కాలంబురాగానె కాటేసి తీరాలె

మనకు ద్రోహము చేసి
మనను దాసుల జేసి
ఆటలాడెడి
అథమనేతలను గుర్తించి
కాలోజీ మాటల్లో
‘కాలంబురాగానే కాటేసి తీరాలె’.
ఇప్పుడు అటువంటి అవకాశం ఒకటి తెలంగాణ ప్రజలకు వచ్చింది. ఇప్పుడే కాదు ఇంకెప్పుడు ఇటువంటి అవకాశం వచ్చినా తెలంగాణ ద్రోహులెవరో, తెలంగాణవాదులెవరో గుర్తించి, గురిచూసి కొట్టవలసిన సమయం వచ్చింది. ఆ అవకాశం ఈ ఉప ఎన్నికలే. గత రెండేళ్లుగా ఉద్యమ వేదిక కానిచోటు లేదు. తెలంగాణ ఆకాంక్షను వ్యక్తీకరించని సందర్భం లేదు.
తెలంగాణ వచ్చినట్టే వచ్చి ఎందుకు ఆగిపోయిందో, ఆశ నిరాశల చక్రభ్రమణంలో తెలంగాణ హృదయాలు ఎంతగా కొట్టుమిట్టాడుతున్నాయో అందరికీ అనుభవమే! ఏ విద్రోహం, ఏ కుట్రలు, ఏ శక్తులు తెలంగాణ ప్రజలతో ఆటలాడుకుంటున్నాయో ఇప్పుడు స్పష్టంగానే తెలిసిపోయింది.

ఈ రెండేళ్ల క్షోభను, దుఃఖాన్ని ఎలా మరచిపోగలం? శ్రీకాంతాచారి మంటల్లో కాలిపోతూ చేతులు పైకెత్తి జైతెలంగాణ నినాదాలివ్వడం మనం ఇంకా మరచిపోలేదు. ఇషాంత్‌రెడ్డి అగ్నికి ఆహుతి అవుతూ రాసిన లేఖలో ఏం చెప్పారో ఇప్పటికీ జ్ఞాపకం ఉంది? కానిస్టేబుల్ కిష్టయ్య తుపాకిని తన కణతకు గురిపెట్టుకుని ఏమని తలుచుకుని ఉంటాడో మననం చేసుకుందామా! విద్యార్థులు, పోలీసుల కవాతు మధ్య అగ్నికీలల్లో యాదయ్య చేసిన తెలంగాణ ఊరేగింపు ఇప్పటికీ గుండెలను పిండుతూనే ఉంది. ఢిల్లీలో పార్లమెంటుకు కూతవేటు దూరంలో చెట్టుకు వేలాడిన యాదిరెడ్డి శవం ఏమని ప్రశ్నించిందో ఎలా మరచిపోగలం? వందలాది మృతవీరుల కుటుంబాల ఆర్తరావాలు ఇంకా మన చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. అయినా తెలంగాణ రాలేదు. స్వేచ్ఛామేఘాలకోసం నిరంతర నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఇవ్వని కాంగ్రెస్, ఇవ్వనీయని తెలుగుదేశం….అంతా క్షేమంగానే ఉన్నారు. ద్రోహులు నిశ్చింతగా ఊరేగుతూనే ఉన్నారు.

దీక్షలు చేశాం. సభలు నిర్వహించాం. మహామహాసభలూ జరిపాం. బాష్పవాయుగోళాలను, లాఠీలనూ, తూటాలనూ ఎదుర్కొన్నాం. నిప్పుల్లో కాలిపోయాం. ఉరితాళ్లను అలుముకున్నాం….దేశచరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా 42 రోజులపాటు సమ్మె చేశాం. ఎన్ని నిరసన రూపాలో! ఎన్ని ఉద్యమ కార్యాచరణలో! ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సింగరేణి కార్మికులు, ఆర్టీసీ సిబ్బంది,  న్యాయవాదులు, డాక్టర్లు, అన్నికులాలు, అన్ని వర్గాల ప్రజలు సమ్మెకట్టారు. ప్రజాస్వామ్య పంథాలో ఇంకేం ఉద్యమరూపాలు మిగిలాయి? మనముందు ఇంకేం ప్రత్యామ్నాయం మిగిలింది? హింసకు దిగలేం. విధ్వంసం సృష్టించలేం. ఆయుధాలు పట్టలేం. మారణహోమాలు మనం కోరుకోవడం లేదు. ఇక మిగిలింది ఒకే ఒక ఆయుధం-అది ఓటు. తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన ప్రయోగాలు చాలు. సీమాంధ్ర నేతల పెత్తనంలోని పార్టీలతో తెలంగాణకు శాశ్వతంగా ఒక సమస్య ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర ప్రాంతంతో ఆబ్లిగేషన్ ఉంటుంది. తెలంగాణ సాధన ఆ పార్టీకి ప్రాధాన్యం కాదు. పైగా ఇక్కడివాళ్లు ఇవ్వాలంటారు. అక్కడివాళ్లు వద్దంటారు. ఇది తేలే విషయం కాదు. కాంగ్రెస్‌దీ అదే పరిస్థితి. వైఎస్సార్ కాంగ్రెస్‌కు తెలంగాణపై పెద్దగా ఆశలు లేవు, తెలంగాణతో ఆబ్లిగేషనూ లేదు. ఈ పార్టీలతో ఇక తెలంగాణకు వచ్చేది, ఒరిగేది ఏమీ లేదు. ఈ పార్టీలతో తెలంగాణకు ఎప్పుడయినా సమస్యే. ఇటువంటి పార్టీలకు చరమగీతం పాడకుండా, తెలంగాణ సొంత రాజకీయ అస్తిత్వానికి పట్టం కట్టకుండా ఎన్నేళ్లు, ఎన్నాళ్లు తన్లాడినా ఈ గోస మారదు. ఈ సమస్య పరిష్కారం కాదు. కనీసం వంద మంది ఎమ్మెల్యేలు, 15 మంది ఎంపీలు ఒకే మాటగా, ఒకే బాటగా ముందుకు సాగే పరిస్థితి ఉంటే ఈ తెలంగాణ ఎలా ఉంటుందో ఊహించండి. తొమ్మిది మంది ఎంపీలతో శరద్‌పవార్ కేంద్రంలో ఎలా చలాయిస్తున్నారో చూడండి. యూపీఏ-1లో తృణమూల్ కాంగ్రెస్, డిఎంకెలు ఢిల్లీలో చక్రం తిప్పింది కేవలం డజను మంది ఎంపీలతోనే కాదా! అందుకే ఇక నుంచి జరిగే ప్రతి ఎన్నికా తెలంగాణపై తీర్పే కావాలి. తెలంగాణ చైతన్య జ్వాలను మరింత ఉన్నతంగా ఎగరేసే సందర్భం కావాలి.

తెలంగాణ సమస్య చల్లారిపోయిందని, తెలంగాణ ఉద్యమం తెల్లారిపోయిందని, తెలంగాణలో అంతా సవ్యంగా సాగిపోతున్నదని, సెంటిమెంటు లేదని నమ్మించాలని, రుజువు చేయాలని, ఢిల్లీవారికి చాటి చెప్పాలని ఇటు చంద్రబాబునాయుడు, అటు కాంగ్రెస్ పెద్దలు పోటీ పడుతున్నారు. ఒకప్పుడు తెలంగాణ పదాన్ని నిషేధించిన చంద్రబాబు, ఇప్పుడు తెలంగాణ నినాదం అసెంబ్లీలో, బయటా చర్చకు రాకుండా, రాజకీయ ఎజెండాలోకి లేకుండా చేయడానికి ఆడని నాటకం లేదు, వేయని వేషం లేదు. తెలంగాణకు అడ్డం పడే విషయంలో, తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీసే విషయంలో, తెలంగాణ ఉద్యమ శ్రేణుల్లో గందరగోళం సృష్టించే విషయంలో, తెలంగాణ నేతలకు తాయిలాలు వేసి, ఇక్కడి నేతల మధ్య చిచ్చు పెట్టే విషయంలో రెండు పార్టీల నేతలకూ పెద్దగా తేడాలేదు.

వీరి రాజకీయ అస్తిత్వం దెబ్బతింటే తప్ప, రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైతే తప్ప తెలంగాణకు విముక్తి లేదు. తెలంగాణకు సంబంధించినంతవరకు వీరికి ఇక ఏమాత్రం రిలవెన్స్ లేదని, సీమాంధ్ర నాయకత్వం కింద పనిచేసే తెలంగాణ నేతలకు ఇక్కడ రాజకీయ భవిష్యత్తు ఉండబోదని దిగ్ధిగంతాలు మారుమోగేలా చాటిచెప్పాల్సిన తరుణం ఆసన్నమయింది. అందుకు మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం ఓటు. మాటతో చెబితే రానిది ఓటుతో చెబితే వస్తుంది. మంచిగా చెబితే విననివాడు ఓటుతో కొడితే వింటాడు. రాళ్లతో కొట్టాల్సిన పనిలేదు. చెప్పులు, కోడిగుడ్లు విసరాల్సిన పనిలేదు. ద్రోహుల గుండాలతో, వారి రక్షక భటులతో తలపడాల్సిన పనిలేదు. సభలు భగ్నం చేయాల్సిన అగత్యమూ లేదు. ఓటును వినియోగించుకోండి. తెలంగాణకోసం ఎత్తిన జెండా దించకుండా పోరాడుతున్నవారిని, తెలంగాణ నినాదాన్ని జాతివ్యాప్తం చేసినవారిని, తెలంగాణ సాధన ఏకైక లక్ష్యంగా అలుపూసొలుపూ లేకుండా ముందుకు సాగుతున్నవారిని విజేతలుగా నిలపండి. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరో ఇవ్వడం ఏమిటి? మనమే సాధించుకుందాం. యాచించే దుస్థితి ఇంకా వద్దు. శాసించే పరిస్థితిని మనమే తెచ్చుకోవాలి. అందుకు మన చేతిలో ఉన్న అధికారం ఓటు. ఆ ఓటుతోనే సీమాంధ్ర ఆధిపత్య పార్టీలను విసిరికొట్టాలి.

రెండేళ్లుగా తెలంగాణ అనుభవిస్తు క్షోభలకు, గుండెకోతలకు, ఆత్మబలిదానాలకు, దుఃఖానికి ఒక ఊరటకావాలి. ద్రోహులకు శిక్ష విధించి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడమే ఆ ఊరట. అన్ని విద్రోహాలకు,  మోసాలకు, అన్నిరకాల వంచనలకు ఒకే ఒక  దెబ్బ, అది ఓటు ఆయుధంతో జరిగిపోవాలి. మాట తప్పినవాళ్లను,  మాట మార్చినవాళ్లను, మడమ తిప్పినవాళ్లను మన సమాజం ఎలా వెలివేస్తుంది? ముల్లును ముల్లుతోనే తీయాలి. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి.  మన ఓటుతో గెలిచి, మన మనోభావాలతో ఆటలాడుకుంటున్న కాంగ్రెస్, టీడీపీలకు ఓటు ఆయుధంతోనే గుణపాఠం చెప్పాలి. సీమాంధ్ర నాయకత్వానికి గులాంగిరి చేస్తున్నవాళ్లకు, సీమాంధ్ర ఎస్టాబ్లిష్‌మెంటు కనుసైగలకు సలాములు కొడుతున్న వాళ్లను, అనేక విద్రోహాలు, వంచనల తర్వాత కూడా సీమాంధ్ర జెండాలను, ఎజెండాలను మోస్తున్నవాళ్లను ఓటుతోనే  దెబ్బతీయాలి. తెలంగాణ సొంత రాజకీయ అస్తిత్వాన్ని నమ్మినవాళ్లను, మనవాళ్లను గెలిపించుకుని, అధికారాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం ఒక్కటే మనకు మిగిలిన ప్రత్యామ్నాయం. చట్టసభల్లో తెలంగాణ సాధనకు అవసరమైన అధికారాన్ని మన ఓటుద్వారానే సాధించుకోవాలి. తెలంగాణకు అండగానిలబడి, తెలంగాణకు ఓటేసే వారిని మాత్రమే ఇక నుంచి పార్లమెంటు, చట్టసభలకు పంపాలి. ఓటుతోనే తెలంగాణ సాధించుకోవాలి.

తెలంగాణకు అడ్డుపడినవాళ్లు ఏ ప్రమాణాలతో చూసినా శిక్షకు అర్హులు. వీళ్లు ప్రజాస్వామికవాదులు కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటిస్తూ తీర్మానాలు చేసి, ఎన్నికల మ్యానిఫెస్టోల్లో పెట్టి, రాష్ట్రపతి ప్రసంగాల్లో ప్రస్తావించి, అఖిలపక్ష సమావేశాల్లో ఓకే చెప్పి, పార్లమెంటు, శాసనసభల్లో ఉపన్యాసాలు చేసి…తీరా ఏర్పాటు ప్రక్రియను ప్రకటించాక మాటమార్చినవాళ్లు ప్రజాస్వామికవాదులు ఎలా అవుతారు? ప్రజాస్వామిక హక్కుల గురించి మాట్లాడే నైతిక బలం వారికి ఎలా  ఉంటుంది? వీళ్లు సూత్రబద్ధ విధానాలకు కట్టుబడిన వారు కాదు. ఎప్పటికప్పుడు విధానాలను మార్చడం వీరి స్వభావం. ఊసరవెల్లి వీరి ముందు వెలవెలపోతుంది. ఎన్నికలకు ముందు  ఒక విధానం, ఎన్నికల తర్వాత మరో విధానాన్ని చెప్పడం వీరికి అలవాటుగా మారింది. తెలుగుదేశం, కాంగ్రెస్‌లు అవకాశవాదానికి ప్రతీకలు. వీళ్లు బాధ్యత కలిగిన నాయకులు కాదు. బాధ్యత కలిగిన నాయకుడెవరూ తొందరపడి నిర్ణయాలు చేయడు. ఒకసారి నిర్ణయాలు చేసిన తర్వాతవెనుకకు తగ్గడు. కష్టమైనా నష్టమైనా చేసిన నిర్ణయానికి కట్టుబడి పోరాడతాడు. బాధ్యత లేనివారే గాలివాటంగా వ్యవహరిస్తారు. బాధ్యతారాహిత్యం వీరి టాగ్‌లైన్.

