‘మీ నాయకులకు తెగింపు లేదు. ఎదురుతిరిగే సాహసం లేదు. మీ జిల్లా నాయకులనే చూడండి-ఒక వైపు తెలంగాణకోసం పోరాడుతున్నామని పెడబొబ్బలు పెడతారు. ఇంకోవైపు ముఖ్యమంత్రితో అంటకాగుతుంటారు. తప్పంతా మీవాళ్ల దగ్గర పెట్టుకుని మమ్మల్ని ఎందుకండి నిందిస్తారు? బానిసతత్వం మీ నాయకుల్లోనే ఉంది. మీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఆధారపడి ఈ ప్రభుత్వం నడుస్తోంది. అందరూ కట్టగట్టుకుని తెగించి నిలబడితే సమస్య పరిష్కారానికి వారం రోజులు చాలు. అది చేయకుండా అస్తమానం సీమాంధ్ర నాయకత్వాన్ని ఎందుకు ద్రోహులుగా చిత్రిస్తారు? దశాబ్దాలుగా చేతిలో ఉన్న అధికారం, అవకాశాలను అంత సులువుగా ఎవరుమాత్రం వదులుకోవడానికి ఇష్టపడతారు? మా నాయకులూ అంతే. మా నాయకుల్లో ఉన్న చైతన్యం, ఐక్యత మీ వాళ్లలో ఎక్కడుంది? ఒక్కరోజులో నిర్ణయాన్ని మార్పించగలిగిన శక్తి మావాళ్లది. ఈ పార్టీ, ఆ పార్టీ అని లేదు అందరూ ఒక్కటయ్యారు. మరి మీ నాయకులకు సాధ్యమవుతుందా? మీ నాయకుల స్వార్థ ప్రయోజనాలే మీ తెలంగాణ సాధనకు అడ్డం’-సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక మేధావి నాకు పంపిన మెయిల్ సారాంశం ఇది. ఆయనే కాదు, తెలంగాణలో స్థిరపడిన ఒక గుంటూరు డాక్టర్ చేసిన విశ్లేషణ ఇంకావిస్మయం కలిగించింది. ‘మీ నాయకులకు బానిసత్వం ఇప్పుడు సంక్రమించింది కాదు. నాలుగైదు వందల ఏళ్లుగా మీ వాళ్లు బానిసత్వానికి అలవాటు పడిపోయారు. ప్రాంతం చిన్నదా పెద్దదా అన్నది వదిలిపెట్టండి. అక్కడి నాయకత్వానికి ఉండే స్వభావం ముఖ్యం. రాయలసీమ ఎంత ప్రాంతం? కానీ గత 56 ఏళ్లలో రాష్ట్రాన్ని అత్యధిక కాలం పరిపాలించింది రాయలసీమవారే. నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నారాచంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి….వీళ్లంతా అంత దీర్ఘకాలం రాష్ట్రాన్ని ఎలా పరిపాలించగలిగారు? అప్పుడు కూడా ఆంధ్రలో అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్నారు కదా? ఆధిపత్య స్వభావం, నాయకత్వ స్వభావం అక్కడి నాయకుల్లో మెండుగా ఉంది. కానీ ఆంధ్ర నాయకత్వానికి అదనపు సంపాదన, పెట్టుబడి పెంచుకోవడం, వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకోవడం మీద ఉన్న శ్రద్ధ రాజకీయాలపై పట్టుసాధించడం మీద లేదు. డబ్బు ఉంటే అధికారం ఉన్నట్టే అని వాళ్లు నమ్ముతారు. ఇందుకు మినహాయింపులు లేకపోలేదు. ఎన్టిఆర్, కాసు బ్రహ్మనందారెడ్డి, నేదురుమల్లి, భవనం వెంకట్రామ్, రోశయ్య వంటి వారు పరిపాలించినమాట వాస్తవం. కానీ ఆ తర్వాత నిలబడలేదెందుకు? వాళ్ల ఫోకస్ ఇతర అంశాలపైనే అధికంగా ఉంది. తెలంగాణ నాయకులకు ఏ ఫోకస్ లేదు. అందుకే ఈ సమస్య ఇన్నేళ్లుగా ఇలా నానుతూ ఉంది. ఇంతమందిని బలితీసుకుంటూ ఉంది’ అని ఆయన చాలా ఆవేశపడ్డారు. ఈ అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవించకపోవచ్చు. కానీ ఇందులో లాజిక్ ఉందనిపిస్తోంది. కొంతవరకు వాస్తవం ఉందనిపిస్తోంది.
