ఇదేనా అభివృద్ధి? తెలంగాణపై ఇదేనా ప్రేమ?

మీ యోగివేమన యూనివర్సిటీ 100 కోట్లతో రెండేళ్లలోనే పూర్తయింది ఎందుకు? మా తెలంగాణ యూనివర్సిటీ, మా మహాత్మగాంధీ యూనివర్సిటి, మా పాలమూరు యూనివర్సిటీ నిధులు లేక ఇంకా సతమతమవుతున్నాయెందుకు?

కడపలో మీ రిమ్స్ వందలకోట్ల రూపాయలతో సకల సౌకర్యాలతో పూర్తయిందెట్లా? నల్లగొండ జిల్లా బీబీనగర్‌లో నిమ్స్, ఆదిలాబాద్‌లో రిమ్స్ నిధులు, భవనాలు, సిబ్బంది లేక పాడుబడిపోతున్నాయెందుకు?

మీ పోతిరెడ్డిపాడు మూడేళ్లలో పూర్తయిందెట్లా? మా శ్రీశైలం ఎడమకాలువ  మూడు దశాబ్దాలయినా ఇంకా పూర్తి కాలేదెట్లా?

మీ హంద్రీ-నీవాలో నీళ్లు పారుతున్నాయెందుకు? దానితోపాటే మొదలుపెట్టిన మా కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టుల కింద ఇంకా కాలువలు తవ్వలేదెందుకు?

మీ పులిచింతల, మీ పోలవరం ఆగమేఘాలమీద నిర్మాణం అవుతుంటే మా ఇచ్చంపల్లిని, కంతానపల్లిని ఇంకా ప్రారంభించలేదెందుకు?

మీ సీమాంధ్రలో పది ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయెందుకు? మా తెలంగాణలో నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డిలలో ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించలేదెందుకు?

మీ రాయలసీమకు ఇంత కరువులోనూ శ్రీశైలం నుంచి 24 టీఎంసీల నీరు, ఆంధ్రకు 40 టీఎంసీల నీరు తీసుకెళ్లారెందుకు? నల్లగొండకు నాలుగు టీఎంసీలు కూడా ఇవ్వలేదెందుకు?

మీ నాన్న తెలంగాణను అభివృద్ధి చేసి ఉంటే మా తెలంగాణలో ఆరేళ్లలో పదివేల మంది రైతులు ఎందుకు మరణించారు? వందలాది మంది చేనేత కార్మికులు ఎందుకు నేలకొరిగారు?

మీ నాన్న మాటమీద నిలబడే మనిషే అయితే, విశ్వసనీయత ఉన్నవారే అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇంతకాలం ఆగిఉండేదా? 900 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవలసిన అగత్యం దాపురించేదా?

మీ నాన్న అవకాశవాది కాకపోతే తెలంగాణలో ఎన్నికలు ముగియగానే, నంద్యాలలో తెలంగాణపై విషం చిమ్మేవారా?

మీ  సీమాంధ్ర రియల్టర్లకు, మీ కంపెనీలకు దోచిపెట్టడంకోసం మా తెలంగాణలోని రెండు లక్షల ఎకరాల భూములను కొల్లగొట్టింది నిజం కాదా?

మీ కుటుంబానికి ఏడేడు తరాలకు సరిపోను దాచిపెట్టడంకోసం మా తెలంగాణలోని బయ్యారం గనులను రిజర్వు చేసింది నిజం కాదా?

మీరు కుటుంబాలు కుటుంబాలు రాజ్యాలు చేయవచ్చునెట్లా? మావాళ్లు ఒక్కరో ఇద్దరో చేయకూడదెట్లా?

మీరు తెలంగాణలో గెలవాలనుకుంటున్నది ఆంధ్రా ఆధిపత్యాన్ని కొనసాగించడంకోసం! మేం తెలంగాణలో గెలవాలనుకుంటున్నది సొంత రాజకీయ అస్తిత్వంకోసం!