వీళ్లకు ప్రజల విజ్ఞతపై చాలా చిన్నచూపు. ప్రజలకు ఏదీ ఎక్కువకాలం గుర్తుండదని, కొన్ని పత్రికలు, మరికొన్ని చానెళ్లు పెట్టుకుని ప్రచారపటాటోపాలతో, అబద్ధాలతో వారిని మాయ చేయవచ్చని, ప్రజల్లో గందరగోళం సృష్టించి ఏదో విధంగా తిరిగి బోల్తా కొట్టించవచ్చని వీరికి, ముఖ్యంగా చంద్రబాబుకు గట్టి నమ్మకం. ఆయన మ్యానిప్యులేషన్స్‌ను నమ్మినంతగా నిజాయితీని నమ్మడు. ప్రజలను నమ్మించడం, ఒప్పించడం కంటే మానేజ్ చేయడంపైనే ఆయన ధ్యాసంతా. ఇంతకాలం వీరి ఆటలు సాగాయి. కుట్రలు, కుతంత్రాలు విజయవంతమయ్యాయి. కానీ ఇప్పుడు తెలంగాణ జాగృతమైంది. లక్ష్యాన్ని, మార్గాన్ని గుర్తించగలిగిన చైతన్యం వచ్చింది. లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన. మార్గం మనందరికీ తెలిసిందీ-అత్యంత ప్రజస్వామికమైనదీ-ఎన్నికల్లో సరైన తీర్పును ఇవ్వడం. ఒకే వేటు, ఒకే ఓటు. విద్రోహ రాజకీయ పతాకాలు ఎగిరిపడాలి. అవకాశవాద జెండాలు, ఎజెండాలను పాతరవేయాలి. కాలం మనకో అవకాశం ఇచ్చింది.  కాటేయవలసిన తరుణం వచ్చింది.

ఒక అబద్ధం, వందమంది గోబెల్స్

చాలా కాలం క్రితం- 2003లో అనుకుంటాను- ఒక ప్రముఖ జర్నలిస్టు యథాలాపంగా ఒక గొప్ప సూత్రం చెప్పారు. అది చాల గొప్ప సూత్రమని తెలంగాణ ఉద్యమ సందర్భంగా నాకు మరింత బాగా అర్థం అయింది. అది తెలంగాణ రాష్ట్ర సాధన, కులాలు, అధికారాలపై చర్చ జరుగుతున్న సందర్భం. ఆయన చెప్పిన విషయం ఆయన మాటల్లోనే ‘‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని, సొంత రాజకీయ అస్తిత్వాన్ని సంపాదించుకోలేదు. సంపాదించుకున్నా నిలబెట్టుకోలేదు. తెలంగాణ వాళ్లు ఇంకా అమాయకత్వాన్ని అధిగమించి ఎదగలేదు. తెలంగాణ వాళ్లు అధికారంలోకి వచ్చినా మూన్నాళ్లకే వాళ్లకు తాటాకులు కట్టి గద్దె దింపేయగల శక్తులు వారికంటే బలంగా ఉన్నాయి. వాళ్లను ఎదర్కొనే సాధనాలేవీ తెలంగాణ వారి వద్ద లేవు’’ అని ఆయన అన్నారు. ‘‘ఏమిటా సాధనాలు? ఎందుకిలా జరుగుతోంది?’’.
‘‘వేదకాలం, ఇతిహాసకాలం, చరిత్ర, చివరకు ఆధునికాంధ్రప్రదేశ్ నేర్పిన పాఠం నీకు అర్థం అవుతుందా? సమాజంపై అధికారాన్ని, ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవడానికి, దానిని జస్టిఫై చేసుకోవడానికి అక్షరం అన్నది ఒక బలమైన ఆయుధం. ఆ ఆయుధాన్ని సమర్థంగా ఉపయోగించుకున్నవాళ్లే నాటినుంచి నేటి వరకు సమాజంపై నిరాటంకంగా పెత్తనం కొనసాగించగలుగుతున్నారు. మా విషయమే తీసుకోండి. వేదాలు, ఉపనిషత్తులు, మంత్రం, తంత్రం రాసుకున్నాం. మాకు మేము అతీంద్రియ శక్తులను, అలౌకిక శక్తులను ఆపాదించుకున్నాం. ఈ ప్రపంచమంతా మంత్రభూతమైందని, ఆ మంత్రం తెలిసినవాళ్లం మేమేనని, ఇక్కడ శాంతిగా బతకాలన్నా, దర్పంగా రాజ్యాలు ఏలాలన్నా మమ్మల్ని ప్రసన్నం చేసుకోవాలన్న స్పృహను సమాజం నిండా వ్యాప్తి చేశాం. మేము కేవలం అక్షరాన్ని, మంత్రాన్ని నమ్ముకున్నాం. చక్రవర్తులయినా మాకు సాష్టాంగపడవలసిందే. దేశాధినేతలయినా మా ఆశీర్వాదం పొందాల్సిందే. అది మా గొప్పతనం కాదు. మా అక్షరం గొప్పతనం. మేము సృష్టించుకున్న సాహిత్యం గొప్పతనం  వేల సంవత్సరాలయినా ఆ అక్షరాల మహిమ తగ్గలేదు చూశావా?’’.

‘‘రాజులయినా అంతే. ఇతిహాసం చూడండి. చరిత్రను చూడండి. మంచి రాజులుగా, స్వర్ణయుగకర్తలుగా, సాహితీ వల్లభులుగా చరిత్రలో మిగిలిపోయినవాళ్లెవరు? ఒక్కసారి గుర్తు చేసుకోండి. రుషి, పండిత, కవి, గాయకులను చేరదీసి సాంస్కృతిక పోషణ చేసిన వారు, తమ పాలనకు సమర్థనగా అపారమైన సాహిత్యాన్ని సృష్టించుకున్నవారు, స్వయంగా అక్షరాలతో సహవాసం చేసినవారు మాత్రమే చరిత్రలో యుగపురుషులుగా మనకు ఇవ్వాళ మిగిలిపోయారు. వారిని గురించి మాత్రమే బాగా చదువుకుంటాం. గొప్పగా చెప్పుకుంటాం. వారిని గురించి మాత్రమే ఇతిహాసం లేక చారిత్రక కథలు, గాధలు, ఆధారాలు తరతరాలకు అందుతూ వచ్చాయి. ఇన్ని వేల సంవత్సరాల్లో ఈ దేశాన్ని ఎంతమంది రాజులు, చక్రవర్తులు పరిపాలించి ఉంటారు? కానీ మహాభారత, రామాయణ పురుషుల సార్వకాలీనత, భోజరాజు గొప్పతనం, చంద్రగుప్తుని స్వర్ణయుగం, కష్ణదేవరాయల భువనవిజయం. . . ఇలా కొంతమంది గురించి మాత్రమే మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం… ఎందుకు?  మళ్లీ అక్షరమే  కారణం. వారు సృష్టించుకున్న సాంస్కృతిక ప్రతిష్ఠ, సమర్థన, స్థానం(కల్చరల్ ఫేసు, జస్టిఫికేషన్ అండ్ స్పేసే) కారణం. ఆధునిక యుగంలో సీమాంధ్ర రాజకీయ నాయకత్వం, పారిశ్రామిక నాయకత్వం, అందునా సీమాంధ్రకు చెందిన ఒక ప్రధాన సామాజిక వర్గం అటువంటి సాంస్కృతిక, సాహిత్య ఫేసు, స్పేసు సృష్టించుకుంది. ఆ ఫేసు, స్పేసుకోసం పుట్టినవే సీమాంధ్ర పత్రికలు, చానెళ్లు. తమకు అనుకూలంగా ఉన్నవారి పరిపాలనను జస్టిఫై చేసుకోవడానికి, తమకు నచ్చని వారిని ఎగతాళి చేసి ఎండగట్టడానికి ఈ పత్రికలు ఆది నుంచీ కృషి చేస్తూనే ఉన్నాయి. మహాకవి శ్రీశ్రీ అన్నట్టు ఈ పత్రికలు తలుచుకుంటే ‘అనకొండలను, గోలకొండలను దాచగలవు. గోరంతలను కొండంతలు చేయగలవు’. ఒక కులాధిపత్యాన్ని, ఒక ప్రాంతాధిపత్యాన్ని, ఒక నేత ఆధిపత్యాన్ని కాపాడడానికి ఈ మీడియా ఎటువంటి కుట్రలు చేయగలదో ఈ మూడు దశాబ్దాల అనుభవం చాలు. అవినీతి పరుడిని ధర్మరాజుగా చూపగలవు. నీతిమంతుడికి తాటాకులు కట్టి మంట పెట్టగలవు. జలగం వెంగళరావును మహానుభావునిగా చిత్రించి నాలుగేళ్లు ఊరేగించిన పత్రిక,  మర్రి చెన్నారెడ్డిని ఏడాది తిరగకుండానే చెన్నారెడ్డి చందాలరెడ్డి అని ముద్రవేసి సాగనంపేందుకు దోహదం చేయగలదు. నాదెండ్ల భాస్కర్‌రావును వెన్నుపోటుదారుగా చిత్రించి, ప్రజాస్వామ్య ఉద్యమం నడిపిన ఆ రెండు పత్రికలు, 1995లో అదే పనిచేసిన నారా చందబాబునాయుడిని ప్రజాస్వామ్య పరిరక్షకునిగా కీర్తించి నిలబెట్టగలవు. తిమ్మిని బమ్మి చేయడం, బమ్మిని తిమ్మి చేయడం అనాదిగా నడుస్తూనే ఉంది. ఆ పత్రికలు నంది అంటే నంది, పంది అంటే పంది. వాళ్లు రాసిందే చరిత్ర. వాళ్లు ఇచ్చేదే కాండక్ట్ సర్టిఫికెట్. తెలంగాణవాళ్ల దగ్గర ఒక పత్రిక లేదు. ఒక చానెల్ లేదు. మీరు ఏం చేయగలరు? మీ ఉద్యమాన్ని ఎలా కాపాడుకోగలరు? మీ మీద జరిగే దాడిని ఎలా తిప్పికొట్టగలరు? తెలంగాణలో బలమైన సాహితీ సృజన ఉంది. కానీ తెలంగాణ రాజకీయాలు, ఉద్యమాలు, అస్తిత్వ పోరాటాల ప్రతినిధిగా ఒక బలమైన సాంస్కృతిక మీడియం ఏది?’’. ఇదంతా ఆయన ఆందోళనతో చెప్పిన విషయమే. తరచి చూస్తే ఆయన చెప్పింది అక్షరాలా నిజమని తెలిసిపోతుంది. అనేకసార్లు రుజువయింది.

ఎనిమిదేళ్లు గడచిపోయాయి. తెలంగాణకు ఇప్పుడొక పత్రిక వచ్చింది. ఒక చానెల్ వచ్చింది. మరికొన్ని చానెల్‌లు కూడా తెలంగాణవాదాన్ని నిజాయితీగా రిపోర్టు చేస్తున్నాయి. ఈ పరిణామాన్ని సీమాంధ్ర నాయకత్వం, వారి ఆధిపత్యంలోని టీడీపీ, కాంగ్రెస్‌లు జీర్ణించుకోలేకపోతున్నాయి. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా, నమస్తే తెలంగాణ పత్రికకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాయి. నమస్తే తెలంగాణను నైతికంగా దెబ్బతీయడానికి వీళ్లు చేయని ప్రయత్నం లేదు. ప్రత్యర్థిని దెబ్బతీయడానికి వీరు మొదటి నుంచీ అనుసరించే విధానం ఒక్కటే.  ఇప్పుడూ అదే పద్ధతి అనుసరిస్తున్నారు. నిజాయితీగా యుద్ధం చేయడం చంద్రబాబు జాతకంలో లేదు. ఎదురొడ్డి పోరాడ్డం ఆయన నైజానికి విరుద్ధం. కుట్రలు, కుతంత్రాలు ఆయనకు బాగా అచ్చొచ్చిన మార్గం. ఆయన కుట్ర ఎలా ఉంటుందంటే  ‘ప్రత్యర్థిని దెబ్బతీయడానికి ఒక అబద్ధాన్ని సృష్టించు, వంద మంది గోబెల్స్‌ను తయారు చెయ్యి. ఆ ముఠాతో అదే అబద్ధాన్ని పదేపదే మాట్లాడించు. ఆ అబద్ధ ప్రచారకులు కూడా వీలైతే బడుగు బలహీనవర్గాలకు చెందిన వారయితే మంచిది. నోటిగదరోడయితే ఇంకా మంచిది. పత్రికలు, చానెళ్లలో ఆ అబద్ధానికి కొండంత ప్రచారం వచ్చేట్టు చూడు. పత్యర్థి ఒక నేత కావచ్చు, ఒక ఉద్యమం కావచ్చు. మరో పత్రిక కావచ్చు’. నాడు ఎన్‌టిఆర్ విషయంలో అయినా సరే, నేడు కేసీఆర్ విషయంలో అయినా సరే.

ఎవరి పోలవరం? ఎవరి టెండర్? టెండర్లు ఎలా వేస్తారు? డబ్బులు ఎప్పుడు వస్తాయి? తెలంగాణ ఉద్యమానికి, నమస్తే తెలంగాణకు,  పోలవరానికి ఏమిటి సంబంధం? కానీ సీమాంధ్ర నాయకత్వం, సీమాంధ్ర మీడియా లక్ష్యం ఉద్యమాన్ని, ఉద్యమకారుల నైతిక స్తైర్యాన్ని, నమస్తే తెలంగాణ నైతిక బలాన్ని దెబ్బతీయడం. అస్తిత్వంకోసం పోరాడుతున్న ఒక ప్రాంత ప్రజలపై సాగిస్తున్న అనైతిక యుద్ధంలో గెలవడమే తెలుగుదేశం, దాని అనుబంధ మీడియాకు ముఖ్యం. సత్యాసత్యాలు, నిజానిజాలు, ఉచ్ఛనీచాలు తర్వాత సంగతి. తడిగుడ్డలతో గొంతులుకోయడంలో వీళ్లు దిట్టలు. తెలంగాణ ఉద్యమం అదృష్టం-పోలవరం టెండర్ రద్దయి ఈ అబద్ధాల ముఠా నిజస్వరూపాన్ని బట్టబయలు చేసింది. కానీ ఒక అబద్ధాన్ని ఇంత నీచంగా మార్కెట్ చేయగలిగిన చందబాబును ప్రజలు ఇంకా ఎందుకు నమ్మాలి? ‘స్యూ’ కంపెనీకి నమస్తే తెలంగాణకు ఏ విధంగానూ సంబంధం లేదు. అది కృష్ణా జిల్లాకు చెందిన స్వర్గీయ వల్లూరిపల్లి నాగేశ్వర్‌రావు అనే పెద్దాయన ఎప్పుడో ఏర్పాటు చేసిన కంపెనీ. అందులో నమస్తే తెలంగాణ చైర్మన్‌కు ఉన్నది మూడు శాతం వాటా. కాంట్రాక్టర్లు, కార్పొరేట్లు, పవర్ బోకర్‌ల సిండికేట్ అయిన టీడీపీకి కంపెనీల గురించి, ప్రాజెక్టుల గురించి, టెండర్ల గురించి, ఆదాయాల గురించి తెలిసినంతగా మరెవరికీ తెలిసే అవకాశం లేదు. సీక్రెట్ కొటేషన్ ద్వారా టెండర్లు పిలవడం అంటేనే, అది తెరిచే దాకా ఎవరికి వస్తుందో తెలియదు. తెరిచిన వెంటనే ప్రభుత్వం ఆమోదించి, అప్పగించాలనీ లేదు. అప్పగించినా డబ్బులు వెంటనే రావు. ఇన్ని విషయాలు తెలిసీ, తెలంగాణ ఉద్యమాన్ని, సకల జనుల సమ్మెను వేలకోట్ల రూపాయలకు అమ్మేశారని, నమస్తే తెలంగాణ పోలవరం డబ్బులతో నడుస్తోందని మోత్కుపల్లి, ఎర్రబెల్లి వంటి వారు వాగడం, సీమాంధ్ర మీడియా వాటిని ప్రముఖంగా ప్రచురించడం-ఇవన్నీ అమాయకంగా జరిగేవి కాదు. ఒక ప్రాంతం, ఒక కులం, కొందరు నేతలు మీడియాను అడ్డం పెట్టుకుని తెలంగాణకు వ్యతిరేకంగా సాగిస్తున్న అధర్మ, అనైతిక, కుట్రపూరిత యుద్ధంలో భాగం ఈ ప్రచారం. అయితే తెలంగాణ ఒకప్పటి అమాయకత్వంలో ఇప్పుడు లేదు.చంద్రబాబు ఎప్పుడు ఏ జూదం ఎందుకు ఆడతాడో, ఏ కీలుబొమ్మకు ఎప్పుడు కీ ఇస్తాడో, మోత్కుపల్లి, ఎర్రబెల్లి వంటి బొమ్మలు ఎందుకు మాట్లాడతాయో ఇప్పుడు తెలంగాణవాదులు తేలికగానే అర్థం చేసుకుంటున్నారు.  తెలంగాణకు ఇప్పుడు అనేక ఆయుధాలు ఉన్నాయి. ఒకనాడు ఆ జర్నలిస్టు  ఆశించినట్టు తెలంగాణకు ఇప్పుడు సాంస్కృతిక ఫేసూ, స్పేసూ ఆవిర్భవించాయి. కుట్రలను పసిగట్టగల నేర్పు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఉంది. ఆలస్యం అయితే కావచ్చు, కానీ అంతిమ విజేత తెలంగాణ ఉద్యమమే.