ఇందుకు అనేక కారణాలూ ఉన్నాయి. బానిసత్వం ఒక్క సారిగా రాదు. పరాధీనత ఒక్క రోజులో జరుగదు. అది జీవన విధానంగా మారడానికి చాలా కాలం పడుతుంది. అందుకు అనేక అంశాలు దోహదం చేస్తాయి. స్వరాష్ట్రం వచ్చిన కొన్ని నాళ్లు(194 సెప్టెంబరు-1956 నవంబరు) తప్ప ఆ తర్వాత తెలంగాణ నాయకులకు రాజకీయ స్వేచ్ఛ లేదు. ఎవరో టికెట్ ఇస్తారు. ఇంకెవరో ఎన్నికల నిధులు ఇస్తారు. ఏ పనులు కావాలన్నా ఏలినవారి దయ. ఏ ప్రాజెక్టు కావాలన్నా సీమాంధ్ర ఎస్టాబ్లిష్మెంట్(ఆధిపత్య యంత్రాంగం) ఇస్తే వచ్చినట్టు లేకపోతే లేదు. రోడ్లు కావాలన్నా, మంచి నీళ్లు కావాలన్నా సీమాంధ్ర అధికార ఛత్రం నీడలోనే. నిజమే. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రులు అయినవారున్నారు. మంత్రులయినవారున్నారు. కానీ ఎవరు ఎంతకాలం ఉన్నారు? ఎంత భద్రంగా ఉన్నారు? ముఖ్యమంత్రి పదవులు, మంత్రి పదవులు కాపాడుకోవడానికి ఎన్ని పాట్లు పడ్డారు? పివి నరసింహారావు 46 రోజులు, మర్రి చెన్నారెడ్డి మొదటిసారి 950 రోజులు, రెండోసారి 379 రోజులు, అంజయ్య 501 రోజులు మాత్రమే పదవుల్లో ఉండగలిగారు. ఈ పదవులన్నీ ఎవరో ఒకరు ఇచ్చినవి. వీరు పుచ్చుకున్నవి. ఇచ్చినవారికి కోపం రాకుండా చూసుకోవాలి. పుచ్చుకునేవాడు ఎప్పుడూ లోకువే. సీమాంధ్ర నాయకత్వం వీరెవరినీ అధికార పీఠంలో కుదురుగా పనిచేయనీయలేదు. పూర్తికాలం ఉండనీయలేదు. జలగం వెంగళరావు ఖమ్మం నుంచి గెలిచినా తన ఆంధ్రా విధేయతను ఏరోజూ విస్మరించలేదు. అందుకే ఆయన పూర్తికాలం ఉండగలిగారు. అధికారం, రాజకీయ స్వేచ్ఛ, పెట్టుబడి దన్ను ఉన్న సమాజాలు మిగిలిన సమాజాలపై పెత్తనం చెలాయించడం తరతరాలుగా వస్తున్నదే. ఇప్పుడు తెలంగాణ విషయంలోనూ అదే జరుగుతున్నది. పై మూడు సాధనాలు సీమాంధ్ర నాయకత్వానికి ఉన్నాయి. తెలంగాణ నాయకత్వానికి లేవు. బానిసత్వానికి ఇదే మూలం. పరాధీనతకు ఇదే హేతువు. తెలంగాణ తిరగబడ్డ సందర్భాలు లేవా? తెలంగాణ సాయుధ పోరాటం నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి పోరాడింది. గ్రామీణ తెలంగాణను విముక్తి చేసింది. కానీ ఆ ఫలితాలు చేతికి అందకముందే మిలటరీ ప్రభుత్వం తెలంగాణలో ఉక్కుపాదం మోపింది. నిజాం పెంచి పోషించిన భూస్వామ్య శక్తులకు అండగా నిలబడింది. 1952లో రాజకీయ స్వేచ్ఛ లభించినా, అది పుష్పించి, ఫలించకముందే 1956లో ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైంది. మళ్లీ మొదటికి వచ్చింది. కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా సీమాంధ్ర రాజకీయ నాయకత్వం నిజాంకాలం నుంచి సంక్రమించిన భూస్వామ్య రాజకీయ శక్తులను దువ్వింది, బుజ్జగించింది. తెలంగాణ రాజకీయ నాయకత్వం ఆ బుజ్జగింపుల మాయలోపడి తమ స్వేచ్ఛను కోల్పోతున్నామన్న విషయమే మరిచిపోయింది. కానీ ఆ భ్రమల నుంచి బయటపడడానికి ఎంతో కాలం పట్టలేదు. ఆ తర్వాత జరిగిన పోరాటాలన్నీ రాజకీయ స్వేచ్ఛ కోసం జరిగినవే. 1969 తెలంగాణ ఉద్యమం, నక్సల్బరీ పోరాటం, ఇప్పటి తెలంగాణ ఉద్యమం…అన్నీ ఎస్టాబ్లిష్‌మెంట్‌కు వ్యతిరేకంగా చెలరేగినవే. ఈ ఉద్యమాలు ప్రభుత్వాలను తెలంగాణ ప్రజలకు అనుకూలంగా కొంత వంచగలిగాయి, మల్చగలిగాయి, తప్ప పూర్తిగా మార్చలేకపోయాయి. దీనికి కారణం ఆధిపత్యశక్తులు మారకుండా మౌలికంగా మార్పులు జరుగవు.
