తెలంగాణ నిఘంటువు


తెలంగాణ నిఘంటువు ఏమిటండి? ఉంటే తెలుగు నిఘంటువు ఉండాలి కానీ అని ఓ పండిత మిత్రుడు ప్రశ్నించాడు. తెలంగాణ పదాన్ని జీర్ణించుకోలేని తత్త్వ మే ఆ గొంతులో వినిపించిందనిపించింది. సూర్యరాయాంధ్ర నిఘంటువు ఉండగా లేనిది తెలంగాణ నిఘంటువు ఉంటే తప్పేమిటి? అని ప్రశ్నిస్తే, తెలుగు, ఆంధ్రమూ పర్యాయపదాలే కదా అని ఆ పండితుడు సమాధానం ఇచ్చారు. తెలుగు, ఆంధ్రమూ ఒకటేనని ఆధిపత్య భాషావాదులు తీర్మానించిన మాట నిజమే కానీ త్రిలింగ, తెలింగ, తెలంగాణ, తెలుంగు, తెలుగు ప్రాంతానికి, ఆ ప్రాంత ప్రజలు మాట్లాడే భాషకు రూపాంతరాలని ఎందుకు దాచిపెట్టారో ఇప్పటికీ అర్థం కాదు. 

ఆంధ్రం అనే పదాన్ని తీసుకువచ్చి తెలంగాణపైన తెలుగుపైన ఎందుకు రుద్దారో ఎట్లా రుద్దారో ఇప్పుడు కనిపెట్టాల్సి ఉంది. త్రిలింగ దేశం లేక తెలంగాణ, ఆంధ్ర దేశం ఎట్ల యిందో పరిశోధన జరుగాల్సి ఉంది. కృష్ణానది ఒడ్డున వెలసిన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఆలయం, కృష్ణుడనే రాజు ప్రతిరూపంగా వెలసిందని, తాను త్రిలింగదేశాధీశుడనని ఆయన ప్రకటించుకున్నారని చరిత్ర ఆధారాల వల్ల తెలుస్తున్నది. ఆం ధ్ర ప్రస్తావనకు ఎంత ఇతిహాసం, ఎంత చరిత్ర ఉందో త్రిలింగ దేశానికి, తెలింగ దేశానికి అంత కథ ఉంది. రిషిక, అస్సక, అస్మ క రాజ్యాలు, శాతవాహనుల కార్యభూమి తెలంగాణనే. అవేవీ చరిత్రలో తగిన స్థానం సం పాదించలేదు. తెలంగాణ గడ్డపై వర్ధిల్లిన బౌద్ధ, జైన క్షేత్రాల చరిత్ర సరిగా రికార్డు కానేలేదు. 

ఎక్కడో రాజస్థాన్‌లో స్థిరపడిన సుధీర్ తైలంగ్ నా జన్మభూమి తెలంగాణే అని చెప్పారట ఒక ఇంటర్వ్యూలో. బర్మా, థాయ్‌లాండ్‌లలో స్థిరపడిన కొన్ని జాతులు తాము తైలంగులమే అని చరిత్రలో రాసుకున్నారు. గోదావరి నదీ లోయలో పడవల ద్వారా శత్రువులను తప్పించుకుని సముద్ర మార్గాన తాము ఇక్కడికి చేరామని తైలంగులు చెప్పుకున్నారు. వాయు పురాణంలోనూ త్రిలింగ ప్రస్తావన ఉంది. విదేశీ యాత్రికుడు టోలెమీ యాత్రా కథనంలో కూడా త్రిలింగ ప్రస్తావన ఉంది. కాకతీయులకు త్రిలింగ దేశాధీశులుగానే పేరుంది. కాకతీయులతో జరిగిన యుద్ధంలో ఓడిపోయి, ఢిల్లీ సుల్తానులకు లొంగిపోయి, మతం మార్చుకున్న ఒక కాకతీ య మంత్రి ఆ తర్వాత సుల్తానుల వద్ద ప్రధాని అయ్యారు. ఆయన తన పేరు చివర తిలంగానీ పెట్టుకున్నారు. ఢిల్లీలోని ఆయన సమాధిపై ఇప్పటికీ ఆయన పేరు అలాగే ఉంది. ఇది 1375ల నాటి సమాధి. 

