చంద్రబాబాబూ….ఇంక చాలించు!

TDP-Flag-1

తెలంగాణ విఫలమవుతుందని, చంద్రశేఖర్‌రావు పాలన సాగించలేరని, కరెంటులేక తెలంగాణ అంధకారమయం అవుతుందని, ఆర్థికంగా అస్తవ్యస్థం అవుతుందని కలలగన్న వాళ్లంతా ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు. డ్యామిట్ కథ అడ్డం తిరిగిందేమిటా అని వలపోస్తున్నారు. విపరీతమైన అక్కసును ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై, నాయకత్వంపై అడ్డగోలుగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. రవంత మనుషులు కొండంత నేతలపై విషం చిమ్ముతున్నారు. ఇదంతా చంద్రబాబు ఎత్తుగడలో భాగమే. అయితే కేసీఆర్ ఎన్‌టిఆర్ కాదని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదని చంద్రబాబు, ఆయన పార్టీ గుర్తుపెట్టుకుంటే మంచిది.

నువ్వు సరిగా పరుగెత్తలేకపోతే పక్కవాడు పరుగెత్తకుండా చూడు. నీకు మంచి పేరు లేకపోతే పక్కవాడి పేరు చెడగొట్టు. నీకు సమస్యలు ఉంటే పక్కవాడికి సమస్యలు సృష్టించు. నీకు నవ్వు రాకపోతే పక్కవాడిని ఏడిపించు. విజయాలను నీఖాతాలో వేసుకో అపజయాలను అవతలివాడి ఖాతాలో వెయ్యి. నీకు తెలివి లేకపోతే తెలివైనవాళ్లంతా నా శిష్యులేనని ప్రకటించుకో… ఏమిటిదంతా అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అనుచర మీడియా ప్రసంగాలు, ప్రచారాల సారాంశం ఇది. స్వరాష్ట్రంలో ఏడవడానికి ఏమీ లేదు. తెలంగాణను ఉద్ధరిస్తాడట. తెలంగాణ ఇప్పుడు ఇలా మిగులు నిధులతో ఉండడానికి ఆయనే కారణమట. ఇంకా నయం… మహబూబ్‌నగర్ ఇప్పడు ఇలా ఉండడానికి కూడా తానే కారణమని చెప్పలేదు. చెప్పడు. మొదట తన మామ, తర్వాత తానూ దత్తత తీసుకుని మహబూబ్‌నగర్‌కు ఏమి చేశారో ఆయనే కాదు, ఆయనకు చెంచాగిరి చేస్తున్నవారు ఎవరూ చెప్పే పరిస్థితి లేదు. మహబూబ్‌నగర్‌కు కొత్తగా ఒక్క చుక్క నీటిని కూడా తేలేకపోయిన దౌర్భాగ్యపాలన టీడీపీది. కృష్ణానది లోతున ప్రవహిస్తున్నది, మహబూబ్‌నగర్ గడ్డమీద ఉంది. కాబట్టి నీళ్లు ఎలా వస్తాయి అని మంత్రులు ప్రకటించింది చంద్రబాబు పాలనలోనే. శ్రీశైలం రిజర్వాయరుకు ఆవైపున అన్ని ప్రాజెక్టులనూ వెంటబడి పూర్తి చేసిన చంద్రబాబు, బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి మొదలు ఎస్‌ఎల్‌బీసీ వరకు అన్నింటినీ తుంగలో తొక్కారు. ఎంతోపోరాటం చేసి, లోక్‌సభ ఎన్నికకు 485 మంది నామినేషన్లు వేసి నిరసన తెలిపిన తర్వాత కూడా ఎస్‌ఎల్‌బీసీని ముందుకు సాగన్విలేదు. అది పనికి రాని ప్రాజెక్టు అని అదీ నల్లగొండకు వచ్చి ప్రకటించినవాడు చంద్రబాబు మంత్రివర్గంలో నీటిపారుదల శాఖను చూసిన ఆంధ్రా పెద్దమనిషే. మాధవరెడ్డి కొట్లాడి, రాజీనామాకు సిద్ధపడి, పట్టుబడితే చివరకు పుట్టంగండి లిఫ్టుపనులు మొదలు పెట్టారు. చంద్రబాబు మెడమీద మాధవరెడ్డి కత్తిపెడితే ఆ ప్రాజెక్టు అమలయింది. ఇటువంటి చరిత్ర కలిగిన మహానుభావులు తెలంగాణను ఉద్ధరించారట. మళ్లీ అవకాశం ఇస్తే ఇంకా చాలా ఉద్ధరిస్తారట. మహబూబ్‌నగర్ రుణం తీర్చుకుంటాడట. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు మద్దతుగా చంద్రబాబుతో ప్రకటన చేయించండి…చూద్దాం…! ఉచ్ఛనీచాలు మరిచిన గుంపునొకదానిని వెంటేసుకుని చంద్రబాబు ఇప్పటికీ తెలంగాణలో అశాంతిని రాజేయడానికి ప్రయత్నిస్తున్నాడు. వీళ్లను జనం కనిపెట్టవలసిన అవసరం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌తో కలిసే నాటికే తెలంగాణ రాష్ట్రం మిగులు రాష్ట్రం. 1969 తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడింది కూడా తెలంగాణ మిగులు నిధులను తెలంగాణలో ఖర్చు చేయకుండా ఆంధ్రాకు మళ్లించం కారణంగానే. స్వయంగా సీపీఎం నేత పుచ్చలపల్లి సుందరయ్య అప్పటి రాష్ట్ర శాసనసభలో తెలంగాణ మిగులు నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ తర్వాత కూడా అంకెల గారడీ పెరిగిందే తప్ప మారలేదు. చంద్రబాబు రాజకీయాల్లోకి రాకముందు నుంచే తెలంగాణ మిగులు రాష్ట్రం. రాజకీయాల్లోకి వచ్చిన రోజుకూడా తెలంగాణ మిగులు రాష్ట్రమే. కానీ ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజం అనిపించుకోగలమనే పాడు నమ్మకం చంద్రబాబుకు, ఆయన అనుచర మీడియాకు బాగా బలపడిపోయింది. ఇప్పటికీ అదే మంత్రాన్ని చదువుతున్నారు. కాస్మొపాలిటన్ నగరంగా, ముందునుంచీ పరిశ్రమలకు కేంద్రంగా, కేంద్ర పరిశోధనా సంస్థలకు నిలయంగా హైదరాబాద్‌కు సహజసిద్ధంగా ఉన్న శక్తిని తమ ఖాతాలో చూపించుకోవడం చంద్రబాబునాయుడుకే చెల్లింది. చంద్రబాబయినా, రాజశేఖర్‌రెడ్డి అయినా, మరో మీడియా బాబయినా హైదరాబాద్ వల్ల బాగుపడ్డారు. హైదరాబాద్ చాలా మందికి చాలా ఇచ్చింది. ఆ క్రమంలో అనివార్యంగా హైదరాబాద్‌కూడా ఎదిగింది. ఎవరయినా హైదరాబాద్‌నుంచి వీలైనంత ఎక్కువ ప్రయోజనం పొందారు తప్ప హైదరాబాద్‌ను తామే ఉద్ధరించామని చెప్పుకోవడం సొంతడబ్బాకొట్టుకోవడమే. హైదరాబాద్ 1930ల దాకా ఢిల్లీ కంటే పెద్ద నగరం. ఆనాడే నిజాం నవాబు ప్రపంచంలోని సంపన్నుల్లో ఒకరు. అప్పుడే అనేక పరిశ్రమలు ఇక్కడ వెలశాయి. అంటే హైదరాబాద్‌కు సహజసిద్ధమైన బలాలు అప్పటి నుంచే ఉన్నాయి. అప్పటికే హైదరాబాద్ ఒక మహానగరంగా ఎదిగింది కాబట్టే, రాజధానికి అవసరమైన అన్ని హంగులు రెడీమేడ్‌గా ఉన్నాయి కాబట్టే ఆరోజు ఆంధ్ర నాయకులు విశాలాంధ్ర నినాదాన్ని ముందుకు తెచ్చి, తెలంగాణ నాయకులను మాయ చేసి రెండు ప్రాంతాలను కలిపేశారు. నగరం ఆధునీకరణ, విస్తృతి వయసుతోపాటు పెరిగాయి. అందువల్ల చంద్రబాబు హైదరాబాద్ గురించి అడ్డగోలు క్లెయిములు మానేయడం మంచిది. ఆయన తెలంగాణ గురించి కాన్‌సెంట్రేట్ చేయడం మానేసి ఆంధ్ర రాష్ర్టాన్ని మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దడం, అమరావతిని మహానగరంగా నిర్మించడం మీద శ్రద్ధపెడితే అక్కడ ఓటేసిన ప్రజలు సంతోషపడతారు. చంద్రబాబు తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ గురించి, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు గురించి అసలు మాట్లాడకపోతే మంచిది.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సందర్భంగా జరిగిన విద్రోహాలకు బ్రాండు అంబాసిడర్ చంద్రబాబు. తెలంగాణ రాష్ట్రం అవతరణకు అడ్డంగా నిలబడిన ముఖ్యుల్లో ఒకడు. 2009 డిసెంబరు 9 ప్రకటన తర్వాత ఆయన వేసిన వేషాలన్నీ తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణలో అనేక మంది యువకులు ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రత్యక్ష, పరోక్ష కారకుల్లో ఒకరు. ఆయన, ఆయన పార్టీ నాయకులు ఇవ్వాళ తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడుతుంటే హంతకులే సంతాపసభలు జరిపినట్టుగా ఉంది. తెలంగాణ గురించి, తెలంగాణ నాయకత్వం గురించి చంద్రబాబు, టీడీపీ నాయకులు ఎంత మాట్లాడితే తెలంగాణ ప్రజలకు అంత కనువిప్పు. తెలంగాణ పాలిట ఆయనది ఇనుపపాదం. కరువులు, కాటకాలు, రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు అన్నీ తారస్థాయికి చేరింది అప్పుడే. తెలంగాణ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన మహానాయకుడాయన. శాసనసభలో తెలంగాణ పదం పలకడానికి వీలు లేదని నిషేధించిన పెద్ద మనిషి. తెలంగాణ ఉద్యమం మొదలు కాగానే ఆగమేఘాలపై దేవాదులకు వెళ్లి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. మూడేళ్లలో వరంగల్ జిల్లాకు నీళ్లిస్తామని ఆరోజు చంద్రబాబు ప్రకటించారు. అనుచర మీడియా ఆయనను అపరభగీరథుడే అని కీర్తనలు పాడాయి. కానీ ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చంద్రబాబుకు సొంత తెలివితేటలు ఎప్పుడూ లేవు. సృజనాత్మకత అంతకంటే లేదు. అన్నీ కన్సల్టెన్సీ తెలువులే. కాపీ కార్యాచరణలే. ఎదుటివారిని తగ్గించి తాను పెరగాలని చూడడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అత్యంత జనాదరణ కలిగిన ఎన్‌టిఆర్‌ను జయించింది ఆ కుట్రలతోనే. లక్ష్మీపార్వతిని అడ్డం పెట్టి పత్రికల్లో రోజుకోకథ రాయించేవాడు. అంతఃపురంలో ఏవేవో జరుగుతున్నాయన్నట్టుగా పుకార్లు వ్యాపింప చేశారు. తెలుగుదేశం సర్వనాశనం అయిపోతున్నట్టుగా ప్రచారం చేయించాడు. పార్టీలో గ్రూపులను తయారు చేసి, కొందరిని ఎన్‌టిఆర్‌కు వ్యతిరేకంగా పోగేశాడు. ఎమ్మెల్యేలను పోగేయడంలో కూడా మీడియాను విపరీతంగా వాడుకున్నాడు. లక్ష్మీపార్వతిని ఒక భూతంగా చూపించి ఒక్కొక్కరినీ ఎన్‌టిఆర్ నుంచి దూరం చేశారు. ఎన్‌టిఆర్ నానాటికీ పతనమైపోతున్నట్టుగా, చంద్రబాబు రోజురోజుకు మేరువుగా ఎదుగుతున్నట్టుగా మీడియా కట్టగట్టుకుని చిత్రీకరిస్తూ వచ్చాయి. చివరికి తెలుగుదేశంను కాపాడడానికి చంద్రబాబు ఒక్కరే దిక్కు అన్న పరిస్థితిని తీసుకువచ్చాడు. అలా టీడీపీని చేజిక్కించుకున్నాడు. ఆ తర్వాత ఏ ఒక్క ఎన్నికలోనూ సొంత నాయకత్వ పటిమతో పార్టీని నడిపించింది లేదు గెలిపించింది లేదు. ఒకసారి అటల్‌బిహారీ వాజ్‌పేయి, మొన్న నరేంద్రమోడీ ఆయనకు కలిసొచ్చిన అదృష్టాలు. ఆపద వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త గాలికోసం వెంపర్లాడడం ఆయనకు అలవాటు.

