మరో ఆధునిక దేవాలయం

 సాంకేతిక అద్భుతం కాళేశ్వరం
రూపుదిద్దుకుంటున్న మహా జలసాధన వ్యవస్థ

Mon,June 11, 2018 02:24 AM

Kaleshwaram1
ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు అన్నారు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నాగార్జునసాగర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తూ. ఇప్పటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలే కాదు, ఆధునిక సాంకేతిక, నిర్మాణ అద్భుతాలు. లోకం అబ్బురపడే మహానిర్మాణాలు. ఒకటిన్నర కిలోమీటర్ల సొరంగం తర్వాత, సుమారు 22 అంతస్తుల భవంతిని (60 మీటర్ల ఎత్తు) తలదన్నే ఒక అపూర్వ భూగృహం నిర్మించి, అందులో ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యం కలిగిన మోటర్లు, పంపులు, అతిపెద్ద జలాశయం, రిమోట్‌తో పనిచేసే మహాయంత్ర భూతాలు ఏర్పాటుచేస్తే అది మరో యాత్రాస్థలం కాక ఏమవుతుంది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు యాత్రాస్థలి అయ్యింది. మనిషి ఊహకందని నిర్మాణం అది. నూట ముప్ఫై తొమ్మిది మెగావాట్ల సామర్థ్యం కలిగిన మోటర్లు ఒక్కొక్కటి మూడువేల క్యూసెక్కుల చొప్పున, ఆరుమోటర్లతో రోజుకు రెండు టీఎంసీల నీటిని పంపింగ్ చేసే మహాజలసాధన వ్యవస్థ అది.

 

తెలంగాణ జలయజ్ఞానికి ముఖద్వారం ఆ భూగృహంలోని ఎగ్జిట్ టన్నెల్. అక్కడి నుంచే మిడ్ మానేరుతో మొదలై అనంతసాగర్, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్‌లకు నీరు వచ్చేది. మల్లన్నసాగర్ నుంచే ఇటు గంధమల్ల, బస్వాపూర్‌లకు, అటు సింగూరు, నిజాంసాగర్‌లకు నీరందించేది. శ్రీరాంసాగర్‌కు గోదావరి నీరు సరిగా రాక ఒట్టిపోయిన ఉత్తరతెలంగాణకు పునర్జీవమిచ్చే ప్రాజెక్టులు, రిజర్వాయర్ల పరంపర ఇది. నదులు, ఉపనదులు, వాగులు, వంకలకు జలమాల వేసే బృహత్ ప్రయత్నమిది. ఒకప్పుడు ఒక ప్రా జెక్టు కట్టడమంటే మూడు నాలుగు పంచవర్ష ప్రణాళికలు గడచిపోయేవి. తెలంగాణ ప్రభుత్వం మొదటి ఐదేండ్లు దాటకుండానే తెలంగాణకు జలధారలను మళ్లించే విధంగా ప్రాజెక్టుల నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తున్నది. భూమికి అంత లోతున పైనించి చూస్తే వందల మంది యువకులు చీమల దండులాగా ఎవరిపని వారు చేస్తున్నారు.

సరిహద్దులో యుద్ధం చేస్తున్నవారిలా కనిపించారు. ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారన్నది పట్టించుకునే పరిస్థితిలో వారు లేరు. పని ఒక్కటే పరమార్థం. ఇరవైనాలుగు గంటలూ పనిజరుగుతున్నది. ఒక షిఫ్టు సిబ్బంది డ్యూటీ దిగగానే మరో షిఫ్టు సిబ్బంది పనిలోకి ఎక్కుతారు. ఏ రోజూ పని ఆపలేదు. కేవలం మూడేండ్ల వ్యవధిలో ఇంత నిర్మాణం చేయగలిగాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా మంత్రి హరీశ్‌రావుగారల రోజువారీ సమీక్షలు, ప్రత్యక్ష పర్యవేక్షణతో మావాళ్లంతా మరింత హుషారుగా, అప్రమత్తంగా పనిచేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా నీళ్లివ్వాలన్నది అం దరి తపన అని రామడుగు భూగృహంలో పనులను పర్యవేక్షిస్తున్న ఇంజినీర్ చెప్పారు. హైదరాబాద్‌లో మనం ఏమేమో మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రాజెక్టులపై వివాదాలు, రాజకీయాలు, కేసుల గోల వినిపిస్తుంటుంది. కానీ అంతటి భూగర్భంలో అన్ని వందలమంది తదేక దీక్షతో ఎవరిపని వారు చేసుకుపోతుంటే ఆశ్చర్యం అనిపించింది. వారెవరూ ఈ జలాలతో ప్రయోజనం పొందేవారు కాదు. బీహార్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల నుంచి వచ్చి పనిచేస్తున్న కార్మికులు.

తెలంగాణ ఉద్యమ కాలంలో, ఆ తర్వాత ప్రభుత్వంలో నీళ్లకోసం, ప్రాజెక్టులకోసం ఆరాటపడిన తెలంగాణ ఇంజినీర్లు, జలయజ్ఞం అంటే ధనయజ్ఞం కాదని, ఆధునిక దేవాలయాల నిర్మాణమని, కోట్లాది మంది జీవితాల్లో జలసిరులు కురిపించే యజ్ఞమని భావించే నిర్మాణసంస్థల సిబ్బంది. అలా అనుకోకపోతే అన్నారం బరాజ్ కేవలం 14 మాసాల వ్యవధిలో నీళ్లు నిలుపగలస్థితికి నిర్మాణం పూర్తయ్యేది కాదు. గోదావరి జలధారలను మళ్లించే కన్నెపల్లి పంపుహౌస్, ప్రధాన కాలువ ఆగమేఘాలపై నిర్మాణం జరిగి తుదిదశకు చేరుకునేది కాదు. మేడిగడ్డ బరాజ్ పూర్తికావడానికి మరి రెండేండ్లు పట్టవచ్చు, కానీ, మేడిగడ్డ బ్యాక్‌వాటర్ నుంచి నీళ్లు తీసుకోవడం మాత్రం మరో రెండుమూడు మాసాల్లో ఎట్టిపరిస్థితుల్లో ప్రారంభిస్తామని ఇంజినీర్లు ధీమాగా చెప్తున్నారు.
Kaleshwaram1
తవ్విపోసిన మట్టి గుట్టలు, అద్భుతమనదగిన పంపుహౌస్‌లు, సర్జ్‌పూళ్లు, గేట్ల నిర్మాణం, కిలోమీటర్ల పొడవునా సాగిపోయే కాలువలు, మొత్తంగా అక్కడ జరిగిన పని పరిమాణం, అందుకు మన ఇంజినీర్లు, నిర్మాణ సిబ్బంది తీసుకున్న సమయం చూస్తే, మనుషులేనా, మనవాళ్లేనా ఈ పనిచేసింది అనే ఆశ్చర్యం కలుగుతుంది. నిర్మాణ విభాగం, యంత్ర విభాగం, విద్యుత్ విభాగం, ప్రణాళికా విభాగం- ఏ శాఖకు ఆ శాఖ ఇంజినీర్లు ఏకకాలంలో అన్ని పనులను వేగంగా, నాణ్యంగా పూర్తి చేస్తున్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని పనులు ఏకకాలంలో ఏకరీతిన, నాణ్యంగా, త్వరితంగా ముందుకు సాగుతుండటం సంతృప్తికరంగా ఉంది అని కేంద్ర జలసంఘం అదనపు కార్యదర్శి వైకే శర్మ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుల వ్యవస్థ నుంచి 270 టీఎంసీల నీటిని తెలంగాణ భూములకు మళ్లించుకునే అవకాశం ఉంది. కానీ, ప్రస్తుతానికి 180 టీఎంసీలను మాత్రమే తరలించుకునే విధంగా మెకానికల్, ఎలక్ట్రికల్ పనులు జరుగుతున్నాయి అని ఈఎన్సీ మురళీధర్ చెప్పారు. ఈ ప్రాజెక్టు కింద కాళేశ్వరం నుంచి ఇటు యాదగిరిగుట్ట సమీపంలోని బస్వాపూర్ వరకు, అటు భూంపల్లి వరకు 20 రిజర్వాయర్లలో 147 టీఎంసీల నీటిని నిల్వచేసే ఒక అద్భుతమై ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఒక్క సీజనులోనయినా సరే 147 టీఎంసీల నీరు తెలంగాణ గడ్డపై నిల్వ ఉంచినా, పొలాలకు పారించినా తెలంగాణ నేల ఎంతగా పులకించిపోతుందో, భూగర్భ జలాలు ఎలా పెరుగుతాయో, చెట్టు చేమ, పశుపక్షాదులు ఎలా ఎదుగుతాయో అర్థం చేసుకోవచ్చు.