1812లో విలియం క్యారీ తెలింగ భాషా వ్యాకరణాల పై ఒక పుస్తకమే రాశారు. అవేవీ గత ఆరు దశాబ్దాల్లో ప్రస్తావనకు, ప్రాచుర్యానికి, చరిత్ర రచనకు నోచుకోలే దు. తెలంగాణ భాష అవమానాలపాలయింది. సం స్కారహీనులు, ప్రతినాయకులు మాట్లాడే భాషగా ముద్రవేయడానికి ప్రయత్నం జరిగింది. తెలంగాణ పదజాలం మరుగునపడిపోయింది. రెండు మూడక్షరాలతో గొప్ప అర్థాన్ని చెప్పే విశేషణాలు, క్రియలు, నామవాచకాలు ఉన్నాయి. అవి మరుగునపడిపోతున్నా యి. వాటిని నమోదు చేసి భావితరాలకు అందించవలసిన అవసరం ఉంది. ఆ ప్రయత్నంలోనే చరిత్ర, భాషా, సాంస్కృతిక పరిశోధనలపై పనిని ప్రారంభించింది. అందుకే తెలంగాణ నిఘంటువు. తెలంగాణ నిఘంటువు తెలుగు భాషకు విస్తృతి.
kattashekar@gmail.com

జీవనదిగా గోదావరి


ప్రాజెక్టులపై ఇన్నేళ్ల జాప్యం కారణంగానే నదీ జలాల్లో మనం హక్కులు కోల్పోయాం. ఆరు దశాబ్దాల తర్వాత కూడా కృష్ణా జలాల్లో మనవాటా మనం ఉపయోగించుకోలేని దుస్థితిలో ఉన్నాం. ఇప్పుడు కూడా కొట్లాడుతూ కూర్చుంటే మరికొన్ని దశాబ్దాలపాటు తెలంగాణ ఎప్పటిలాగే నీటికోసం తన్లాడాల్సి వస్తుంది. ఎగువ, దిగువ రాష్ర్టాలు ప్రాజెక్టులు పూర్తి చేసుకుని నదీ జలాలపై హక్కును ప్రకటించుకుంటా యి. 

సీమాంధ్ర నాయకులకు తమ ఆత్మలను, తనువులను, రాజకీయాలను అమ్ముకున్న కొందరు నాయకులు తెలంగాణ ప్రభుత్వంపై సీమాంధ్ర నాయకులకంటే హీనంగా మాట్లాడుతున్నారు. సీమాంధ్ర నాయకులు వదిలేసిపోయిన నీచమైన పనులన్నీ వీరు కొనసాగిస్తున్నారు. వీరిపట్ల అప్రమత్తంగా ఉండకపోతే, వీరి కుట్రలను తిప్పికొట్టకపోతే ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తికావు. తెలంగాణ బీళ్లు ఎప్పటికీ జలధారలతో నిండవు.’గోదావరి నదిపై సదర్‌మాట్, ఎల్లంపల్లి, సుందిళ్ల, అన్నారం, కాళేశ్వ రం, తుపాకులగూడెం ప్రాజెక్టులు గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యంతో పూర్తయితే నదిలో 200 కిలోమీటర్ల పొడవునా నీళ్లు నిలబడి ఉం టాయి. ధర్మపురి నుంచి భద్రాచలం దాకా గోదావరి నిరంతరం జలకళతో ఓలలాడుతుంది. సంవత్సరం పొడవునా నదిలో నీరు అందుబాటులో ఉంటే దాని చుట్టూ ఉండే జీవితం ఎలా మారిపోతుందో కృష్ణా, గోదావరి డెల్టాల్లో జీవితం చూస్తే అర్థమవుతుంది. వ్యవసాయం, పశుపోషణ, చేపల పెంపకం, అటవీ రక్షణ, పర్యాటకం.. అన్నీ వర్ధిల్లుతాయి. అన్ని రిజర్వాయర్లలో ఏడాది పొడవునా సుమారు 70 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. కొత్తగా సుమారు 200 టీఎంసీలకుపైగా నీటిని వినియోగించుకోవడానికి వీలవుతుంది. నదీ రిజర్వాయర్ల నుంచి ఉపనదులపై, కాలువలపై నిర్మించిన వందలాది రిజర్వాయర్లు, పెద్ద చిన్న చెరువులను నీటితో నింపడానికి వీలవుతుంది. ఉత్తర తెలంగాణ, ఖమ్మం, యాదాద్రి జిల్లాలకు, సూర్యాపేట సగం జిల్లాకు గోదావరి జలాలు ప్రాణాధారం అవుతాయి. 