కజిన్ హజారేలు!

అద్దాల మేడలో కూర్చున్నవారు లోకంపైకి
రాళ్లు విసిరితే ఏమవుతుంది?
సవాలక్ష కుంభకోణాలకు సారథులు
అవినీతి బాగోతాలకు ఆదిగురువులు
నీతిశాస్త్రం బోధించడం మొదలుపెడితే ఎవరు వింటారు?
సకల అవలక్షణాలతో ప్రజల ఛీత్కారానికి గురైనవారు
అన్నా హజారేకు కజిన్‌లమని
గాంధీకి మనవళ్లమని చెప్పుకుంటూపోతే
జనం ఏమనుకుంటారు?
అవతలి వాడు బొందలో పడ్డాడని
పత్రికలూ, పార్టీలూ కలసి నిస్సిగ్గుగా తీన్‌మార్ ఆడితే
విధి చూస్తూ ఊరుకుంటుందా?
కుడి ఎడమల పారిశ్రామికవేత్తలను,
ముందు వెనుకల కాంట్రాక్టర్లను
నెత్తిపైన దళారీలను పెట్టుకున్నవారు
ఎదుటివాడి గుండుపై ఈకలు పీకాలని చూస్తే
అదేపనిగా అబద్ధాలవర్షం కురిపిస్తూ పోతే
ఏదోఒకరోజు పాపం పండకపోతుందా?
ప్రచారంతో, పటాటోపాలతో ప్రజలను
ఏమైనా చేయవచ్చునని, ఏమార్చవచ్చునని నమ్మేవారికి
గుణపాఠం చెప్పేకాలం రాకపోతుందా?

‘బాబు మీద ఎన్నో కేసులు వేశారు. ఎప్పుడో కొట్టేశారు. ఇప్పుడు వేస్తున్న కేసూ అటువంటిదే’ అని తెలుగు తమ్ముళ్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కొట్టేసిన కేసుల జాబితానొకదానిని విడుదల చేశారు. అందులో ఒక కీలకమైన సమాచారం ఉంది. ఆ జాబితాలో పేర్కొన్న కేసుల్లో రెండు తప్ప మిగిలినవన్నీ  రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్రంలో ఎన్‌డిఏ ఏలుతున్న కాలంలో వేసినవే. కోర్టులు కొట్టివేసిందీ దాదాపు ఆ కాలంలోనే.

ఉష్ట్రపక్షుల ప్రేలాపనలు
పెట్టుబడికి, కట్టుకథకు పుట్టిన
వక్ర చరిత్ర పురుషులారా!
అసత్యానికి, ఆధిపత్యానికి
అవతరించిన మేధావులారా?
విద్వేషం ఆకృతి పోసుకున్న
విశాలాంధ్ర పెద్దమనుషులారా!
ఇక్కడ దశాబ్దాలుగా జరుగుతున్న
నరమేధం మీ కళ్లకు కనిపించడం లేదా?
మీ సమైక్యతలోని డొల్లతనాన్ని
మీ విద్వేషం తెలియజేస్తుంది!
మీ విశాలతలోని సంకుచితాన్ని
మీ అబద్ధాలు పట్టిస్తున్నాయి!
మీ చరిత్రలోని కాల్పనికతను
మీ రాతలు బట్టబయలు చేస్తున్నాయి!
మీ విశాలాంధ్ర ఇంకే మాత్రం
మమ్మల్ని మోసం చేయలేదు!

ఇంకా ఏమి రుజువులు కావాలి?
గత నాలుగు మాసాల్లో ఆత్మహత్యలు చేసుకున్న 180 మంది రైతుల్లో 143 మంది తెలంగాణవారే ఎందుకున్నారు?
1995 నుంచి 2010 వరకు ఆత్మహత్యలు చేసుకున్న 31120 మంది రైతుల్లో 70 శాతం మంది తెలంగాణ వారే ఎందుకయ్యారు?
1985లో అఖిలపక్షం తీర్మానం మేరకు ప్రారంభించిన పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ అనేక బాహువులతో 44000 క్యూసెక్కుల నీటితో మూడు కాలువలు-తెలుగు గంగ, కుడికాలువ, కడప-కర్నూలు కాలువల ద్వారా రిజర్వాయర్లలోకి ప్రవహిస్తుంటే, అదే తీర్మానంలో ఆమోదం పొందిన ఎస్‌ఎల్‌బీసీ ఇంకా ఎందుకు పూర్తి కాలేదు? ఛిద్రమైన అవయవాలతో, మొండి దేహాలతో ఇంకా నల్లగొండ ఎందుకు భారంగా జీవితాన్ని ఈడ్చుతోంది? ఇచ్చంపల్లి ఎందుకు మొదలు పెట్టలేదు? భీమా ప్రాజెక్టు ఎందుకాగిపోయింది? జూరాల నీటి నిల్వ సామర్థ్యం రెండు దశాబ్దాల తర్వాత కూడా ఎందుకు పెరగలేదు? రాజోలిబండ మహబూబ్‌నగర్ గొంతులు ఎందుకు తడపడం లేదు? శ్రీరాంసాగర్‌కు పురిట్లోనే సంధికొట్టిందెవరు?

మీరు మాట్లాడుతున్నది జీడీపీ లెక్కల గురించే కదా!
రంగారెడ్డి జిల్లా జనాభా డివైడెడ్ బై రామోజీ ఫిల్మ్ సిటీ ప్లస్ సంఘీనగర్ ప్లస్ శంశాబాద్ విమానాశ్రయం ప్లస్ జీవీకే ఫామ్ హౌజ్ ప్లస్ లహరి రిసార్టు ప్లస్ ప్రగతి రిసార్ట్సు ప్లస్ నగరం చుట్టూ పరుచుకున్న వేలాది ఎస్టేట్లు ప్లస్ వందలాది పరిశ్రమల విలువ ప్లస్ రంగారెడ్డి జిల్లా ప్రజల ఆస్తుల విలువ ఈజ్ ఈక్వల్టు రంగారెడ్డి జిల్లా పౌరుని తలసరి ఆదాయం. పోయిన ఏడాదికి, ఈ ఏడాదికి  ఒక పౌరుని తలసరి ఆదాయంలో వచ్చే మార్పు అభివృద్ధి రేటు. ఈ లెక్కలు చూస్తే బ్రహ్మాండంగా ఉంటాయి. తలసరి ఆదాయం మూడు రెట్లు నాలుగు రెట్లు పెరుగుతుంది. కానీ బాబూ ఈ ఆస్తులెవరివి? ఈ ఎస్టేట్లు ఎవరివి? ఈ కంపెనీలు ఎవరివి? ఎవరి సంపదను ఎవరి ఖాతాలో చూపుతున్నారు? ఏది అభివృద్ధి అని చెబుతున్నారు? ఎవరిని మోసం చేస్తారు? ఒక్క రంగారెడ్డి జిల్లాయే కాదు మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ జిల్లాల తలసరి ఆదాయాలను, అభివృద్ధి రేట్లను లెక్కించింది ఇలాగే! మీ స్టాటిస్టిక్స్ మీ మోసాన్ని, ద్రోహాన్ని కప్పి పుచ్చుకోవడం కోసం మీరు సృష్టించుకున్న పెద్ద అబద్ధం! కేంద్రాన్ని మోసం చేయవచ్చు, కానీ తెలంగాణ ప్రజలను ఇంకేమాత్రం మోసం చేయలేరు!

మీ నాయకులేం చేశారని ప్రశ్నిస్తున్నారు కదూ!
ఎవరిని బతకనిచ్చారు? ఐదేళ్లూ పూర్తిగా పరిపాలించిన ఒక్క తెలంగాణ నేతను చూపించండి ఈ యాభైయ్యేళ్లలో!  రాకరాక వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి పీవీ నరసింహారావును పట్టుమని పదిహేను మాసాలు కూడా పనిచేయనివ్వని జై ఆంధ్ర ఉద్యమ చరిత్ర తమరిది. అవినీతికి, అణచివేతకు, అక్రమాలకు పేరుగాంచిన జలగం వెంగళరావును ఈనాడు పల్లకీలో సకల మర్యాదలతో ఊరేగించిన రామోజీరావు, వచ్చిన ఏడాదిలోనే చెన్నారెడ్డిని చెందాలరెడ్డి అని ముద్రవేసి, పత్రికల్లో పతాక శీర్షికల్లో ఆగంపట్టించి పంపడం గుర్తులేదా? మీరు రాసింది చరిత్ర, మీరు చూసింది చరిత్ర, మీరు చెప్పింది చరిత్ర! మా అంజయ్యను ఏకంగా జోకరుగా చిత్రించిన దుర్మార్గ రాజకీయం తమరిది. 1989లో మళ్లీ వచ్చిన చెన్నారెడ్డిని గద్దెదింపడానికి ఏడాది తిరగకుండానే  హైదరాబాద్‌లో మతకల్లోలాలు సృష్టించి రోడ్డపై రక్తపుటేరులు పారించిన దాష్టీకం తమరిది! రాజకీయ వెన్నుపోట్లను, విద్రోహాలను ఒకసారి ప్రజాస్వామ్యంగా, మరోసారి అప్రజాస్వామ్యంగా నమ్మించగల జాణతనం మీ మీడియాది. అవినీతిని, అక్రమాలను, ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలను తమకిష్టమైతే అందమైన తివాచీల కింద దాచిపెట్టగలరు. ఇష్టంకానివాడు అధికారంలోకి వస్తే వచ్చిన వారానికే తాటాకులు కట్టగలరు.

ఎవరిది ప్రజాస్వామ్యం?
‘తెలంగాణపై ప్రజారాజ్యం పార్టీకి ఉన్నంత స్పష్టత మరెవరికీ లేదు. కుటుంబంలో సోదరుల మాదిరిగా రాష్ట్రాన్ని విభజించాలని మేము కోరుతున్నాం. మేము తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, ఆత్మాభిమానాలను గౌరవిస్తున్నాం. విభజన అనివార్యమైతే మేము ఎప్పుడు అడ్డుపడబోము’- 2008 అక్టోబరు 16న నిజామాబాద్‌లో ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధిగా పరకాల ప్రభాకర్ మాట్లాడిన మాటలివి. ప్రజారాజ్యం పార్టీ మ్యానిఫెస్టో కమిటీలో అప్పట్లో ఈయనే రింగు మాస్టర్. సామాజిక తెలంగాణ ఏర్పాటుకు ప్రజారాజ్యం పార్టీ కట్టుబడి ఉంటుందని మ్యానిఫెస్టోలో పొందుపర్చడంలో కూడా ఈయన ప్రధాన పాత్ర పోషించారు. తీరా ఎన్నికల సమయంలో టిక్కెట్ రాకపోయేసరికి ప్రత్యర్థి పార్టీలకు అమ్ముడుపోయి, తిన్నింటి వాసాలు లెక్కపెట్టి, అదే పార్టీ ఆఫీసులో చిరంజీవిని నానాబూతులు తిట్టి, పలాయనం చిత్తగించిన నీతిబాహ్యుడు పరకాల!  ఇంత ఘనచరిత్ర కలిగిన పెద్ద మనిషి ఇప్పుడు విశాలాంధ్ర గురించి చెప్పుకోవడానికి ప్రజాస్వామ్యం కావాలని, హక్కులు కావాలని అడుగుతున్నాడు. మాటమార్చినవాడు, మడమతిప్పినవాడు, నీతితప్పినవాడు, అప్రజాస్వామికంగా వ్యవహరించినవాడు ప్రజాస్వామిక హక్కులకు అర్హుడేనా? అన్ని పార్టీలు అంగీకరించి నమ్మకద్రోహం చేసిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలు సహనం కోల్పోకుండా వ్యవహరిస్తున్నారు. అయినా విశాలాంధ్ర పేరిట ఆంధ్రా ఆధిపత్య జీలట్స్ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. వారి కుట్రలు ఎప్పటికీ ఫలించవు!

పాలసీ పెరాలిసిస్
‘ప్రభుత్వాలు విధానపరమైన పక్షవాతం(పాలసీ పెరాలిసిస్)తో సతమతమవుతున్నాయి’ అని ముఖేశ్ అంబానీ అన్న సందర్భం వేరు, కానీ కేంద్రం విషయంలో అది ముమ్మాటికీ నిజం. రాజనీతిజ్ఞుల కంటే రాజకీయ మరుగుజ్జులు ఇప్పుడు కేంద్రాన్ని పాలిస్తున్నారు. శాసిస్తున్నారు. డైనమిజం, ధీరోదాత్తత, స్థిరచిత్తం, ధైర్యం ఇవేవీ యూపీఏ నాయకత్వంలో కనిపించవు. ఆ మధ్య ఒక అంతర్జాతీయ సర్వేలో అత్యంత వయస్సు పైబడినవారు పరిపాలిస్తున్న దేశాల్లో మనం అగ్రస్థానంలో ఉన్నట్టు వెల్లడయింది. మెమొరీ లాస్, ఊగిసలాట, దృష్టిలోపం ఈ ప్రభుత్వాన్ని పీడిస్తున్నాయి.