ఏకకాలంలో ఇన్ని బరాజ్‌లు, పంపుహౌస్‌లు, టన్నెళ్లు, కాలువలు, ఇంతపెద్ద లిఫ్టింగ్ వ్యవస్థను నిర్మించిన చరిత్ర దేశంలో మరే రాష్ర్టానికి లేదు. దేశం సృష్టించుకున్న అద్భుతాల్లో ఇదొకటి అవుతుంది అని కాళేశ్వరం ఈఎన్సీ హరిరాం చెప్పారు. కొత్తగా 18.25 లక్షల ఆయకట్టుకు నీరందించడంతోపాటు, మరో 18.75 లక్షల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించడం (శ్రీరాంసాగర్, నిజాంసాగర్, ఇతర ప్రాజెక్టుల కింద నీళ్లు అందని ఆయకట్టుకు నీళ్లివ్వడం) కాళేశ్వరం ప్రాజెక్టు అంతిమ లక్ష్యం. మొత్తం 37 లక్షల ఎకరాలకు నీళ్లొస్తే ప్రజల జీవితాల్లో ఎంత మార్పు వస్తుందో ఊహించండి అని ఆయన అన్నారు. మా వాళ్లంతా ఎంతో టీమ్ స్పిరిట్‌తో పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో భాగస్వాములు కావడం, పూర్తిచేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం అని చీఫ్ ఇంజినీరు వెంకటేశ్వర్లు తెలిపారు. వాటర్ ఈజ్ కింగ్. వాటర్ ఈజ్ ఎవ్రీథింగ్. దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఎ మార్వెల్ అని అన్నారు పాత్రికేయ మిత్రుడు, టైమ్స్ ఆఫ్ ఇండియా రెసిడెంట్ ఎడిటర్ కేఆర్ శ్రీనివాస్.

ప్రాజెక్టులపై కొందరు కావాలని వివాదం సృష్టిస్తున్నారు. వాళ్లకు ఇంకా తెలంగాణ ఏమి కోరుకుంటున్నదో అర్థం కావడం లేదు. ఎక్కడైనా గొడవపడండి. ప్రాజెక్టుల జోలికి రావద్దు. ఇప్పుడు నోరుపెట్టుకుని గోలచేస్తున్న వాళ్లంతా ఈ ప్రాజెక్టులు పూర్తయిన రోజున నోరు విప్పలేరు. కనీసం తలెత్తుకు తిరుగలేరు అన్నారు నీటిపారుదల ఇంజినీరింగ్ సలహాదారు పెంటారెడ్డి. అది నీటికి ఉన్న శక్తి. నీటి విలువ తెలిసిన మనుషులు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. తెలంగాణ ఆరు దశాబ్దాలుగా నష్టపోయింది సాగునీరు లేకనే..

Advertisements

తెలంగాణ ఓ ఫీనిక్స్

IMG_2293

Sun,June 3, 2018 08:37 AM

కాంగ్రెస్ ఏనాడైనా ప్రజాకేంద్రకంగా ఆలోచనలు చేసిందా? ప్రజలు ప్రాధాన్యంగా ప్రణాళికలు చేసిందా? ప్రజల కష్టనష్టాలు తెలిసిన నేత, తెలంగాణ పడిన యాతనను ఊరూరా తిరిగిచూసిన నాయకు డు, తెలంగాణ అనుభవించిన క్షోభను ప్రత్యక్షంగా చూసి, దేశవ్యాప్తంగా రాజకీయ ఏకాభిప్రాయాన్ని సమీకరించి, తెలంగాణలో సకల జనులను ఉద్యమపథం పట్టించి, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమకారుడు కేసీఆర్. తెలంగాణ ఉద్యమాన్ని ఎవరు ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎంతగా ఖతం పట్టించాలని చూసినా పడిలేచిన కెరటంలా, ఒక ఫీనిక్స్‌లా తెలంగాణ ఉద్యమ కాంక్షను ఎగరేస్తూ వచ్చిన మహాసారథి కేసీఆర్.

తెలంగాణ రాష్ట్రం విజయవంతంగా నాలుగేండ్ల పాలన పూర్తి చేసుకొని ప్రజల్లో ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని నింపింది. అన్నిరంగాల్లో ఒక ప్రత్యేక ముద్రతో ముందుకు సాగుతున్నది. బంగారు తెలంగాణ లక్ష్యాన్ని సాధించే దిశగా ఒక్కొక్క అడుగు ముందుకువేస్తున్నది. పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు విస్తరించడం, వ్యవసా యం, పంటదిగుబడులు రికార్డులు సృష్టించ డం, రాష్ట్రంలోని సుమారు కోటి కుటుంబాల్లో ప్రతికుటుంబానికి ఏదో ఒక సాయం అంద డం ప్రజల కళ్లల్లో ఆనందాన్ని, భవిష్యత్తుపై భరోసాను పెంచింది. మా పల్లెకు ఒక్క రైతు బంధు పథకం ద్వారానే 78 లక్షల రూపాయలు వచ్చాయి. పల్లె పండుగ చేసుకుంటున్నది. అన్నిరకాల ఆసరా పింఛన్ల ద్వారా నెలనెలా ఏడు లక్షల రూపాయలు వస్తున్నాయి. ఇంత ధనం మా ఊళ్లకు వచ్చిన చరిత్ర ఇంతవరకు లేదు. నాయకులు, అధికారులు, దళారీల ప్రమేయం లేకుండా మా పల్లెకు ఈ నిధులు వస్తున్నాయి.

