్, తెలుగుదేశంలలోని అసంతృప్తులకు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ ఒక ఆశాజ్యోతిలాగా కనిపిస్తున్నది. జగన్ మాత్రమే తెలంగాణవాదాన్ని ఎదుర్కోగలడన్న ఒక ప్రచారాన్ని ఈ శక్తులే ప్రచారంలో పెట్టాయి. పరకాల వేరు, మిగతా తెలంగాణ వేరన్న విషయాన్ని వీరు మరచిపోతున్నారు. నిశ్చయంగా పరకాలలో కొండా మురళి-సురేఖల ఉమ్మడి కృషి, బలం కారణంగానే వారు టీఆరెస్‌ను ఆ మాత్రం ఎదిరించగలిగారు. తెలంగాణలో మరే నియోజకవర్గంలోనూ కొండా మురళి మాదిరిగా నెట్‌వర్కింగ్ చేయగల నాయకుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో లేరు. అందులో చేరాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్, తెలుగుదేశం నేతల్లో కూడా అటువంటివారు లేరు. అందువల్ల పరకాల ప్రోటోటైప్  వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు తెలంగాణ అంతటికీ పనికిరాదు. తెలంగాణవాదుల ఓట్లు ఛిన్నాభిన్నమైన పరిస్థితుల్లో, పూర్తి శాంతికాలంలో జరిగిన ఎన్నిక. ఒంటరిగా టీఆరెస్ విజయం సాధించింది. బిజెపి, కారును పోలిన ఆటో గుర్తుతో ఒక ఇండిపెండెంట్ 13 వేల ఓట్లు చీల్చుకున్నా(ఇవన్నీ తెలంగాణవాదుల ఓట్లే) టీఆరెస్ మాత్రమే గెలిచింది. పన్నెండు నియోజకవర్గాల విజయం కంటే, ఆరు నియోజకవర్గాల విజయం కంటే పరకాల విజయమే మిన్న. పన్నెండు నియోజకవర్గాల ఉప ఎన్నికలనాటికి తెలంగాణవాదులంతా ఒక్కతాటిపై ఉన్నారు. ఆ ఎన్నికలు పూర్తిగా ఉద్యమకాలంలో, ఒక వడిలో జరిగాయి. ఆరు నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పోటీలో లేదు. అన్ని రాజకీయ శక్తులు బరిగీసి నిలబడిన ఎన్నికలు పరకాల మాత్రమే. ఎంతోదూరం ఎందుకు? నిన్న జరిగిన సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో ఎన్నోఏళ్లుగా పాతుకుపోయిన జాతీయ సంఘాలను కాదని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఎన్నుకోవడం దేనికి సంకేతం! తెలంగాణ ఇవ్వకపోతే 2014 ఎన్నికల దృశ్యం కూడాపరకాల మాదిరిగానే, సింగరేణి నమూనాలోనే ఉంటుంది. టీఆరెస్‌కు పరకాల వంటి టఫ్ నియోజకవర్గాలు తెలంగాణ మిగిలిన జిల్లాల్లో చాలా తక్కువ. తెలంగాణ రాకపోతే ఈ రెండేళ్లు తెలంగాణవాదులు, టీఆరెస్ శాంతియుతంగా ఉండే అవకాశం లేదు. తెలంగాణకు అవరోధంగా ఉన్న శక్తులను ఎండగట్టకుండా ఉండలేరు. ఉద్యమ ఉధృతిని పెంచకుండా 2014 ఎన్నికలకు వెళ్లలేరు. అందువల్ల జగన్‌తో చేరాలనుకునేవారికి కూడా ఒక స్పష్టత అవసరం.

తెలంగాణపై వైఖరి చెప్పకుండా జగన్ పార్టీలో చేరినా కాంగ్రెస్, తెలుగుదేశంలలో ఉన్నా పెద్దగా తేడా ఉండదు. ఆ పార్టీలకు ఉండే బలహీనతే జగన్ పార్టీకి కూడా ఉంటుంది. జగన్‌కు తెలంగాణలో అసలు బలం లేదని, ఉండదనీ కాదు. అది ఎంత అన్నదే సమస్య. తెలంగాణ ఏర్పాటుపై ఆయన వైఖరి తేలకుండాఇక్కడి ప్రజలు ఆయనకు ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలికే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజశేఖర్‌రెడ్డికే సాధ్యం కాలేదు. 2009 సాధారణ ఎన్నికల్లోనే తెలంగాణలో రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు 33 శాతం. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఇంకా దిగజారింది. ఇప్పుడు జగన్ వచ్చినా బ్రహ్మాండం బద్దలయ్యే అవకాశం లేదు. రాజకీయ శక్తుల సమీకరణలు మారవచ్చు. బలహీనపడిన కాంగ్రెస్, టీడీపీల నుంచి కొందరు జగన్ గూటిలోకి దూకవచ్చు. రాజశేఖర్‌రెడ్డిని అభిమానించే కొన్ని వర్గాల ప్రజల్లో జగన్‌పై సానుకూలత ఉండవచ్చు. కానీ అది విజయానికి సరిపోయేంత సానుకూలత కాదు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో తెలంగాణవాదమే ప్రధాన ఎజెండా. తెలంగాణకోసం పోరాడుతున్నవారికి, తెలంగాణను అడ్డుకున్నవారికి మధ్యనే సమరం. సమైక్యాంధ్రకోసం పార్లమెంటులో ప్లకార్డు పట్టుకున్న జగన్‌ను, తెలంగాణలో ఎన్నికలు పూర్తయి నంద్యాలలో ప్రవేశించగానే హైదరాబాద్‌కు వెళ్లాలంటే వీసా తీసుకోవాల్సివస్తుందని ఆంధ్రా ప్రజలను రెచ్చగొట్టిన రాజశేఖర్‌రెడ్డిని తెలంగాణ ప్రజలు మరచిపోలేరు. తెలంగాణ విషయంలో చంద్రబాబుకు జగన్‌కు తేడాలేదని తెలంగాణవాదులు భావిస్తున్నారు. రెండు కళ్ల ధోరణిని లేక రెండు నాల్కల ధోరణిని తెలంగాణ ప్రజలు సహించడానికి సిద్ధంగా లేరు. అందువల్ల ఏ పార్టీలో ఉన్న నాయకులైనా తెలంగాణపై ఏ పార్టీ ఏం చెబుతుందో చూసుకుని మసలుకోవలసిందే.

తెలుగుదేశానిది కూడా ఏదో ఒకటి తేల్చుకోక తప్పని స్థితి. చంద్రబాబునాయుడు తెలంగాణపై స్పష్టమైన వైఖరిని తీసుకోవడం ఒక్కటే ఆ పార్టీని కాపాడగలదు. నైతికంగా బాగా బలహీనపడిన తెలుగుదేశం శ్రేణులలో కొత్త ఉత్సాహాన్ని నింపాలంటే అధినేత మరోసారి నైతిక నిర్ణయమే తీసుకోవాలి. కోల్పోయిన చోటే వెతుక్కోవాలి. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషిచేస్తామ’ని 2009 ఎన్నికలకు ముందు చెప్పిన మాటను నిలబెట్టుకోవడం ఒక్కటే చంద్రబాబును, తెలుగుదేశాన్ని కాపాడగలదు. పరకాల ఎన్నికల తర్వాత చంద్రబాబుతో లేఖ ఇప్పిస్తామని చెప్పిన తెలుగుదేశం నేతలు తీవ్ర అంతర్మథనానికి గురువుతున్నారు. పరకాల సమీక్ష సందర్భంగా అధినేతను అదే విషయం అడిగినట్టు కొందరు తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. ‘ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్నాయి. ఇప్పుడే తొందరెందుకు? ఎన్నికలకు ముందు చూద్దాం’ అని చంద్రబాబు అన్నట్టు వారు వాపోతున్నారు. చంద్రబాబు చాలా లెక్కలు వేసుకుని, కొన్ని అంచనాలకు వచ్చి ఇలా మాట్లాడినట్టు తెలుగుదేశం నాయకులతో కాసేపు ముచ్చటిస్తే తెలిసిపోతుంది. చంద్రబాబు మొదటి అంచనా ఏమంటే, ‘తెలంగాణలో టీఆరెస్ రోజు రోజుకు బలహీనపడిపోతున్నది. మరోవైపు పన్నెండు నియోజకవర్గాల ఉప ఎన్నికల నాటికి ఆరు నియోజకవర్గాల ఉప ఎన్నికల నాటికి టీడీపీ బలపడింది. పరకాల ఉప ఎన్నిక నాటికి ఇంకా బలపడింది. 2014 నాటికి టీడీపీ ఇంకా బలపడుతుంది, టీఆరెస్ బలహీనపడిపోతుంది’.