‘అధికార వికేంద్రీకరణ, పరిపాలనా సౌలభ్యం కోసం, సమర్థమైన, జవాబుదారీ పాలన అందించడంకోసం చిన్న రాష్ట్రాలు ఉత్తమ మార్గమ’ని చాలా కాలంగా రాజనీతిశాస్త్ర పండితులు, రాజ్యాంగ నిపుణులు సూచిస్తున్నారు. ‘నిర్వహణ దుర్లభంగా మారిన పెద్ద రాష్ట్రాలకు పరిష్కారం దేశాన్ని 40 రాష్ట్రాలుగా విభజించడమే’ అని రాజనీతి శాస్త్రవేత్త రజనీ కొఠారి 1976లోనే ప్రతిపాదించారు. ‘ కేంద్రీకృతమై అచేతనంగా మారిన కాలం చెల్లిన సమాఖ్య వ్యవస్థ స్థానంలో సమతుల, సహకార, సమకాలీన సమాఖ్య వ్యవస్థను ఆవిష్కరించాల’ని, అందుకోసం ‘దేశాన్ని 58 రాష్ట్రాలుగా విభజించాల’ని ప్రొఫెసర్ రషీదుద్దీన్ ఖాన్ 1992లో ‘ఫెడరల్ ఇండియా: ఎ డిజైన్ ఫర్ చేంజ్’ అనే గ్రంథంలో సూచించారు. లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాష్ సి కాశ్యప్ 1992లో పది లోక్‌సభలపై ఒక గ్రంథాన్ని రాస్తూ, ‘దేశాన్ని 50 నుంచి 60 సమాన స్థాయి రాష్ట్రాలుగా విభజించాల’ని సూచించారు. కానీ రాజకీయ ప్రయోజన దృష్టి తప్ప రాజనీతిజ్ఞత లేని నాయకులు, అవకాశవాదంతో ఏపూటకామాట మాట్లాడడం తప్ప ఒక విధానపరమైన నిబద్ధత లేని నాయకులు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కొలువై ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడు వీరిని తిరస్కరించడం తప్ప తెలంగాణకు విముక్తి లేదు.

ఇచ్చేవాళ్లు కానప్పుడు ఈ జాతరలెందుకు?

‘తెచ్చేది మేము కాదు, ఇచ్చేది మేము కాదు, మా అభిప్రాయాలెందుకు’ అని తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పదేపదే చెబుతున్నారు. ఇది నిజమేనా? ఇది నిజమయితే ఈ పార్టీలు దీక్షలు, యాత్రలు, పోరుబాటలు, ఉద్యమాలు చేయడం ఎందుకు? ఉద్యమాల లక్ష్యం ఏదైనా అంశంపై ఒక స్పష్టమైన విధానం తీసుకుని, ఆ విధానం అమలుకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, పని జరిగేట్టు చూడడం. తెలుగుదేశం రైతు పోరుబాట అని ఊరేగుతుంటే, వైఎస్సార్ కాంగ్రెస్ రైతు దీక్ష అని జాతర నిర్వహిస్తోంది. ఈ రెండు పార్టీల నాటకం ప్రజల్లో అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. తెలంగాణ తెచ్చే సామర్థ్యం, లేక ఇచ్చే సామర్థ్యం, లేక కనీసం ఒక నిశ్చితాభిప్రాయాన్ని చెప్పే దమ్ము లేని పార్టీలు రైతులను ఉద్ధరిస్తాయంటే ఎలా నమ్మడం? రెతులకు గిట్టుబాటు ధ ర ఇచ్చేది ే ంద్రమే, తెచ్చేది కేంద్రమే అయినప్పుడు ఈ రెండు పార్టీలు తగుదుమమ్మా అంటూ ఊరేగింపులు చేయడం ఎందుకు? ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది, ప్రాజెక్టు పనులు అమలు చేయించేది కేంద్రమే అయినప్పుడు పాదయాత్రల పేరుతో తెలుగుతమ్ముళ్ల పగటివేషాలు ఎందుకు? తెలంగాణ సాధించలేని వారు ఏదైనా సాధించగలరా?

ఈ రెండు పార్టీలు మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉంటామంటూ ఎన్నికల మానిఫెస్టోలో పెట్టింది. 2009 డిసెంబరు 7న అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తీర్మానం పెడితే మద్దతు ఇస్తామని స్వయంగా చంద్రబాబు సవాలు విసిరారు. 2009 డిసెంబరు 8న అఖిలపక్ష సమావేశంలో అశోకగజపతిరాజు నాయకత్వంలో తెలుగుదేశం ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంగీకారం తెలుపుతూ సంతకాలు చేశారు. ఆ మరుసటి రోజు డిసెంబరు 9న కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. అదేరోజు రాత్రి చంద్రబాబునాయుడు ‘తమిళనాడుకు చెందిన చిదంబరం, కర్నాటకకు చెందిన వీరప్పమొయిలీ అర్ధరాత్రి ఇటువంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని’ అడ్డం తిరిగారు. అంతటితో ఆగలేదు. ఆయన ఆదేశాలతోనే మరుసటిరోజు ఉదయం పయ్యావుల కేశవ్, దేవినేని ఉమ తెలంగాణ ఏర్పాటు చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరికలు చేశారు. తెలుగుదేశం కార్యాలయం నుంచి సరఫరా అయిన రాజీనామా లేఖల కామన్ ఫార్మాట్‌లో ఆంధ్రాకుచెందిన తెలుగుదేశం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామాలేఖలు సమర్పించారు. చంద్రబాబు నాయుడు పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి తాను తిలోదకాలు ఇవ్వడమే కాదు, కేశవ్, ఉమ వంటి వారికి పార్టీలో పెద్ద పీట వేశారు.  పార్టీ విధానాలను ఉల్లంఘించిన వారికి కిరీటాలు, పార్టీ విధానానికి కట్టుబడి ఉండాలని చెప్పినవారికి బహిష్కార పత్రాలు. ఇటువంటి విపరీత బుద్ధిని ప్రశ్నించినందుకు నాగం జనార్దనరెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించారు. అంటే చంద్రబాబునాయుడుకు మాటతప్పే జబ్బు ఎప్పటి నుంచో ఉంది.

ఎన్‌టిఆర్ మద్యనిషేధం అమలు చేస్తే, చంద్రబాబు ఆ విధానాన్ని తుంగలో తొక్కి మద్యం బజార్లను ప్రవేశపెట్టారు. ఎన్‌టిఆర్ బియ్యంపై సబ్సిడీ ఇస్తే చంద్రబాబు ధర పెంచి పేదల నోట మట్టికొట్టారు. ఎన్‌టిఆర్ విద్యుత్ సబ్సిడీ అమలు చేస్తే, ఉచిత విద్యుత్తు రైతులను సోమరులను చేస్తుందని, విద్యుత్ చార్జీలు పెంచారు. విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినవారిపై తూటాలు కురిపించి ముగ్గురిని బలిగొన్నారు. కమ్యూనిజానికి కాలం  చెల్లిందని ఇక భవిష్యత్తు అంతా టూరిజానిదేనన్నారు. తెలంగాణ ప్రజాల ఆకాంక్షలను గుర్తిస్తూ, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నామని  చెప్పారు. ఇవన్నీ అధికారంలో ఉనప్పటిమాటలు. అధికారం కోల్పోయి, రెండోసారీ ఛీత్కరించబడి, నానాటికీ పతనమవుతున్న అదే చంద్రబాబు ఇప్పుడు ఏంచేస్తున్నారు? ఏమని హామీలు ఇస్తున్నారు? ఎలా మాట మారుస్తున్నారు? తెలంగాణపై రెండు కళ్ల సిద్ధాంత మట. ఎక్కడివాళ్లు అక్కడ ఉద్యమాలు చేసుకోవచ్చునట. రెండు ప్రాంతాల వారిని ఫోరమ్‌లు ఏర్పాటు చేసుకుని పోరాడమని తానే చెప్పారట. కానీ తాను చెప్పిందే ఫైనల్ విధానమనీ ఈ పెద్ద మనిషి చెబుతారు. సందులో మందుగా తెలుగు ప్రజల ఐక్యతకోసం కూడా ఉద్యమిస్తాడట. ఇప్పుడు చెప్పండి ఆయన నిజస్వరూపం ఏమిటో! మద్యం అమ్మకాలను నియంత్రిస్తాడట. బెల్టు షాపులు ఎత్తేస్తాడట. ఉచిత విద్యుత్ ఇస్తాడట. రైతు రాజ్యం స్థాపిస్తాడట. ఉచిత బియ్యం ఒక్కటే మిగిలి ఉంది. ఇంటింటికీ క్యాష్ పంచుతానని ఇంతకు ముందే హామీ ఇచ్చాడు. టూరిస్టుల కంటే హీనంగా చూసిన కమ్యూనిస్టులను ఇప్పుడు సందు దొరికితే సంకలో వేసుకోవడానికి పడని పాట్లు లేవు. అంతేకాదు దేశంలో తనంత శుద్ధపూస లేడంటూ అన్నా హజారేకు తమ్మునిలాగా బిల్డప్ ఇస్తున్నారు.

సందర్భం వస్తే ఇదే చంద్రబాబు మళ్లీ మాట మార్చడన్న గ్యారెంటీ ఏమీ లేదు. అధికారం కోసం తెలంగాణ ఓట్లు సీట్లు అవసరమైతే జై తెలంగాణ అనడన్న హామీ కూడా ఏమీ లేదు. నమ్మిన రైతులను నట్టేట ముంచడని ఎలా అనుకోవడం? బ ల్టు షాపులకు వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలను కాంట్రాక్టర్లతో కొట్టించడని ఎలా నమ్మడం? విద్యుత్ చార్జీలు పెంచడని ఎందుకు విశ్వసించాలి? మాటమీద నిలబడలేని వాడిని మహానుభావుడిగా ఎంతకాలం వర్ణిస్తారు? ఇచ్చిన హామీలకు కట్టుబడనివాడు అసలు ప్రజానాయకుడెలా అవుతాడు? విధాన నిబద్ధత లేనివాడిని సూత్రబద్ధ నాయకునిగా ఎలా కీర్తించడం? వెన్నుపోటుకు నిర్వచనమైన మనిషిని రాజనీతిజ్ఞునిగా ఎలా అంగీకరించడం? ప్రజాస్వామిక ప్రక్రియను మధ్యలో ధ్వంసం చేసినవాడిని ప్రజాస్వామిక వాదిగా ఇంకా ఎలా భరించడం? అబద్ధం ఆయుధం చేసుకున్నవాడిని నీతిమంతుడని ఎలా విశ్వసించడం? చంద్రబాబు నాయుడు నమ్మకద్రోహానికి ప్రతీక. విశ్వాసరాహిత్యానికి చిరునామా.  ఆయన అవినీతిలో సుఖ్‌రామ్! అవకాశవాదంలో రాంలాల్!

అవకాశవాదం, నమ్మకద్రోహం విషయంలో జగన్ మోహన్‌రెడ్డి చంద్రబాబుకు ఏమాత్రం తీసిపోడు. తొలుత తెలంగాణను అడ్డుకున్నదే రాజశేఖర్‌రెడ్డి. తెలంగాణ ఉద్యమాన్ని చీల్చి తెలంగాణవాదాన్ని నానా తెర్లు పట్టించిందే రాజశేఖర్‌రెడ్డి. 2009లో తెలంగాణలో ఎన్నికలు పూర్తికాగానే నంద్యాలలో ఆంధ్రావాళ్లను రెచ్చగొట్టే ప్రసంగం చేసిందీ రాజశేఖర్‌రెడ్డే. ఆయన తెలంగాణవాదాన్ని ఉపయోగించుకుని పైకి వచ్చి, అదే వాదాన్ని అతిదుర్మార్గంగా అణచివేసే ప్రయత్నం చేశారు. ఆయన తనయుడుగా జగన్‌మోహన్‌రెడ్డి ఆ పాపాలను కడిగేసుకునే ప్రయత్నం ఏదీ చేయలేదు. ఆయన లాగే ఈయనా గోడమిది పిల్లివాటంగా తెలంగాణతో ఆడుకోవాలనుకుంటున్నారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరిని ప్రకటించని ఏ నాయకుడినీ ప్రజానాయకునిగా, రాజనీతిజ్ఞునిగా భావించలేము. తెలంగాణపై డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నాడంటే ఇక్కడి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడన్నమాటే. తెలంగాణ సాధనకోసం ఏమీ చేయనివాడు రైతులకోసం ఏదో చేసిపెడతాడని ఎవరయినా నమ్మితే వారు అమాయకులయినా కావాలి, రాజకీయ అవకాశ వాదులయినా కావాలి. తెలంగాణపై ఒక విధానం లేని వారికి, రైతు సమస్యలపై ఒక విధానం ఉండే అవకాశమే లేదు. ఉద్యమాలు, దీక్షలు, యాత్రలు ఉత్త వేషాలు, నటనలు, నయవంచనలు.