సొంత బలంతో, నాయకత్వ దీక్షాదక్షతలతో, వినూత్నమైన ఆలోచనలతో ఒక ఉద్యమానికి గానీ, ఒక పార్టీకి గానీ మార్గదర్శనం చేసిన చరిత్ర లేదు. మహాఅయితే మంచి మేనేజరుగా పనిచేస్తాడు. ఒక కంపెనీ యజమానిలాగా ప్రవర్తిస్తాడు. అందుకే మంచి నాయకులను చూస్తే భయపడతాడు. ఉద్యమాలను చూస్తే ఈసడించుకుంటాడు. ఇప్పుడు కూడా ఆయన అదే పనిచేస్తున్నాడు. తెలంగాణలో ఆయన కుంపటిని రాజేయడంలోని ఆంతర్యం ఇదే. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు స్వయంగా ఒక ఉద్యమానికి నాయకత్వం వహించాడు. అనేక ఎత్తుపల్లాలను చూశాడు. అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. తెలంగాణ విముక్తి యోధునిగా చరిత్రలో నిలిచిపోయారు. తన పార్టీని ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకువచ్చారు. కొత్త ఆలోచనలతో, ఊహకందని వేగంతో ఆయన పనులు చేసుకుపోతున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని తన కనుసన్నల్లో పరుగులు పెట్టిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రప్రదాతగా తన పేరును శాశ్వతం చేసుకునే దిశగా ఆయన భారీ లక్ష్యాలు పెట్టుకుని పనిచేస్తున్నారు. అంతేగాక రాజకీయ శక్తుల పునరేకీకరణతో టీఆరెస్‌ను ఒక బలమైన శక్తిగా నిర్మించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. తెలంగాణ విఫలమవుతుందని, చంద్రశేఖర్‌రావు పాలన సాగించలేరని, కరెంటులేక తెలంగాణ అంధకారమయం అవుతుందని, ఆర్థికంగా అస్తవ్యస్థం అవుతుందని కలలగన్న వాళ్లంతా ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు. డ్యామిట్ కథ అడ్డం తిరిగిందేమిటా అని వలపోస్తున్నారు. విపరీతమైన అక్కసును ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై, నాయకత్వంపై అడ్డగోలుగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. రవంత మనుషులు కొండంత నేతలపై విషం చిమ్ముతున్నారు. ఇదంతా చంద్రబాబు ఎత్తుగడలో భాగమే. అయితే కేసీఆర్ ఎన్‌టిఆర్ కాదని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదని చంద్రబాబు, ఆయన పార్టీ గుర్తుపెట్టుకుంటే మంచిది.