రెండవ అంచనా ఏమంటే, ‘టీడీపీ తెలంగాణపై ఇప్పుడు లేఖ ఇస్తే, కాంగ్రెస్ కూడా తప్పనిసరి పరిస్థితి తలెత్తి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. తెలంగాణ ఏర్పడితే టీడీపీకి కలిగే ప్రయోజనం పరిమితం. కాంగ్రెస్, టీఆరెస్‌లకే ఎక్కువ మేలు జరుగుతుంది. ఆంధ్రలో ఇప్పుడే టీడీపీ పరిస్థితి బాగోలేదు. తెలంగాణపై లేఖ ఇస్తే ఇంకా దెబ్బతింటుంది. జగన్ ఇంకా బలపడతాడు. అందువల్ల ఇప్పుడు కాకుండా ఎన్నికలకు ముందు తెలంగాణపై లేఖ ఇస్తే కాంగ్రెస్ అప్పటికప్పుడు తెలంగాణ ఇవ్వలేదు. తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడుతుంది కాబట్టి అది టీడీపీకి ఉపయోగపడుతుంది. తెలంగాణ రాకపోతే టీఆరెస్‌ను కూడా దోషిగా నిలబెట్టి దెబ్బతీయవచ్చు. తెలంగాణలో బలపడ్డామంటే ఆంధ్రలో కూడాత్రిముఖ పోటీలో టీడీపీకి ప్రయోజనం ఉంటుంది. పైగా 2014లోపు తెలంగాణను అడ్డుకునే ఎజెండా విజయవంతమవుతుంది’. దీనిని తెలివి అనలేము. చావుతెలివి అనాలేమో! రాజకీయాల్లో సరళ రేఖలుండవు. సూటిగా లెక్కలు వేసి కొట్టడానికి! మనం కొడుతూ ఉంటే అవతలివాళ్లంతా చేతులు ముడుచుకుని కూర్చోరు. చంద్రబాబునాయుడు ఇప్పటికీ తాను జనం దృష్టిలో ఎందుకు పలుచనయ్యారో తెలుసుకోవడం లేదు. తనను జనం ఎందుకు విశ్వసించడంలేదో తర్కించుకోవడం లేదు. తాను ఏం చేస్తే ధీమంతునిగా తిరిగి నిలబడగలరో గుర్తించడం లేదు. సొంతపార్టీలో తనపై సడలిపోతున్న నమ్మకాన్ని కూడా ఆయన తెలుసుకోలేకపోతున్నారు. ‘అధినేత వైఖరి వల్ల తెలంగాణలో మేము దోషులుగా నిలబడాల్సి వస్తోంది. తెలంగాణపై మాటమార్చడం మమ్మల్ని రాజకీయంగా బాగా దెబ్బతీసింది. ఎంత నిజాయితీగా తెలంగాణ గురించి మాట్లాడినా మమ్మల్ని విశ్వసించడం లేదు. అధినేత చేసిన తప్పిదాలకు మా రాజకీయ జీవితాలు బలవుతున్నాయి. తెలంగాణపై కేంద్రానికి లేఖ ఇప్పించడమో లేక మా దారి మేము చూసుకోవడమో-ండే మాకు మిగిలిన ప్రత్యామ్నాయాలు. 2014లో గెలువకపోతే ఇక మేము శాశ్వతంగా తెరమరుగు కావలసిందే’ అని తెలంగాణ తెలుగుదేశం నాయకుడొకరు ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ల గుండె చప్పుడు బాబు వింటారా? నిజాయితీ మాత్రమే జనం మనసులను గెల్చుకుంటుంది. డొంకతిరుగుడు వ్యవహారాలను, ఎత్తులు జిత్తులను జనం ఛీకొడతారు. తెలంగాణను అడ్డుకోవడం, జగన్‌పై రోజూ దుమ్మెత్తిపోయడం తెలుగుదేశాన్ని బతికించదు. చంద్రబాబు ఇమేజి పెరిగితేనే ఆ పార్టీ బతుకుతుంది. తెలుగుదేశం మాత్రమే ప్రత్యామ్నాయం అన్న నమ్మకం కలిగితేనే ఆ పార్టీ నిలబడగలుగుతుంది. అందుకు కష్టమైనా కొన్ని కఠిన నిర్ణయాలు చేయాలి. పార్టీకి మోరల్ బూస్టర్‌లు ఇవ్వాలి. తెలంగాణ అనుకూల నిర్ణయం, అవినీతి రహిత స్వచ్ఛమైన పాలనతోపాటు గతకాలపు దోషాల నుంచి ఆయనకు ప్రాయశ్చిత్తం ప్రసాదించే పలు కొత్త నినాదాలు కావాలి. కార్యాచరణ కావాలి.

టీఆరెస్‌కు కూడా ఇది పరీక్షా సమయం. ప్రణబ్ ఎన్నికను ట్రిగ్గర్‌లా ఉపయోగించాలని తెలంగాణవాదులు ఒత్తిడి తెస్తున్నారు. ప్రణబ్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని కూడా వారు డిమాండు చేస్తున్నారు. ప్రణబ్ తెలంగాణ వ్యతిరేకి అని, తెలంగాణ సమస్య ఇంతకాలం నానడానికి కారకుడు ఆయనేనని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. ప్రణబ్ విషయంలో తెలంగాణవాదులు చేస్తున్న వాదనలన్నీ నిజమే. కానీ ప్రణబ్‌కు వ్యతిరేకంగా ఓటు చేయాలన్న నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా అంత తేలికైన విషయం కాదు. టీఆరెస్ ఓటు వేసినా వేయకపోయినా ప్రణబ్ ఎలాగూ గెలుస్తారు. ఐదేళ్లు రాష్ట్రపతిగా ఉంటారు. తెలంగాణ ఏర్పాటు కూడా ఆయన చేతులమీదుగా జరగాల్సిందే. కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే సాధారణంగా అయితే రాష్ట్రపతి నిరభ్యంతరంగా దానిని పార్లమెంటుకు నివేదించవలసిందే. కానీ కేంద్రం నిర్ణయాలను తొక్కిపెట్టిన జైల్‌సింగ్ వంటి రాష్ట్రపతిని చూశాం. అటువంటప్పుడు ప్రణబ్‌కు వ్యతిరేకంగా ఓటు వేసి ఎన్‌డిఏ శిబిరంతో ఐడెంటిఫై కావడం ఎందుకు? కొత్త సమస్యలు తెచ్చుకోవడం ఎందుకు? ఇక అప్పుడు మిగిలిన ప్రత్యామ్నాయం-ఎన్నికలను బహిష్కరించడం. ఎన్నికలను బహిష్కరించడం కూడా ఒక ఉద్యమ రూపమే. కేంద్రం సానుకూలంగా ఉందన్న సంకేతాలు వస్తున్న తరుణంలో ఇటువంటి చర్య మేలు చేస్తుందా? హాని చేస్తుందా? అలాగని ఉన్నపళంగా అనుకూలంగా ఓటు వేయవచ్చా? అదీ కష్టతరమైన నిర్ణయమే. ఏ హామీ లేకుండా, కేంద్రం నుంచి ఏదోఒక హామీ లభించకుండా ఓటు వేయడం టీఆరెస్‌కు చిక్కు సమస్యే. ఆచితూచి అడుగేయవలసిన తరుణం ఇది. టీఆరెస్‌కు కూడా తెలంగాణ సాధనలో ఈ ఆరుమాసాల కాలమే కీలకం.