పప్పెట్ షో
తోలుబొమ్మలాట మనకు తెలుసు. ప్రధాన కథకుడు ఉంటాడు. బొమ్మలను ఆడించేవారుంటారు. కేతిగాడితో సహా బొమ్మలు అనేకం ఉంటాయి. కథకు తగినట్టుగా సంగీతాన్ని సమకూర్చే హార్మోనియం, తబలా, తాళాలు ఉంటాయి. చంద్రబాబు పప్పెట్ షోలో తెలంగాణ తమ్ముళ్లు పాత్రధారులు. కిరణ్‌కుమార్ పప్పెట్ షోలో చంద్రబాబు, జగన్ కూడా పాత్రధారులు. ఎన్‌టిఆర్ భవన్‌లో ఒక షో నడుస్తూ ఉంటుంది. తెలంగాణ కార్యక్షేత్రంలో మరో షో నడుస్తూ ఉంటుంది. ఎక్కడి కేతిగాడు అక్కడే. ఎక్కడి పాత్రలు అక్కడే. ఈ పప్పెట్ షోల లక్ష్యం తెలంగాణవాదం దెబ్బతిన్నదని చాటిచెప్పడం. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నవారిపై బురదజల్లడం, ప్రజల్లో వారిని పలుచన చేయడం. ఎన్‌టిఆర్ భవన్‌లో ఒక కేతిగాడు వస్తాడు. మురుగు కాలువను తలపించే ఆయన మాటల ప్రవాహం తెలంగాణ అంతటా దుర్గంధం ప్రసరింపజేస్తుంది. ఆ తర్వాత మరో కేటుగాడు వస్తాడు. ఆయన అబద్ధాలు వింటే గోబెల్ కూడా సిగ్గుపడేవాడు. మరో తుప్పిర్ల రాయుడు వస్తాడు. చంద్రబాబు చేతిలో బొమ్మ. స్కీమింగ్, గేమింగ్ అంతా బాబుగారిదే. వీరి దుర్భాషితాలన్నీ మోసుకెళ్లి ప్రధాన శీర్షికలకు ఎక్కించడానికి మీడియా జాకీలు ఉంటాయి. నానాటికీ పతనమవుతున్న తెలుగు దేశాన్ని లేపి నిలబెట్టడానికి మీడియా జాకీలు చేయని ప్రయత్నం లేదు. బాబును కొండంత చేసి చూపడం, ప్రత్యర్థులను చిన్న చేసి చూపడం ఈ జాకీల జాణతనం. వెన్నుపోటును ప్రజాస్వామ్యంగాను, ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటుగా నమ్మించగల నేర్పరులు వీరు. చంద్రబాబు రాజకీయ దండయాత్ర ‘విజయవంతమైంద’నీ, జనం తండోపతండాలుగా వచ్చారని, తరలి వచ్చిన జనాన్ని చూసి ఆనందంతో తెలుగు తమ్ముళ్లు కిందబడి గిలగిలా కొట్టుకున్నారని మీడియా జాకీలు పులకించిపోయారు. చంద్రబాబు సభతో తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహం ఇనుమడించిందనీ, గతించిన తెలుగు వైభవం మళ్లీ వెతుక్కుంటూ వచ్చి, చంద్రబాబు గడపలో నిలబడిందనీ మీడియా ఆనందపడిపోయింది. అబద్ధాన్ని పదేపదే చెబితే ప్రజలు అదే నిజమని నమ్ముతారని వీరికి గొప్ప విశ్వాసం. వీరందరి లక్ష్యం తెలంగాణకోసం ఉద్యమం కాదు. తెలంగాణ మీద ఉద్యమం. ఉద్యమం చేస్తున్నవారిపై దండయాత్ర. కిరణ్ షో లక్ష్యం వేరు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. బాబు, జగన్‌లు ఆయన షోలో పాత్రధారులు. వీరి యాత్రలు విజయవంతమైతే, ‘చూశారా తెలంగానవాదం చల్లారిపోయింది. ఎలా అదుపు చేశానో’ అని చాటుకోవచ్చు. యాత్రలు విఫలమై, ఏదయినా రచ్చయితే ‘ఆ పాపమంతా చంద్రబాబు మీదో, జగన్ మీదో నెట్టి వేయవచ్చు’. అందుకే ప్రధానికి మించిన పోలీసు భద్రతను చంద్రబాబుకు కల్పిస్తారు. జగన్ యాత్రకు ఏ అవరోధాలూ రాకుండా చూసుకుంటారు. అందరి లక్ష్యం తెలంగాణను దెబ్బకొట్టడమే. తెలంగాణను అడ్డుకోవడమే.

తెలంగాణ ఏర్పడాలంటే ముందుగా ఇక్కడి రాజకీయాలు ఆంధ్రా ఆధిపత్య రాజకీయాల నుంచి విముక్తి పొందాలి. ఆంధ్రా నాయకత్వంలోని పార్టీల సంకెళ్ల నుంచి ఇక్కడి రాజకీయ నాయకులు స్వేచ్ఛను పొందాలి. రాజకీయ బానిసత్వం నుంచి విముక్తి పొందనిదే రాష్ట్రాన్ని సాధించుకోలేము. సొంత రాజకీయ అస్తిత్వం లేకపోతే ఏ నాయకుడూ మనజాలడు. ఎన్ని పార్టీలయినా పర్వాలేదు-కొత్త రాజకీయ శక్తులు అవతరించాలి. రాజకీయ శక్తుల పునరేకీకరణ జరగాలి.

తెలంగాణ చార్జి షీట్ :ఇవి ఆత్మహత్యలు కాదు, హత్యలే

తెలంగాణకోసం జరిగిన ఆత్మహత్యలన్నీ హత్యలే. నిజమే. కానీ హంతకులెవరు? 2009 డిసెంబరు 9 తర్వాతనే ఆత్మహత్యలు ఎందుకు మొదలయ్యాయి? యువకాశల నవపేశల సుమగీతావరణంలో హోరెత్తాల్సిన యువకెరటాలు అగ్నికీలల్లో దూకి కాలిపోవలసిన అగత్యం ఎందుకు వచ్చింది? తెలంగాణ యువకుల హృదయాలను ఛిద్రం చేసిన శక్తులేవి? తెలంగాణ స్వప్నాన్ని భగ్నం చేసిన ధూర్తులు ఎవరు? తెలంగాణ ఇస్తమని మాటతప్పిన మారీచులు ఎవరు? వచ్చిన తెలంగాణకు అడ్డంపడిన సైంధవులెవరు? తెలంగాణ శ్రేణులు ఏకోన్ముఖంగా ఉద్యమిస్తుంటే సీమాంధ్ర నేతల గులాములుగా ఉద్యమంపైకి విషం చిమ్మి, ఉన్మాద ప్రేలాపనలతో గందరగోళం సృష్టించిన ఇంటిదొంగలు ఎవరు? తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వికృత కథనాలను, అబద్ధాల పంచాంగాలనూ ప్రచురించి పిల్లల మనసును గాయపరిచిన పత్రికలు, చానెళ్లు ఏవి? తెలంగాణలో 700 మందిని బలితీసుకున్నవారిపై, తెలంగాణకు అడ్డం పడినవారిపై, తెలంగాణ ఉద్యమంలో గందరగోళం సృష్టించాలనుకుంటున్నవారిపై చార్జిషీటు దాఖలు చేయాల్సివస్తే, అది ఎలా ఉంటుంది? నిందితుల జాబితా ఎలా ఉంటుంది? మొదటి ముద్దాయి ఎవరు? చివరి ముద్దాయి ఎవరు? అభియోగాలు ఏమిటి?

అభియోగాలు ఏవి?

రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ ఏకాభ్రిపాయం ప్రాతిపదికగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించి, ఆ మరుసటి రోజే మాట తప్పి, తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం తలపెట్టడం.

తెలంగాణపై అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మాటతప్పి తెలంగాణ యువకులను నిరాశా నిస్పృహలకు గురిచేసి, వారిని ఆత్మహత్యలకు పురికొల్పడం. 700 మందికి పైగా యువకుల ఆత్మహత్యలు, కాదు హత్యలకు కారణం కావడం.

2009 డిసెంబరు 9కి ముందు వరకు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన సీమాంధ్రుల నాయకత్వంలోని పార్టీలు రాత్రికిరాత్రి మాటమార్చి రాజీనామాల డ్రామాతో ప్రజాస్వామిక ప్రక్రియకు భంగం కలిగించడం.

ఎన్నికల మ్యానిఫెస్టోల్లో, శాసనసభ వేదికల్లో, పార్లమెంటులో ఇచ్చిన హామీలను వమ్ము చేసి కాంగ్రెస్, టీడీపీలు ప్రజాస్వామ్య ద్రోహానికి, రాజ్యాంగ ద్రోహానికి పాల్పడడం.

సీమాంధ్ర రాజకీయ పార్టీలు, నాయకుల ప్రయోజనాలకు అనుకూలంగా, తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమ శ్రేణుల్లోనే గందరగోళం సృష్టించేందుకు కుట్రలు చేయడం.

సీమాంధ్ర మీడియా-కొన్ని పత్రికలను, చానెళ్లను అడ్డంపెట్టుకుని తెలంగాణకు వ్యతిరేకంగా, ఉద్యమకారులకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు చేసి, తెలంగాణ ప్రజలు, యువకుల మనోభావాలను దెబ్బతీయడం.
ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రజాస్వామ్యయుతంగా జరిగిన 42రోజుల సకల జనుల సమ్మెను, తెలంగాణ నలుమూలల్లో, అన్నివర్గాల ప్రజల్లో వెల్లువెత్తిన ప్రజానిరసనను గుర్తించడానికి నిరాకరించడం.

తెలంగాణకు శాపంగా మారిన తెలంగాణ కాంగ్రెస్, తెలుగుదేశం నేతల రాజకీయ బానిస బుద్ధి. సీమాంధ్ర రాజకీయ నాయకులు, మీడియా ఇన్ని కుట్రలు చేస్తున్నా తెలంగాణ నేతలు ఇంకా వారి సంకల్లోనే కూర్చుని ఉద్యమంపైకి రాళ్లు విసరడం ద్వారా తెలంగాణ ప్రజలను తీవ్ర క్షోభకు గురిచేయడం.

తెలంగాణ ప్రజల అస్తిత్వ కాంక్షలను, ఉద్యమ దీక్షను సవాలు చేస్తూ తెలంగాణపైకి సీమాంధ్ర నాయకుల రాజకీయ దండయాత్రలను ప్రోత్సహించడం.

ప్రజాస్వామికంగా జరుగుతున్న ఉద్యమాన్ని అణచివేయడానికి నిరంకుశ అణచివేత విధానాలను అమలు చేయడం. వేలాది మంది విద్యార్థులు, యువకులపై అసంఖ్యాకంగా కేసులు నమోదు చేసి, జైళ్లపాలు చేయడం.

ఆంధ్రలో కల్తీసారా తాగి మరణించినవారి కుటుంబాలను పరామర్శించిన చంద్రబాబు, ఇతర సీమాంధ్ర నేతలు తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర కాంక్ష భగ్నమై మరణించినవారి కుటుంబాల్లో ఒక్కరిని కూడా పరామర్శించకపోవడం.

అభియోగాలను రుజువు చేసే సాక్ష్యాధారాలు

కాంగ్రెస్, తెలుగుదేశం, పీఆర్పీ మ్యానిఫెస్టోలు, రాష్ట్రపతి ప్రసంగాలు, సోనియాగాంధీ ప్రసంగం.

అసెంబ్లీలో, పార్లమెంటులో ఆ పార్టీల నేతలు చేసిన ప్రసంగాలు.

రాజీనామా డ్రామాలకు సంబంధించిన అసెంబ్లీ రికార్డులు.

2009 డిసెంబరుకు 9కి ముందు తర్వాత చంద్రబాబు, చిరంజీవి, రోశయ్య, ఇతర నేతలు తెలంగాణపై చేసిన ప్రకటనల పత్రిక క్లిప్పింగులు, విడియో క్లిప్పింగులు.

యువకుల ఆత్మహత్యల వార్తల పత్రిక క్లిప్పింగులు, విడియో ఫుటేజ్‌లు.

ఆత్మహత్యలు చేసుకున్న యువకుల మరణవాంగ్మూలాలు, వారు రాసిన లేఖలు.

మృతుల తలిందండ్రుల వాంగ్మూలం.

2009 డిసెంబరు 9, ఆతర్వాత చిదంబరం చేసిన ప్రకటనల విడియో క్లిప్పింగులు.

విద్యార్థులపై, ఉద్యమకారులపై పెట్టిన కేసులు, నిర్బంధాల రికార్డులు.

ముద్దాయిలెవరు?

మొదటి ముద్దాయి- కేంద్ర ప్రభుత్వం:

2004లో తొలి యుపిఎ ప్రభుత్వం ఏర్పడినప్పుడే కనీస ఉమ్మడి కార్యక్రమంలోనూ, రాష్ట్రపతి ప్రసంగంలోనూ తగిన సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చింది. కాన్సెన్సస్(విస్తృతాంగీకారం) కుదిరితే తెలంగాణ ఏర్పాటుకు సిద్ధమేనని చెబుతూ వచ్చింది. తొలి యుపిఎ పాలన సమయంలోనే ప్రధాన ప్రతిపక్షమైన బిజెపితో సహా దేశంలోని 30 రాజకీయ పక్షాలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చాయి. విస్తృతాంగీకారం అప్పుడే వచ్చింది. కానీ యుపిఎ కావాలనే తెలంగాణ ప్రజలను వంచిస్తూ వచ్చింది. డిసెంబరు 2009లో రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ దీక్షతో ఉద్యమం ఉధృతమైన నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాలు అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ఏర్పాటుకు విస్తృతాంగీకారం తెలియజేశాయి. పార్లమెంటులో, శాసనసభలో అన్ని పార్టీలూ తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండు చేశాయి. తదనుగుణంగా డిసెంబరు 9న కేంద్రం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. కానీ రాష్ట్రంలోని సీమాంధ్ర నాయకులు రాజీనామాల డ్రామా ఆడడంతో కేంద్రం కూడా ప్లేటు ఫిరాయించింది. ఒకసారి విస్తృతాంగీకారం ఏర్పడిన తర్వాత, కేంద్రం ఒక రాజకీయ ప్రక్రియను ప్రకటించిన తర్వాత దానిని తిరగదోడడం నమ్మకద్రోహం, ప్రజాస్వామ్యానికి విఘాతం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం విశ్వాసఘాతుకానికి పాల్పడింది. ఇందుకు ఆ ప్రభుత్వం తెలంగాణ ప్రజల దండనకు అన్ని విధాలా అర్హమైంది.

రెండవ ముద్దాయి-కాంగ్రెస్:

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించారు. ఈ ప్రకటన చేయడానికి ముందు సోనియాగాంధీ, మన్‌మోహన్‌సింగ్‌ల సారథ్యంలో కాంగ్రెస్ అత్యున్నతస్థాయి కోర్ కమిటీ పలుమార్లు సమావేశమై చర్చించింది. కేంద్రం సూచన మేరకే అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్‌తోపాటు తెలుగుదేశం, పీఆర్పీ, సిపిఐ, బిజెపి, టీఆరెస్ అంగీకారాన్ని తీసుకుని కేంద్రానికి పంపారు. ఆ తీర్మానం ప్రాతిపదికగానే హోంమంత్రి చిదంబరం ప్రకటన చేశారు. అంటే కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటుకు సిద్ధపడే ఇవన్నీ చేసింది. ఇన్ని జరిగిన తర్వాత మళ్లీ రాజకీయ పక్షాల అభిప్రాయాలు కావాలని మొదలు పెట్టడమంటే తెలంగాణ ప్రజలను వంచించడమే, దగా చేయడమే. మరికొంతకాలం కాలయాపన చేసే కుతంత్రమే. సీమాంధ్ర రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రజాస్వామిక ప్రక్రియను వమ్ము చేయడమే. ఒక సమస్యపై విస్తృతాంగీకారాన్ని ఒకసారి సాధిస్తే చాలదా? ఎన్నిసార్లు విస్తృతాంగీకారం కావాలి? ఎన్నేళ్లు ఈ నాటకాలు కొనసాగిస్తారు? కాంగ్రెస్ సీమాంధ్ర నాయకత్వం కనుసన్నల్లోనే తెలంగాణ ప్రజలను హింసిస్తున్నది. వేధిస్తున్నది. కాంగ్రెస్ కుట్రల కారణంగానే తెలంగాణ యువకులు నిరాశా నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ గర్భశోకానికి ప్రధాన కారణం కాంగ్రెసే. తెలంగాణ ప్రజలు విధించే శిక్షలకు కాంగ్రెస్ నాయకత్వం అన్ని విధాలా అర్హమైంది.