గోదావరి పొడవునా బరాజ్‌లు, ప్రాజెక్టులు

godavari610

-ఇక ఎక్కడి నీళ్లు అక్కడే వాడకం
-వీలున్నచోటల్లా జల విద్యుదుత్పత్తి
-రాష్ర్టానికి ఉపయోగకరంగా ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్
-సీమాంధ్ర అన్యాయానికి తెలంగాణ పరిష్కారం
-మన నీళ్లు మనకే దక్కేలా ప్రాజెక్టులు
-ప్రాజెక్టుగా కాళేశ్వరం-పాములపర్తి
-సాహసోపేత నిర్ణయాలతో కేసీఆర్ సర్కార్

ప్రాజెక్టులు మొదలుపెట్టాలి.. తమవారైన కాంట్రాక్టర్లు మొబిలైజేషన్ అడ్వాన్సులతో సొమ్ము చేసుకోవాలి.. కానీ ప్రాజెక్టు పూర్తికాకూడదు.. నీరు పారకూడదు! అదీ సిద్ధాంతం!! తెలంగాణ దాటేలోపు గోదావరికి అడ్డంకులు ఉండకూడదు! అదీ లోగుట్టు! అత్యంత భారీ.. అత్యంత క్లిష్టమైన.. అత్యంత అసాధ్యమైన ప్రాజెక్టుగా తయారైన ప్రాణహిత-చేవెళ్ల మొదలు.. ఏ చిన్నాచితక ప్రాజెక్టు చూసినా నాటి సమైక్య పాలకుల కుట్రలన్నింటికీ ఈ రెండు అంశాలే మెట్లు! ఎప్పుడో పూర్తయిపోయినా.. ఇంకా దిగువ ప్రాంతాలకు కనీస స్థాయిలో నీళ్లందించలేకపోతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టే సాక్ష్యం! ఎస్సారెస్పీ కాలువల్లో నీళ్లు కాదు.. రైతుల కన్నీళ్లు పారుతున్నాయి! గోదావరి పక్కనే ప్రవహిస్తున్నా తెలంగాణ పొలాలు ఎండిపోయాయి! దశాబ్దాలుగా అనుభవించిన ఈ నీటి గోసను తీర్చేందుకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పంతం పట్టింది! ఇక గోదావరి నీళ్లు ఎక్కడికక్కడే వినియోగమయ్యేలా సాహసోపేత నిర్ణయాలకు సిద్ధమవుతున్నది! గోదావరి, దాని ఉపనదుల పొడవునా.. వీలున్నచోట ప్రాజెక్టులు.. కాదంటే బరాజ్‌లు! వాటినుంచి సమీప గ్రామాలు.. పట్టణాలకు, అక్కడి పొలాలకు అవసరమైన తాగు.. సాగునీరు! పనిలోపనిగా అదనంగా జల విద్యుత్ ఉత్పత్తి! ఇప్పటికే మన హక్కుగా మిగిలి ఉన్న 487 టీఎంసీల నీటి వినియోగంతోపాటు.. వరద జలాల్లో 500 టీఎంసీల నుంచి వెయ్యి టీఎంసీలు ఉపయోగించుకునే అవకాశం! ఈ సత్సంకల్పం పూర్తయితే.. ఇంక బంగారు తెలంగాణ నిర్మాణానికి అడ్డెవ్వరు?

గోదావరిలో నీళ్లున్నా ఇంతకాలం తెలంగాణ నెత్తిపై శని ఉంది. సమైక్య ప్రభుత్వాలు ప్రాజెక్టులు చేపట్టలేదు. చేపట్టినా వివాదాలలో ఇరికించేందుకు ప్రయత్నించాయి. వివాదాలు లేకపోతే సృష్టించాయి. ప్రాజెక్టులు మొదలు పెట్టాలి కానీ పూర్తి కావద్దు. కాలువలు తవ్వాలి కానీ నీళ్లు పారొద్దు. సమైక్య ప్రభుత్వాల కుట్రలను గుర్తుపట్టిన తెలంగాణ ప్రభుత్వం గోదావరిపై ప్రాజెక్టులను పునఃసమీక్షిస్తున్నది. వీలైనంత ఎక్కువ నీటిని వినియోగంలోకి తీసుకురావడానికి, వీలైనంత ఎక్కువ ఆయకట్టును సృష్టించడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పంతంగా పనిచేస్తున్నారు.

గోదావరి నదిపై వీలైనన్ని బరాజ్‌లు నిర్మించి నీటిని లిఫ్టు చేయడమే కాకుండా, పెద్ద ఎత్తున జలవిద్యుత్ ప్రాజెక్టులు చేపట్టే విషయమూ పరిశీలిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏం చేసినా వ్యతిరేకించేవాళ్లు, తొర్రలు వెతికేవాళ్లు కొందరున్నారు. ప్రాణహిత-చేవెళ్ల పథకాన్ని ఎత్తేస్తున్నారని ఒకరు, ఆదిలాబాద్‌కు అన్యాయం చేస్తున్నారని మరొకరు, కంతానపల్లి ఎలా కడతారని ఇంకొందరు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఉన్నవీలేనివీ పోగేసి ఆంధ్రా మీడియాలో కుప్పపోస్తున్నారు.

ప్రాజెక్టుల రీ-ఇంజినీరింగ్
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కొత్త ఆలోచనలవల్ల ఏదో భారం పెరగబోతున్నదని, ప్రాజెక్టులు ఆచరణ సాధ్యం కావని, ఇంకా ఏవేవో ప్రచారాలు ప్రారంభించారు. ఆంధ్రా మీడియాకు, నాయకత్వానికి కావలసింది తెలంగాణ ప్రాజెక్టులు ముందుపడొద్దు. వాళ్లు తెలంగాణ వారినే కొందరిని కవచంగా పెట్టుకుని ప్రచార యుద్ధాలు సాగిస్తున్నారు. మీరు పాత ఆలోచనలు వదిలేయండి.