తాగునీరు, సాగునీరు సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. యాభై లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తుంది. నీటివనరులు సృష్టించే సంపద అపారం. తెలంగాణ ఇన్ని దశాబ్దాలు నష్టపోయింది నీరు లేకనే. అందుకే తెలంగాణ ప్రభుత్వం దీనిని అత్యంత ప్రాధాన్యమైన ఎజెండాగా పెట్టుకుని పనిచేస్తున్నది అని నీటిపారుదల రంగ నిపుణుడు మొన్న ఇష్టాగోష్ఠి సమావేశంలో వివరించారు. నీటి సమస్యను ఇంత విస్తృత పరిధిలో అర్థం చేసుకుంటే తప్ప ప్రాజెక్టుల వల్ల జరిగే మంచిని గుర్తించలేము. ఇంత భారీమొత్తంలో నీటిని మళ్లించడం, దానివల్ల కలిగే ప్రయోజనం, దాని విలువను అర్థం చేసుకోలేకపోతే చిన్నచిన్న కారణాలతో ప్రభుత్వంతో కయ్యానికి దిగాలనిపిస్తుంది. కర్ణాటక, మహారాష్ట్రలలో వందలాది ప్రాజెక్టులు, బరాజులు నిర్మించారు. వారెప్పుడూ ప్రాజెక్టులపై వీధి పోరాటాలకు దిగిన దాఖలాలు లేవు. గోదావరి నదిపై మహారాష్ట్రలో 200కు పైగా బరాజులు నిర్మించారని గత ప్రభుత్వాలకు సూచన మాత్రంగానైనా తెలియదు. అంటే అంత గుట్టుగా వారు పనిచేసుకుపోయారు. చివరకు తెలంగాణ ఉద్యమం నుంచి దృష్టి మళ్లించడం కోసం బాబ్లీ వద్ద డ్రామా కు దిగారు కొందరు.మన ప్రతిపక్షాలు మాత్రం ఏకసూత్ర కార్యక్రమంతో పనిచేస్తున్నాయి. ప్రభుత్వం ఏది చేస్తే దానిని వ్యతిరేకించాలనే దుగ్ధపూరితమైన వైఖరితో రోజూ ఏదో యాగీ చేస్తున్నాయి. భూ సేకరణను అడ్డంపెట్టి కేసులమీద కేసులు వేసి ప్రాజెక్టులు ముందుకు సాగకుండా చేయాలని చూస్తున్నాయి. ఒకప్పుడు సాగునీరు, తాగునీరు, కరెంటు ఇవ్వాలని ఉద్యమాలు చేసిన కమ్యూనిస్టులు ఇప్పుడు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దుమ్మెత్తిపోస్తున్నారు. నాడు ప్రాజెక్టులం టే కాంట్రాక్టులు, కమీషన్లు మాత్రమేనని, తక్షణం నీరివ్వడం కాదని కళ్లు మూసుకుని జపం చేసిన తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఇప్పుడు చరిత్ర అంతా మరిచిపోయి కాంట్రాక్టులు కొత్తగా తెలంగాణ ప్రభుత్వమే కనిపెట్టినట్టు మాట్లాడుతున్నారు. విషాదమేమంటే తెలంగాణకు ఏం కావాలో ఇప్పటికీ వీరికి అర్థం కాకపోవడం. ఏ అంశంపై ఎలా వ్యవహరించాలో తెలియకపోవడం. 