మీరు తెలంగాణకు వ్యతిరేకం కాదు సరే, అనుకూలం ఎలాగో చెప్పగలరా?

తెలంగాణ మీరు ఇచ్చేవారు కాదు సరే, తెలంగాణ సాధనకోసం ఏ చేస్తారో చెప్పగలరా?

తెలంగాణకోసం ఇప్పుడే మీ ప్రాంత నాయకులను, ఎమ్మెల్యేలను ఒప్పించలేనివారు రేపు అధికారంలోకి వస్తే ఒప్పిస్తారని ఎలా నమ్మాలి?

ఆంధ్రాలో ఏమవుతుందోనన్న భయంతో తెలంగాణపై వైఖరినే చెప్పలేని పార్టీలు, రేపు తెలంగాణ సాధనకు సహకరిస్తాయని ఎందుకు విశ్వసించాలి?

మీరు మనుషులే ఇక్కడ, మీ మనసులు అక్కడే!

గీతమ్మ అమ్మ చెప్పిన మాట

ఈ మంత్రులు మాకెందుకు? వీళ్లలో పనికివచ్చే మంత్రులేరి?
రొట్టెముక్కలకు ఆశపడి నోళ్లు మూసుకున్నారు!
బుడంకాయ దొంగలంటే మంత్రులు భుజాలు తడుముకుంటున్నారు!
ఇంతమంది అడుగుతుంటే మంత్రులు ఎందుకు రాజీనామా చేయరు?
ఏముఖం పెట్టుకుని అసెంబ్లీలో కూర్చుంటున్నారు?
మంత్రుల తీరు సిగ్గు చేటు?

1969 మార్చి న అసెంబ్లీలో ఈశ్వరీబాయి ఆగ్రహం

కోదండరాం-గీతారెడ్డి వివాదం నేపథ్యంలో
ఈశ్వరీబాయి ప్రసంగం పూర్తి పాఠం చదవండి-

‘రెండు నెలలకు పైగా ఇక్కడ(తెలంగాణలో) గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు సాగడానికి కారణం, బాధ్యులు కాంగ్రెస్ మంత్రులు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్‌వారిపైనే నేను నేరం మోపుతున్నాను. ఈ గొడవల గురించి ముఖ్యమంత్రిగాని, మంత్రులుగాని పట్టించుకున్న పాపానపోలేదు. నేడు పిల్లలను ఉద్రేకంలోకి దించారు. అసలు విద్యార్థులు ఈ సమస్యను తీసుకోవడానికి కారణం ఏమిటి? భాషా ప్రాతిపదికపై 1956లో ఆంధ్ర తెలంగాణలు కలవాలన్నప్పుడు ఒక ఒప్పందానికి రావడం జరిగింది. అప్పుడు తెలంగాణలో అందరికీ ఆంధ్రలో కలవాలని లేదు. మంత్రులలో కొందరు వేరుగానే ఉండాలన్నారు. కొందరు విశాలాంధ్ర కావాలన్నారు. నెహ్రూ, శాస్త్రి మీరంతా ఒక భాషవారు ఒక ఒప్పందానికి రావాలి అన్నారు. ఈనాడు ఆ ఒప్పందంమీదనే గొడవలు జరుగుతున్నాయి. దానిని జెంటిల్‌మెన్ అగ్రిమెంట్ అన్నారు….జెంటిల్‌మెన్ అగ్రిమెంట్‌లో ఒక్కటయినా అమలులోకి వచ్చిందా?…ఒక ఒప్పందం ఉన్నతర్వాత ఆ ఒప్పందం ప్రకారం ఎందుకు నడవలేదు? ఈనాడు మనలో భేదాలు రావడానికి కారణం ఏమిటి? బ్రహ్మనందారెడ్డిగారు ఆ పద్ధతిని ఎందుకు తొలగించారు? ఇప్పుడు మీకు తొమ్మిది మంది మంత్రులు ఇచ్చాము అని అంటున్నారు. ఈ మంత్రులు మాకు ఎందుకు? వీరిలో ఒక్కరు కూడా పనికి వచ్చేమంత్రిలేరు. ఈ మంత్రులు మాకు అక్కర్లేదు. ఈనాడు ఇన్ని గొడవలు జరుగుతున్నా, పిల్లలను తుపాకి గుళ్లతో కాల్చివేస్తున్నారు. అయినా ఒక్క మినిస్టర్ కూడా వచ్చి అడగలేదు. అటువంటప్పుడు మాకు ఈ మంత్రులెందుకు? కాంగ్రెస్ సమావేశం జరిగినప్పుడయినా ఈ మంత్రులుగాని, కాంగ్రెస్ సభ్యులుగాని, ఇట్లా అన్యాయం జరుగుతోందని, తెలంగాణవారికి పనులు, సర్వీసెస్‌లో ఉద్యోగాలు ఇవ్వడం లేదని, వారికి సీనియారిటీ దెబ్బతింటోందని మాట్లాడుతున్నారా అని అడుగుతున్నాను. ఈ మంత్రులు తమ రొట్టె ముక్కలకు ఆశపడి మాట్లాడకుండా ఊరుకుంటున్నారు….