ఇప్పుడు మనం స్వరాష్ట్రంలో ఉన్నాం. కొత్తగా ఆలోచించండి. స్వేచ్ఛగా ఆలోచించండి. మన ప్రాంతానికి మనం ఎక్కువగా ఏం చేయగలమో పరిశీలించండి. ఎవరో ఏదో అంటారని మరచిపోండి. ప్రజలకు నీళ్లిస్తే అన్నీ వాళ్లే చూసుకుంటారు అని ముఖ్యమంత్రి నీటిపారుదల ఇంజినీర్లతో పదేపదే చెప్తున్నారు. ఇటువంటి ఆలోచనలనుంచి పుట్టిందే ప్రాజెక్టుల రీ-ఇంజినీరింగ్. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు సమీక్ష కూడా అందులో భాగమే. దానికంటే మంచి ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా? అన్న ఆలోచనను ప్రభుత్వం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్‌కు అధ్యయనం బాధ్యత అప్పగించింది.

ప్రాణహిత-చేవెళ్లపై మహారాష్ట్ర ఆందోళన
ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత నదిపై కౌటాల మండలం తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించి అక్కడినుంచి ఎల్లంపల్లికి, ఎల్లంపల్లినుంచి మిడ్‌మానేరుకు నీటిని మళ్లించాలన్నది ప్రస్తుత ప్రాజెక్టు లక్ష్యం. దీనివల్ల మొత్తం 6140 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని అంచనా.

అందులో 5247 ఎకరాలు మహారాష్ట్రలోనే ఉన్నాయి. అందుకే బ్యారేజీ ఎత్తు తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. గతంలో ఈ ప్రాజెక్టు విషయంలో ఆందోళనలు చేసిన ఫడ్నవీస్ ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, తమ ప్రాంతానికి మేలు చేయాలనే సంకల్పంతో, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా మహారాష్ట్రలో ముంపు తగ్గే అవకాశాన్ని పరిశీలించాని విజ్ఞప్తి చేస్తూ స్వయంగా ఓ వినతిపత్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు అందజేసినట్లు నీటిపారుదలవర్గాలు తెలిపాయి.

మహారాష్ట్రలో ముంపు తగ్గించగలిగితే 160 టీఎంసీలే కాదు, అంతకన్నా ఎక్కువ వినియోగించుకున్నా తమకు అభ్యంతరం లేదని ఈ సందర్భంగా కేసీఆర్‌తో ఫడ్నవీస్ అన్నట్లు తెలిసింది. ప్రాణహిత బ్యారేజీవద్ద నుంచి 90 రోజుల పాటు నీటిని మళ్లించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కొత్తగా మేడిగడ్డ వద్ద ప్రతిపాదిస్తున్న బ్యారేజీ నుంచి ఆరు మాసాల పాటు నీటిని మళ్లించుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాణహిత-చేవెళ్ల ఏడు జిల్లాల రైతాంగానికి సాగు, తాగునీరు అందించే ప్రాజెక్టు కనుక, ప్రభుత్వం ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నది. ఏది ఏమైనా వ్యాప్కోస్ సంస్థ అధ్యయనం చేసి ఇచ్చే నివేదికలోని సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని నీటిపారుదల వర్గాలు తెలిపాయి.

ప్రాణహిత-చేవెళ్ల పూర్తి చేసే ప్రాజెక్టు కాదు
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో చాలా సమస్యలున్నాయి. నిజానికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయడంకోసం మొదలుపెట్టిన ప్రాజెక్టు కాదు. పూర్తికాకుండా ఉండడంకోసం రూపొందించిన అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టు. 28 ప్యాకేజీలు, 206 కిలోమీటర్ల టన్నెళ్లు, 849 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 22 లిఫ్టులు, 3466 మెగావాట్ల విద్యుత్ అవసరం, 1757 మీటర్ల ఎత్తిపోత.. ఎప్పటికి పూర్తి కావాలి? చేవెళ్లకు ఎప్పుడు నీరందించాలి? చేవెళ్లకు సూటిగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న జూరాలనుంచి కాకుండా 1055 కిలోమీటర్ల దూరంలోని ప్రాణహితనుంచి నీటిని తీసుకురావాలని ప్రణాళిక రూపొందించడమే పెద్ద కుట్ర. కృష్ణానదిలో తెలంగాణ వాటాను కాజేసే దూరదృష్టితో రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం నడిపించిన కుతంత్రం. శ్రీశైలంను కబ్జా చేయడంకోసమే ఆయన పోలవరంను హడావిడిగా మొదలుపెట్టారు. కృష్ణా నదిని రాయలసీమకు మళ్లించడం కోసమే ఆయన దుమ్ముగూడెం-టెయిల్‌పాండ్ ప్రాజెక్టును ప్రారంభించారు.

చివరి భూములకు నీళ్లివ్వలేని ఎస్సారెస్పీ
విచిత్రం ఏమంటే శ్రీరాంసాగర్ నుంచి కరీంనగర్ జిల్లాలోనే చివరి భూములకు నీళ్లు రావడం ఆగిపోయింది. వరంగల్ జిల్లాకు ఎప్పుడో ఒకసారి కాకతీయకాలువ నీళ్లు వస్తాయి. ఎండాకాలమయితే మంచినీటికోసంకూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి. వరంగల్ జిల్లా నిండా కాలువలైతే తవ్విపెట్టారు. ఒకటికాదు రెండు కాదు. శ్రీరాంసాగర్ రెండో దశ. రెండు పాయలుగా చీలి ఒకటి సూర్యాపేట సమీపంలోని మోతెదాకా వెళుతుంది. మరో కాలువ మహబూబాబాద్‌దాకా వెళుతుంది.

మరోవైపునుంచి వరద కాలువకూడా చేర్యాల ప్రాంతంలో ప్రవేశించి దేవరుప్పలదాకా వచ్చింది. ఇంకోవైపు దేవాదులకోసం వేసిన పైపులైన్లు. కాలువల మీద కాలువలు. కాలువలమీద పైపులైన్లు. ఒక పద్ధతి లేదు, పాడు లేదు, ప్లాను లేదు. రైతులకు నీళ్లు మాత్రం రావడం లేదు. కాలువలు మాత్రం కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల చెట్లు మొలుస్తున్నాయి. గోదావరి నీటిని ఇక్కడెక్కడా ఇద్దామని ఆలోచన చేయని రాజశేఖర్‌రెడ్డి ప్రాణహితకు ఎందుకు వెళ్లాడో ఎవరికీ ఎందుకు అర్థం కావడం లేదు? పోనీ అదయినా సక్కగా చేశారా? తుమ్మిడిహట్టి వద్ద తట్టెడు మట్టి పోయకుండానే అక్కడి నుంచి చేవెళ్లదాకా కాలువల తవ్వకం కాంట్రాక్టులు ఇచ్చేశారు. తుమ్మిడిహట్టి బరాజ్‌పై మహారాష్ట్రతో అవగాహనకు రాకుండానే దిగువన వందల కోట్లు ఖర్చుచేశారు.