మూడవ ముద్దాయి-తెలుగుదేశం:

నిజానికి పీఆర్పీ రావడంతోనే తెలుగుదేశం పతనం మొదలైంది. ఒకప్పుడు అసెంబ్లీలో ‘తెలంగాణ’ పదాన్ని నిషేధించిన తెలుగుదేశం పార్టీ 2008 వచ్చేసరికి తెలంగాణ నినాదాన్ని ఎత్తుకుంటే తప్ప బతకలేని పరిస్థితి. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని అందుకుని పార్టీని బతికించుకుంటే, ఆంధ్రాలో ఆ ఆదరువుతో బతికేయవచ్చని టీడీపీ భావించింది. అందుకే తెలంగాణపై ఎర్రన్నాయుడు అధ్యక్షతన ఒక కమిటీ వేసి, విస్తృతంగా సంప్రదింపులు జరిపి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుగా తీర్మానం చేసింది. తీర్మానం ప్రతిని ఎర్రన్నాయుడు ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి కూడా అందజేశారు. ఇవేవీ రహస్యంగా జరగలేదు. కమిటీల ఏర్పాటు, సంప్రదింపులు, తీర్మానం చేయడం, ప్రణబ్ కమిటీకి అందజేయడం అన్నీ పత్రికల్లో విస్తృతంగా వచ్చాయి. అప్పుడెప్పుడూ సీమాంధ్ర తెలుగుదేశం నాయకులకు సమైక్యాంధ్ర గుర్తుకు రాలేదు. అప్పుడెప్పుడూ అభ్యంతరాలు చెప్పలేదు. చివరకు 2009 డిసెంబరు 7,8,9 తేదీల్లో తెలంగాణపై తీర్మానం పెట్టాలని కూడా టీడీపీ సవాలు చేసింది. అశోకగజపతి రాజు నాయకత్వంలోని టీడీపీ ప్రతినిధి బృందం అఖిలపక్షం సమావేశానికి హాజరై ప్రత్యేక రాష్ట్ర తీర్మానానికి మద్దతు తెలిపింది. కానీ చిదంబరం ప్రకటన వచ్చిన మరుక్షణమే చంద్రబాబు ప్లేటు ఫిరాయించారు. సడన్‌గా రెండు కళ్ల సిద్ధాంతం అంటూ కతలు మొదలు పెట్టారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా సీమాంధ్ర నాయకులతో రాజీనామాలు చేయించారు. ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో చేయకూడని విశ్వాసఘాతుకానికి, విద్రోహానికి పాల్పడ్డారు. మాట మార్చి, నీతి తప్పి, తెలంగాణ ప్రజల హృదయాల్లో కనీవినీ ఎరుగని సంక్షోభానికి కారకులైన టీడీపీ నాయకత్వం అన్ని రకాల శిక్షలకూ అర్హమైందే.

నాలుగువ ముద్దాయి-తెలంగాణ నేతలు:

ఉద్యమంలో తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నేతలది అడుగడుగునా విద్రోహపాత్రే. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కొంత తెగువ ప్రదర్శించినా, వారు కూడా చివరికి దాగుడు మూతల్లోకే జారిపోయారు. టీడీపీ నేతలైతే తెలంగాణ పాలిట బ్రూటస్‌లుగా మారారు. నలభైరెండు రోజుల సకల జనుల సమ్మె తెలంగాణ చరిత్రలో వీరోచితమైన ఉద్యమం. ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న కాలంలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు మరోసారి రాజీనామాచేసి రాజకీయ సంక్షోభం సృష్టించి ఉంటే ఈ పాటికి తెలంగాణ సమస్య పరిష్కారమై ఉండేది. తెలంగాణకు ఈ గుండెకోత కొంతయినా తప్పి ఉండేది. ఈ ఆత్మహత్యలు నిలిచిపోయేవి. బయటివారి విద్రోహం కంటే ఇంటిదొంగల చేతగానితనం, రాజకీయ నంగనాచితనం తెలంగాణ ప్రజలను బాగా కలచివేస్తోంది. సొంతరాజకీయ అస్తిత్వంలేని ఈ వానపాములను ఎన్నుకున్నందుకు తెలంగాణ ప్రజలు కుమిలిపోతున్నారు. అవకాశం వచ్చినప్పుడు వీరిని శిక్షండానికి వెనుకాడరు.

ఐదవ ముద్దాయి-సీమాంధ్ర మీడియా:

తెలంగాణకు వ్యతిరేకంగా ఒంటికాలుపై లేచే చానెళ్లు, పత్రికలు కొన్ని ఉన్నాయి. ‘తోడేళ్లు, గుంటనక్కలు, పిచ్చి కుక్కలు, గుడ్ల గూబలు మానవరూపం ఎత్తి తెలంగాణలోనే సంచరిస్తున్నాయి. ఇక్కడి ఉద్యమకారులపైకే ఎగబడుతున్నాయి’ అని ఒక సందర్భంలో ఒక కవి అన్నారు. ఈ తోడేళ్లను, గుంటనక్కలను కెమెరాల ముందు కూర్చోబెట్టి తెలంగాణవాదంపై విద్వేషాన్ని, విషాన్ని, ఉన్మాదాన్ని కక్కిస్తున్నాయి ఈ చానెళ్లు, పత్రికలు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా, తెలంగాణ ద్రోహులకు అనుకూలంగా అసత్య, అర్ధసత్య, కాల్పనిక కథనాలను వండివార్చి, తెలంగాణ యువతను నిరాశా నిస్పృహల్లోకి నెట్టి, వారిని ఆత్మహత్యలకు పురికొల్పి వినోదిస్తున్న పత్రికలు, చానెళ్లు కూడా తెలంగాణ ప్రజల శిక్షల నుంచి తప్పించుకోలేవు.

తీర్పు

తీర్పు ప్రజలకు తెలుసు. ఇప్పుడు తెలంగాణ ప్రజ మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేదు. సీమాంధ్ర పార్టీలు, మీడియా చేసే కుట్రలను ప్రజలు ఇప్పుడు తేలికగానే పసిగట్టగలుగుతున్నారు. ఎప్పుడు ఎటువంటి తీర్పు ఇవ్వాలో ప్రజలు రిజర్వు చేసుకునే ఉంటారు.

ఎన్‌టిఆర్ వధ, టీడీపీ చెర

ఎన్‌టిఆర్ మహాత్మాగాంధీ, అంబేద్కర్ అంతటి మహనీయుడు. ఆయన విగ్రహం పార్లమెంటులో ప్రతిష్టించాలి.                      -టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు

“నేను స్థాపించిన తెలుగుదేశంలోనే కాంగ్రెస్ అక్రమ శిశువులు, గోముఖ వ్యాఘ్రాలు, మేకవన్నె పులులు తలెత్తుతున్నాయని ముందుగా తెలుసుకోలేకపోయాను…నేనే దేవున్ని అని చెబుతూ చాపకింద నీళ్లలాగా, పుట్టలో తేళ్లలాగా, పొదల్లో నక్కల్లాగా కుట్రలు, కుతంత్రాలు అల్లారు…ఇంతనీచానికి ఒడిగట్టిన చంద్రబాబు ఎన్‌టిఆర్ మా దేవుడు ఆయన విధానాలే అమలు జరుపుతానంటున్నాడు. చేతులు జోడించి, నమస్కారం చేసి, తుపాకి పేల్చి గాంధీని పొట్టనపెట్టుకున్న గాడ్సేను మించిన హంతకుడు చంద్రబాబు.”  -1995 ఆగస్టులో తనకు వ్యతిరేకంగా జరిగిన విద్రోహంపై ఎన్‌టిఆర్ ఆగ్రహం ఇది.

‘నారా, నారా, పోరా, పోరా…’, ‘గతంలో ఎన్‌టిఆర్‌ను వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల భాస్కర్‌రావు కొంతయినా చరిత్ర మిగిల్చుకున్నారు. చంద్రబాబుకు అదికూడా మిగలదు’.  -ఎన్‌టిఆర్‌ను గద్దెదింపినందుకు నిరసనగా 1995 డిసెంబరులో నిర్వహించిన మాక్  అసెంబ్లీలో చంద్రబాబునాయుడుపై మోత్కుపల్లి నర్సింహులు ఆక్రోశం ఇది.

నారా చంద్రబాబునాయుడుకు నాడున్న ఇమేజి అది. ఎన్‌టిఆర్ ఆభిమానుల్లో ఉన్న ఆగ్రహానికి ప్రతీక ఆ నినాదం. చంద్రబాబు ఎన్‌టిఆర్‌కు చేసిన ద్రోహాన్ని జీర్ణించుకోలేనివారు ఈ రాష్ట్రంలో ఇప్పటికీ కోట్లాది మంది ఉన్నారు. అందుకే చంద్రబాబునాయుడు తెలుగుజాతి ఆత్మగౌరవం గురించి, ఎన్‌టిఆర్ ఖ్యాతి గురించి మాట్లాడుతుంటే ఇప్పటికీ మనసు వెక్కిరిస్తూ ఉంటుంది. బతికి ఉన్నప్పుడు చిత్రవధ చేసి ఆయనను బలితీసుకున్న చంద్రబాబు ఇప్పుడు ఆయన విగ్రహాలకు దండలు వేస్తున్నారు. ఒక్క ఎన్‌టిఆర్‌నే కాదు తిరుగుబాటులో తన పల్లకీ మోసిన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావును, బావమరిది హరికృష్ణనను, ఇంకా అనేక మంది సీనియర్ నాయకులను ఆయన ఆ తర్వాత  కరివేపాకులాగా తీసి పారేశారు. రాజకీయాల్లో ‘యూజ్ అండ్ త్రో’ విధానాన్ని పక్కాగా అమలు చేసిన నాయకుడు చంద్రబాబే. స్నేహమయినా, బంధుత్వమయినా ఉపయోగపడితేనే కలుపుకుంటారాయన. తన ఆంతరంగికులను సైతం ఎప్పటికప్పుడు మార్చే చంద్రబాబుకు శాశ్వత శత్రుత్వాలు, మిత్రుత్వాలు, శాశ్వత బంధుత్వాలు ఉండవు. విధానాలయినా అంతే. ఎప్పటికప్పుడు మార్చకపోతే ఆయన చంద్రబాబే కాదు. ఇప్పటికీ బయటి ప్రపంచానికి వెల్లడి కాని విషయం ఏమంటే,  అభినవ గాడ్సే ఎన్‌టిఆర్ వారసుడెలా అయ్యారు? ఎన్‌టిఆర్‌ను అర్ధంతరంగా బలితీసుకున్నవాడు ఆయన కుటుంబానికి ఆత్మబంధువెలా అయ్యారు? ‘విద్రోహ చంద్రబాబు’కు ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా, పార్టీ రక్షకునిగా సమ్మతిని, సమర్థనను మాన్యుఫాక్చర్ చేసిన శక్తులు ఏవి?

విషాదం ఏమంటే 1995లో ఎన్‌టిఆర్‌కు జరిగిన దుర్మార్గంపై ఇంతవరకు లోతైన పరిశోధన జరుగక పోవడం. వైస్రాయ్‌లో జరిగిన కుట్ర చరిత్రను రికార్డు చేయకపోవడం. చంద్రబాబునాయుడు, ఆయన వందిమాగధ మీడియా రాసిన అనుకూల చరిత్ర తప్ప, అసలేం జరిగిందన్న అంశంపై ఎవరూ శ్రద్ధపెట్టకపోవడం యాదృచ్ఛికంగా జరుగలేదు. అధికారంలో ఉన్నవారి చరిత్రే తర్వాతి తరాలకు చరిత్రగా సంక్రమిస్తోంది. ఓడిపోయి పడిపోయిన వారి చరిత్ర రికార్డుల్లోకి రాకపోవడం అనాదిగా ఉంది. వర్తమానంలో కూడా అదే జరుగుతోంది. గెలిచినవాడి చరిత్ర చీకటి పార్శ్వాలు బయటికి రావడం లేదు. ఎన్‌టిఆర్‌పైన, చంద్రబాబుపైన, ఆ కాలపు రాజకీయాలపైన కొన్ని పుస్తకాలు వచ్చినమాట వాస్తవం. కానీ అన్నీ రాయించిన చరిత్రలో, చేసిన నేరాలను సమర్థించుకునే చరిత్రలో తప్ప, వాస్తవాలను ఆవిష్కరించే చరిత్ర రాలేదు. ఇప్పటికీ అందరినీ వేధించే ప్రశ్న ఒక్కటే-1984ఆగస్టులో నాదెండ్ల భాస్కర్‌రావు చేసిన ప్రయత్నమే, 1995 ఆగస్టులో చంద్రబాబునాయుడు చేశారు. నాదెండ్లది వెన్నుపోటు ఎలా అయింది? చంద్రబాబునాయుడిది ప్రజాస్వామ్యం ఎలా అయింది? ఒకే తరహా ఘాతుకానికి రెండు నిర్వచనాలు ఎలా సాధ్యం? నాదెండ్ల ఎందుకు విఫలమయ్యాడు? చంద్రబాబు ఎలా సఫలీకృతుడయ్యాడు? చంద్రబాబును గెలిపించిన శక్తులేవి?

ఎన్‌టిఆర్‌ను గద్దెదింపడానికి నాదెండ్ల చేసిన యత్నానికి, చంద్రబాబునాయుడు చేసిన యత్నానికి తేడా లేదు. నాదెండ్ల కూడా అసంతృప్తి, అవమానాలతోనే తిరుగుబాటు ప్రయత్నం చేశారు. చంద్రబాబు కూడా ఇవే కారణాలు చెప్పారు. నాదెండ్ల అంతిమలక్ష్యం అధికారాన్ని చేజిక్కించుకోవడమే. చంద్రబాబు అంతిమంగా ఆ లక్ష్యాన్ని చేరుకున్నారు. నాదెండ్ల తిరుగుబాటు జెండా ఎత్తుకున్నప్పుడు ఆయనతో ఉన్నది చాలా కొద్ది మంది మాత్రమే. చంద్రబాబునాయుడు పరిస్థితీ అదే. కానీ చంద్రబాబు  అతివేగంగా పావులు కదిపి బలసమీకరణలో సక్సెస్ అయ్యారు. నాదెండ్ల  విఫలమయ్యారు. ఇక్కడే చాలా శక్తులు పనిచేశాయి. నాదెండ్ల తిరుగుబాటు జెండా ఎగరేయగానే ఎన్‌టిఆర్‌ను అధికారంలోకి తీసుకురావడానికి భూమీ ఆకాశం ఏకం చేసిన  పత్రికలు దానిని ‘వెన్నుపోటు’గా, ‘ప్రజాస్వామ్యానికి విద్రోహం’గా చిత్రీకరిస్తూ అభిప్రాయాన్ని కూడగట్లాయి. అన్ని రాజకీయ పార్టీలు ఒక్కతాటిపైకి రావడానికి, ఎన్‌టిఆర్‌కు వెన్నుదన్నుగా నిలవడానికి ఒక భూమికను పత్రికలు సృష్టించాయి. అదేసమయంలో నాదెండ్ల వెంట ఎంతమంది ఉన్నారో, ఎన్‌టిఆర్‌తో ఎంత మంది ఉన్నారో ఎప్పటికప్పుడు లెక్కలు వేస్తూ నాదెండ్ల వెనుక ఎమ్మెల్యేలు చేరకుండా సైకలాజికల్ వార్‌ఫేర్ నిర్వహించాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని పత్రికలు ముందుండి నడిపించాయి. రాజకీయాలు, పత్రికలు కలసిపోయి పనిచేశాయి. నాదెండ్ల పప్పులు ఉడకలేదు.