మా చెరువులో ఈ ఎండాకాలం కూడా నీళ్లున్నాయి. మాకు ఇంతకన్నా ఏం కావాలి? ఇది బంగారు తెలంగాణ సాలు కాదా? అని ప్రశ్నించాడు ఒక రైతు నాయకుడు. రెవెన్యూ రికార్డుల సవరణలో కొన్ని లోపాలు జరిగిన మాట వాస్తవం. పట్టా పుస్తకాల్లో తప్పులు దొర్లిన మాట నిజం. అవి సరిదిద్దుతూ వేగంగా చర్యలు తీసుకుంటున్నారన్నదీ వాస్తవం. అయినా మొత్తం 56 లక్షల చెక్కుల్లో ఇప్పటికే 46 లక్షల మందికిపైగా చెక్కులు అందాయి. మిగిలినవి కూడా త్వరితగతిన పూర్తిచేయడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నది. అయితే ఇంత గొప్పగా జరిగిన ఈ కార్యక్రమానికి మసిబూయడానికి కొన్నిశక్తులు పనిగట్టుకొని ప్రయత్నిస్తున్నాయి. భూస్వాములు, పెత్తందారులకు మాత్రమే రైతుబంధు ఉపయోగపడుతున్నదని చెప్పడానికి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయి. ఇంతకాలం రైతును పట్టించుకున్న నాథుడు లేడు. కాంగ్రెస్ ఎప్పుడూ రైతు రుణమాఫీ అన్నా ఎగతాళి చేసిం ది. ఏ కాలంలోనూ రైతుకు ఒక్క పైసా ఆదాయం వచ్చే పనిచేయలేదు. రైతుకు గతంలో ఉన్న సబ్సిడీలన్నింటినీ ఆర్థిక సంస్కరణల పేరిట ఒక్కొక్కటీ పీకేస్తూ వచ్చిన పార్టీ అది. అటువంటి పార్టీ, ఇవ్వాళ తెలంగాణ ప్రభుత్వం రైతులకు చరిత్రలో కనీవినీ ఎరుగని ఒక పథకాన్ని తెస్తే, కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నది.

చంద్రుడిని చూడమంటే అందులోని మచ్చలను మాత్రమే చూసేవారిని బ్రహ్మదేవుడు కూడా బాగు చేయలేడు. వారిది ఉద్దేశపూర్వక అంధత్వం. చూపు ఉండీ చూడ నిరాకరించే మూఢత్వం. తెలిసీతెలియనట్టు నటించే కుటిలత్వం. రైతుబంధుపై విపక్షాలు లేవదీస్తున్న వాదనలు వింటుంటే విస్మయం కలుగుతున్నది. ఒక్క రైతుబంధు ఏమిటి ఏ అంశంపైనైనా వారి వాదనలు వింటుంటే వీరికి ప్రజలపట్ల ఏమైనా సానుభూతి ఉందా అనిపిస్తుంది. భూస్వాములకు, పెత్తందారులకు మాత్రమే ఉపయోగపడుతున్నదన్న వాదన చేస్తున్నవారికి ఒకటే ప్రశ్న. మీరు అధికారంలోకి వస్తే రైతుబంధు అమలు చేస్తారా లేదా? అమలు చేస్తే రైతులందరికీ ఇస్తారా లేదా? అంతదూరం ఎందుకు? అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఊదరగొడుతున్నారు కదా-మరి పేద రైతులెంతమందికి రెండు లక్షల రుణం ఉంటుంది. అసలు వారికి రుణం దొరుకుతుందా? బ్యాంకులు రైతులకు ఎంతవరకు రుణా లు ఇస్తున్నాయి? మీరు పేద రైతుల వరకే రుణమాఫీ చేస్తారా? లేక మీ భాషలోనే భూస్వాములకూ, పెత్తందారులకూ రుణమాఫీ చేస్తారా? రైతుబంధు పథకం దేశంలోనే మొదటిది. ఏ నాయకుడూ చేయని ఆలోచన.

ఏ పార్టీ అమలుచేయని గొప్ప పథకం. అది మొదలు పెడుతూనే పరిమితులతో, ఆంక్షలతో మొదలుపెడితే రైతుల్లో నమ్మకాన్ని కలిగించలేమని ప్రభుత్వం భావించి ఉంటుంది. తరతరాల సంక్షోభాన్ని నెత్తినెత్తుకొని ఉన్న తెలంగాణ రైతాంగంలో ఒక తిరుగులేని నమ్మకాన్ని కలిగించాలంటే ఎటువంటి పరిమితులు లేకుండా ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు భావించారని అధికారులు చెబుతున్నారు. నిజమే ధనిక రైతులను, స్వయంగా పెట్టుబడి పెట్టుకోగల రైతులను పథకం నుంచి మినహాయించి ఉంటే బాగుండేదని ఇప్పుడు చాలామంది నిపుణులు సూచిస్తున్నారు. పథకం ప్రారంభ దశలో కూడా ఈ సలహా ఇచ్చారని, ఈ దశలో అటువంటి పరిమితులు వద్దని ముఖ్యమంత్రి భావించారని అధికారవర్గాలు తెలిపాయి. సూచనలు, సలహాలు ఇవ్వడం వేరు. మెదడు నిండా బురద నింపుకొని ఆ బురదను పథకంపైన, ప్రభుత్వంపైన కుమ్మరించడం వేరు. అనుభవాల నుంచి ప్రభుత్వం పథకంలో మార్పులు తేవచ్చు. ముందుముందు మరింత అర్థవంతంగా ఈ పథకాన్ని అమలుచేయవచ్చు. కానీ ఆ పథకానికే కీడు తలపెట్టే దుర్మార్గపు విమర్శలు చేయడం వంకర బుద్ధులకు మాత్రమే చెల్లుతుంది. అయ్యా…వారిలో కొందరు అక్కు పక్షులు. ఇంకొందరు అక్కసు పక్షులు. వారు మంచిని చూడలేరు. మంచిని సహించలేరు. వారి మానసిక ఆరోగ్యం బాగోలేదు. వదిలేయండి అని మా రామశాస్త్రి అంటుంటాడు.

కాంగ్రెస్ ఏనాడైనా ప్రజాకేంద్రకంగా ఆలోచనలు చేసిందా? ప్రజలు ప్రాధాన్యంగా ప్రణాళికలు చేసిం దా? ప్రజల కష్టనష్టాలు తెలిసిన నేత, తెలంగాణ పడిన యాతనను ఊరూరా తిరిగిచూసిన నాయకు డు, తెలంగాణ అనుభవించిన క్షోభను ప్రత్యక్షంగా చూసి, దేశవ్యాప్తంగా రాజకీయ ఏకాభిప్రాయాన్ని సమీకరించి, తెలంగాణలో సకల జనులను ఉద్యమపథం పట్టించి, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమకారుడు కేసీఆర్. తెలంగాణ ఉద్యమాన్ని ఎవరు ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎంతగా ఖతం పట్టించాలని చూసినా పడిలేచిన కెరటంలా, ఒక ఫీనిక్స్‌లా తెలంగాణ ఉద్యమ కాంక్షను ఎగరేస్తూ వచ్చిన మహాసారథి కేసీఆర్. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, తెలంగాణ ప్రజలకు గరిష్ఠ మేలుచేసే దిశగా ఏదైనా చేయాలన్న పట్టుదలతో పనిచేస్తున్నారు కాబట్టి, వందలాది కొత్తకొత్త ఆలోచనలను పథకాలను అమలు చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు వీధిన పడ్డారు. మేమూ చేస్తామంటూ అడ్డగోలు నినాదాలు, హామీ లు ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ ఏ పథకం ప్రకటించి నా అది దేశవ్యాప్తంగా అమలుచేయాలి. దానికి అధిష్ఠానం ఆమోదం తెలుపాలి. సొంతంగా అమలుచే సే దమ్మూ ధైర్యం జాతీయపార్టీ నాయకులుగా వారి కి ఉండవు. పైగా ఎప్పుడు ఏ నాయకుడు ఉంటాడో తెలియదు. కాంగ్రెస్ రుణమాఫీ అమలు చేస్తుందన్న నమ్మకం ఎప్పుడు కుదురుతుందీ అంటే అది రాహుల్‌గాంధీయో, సోనియాగాంధీయో ప్రకటించినప్పుడు. ఎందుకంటే ఇప్పుడు పథకాలు ప్రకటించే నాయకుడు ఎన్నికల నాటికి ఉండకపోవచ్చు. ఒక వేళ ఈయనే ఉన్నా ఎన్నికల తర్వాత ఎవరు వస్తారో తెలియదు. హామీలు ఒకరు ఇస్తే అమలుచేసేవారు మరొకరుండరు. కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ ఉంటే దేశవ్యాప్తంగా పంట పెట్టుబడి పథకాన్ని, రుణమాఫీ విధానాన్ని ప్రకటించాలి. అప్పుడు మాత్రమే వారి మాటలకు విలువ. అప్పటిదాకా వారివి ఆపదమొ క్కులే. ఏరుదాటేందుకు ఉపయోగించే ఎత్తుగడలే.