మొబిలైజేషను అడ్వాన్సులు ఇచ్చేశారు. ఒక వరుసక్రమం, ప్రాధాన్యతాక్రమం ఏదీ లేదు. ఏరోజుకు నీళ్లివ్వాలన్న కాల నిర్ణయ ప్రణాళిక లేదు. గోదావరి నీటితో నిమిత్తం లేకుండా 16.4 లక్షల ఎకరాలను సాగులోకి తేగలమని అప్పటి ప్రభుత్వం నమ్మబలికింది. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 2,46,704 ఎకరాలను సాగులోకి తేనున్నట్టు రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టు నివేదికను ఖరారు చేసింది. మనవాళ్లు కూడా చాలా మంది నిజమే కాబోలు అనుకున్నారు. కానీ అసలు విషయం ఎవరికీ అర్థం కాలేదు. వాళ్లకు కావలసింది గోదావరిపై మరో ప్రాజెక్టు ఏదీ లేకుండా చూడడమేనని లోతుగా పరిశీలిస్తే తప్ప తెలియదు.

ఇప్పుడు ఏం చేయబోతున్నారు?
వ్యాప్కోస్ నివేదిక చేసే సూచనల ప్రకారం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో మార్పులు చేస్తే ప్రాజెక్టు కాళేశ్వరానికి దిగువకు మారుతుంది. ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టివద్ద చిన్న ఆనకట్ట నిర్మించి పశ్చిమ ఆదిలాబాద్ జిల్లాలో ముందు నిర్ణయించిన ప్రకారం 56,200 ఎకరాల ఆయకట్టుకు నీరిస్తారు. తుమ్మిడిహట్టి వద్ద నదిపై ఇప్పటివరకు ఎటువంటి నిర్మాణాలు చేయలేదు. ఇప్పటివరకు తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి లోపు 900 కోట్లు ఖర్చు పెట్టి కాలువలు, కొంత టన్నెల్ తవ్వారు.

ఇంకా రూ.4500 కోట్ల విలువచేసే పనులు పెండింగులో ఉన్నాయి. ఆ నిధులను కొత్త ప్రాజెక్టుకు మళ్లించవచ్చు. ముంపు వివాదానికి తావివ్వని రీతిలో ఆనకట్టను నిర్మించి, నీటిని మళ్లించి, ఇప్పటికే తవ్విన కాలువల ద్వారా పైన పేర్కొన్న ఆయకట్టుకు నీరందించాలి. ఆనకట్ట నిర్మాణానికి, ఈ ఆయకట్టును సాగులోకి తీసుకురావడానికి 300 నుంచి 400 ఖర్చవుతాయని ఇంజినీర్లు చెప్తున్నారు. అలాగే చేవెళ్లనుకూడా ప్రాణహిత ప్రాజెక్టునుంచి విడదీయాలి. చేవెళ్లకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుద్వారా నీరివ్వడం సులువు. తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. చేవెళ్ల కృష్ణా పరివాహక ప్రాంతం కూడా అని రిటైర్డు చీఫ్ ఇంజినీరు ఒకరు చెప్పారు.

అంటే ప్రాణహిత, చేవెళ్ల రెండు కూడా ఈ ప్రాజెక్టునుంచి డీలింక్ అయ్యే అవకాశాలున్నాయి అని ఆయన చెప్పారు. ఈ మార్పులు జరిగితే కాళేశ్వరం-పాములపర్తి ప్రాజెక్టుగా రూపుదిద్దుకోబోతున్నదా లేక మరో రూపం తీసుకుంటుందా అన్నది వ్యాప్కోస్ నివేదికపై ఆధారపడి ఉంటుంది. ఇక ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు జరిగిన పనులు కూడా వరదల కాలంలో ఉపయోగపడతాయి. మెదక్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయరుగా ఉపయోగపడే మిడ్‌మానేరుకు కాళేశ్వరంతోపాటు ఎల్లంపల్లి కూడా అదనపు ఫీడరుగా పనిచేస్తుంది. మిడ్‌మానేరు నుంచి పాములపర్తి దాకా ప్రాజెక్టు రూపు రేఖల్లో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు లేవు.

కాళేశ్వరం ఎందుకు?
తుమ్మిడిహట్టి వద్ద లభించే ప్రాణహిత నీరే వందకిలోమీటర్లు దిగువన కాళేశ్వరం వద్ద కూడా లభిస్తుంది. చుట్టూ దట్టమైన అడవులనుంచి వచ్చే అనేక వాగులు తుమ్మిడిహట్టికి దిగువనే ప్రాణహితలో కలుస్తాయి. పెద్దవాగు, రాళ్లవాగుదాకా అరడజనుకు పైగా ఆదిలాబాద్ వాగులు అటు ప్రాణహిత ఒడిని, ఇటు గోదావరి ఒడిని చేరతాయి. కాళేశ్వరం వద్ద నీటి లభ్యత ఎక్కువ. కాళేశ్వరానికి దిగువన మేడిగడ్డ వద్ద నది సన్నగా మారుతుంది. అక్కడినుంచి కాళేశ్వరందాకా నది వెడల్పుగా ఉంటుంది. అక్కడ నదీగర్భంలోనే వీలైనంత ఎక్కువ నీటిని నిల్వచేసే అవకాశాలు ఉన్నాయని ఇంజినీర్లు చెప్తున్నారు. ముంపు వివాదానికి ఎక్కువగా ఆస్కారం ఉండదని వారంటున్నారు. అక్కడ ఒక్క చోట లిఫ్టు చేసి టన్నెల్ ద్వారా కరీంనగర్ పట్టణానికి ఎగువన వరద కాలువదాకా తీసుకువస్తే అక్కడ మరో లిఫ్టుద్వారా వరద కాలువలోకి నీటిని మళ్లించవచ్చునని వారు ప్రస్తుతానికి అంచనా వేస్తున్నారు. రెండే లిఫ్టులతో మిడ్ మానేరు దాకా నీరు తేవచ్చునని ఇంజినీర్లు ప్రాథమిక అంచనాలు వేశారు. నీటిలభ్యత, ఫీజిబులిటీ ఇక్కడ ఎక్కువగా ఉంటుందని వారు భావిస్తున్నారు.

వరుసగా బరాజ్ కం రోడ్డు బ్రిడ్జిలు
మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలించడంతోపాటు దుమ్ముగూడెందాకా వరుసగా బరాజ్ కం రోడ్డు బ్రిడ్జిలు నిర్మించేందుకు ప్రయత్నం చేయాలని ఇంజినీర్లు సూచించారు. ఇంద్రావతి గోదావరిలో కలిసిన తర్వాత పన్నెండు కిలోమీటర్లు దిగువన ఇచ్ఛంపల్లి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ప్రారంభించాలని, కంతానపల్లి, దుమ్ముగూడెంలలో బరాజ్‌లు నిర్మించాలని ఇంజినీర్లు ప్రతిపాదిస్తున్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకానికి ఇప్పుడు పూర్తిస్థాయిలో నీరందండం లేదని, అవసరమైతే ఇక్కడ కూడా ఒక చిన్న బరాజ్‌ను నిర్మించడం కానీ కంతానపల్లి ఎత్తుపెంచి నిర్మించడం కానీ వాంఛనీయమని వారు సూచిస్తున్నారు.

