పోత పోసిన ఉన్మాదం

రాజా సిద్ధార్థ

ఈ విశ్వం పుట్టినప్పటి నుంచి అవతరించిన మనుషులు, మహానుభావులు, మహాపురుషులు, చక్రవర్తులు, దేవుళ్ళు, దేవదూతలు ఏ ఒక్కరూ చావుపుట్టుకల చక్రభ్రమణాన్ని తప్పించుకోలేదు.

ఎంతటి అవతార పురుషుడయినా బోయవాడి బాణానికి గతించక తప్పలేదు. భావాలు, భ్రమలు తప్ప, ఎల్లకాలం బతికిన దేవుళ్ళు, దేవతలు లేరు. మళ్ళీ మళ్ళీ పుట్టినవారూ లేరు. ఒకటే జననం ఒకటే మరణం. మనిషికయినా, మనిషి రూపంలోని దేవుడికయినా.

భావాలు, భ్రమలు ఉన్నాయి కాబట్టి వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుని అధ్యాత్మిక వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకునే ఆధునిక దేవుళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. ఉన్నన్నాళ్ళు భావాలను, భ్రమలను, మూఢ నమ్మకాలను పెంచి పోషించి, మహా లింగాలను, మహామందిరాలను, విశాలమైన ప్రార్ధనా స్థలాలను ప్రతిష్టించిన వారు, నిర్మించినవారు కూడా ఏదో ఒక రోజు దేహం కృశించి, చితికి చేరవలసిందే.

మంత్రాలు, తంత్రాలు, సృష్టి ప్రతి సృష్టి, పునర్జన్మ, పూనకాలు అన్నీ మనిషి మనో జనిత భావనలు. మనం సృష్టించుకున్న భావనలు మనలను బలితీసుకోవడం విషాదం. మూఢ నమ్మకాలను, అంధ విశ్వాసాలను పెంచి పోషించే గురువులు, స్వాములు, వారి శిష్య పరమాణువులు, వారికి విలువనిచ్చి వారి ఆశ్రమాలను, మందిరాలను, ప్రార్ధనా స్థలాలను సందర్శించే పెద్దమనుషులు అందరూ ఈ పాపంలో భాగస్వాములే.

శాస్త్రీయ దృక్పథాన్ని, విచక్షణ, వివేకాలను అందించని చదువులు దండగ.