ఒకవైపు బ్రహ్మనందారెడ్డి స్టూడెంట్స్, ఇంకోవైపు వేరే స్టూడెంట్స్. మాకు వ్యతిరేకంగా ఉన్న స్టూడెంట్స్‌ను ఎక్కువ సంఖ్యలో పట్టుకుని జైళ్లలో పెట్టండని పోలీసులకు చెబుతారు వారు. పిల్లలు పిల్లల మధ్య అన్యాయాలు చేసి మంత్రులు తమ పదవులలో ఉంటున్నారు రాజీనామాలు చేయకుండా. ఒక్కరు కాదు. ప్రతిపక్షం అంతా అడుగుతోంది రాజీనామా చేయమని. విద్యార్థులు అడుగుతున్నారు. అయినా ఏ ముఖాలు పెట్టుకుని అసెంబ్లీలో కూర్చున్నారు. నిజంగా సిగ్గుచేటు. ఇప్పుడు సెక్రెటేరియట్‌లో 50 మంది ఆఫీసర్లు ఉంటే అందులో తెలంగాణ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు? కీ పోస్టులు ఎవరి చేతిలో ఉన్నాయి? చీఫ్ సెక్రెటరీ ఎంటీ రాజు. ఇదివరకున్న ఇద్దరిలో కూడా మూడు కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని ముంచిపోయిన నంబియారు ఉన్నారు. ఆయన సంజీవరెడ్డి అనుచరుడు. అంతకుముందు ఉన్నవారు కూడా ఎవరికో చుట్టమో…బంధువో లేక తెలిసినవారో….

మన మంత్రులకు బుడంకాయ దొంగ అంటే భుజాలు తడిమి చూసుకోవడం అలవాటు….

మంత్రి తిమ్మారెడ్డి సెపరేట్ తెలంగాణ కావాలనేవారు ట్రెయిటర్స్ అని అన్నారు. కానీ ఆ నినాదం ఎందుకు వచ్చింది?  12 సంవత్సరాలైనా పాకిస్తాన్‌లో ఉన్నామా? హిందుస్థానంలో ఉన్నామా అన్న అనుమానం వస్తోంది. ఈ పరిస్థితులకు కారణం మంత్రులు, ప్రభుత్వం కాక మరెవరు? ఈ పరిస్థితికి కాంగ్రెస్‌వారే కారకులు. అందరం కలసి మెలసి ఉండాలంటే కాంగ్రెస్ మంత్రులు రాజీనామా చేయాలి.