ప్రాజెక్టులపై ఇన్నేళ్ల జాప్యం కారణంగానే నదీ జలాల్లో మనం హక్కులు కోల్పోయాం. ఆరు దశాబ్దాల తర్వాత కూడా కృష్ణా జలాల్లో మనవాటా మనం ఉపయోగించుకోలేని దుస్థితిలో ఉన్నాం. ఇప్పుడు కూడా కొట్లాడుతూ కూర్చుంటే మరికొన్ని దశాబ్దాలపాటు తెలంగాణ ఎప్పటిలాగే నీటికోసం తన్లాడాల్సి వస్తుంది. ఎగువ, దిగువ రాష్ర్టాలు ప్రాజెక్టులు పూర్తి చేసుకుని నదీ జలాలపై హక్కును ప్రకటించుకుంటా యి. కేంద్రం కూడా పూర్తయిన ప్రాజెక్టులనే పరిగణనలోకి తీసుకుని నీటి లెక్కలు, హక్కులు నిర్ణయిస్తుంది. భూసేకరణ చేయకుండా ఎక్కడా ప్రాజెక్టులు నిర్మించడం సాధ్యం కాదు. మా ఊర్లో భూమి ఎకరం రెండు లక్షలు కూడా చేసేది కాదు. తెలంగాణ ప్రభు త్వం ఎనిమిది లక్షలు ఇవ్వడానికి ముందుకువచ్చింది. మీరు ఇప్పుడే ఇవ్వద్దు. ఇంకా ఎక్కువ వచ్చేట్టు చేస్తాం అని మా ఊరి రైతులను రెచ్చగొట్టి కేసులు వేయిస్తున్నారు. కొందరైతే 20 లక్షలు ఇవ్వాలని డిమాండు చేస్తున్నారు. మాకే అన్యాయంగా అనిపిస్తున్నది అని అన్నారం ప్రాజెక్టు ముంపు గ్రామానికి చెందిన ఒక యువకుడు వాపోయాడు. ఇప్పుడు ఇస్తున్నది తీసుకోనివ్వరు. ప్రాజెక్టు పనులు మొదలు పెట్టనివ్వరు. వారిప్పిస్తామంటున్నది ఎన్నేండ్లకు తేలుతుందో అర్థం కాదు. నష్టం మాత్రం మొత్తం ప్రాంతానికి జరుగుతుంది అని ఆ విద్యావంతుడు అన్నాడు. చాలా ప్రాజెక్టుల వద్ద ఇదే కథ. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు అధికారం లో ఉండి చేయలేదు. ఇప్పు డు చేద్దామంటే అడుగడుగునా రాద్ధాంతం. సీమాంధ్ర నాయకులకు తమ ఆత్మలను, తనువులను, రాజకీయాలను అమ్ముకున్న కొంద రు నాయకులు తెలంగాణ ప్రభుత్వంపై సీమాంధ్ర నాయకులకంటే హీనంగా మాట్లాడుతున్నారు. సీమాం ధ్ర నాయకులు వదిలేసిపోయిన నీచమైన పనులన్నీ వీరు కొనసాగిస్తున్నారు. వీరిపట్ల అప్రమత్తంగా ఉండకపోతే, వీరి కుట్రలను తిప్పికొట్టకపోతే ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తికావు. తెలంగాణ బీళ్లు ఎప్పటికీ జలధారలతో నిండవు.

సాగునీరే సమాధానం


నీటి విలువను, శక్తిని గుర్తించనివారిని ఎవరూ నాశనం చేయాల్సిన పనిలేదు. సాగు, తాగునీరు ప్రాజెక్టులనూ పూర్తిచేసి ప్రతి ఎకరానికి నీరు ఇవ్వగలిగితే అదే ఇటువంటి వారి కి అంతిమగీతం అవుతుంది. 

తెలంగాణ ఒకప్పుడు సాగునీటి కోసం తాగునీటి కోసం కొట్లాడింది. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని కరెంటు కోసం అర్ధరాత్రి అపరాత్రి అల్లల్లాడిన పరిస్థితి. రైతులు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకోవలసిన పరిస్థితి. కాలువ కింద రైతులు ఖర్చులేకుండా పొలాలు పారించుకుంటూ ఉంటే తెలంగాణలో అత్యధిక శాతం రైతులు బోర్లు వేసీవేసీ విసిగి వేసారి డస్సిపోవలసిన పరిస్థితి. తెలంగాణలో అన్ని రాజకీయపార్టీల ఎజెండా ఒక్కటే ప్రాజెక్టులు ప్రాజెక్టులు ప్రాజెక్టులు…. తెలంగాణ ఉద్యమం అంతా నడిచిందే నీళ్లు, నిధులు, ఉద్యోగాల విషయంలో జరిగిన అన్యాయాల గురించే. బీజేపీ గోదావరి జలసాధన కోసం పాదయాత్రలు చేసింది. గోదావరి జలాల వినియోగం కోసం కాంగ్రెస్ ప్రత్యేక నివేదికలు తయారుచేసి ఊరేగింపులు చేసింది. కమ్యూనిస్టు పార్టీలైతే ప్రాజెక్టుల గురించి మాట్లాడని సందర్భం ఉండేది కాదు. పుచ్చలపల్లి సుందరయ్య అయితే రాష్ట్రం లో సమగ్ర నీటి వినియోగంపై ఒక పుస్తకమే రాశారు. ఇప్పటికీ రాయలసీమలో సీపీఎం సీపీఐలు ప్రాజెక్టుల గురించే కొట్లాడుతున్నాయి. రాయలసీమకు నీరివ్వాలని ఉద్యమాలు చేస్తున్నాయి. టీడీపీది మరీ విడ్డూరం. పక్కరాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ప్రాజెక్టుల నిర్మాణానికి, భూ సేకరణకు అనుసరిస్తున్న విధానం లోకవిదితం. అరటితోటలు తగులబెట్టి, రైతులను వేధించి, బెదిరించి భూములు లాక్కుంటున్న తీరు పత్రికల్లో వస్తూనే ఉంది. అక్కడ ప్రాజెక్టులు నిర్మిస్తున్న కాంట్రాక్టర్లు ఎవరో కూడా అందరికీ తెలుసు. కానీ విచిత్రంగా ఇప్పుడు ఎజెండా మారిపోయింది. ప్రభుత్వం ఏం చేసినా వ్యతిరేకించడమే ఎజెండా అయింది.