ఉప ఎన్నికల సందేశం

పద్దెనిమిది శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికలు ఊహించినదానికి భిన్నంగా ఏమీ రాలేదు. అయితే ఇందులో ఎన్నో సందేశాలు, సంభ్రమాలు, ఆశ్చర్యాలు ఉన్నాయి. సునాయాసం అనుకున్న పరకాల ఉప ఎన్నిక గెలుపు చివరివరకు నరాలు తెంపే ఉత్కంఠకు గురిచేసి, ఊరించి, వేధించి టీఆరెస్‌ను గెలిపించింది.  ఆ గంటలో ఎన్ని ఆక్రోశాలో! ఎన్ని ఉక్రోషాలో! ఎంత నరకయాతనో! ‘సురేఖ గెలిస్తే ఇంకేమైనా ఉందా? టీఆరెస్‌ను జగన్ అయితేనే నిలువరించగలడని ఆంధ్రా జనం నమ్మేస్తారు. తెలంగాణలో కూడా ఆయన హవా వచ్చేస్తుంది. కాంగ్రెస్, తెలుగుదేశం నేతలు చాలా మంది వైఎస్‌ఆర్‌సిపికి క్యూగడతారు’-ఒక మిత్రుడి భయం. ‘కేసీఆర్ మరికాస్త తిరిగితే పరిస్థితి వేరుగా ఉండేది. విజయమ్మ సభలు, రోడ్‌షోలతో నియోజకవర్గం అంతటా కలెదిరిగితే, ఆయన ఒక్క సభ పెట్టుకుని, అదీ పదినిమిషాలు మాట్లేడేసి వచ్చారు. ఛ అంతా అయిపోయింది’-ఒక సబ్ ఎడిటర్ ఆవేదన. ‘నేను చెబుతూనే ఉన్నా. పోలింగ్ రోజు మధ్యాహ్నం నుంచి గీసుకొండ, సంగెం మండలాల్లో అనేక గ్రామాల్లో టీఆరెస్ ఏజెంట్లు, కార్యకర్తలు పోలింగ్ బూత్‌లవద్ద నుంచి మాయమయ్యారు. ఏదో జరుగుతోందని అప్పుడే అనుకున్నా’-అక్కడ రిపోర్టింగ్ చేసిన మరో విలేఖరి వ్యాఖ్యానం. ‘టీఆరెస్‌కు గ్రామాల్లో నిర్మాణం లేదు. నిలబడి ఓట్లేయించే కార్యకర్తలు లేరు. అదే దెబ్బతీసింది’. ‘తెలంగాణవాదులను ఏకోన్ముఖం చేయడంలో టీఆరెస్ విఫలమైంది. ఒంటెత్తు పోకడలు, ఏకపక్ష నిర్ణయాలు ఆ పార్టీని చాలా మందికి దూరం చేశాయి’. ‘టీఆరెస్ అభ్యర్థి ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. ఆయన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరు’….టీవీల్లో ఇంకా ఇలా అనేక వ్యాఖ్యాతల విశ్లేషణలు వినిపించాయి. ఈ వ్యాఖ్యలు, విశ్లేషణలు, విమర్శలు చేసినవారంతా తెలంగాణవాదులే. పరకాలలో టీఆరెస్ గెలవాలని ఆశిస్తున్నవారే. టీఆరెస్ అంటే తెలంగాణవాదం ఓడిపోతుందేమోనన్న ఆందోళన, ఆక్రోశం, బాధతోనే ఇవన్నీ మాట్లాడారు. గెలుపు వార్త వచ్చేలోగా ఈ విమర్శలన్నీ వినవలసి వచ్చింది. గెలుపు వార్త వచ్చిన తర్వాత కూడా ఇవే విమర్శలు కొనసాగాయి. బాధలో మాట్లాడినా, కోపంలో మాట్లాడినా ఈ వ్యాఖ్యలన్నింటిలో వాస్తవం ఉందో లేదో టీఆరెస్ సమీక్షించుకోవలసిన అవసరం ఉంది. వాస్తవిక దృక్పథంతో మాట్లాడుకోకపోతే, అనేక తప్పులు జరుగుతాయి. కౌంటింగ్‌కు రెండు రోజుల ముందు ఒక టీఆరెస్ నాయకుడు ఫోను చేశాడు. చాలా ఆవేశంగా మాట్లాడాడు. ‘మన పత్రికలో టఫ్ ఫైట్ అని ఎలా పెడతారు? అసలక్కడ పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసా?’ అని ప్రశ్నించారు. అది కూడా మీరే చెప్పండి అంటే, ‘మంచి మెజారిటీతో సులువుగా గెలుస్తాం. మీ విలేఖరులకు అంచనాలే తెలియదు’ అని విసుక్కున్నారు. అనుమానం వచ్చి, విలేఖరితో మాట్లాడాను, ‘ఐదువేల లోపే గెలుపోటములుంటాయి సార్. మనవాళ్లు వినిపించుకునే పరిస్థితిలో లేరు’ అన్నాడు. ఇవ్వాళ 17వ రౌండు సందర్భంగా అనేక మంది మాట్లాడిన కారణాలనే ఆ విలేఖరి చెప్పాడు. నాకు కూడా నమ్మశక్యం కాలేదు. కానీ విష్‌ఫుల్ థింకింగ్ వేరు, గ్రౌండ్ రిపోర్టింగ్ వేరు. ఒకటి భ్రమ. మరొకటి వాస్తవం.

ఉద్యమకాలంలో జరిగే ఎన్నికలకు, శాంతికాలంలో జరిగే ఎన్నికలకు తేడా ఉంటుంది. ఉద్యమకాలంలో జరిగిన ఎన్నికల్లో టీఆరెస్ ఆలవోకగా గెలుస్తూ వస్తున్నది. కరీంగనర్ లోక్‌సభ ఎన్నిక ఇందుకు తార్కాణం. శాంతికాలంలో జరిగిన ఎన్నికల్లో టీఆరెస్ ఎదురీదుతున్నది. 200లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు ఇందుకు ఉదాహరణ. 2009లో మహాకూటమి ఫలించకపోవడానికి కూడా కారణం ఉద్యమవాతావరణం లేకపోవడమే. ఇంతెందుకు 2010లో జరిగిన 12 నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో టీఆరెస్ ఆడుతూపాడుతూ ఘనవిజయం సాధించింది. అప్పుడు కష్టపడలేదని కాదు. కానీ తెలంగాణవాదులంతా ఏకోన్ముఖంగా ఉన్న రోజులవి. మొన్న ఆరు నియోజకవర్గాల ఎన్నికలు వచ్చేసరికి ఉద్యమ కాక తగ్గిపోయింది. పోరాడి గెలవాల్సి వచ్చింది. పరకాల పూర్తిగా శాంతికాలంలో జరిగిన ఎన్నిక. పైగా పరకాలది ప్రత్యేక పరిస్థితి. పులివెందులకు జగన్ ఎలాగో ఈ పదకొండేళ్లుగా పరకాలకు కొండా మురళి అలా! ఆయనకు ఆ నియోజకవర్గంపై ఉన్న పట్టు అటువంటిది. నియోజకవర్గంలో ఆయనకు ఉన్న నిర్మాణం కూడ టీఆరెస్ కంటే బలమైనది. ధనబలంలో కూడా ఆయన టీఆరెస్ అభ్యర్థి కంటే అనేకరెట్లు శక్తిమంతుడు. సురేఖ, మురళి స్థానికులకు అందుబాటులో ఉంటారని ప్రతీతి. వ్యూహం, పథకం, ఆచరణ అన్నీ తెలిసిన నేత. టీఆరెస్ మొత్తం ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, తెలంగాణవాదులు, కళాకారులు అందరూ ఊరూవాడా తిరిగినా సురేఖ ఇంత పోటీ ఇచ్చిందంటే కచ్చితంగా మురళి ప్రత్యేకతే. ఇన్ని ప్రత్యేకతలున్న మురళిని ఎదిరించడానికి ఇంకా ఎంత శక్తి కావాలి? ఒక వైపు పార్టీ నిర్మాణ లోపాలు, ఇంకోవైపు బలమైన ప్రత్యర్థి…అయినా టీఆరెస్ గెలిచిందంటే హరీశ్‌రావు నాయకత్వంలో పార్టీ శ్రమ, తెలంగాణవాదంపై ప్రజల్లో ఉన్నమమకారం ఫలించాయి. ఉద్యమ వాతావరణం ఉండి ఉంటే ఇంత కష్టపడవలసి వచ్చేది కాదు. ఇంత యాతన అవసరమయ్యేదికాదు. ఈ ఎన్నికలు టీఆరెస్‌కు ఒక హెచ్చరిక చేస్తున్నాయి. శాంతికాలంలో జరిగే ఏ ఎన్నికలోనయినా టీఆరెస్ ఇలాగే చెమటోడ్చవలసి వస్తుంది. మిగిలిన పార్టీల మాదిరిగా డబ్బుతో ఎలక్షనీరింగ్ నిర్వహించగలిగే పరిస్థితి టీఆరెస్‌కు ఇప్పుడు లేదు, ఇక ముందు కూడా ఉండే అవకాశం లేదు. తెలంగాణవాద బలంతో, ఉద్యమంతో కలగలసి వచ్చే ఎన్నికలు మాత్రమే ఆ పార్టీకి మేలు చేస్తాయి.  ఈలోగా తెలంగాణ రాకపోతే 2014 ఎన్నికలకు మనం ఉద్యమకాలంలో ఉంటామా లేక శాంతికాలంలో ఉంటామా అన్నది తేల్చుకోవలసిన అవసరం ఆ పార్టీపై ఉంది.