కొందరు కాంగ్రెస్ నాయకులు కులాల ప్రస్తావన తెచ్చి నిర్లజ్జగా వేదికలపై మాట్లాడుతున్నారు. కులం ప్రస్తావన ఎవరుచేసినా అది నీచాతినీచం. సంస్కార హీనం. అధికారం కోసం రాజకీయ నాయకులు దేశభక్తులుగా అవతారమెత్తుతారని ఎక్కడో ఒకరాజనీ తి పాఠం చదివిన గుర్తు. అంటే వారికి నిజంగా దేశభక్తి ఏమీ ఉండదు. రాజకీయాధికారం కోసం ఏ అవతారమైనా ఎత్తుతారని చెప్పడం ఆ పాఠం సారాంశం. ఇప్పుడు కొందరు నాయకులు ప్రకటిస్తున్న కులాభిమానం కూడా ఆపదమొక్కులో భాగ మే. వేణుగోపాల్‌రెడ్డి, ఇషాన్‌రెడ్డి, యాదిరెడ్డి మృత్యుకీలలకు బలవుతున్నప్పుడు ఈ అరివీరకుల శేఖరులు ఎక్కడున్నారో ఒక్కసారి చరిత్ర పేజీలను వెనుకకు తిప్పిచూడండి. ఇవ్వాళ ఏవేవో కులాలను కలిపి కొత్త పేర్లు సృష్టించి మాట్లాడుతున్న నాయకు లు గతంలో అవే కులాలతో అంటకాగి తెలంగాణ ఉద్యమానికి తీరని ద్రోహంచేసిన విషయం అప్పుడే మరిచిపోతామా? రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటు లో ఆమోదం పొందకుండా సకల కుట్రలు చేస్తున్నా చూస్తూచూస్తూ చంద్రబాబు సంకన కూర్చున్న నాయకులు ఇవ్వాళ ఎవరికి వీరులు? ఎవరిని ఉద్ధరిస్తారు? అప్పుడు కులాలు కమ్మగా అనిపించా యా? సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని, సాధించుకున్న తెలంగాణ స్వయం పాలనను పురిటిలోనే కుప్పకూల్చడానికి చంద్రబాబు కుట్రలు చేస్తే ఆ కుట్రలో ప్రధాన సూత్రధారులైన వారు తెలంగాణ లోకుల ఉద్ధారకులా? కేసీఆర్‌తో కొట్లాడటానికి ఈ నాయకులంతా కులాన్ని ఆశ్రయించారంటేనే రాజకీయంగా వారు ఎంతగా బలహీనపడిపోయారో, ఎంతగా దిగజారిపోయారో అర్థం చేసుకోవాలి. రాజకీయంగా కొట్లాడలేని వారే ఇలా అడ్డదారులు తొక్కుతారు. కాంగ్రెస్ నాయకత్వం రోజురోజుకు దిగజారుతున్నది. తెలంగాణ నాయకత్వం అనుభవాల నుంచి ఎదుగుతున్నది. మరింత ఉన్నతంగా ఆలోచిస్తూ ముందుకు పయనిస్తున్నది. ఎవరెన్ని శాపనార్థాలు పెట్టినా తెలంగాణ విజయవంతంగా ముందుకు సాగుతున్నది. కొత్త అడుగులు వేస్తూనే ఉంటుంది.

పాపాలు వెంటాడుతాయి

26 May 2018, 11:05 PM

చంద్రబాబుకు మతిపోతున్నది. సమయం, సందర్భం, ఉచితానుచితం ఏదీ పట్టడం లేదు. ఏది పడితే అది మాట్లాడే స్థితికి జారిపోతున్నాడు. పాపం నిన్నగాక మొన్న అష్టకష్టాలు పడి చదువుకొని సివిల్స్ టాపర్గా వచ్చిన అనుదీప్ ఘనతనూ చంద్రబాబు తన ఖాతాలోనే రాసుకోవాలనుకున్నాడంటే ఆయన పిచ్చి స్థాయికి చేరిందో అర్థ మవుతున్నది. ఆయనను ఎన్టీఆర్ ఆత్మ వేధిస్తున్నది. అందుకే పార్టీ తెలంగాణలో అంతరించింది. ఆంధ్రలో కూడా విశ్వసనీయతను కోల్పోయి, చుక్కాని లేని నావలా పయనిస్తున్నది. మాటలకు, విధానాలకు, చేతలకు పొంతన లేకుండా రాష్ర్టానికి భారంగా పరిణమిస్తున్నది.

శ్రీ కృష్ణుడు బోధించిన భగవద్గీత నాకు అర్థమైనంతవరకు మన కర్మఫలం మనలను వెంటాడుతుంది అని. అదీ ఈ జన్మలోనే. మనం చేసే మంచి చెడులు మనకో మన పిల్లలకో పాపమో పుణ్యమో కలిగిస్తాయని అనిపిస్తుంది. అనేక పాపాలు చేసినవాళ్లూ దర్జాగా బతుకుతున్నారే అని ఎవరయి నా అనవచ్చు. ఈ తరం కాకపోతే మరో తరానికి ఆ పాపమో పుణ్యమో బదిలీకావచ్చు. రాజకీయ సందర్భాలకు కూడా ఇది వర్తిస్తుం ది. రాజకీయ నాయకత్వానికి కూడా ఇదే విలువలు వర్తిస్తున్నాయని అనేక పార్టీలు, అనేక మంది నాయకుల పతనోన్నతాలను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. నిలబడాల్సిన సమయంలో నిలబడకపోవడం, మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడకపోవడం, చేయగూడని పనులు చేయడం ఇవన్నీ ఇప్పుడు కాంగ్రెస్‌ను వెంటాడుతున్నాయి. ఆ పార్టీ ఇప్పుడు ఏది నీతి అని వాదిస్తున్నదో ఆ నీతులన్నింటినీ ఎప్పుడో తుంగలో తొక్కేసింది.