ఆరు దశాబ్దాలపాటు చేతులు కట్టుకుని ఆంధ్ర ఆధిపత్యశక్తుల ముందు అశక్తంగా నిలబడిన తెలంగాణ ఇప్పుడు మేల్కొని తనకేమి కావాలో గుర్తించి వడివడిగా అడుగులు వేస్తున్నది. తెలంగాణ అదృష్టం కొద్దీ తెలంగాణ ఆత్మ, తెలంగాణ అవసరాలు తెలిసిన నాయకత్వం తెలంగాణకు దక్కింది. ఏమి చేస్తే జీవితాల్లో మౌలికమైన మార్పులు సంభవిస్తాయో తెలిసిన నాయకత్వం వచ్చింది. అరవైయేళ్లలో సాధించలేని పనిని రెండున్నరేళ్లలో సాధించింది. తెలంగాణ వచ్చిన ఆరుమాసాల్లోనే కరెంటు సమస్య లేకుండా చేసింది ఈ ప్రభుత్వం. విడిపోతే తెలంగాణ అంధకారం అవుతుందన్న సమైక్య కాంగ్రెస్ ప్రవక్తల ముక్కుపుటాలు అదిరేలా నిత్యం వెలుగులు అందిస్తున్నది తెలంగాణ. సాధించి తీరాలన్న పంతం, మన రైతులను, మన పరిశ్రమలను మనం కాపాడుకోవాలన్న తాపత్రయం అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసింది. సమైక్యాంధ్ర ప్రభుత్వాలన్నీ కాలువలు తవ్వి కమీషన్లు తీసుకుని అడ్డమైన ప్రాజెక్టులన్నింటి కీ నివాళులు పట్టి వెళ్లిపోతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత హెడ్‌వర్క్స్ పనులు చేపట్టింది. ప్రాజెక్టుల వద్ద నిద్రలు చేసి మరీ హెడ్‌వర్క్స్ పూర్తి చేయిస్తున్నది. కల్వకుర్తి, నెట్టెంపా డు, భీమా ప్రాజెక్టుల నుంచి ఈరోజు నీరు పారుతున్నదీ అంటే తెలంగాణ పంతం సాధించి న విజయం. అదొక్కటే కాదు ప్రాజెక్టుల నుంచి గరిష్ఠమొత్తంలో నీటిని వినియోగించుకున్న సంవత్సరం ఏదైనా ఉందంటే అది ఈ సంవత్సరమే. తెలంగాణ నాయకత్వానికి, ముఖ్యం గా సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు నీటి విలువ తెలుసు. తాగు, సాగునీరు జీవితాల్లో ఎటువంటి విప్లవం తీసుకువస్తుందో డెల్టా ప్రాంతంలో ఆర్థిక జీవితం చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అందుకే ముఖ్యమంత్రికి నీటి సమస్య ఒక మనాది. నీటి సమస్యపై ఇంతగా తపన పడిన నాయకుడు తెలంగాణ జీవితంలో మరొకరు లేరు. ప్రాజెక్టుల పూర్తికోసం ఇంతగా వెంటాడి న ప్రభుత్వం మరొకటి లేదు.

తెలంగాణలో టీడీపీ ఒక అవాంఛిత, అసంగత రాజకీయ శక్తి. దానికి మనుగడకానీ, భవిష్యత్తుకానీ, తెలంగాణతనంకానీ ఉండే అవకాశం ఎంతమాత్రం లేదు. ఆ వేదికలపై నిలబడి తెలంగాణ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తే అది తెలంగాణ శక్తులకు దీవెన. నువ్వెవరి పక్కన నిలబడి మాట్లాడుతున్నావు, ఎవరికోసం మాట్లాడుతున్నావు అన్నది జనం తేలిగ్గా గ్రహించగలుగుతారు.