1995లో సీను రివర్సయింది. ఎన్‌టిఆర్‌ను అధికారంలోకి తీసుకురావడానికి ఆరాటపడిన పత్రికలకు ఆయనపై మోజు తీరిపోయింది. ఎన్‌టిఆర్ మునుపటిలా పత్రికలు, పారిశ్రామికవేత్తలు చెప్పినట్టు నడుచుకునే రోజులు పోయాయి. అమాయక ఎన్‌టిఆర్ కాస్తా ముదిరిపోయారు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆయన స్వతంత్రించి వ్యవహరించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఎన్‌టిఆర్‌పై యుద్ధం మొదలయింది. ఆయనతో ఎదురుపడి యుద్ధం చేయడం అసాధ్యం. ఆయనను ఓడించడం మామూలుగా అయ్యేపనికాదు. పైగా అఖండ విజయం సాధించి అప్పటికి ఎంతోకాలం కాలేదు. అందుకే లక్ష్మీపార్వతిని బూచిగా చూపడం మొదలు పెట్టారు. ఆమెను వివాహం చేసుకోవడం, ఆమెకు మర్యాద మన్ననలు ఇవ్వడం ద్వారా ఎన్‌టిఆర్ తెలుగుజాతి కొంపలు కూల్చుతున్నారన్నంత యాగీ చేశాయి ఆ పత్రికలు. ఆమె వల్ల  ప్రజాస్వామ్యం పాడుబడిపోతున్నదని, కుటుంబ గౌరవం నవ్వులపాలవుతున్నదని ఆ పత్రికలు రచ్చ చేశాయి. ఆమె ఎన్‌టిఆర్‌తో కలసి చైతన్యరథంపై ఎన్నికల ప్రచారం చేసినప్పుడు ఎటువంటి చర్చ జరగలేదు. ఎవరూ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కానీ అధికారం అనుభవించే విషయం వచ్చే సరికి మాత్రం ఆమె పాత్ర కంటగింపయింది. మంత్రిపదవుల పంపకం దగ్గర మొదలయిన అసంతృప్తి, డిసిసిబి చైర్మన్ల ఎంపిక వరకు వచ్చే సరికి ముదిరి పాకాన పడ్డది. చంద్రబాబునాయుడు పావులు కదపడం మొదలు పెట్టారు. మంతనాలు ప్రారంభించారు. తెలుగుదేశంలో అత్యధికులు చంద్రబాబుతో వెళ్లడానికి భయపడ్డారు. కానీ అప్పటికే లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా మీడియాను యధేచ్ఛగా వాడుకుంటున్న చంద్రబాబు తిరుగుబాటు కుట్రలో మీడియాను ప్రధాన భాగస్వాములను చేశాడు.

నాడు నాదెండ్లకు అడ్డం తిరిగిన మీడియా ఈసారి చంద్రబాబును భుజానికెత్తుకుంది. వీలైనంత ఎక్కువ మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు వైపు సమీకరించడానికి అదే మీడియా మరోసారి సైకాలాజికల్ వార్‌ఫేర్ నిర్వహించింది. జర్నలిస్టులను, ఎడిటర్లను ప్రత్యక్షంగా రంగంలోకి దింపారు చంద్రబాబు. వాడొస్తున్నాడని వీడికి, వీడొస్తున్నాడని వాడికి జర్నలిస్టులతో, ఎడిటర్లతో చెప్పించి నమ్మబలికారు. వైస్రాయ్‌లో ఎంతమంది చే రారో తెలియదు, కానీ మెజారిటీ ఎమ్మెల్యేలు పోగయ్యారని, ఎన్‌టిఆర్ పని అయిపోయిందని కొందరు జర్నలిస్టులు ఎమ్మెల్యేలకు అదేపనిగా ఫోను చేసి భయపెట్టారు. దగ్గుబాటి సన్నిహితులకు ఫోను చేసి ఆయన వెంట ఉండే ఎమ్మెల్యేలంతా చంద్రబాబుతో రావడానికి తయారయ్యారని, చంద్రబాబుతో చేతులు కలుపకపోతే దగ్గుబాటి ఏకాకి అవుతారని ఊదరగొట్టారు. దగ్గుబాటి వర్గం ఎమ్మెల్యేలకు ఫోను చేసి దగ్గుబాటి కుటుంబసభ్యులందరితోపాటే చంద్రబాబుతో వచ్చేస్తున్నారని చెప్పారు. మరోవైపు వచ్చిన ఎమ్మెల్యేలను కట్టిపడేయడానికి ఏమేమి చేయాలో అవన్నీ చంద్రబాబు వైస్రాయ్ నీడలో గుట్టుగా చేసుకుపోయారు. బయట జరుగుతున్నది లోపలివారికి, లోన జరుగుతున్నది బయటివారికి తెలియనీయలేదు. పత్రికలకు ప్రజాస్వామ్యం కనిపించలేదు. ప్రజలు ఎన్‌టిఆర్‌ను చూసి గెలిపించారన్న సోయి లేకపోయింది. తెలుగుదేశాన్ని కాపాడడానికి తాను తిరుగుబాటు చేయాల్సివచ్చిందని చంద్రబాబు చెప్పారు. పత్రికలు దానిని జస్టిఫై చేశాయి. ప్రతి సంఘటనను విమర్శనాత్మకంగా విశ్లేషించే సిపిఐ, సిపిఎంలు సైతం పత్రికలు, రాజకీయ మ్యానిపులేటర్లు సృష్టించిన కొత్త నిర్వచనాన్నే స్వీకరించాయి. చంద్రబాబుకు జైకొట్టాయి. తాను నిర్మించిన రాజకీయ మహాసౌధం తన కళ్లముందే చేజారిపోవడం చూసి, తన రక్తం పంచుకుపుట్టినవారే తనపై కుట్రచేసిన తీరును చూసి, తాను గెలిపించిన వారే తనపై కత్తిగట్టిన మోసాన్ని చూసి, వగచి, విలపించి, విలపించి, గుండెలు పగిలి, ఐదుమాసాలు తిరగకుండానే ఎన్‌టిఆర్ కన్నుమూశారు. ఎప్పుడయినా చంద్రబాబు ఉపయోగించే ట్రిక్కు ఒక్కటే. ఎవరినయినా దెబ్బకొట్టాలంటే వారికి వ్యతిరేకంగా ఒక అబద్ధాన్ని ఆయనే సృష్టిస్తారు. ఆ అబద్ధాన్ని వందిమాగధ పత్రికలు పతాక శీర్షికల్లో అచ్చోస్తాయి. ఆ అబద్ధాన్ని పదేపదే వాగడానికి కొన్ని పెంపుడు కుక్కలను చంద్రబాబే ఎగదోస్తుంటాడు. ప్రభుత్వంలో లక్ష్మీపార్వతి జోక్యం అనే ఒక అబద్ధాన్ని ప్రచారంలో పెట్టి, నాడు ఎన్‌టిఆర్‌ను దెబ్బకొట్టారు.

అధికారంలోకి వస్తూనే ఎన్‌టిఆర్‌ను మరిపించడానికి, చంద్రబాబును మహానుభావుడిని చేయడానికి పత్రికలు మేళ తాల సహితంగా ఆరున్నొక్కరాగం అందుకున్నాయి. ఆయనలోని సుగుణాలను కీర్తించడానికి, ఆయనను బిల్ క్లింటన్ సరసన కూర్చోబెట్టడానికి, ఆయనకు స్టార్ ఆఫ్ ఏసియా కిరీటం తొడగడానికి మీడియా తన్మయత్వంతో పనిచేసుకుంటూ పోయింది. నిజానికి, చంద్రబాబుకు జనామోదం ఎప్పుడూ లభించలేదు. 1996, 1998 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును శిక్షించారు. ఎన్‌టిఆర్‌ను వెన్నుపోటు పొడిచినందుకు జనంలో ఆగ్రహం ఉండడం వల్లే రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మెజారిటీ లోక్‌సభ స్థానాలను(22) గెల్చుకోగలిగింది. టీడీపీ కూటమి ఒకసారి 20, రెండోసారి 15 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. 1999లో కూడా కార్గిల్ యుద్ధ నేపథ్యం, వాజ్‌పేయి ఇమేజి ఎన్‌డిఏతోపాటు చంద్రబాబును గెలిపించింది. చంద్రబాబు గొప్పతనమేమీ లేదు. ఎన్‌టిఆర్ అకాలమరణానికి కారకుడయిన చంద్రబాబును తెలుగు ప్రజలు ఇప్పటికీ క్షమించలేదు. ఎప్పటికీ క్షమించలేరు. ఆ పాపం చంద్రబాబును కట్టికుడుపుతూనే ఉంది. ఇక ముందు కూడా అదే జరుగనున్నది. తెలుగుదేశంపై ఇప్పటికీ ఏదైనా అభిమానం మిగిలి ఉందీ అంటే అది ఎన్‌టిఆర్‌పై ఉన్న అభిమానమే తప్ప, చంద్రబాబుపై అభిమానం కాదు. చంద్రబాబు తెలంగాణలో కూడా ఇప్పుడు పాత ట్రిక్కులనే ఉపయోగిస్తున్నారు. అబద్ధాల ప్రచారం, పెంపుడు కుక్కల వీరవిహారం, వందిమాగధ పత్రికల పులకింత ఇవన్నీ చంద్రబాబు నాటకంలో భాగం. కానీ ఆ రోజు ఎన్‌టిఆర్ మోసపోయి ఉండవచ్చు. ఇప్పుడు తెలంగాణ మోసపోవడానికి సిద్ధంగా లేదు.

అపనమ్మకం ఇంటిపేరు, కుట్ర అసలు పేరు

నన్ను ఒకరు బాలుడన్నారు. వారు నన్ను ఒకవైపే చూశారు. రెండోరూపం వారికి తెలియదు…….అధికారం కోసం పార్టీని అమ్ముకోలేదు. సీఎం కుర్చీనే వారి జీవిత లక్ష్యం.
                        -సినీనటుడు నందమూరి బాలకృష్ణ

సినిమాల్లో తొడగొడితే సౌండ్ ఎఫెక్ట్ ఇస్తారు. కాబట్టి చప్పుడు బ్రహ్మాండంగా వినిపిస్తుంది. పరిసరాలన్నీ గడగడా ఊగిపోతాయి. నిజజీవితంలో తొడగొడితే చప్పుడు రాదు. తొడ వాచిపోతుంది. ఆయన ఊగిపోతారు. బాలకృష్ణకు సినిమా జీవితానికి, నిజ జీవితానికి ఇంకా తేడా తెలిసినట్టు లేదు. ఇప్పటికీ  బ్రహ్మనాయుడులాగా చెయ్యడ్డంపెట్టి రైలు ఆపగలననుకుంటున్నాడు. తనలో ఒక అపరిచితుడు ఉన్నాడని చెబుతున్నాడు. రెండో రూపం గురించి, మూడో రూపం గురించి మాట్లాడుతున్నాడు. ఆయనకు తెలియని విషయం ఏమంటే, ఆయన అన్ని రూపాలూ తెలుగు ప్రజలకు ఎప్పుడో తెలిసిపోయాయి. సొంత ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు ఆయనలోని అపరిచితుడు తొలిసారి తెలిసారు. ఎన్నికల ప్రచారంలో ‘నీ ఊరికొచ్చా, నీ ఇంటికొచ్చా’ అని అక్క పురందేశ్వరి ఇంటి ముందు తొడగొట్టి సవాలు చేసి, కాంగ్రెస్ బావ దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావును గెలిపించి వచ్చినప్పుడు, రాష్ట్రమంతా తిరిగితిరిగీ గొంతువాచేట్టు డైలాగుల వర్షం కురిపించినా తెలుగు ప్రజలు ఓట్ల వర్షం కురిపించడానికి నిరాకరించినప్పుడు ఆయన రెండో రూపం చూసే ఉన్నారు. ఇప్పుడు ఇక ఎటునుంచి చూసినా అదే రూపం. కొత్తగా కనిపించేదేగానీ, వినిపించేదిగానీ ఏమీ లేదు. తెలిసేది అంతకన్నాలేదు. కాకపోతే సినిమా హీరో కదా కాస్తంత వినోదం. ఇక అధికారంకోసం పార్టీని అమ్ముకోలేదు అన్నారు చూశారూ! సూపర్ డైలాగ్! కానీ అది మీరు కొట్టాల్సిన డైలాగ్ కాదు. అధికారంకోసం తండ్రిని బలిపెట్టి, పార్టీని హైజాక్ చేసి బావ చేతిలో పెట్టిన అపర ఔరంగజేబుల్లో తమరు కూడా ఉన్నారు! ఎన్‌టిఆర్‌ను స్వయంగా బలితీసుకున్నవారు ఆయన వారసత్వాన్ని పునరుద్ధరిస్తామని చెబితే ఎవరు నమ్మగలరు? పార్టీని అమ్మినవాడు గొప్పా? లేక తండ్రిని బజారుపాలు చేసి, పార్టీని పాతరేసినవాడు గొప్పా? ఎవరు గొప్ప? సీఎం కుర్చీపై యావ లేకపోతే ఇప్పుడెందుకు సార్ మీరు, మీ బావ వీధుల్లో పడి తొడలు చరుస్తున్నారు. అధికారం కోసం కాకపోతే సెక్రెటేరియట్‌లో పల్లీలు అమ్ముకోవడానికి రాజకీయాలు చేస్తున్నారా సార్? డైలాగులే కాదు, అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి. సంభాషణల రచయితను పెట్టుకుంటే మంచిది.
————————-.
పార్టీకి పూర్వవైభవం తెస్తా…. మళ్లీ అధికారంలోకి వస్తాం….అడ్డొస్తే కొండలనయినా పిండి చేస్తాం…
                -తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు

చంద్రబాబునాయుడు చెబుతున్నది నిజమేనా? ఆయనకు ప్రజలు నిజంగానే బ్రహ్మరథం పడుతున్నారా? తండోపతండాలుగా జనం వస్తున్నారని నాయుడిగారి మీడియా  ఊదరగొడుతున్నది వాస్తవమేనా? బాబు పర్యటనలతో ప్రజలు, ప్రత్యేకంగా తెలుగు తమ్ముళ్లు ఉబ్బితబ్బిబ్బవుతున్నారన్న కొన్ని పత్రికల పులకింతను నమ్మవచ్చా? 2009 ఎన్నికలకు ముందు కూడా ఇటువంటి పత్రికా రాతలు, చానెళ్ల బాకాలు చాలా చూశాం. ఆ ఎన్నికల్లో బాలకృష్ణకు, ఆయనను మించి జూనియర్ ఎన్‌టిఆర్‌కు జనం బారులుతీరి స్వాగతాలు పలికిని మాటా నిజమే. కానీ ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు ముఖం చాలా స్పష్టంగా కనిపించింది. చంద్రబాబునాయుడును జనం నమ్మలేదని, గ్రహణ చంద్రుడి నీడలో ఊరేగిన స్టార్స్‌ను జనం పెద్దగా పట్టించుకోలేదని ఓట్ల డబ్బాలు తేటతెల్లం చేశాయి. ఇంటింటికీ నగదు పంపిణీ చేస్తామంటే కూడా చంద్రబాబును జనం నమ్మలేదు. ప్రజల్లో చంద్రబాబునాయుడుకు ఉన్న అపనమ్మకం అటువంటిది.  చంద్రబాబు ఇంతటి అపనమ్మకాన్ని ఎలా మూటగట్టుకున్నారు?