జలవిద్యుత్
తుమ్మిడిహట్టినుంచి కాళేశ్వరం వచ్చేసరికి ప్రాణహిత సుమారు 80 మీటర్లు దిగువకు ప్రవహిస్తుంది. ఇంద్రావతి 70 మీటర్లు దిగువకు ఉధృతితో ప్రవహించి ప్రతాపగిరి వద్ద గోదావరిలో కలుస్తుంది. తుమ్మిడిహట్టినుంచి దుమ్ముగూడెందాకా పెద్ద ఎత్తున జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలున్నాయి. వెయ్యి టీఎంసీల నీటినుంచి సుమారు 50వేల మిలియన్ యూనిట్‌ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది అని విద్యుత్ నిపుణుడు వెంకట్ గాంధీ చెబుతున్నారు. ఇంద్రావతి చాలా వేగంగా ప్రవహించేనది. ప్రాణహిత కూడా ఉధృతి ఎక్కువే. కాళేశ్వరం నుంచి దుమ్ముగూడెం వరకు నదీ ప్రవాహం మంద్రంగా ఉంటుంది. ఇక్కడ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లతో కలసి పెద్ద ఎత్తున విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించవచ్చు. రామగుండంనుంచి భద్రాచలందాకా మంచి జలమార్గాన్ని కూడా నిర్మించవచ్చు అని ఆయన సూచించారు.

జీవనదిగా మిగిలింది ఇక్కడే!

D95084512

గలగలా గోదారి..
విలవిలా తెలంగాణ-2

వాగులు, వంకలు, ఉప నదులతో
నిండు కుండలా గోదావరి నది
సముద్రంలో కలిసేవన్నీ ఇక్కడి నీళ్లే
ఎండిపోని ప్రాణహిత, ఇంద్రావతి
150 టీఎంసీలిస్తున్న ఆదిలాబాద్ జిల్లా
సాగు అవకాశాలు తగ్గిపోయిన ఎస్సారెస్పీ
గోదావరికి జలాలన్నీ ఆ ప్రాజెక్టు దిగువనే
ఒడిసి పట్టుకుంటే బంగారు తెలంగాణే

తెలంగాణలో గోదావరి అడుగిడిన తర్వాత తొలి మజిలీ ఎస్సారెస్పీ జలాశయం! కానీ.. మహారాష్ట్రలో అడుగడుక్కీ బరాజ్‌లు కట్టడంతో పైనుంచి వచ్చే నీరు తగ్గిపోవడం.. వరదలొస్తేగానీ ఎస్సారెస్పీ నిండకపోవడంవంటి పరిస్థితుల్లో తదుపరి గోదావరిని తెలంగాణే నింపుకొంటున్నది! 43 టీఎంసీల లోటుతో మొదలయ్యే గోదావరి ప్రయాణంలో ఆదిలాబాద్ జిల్లా మొదలుకుని.. ఖమ్మం జిల్లా భద్రాచలంవద్ద ఆంధ్రలో కలిసేవరకూ అనేక జీవనదుల్లాంటి ఉపనదులు, ఉపనదుల్లాంటి వాగులు, వాగుల్లా పొంగే వంకలు దట్టమైన అటవీ ప్రాంతాలనుంచి నీటిని తెచ్చి నిండుకుండలా మార్చుతున్నాయి! ఒక్క ఆదిలాబాద్ జిల్లానుంచే 150 టీఎంసీల నీరు కొత్తగా గోదావరిలో చేరుతున్నది! అంటే.. సగటున ఏటా సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాల్లో అత్యధిక భాగం నీళ్లు మనవే! కానీ.. ఈ నీళ్లు మనకు దక్కడం లేదు! ఎందుకంటే.. ఎలాంటి ఆటంకాల్లేకుండా గోదావరిని గోదావరి జిల్లాలకు, ఆంధ్ర ప్రాంతానికి అంకితం చేసేందుకు నాటి సమైక్య పాలకులు కుట్ర చేసినందుకు!!