తెలంగాణపై ఒక స్పష్టమైన వైఖరి తీసుకోనంతవరకు కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్‌సిపిలకు తెలంగాణలో భవిష్యత్తు లేదని పరకాల ఎన్నికలు తేల్చి చెప్పాయి. ఆ పార్టీలు నానాటికీ బలహీనపడుతున్నాయి. సాధారణ ఎన్నికల తర్వాత ఇప్పటివరకు 20 నియోజకవర్గాల ఉప ఎన్నికలు జరుగగా టీఆరెస్ 10 నుంచి 17 స్థానాలకు పెరగగా, టీడీపీ ఐదు స్థానాలను కోల్పోయింది. కాంగ్రెస్ 3 స్థానాలను కోల్పోయింది. బిజెపి రెండు స్థానాలను గెల్చుకోగా ఒకరు ఇండిపెండెంట్ గెలిచారు. కాంగ్రెస్, టీడీపీల ఓట్ల శాతం గణనీయంగా తగ్గిపోయింది. 2009 సాధారణ ఎన్నికల్లో ఈ 20 నియోజకవర్గాల్లో  టీడీపీకి వచ్చిన ఓట్ల శాతం16.5 కాగా 2010 నుంచి 2012 వరకు జరిగిన ఉప ఎన్నికల్లో 11.1 శాతానికి తగ్గిపోయింది. 14 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. కాంగ్రెస్ పరిస్థితి కూడాఇందుకు భిన్నంగా లేదు. 2009లో ఈ 20 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు 30.5 శాతం ఓట్లు రాగా, ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్ల శాతం 20. శాతానికి పడిపోయింది. ఐదు స్థానాల్లో ఆ పార్టీ డిపాజిట్ గల్లంతయింది. అదే సమయంలో టీఆరెస్ ఓట్లు ఈ నియోజకవర్గాల్లో 24 శాతం నుంచి 51.5 శాతానికి పెరిగాయి. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని ఉద్యమ ఉధృతిని పెంచడంతోపాటు రాజకీయ శక్తుల పునరేకీకరణకు టీఆరెస్ చొరవ తీసుకోవలసిన అవసరం ఉంది. కాంగ్రెస్, టీడీపీలు  తెలంగాణపై తిరిగి స్పష్టమైన వైఖరి తీసుకోవాలంటే, ఆ పార్టీలకు రాజకీయ అనివార్య పరిస్థితి దాపురించాలి. రాజకీయంగా తమకు చావుతథ్యం అనుకున్నప్పుడే పార్టీలు కచ్చితమైన నిర్ణయాలు చేస్తాయి. ఈ ఎన్నికలు అటువంటి సందేశాన్ని ఇస్తున్నాయి. భవిష్యత్తు ఇంకా చేదుగా ఉంటుందన్న వాస్తవాన్ని టీడీపీ, కాంగ్రెస్‌లు గ్రహించేట్టు చేయాల్సిన బాధ్యత తెలంగాణవాదులపైన, టీఆరెస్‌పైన ఉంది.
*******
సీమాంధ్రలో జరిగిన 17 శాసనసభ నియోజకవర్గాలు, ఒక లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల ఫలితాలు కూడా తెలంగాణకు మేలు చేసేవే. వచ్చిన తెలంగాణను అడ్డుకున్న సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకు ముఖం చెల్లకుండా చేశాయి ఈ ఎన్నికలు. సమైక్యాంధ్ర అంటే ఆంధ్ర తమవెంటే ఉంటుందని నమ్మబలికిన లగడపాటి, కావూరి, రాయపాటి వంటివారు ఇప్పుడు ఏమని సమాధానం చెప్పగలరు? ఆంధ్రలో కాంగ్రెస్ ఓడితే తెలంగాణ ఏర్పడుతుందని బెదిరించినా అక్కడి ప్రజలు పట్టించుకోలేదు. జగన్‌కు ఓటేయడమంటే రాష్ట్ర విభజనకు ఓటేయడమేనని హెచ్చరించినా అక్కడి ప్రజలు ఖాతరు చేయలేదు. జగన్‌పై కాంగ్రెస్ చేస్తున్న అవినీతి ఆరోపణలను కూడా ప్రజలు విశ్వసించలేదని భావించాలి. ఆశ్చర్యం ఏమంటే, ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి సొంత జిల్లాలోని తిరుపతిలో, స్టార్ కాంపెయినర్ చిరంజీవి ప్రాతినిధ్యం వహించిన తిరుపతిలో జగన్ పార్టీ గెలవడం. కాంగ్రెస్‌కు ఒక్క పరాభవం కాదు. ఒక్క తిరుపతిలోనే కాదు చిరంజీవిని కలుపుకున్న ఫలితం ఎక్కడా దక్కలేదు. ఈ 17 నియోజకవర్గాల్లో 2009 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 41. శాతం, పీఆర్‌పికి 21.9 శాతం ఓట్లు వచ్చాయి. అంటే రెండు పార్టీలకూ కలిపి 63.7 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఉప ఎన్నికల్లో ఇదే 17 నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్ల శాతం 22.9 మాత్రమే. నేతలు కలసిపోవచ్చు. పార్టీలు విలీనం కావచ్చు. కానీ జనం విలీనం కారన్న విషయాన్ని ఈ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. అతిరథ మహారథులు, కేంద్ర మంత్రులు కాలికి బలపం కట్టుకుని ఊరూవాడా తిరిగినా, స్టార్ కాంపెయినర్లు ‘ఇది వాళ్ల గడ్డ కాదు, ఆళ్ల గడ్డ’ సవాళ్లు విసిరినా జనం మాత్రం జగన్ వైపే చూశారు. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడే లోకస్ స్టాండీని కోల్పోయారు. విజయమ్మ పరకాలకు వచ్చి తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పారు. సీమాంధ్రకు వెళ్లి సమైక్యాంధ్ర గురించి చెప్పలేదు. తెలంగాణపై లగడపాటి వంటి కాంగ్రెస్ నాయకులు రెచ్చగొట్టినా ఆమె నోరుమెదపలేదు. తన కొడుకుకు జరిగిన అన్యాయం గురించి మాత్రమే చెప్పారు. అయినా సీమాంధ్ర ప్రజలు జగన్‌వైపే చూశారు. ఈసారి కూడా సీమాంధ్ర ప్రజలు తెలంగాణ వ్యతిరేకతను ప్రదర్శించలేదు.