వాళ్లు ఇచ్చేవాళ్లుగా, మనం తీసుకునేవాళ్లంగా ఉన్నంతకాలం ఈ పరాధీనత తప్పదు. దీనినుంచి బయటపడడానికి పూర్తిస్థాయి స్వేచ్ఛా పోరాటమే జరగాలి. తెలంగాణలో ఉన్న అనేక శక్తులు కలసి రాకపోవడం వల్ల పాత ఎస్టాబ్లిష్మెంట్ సంకెళ్లు తెంచుకోవడానికి గత పుష్కరకాలంగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమానికి శక్తి చాలడం లేదు. సగానికంటే ఎక్కువ రాజకీయ శక్తులు ఇప్పటికీ పరాధీన భావజాల ప్రభావంలోనే ఉన్నాయి. ఇక్కడి నేతలు కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్సీపీల నీడలో ఉన్నంతకాలం ఇచ్చేవాడు, తీసుకునేవాడి సమీకరణలు మారవు. రాజకీయ స్వేచ్ఛ లభించదు. యాభై ఆరేళ్లుగా వ్యవస్థను గుప్పిట పట్టినవాళ్లు ఆషామాషీ బెదిరింపులకు, దాగుడుమూతలకు భయపడి పోరు. సీమాంధ్ర ఆధిపత్య శక్తులది భల్లూకపు పట్టు. వారికి ప్రయోజన స్పృహ ఎక్కువ. సమైక్యత వల్ల సంక్రమిస్తున్న ప్రయోజనాలను కాపాడుకునే పట్టుదల ఎక్కువ. ప్రయోజనాల ముందు వాళ్లకు రాజకీయ భేదాలు అల్పమైనవి. అందుకే రాత్రికి రాత్రి వాళ్లు ఒక్కటి కాగలిగారు. దానితో పోరాడాలంటే, దానినుంచి విముక్తి సాధించాలంటే అంతకంటే బలంగా కొట్లాడాలి. తెలంగాణ దురదృష్టం ఏమంటే ఇక్కడ నాయకులు రాజకీయ విభేదాలనే ముందుపెట్టుకుంటారు. మన నేతలకు భేషజాలు ఎక్కువ. ప్రాంతీయ స్పృహకంటే స్వార్థ ప్రయోజన స్పృహ ఎక్కువ. టికెట్ల బెంగ, ఎన్నికల నిధుల బెంగ కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ సీపీలలోని తెలంగాణ నాయకులను కట్టిపడేస్తుండవచ్చు. కానీ తెగించి కొట్లాడేవారిని తెలంగాణ ప్రజలు అక్కున చేర్చుకుంటారని ఇటీవలి ఉప ఎన్నికలు పదేపదే రుజువు చేశాయి. నాగం జనార్దన్‌రెడ్డికి ఎవరు టికెట్ ఇచ్చారు? పోచారం శ్రీనివాసరెడ్డి, గంప గోవర్దన్,జోగి రామన్నలకు ఎవరు టికెట్ ఇచ్చారు? ఎన్ని నిధులు ఖర్చు చేశారు? ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రయాణం చేసేవారిని ఎవరు ఆపగలరు?