శ్రీరాంసాగర్‌కు దిగువన గోదావరిలో నదీ జలాలు పుష్కలం. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పైనుంచి అసాధారణ రీతిలో వర్షాలు వచ్చినప్పుడు తప్ప తగినంత నీరు రావడంలేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి లోటును ఎదుర్కొంటున్నట్టు హైడ్రలాజికల్ అధ్యయనాల్లోకూడా వెల్లడయింది. అంటే శ్రీరాంసాగర్ ఆయకట్టు పూర్తిస్థాయిలో సాగయ్యే అవకాశాలు బాగా తగ్గిపోయాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కాలువ రెండు దశలుగా సుదీర్ఘ దూరం ప్రయాణించి నల్లగొండ జిల్లా మోతె మండలంలో ముగుస్తుంది. కాకతీయ కాలువ రెండోదశ పూర్తయి పదేండ్లు దాటుతున్నా అందులో నీటిని వదిలింది నాలుగుసార్లే. తరచూ వరంగల్‌కు మంచినీటిని తరలించటంకూడా కష్టమవుతున్నది. వెరసి ఎస్సారెస్పీపై ఆధారపడే పరిస్థితి బాగా తగ్గిపోయింది. తెలంగాణ ఇక నీటిని వినియోగించుకోవలసింది శ్రీరాంసాగర్‌కు దిగువనే. కొత్తగా ప్రాణహిత-చేవెళ్ల పథకంలో భాగంగా ఎల్లంపల్లి బరాజ్ నిర్మించారు. ఆ బరాజ్ నీటి వినియోగ సామర్థ్యం 63 టీఎంసీలు మాత్రమే. ఎన్టీపీసీ అవసరాలు తీర్చటంతోపాటు హైదరాబాద్‌కు తాగునీటిని మళ్లించటానికి, ఎల్లంపల్లి ఎడమ కాలువద్వారా కొంత ఆయకట్టుకు నీరు అందించటానికి మాత్రమే ఈ బరాజ్ ఉపయోగపడుతుంది. ఆ మేరకు శ్రీరాంసాగర్‌పై కొంత భారం తగ్గించటానికికూడా మార్గం సుగమమయింది.
శ్రీరాంసాగర్ నీటి నిల్వసామర్థ్యం తగ్గిపోవడం, ఎగువనుంచి తగినంత వరద రాకపోవటం వంటి కారణాల వల్ల ముందు ముందు వరంగల్ జిల్లా కాకతీయ కాలువ ద్వారా నీటిని పొందే అవకాశాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. అంతేగాక శ్రీరాంసాగర్ ద్వారా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో మరింత ఆయకట్టును సాగులోకి తేవాలని అక్కడి రైతాంగం చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నది. ఈ డిమాండ్లను దృష్టిలో పెట్టుకునే పశ్చిమ ఆదిలాబాద్‌లోని నిర్మల్, ముథోల్‌లలో లక్ష ఎకరాలు, తూర్పు ఆదిలాబాద్‌లో 56 వేల ఎకరాలు అదనంగా సాగులోకి తేవాలని ప్రాణహిత-చేవెళ్ల పథకంలో చేర్చారు.
ప్రాణహిత-చేవెళ్ల పథకంలో మార్పులు జరిగినా ఆదిలాబాద్ జిల్లాలో తలపెట్టిన ఆయకట్టుకు ఎట్టిపరిస్థితుల్లో నీరివ్వాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇటీవల అధికారుల సమావేశంలో స్పష్టంగాచెప్పారు. తుమ్మిడిహట్టివద్ద లోలెవల్ బరాజ్ నిర్మించి, తూర్పు ఆదిలాబాద్ జిల్లాలో తలపెట్టిన ఆయకట్టుకు యథావిధిగా ఇప్పటికే తవ్విన కాలువల ద్వారా సాగునీరు ఇవ్వాలని ఆయన కోరారు. గోదావరి జలాలను వీలైనంత సమర్థంగా ఉపయోగించుకోవటం ఎలాగో ఆలోచించండి. అందుకు అనుగుణంగా ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్ చేయండి. ఆకుకు అందని పోకకు పొందని ప్రాజెక్టులను సమీక్షించండి అని ఆయన దిశానిర్దేశం చేశారు. ఆయన సూచన మేరకే ఇటీవల నీటిపారుదల ఇంజినీర్లు గోదావరి తీరం వెంబడి ఏరియల్ సర్వే నిర్వహించారు. ఎక్కడెక్కడ నీరు లభిస్తున్నదో గుర్తించారు. ఎక్కడెక్కడ ప్రాజెక్టులు చేపట్టవచ్చునో సూచనలు చేశారు.
గోదావరికి నీరెక్కడి నుంచి వస్తున్నది?
గోదావరిలో ముందుముందు నమ్మకంగా నీరు లభించే ప్రాంతమంతా తెలంగాణలోనే ఉంది. సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలు అత్యధికంగా మన రాష్ట్రం నుంచే దిగువకు ప్రవహిస్తున్నాయి. మంజీర, హరిద్ర, లోయర్ పెన్‌గంగా, కడెం, సాత్నాల, స్వర్ణ, సుద్దవాగులు, వట్టివాగు-ఎర్రవాగు-పెద్దవాగు, రాళ్లవాగు, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి, జంపన్నవాగు, తాలిపేరు, కిన్నెరసాని, శబరి వంటి ఉప నదులన్నీ గోదావరి నది ఒడిని చేరేది తెలంగాణకు ఈ ఒడ్డున లేక ఆ ఒడ్డునే. ఈ ఉప నదులు, వాగుల్లో ఎక్కువ వాటికి అడవులు రక్షణ కవచంగా ఉన్నాయి. శ్రీరాంసాగర్‌కు దిగువన ప్రధాన ఉపనదులైన కడెం, పెద్దవాగు, ప్రాణహిత, ఇంద్రావతి, జంపన్నవాగులకు దట్టమైన అడవుల కారణంగానే ప్రతిఏటా వరదలు వస్తున్నాయి. ప్రాణహిత, ఇంద్రావతి నదులయితే ఎప్పుడూ ఎండిపోగా చూడలేదని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఆదిలాబాద్ నదులు, వాగులు వంకలతో అలరారుతున్న జిల్లా. ఒక అంచనా ప్రకారం ఒక్క ఆదిలాబాద్ జిల్లా నుంచే 150 టీఎంసీలకు పైగా నీరు గోదావరిలోకి ప్రవహిస్తున్నది. ఆదిలాబాద్‌లో మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కొన్ని ఉన్నా వాటికింద సాగవుతున్నది ఎక్కడా పదివేల ఎకరాలకు మించదు. సీడబ్ల్యూసీ హైడ్రలాజికల్ అధ్యయనాల ప్రకారం గోదావరి నదిలో ఏయే పాయింటు వద్ద ఎంత నీరు లభిస్తున్నదో చూడండి..
1. హైడ్రాలజికల్ అధ్యయనాల నివేదిక ప్రకారం శ్రీరాంసాగర్ వద్ద ఉపయోగించదలచిన నీరు 196 టీఎంసీలు కాగా ప్రస్తుతం లభిస్తున్న నీరు 152 టీఎంసీలు మాత్రమే. మహారాష్ట్ర గోదావరి పొడవునా 5 నుంచి 20 టీంఎసీల నీటిని నిల్వచేసే విధంగా పెద్ద సంఖ్యలో బరాజ్ కం బ్రిడ్జిలు నిర్మించింది. దీంతో అసాధారణంగా వర్షాలు కురిసిన సంవత్సరాల్లో తప్ప కిందికి నీరు రావడమే తగ్గిపోయింది. ఫలితంగా శ్రీరాంసాగర్ వద్ద 43 టీఎంసీల లోటు ఏర్పడినట్టు గుర్తించారు. అంటే ఈ ప్రాజెక్టు కింద ముఖ్యంగా కాకతీయ కాలువ కింద నిర్ణయించిన ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీటిని అందించలేని పరిస్థితి ఏర్పడుతున్నది. ఈ ప్రాజెక్టుపై అనివార్యంగా కొంత ఆయకట్టు భారం తప్పించి మరో ప్రాజెక్టు నుంచి నీటిని అందివ్వాల్సిన పరిస్థితి తలెత్తుతున్నది.