అందుకే వారి అరుపులకు, నినాదాలకు విలువ లేకుండాపోయింది. రేపు బీజేపీ పరిస్థితి అయినా అంతే. నరేంద్ర మోదీ పరిస్థితి అయినా అంతే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరిస్థితి ఇప్పటికే రుజువవుతున్నది. తెలంగాణలో ఆయన పార్టీ అంతరించిపోయింది. ఆంధ్రలో కూడా అవసానదశకు చేరువైంది. ఆయన మాట, చేత గతితప్పుతున్నాయని ఇటీవల పదేపదే రుజువవుతున్నది. ఆయన గతంలో సాధించిన విజయాలు కూడా ఆయనవి కాదు. ఆయన మూడు మార్లూ బై డీఫాల్టు ముఖ్యమంత్రి అయ్యారు. సొంత బలమో, సొంత రాజకీయ సత్తానో ఆయనను గెలిపించలేదు. ఎన్టీఆర్ నుంచి ఆయన పార్టీని లాగేసుకున్నారు. శిఖరం వంటి ఎన్టీఆర్‌ను ఆరు మాసాల్లో అతలంకుతలం చేసి గుండె పగిలి చనిపోయేట్టు చేశారు. ఎన్టీఆర్‌ను బలి తీసుకున్న పాపాన్ని కడిగేసుకోవడానికి, తనను తాను నిలబెట్టుకోవడానికి బాబు చాలా ప్రయత్నమే చేశారు. కానీ ఏనాడూ సొంత బలంతో నిలబడలేదు. ఒకసారి బీజేపీతో, ఒకసారి థర్డ్‌ఫ్రంట్‌తో నెట్టుకొచ్చారు. గాలివాటం చూసి మిత్రులను మార్చడంలో చంద్రబాబుది చాలా వేగం.

మంచీ చెడూ తప్పూ ఒప్పూ విలువ వలువ అన్నీ ట్రాష్ ఆయన దృష్టిలో. అధికారంలో కొనసాగడానికి, అధికారం సాధించడానికి ఏంచేసినా ఫర్వాలేదన్నది ఆయన విధానం. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు అన్నవి ఆయనకు పాచికలు మాత్రమే. ఆయన కొట్లాట ఎప్పుడూ సెంటిమెంట్ చుట్టూనే తప్ప, ప్రజల సమస్యల పరిష్కారం చుట్టూ ఉండదు. ప్రజలు కేంద్రంగా ఆలోచనలు, విధానాలు రూపొందించే సత్తా కానీ, అవగాహనకానీ, వాటిని అమలుచేసే సాహసం కానీ చంద్రబాబుకు లేవు. చంద్రబాబు ఎప్పుడూ షార్ట్‌కట్‌లో పాస్‌కావడం ఎలా అన్నదే ఆలోచిస్తారు. అందుకే ఆయనకు ఎటువంటి ప్రతిష్ఠ మిగులలేదు. ఆయన గురించి ఆయన చెప్పుకోవడం, ఆయన చందాలతో నడిచే మీడియా ఆయనకు డబ్బాకొట్టడం తప్ప, చంద్రబాబు మహానుభావుడు అని చెప్పే ఒక విశాల సమూహం ఏదీ లేదు. చంద్రబాబును నమ్మి అంతదూరం ప్రయాణించినవారే లేరు. చంద్రబాబును ఒక మేధావిగా గుర్తించినవారూ లేరు. చంద్రబాబు ఒక డొల్ల. చం ద్రబాబు ఒక మానిపులేటర్. చంద్రబాబును ఎన్టీఆర్‌కు చేసిన పాపం వెంటాడుతూ ఉం ది.

చంద్రబాబు ఏం చేసినా ఆయనకు ఆ విద్రోహ ముద్ర పోదు. ఎన్టీఆర్ స్వర్ణ విగ్రహం చేయించి పెట్టి నా ఎన్టీఆర్ ఆత్మ ఆయనను క్షమించదు. ఎన్టీఆర్ చనిపోవడానికి ముందురోజు ఏం జరిగింది- ఆరో జు సాయంత్రం అంటే 1996 జనవరి 17న చంద్రబాబు టీడీపీ అకౌంట్‌ను సీజ్ చేయించాడని, తాను ఇచ్చిన చెక్కు పాస్ కాలేదని ఎన్టీఆర్‌కు వచ్చి చెప్పా రు. అప్పటికే అనేక దెబ్బలు తిని ఉన్న ఎన్టీఆర్ ఆ రోజు హతాశుడయ్యారు. ప్రభుత్వాన్ని కొట్టేశారు. పార్టీని కొట్టేశారు. డిసెంబరు 22, 1995న ఎన్నికల గుర్తును కొట్టేశారు. చివరికి పార్టీ అకౌంట్‌ను కూడా దక్కనివ్వలేదా? ఎన్టీఆర్ పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయారని, గుండెలవిసేలా రోదించారని, ఆ బాధతోనే తన గదిలోకి వెళ్లిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. తెల్లవారేసరికి ఆయన విగతజీవి అయ్యా రు. ముప్పైయ్యేళ్లుగా జర్నలిజంలో ఉన్న మా అందరికీ అది వెంటాడే విషాద జ్ఞాపకం.

ఇదంతా ఎందుకంటే చంద్రబాబు మొన్న హైదరాబాద్‌కు వచ్చి చాలాచాలా మాట్లాడిపోయారు. నిజానికి ఆయన పిచ్చి ఆయనది అని వదిలేయవ చ్చు. కానీ ఇప్పటికీ ఇంకా ఆ జెండాలు పట్టుకొని కొంతమంది తెలంగాణలో తిరుగుతుంటే జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం జెండా ఎగరేస్తామని చెబుతూ ఉంటే డోకు వస్తున్నది. రాజకీయాల్లో ఇంత అంధత్వం ఉంటుం దా అనిపిస్తున్నది. తెలంగాణకు జరిగిన అన్యాయా ల్లో పెద్ద వాటా చంద్రబాబుదే. హైదరాబాద్‌లోని ప్రభుత్వరంగ కంపెనీలను అడ్డికిపావుసేరు చొప్పున అమ్మేసి వేలాదిమంది ఉద్యోగులను వీధులపాలు చేసినవాడు, హైదారాబాద్ చుట్టూ వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసినవాడు, హైదరాబాద్‌ను ఆంధ్ర కాలనీగా మార్చినవాడు, తెలంగాణ వనరులు, ఉద్యోగాలు, నీళ్లు, నిధులను అడ్డంగా మళ్లించినవాడు చంద్రబాబే. అసెంబ్లీలో తెలంగాణ పదం ఉచ్చరించవద్దని చెప్పిన నాయకు డూ చంద్రబాబే. తెలంగాణ ఉద్యమాన్ని ఆగం పట్టించడానికి ఆయన, ఆయన తాబేదారు మీడి యా చేయని ప్రయత్నం లేదు. తెలంగాణ ఉద్యమ నాయకత్వాన్ని ఎన్నివిధాలుగా బద్నాం చేయాలో అన్నివిధాలుగా బద్నాం చేసేందుకు దిగజారారు.