నీతి గెలిచిందా? అవినీతి గెలిచిందా? అని ఎవరయినా నిలదీయవచ్చు. జనం మాత్రం అవేవీ చూడ లేదు. జగన్ గెలుస్తాడా? ఆయనను ఒంటరి చేసి మూకుమ్మడిగా దాడిచేస్తున్న మిగిలిన పార్టీలు గెలుస్తాయా? అని మాత్రమే చూశారు. జగన్‌నే గెలిపించారు. జనం తీర్పును తప్పు పట్టే వాళ్లూ ఉంటారు. వారికి శాపనార్థాలు పెట్టే విశ్లేషకులూ ఉంటారు. ఇదే జనం గతంలో కాంగ్రెస్‌ను గెలిపించారు. ఇదే జనం టీడీపీనీ గెలిపించారు. ఇదే జనం కొందరు పీఆర్‌పీకీ ఓటేశారు. మనకు అర్థం కాని తీర్పులన్నీ తప్పు కాదు. అసలెందుకు ఇలా జరిగిందో ఆలోచించుకోవాలి. జగన్‌పై ఇన్ని అవినీతి ఆరోపణలు వచ్చిన తర్వాత, ఇన్ని లక్షల టన్నుల న్యూస్ ప్రింట్, ఇన్ని వేల గంటల న్యూస్ అవర్స్ వెచ్చించి ఆయనను దోషిగా నిలబెట్టిన తర్వాత, ఇన్ని పార్టీలు ఆయనపై ఒక్కుమ్మడిగా దాడి చేసిన తర్వాత కూడా జనం ఎందుకు ఆయనను గెలిపించారో లోతుల్లోకి వెళ్లి చూడాలి. అధికారపక్షం, ప్రతిపక్షం, పత్రికలు, చానెళ్లు ఊపిరిసలుపకుండా కుమ్మరించిన అస్త్రాలన్నీ జగన్ గడపను ఎందుకు తాకలేకపోయాయో ఆలోచించుకోవాలి. జనం విశ్వాసాన్ని చూరగొనలేకపోవడం తప్పా? లేక జనం విశ్వసించకపోవడం తప్పా? తప్పు అపనమ్మకాన్ని మూటగట్టుకున్నవారిదా? నమ్మనివారిదా? నిర్ణయించుకోవాలి. జనాన్ని గొర్రెదాటు అని, పిచ్చోళ్లు అని, మోసపోయారని తిట్టినవాళ్లెవరూ రాజకీయాల్లో బాగుపడలేదు. తెలుగుదేశం ఆలోచించవలసింది ఇక్కడే. ఈ ఎన్నికలు త్రిముఖ పోటీలాగా జరుగలేదు. ద్విముఖ పోటీలాగానే జరిగాయి. తెలిసి చేసినా తెలియక చేసినా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, లోక్‌సత్తా, సిబిఐ, కొన్ని పత్రికలు, చానెళ్లు ఈ ఎన్నికలను జగన్ వర్సెస్ ఆల్ కింద మార్చేశాయి. తెలుగుదేశం తన ప్రత్యామ్నాయ పాత్రను, ప్రధాన ప్రతిపక్ష పాత్రను తానే కుదించుకుంది. జగనే శత్రువు, జగనే దయ్యం, జగనే భూతం….మెలకువలో, కలలో, నడకలో, మాటలో జగన్నామస్మరణ వీడలేదు టీడీపీ. ఎనిమిదేళ్ల అధికార కాంగ్రెస్ వైఫల్యాలు, జగన్ అవినీతి పురాణం నుంచి లబ్దిపొందవలసిన టీడీపీ పూనకం వచ్చినట్టుగా జగన్ చుట్టూనే ప్రచారం చేస్తూ వచ్చింది. కాంగ్రెస్‌కు ఎలాగూ జగనే శత్రువు. కాంగ్రెస్-టీడీపీలు ఒక్కటై జగన్‌ను టార్గెట్ చేశారన్న భావన జనంలో వచ్చేసింది. జగన్ బయటికి వెళ్లింది కాంగ్రెస్ నుంచి. నష్టపోతే కాంగ్రెస్ భారీగా నష్టపోవాలి. కాంగ్రెస్ ఓట్లు నిలువునా చీలిపోవాలి. కానీ విచిత్రంగా టీడీపీ కూడా నష్టపోయింది. టీడీపీ ఓట్లు కూడా జగన్ వైపు వెళ్లాయి. ఉప ఎన్నికలు జరిగిన ఈ 17 నియోజకవర్గాల్లో 2009 సాధారణ ఎన్నికల్లో టీడీపీకి 30.3 శాతం ఓట్లు రాగా, ఈ ఉప ఎన్నికల్లో 24.5 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఐదుచోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2009 ఎన్నికల్లో చిరంజీవి పీఆర్పీ పెట్టడం వల్ల నష్టపోయామని చంద్రబాబు చెబుతుంటారు. కానీ చిరంజీవి ఓట్లు కూడా టీడీపీకేమీ రాలేదు. ఉన్న ఓట్లనే కోల్పోయింది. అన్ని పార్టీల ఓట్లనూ చీల్చుకుని జగన్ బలవంతుడయ్యారు. ఆయనకు ఏకంగా 47.7 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీ, కాంగ్రెస్-ండు పార్టీలకు వచ్చినన్ని ఓట్లు ఆయన ఒక్కడికే వచ్చాయి. జగన్ ఈ విజయాలను నిలబెట్టుకుని, నిలకడగా రాజకీయాలు చేస్తే ఈ ఫలితాలు మున్ముందు సరికొత్త రాజకీయ సమీకరణలకు దారితీయడం తథ్యం.

పరకాల- అనేక తీర్పులకు సందర్భం

పరకాల ఉప ఎన్నికకు సాధారణ పరిస్థితుల్లో అయితే పెద్దగా ప్రాధాన్యం లేదు. ఒకే ఒక్క నియోజకవర్గం. పైగా ముందు తెలంగాణవాదులు గెల్చిన సీటు కాదు. కానీ ఇప్పుడు చాలా ప్రాధాన్యతలను సంతరించుకుంది. ఈ ఒక్క ఎన్నిక ద్వారా పరకాల ప్రజలు అనేక సంకేతాలను, తీర్పులను ఇవ్వాల్సి ఉంది. కొందరు ద్రోహులను తిప్పికొట్టాల్సి ఉంది. ఇంకొందరి భ్రమలను తొలగించాల్సి ఉంది. మరికొందరి మాయలను తిరస్కరించాల్సి ఉంది. తెలంగాణ రాజకీయ అస్తిత్వ బావుటాను మరోసారి సమున్నతంగా ఎగరేయాల్సి ఉంది. తెలంగాణ ప్రజల కన్ను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తప్ప మరి దేనిపైనా లేదని తేల్చి చెప్పాల్సి ఉంది. మహబూబ్‌నగర్ ఉప ఎన్నికలో
జరిగిన తప్పిదాలను సరిచేసుకోవడానికి పరకాల ఉపఎన్నిక కలసివచ్చిన అవకాశం. మానుకోట గాయాల్ని మాన్పడానికి, జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ చొరబాటును తిప్పికొట్టడానికి ఇది సరైన సందర్భం. తెలంగాణవాదం కోసం నిలబడినా బిజెపిని ఎందుకు నమ్మడం లేదని ఒక మిత్రుడు ప్రశ్నించారు. నమ్మకం రాత్రికి రాత్రి తయారయ్యేది కాదు. సుదీర్ఘ అనుభవం, ఆచరణ మీద ఆధారపడి ఏర్పడేది. బుద్ధిజీవులు ఎవరైనా అనేక సాధారణ పరిణామాలను పరిశీలించి ఒక నిర్దిష్ట వైఖరి, ఒక నైతిక నిర్ణయం తీసుకుంటారు. ఒక నిర్దిష్ట పరిణామాన్ని చూసి సాధారణ నిర్ణయాలు చేయరు.