నీళ్లు, కరెంటిస్తే చాలు. మాకు అంతకంటే గొప్ప మేలు మరొకటి లేదు. మా జీవితాలను మేము బాగు చేసుకోగలం. మా పిల్లలను బాగా చదివించుకోగలం. మా ఇళ్లను మేము బాగు చేసుకోగలం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు నమ్మకం కలుగుతున్నది. అంతటా మార్పు వస్తున్నది అని ఒక రైతు నాయకుడు చెప్పారు. ఆయన అన్ని పార్టీలనూ చూశా రు. అన్ని ప్రభుత్వాలనూ చూశారు. అన్ని జెండాలనూ మోశారు. ఇటీవల ఒక పల్లెలో ఒక కార్యక్రమానికి వెళి తే ఒక మధ్యతరగతి బుద్ధిజీవి ప్రభుత్వానికి వ్యతిరేకం గా ఏదేదో మాట్లాడుతున్నారు. కొద్దిసేపు చూసిన తర్వాత మరో మిత్రుడు మీ సమస్య ఏమిటి? మీరు ఏమి కావాలనుకున్నారు? ఏమి కాలేదు? ఎందుకు ఈ వలపోత? సూటిగా చెప్పండి? అని ఆ ఉపన్యాసకర్తను ప్రశ్నించాడు. ఒక్కసారిగా ఆయనకు పాలుపోలేదు. కరెంటు రావడం లేదా? నీరు రావడం లేదా? పింఛన్లు రావడం లేదా? సంక్షేమ ప్రయోజనాలు అం దడం లేదా? మీ కోపం దేనిపైన చెప్పండి? అని మళ్లీ నిలదీశాడు మిత్రుడు. ప్రభుత్వం పనితీరు బాగాలే దు అని క్లుప్తంగా సమాధానం చెప్పాడు. ఎట్లా? ఎం దుకు? కారణం ఉండాలి కదా? అని రెట్టించాడు. అత ని నుంచి సమాధానం లేదు. ప్రభుత్వం మీకు అందుబాటులో లేదా? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మీకు అందుబాటులో లేరా? మునుపు ఏ మంత్రయి నా, ఏ ఎమ్మెల్యే అయినా ఇప్పటికంటే ఎక్కువగా ప్రజ ల మధ్యకు వచ్చారా? ప్రజలకు ఇంత చేరువగా ప్రభు త్వం వచ్చిందా? అని మిత్రుడు రెట్టించాడు.

ఆ బుద్ధిజీవి అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. చాలామం దిలో ఒక అకారణ అసంతృప్తి ఉంది. మనుషుల్ని చూసి, కులాలను చూసి, వ్యక్తిగత ఇష్టాయిష్టాలను పునాదిగా చేసుకుని ఏర్పాటు చేసుకున్న అభిప్రాయా లు తప్ప మరో కారణం కనిపించలేదు. కాసేపటికి మళ్లీ వచ్చి, భూ సేకరణ ఇలా ఎలా చేస్తారు? అని ఏదో కనిపెట్టిన వాడిలా ఓ ప్రశ్న సంధించాడు. దేశంలో భూ సేకరణ చేయకుండా ఏ ప్రాజెక్టు అయినా నిర్మించా రా? టీడీపీ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, బీజేపీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో భూ సేకరణ జరుగడం లేదా? తెలంగాణ ఆరు దశాబ్దాల కొట్లాట తర్వాత తనను తాను పరిపాలించుకునే అవకాశం దక్కించుకుంది. ఇంత సుదీర్ఘకాలం జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ఎంత వేగంగా అభివృద్ధి బాటలో పయనించాలి? ఎంత త్వరితగతిన పనులు చేసుకోవా లి? భూ సేకరణ చేయకుండా ప్రాజెక్టులు, కాలువలు, రిజర్వాయర్లు నిర్మించడం ఎలా? ప్రాజెక్టులు, రిజర్వాయర్లు లేకుండా తెలంగాణను నిత్య కరువుల నుంచి, ఆర్థిక సంక్షోభాల నుంచి విముక్తి చేయడం సాధ్యమేనా?