ఇదే మోత్కుపల్లి నర్సింహులును, మరికొంత మం ది అమాయక తెలంగాణ నాయకులను ఎగదోసి రోజూ కేసీఆర్‌పై దుమ్మెత్తిపోయించారు. తెలంగాణ ఉద్యమం పతాక సన్నివేశానికి చేరిన తర్వాత కూడా తెలంగాణ టీడీపీ నాయకులనే కేసీఆర్‌కు ఎదురు నిలబెట్టి నోటికొచ్చిందల్లా వాగించారు. ఎన్నికల కోసం 2009లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తామ ని మ్యానిఫెస్టోలో పెట్టారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్లీ కేసీఆర్ మీద, టీఆర్‌ఎస్ మీద దాడి మొదలు. 2009 డిసెంబరు 9న కేసీఆర్ దీక్ష పర్యవసానంగా కేంద్రం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మొదలు పెడుతున్నట్టు ప్రకటించింది. ఇక అక్కడి నుంచి చూడాలి చంద్రబాబు కుట్రలు. ఎన్టీఆర్ ట్రస్టుభవన్ నుంచే ఆంధ్ర నాయకుల రాజీనామా డ్రామాలు. కృత్రిమ ఉద్యమాలు. కేంద్రంపై ఒత్తిడి. అయినా టీఆర్‌ఎస్, కేసీఆర్ పట్టినపట్టు విడువకుం డా ఒకే లక్ష్యంతో ముందుకుసాగుతూ వచ్చారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ గడపదాటకుండా చూస్తామని ప్రగల్భాలు పలికి నానా రభస చేసి, చివరికి బిల్లు పాస్ కాకుండా చూడాలని కుట్రచేసిన నాయకుడు చంద్రబాబు.

అప్పుడెప్పుడూ ఆంధ్రకు ప్రత్యేక హోదా గురిం చి కానీ, ఆంధ్ర అవసరాల గురించి కానీ చంద్రబా బు, ఆంధ్ర నాయకులు మాట్లాడలేదు. రాష్ట్రం ఏర్పాటుకాకుండా చూడటమే ఏకైక లక్ష్యంగా పనిచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏడు మండలాలను తెలంగాణ నుంచి లాగేసుకున్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని పేరుతో సెక్షన్ 8 అమలుచేసి ఇబ్బందిపెట్టాలని చూశారు. అంతటి తెలంగాణ వ్యతిరేకి, కుట్రదారుతో ఇప్పటికీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డి, ఎల్.రమణ, అరవింద్‌కుమార్‌గౌడ్ వంటివారు అంటకాగుతున్నారూ అంటే తెలంగాణ ప్రజ లు ఏమనుకోవాలి. వీళ్లకు ఆత్మగౌరవం, ప్రాంతీయాభిమానం ఉన్నాయా? చంద్రబాబు ఇప్పుడు జై తెలంగాణ అన్నా తెలంగాణ నాదే అన్నా ఎవరు పట్టించుకుంటారు. తెలంగాణలో టీడీపీకి పనిలేదు. తెలంగాణకు టీడీపీ అవసరం లేదు. టీడీపీ తెలంగా ణ పార్టీ కాదు. అది ఆంధ్రా ఆధిపత్యానికి ప్రతీక. తెలంగాణ వ్యతిరేకతకు పతాక. అందువల్ల చంద్రబాబుతో కలిసి రాజకీయ వేదిక, సారూప్యత పంచుకునే వారెవరూ తెలంగాణకు మిత్రులు కాదు. ఎన్టీఆ ర్ ట్రస్టు భవన్‌ను ఇప్పటికే సగానికిపైగా అద్దెకు ఇచ్చారు. చంద్రబాబుకు అర్థం అవుతున్నది. తనకు ఇక్కడ పనిలేదని.

అర్థం కానిదల్లా తెలంగాణ తమ్ముళ్లకే. ఇక చంద్రబాబు హైదరాబాద్‌ను అరువై ఏండ్లు గా అంగుళం అంగుళం కష్టపడి నిర్మించాడట. మన గురించి ఎవరూ చెప్పేవారు లేకపోతే ఇదే బాధ. సొంత డబ్బా కొట్టుకోవడానికి కూడా కొంచెం జ్ఞానం ఉండాలి. సోయి ఉండాలి. ఈయన ఒక్క సైబర్ టవర్స్ నిర్మించి మొత్తం హైదరాబాద్ నేనే నిర్మించా అంటే అనేక భవంతులు, అద్భుతమైన ప్రాసాదాలు నిర్మించిన ఆఖరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఏమనుకోవాలి? చంద్రబాబుకు మతిపోతున్న ది. సమయం, సందర్భం, ఉచితానుచితం ఏదీ పట్ట డం లేదు. ఏది పడితే అది మాట్లాడే స్థితికి జారిపోతున్నాడు. పాపం నిన్నగాక మొన్న అష్టకష్టాలు పడి చదువుకొని సివిల్స్ టాపర్‌గా వచ్చిన అనుదీప్ ఘనతనూ చంద్రబాబు తన ఖాతాలోనే రాసుకోవాలనుకున్నాడంటే ఆయన పిచ్చి ఏ స్థాయికి చేరిందో అర్థ మవుతున్నది. ఆయనను ఎన్టీఆర్ ఆత్మ వేధిస్తున్నది. అందుకే ఆ పార్టీ తెలంగాణలో అంతరించింది. ఆం ధ్రలో కూడా విశ్వసనీయతను కోల్పోయి, చుక్కాని లేని నావలా పయనిస్తున్నది. మాటలకు, విధానాల కు, చేతలకు పొంతన లేకుండా ఆ రాష్ర్టానికి భారం గా పరిణమిస్తున్నది. తెలంగాణ సంగతి దేవుడెరుగు. ఆయన ఆంధ్రలోనే మళ్లీ గెలువడం అసాధ్యమని అప్పుడే అప్పుడే విశ్లేషణలు జరుగుతున్నాయి.