కలిసి నడవాలి, నిలిచి గెలవాలి

బ్బులు చెదరిపోతున్నాయి. తెలంగాణవాదులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న స్పష్టత క్రమంగా సమీపిస్తున్నది. కర్తవ్యం బోధపడుతున్నది. టీఆరెస్ కరీంనగర్ సమావేశాల అనంతరం కేసీఆర్ చేసిన ప్రకటన తెలంగాణవాదుల మనసులను తేలికపర్చింది. చీలికలు పేలికలైన తెలంగాణ రాజకీయోద్యమ శ్రేణుల్లో ఇంతకాలంగా నెలకొన్న అయోమయం, అనుమానాలు తొలగిపోతాయన్న నమ్మకం కలుగుతున్నది. చేరాల్సిన గమ్యం, చేయాల్సిన కృషి, నడవాల్సిన బాట ఇప్పుడు కొంత స్పష్టంగా కనిపిస్తున్నది. ‘కాంగ్రెస్‌లో విలీనం’ మాట తెలంగాణవాదుల్లో సృష్టించిన స్తబ్దత, నిర్లిప్తత ఈ సమావేశాలు పటాపంచలు చేశాయి. కాంగ్రెస్‌తో చర్చలు తప్పు కాదు. చర్చల ద్వారాన్ని మూసేయడం కూడా సమంజసం కాదు. కానీ కాంగ్రెస్ మనసులో మాట చెప్పకుండా, అధికారికంగా చర్చలకు ఆహ్వానించకుండా వారి గడపలోకి మనం వెళ్లడమే విమర్శలకు కారణమైంది. కాంగ్రెస్ ఎప్పటిలాగే మోసపూరితంగా వ్యవహరించింది. ఒకవైపు ఢిల్లీలో చర్చలు జరుగుతుండగానే, టీఆరెస్ తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమ సంఘాలకు దూరమైపోయిందని కాంగ్రెస్‌కు ప్రత్యర్థులు నూరిపోశారు. ఉద్యమసంఘాలు, టీఆరెస్ వేరైతే తెలంగాణ ఇవ్వకుండానే రాజకీయంగా ఆడుకోవచ్చునని మరోసారి కాంగ్రెస్ భావించింది. అందుకే కేసీఆర్‌తో చర్చల్లో అన్ని మలుపులు. కేసీఆర్ ఉద్యమంతో ఉంటూనే చర్చలకు వెళితే పర్యవసానం మరోలా ఉండేది. 2004 ఎన్నికలకు ముందు ఏం జరిగిందో  మనందరికీ తెలుసు. టీఆరెస్‌తో పొత్తు కోసం కాంగ్రెస్ భూమీ ఆకాశాలూ ఏకం చేసింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేసీఆర్ చుట్టూ ఎన్నిసార్లు పరిభ్రమించారో చూశాం. రాజశేఖర్‌రెడ్డి అభీష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్ఠానం నేరుగా టీఆరెస్‌తో చర్చలకు వచ్చింది. చివరికి గులాంనబీ ఆజాద్ స్వయంగా కేసీఆర్ ఇంటికి వచ్చి ఒప్పందంపై సంతకాలు చేయించుకుని వెళ్లారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో కాంగ్రెస్ ఎలా మోసం చేసిందో చూశాం. కాంగ్రెస్ మోసం చేయకపోతే ఆశ్చర్యపడాలి. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి అన్ని రోజులు వారితో చర్చలు జరుపడం, కాంగ్రెస్ ఆ చర్చలకు విశ్వసనీయత ఇవ్వకపోవడం టీఆరెస్ శ్రేణులను, తెలంగాణవాదులను నైతికంగా దెబ్బతీసింది.