గోదావరి, కృష్ణా నదుల్లో మన రాష్ర్టానికి సుమారు 1400 టీఎంసీల వాటా నీరు ఉంది. ఇప్పటిదాకా మనం వాడుకుంటున్న జలాలు 300 టీఎంసీలకు మించలేదు. తెలంగాణ వచ్చిన తర్వాతనే అన్ని ప్రాజెక్టుల్లో మన వాటాను గరిష్ఠమొత్తంలో వాడుకోవడం మొదలైంది. ఇప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి కనీసం వెయ్యి టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతున్నది. కోటి ఎకరాల సాగు లక్ష్యం అలా పెట్టుకున్నదే. సుమారు 350 టీఎంసీల నీటిని నిల్వచేయగల రిజర్వాయర్లు, బరాజులను ప్రభుత్వం సంకల్పించింది. అవి పూర్తయిన రోజు తెలంగాణకు పండుగే. అన్ని విమర్శలకు నీరే సమాధానం.

నీటి విలువను గుర్తించకనే సమైక్యాంధ్ర పాలనలో టీడీపీ, కాంగ్రెస్ నాయకత్వాలు ఎలా చెబితే అలా డూడూ బసవన్నల్లా వ్యవహరించారు తెలంగాణ నాయకులు. ఇప్పుడు కూడా నీటి విలువను, శక్తిని గుర్తించకుండా అడ్డగోలు వాదనలు చేస్తున్నారు. సహేతుక విమర్శల పరిధిని దాటి అకారణ ద్వేషాన్ని అక్కసును ప్రదర్శిస్తున్నారు. ఒక టీడీపీ నాయకుడైతే ఆం ధ్రా కాంట్రాక్టర్ల గురించి మాట్లాడుతుంటే రోత పుడుతున్నది. ఆయన పనిచేస్తున్నది ఆంధ్రా ఆధిపత్య పార్టీ లో. ఆయన పాటించేది ఆంధ్ర నాయకుని ఆదేశాలు. ఆయన కోరుకున్నది తెలంగాణకు లోకేశ్‌బాబు నాయకత్వం. తెలంగాణకు హాని తలపెడుతున్నది ఆయన శిరసావహిస్తున్న ఆంధ్రా ప్రభుత్వాధినేతే. ఇప్పటికీ రాష్ట్ర విభజన పూర్తికాకుండా ముప్పు తిప్పలు పెడుతున్నది ఆంధ్రా ప్రభుత్వమే. హైకోర్టు విభజన జరుగనివ్వరు. అడ్డగోలుగా న్యాయమూర్తుల నియామకాలు చేసుకుపోతారు. తొమ్మిదో షెడ్యూలు సంస్థల విభజన జరుగనివ్వరు. నీళ్లు నిధులపై నిత్యం పంచాయితీలు చేస్తారు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మాటిమాటికి కేంద్రానికి లేఖలు రాస్తారు. అయినా ఇక్కడ తరుచూ తొడలు కొట్టే ఈ అభినవ వీరతెలంగాణవాది చంద్రబాబును ఒక్కమాట అనరు. ఆంధ్ర ప్రభుత్వ చర్యలను తప్పు పట్టరు. పైగా లోకేశ్‌బాబును తెలంగా ణ నాయకునిగా పంపించమని చంద్రబాబు గడ్డం పట్టుకుని అడుగుతారు. ఆంధ్రా కాంట్రాక్టర్లు చంద్రబాబుకు సేవ చేయవచ్చు. అదే కాంట్రాక్టర్లు ఇక్కడ పనిచేస్తే తప్పు. తెలంగాణలో టీడీపీ ఒక అవాంఛిత, అసంగత రాజకీయ శక్తి. దానికి మనుగడకానీ, భవిష్యత్తుకానీ, తెలంగాణతనంకానీ ఉండే అవకాశం ఎంతమాత్రం లేదు. ఆ వేదికలపై నిలబడి తెలంగాణ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తే అది తెలంగాణ శక్తులకు దీవెన. నువ్వెవరి పక్కన నిలబడి మాట్లాడుతున్నావు, ఎవరికోసం మాట్లాడుతున్నావు అన్నది జనం తేలిగ్గా గ్రహించగలుగుతారు.