చంద్రబాబు ఇంతటి అపనమ్మకాన్ని, అప్రతిష్ఠను పోగేసుకోవడం, విశ్వసనీయతను కోల్పోవడం ఒక్క రోజులోనో, ఒక్క ఏడాదిలోనో జరిగింది కాదు. గత ఒకటిన్నర దశాబ్దాల్లో పరంపరగా జరిగిన అనేక పరిణామాలు ఎప్పటికప్పుడు ఆయనను దోషిగా నిలబెడుతూ వచ్చాయి. ఆయన ఒక ఉదాత్త నాయకుడిగా ఎదగడానికి బదులు మ్యానిప్యులేటర్‌గా, మాకియవెల్లియన్‌గా నానాటికీ రుజువవుతూ వచ్చారు. కుట్రతో రాజసూయం ప్రారంభించి ప్రతిమలుపులోనూ కుట్రపూరితంగానే వ్యవహరిస్తూ వచ్చారు. చివరికి అది ఆయన స్వభావమేమో అనుకునేంతగా స్థిరపడిపోయింది. చంద్రబాబుపై ప్రజలకు నమ్మకం సడలిపోవడానికి కారణం ఎన్‌టిఆర్‌కు ఆయన చేసిన ద్రోహాన్ని జీర్ణించుకోలేకపోవడమే. చంద్రబాబు ద్రోహం చేసింది కేవలం ఎన్‌టిఆర్‌కు మాత్రమే కాదు, 1994లో ఎన్‌టిఆర్‌కు అఖండ విజయం చేకూర్చిన ప్రజలకు కూడ. ఎన్‌టిఆర్ అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను చంద్రబాబు తిరగదోడారు. అక్కడ మొదలైన విద్రోహాల పర్వం 2004 దాకా కొనసాగింది. ఆయన అనుసరించిన విశ్వాసఘాతుక విధానాలు అన్నీ ఇన్నీ కాదు. రాస్తే పెద్ద జాబితాయే అవుతుంది: సబ్సిడీ బియ్యం రద్దు చేయడం, మద్య నిషేధాన్ని సడలించడం వైన్‌షాపులకు అనుమతినివ్వడం, వ్యవసాయ విద్యుత్‌పై సబ్సిడీ ఎత్తివేయడం, విద్యుత్ ఉత్పత్తిని ప్రైవేటు  కంపెనీలకు అప్పగించడం, ఇంటి కరెంటు చార్జీలు పెంచడం, బస్సు చార్జీలు, నల్లా బిల్లులు, భూమి పన్ను, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం, వ్యవసాయానికి సబ్సిడీలు రద్దు చేయడం, ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ పూర్తిగా నిలిపివేయడం, సింగరేణిని ప్రైవెటీకరించడం, అనేక ప్రభుత్వ రంగ కంపెనీలను తెగనమ్మడం, మూసేయడం…
చంద్రబాబు ఘనకార్యాలు ఇలా ఎన్నయినా చెప్పవచ్చు. ఇవన్నీ ఎన్‌టిఆర్ ఏర్పాటు చేసిన తెలుగుదేశం నుంచి ప్రజలు ఆశించని పరిణామాలు.

చంద్రబాబు తాను ముఖ్యమంత్రిని అన్న విషయం మరచిపోయి ప్రపంచబ్యాంకు మేనేజరులాగా వ్యవహరించడాన్ని జనం సమ్మతించలేదు. అందుకే వెన్నుపోటు తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ చంద్రబాబుకు జనామోదం లభించలేదు. 1995 వెన్నుపోటు తర్వాత రెండుసార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఓట్లు, సీట్ల మెజారిటీ లెక్కల ప్రకారం రెండుసార్లూ ప్రజలు చంద్రబాబును తిరస్కరించారు. 1999లో గెలవడం వెనుక మరో నమ్మక ద్రోహం ఉంది. 1996, 1998 లోక్‌సభ ఎన్నికల్లో వామపక్షాలు, మధ్యేవాద పార్టీలతో కలసి జాతీయ ఫ్రంట్‌తో అంటకాగిన చంద్రబాబు, వీర లౌకికవాదిగా పోజులు పెట్టిన చంద్రబాబు, బిజెపిని అంటరాని పార్టీగా ప్రకటించిన చంద్రబాబు 1999 ఎన్నికలకు వచ్చేసరికి ప్లేటు ఫిరాయించారు. దానికీ కారణం ఉంది. 1998 ఎన్నికల్లో బిజెపి ఒంటరిగా పోటీ చేసి 18 శాతం ఓట్లతో నాలుగు లోక్‌సభ స్థానాలను దక్కించుకుంది. చంద్రబాబును ఈసారి ఇంకా తీవ్రంగా జనం తిరస్కరించారు. ఈ పరిణామం చంద్రబాబుకు అశనిపాతమైంది. తన పునాదులు కదలిపోతున్నాయని భావించారు. కేవలం ఇరవైనాలుగు గంటల వ్యవధిలో బాబు జెండాను ఎజెండానూ మార్చారు. అప్పటిదాకా కలసి ఉన్న మిత్రులను నట్టేట ముంచేసి కేంద్రంలో బిజెపికి మద్దతు ప్రకటించారు. 1999లో అది ఆయనకు ఉపయోగపడింది. రాష్ట్రంలో ముందే బలంగా ఉన్న బిజెపికి కార్గిల్ యుద్ధంలో గెలుపు, కేంద్రంలో అర్ధంతరంగా ప్రభుత్వాన్ని కూలదోయడంతో వాజ్‌పేయిపై సానుభూతి వెల్లువెత్తడం బాగా ఉపయోగపడింది. చంద్రబాబు ఈ సందడిలో దూరి ప్రయోజనం పొందారు. మరోసారి అధికారంలోకి వచ్చారు. కానీ చంద్రబాబుపై జనాగ్రహం తగ్గలేదనడానికి ఆ తర్వాత వెల్లువెత్తిన తెలంగాణ ఉద్యమం మరో ఉదాహరణ. రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ ఉద్యమకారులపై కాల్పులు, అంగన్‌వాడీ కార్మికులను గుర్రాలతో తొక్కించడం ఒకటేమిటి….అనేక దాష్టీకాల కాలం అది.
ఏ ఎన్నిక        టీడీపీ        బిజెపి        లెఫ్ట్        కాంగ్రెస్
1994 అసెంబ్లీ ఎన్నికలు    44.35        3.89        6.35        33.85
1996 లోక్‌సభ        32.59        5.65        5.3        39.66
1998 లోక్‌సభ        31,97        18.3        5.45        38.46
1999 లోక్‌సభ        39.85        9.90        2.73        42.79
2004 అసెంబ్లీ        37.59        2.63        3.37        38.56
2009 అసెంబ్లీ        28.12        2.84        2.65        36.55

అవసరంకోసం బిజెపిని కౌగిలించుకున్న బాబు అది తీరిపోగానే మళ్లీ మతతత్వ పార్టీగా ముద్రవేసి లౌకికవాదిగా మారాలని చూశారు. కానీ ఎవరు నమ్ముతారు? ఎంతకాలం నమ్ముతారు? దాని పర్యవసానం 2004 ఎన్నికల్లో బాబు పతనం. 2009 ఎన్నికలకు ముందే బాబు పడవ మునిగిపోవలసింది. చిరంజీవి రాకతో అసలే కుంటుతున్న బాబునావ మరీ కకావికలైంది. టీఆరెస్ చిరంజీవితో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో టీడీపీ ఆనాడే ఖాళీ అయిపోయేది. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మరో విధంగా ఉండేది. కానీ నాయుడుగారు, ఆయనగారి మీడియా ఎన్నికల రుతుపవనాలను ముందుగా పసిగట్టడంలో నేర్పరులు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం చేయకపోతే తెలంగాణలో తెలుగుదేశం అంతరించిపోతుందని తెలుసు. అందుకే కమిటీ వేసి, చర్చలు చేసి, బోలెడంత బిల్డప్ ఇచ్చి తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేసింది. అయినా తెలంగాణ తెలుగుతమ్ముళ్లు టీఆరెస్ ఎవరితో చేతులు కలుపుతుందో చూసి రాజకీయ నిర్ణయం తీసుకుందామని అప్పటికే ఒక అవగాహనకు వచ్చారు. తెలుగుతమ్ముళ్లు కొందరు టీఆరెస్‌తో, కొందరు చిరంజీవితో మంతనాలు కూడా జరిపారు. టీఆరెస్, పీఆర్‌పీ మధ్య పొత్తు కుదిరితే రెండు పార్టీల్లోకి దూకడానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు.

ఈ ప్రమాదాన్ని నివారించడానికి రాజకీయ బ్రోకర్లు, మీడియా పెద్దలు కొందరు రంగంలోకి దిగి పావులు కదిపారు. టీఆరెస్‌ను తమవైపునకు తిప్పుకోవడానికి తొలుత టీడీపీ చేయని ప్రయత్నం లేదు. ఇవ్వని ఆఫర్‌లు లేవు. టీఆరెస్ కూడా టీడీపీ క్యాడర్ బేస్డ్ పార్టీ కాబట్టి పొత్తు వల్ల ప్రయోజనం ఉంటుందని ఆశించి, చివరకు అటు మొగ్గు చూపింది. అది చరిత్రాత్మక తప్పిదమని తీరా ఎన్నికలు సమీపించే కొద్దీ తెలుస్తూ వచ్చింది. ఫలితాల తర్వాత టీడీపీ కుట్ర పూర్తిగా తెలసిపోయింది. టీడీపీ తాను పోటీ చేసిన స్థానాలను గెలవడానికి, టీఆరెస్ స్థానాల్లో ఆ పార్టీని ఓడించడానికి చేయాల్సిందంతా చేసింది. అదనంగా 32 మందికి బి ఫారమ్స్ ఇచ్చి టీఆరెస్‌కు ఇచ్చిన స్థానాల్లో టీడీపీని దింపి ఓడించాలనుకున్నాడు. అన్నంత పనిచేశాడు. అన్ని స్థానాల్లో, అందరు టీడీపీ వాళ్లు అలా మోసం చేసి ఉండకపోవచ్చు, కానీ చంద్రబాబునాయుడు హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసి మరీ టీఆరెస్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేయించినట్టు టీఆరెస్ అభ్యర్థులు ఆ తర్వాత ఆరోపించారు. అప్పుడు కూడా ఆయన లక్ష్యం ఒక్క టీఆరెస్‌ను ఓడించడం కాదు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు నేలకూలతాయనుకున్నాడు. ఇటు టీఆరెస్, అటు తెలంగాణవాదం రెంటినీ దెబ్బతీయాలన్నది చంద్రబాబు కుట్ర. అలా ఆయన విశ్వాస ఘాతుకాల జాబితాలో 2009 ఎన్నికలు కూడా చేరిపోయాయి. టీఆరెస్ తాత్కాలికంగా దెబ్బతిని ఉండవచ్చు. కానీ తెలంగాణవాదం ఫీనిక్స్‌లాగా ఉవ్వెత్తున ఎగసింది. ఆయనపై అపనమ్మకం పరాకాష్ఠకు చేరడానికి లేటెస్టు ఉదాహరణ 2009 డిసెంబరు 7,8,9,10 తేదీలలో ఆయన మాటమార్చిన తీరు. ‘చేతనైతే తెలంగాణపై తీర్మానం పెట్టండి’ అని సవాలు చేసిన వ్యక్తి, మరుసటిరోజే ‘అర్ధరాత్రి నిర్ణయం ఎలా తీసుకుంటారు’ అని అడ్డం తిరిగారు. అర్ధరాత్రే కుట్ర చేసి, తెల్లవారేసరికి రాజీనామాల డ్రామాను ఆవిష్కరించారు. ఇప్పుడు తనకు రెండు కళ్లు అని చెబుతున్నాడు. తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసినప్పుడు కూడా ఈ పెద్ద మనిషికి రెండు కళ్లు ఉన్నాయి. సీమాంధ్ర, తెలంగాణ అప్పుడు కూడా ఉన్నాయి. తీర్మానం చేసిన కమిటీకి నాయకత్వం వహించిన ఎర్రన్నాయుడు సీమాంధ్రవారే. సమస్యలు, సవాళ్లు వచ్చినప్పుడు నాయకుడు నిలబడాలి. తప్పించుకునేవాడిని, తప్పుకు తిరిగేవాడిని జనం విశ్వసించరు.

ఒక నాయకుడికి కీర్తి అయినా, అపకీర్తి అయినా ఒకటి రెండు మాసాల్లోనో, సంవత్సరాల్లోనో రాదు. చాలా కాలం పడుతుంది. ఒకటి రెండు సార్లు తప్పులు చేస్తే ప్రజలు ఒకసారి శిక్షిస్తారు, ఆ తర్వాత క్షమిస్తారు. అదేపనిగా తప్పులు చేసేవారిని, అలవాటుగా నమ్మకద్రోహానికి పాల్పడేవారిని, అవసరం వచ్చినప్పుడల్లా విధానాలు మార్చేవారిని, అత్యంత అవకాశవాదిగా వ్యవహరించేవారిని జనం క్షమించరు. అపనమ్మకాన్ని, విశ్వాసరాహిత్యాన్ని పోగేసుకోవడం చంద్రబాబునాయుడు 1995 నుంచి ఇప్పటివరకు అవిశ్రాంతంగా కొనసాగిస్తున్నారు. అదే రేటున ప్రజల్లో ఆయన అప్రతిష్ఠ పెరుగుతూ వచ్చింది. తెలుగుదేశం ఓటు బ్యాంకు కరుగుతూ వస్తున్నది. ఇంకా పతనం కావడమే తప్ప, అది కోలుకునే అవకాశాలు మృగ్యం. కాంగ్రెస్, జగన్ పరస్పరం అంతం చేసుకుంటే తప్ప చంద్రబాబు అధికారంలోకి రావడం కల్ల.