‘అంటే అందరూ టీఆరెస్‌లో చేరాలా? ఏమిటీ మీ ఉద్దేశం?’ అని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడొకరు ఇటీవల ఇష్టాగోష్టిగా మాట్లాడుతన్నప్పుడు ప్రశ్నించారు. టీఆరెస్‌లో చేరతారా లేదా అన్నది సమస్య కాదు. తెలంగాణకోసం తెగించి కొట్లాడతారా లేదా అన్నది ప్రధానం. రాజకీయ శక్తులు సంఘటితం కావడం ముఖ్యం. కాంగ్రెస్‌లో ఉంటూ తెగదెంపుల సంగ్రామం చేస్తే ఎవరు వద్దన్నారు? తెలంగాణ హీరోలుగా నిలబడితే ఎవరు ప్రశ్నించారు? ఒకవైపు రాజీలు, మరోవైపు ఉద్యమాల ముసుగు…ఏకకాలంలో రెండూ నడవవన్న విషయం కాంగ్రెస్ నేతలు గుర్తించాలి. టీడీపీ అయితే తెలంగాణ సాధన సమస్య తమ సమస్యే కాదన్నట్టు వ్యవహరిస్తోంది. తెలంగాణ అంతటా జనం స్వరాష్ట్రంకోసం పలవరిస్తుంటే, వాళ్లు వారి నాయకుడి జెండానో, ఎజెండానో పట్టుకుని ఊరేగుతున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులకు కూడా తెలంగాణ ప్రాధాన్యాంశం కాదు. జగనన్నను ముఖ్యమంత్రిని చేయడం వారి ఆశ, ఆశయం. ఈ రెండు పార్టీలదీ పాత ఎస్టాబ్లిష్మెంట్ను, పాత భావజాలాన్ని కొనసాగించే ప్రయత్నమే. వీళ్లు రాజకీయ స్వేచ్ఛను కోరుకోవడం లేదు. తెలంగాణ అస్తిత్వ కాంక్షకు ప్రాతినిధ్యం వహించడం లేదు. ఇప్పటికయినా సమయం మించిపోలేదు. ఈ పార్టీల నేతలు కళ్లు తెరవాలి. కొట్లాడేవారి వెంట ప్రజలు నిలబడతారు. ఎన్నికల్లో గెలిపిస్తారు. ఏ పార్టీ అయినా సరే. అన్ని పార్టీలలోని తెలంగాణ నాయకులు సంఘటితమై రాష్ట్ర సాధనకోసం బరిగీసి నిలవాలి. తెలంగాణ సాధిస్తే ఎవరి స్పేస్ వారికి లభిస్తుంది.
కేంద్రం, కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా తెలంగాణ అంశాన్ని సాగదీస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఏదో అంశాన్ని అడ్డంపెట్టి తెలంగాణ పరిష్కారాన్ని వాయిదా వేస్తున్నది. ఇప్పుడు బడ్జెట్ సాకు చూపిస్తున్నది. మార్చి 22లోపు కేంద్ర బడ్జెట్ ఆమోదం పొందే అవకాశం ఉంది. ఆ తర్వాతయినా వేగంగా, చిత్తశుద్ధితో నిర్ణయాలు చేయగలిగితే రాష్ట్ర విభజన సాధ్యమవుతుంది. రాష్ట్ర విభజన ప్రక్రియలో చాలా మెలికలు ఉన్నాయి. తొలుత కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుని హోంశాఖ, న్యాయమంత్రిత్వ శాఖల ద్వారా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు తయారు చేయించి రాష్ట్రపతికి పంపాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఆ బిల్లును నిర్దిష్ట గడువుతో శాసనసభకు రెఫర్ చేయవలసి ఉంటుంది. శాసనసభ అభిప్రాయం అనుకూలమా ప్రతికూలమా అన్నదానితో నిమిత్తం లేకుండా నిర్దిష్టగడువులోపల ఆ బిల్లును తిరిగి కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. ఒక వేళ శాసనసభ రాష్ట్రపతి విధించిన గడువులోపల తిప్పి పంపకపోతే, రాష్ట్రపతి ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వం ద్వారా పార్లమెంటు ఆమోదానికి సమర్పించాల్సి ఉంటుంది. పార్లమెంటు ఉభయ సభలు సాధారణ మెజారిటీతో ఈ బిల్లును ఆమోదిస్తే అది చట్టమవుతుంది. అది చట్టం కాగానే విభజన ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆస్తులు, అప్పులు, వనరులు, సిబ్బంది పంపణీతో సహా విభజనకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ అమలు చేయించడానికి త్రైపాక్షిక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియ అంతా కేంద్రం తలుచుకుంటే మూడు మాసాల్లో పూర్తి చేయవచ్చు. పరిష్కరించదల్చుకోకపోతే మరో మూడేండ్లు సాగదీయవచ్చు. మరోవైపు డిసెంబరులోనే ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ నుంచి సంకేతాలున్నాయి. సమయం తక్కువగా ఉంది. తెలంగాణ రాజకీయ శక్తులన్నీ ఉద్యమ ఓల్టేజీని పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తెలంగాణ రాకపోతే తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులదే ప్రధాన బాధ్యత. ఇప్పుడు ఇక మొదటి దోషులు కాంగ్రెస్ వాళ్లే. రాష్ట్రం రాకపోతే బలిపీఠం ఎక్కాల్సింది వారే.