బిజెపిని నమ్మకపోవడానికి లేక శంకించడానికి కారణాలనేకం- మొదటిది, బిజెపి గతంలో ఒకసారి మాట ఇచ్చి తప్పింది. ఒక ఓటు రెండు రాష్ట్రాల నినాదంతో బలపడిన బిజెపి టీడీపీతో పొత్తుకోసం మాటమార్చింది. రెండు, బిజెపి జాతీయ పార్టీ, ఆపార్టీకి వంద ఎజెండాలు ఉన్నాయి. ఎన్నిక ఎన్నికకూ దాని ప్రాధాన్యతలు, ఎజెండాలు మారడం చూస్తున్నాం. రామజన్మభూమి, కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు వంటి నినాదాలను ఆ పార్టీ ఇప్పుడు వినిపిస్తోందా? మూడు, బిజెపికి దేశవ్యాప్తంగా డజనుకుపైగా రకరకాల మిత్రపక్షాలున్నాయి. అధికారంలోకి రావడానికి  ఆ పార్టీ ఎప్పటికప్పుడు కొత్త మిత్రపక్షాలను వెదకుతూనే ఉంది. వాటితో పొత్తుకోసం, మద్దతుకోసం, స్నేహంకోసం ఎప్పుడయినా ఏ హామీనయినా, ఏ నినాదాన్నయినా పక్కన పెట్టే అవకాశాలు కోకొల్లలు. తెలుగుదేశంకోసం తెలంగాణను తొక్కిపెట్టిన చరిత్ర ఉండనే ఉంది. నాలుగు, జాతీయ పక్షాలకు చాలా రాజకీయ అనివార్యతలు(పొలిటికల్ కంపల్షన్స్) ఉంటాయి. ఎప్పుడు ఏ అనివార్యత వాటిని ప్రభావితం చేస్తుందో చెప్పలేం. ఐదు, బిజెపి నుంచి గెలిచే ఎంపీలు, ఎమ్మెల్యేలు అధిష్ఠానం ఆదేశాల మేరకు పనిచేస్తారు తప్ప, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు స్పందించరు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను చూస్తున్నాం-వాళ్లేం చేస్తున్నారో, ఎన్ని పిల్లి మొగ్గలు వేస్తున్నారో! జాతీయ పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేల జుట్టు ఢిల్లీ పెద్దల చేతుల్లో ఉంటుంది. ఇంతెందుకు వెంకయ్యనాయుడు కనుసన్నల్లో పనిచేసే కిషన్‌రెడ్డిని కూడా చూశాం. లక్ష్మీనారాయణ రాజీనామా చేస్తే, ఆయన మాత్రం రాజీనామా చేయడానికి నిరాకరించారు. మన ఓటు, అధికారాన్ని మన అదుపాజ్ఞల్లో ఉంచుకోడానికి ఉపయోగపడాలి. ఎక్కడో కనిపించని అధిష్ఠానం చేతుల్లో పెట్టడం ఎందుకు? మన ఎంపీలు, ఎమ్మెల్యేల జుట్టు మన తెలంగాణ నేతల చేతుల్లోనే ఉండాలి. ఆరు, బిజెపి సమాజాన్ని చీల్చి రాజకీయంగా బలపడాలని చూసే పార్టీ. కుల, మత రాజకీయాలకు పెట్టింది పేరు. మహబూబ్‌నగర్‌లో దాని విశ్వరూపం చూశాం. ఇప్పుడు పరకాలలో కూడా కులం కార్డును ప్రయోగిస్తున్నది.

టీఆరెస్ ఇందుకు పూర్తిగా భిన్నం. టీఆరెస్‌ది ఏకైక ఎజెండా. తెలంగాణ సాధన దాని ఏకైక లక్ష్యం. మిత్రపక్షాల గొడవ లేదు. రాజకీయ అనివార్యతల సమస్యలేదు. మాటమార్చే అగత్యం లేదు. మన ఓటుతో అధికారాన్ని మన చేతుల్లో ఉంచుకోవాలి. టీఆరెస్ నుంచి గెలిచే ఎంపీలు, ఎమ్మెల్యేలకు తెలంగాణ నేతలు, ప్రజలే అధిష్ఠానం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడమే వారి ప్రాథమిక లక్ష్యం అవుతుంది. టీఆరెస్ తెలంగాణ సమాజాన్ని ఐక్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నది. హిందూ-ముస్లిం ఐక్యతా సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళుతుంది. ఉద్రిక్తతలను, ఉన్మాదాలను రెచ్చగొట్టదు. ఈ పదకొండేళ్లలో ఎదురైన అనేక అనుభవాల తర్వాత బుద్ధిజీవులు ఎవరైనా ఇంతకన్నా భిన్నంగా ఆలోచించే అవకాశం లేదు.

ఇక జగన్‌మోహన్‌రెడ్డి విషయం – ఆయన తెలంగాణ ప్రజలకు ఏమీకాడు. ఆయన రాజశేఖర్‌రెడ్డి వారసుడు. రాజశేఖర్‌రెడ్డి తెలంగాణకు చేసిన ద్రోహాలకు, వెన్నుపోట్లకు వారసుడు. రాజశేఖర్‌రెడ్డి తెలంగాణలో కొల్లగొట్టిన సంపదలకు వారసుడు. తెలంగాణ నుంచి అక్రమంగా మళ్లించిన వనరులకు వారసుడు. హైదరాబాద్‌కు
పోవాలంటే వీసా తీసుకోవాల్సి వస్తుందని ఆంధ్రా ప్రజలను బ్లాక్‌మెయిల్ చేసిన రాజశేఖర్‌రెడ్డికి ఆయన రాజకీయ అంతేవాసి. తెలంగాణ ఏర్పాటును అడుగడుగునా అడ్డుకున్న రాజశేఖర్‌రెడ్డికి కొనసాగింపు. స్వయంగా తాను సమైక్యవాదినని  పార్లమెంటులోనే ప్లకార్డు ప్రదర్శించినవాడు. రాజకీయాల్లో అడ్డగోలు ఎదుగుదలకు,
అంతులేని అవినీతికి సింబల్. అన్ని రకాల అవినీతి ఆరోపణల్లో పీకల్లోతు కూరుకుపోయినవాడు. తెలంగాణ ప్రజాభీష్టంపై దురాక్రమణకు ప్రయత్నించి మానుకోటను యుద్ధభూమిగా మార్చినవాడు. ఇవన్నీ ఎలా మర్చిపోగలం? పైగా ఆయనది సీమాంధ్ర పార్టీ. సీమాంధ్ర నాయకత్వంలో నడిచే పార్టీ. ఇంత జరిగిన తర్వాత, ఇన్ని
అనుభవాల తర్వాత జై తెలంగాణ అనని వారికి ఇక్కడ ఎలా ఓటేస్తారు?

చంద్రబాబునాయుడుకూ, రాజశేఖర్‌రెడ్డికీ స్థూలంగా ఏమీ తేడా లేదు. తెలంగాణలో దోపిడీకి ఒకరు పునాది వేస్తే, మరొకరు పూర్తి చేశారు. హైదరాబాద్‌ను కాలనీగా మార్చడానికి ఒకరు దారులు వేసి, కిటికీలు తెరిస్తే, మరొకరు ద్వారాలు తెరిచారు. ఒకరు తెలంగాణ రాకుండా అడ్డంపడితే, మరొకరు వచ్చిన తెలంగాణకు అడ్డం పడ్డారు. ఇద్దరిదీ రెండు కళ్ల సిద్ధాంతమే. ఇక్కడో మాట, అక్కడో మాట. మనుషులిక్కడ, ఆత్మలక్కడ. అవినీతి విషయంలోనూ ఇద్దరిదీ ఒకటే బడి. ఒకరిది పాలిష్డ్ అవినీతి. మరొకరిది మొరటు అవినీతి. తీవ్రతలో తేడా. పరిమాణంలో తేడా. చంద్రబాబునాయుడుకు తెలంగాణలో ఓటు అడిగే హక్కులేదు.

కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం గురించి ఒక రాజకీయ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్య ఈ సందర్భంగా ఉటంకించడం సబబుగా ఉంటుందేమో- ‘కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్‌కు ఒక నిరర్థక ఆస్తి(నాన్ పర్‌ఫార్మింగ్ అసెట్-ఎన్‌పిఏ). తెలంగాణ ప్రజలకు భారం. ఉండీ ఉండనట్టు. దేనికీ కట్టుబడనట్టు. ఏ పనీ చేయనట్టు. ఎవరికీ
పట్టనట్టు. ఏ ప్రభావానికీ లొంగనట్టు. ఎవరికీ ఏమీ కానట్టు. అనేక మంది నాయకులు. వంద కుంపట్లు. వేయి నాల్కలు. ఏకకాలంలో అనేక యుద్ధాలు చేస్తున్నట్టు కనిపిస్తారు. వందలాది మ ంది కత్తులు గాలిలో తిప్పుతూ కనిపిస్తారు.  చివరకు చూస్తే వీళ్ల శరీరాల నుంచే రక్తం ధారలు కడుతుంటాయి. వీళ్లను గెలిపిస్తే ఈ ఎనిమిదేళ్లలో ఏం జరిగింది? ఇప్పుడు ఒరిగేదేముంది?’  ప్రతి ఎన్నిక ఒక తీర్పు చెప్పే సందర్భం. ప్రతి ఓటు నచ్చనివాటిని నిరాకరించే అస్త్రం. ప్రతిఓటు అస్తిత్వాన్ని చాటుకునే ఆయుధం! తెలంగాణవాదాన్ని గెలిపించుకోవాలి. తెలంగాణవాదాన్ని బతికించుకోవాలి.

*****

ఇద్దరు జర్నలిస్టుల సంభాషణ- ‘రాజకీయాల్లోకి వచ్చి పట్టుమని పది  మాసాలు కాకముందే ముఖ్యమంత్రి పదవిపై మోజుపడిన మనిషిని, ఇన్ని అవినీతి ఆరోపణలు ఎందుర్కొంటున్న వ్యక్తిని, పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయిన మనిషిని సీమాంధ్రలో ఎందుకింత అభిమానిస్తున్నారు? ఆయన జైలుకెళితే, ఆయన తల్లి, చెల్లి
పర్యటనకెళితే జనం ఇంతగా ఎందుకు విరగబడుతున్నారు?’. ‘అది వాస్తవం కాదు. బలమైన వాదం, ప్రత్యామ్నాయం ఉన్న చోట జగన్‌ను నిలువరించగలిగారు. తెలంగాణలో జగన్ ఎందుకు ఏమీ చేయలేక పోయారు? తెలంగాణవాదం ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అయింది. అందుకే జగన్‌వైపు పెద్దగా జనం కదలలేదు. ఇకముందు కదిలే అవకాశం లేదు. సీమాంధ్రలో చంద్రబాబు, కిరణ్ లేక బొత్స లేక చిరంజీవి ఒక బలమైన ప్రత్యామ్నాయంగా జనం విశ్వాసాన్ని చూరగొనలేకపోతున్నారు. ఆ నాయకులు విధానాలపరంగా, రాజకీయంగా దివాలా అంచున నిలబడి ఉన్నారు. తలా ఒక కుంభకోణాన్ని నెత్తిపెట్టుకుని, జగన్
అవినీతిపై యుద్ధం చేస్తున్నామని చెబితే ఎవరు నమ్ముతారు? క్రెడిబుల్ ఆల్టర్నేటివ్ లేదు. జనం ఉన్నవాళ్లలో బెటర్ ఎవరో ఎంచుకుంటున్నారు. ఒక రకంగా జనానికి జగన్ కొత్త. ఏం చేస్తాడో చూద్దామన్న ఉత్సుకత. అందుకు రాజశేఖర్‌రెడ్డి చేసిన మేళ్లు కొంత ఉపయోగపడుతున్నాయి. గెలిచేవాడివైపు ఉండాలన్న గాలివాటం ఇంకొంత
తోడవుతోంది. అన్నీ జగన్‌కు ఉపకరిస్తున్నాయి’.

‘జగన్‌ను మానుకోటవరకు వెళ్లనిచ్చి ఉంటే తెలంగాణవాదం ఎప్పుడో చల్లారిపోయి ఉండేదని ఒక రాజకీయ వేత్త చెబుతున్నాడు’. ‘తెలంగాణ వ్యతిరేకతతో అలా మాట్లాడి ఉంటాడు. జగన్‌ను అప్పుడడ్డుకున్నారు. సరే నిజామామాద్ జిల్లాకు వెళ్లి దీక్ష చేశాడు. చంద్రబాబును ఐదు వేల మంది పోలీసు బలగాలను మోహరించి పాలకుర్తి పంపారు. కిరణ్‌కుమార్‌రెడ్డి భూపాలపల్లి దగ్గర్లో పురుషులను బంధింపజేసి, మహిళలతో సభలు పెట్టించారు. ఏమైంది? తెలంగాణవాదం చల్లారిపోయిందా? ఆ తర్వాతనే కదా ఆరు నియోజకవర్గాల ఉప ఎన్నికలు జరిగి తెలంగాణ వాదులు గెలిచిందీ, టీడీపీ సగం సీట్లలో డిపాజిట్లు గల్లంతయింది, అధికారపార్టీ అన్ని చోట్లా
ఓడిపోయింది’.

*****

ఒక పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధి ఐదేళ్లపాటు ఏ పార్టీలోకీ వెళ్లకుండా చట్టం తేవాలి(ఒంగోలు సభలో)….ఉప ఎన్నికలంటే తమాషా అయిపోయింది. ప్రతిసారీ రాజీనామా చేయడం, పోటీ చేయడం రాష్ట్రంలో తప్ప ఎక్కడా లేదు. ఇలా రాజీనామా చేసేవారు మళ్లీ పోటీ చేయకుండా పదేళ్లు నిషేధం విధించాలి.

-నారా చంద్రబాబునాయుడు
ఎంకిపెల్లి సుబ్బిసావుకు వచ్చినట్టు, ఉప ఎన్నికలు తెలుగుదేశం చావుకు వచ్చాయి. ఆడలేని వాడు మద్దెలను బద్దలు కొట్టాలని చూస్తాడు. పోరాడలేనివాడు ఎన్నికలు నిషేధించాలని చూస్తాడు. అనువైతే ఒక మాట, అనువుకాకపోతే మరో మాట..ఐదేళ్లకోసం ఎన్నుకున్న ఎన్‌టిఆర్‌ను దించేసి ముఖ్యమంత్రి పదవిని, పార్టీ
అధ్యక్షపీఠాన్ని కబ్జా చేయవచ్చు. ఎన్‌టిఆర్ చలువతో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయించి ఏకంగా ప్రభుత్వాన్నే మార్చేయవచ్చు. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన మోత్కుపల్లి నర్సింహులు(1999 ఎన్నికల్లో)తో తిరుగుబాటు చేయించి పచ్చజెండా కింద ఆశ్రయం ఇవ్వచ్చు. తనపైనే ‘బిగ్‌బాస్’ ఆరోపణలు చేసిన
మైసూరారెడ్డిని పార్టీలో చేర్చుకోనూవచ్చు. ప్రతిపక్ష జడ్‌పిటిసి సభ్యులను టోకున కొనుగోలు చేసి(2001 స్థానిక ఎన్నికల్లో) వరంగల్, రంగారెడ్డి, చిత్తూరు….జడ్పీలను కైవసం చేసుకోవచ్చు. అప్పుడెప్పుడూ చంద్రబాబుకు నిషేధాలూ, నీతులూ గుర్తుకురాలేదు. అదొక్కటేనా నలభై ఎనిమిది గంటల్లో మాటమార్చవచ్చు. ఏడాది తిరగకుండానే ఎన్నికల మానిఫెస్టోను మరచిపోవచ్చు. పార్టీ మార్చడాన్నేనా, మాట మార్చడాన్ని నిషేధించవద్దా? మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఐదేళ్లదాకా మార్చకుండా చట్టం తేనవసరం లేదా?