అధికారపక్షంలో ఉన్నప్పుడు ఎలాగూ సాగునీటి సోయి లేకపోయింది. కృష్ణా నదిని మళ్లించుకుపోయే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును గొప్పగా కీర్తించారు. వారి ఎత్తిపోతల పథకాలకు వెళ్లి హారతులు పట్టారు. జెండాలు ఊపారు. వాటివల్ల తెలంగాణకు జరుగుతున్న నష్టం ఏమిటో వారెవరూ అప్పట్లో గుర్తించలేదు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతయినా వారు మన నదులేమిటి? మనకు రావలసిన నీరేమిటి? అందుకు చేయాల్సిన పనులేమిటి? అన్న జ్ఞానాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయడంలే దు.

కాంగ్రెస్ ఒక దిక్కుతోచని దివాణం. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో వారికి ఇప్పటికీ అలవాటు కాలేదు. తిట్టి పెద్దవాళ్లు కావాలన్న తాపత్రయం తప్ప నిర్మాణాత్మక దృష్టి ఇసుమంత కూడా అలవర్చుకోని పార్టీ అది. అధికారపక్షంలో ఉన్నప్పుడు ఎలాగూ సాగునీటి సోయి లేకపోయింది. కృష్ణా నదిని మళ్లించుకుపోయే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును గొప్పగా కీర్తించారు. వారి ఎత్తిపోతల పథకాలకు వెళ్లి హారతులు పట్టారు. జెండాలు ఊపారు. వాటివల్ల తెలంగాణకు జరుగుతున్న నష్టం ఏమిటో వారెవరూ అప్పట్లో గుర్తించలేదు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతయినా వారు మన నదులేమిటి? మనకు రావలసిన నీరేమిటి? అందుకు చేయాల్సిన పనులేమిటి? అన్న జ్ఞానాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయడంలే దు. బీజేపీ చంద్రబాబుకు తెలంగాణకు మధ్య ఎటూ తేల్చుకోలేని పార్టీ. వారివల్ల తెలంగాణకు జరిగిన నష్టం ఏమిటో వారికీ తెలుసు. రాష్ట్ర విభజన ప్రక్రియ ఇంకా ఎందుకు పూర్తికాలేదో తెలుసు. హైకోర్టు విభజన ఇది గో ఇలా చేయిస్తాం అని చెప్పి ఏడాది గడచిపోయింది. ఆంధ్రలో రెండు డజన్లకు పైగా జాతీయస్థాయి విద్యా, పరిశోధన సంస్థలను మంజూరు చేసిన కేంద్రం, తెలంగాణకు ఒక్క ఎయిమ్స్ ఇంతవరకు ఇవ్వలేదు. ఉక్కుకర్మాగారం ఊసే మరిచిపోయారు. అయినా వారూ తెలంగాణ ప్రభుత్వంపై ఒంటికాలుపై లేస్తారు. తెలంగాణ వచ్చిన ఆనందం, తెలంగాణను బాగు చేసుకోవాలన్న తాపత్రయం, అందుకోసం ఐక్యంగా ముందుకు కదలాలన్న ఆలోచన ఏకోశానా లేకుండాపోయింది.

ఆరునూరైనా నీరొక్కటే తెలంగాణను రక్షించగలదు. అందరూ ఆ విషయం గుర్తిస్తే మంచిది. నీటి విలువ ను, శక్తిని గుర్తించనివారిని ఎవరూ నాశనం చేయాల్సిన పనిలేదు. సాగు, తాగునీరు ప్రాజెక్టులనూ పూర్తిచేసి ప్రతి ఎకరానికి నీరు ఇవ్వగలిగితే అదే ఇటువంటి వారి కి అంతిమగీతం అవుతుంది. గోదావరి, కృష్ణా నదుల్లో మన రాష్ర్టానికి సుమారు 1400 టీఎంసీల వాటా నీరు ఉంది. ఇప్పటిదాకా మనం వాడుకుంటున్న జలాలు 300 టీఎంసీలకు మించలేదు. తెలంగాణ వచ్చిన తర్వాతనే అన్ని ప్రాజెక్టుల్లో మన వాటాను గరిష్ఠమొత్తంలో వాడుకోవడం మొదలైంది. ఇప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి కనీసం వెయ్యి టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతున్నది. కోటి ఎకరాల సాగు లక్ష్యం అలా పెట్టుకున్నదే. సుమారు 350 టీఎంసీల నీటిని నిల్వచేయగల రిజర్వాయర్లు, బరాజులను ప్రభుత్వం సంకల్పించింది. అవి పూర్తయిన రోజు తెలంగాణకు పండుగే. అన్ని విమర్శలకు నీరే సమాధానం.