నిజానికి కేసీఆర్ క్షేత్రంలో బలపడితే, తెలంగాణ ఉద్యమం బలంగా ఉంటే ఢిల్లీ ఇక్కడికే వస్తుంది. చర్చలు ఇక్కడే జరుగుతాయి. ఆంటోనీ చిరంజీవి ఇంటికి వచ్చి ఆహ్వానించిన విషయం మనం మరచిపోకూడదు. ఎన్నికలు ఆఖరి అస్త్రం. అందుకు. సన్నాహాలు చేస్తూనే ఉద్యమ కాకను పెంచడం అవసరం. తెలంగాణ 2014 ఎన్నికలకు ముందు వస్తుందా తర్వాత వస్తుందా అన్న చర్చ కూడా ఇప్పుడు అప్రస్తుతం. మన పని మనం చేసుకుంటూ పోవాలి. రాజకీయ పార్టీల బలం ప్రజా పునాదుల్లోనే ఉంటుంది. కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, కొత్తగా వైఎస్సార్ కాంగ్రెస్ అయినా తెలంగాణలో ఇంకా ఈ మాత్రం రాజకీయాలు చేస్తున్నాయీ అంటే ఎంతో కొంత మంది ఆ పార్టీల వెంట ఉండడంవల్లనే సాధ్యమవుతుంది. తెలంగాణలో సీమాంధ్ర రాజకీయ ఆధిపత్యానికి ప్రతిరూపాలుగా వ్యవహరించిన కాంగ్రెస్, తెలుగుదేశం ఇక్కడి ప్రజలను పదేపదే మోసం చేసి ఇప్పుడు పతనమయిపోయాయి. పాతబడిపోయాయి. అందుకే ఇక్కడి బానిస రాజకీయ నాయకత్వం కొత్త అవతారాలకోసం, మారువేషాలకోసం ఎదురుచూస్తున్నది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ రాజకీయ నాయకులు జగన్‌మోహన్‌రెడ్డిలో ఆ కొత్త అవతారాన్ని చూస్తున్నారు. విషాదం ఏమంటే  కాంగ్రెస్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులు తెలంగాణ ఉద్యమానికి ముందుండి నాయకత్వం వహించడానికి బదులు పదేపదే వంచనకు పాల్పడుతూ వచ్చారు. నిజానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకోసం 41 మంది ఎమ్మెల్యేలను సమీకరించి సోనియాగాంధీకి మహజరు సమర్పించింది ప్రధానంగా ఈ సామాజిక వర్గానికి చెందిన నాయకులే. కానీ ఆ తర్వాత ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మసలుకోవడంలో వీరు విఫలమయ్యారు. నిజానికి ఈ సామాజికి వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పూనుకుని బరిగీసి నిలబడితే తెలంగాణ ఎప్పుడో వచ్చేది. రాజీపడిపోవడాలు, అమ్ముడుపోవడాలు, చివరికి ఫార్చూనర్ కార్లకు కూడా పడిపోవడాలు ఈ నాయత్వాన్ని తెలంగాణ ప్రజల ముందు పలుచన చేశాయి. ఇప్పుడు జానారెడ్డి ఏకంగా చేతులెత్తేశారు. మా కన్నా ఎక్స్‌పర్ట్ ఉంటే చూసుకోండని ఆయన తెలంగాణ ప్రజలను బెదిరిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గోడమీద కూర్చోని కేసీఆర్ ఏం చేయాలో చెబుతున్నారు. ఇంద్రకరణ్‌రెడ్డి ఇప్పటికే జగన్‌మోహన్‌రెడ్డి పంచన చేరిపోయారు. తెలంగాణ జాతరలు నిర్వహించిన జిట్టా బాలకృష్ణారెడ్డి భువనగిరిలో విజయమ్మను ఊరేగించారు. సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకున్న నేతను, డిసెంబరు 10న తెలంగాణకు వ్యతిరేకంగా జరిగిన సీమాంధ్ర కుట్రలో భాగాస్వాములైన వారిని రెడ్డిజన ఉద్ధారకుడిగానో, తెలంగాణ ప్రజాబంధుగానో నమ్మించాలని చూడడం విచిత్రం.