నిశ్శబ్దవిప్లవం కాదు, శబ్దవిప్లవమే

కాంగ్రెస్ నాయకులు నిశ్శబ్ద విప్లవం గురించి మాట్లాడుతుంటే వీళ్లు ప్రజలకు ఎంత దూరంగా ఉండి మాట్లాడుతున్నారో అర్థమవుతున్నది. కళ్లుండీ చూడలేని, చెవులుండీ వినలేని వాళ్లకు నిశ్శబ్ద విప్లవాలే కనిపిస్తాయి. తమ రాజకీయ జీవితంలో ఏనాడూ ఒక నిర్మాణాత్మక విధానాన్ని అమలు చేయని పార్టీ కాంగ్రెస్. ఏనాడూ ప్రజలకు చేరువగా వచ్చి నిలబడని పార్టీ కాంగ్రెస్. ఏనాడూ స్వతంత్రించి తమ ప్రజలకు ఏమి కావాలో అది చేసే సాహసం చేయని ఉపగ్రహ నాయకులు కాంగ్రెస్ నాయకులు. నీతులన్నీ వదలి, తప్పులన్నీ చేసి, ఆరు దశాబ్దాలుగా ఒకే కుటుంబానికి సేవ చేస్తూ ఇప్పుడు నీతుల గురించి, కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ నాయకుల భావ దారిద్య్రం అర్థం చేసుకోవచ్చు. ఏ విలువల పట్లనైనా వీరికి నిబద్ధత ఉన్నదీ లేనిది వీరి రాజకీయ జీవితాల్లోకి తొంగిచూస్తే చాలు చాలా సులువుగా అర్థమవుతుంది. కేసీఆర్ కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని పదేపదే మాట్లాడుతున్న ఉత్తమ్ కుమారునికి, కోమటిరెడ్డి సోదరులకు, జానారెడ్డి…ఇంకా చాలా మంది కాంగ్రెస్ నాయకులకు ఒకటే ప్రశ్న. ఉత్తమ్‌కుమారుని ఇంట్లో ఇద్దరికి, కోమటిరెడ్డి ఇంట్లో ఇద్దరికి, రేపు జానారెడ్డి ఇంట్లో ఇద్దరికి…రాజకీయ వారసత్వాలు ఇస్తే తప్పులేదు, కానీ ఒక సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో ముందుండి కొట్లాడి, నలిగి నలిగి ఎదిగి వచ్చిన నాయకులు ఒకే కుటుంబం నుంచి వచ్చిన వారయితే తప్పేమిటి? ఉత్తమ్ కుమార్‌రెడ్డికి, జానారెడ్డికి, కోమటిరెడ్డికి, దామోదర్‌రెడ్డికి ప్రజలంటే ఒక ఓటు వేసే యంత్రాలు. ఎన్నికలప్పుడు మాత్రమే పనికివచ్చే ఈవీఎంలు. వారిపట్ల ఎటువంటి సేవాదృక్పథం, సహృదయం, సహానుభూతి లేని నాయకులు వీరు. ప్రజలకు మేలు చేసి, పనులు చేసి, అభివృద్ధి చూపించి వారిని గెలుచుకోవడం, వారి హృదయాల్లో స్థానం సంపాదించుకోవడం కాకుండా, ప్రజలను ఎన్నిక ఎన్నికకూ ఎలా బురిడీ కొట్టించాలో మాత్రమే తెలిసిన రాజకీయ విద్యాపారంగతులు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ పాత ఒరవడిని రద్దు చేసింది. జనం మధ్య జనం కోసం పనిచేయడం అన్నది ఎలా ఉంటుందో గత నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రుజువు చేశారు. టీఆర్‌ఎస్ నాయకులు జనంలో ఒకరుగా ఉన్నారు. పిలిస్తే పలికేట్టుగా పల్లెలు పట్టుకుని తిరిగారు. పోటీపడి అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. కాంగ్రెస్ నాయకత్వానికి టీఆర్‌ఎస్ నాయకత్వానికి అసలు పోలికే లేదు. టీఆర్‌ఎస్ నాయకులు ఉద్యమంలో రాటుదేలి, ప్రజల సమస్యలను ఆకళింపు చేసుకుని, పోరాడి రాజకీయాల్లో ఎదిగి వచ్చినవారు. కాంగ్రెస్ నాయకులు పైరవీలు చేసి పైకి వచ్చినవారు. ధన రాజకీయాలతో ఎదిగి వచ్చినవారు. రెండు పార్టీల మధ్య ఇంత స్పష్టమైన అంతరం ఉన్నది. ఇక నిశ్శబ్ద విప్లవం అవసరం ఉంటే గింటే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే ఉండాలి. టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా జనం గొంతెత్తి మాట్లాడుతున్నారు. వారు తమ ఇష్టాయిష్టాలను దాచుకోవడం లేదు. బాహాటంగానే టీఆర్‌ఎస్‌ను ఎందుకు సమర్థిస్తున్నారో చెబుతున్నారు. అక్కడో ఇక్కడో కొద్ది మంది నాయకులపై అసంతృప్తి ఉంటే ఉండవచ్చు. కానీ ప్రభుత్వం, మెజారిటీ టీఆర్‌ఎస్ నాయకత్వం కష్టపడుతున్న తీరును అందరూ గమనిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నిశ్శబ్ద విప్లవం ఎందుకు? ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చినందుకా? విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చేసినందుకా? చెరువులు బాగుచేయించినందుకా? ఎప్పుడూ లేనంతగా కాలువలలో నీరు పారించినందుకా? ఊరూరా రోడ్లు, భవనాలు నిర్మించినందుకా? పంటపెట్టుబడికింద ఎనిమిది వేల రూపాయల సాయం అందిస్తున్నందుకా? పైసా ఖర్చు లేకుండా రెవెన్యూ రికార్డులను సరిచేసి, పట్టా పుస్తకాలు ఇస్తున్నందుకా? నలభై లక్షల మందికి పించన్లు అందిస్తున్నందుకా? మున్సిపాలటీల స్వీపర్లు మొదలుకుని వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు, హోంగార్డులు, అంగన్‌వాడీ కార్యకర్తలు…ఇలా అతితక్కువ భత్యాలతో పనిచేస్తున్న వర్గాలకు పెద్ద మనసుతో భత్యాలను పెంచినందుకా? ఉద్యోగులకు అడిగిందే తడవుగా డిమాండ్లను నెరవేర్చుతున్నందుకా? ఏ కారణం చేత ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవం వస్తుంది? అని మొన్న పాస్ పుస్తకాలు తీసుకోవడానికి వెళ్లిన సందర్భంగా ఇష్టాగోష్టి సమావేశంలో ఒక రైతు నాయకుడు ప్రశ్నించాడు. కాంగ్రెస్ నాయకులకు ఒక ప్రాజెక్టు అంటే నాలుగైదు పంచవర్ష ప్రణాళికలపాటు పండుగ. ప్రాజెక్టు మొదలు పెట్టి, అందులో నీళ్లు వచ్చే నాటికి ఒక తరం గతించి పోయే పరిస్థితి. నిధులివ్వరు. భూసేకరణ చేయరు. జనం నీళ్లు వస్తాయని కొండకు ఎదురు చూసి నట్టు ఎదురు చూడడం, తరాలు మారిపోవడం….అదొక అంతులేని వ్యధ. మాధవరెడ్డి ప్రాజెక్టు కింద ఉదయ సముద్రం పూర్తి చేసి దశాబ్దం గడచిపోయింది. ఈరోజుకూ ఉదయ సముద్రం రిజర్వాయరును పూర్తిస్థాయిలో నింపని పరిస్థితి. సగం డిస్ట్రిబ్యూటర్లకు నీరివ్వని పరిస్థితి. ఎందుకంటే ముంపు గ్రామాల ప్రజలకు నష్టపరిహారం ఇవ్వరు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పనులు కదలడం మొదలయింది. నష్టపరిహారం ఖరారయింది. ఒక్క మాధవరెడ్డి ప్రాజెక్టే కాదు, కాళేశ్వరం నుంచి పాలమూరు రంగారెడ్డి వరకు డెడ్‌లైన్‌లు పెట్టుకుని, రాత్రి జాగారాలు చేసి, ఒకటికి పదిసార్లు ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల వెంటపడి పనులు వేగంగా పూర్తి చేయించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వానికి ప్రాజెక్టు నిర్మించడం అంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పొలాలకు నీళ్లివ్వడం. మొబిలైజేషన్ అడ్వాన్సులు, బ్రోకర్లు, కమీషన్లు, ఎస్కలేషన్లు, ఏళ్ల తరబడి సాగదీసుడు, ధనయజ్ఞాలు…ఇది కాంగ్రెస్ సృష్టించిన ఇరిగేషను ప్రాజెక్టుల

పదజాలం. తెలంగాణ ప్రభుత్వం నీటి పారుదల విజ్ఞాన సర్వస్వాన్ని పునర్లిఖించింది. నీళ్లివ్వడం ఒక్కటే లక్ష్యంగా ప్రాజెక్టుల పనులను నడిపిస్తున్నది. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పనివిధానానికి, తెలంగాణ ప్రభుత్వ పనివిధానానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని పదవీ విరమణ చేసిన నీటిపారుదల ఇంజనీరు వివరించారు. కొన్ని ప్రాజెక్టుల కింద ఫలితాలు కనిపిస్తున్నాయి. జనం ఆనందంగా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులే అక్కసుతో రగిలిపోతున్నారు అని ఆయన అన్నారు.

