బాహుబలి is a marvel, and a feast

05bahubali

బాహుబలి సినిమా గొప్పగా ఉంది. భారీగా ఉంది. అద్భుతంగా ఉంది. చూసినంతసేపూ వినోదమూ, సంభ్రమమూ ఉన్నాయి. రాజమౌళి తనకు అందుబాటులో ఉన్న అన్ని సాంకేతిక నైపుణ్యాలనూ ఉపయోగించుకుని తెలుగు తెరకు తొలిసారి ఒక హాలీవుడ్ స్థాయి సినిమాను అందించారనిపించింది. ఇదంతా ఒక సాధారణ ప్రేక్షకుడిగా నాకనిపించిందే. ఇది వాస్తవ కథకాదు. చరిత్ర కాదు. కానీ ప్రేక్షకులు కనెక్టు అయ్యే విధంగా చారిత్రక పాత్రలను సొంత కథలోకి మల్చుకున్నారు. జలపాతాలను ఒకదానిమీద ఒకటి పేర్చి, కూర్చి, వాటి మధ్య ప్రభాసును పెంచిన తీరు చాలా బాగుంది. ఇటువంటి సినిమాలు గతంలో మనవాళ్లు తీయలేదని కాదు. అరుంధతి గొప్ప గ్రాఫిక్సు, కథ కలిసి విందు చేసిన సినిమా. బాహుబలి యుద్ధ సన్నివేశాలు చూస్తుంటే గ్రీకు యుద్ధాలపై వచ్చిన హాలివుడు సినిమాలు గుర్తొస్తాయి. కీరవాణిగారి సంగీతం చాలా బాగా నప్పింది. ఆయన పాటలూ నచ్చాయి. ప్రభాసు నిజంగానే బాహుబలిలాగా కనిపించాడు. మొత్తం సినిమా బృందానికి అభినందనలు.

ఇందులో లోపాలు కూడా ఉన్నాయి. అందరినీ గతంలోకి తీసుకుపోవడానికి రాజమౌళి చాలా కష్టపడ్డారు. అక్కడక్కడా వర్తమానం కనిపిస్తూ ఉంటుంది. రామోజీ ఫిల్ము సిటీ భూములు, తాటిచెట్లు…మనకు వర్తమానమే గుర్తు చేస్తాయి. చరిత్రాత్మక మహిష్మతి నగరం ఇప్పుడు మధ్యప్రదేశంలోని మహేశ్వరంగా చెబుతారు. వింధ్యాచలం సానువుల్లో, నర్మదా నది ఒడ్డున ఉంటుంది. అక్కడ హిమనీ నదాలు ఉండవు. కానీ సినిమా అంతా హిమాలయాల్లో నడిచినట్టు చూపుతారు. కాల్పనికం అయినప్పుడు ఇవన్నీ సహజమే కావచ్చు.

Maheshwar_fort

కథ క్రీస్తుపూర్వం మొదలయినట్టుగా చెప్పారు. అకస్మాత్తుగా అస్లాం ఖాన్ను ప్రవేశపెట్టారు. క్రీస్తుపూర్వం అస్లాం ఖాను ఉండే అవకాశమే లేదు. విమర్శలు ఎప్పుడూ వుంటాయి. సినిమా పండితులయితే రకరకాలుగా శల్య పరీక్షలు చేయవచ్చు. నాకయితే గొప్ప విజయం సాధించిందే గొప్ప సినిమా. ఐఫోను ఎక్కువ కొంటున్నారు. ఎక్కువ ధరపెట్టి కొంటున్నారు. పదిహేను వందలకు కూడా ఫోను దొరుకుతుంది. కానీ దేని పనితీరు దానిదే.