ఎంతోదూరం ఎందుకు- చరిత్రాత్మక ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్సు కళాశాల భవనానికి ఎదురుగా చెట్టుకు ఉరివేసుకుని ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటాడు. ఎన్ని హామీలు, ఎన్ని ఉద్యమాలు, ఎన్ని త్యాగాలు, ఎన్ని ఆశాభంగాలు, ఎంత గుండెకోత- అయినా తెలంగాణ రాలేదు! తెలంగాణపై భరోసా ఇవ్వని ఈ వ్యవస్థల్ని చూసి గుండెపగిలిన ఆ పసిహృదయం ఆత్మబలిదానానికి సిద్ధపడింది. యూనివర్సిటీ విద్యార్థులు గుండెలవిసేలా దుఃఖిస్తున్నారు. నినదిస్తున్నారు. అంతిమయాత్రకోసం బాష్పవాయుగోళాలను ఎదుర్కొంటున్నారు. వీధిపోరాటాలకు సిద్ధపడుతున్నారు. ఒకవైపు ఇదంతా జరుగుతుంటే ఉదయం ఒక సీమాంధ్ర టీవీలో ‘మీరు ఎంత గింజుకున్నా తెలంగాణారాదు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదు. వాళ్లు ఇస్తే మేం అడ్డంపడం’ అని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర నేత టెలివిజన్ తెరపై వికటాట్టహాసం చేస్తుంటాడు. ‘భలే చెప్పావ’న్నట్టు సీనియరు యాంకరు, జర్నలిస్టు స్క్రీనంతా నవ్వుపులుముకుని ఆ ప్రకటనకు ముక్తాయింపు ఇస్తుంటాడు. అయినా వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరడానికి తెలంగాణ కాంగ్రెస్ పాత ముత్తయిదువలంతా క్యూకడతారు. తెలంగాణకు, హైదరాబాద్‌కు వైఎస్సార్ చేసిన నష్టం మరెవరూ చేయలేదు. 2004 ఎన్నికల్లో గెలిచింది మొదలు 2009 సెప్టెంబరులో మరణించేవరకు తెలంగాణ రాకుండా అడ్డుపడింది రాజశేఖర్‌రెడ్డే. పదిమంది టీఆరెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఆగం పట్టించాలని చూసింది రాజశేఖర్‌రెడ్డే. ఆ తర్వాత ప్రతి సందర్భంలోనూ తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయాలని చూసిందీ ఆయనే. 2007లో అధిష్ఠానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ప్రయత్నిస్తే, తాను రాజీనామా చేసి ఇటునుంచి ఇటే బెంగుళూరు వెళతానని, ఆ తర్వాత జరిగే పర్యవసానాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని రాజశేఖర్‌రెడ్డి బెదిరించారని సీనియర్ కాంగ్రెస్ నాయకుడొకరు చెప్పారు. 2009 ఎన్నికల ముగింపు సన్నివేశంలో హైదరాబాద్‌కు రావాలంటే వీసా తీసుకోవాల్సి వస్తుందేమోనని బెదిరించిన పెద్దమనిషీ ఆయనే. పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణానదిని రాయలసీమకు మళ్లించుకుపోయిన మహానుభావుడు రాజశేఖర్‌రెడ్డి. ఆయన వారసుడు జగన్‌మోహన్‌రెడ్డి. అందుకే ఆయన పార్లమెంటులో సమైక్యాంధ్ర ప్లకార్డును టీడీపీ వాళ్ల చేతుల్లోంచి లాక్కొని మరీ ప్రదర్శించారు. పైకి ఎన్నిమాటలయినా చెప్పనీయండి- తెలంగాణకు చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికీ వ్యతిరేకులే. తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడయినా కుట్రలు చేసేవారే. వీళ్ల నాయకత్వాలను, వీళ్ల పార్టీలను వదిలించుకోకుండా తెలంగాణకు విముక్తి లేదు, రాదు.