ఇప్పటిదాకా మమ్మల్ని పట్టించుకున్న నాయకుడు కేసీఆర్ ఒక్కరే. రైతు బిడ్డ. రైతు కష్టం తెలిసినోడు. అందుకే ఆయన ఇంతపెద్ద పని ముందేసుకుని చేయిస్తుండు. నాకు పెట్టుబడి వచ్చినా రాకున్నా పర్వాలేదు. కానీ మూడెకరాలోళ్లు, నాలుగెకరాలోళ్లు, పేద రైతులు పండుగ చేసుకుంటుండ్రురా. ఇసోంటి ముఖ్యమంత్రిని చూడలేదని చెప్పుకుంటుండ్రురా అని లింగయ్య తాత చెప్పాడు. ఆయన పుట్టి బుద్ధెరిగిన నాటి నుంచి కాంగ్రెస్ వాది. నాయనా నా చెక్కు రాలేదురా. ఇస్తరా ఇవ్వరా. ఒక్కసారి కనుక్కుని చెప్పు అని ఒక పెద్దావిడ ప్రశ్నించింది. రికార్డుల్లో కొన్ని తప్పులు దొర్లాయి సరిచేసి త్వరలోనే ఇచ్చేస్తామని ఎమ్మార్వో చెప్పారు. డబ్బులు ఎంత ఇస్తున్నామని కాదు, రైతులోకంలో అది సృష్టించిన ఆత్మవిశ్వాసం, ప్రజల్లో వెల్లువెత్తిన హర్షాతిరేకాలు ప్రభుత్వ విధానం సాధించిన విజయానికి సూచికలు. ఇవ్వాళ పల్లెలు కళకళలాడుతున్నాయి. పించను డబ్బులతో, పంటపెట్టుబడి డబ్బులతో ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలను చేరుకునే ప్రయత్నం, ఆదుకునే ప్రయత్నం చేసింది. నెలనెలా వచ్చే పించను డబ్బులు కాకుండా సుమారు ఆరువేల కోట్ల రూపాయలు పంట పెట్టుబడి రూపంలో పల్లెలకు ఇన్‌ఫ్యూజ్ అయిందంటే దాని ప్రభావం ఎంతగా ఉంటుందో ఊహించండి. ఇంతగా నిధులు ప్రజలకు అందజేసిన చరిత్ర దేశంలో ఏపార్టీకయినా, ఏ రాష్ర్టానికయినా ఉందా? కంపెనీలు 30 వేల కోట్లు, 40 వేల కోట్లు రుణాలు తీసుకుని ఎగవేస్తున్న కాలంలో, దివాలా ప్రకటిస్తున్న కాలంలో, విదేశాలకు పారిపోతున్న కాలంలో కేవలం ఆరు వేల కోట్ల రూపాయలతో తెలంగాణ ప్రభుత్వం పల్లెల్లో ఒక గుణాత్మక మార్పునకు పునాదులు వేసింది. ఈ పెట్టుబడిదేముంది, గిట్టుబాటు ధర ఇవ్వాళని, అలా రైతుకు ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుందని  కొందరు మాట్లాడుతున్నారు. అసలు మార్కెట్లను గతంలో ఏ ప్రభుత్వం అన్నా పట్టించుకుందా? జోక్యం చేసుకుని రైతు పంటలను కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుందా? తెలంగాణ ప్రభుత్వమే ఆ విషయంలో అందరికంటే ముందుగా స్పందిస్తున్నది. ఈ సారి అసాధారణ రీతిలో వరిపంట పండించారు. మొన్న సంగారెడ్డి నుంచి సింగూరు వెళుతుంటే దాదాపు పది కిలోమీటర్ల పొడవున రైతులు ధాన్యం రాశులు రోడ్డుపై ఆరబెట్టుకుంటున్నారు. అంతధాన్యం నేనెప్పుడూ చూడలేదు. ఎక్కడ చూసినా వందలు వేల బస్తాలు నింపి నెట్టుకట్టి పెట్టారు. అక్కడ ఒక రైతును అడిగాను…ఎన్నేళ్లుగా ఇలా పండిస్తున్నారు? అని. అయ్యో ఎన్నో ఏళ్లు ఎక్కడ. ఇంతకుముందు మాకు నీళ్లు ఎక్కడివి? తెలంగాణ వచ్చినంక ఈ రెండు మూడేళ్ల నుంచే ఈ పంట. సింగూరు నుంచి మాకు నీళ్లిస్తున్నరు. అందుకే ఇంత పంట దిగుబడి వచ్చింది అని ఆ రైతు చెప్పారు. అందరూ వరే పండిస్తే ఎలా? పంటలు మార్చవచ్చు కదా? అని అంటే ఇగ చెయ్యాలె. మేమూ అదే అనుకుంటున్నం అని ఆ రైతు సమాధానం చెప్పాడు. పంట పెద్ద ఎత్తున మార్కెట్‌లోకి రావడం వల్ల కొనుగోళ్ల సమస్య ఏర్పడ్డ మాట వాస్తవమే. అయినా ప్రభుత్వమే మిల్లర్లతో, మార్కెట్ వర్గాలతో మాట్లాడి ధాన్యం కొనుగోలుకు మార్గం సుగమం చేస్తున్నది. కాంగ్రెస్ హయాంలో రైతులది అరణ్య రోదన. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి సందర్భంలోనూ స్పందించి దిద్దుబాటు చర్యలు, సహాయక చర్యలు చేపడుతున్నది.

అందుకే కాంగ్రెస్ నాయకత్వం ఎంత గింజుకున్నా ప్రజల్లో స్పందన రావడం లేదు. ఇంతకాలం ఎటువంటి బాధ్యత లేకుండా అనుభవించిన అధికారం చేజారిపోయిందన్న అక్కసు, ద్వేషం, ఆక్రోషం కాంగ్రెస్ నాయకులను వివశులను చేస్తున్నది. మంచిని మంచి చెడును చెడు అనాలనే కనీస నిజాయితీ కూడా వారిలో లోపించింది. అడ్డగోలు మాటలు, ఆరోపణలు ఆ వివశత్వం నుంచి వస్తున్నవే. వాస్తవాలు తెలుసుకునే పరిస్థితిలో కానీ ప్రజాస్పందనను గుర్తించే పరిస్థితుల్లోగానీ వారు లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ నాయకత్వానికి కాలం చెల్లిపోయింది. ఈ కాలానికి పనికివచ్చే  ఆలోచనలు కానీ, ఆహార్యం కానీ, వర్తన కానీ, ఆధునికత కానీ వారికి లేవు, ఇక రావు. సమీప భవిష్యత్తులో టీఆర్‌ఎస్‌ను మరిపించే మంత్ర దండమేదీ వారివద్ద లేదు. రాదు. ఆ పార్టీ నాయకత్వం ఉత్త భ్రమల దుర్గాలు నిర్మించుకుని విహరించవలసిందే.