*****

ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌పైన, కేంద్రమంత్రులపైన అన్నాహజారే బృందం ఆరోపణలు చేయడం సరికాదు. ‘ఎటువంటి హేతుబద్ధత లేకుండా, సహజ, సమన్యాయ సూత్రాలను గాలికి వదిలేసి అత్యుత్సాహంగా, నిర్లక్ష్యంగా ఆరోపణలు చేయడం వల్ల అవినీతిపై మనం చేస్తున్న సంఘటితపోరాటం దెబ్బతింటుంది’.

-లోక్ సత్తా నేత జయప్రకాశ్ నారాయణ్

‘విషవృక్ష వారసుడుగా అవినీతికి మూల్యం చెల్లించడమే జగన్ అరెస్టు. జగన్ అవినీతిపై స్పష్టమైన ఆధారాలు దొరకడంతోనే అరెస్టు జరిగింది.  ఇలాంటి అవినీతి ఘటనలతో తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిని తలదించుకునే దుస్థితి దాపురించింది’- ఈ మాటలన్నది కూడా జయప్రకాశ్ నారాయణ్‌గారే. ప్రధాని చేసిన కోల్ బ్లాక్‌ల
కేటాయింపుపై దర్యాప్తు చేయాలని డిమాండు చేయవద్దు. సిబిఐ దర్యాప్తూ చేయవద్దు. ఆధారాలు పట్టుకోవద్దు. ఒకే నేత, రెండు నీతులు.

*****

వాన్‌పిక్‌లో మోపిదేవి వెంకటరమణ పొందిందేమీ లేదు. జగన్ రూ.00 కోట్ల ముడుపులు తీసుకున్నారు. తండ్రి(వైఎస్) అధికారాన్ని అడ్డుపెట్టుకుని సాగించిన అవినీతి, అక్రమాలు చట్టబద్ధం కావాలని కోరుకుంటున్నాడు
– రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్
రాజకీయాల్లో దయ, దాక్షిణ్యాలుండవు. శాశ్వతశత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. బండ్లు ఓడలవుతాయి. ఓడలు బండ్లవుతాయి. విధేయులు విరోధులవుతారు. విరోధులు విధేయులవుతారు. ఉండవల్లి అరుణ్‌కుమార్ మొన్నమొన్నటిదాకా ఏం మాట్లాడారో, ఇప్పుడేం మాట్లాడుతున్నారో చూస్తే, చదివితే మనకు మతిపోతుంది. ‘‘ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై బురదజల్లేందుకే టీడీపీ అధినేత చంద్రబాబు అనవసరంగా అవినీతి అంటూ గగ్గోలు పెడుతున్నారు…ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు, ఈటీవీ న్యూస్ చానెల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అవినీతి మయమైందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు… (2.12.200). రాజశేఖర్‌రెడ్డి పేదలపాలిట పెన్నిధి….(01.09.09). బతికున్నంతకాలం లేదా ఆయన కోరుకున్నంతకాలం సీఎంగా ఆయనే
కొనసాగుతారు…(29.06.09). చంద్రబాబు పదవీకాంక్షకు ప్రతిరూపం. నిత్యం వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను, హామీలను నెరవేర్చగలిగిన సత్తా జగన్‌లో ఉందని జనం నమ్మారు. కాబట్టే ఆయన సీఎం అయితే బాగుంటుందని భావించారు. అంతేతప్ప తనను సీఎం చేయమని జగన్ ఎవ్వరినీ అడగలేదు…(10.01.10). విశ్వసనీయతలో వైఎస్‌ను మించినవారు లేరు. పేదలకు మేలు చేయడంలో, చెప్పినమాట నిలబెట్టుకోవడంలో ఆయనే నంబర్ వన్…(20.03.09). ఎన్నిసార్లు ఆయన(వైఎస్)కు నా మాటల వల్ల బాధ కలిగిందో…హటాత్తుగా నాకు భగవద్గీతలో శ్లోకం గుర్తుకు వచ్చింది…‘కృష్ణా! నాశరహితా, నీ మహిమ తెలియక పొరపాటునగానీ చనువువల్లగానీ ఓ కృష్ణా, యాదవా, సఖా…విహారము సల్పునపుడుగానీ, పరుండునప్పుడుగానీ, కూర్చున్నప్పుడుగానీ, భుజించునప్పుడుగానీ, ఒక్కడవు ఉన్నప్పుడుగానీ…ఏవిధముగా
ప్రవర్తించితినో… నా అపరాధములన్నింటినీ అప్రమేయుడవగు నీవు క్షమించమని వేడుకుంటున్నాను’. తండ్రీ! ఓ రాజశేఖర్‌రెడ్డీ నన్ను క్షమించు….అనుగ్రహించు!(వైఎస్ మృతి సందర్భంగా 15.09.09న రాసిన వ్యాసం)’’…ఇవన్నీ ఉండవల్లి చేసిన ప్రసంగాలు, రాసిన రాతలే. ఎవరు ఎవరిని క్షమించాలి? ఏది పాపం? ఏది పుణ్యం? ఎవరు కృష్ణుడు? ఎవరు కంసుడు?

*****

మా మంత్రి మోపిదేవి వెంకటరమణ గుడ్‌పర్సన్…సిన్సియర్…క్లీన్….ఆయన ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటికి వస్తారని నమ్ముతున్నాను.
-ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి
అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గం ఉమ్మడిగా తీర్మానాలు చేస్తే, ఆ తీర్మానాల ఆధారంగా కార్యదర్శులు ఆదేశాలు రూపొందిస్తే, మంత్రులు సంతకాలు చేస్తే జీవోలు వెలువడుతాయి. ముఖ్యమంత్రి బలవంతుడే కావచ్చు, సర్వాధికారీ కావచ్చు. కానీ చట్టంలో ఆ పదాలు లేవు. ప్రభుత్వం నిర్ణయాలకు
మంత్రివర్గం ఉమ్మడిగా బాధ్యత వహించాలని చట్టం చెబుతుంది. జీవోలు విడుదల చేసిన ఆరుగురు మంత్రులే కాదు, రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో సభ్యులుగా ఉన్న మంత్రులందరూ ఉమ్మడిగా బాధ్యత వహించాలి. మంత్రి వర్గ తీర్మానాల వల్ల జరిగిన ఇచ్చిపుచ్చుకోవడాలకు జవాబుదారీ కావాలి. జగన్‌రెడ్డి పిటిషన్ వేయించింది మీ
ఎమ్మెల్యేతోనే. (జగన్‌రెడ్డిని కోర్టులో ఇరికించినందుకు ప్రతిఫలంగా మంత్రిపదవి ఇచ్చిందీ, అంతలోనే తొలగించిందీ తమరే.) ముందుగా అరెస్టు చేసిందీ మీ ప్రభుత్వాధికారులనూ, మంత్రినే. మొద్దులో తోక ఇరికించి మేకు పీకేసిన కోతి కథలా లేదు. ఇప్పుడు లాక్కోలేరు, పీక్కోలేరు. ఇంత బురద మీదపోసుకుని, జగన్ రెడ్డిపై ఎంత బురదవేస్తే మాత్రం ఏం ప్రయోజనం?
*****