ఎన్నికల సంగతి తర్వాత. తెలంగాణ ఇవ్వకపోతే ఇక్కడ ఏ పార్టీ బతకలేదన్న భయం కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్‌ల్లో పుట్టించాలి. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్‌లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిస్తూ లేఖలు ఇస్తే తప్ప ఆ పార్టీల్లో ఉండడానికి, చేరడానికి తెలంగాణ రాజకీయ నేతలెవరూ అంగీకరించరాదు. తెలంగాణపై నిర్ణయం చేయకపోతే కాంగ్రెస్‌లో ఉండలేమని తెలంగాణ కాంగ్రెస్ నేతలూ స్పష్టం చేయాలి. తెలంగాణలో సర్వనాశనం అవుతామన్న వెరపు ఒక్కటే అన్ని పార్టీలను లొంగదీయగలుగుతుంది. అడుగులూడిపోవడం, పునాదులు కదలిపోవడం మొదలయితే అన్ని పార్టీలూ దారికి వస్తాయి. గ్రామస్థాయి నాయకులు మొదలు ఎంపీ, ఎమ్మెల్యేలవరకు అందరూ ఆ పార్టీలను వదిలిపెట్టడం మొదలు పెడితే తెలంగాణ సాధనకోసం 2014వరకు వేచి చూడనవసరం లేదు. ఆ పార్టీలలో ఆ భయం, ఆ వెరపు పుట్టించవలసింది తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న టీఆరెస్, టిజేయేసీలే. తెలంగాణ వ్యతిరేకుల్లో భయం పుట్టించడం ఎంత అవసరమో, సంప్రదింపుల ప్రయత్నాల్లో, సంధికాలాల్లో  తెలంగాణవాదులను ఆవరించిన నిర్లిప్తతను తొలగించడం కూడా అంతే అవసరం. తెలంగాణవాదుల్లో కోల్పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత ఈ రెండు శక్తులదే. అందుకు కరీంనగర్ సమావేశాల్లో కేసీఆర్ చెప్పినట్టు ఒకటే మార్గం- ఒకవైపు రాజకీయ సమీకరణ, మరోవైపు ఉద్యమ కార్యాచరణ. ఇవి రెండూ సమాంతరంగా, పరస్పరాశ్రీతంగా సాగాలి. రాజకీయ శక్తులు ఒక గొడుగుకింద సమీకృతం కావాలి. తెలంగాణ ఉద్యమ శక్తుల సంఘటిత వేదికలను మళ్లీ తెలంగాణ ప్రజలముందు ఆవిష్కరించాలి. ఆ వేదికలపై కేసీఆర్, కోదండరాం, స్వామిగౌడ్, గద్దర్, బాల్‌కిషన్…అందరూ కనిపించాలి. ఊరూవాడా ధూం ధాంలతో మారుమోగిపోవాలి. తెలంగాణ రాజకీయాధికారాన్ని మన చేతుల్లోకి తీసుకునే దిశగా సాగిపోవాలి. మన ఎంపీలు, ఎమ్మెల్యేలు మన చేతుల్లో ఉండాలి. సీమాంధ్ర పార్టీల చేతుల్లో, సీమాంధ్ర నాయకత్వాల చేతుల్లో కాదు. కడుపుమండిన కొంతమంది తెలంగాణవాదులు మిలిటెంట్ పోరాటాలు చేయలేమా అని ప్రశ్నిస్తున్నారు. సాయుధ పోరాటాలు, వీధి పోరాటాలు ఎలా ముగుస్తాయో తెలంగాణ ప్రజల అనుభవంలోనే ఉన్నది. రెండు సాయుధ పోరాటాలు, అనేక వీధి పోరాటాలు వేలాది మంది తెలంగాణ బిడ్డలను బలితీసుకున్నాయి. ఆ పోరాటాల్లో కొన్ని మౌలిక ఫలితాలు సాధించారు. సామాజిక మార్పుకు పునాదులు వేశారు. కానీ అంతిమంగా ఎవరు విజయం సాధించారు? రాజ్యమే. రాజ్యం చేతికి మన ప్రాణాలు చిక్కకుండా తెలంగాణ సాధించుకునే మార్గం ఉన్నప్పుడు ఎందుకు వదలిపెట్టాలి? సీట్లూ, ఓట్లూ సమీకరించడం ఉద్యమంలో భాగమే. ప్రజాస్వామ్యంలో అదే బలమైన ఆయుధం. రాజకీయంగా మనపై ఆధిపత్యం చెలాయిస్తున్న శక్తులను బొందపెట్టడానికి అంతకు మించిన అవకాశం మరొకటి ఏముంది?