2. ఎల్లంపల్లి బరాజ్ వద్ద 62.74 టీఎంసీల నీరు లభిస్తున్నట్టు గుర్తించారు. కడెం నది నుంచి మొత్తం 26 టీఎంసీల నీరు లభిస్తున్నట్టు హైడ్రాలాజికల్ అధ్యయనంలో నిర్ధారణ చేశారు. ఒక్క కడెం ప్రాజెక్టు నీటి వినియోగ సామర్థ్యం 18.65 టీఎంసీలు. శ్రీరాంసాగర్- ఎల్లంపల్లి మధ్యన కడెం ప్రాజెక్టుతో సహా మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకింద మొత్తం 41 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నట్టు గుర్తించారు. అవి పోగా ఎల్లంపల్లి వద్ద ఇంకా 62.74 టీఎంసీల నీరు లభిస్తున్నట్టు నివేదిక పేర్కొంది.
3. శ్రీరాంసాగర్‌కు దిగువన కాళేశ్వరానికి ఎగువన మొత్తంగా 150 టీఎంసీల నీరు లభిస్తున్నట్టు హైడ్రలాజికల్ అధ్యయనంలో గుర్తించారు. ఎల్లంపల్లి బరాజ్‌కు దిగువన ముల్కలవాగు, రాళ్లవాగు-తోళ్లవాగు, మిట్టపల్లివాగు, జోడువాగులు ఆదిలాబాద్‌వైపు నుంచి గోదావరిలో కలుస్తుండగా, కరీంనగర్ వైపు నుంచి మానేరు నది కలుస్తుంది.
4. గోదావరిలో చేరక ముందు ప్రాణహిత నదిలో 297 టీఎంసీల నీరు లభిస్తుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. నిజానికి ఈ నదిలో ఇంకా ఎక్కువే నీరు లభిస్తుంది. ఈ మొత్తం నీటిని ఉపయోగించుకునే హక్కు కూడా తెలంగాణకు ఉంది. కాళేశ్వరంవద్ద నికరంగా 283 టీఎంసీల నీరు లభిస్తుందని హైడ్రలాజికల్ నివేదిక అంచనా. ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత సుమారు పది కిలోమీటర్ల దిగువన మేడిగడ్డవద్ద గోదావరి వెడల్పు తగ్గిపోయి రెండు చిన్నపాటి గడ్డల మధ్యనుంచి ప్రవహిస్తుంది. ఇక్కడ నీటి లభ్యత ఇంకా ఎక్కువగా ఉంటుందని ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు.
5. ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత సుమారు 40 కి.మీ. దూరంలో ఇంద్రావతి వచ్చి కలుస్తుంది. ఇంద్రావతి గోదావరిలో కలిసిన 12.కి.మీ. దిగువన ఇచ్ఛంపల్లి ప్రాజెక్టు నిర్మించాలని ఒకప్పుడు నిజాం ప్రభుత్వమే తలపెట్టింది. యాభైయ్యేళ్ల సగటు నీటి లభ్యత 75% ప్రాతిపదికగా చూస్తే ఇచ్ఛంపల్లివద్ద గోదావరిలో 553.92 టీఎంసీల నీరు లభిస్తుందని హైడ్రలాజికల్ అధ్యయనంలో తేలింది. 50% నీటిలభ్యత ప్రాతిపదికగా చూస్తే 1091 టీఎంసీలు లభిస్తుందని కూడా గుర్తించారు. ఒక్క ఇంద్రావతి నది నుంచే 237.69 టీఎంసీల నీరు లభిస్తుందని ఈ నివేదికలో బహిర్గతమైంది.
6. ఇంద్రావతి-దుమ్ముగూడెంల మధ్యన వరంగల్, ఖమ్మంల వైపు నుంచి హనుమంతునివాగు, జంపన్నవాగు (దయ్యాలవాగు), జీడివాగు, ఎర్రవాగు, గౌరారంవాగు, మల్లూరు వాగు, ముసలమ్మవాగు, పెద్దవాగు, ఛత్తీస్‌గఢ్‌వైపు దండకారణ్యంనుంచి ఖమ్మం జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, చర్ల మండలాల ద్వారా చండ్రుపట్లవాగు, లొటపిటలగండివాగు, పావురాలవాగు, ఇసుకవాగు, చల్లవాగు, చీకుపల్లివాగు, బల్లకట్టవాగు, పాలెంవాగు, కొండాపురంవాగు, రాళ్లవాగు, సంకలవాగు, తాలిపేరు, సీతమ్మవాగు, పెదబండిరేవు గోదావరి నదిలో కలుస్తాయి. రెండు వైపుల నుంచి గోదావరిలో ప్రవేశించే వాగులన్నీ అడవులను ఆలంబన చేసుకుని ప్రతిఏటా పొంగిపొర్లుతున్నవే. ఈ ఉపనదులు, వాగుల నుంచి లభిస్తున్న జలాల్లో కొంత గోదావరి జిల్లాల్లో ఉపయోగించుకోగా మిగిలిన జలాలు సముద్రం పాలవుతున్నాయి. గోదావరిలో మనకు హక్కుగా లభించే నీటిలో ఇప్పటివరకు మనం వినియోగిస్తున్నట్టుగా లెక్క చెబుతున్న నీరు 370 టీఎంసీలు. అందులో కూడా మైనర్, మీడియం ఇరిగేషన్ కిందనే 145 టీఎంసీలు చూపిస్తున్నారు. గోదావరి ట్రిబ్యునల్ మనకు హక్కుగా కేటాయించిన నీరు 857 టీఎంసీలు. అంటే ఇంకా 487 టీఎంసీల నికర జలాలను ఉపయోగించుకోవడానికి తెలంగాణకు హక్కు ఉంది. ట్రిబ్యునల్ వరద జలాలపై కూడా తెలంగాణకే హక్కులు ఇచ్చింది. సముద్రంలో కలుస్తున్న యాభైయ్యేళ్ల సగటు వరద జలాలే 1781 టీఎంసీలుగా సీడబ్ల్యూసీ గుర్తించింది. గత పదిహేనేండ్ల సగటు అయితే 2783 టీఎంసీలు.
ప్రాజెక్టులు కట్టకుండా కుట్ర
సమైక్య పాలకులు ఉద్దేశపూర్వకంగానే తెలంగాణలో ప్రాజెక్టు నిర్మించకుండా కుట్రలు చేస్తూ వచ్చారు. గోదావరి చాలా లోతునుంచి ప్రవహిస్తుందని, తెలంగాణ ఎత్తున ఉండడంవల్ల నీళ్లందించడం సాధ్యంకాదని తెలంగాణ ప్రజలకు నమ్మబలుకుతూ వచ్చారు. సమైక్య పార్టీలలోని కొందరు తెలంగాణ నాయకులు కూడా అదే నిజమని నమ్ముతూ ఎత్తున ఉన్నోళ్లకు నీళ్లెలా వస్తాయి? అని ప్రశ్నిస్తూ వచ్చారు. శ్రీశైలంవద్ద 269.78 మీటర్ల ఎత్తు డ్యాం నిర్మించి ఎక్కడో పాతాళంలో ప్రవహిస్తున్న కృష్ణానది నుంచి నల్లమల కొండలను తొలిచి, సొరంగాలు చేసి వందల కిలోమీటర్ల దూరం నీరు మళ్లించుకుపోగలిగిన సమైక్యాంధ్ర ప్రభుత్వాలు గోదావరి నదిపై 125 మీటర్ల ఎత్తుతో ఇచ్ఛంపల్లి డ్యాం నిర్మించడానికి మనకు వంద అబద్ధాలు చెప్పారు. వంద వివాదాలు ప్రచారం చేశారు. రాయలసీమలో 250 మీటర్ల ఎత్తున ఉన్న భూభాగాలకు నీరు మళ్లించడం సాధ్యమైనప్పుడు, దాదాపు అంతే ఎత్తున ఉన్న తెలంగాణ భూభాగాలకు నీరు మళ్లించడం ఎందుకు సాధ్యం కాలేదో వాళ్ల వద్ద సమాధానం ఉండదు.
ఎల్లపల్లి-దుమ్ముగూడెం మధ్య లభించే జలాలే ఆధారం
తెలంగాణ భవిష్యత్తు అంతా ఎల్లంపల్లి, దుమ్ముగూడెంల మధ్య లభించే నదీజలాలపైనే ఆధారపడి ఉంది. కరీంనగర్‌లో కొంతభాగం, మెదక్, వరంగల్, నల్లగొండ కొంతభాగం, ఖమ్మం జిల్లాలకు సాగునీరు, తాగునీరు అవసరాలు తీర్చాల్సింది ఈ జలాలతోనే. ఏం చేయాలిప్పుడు? తెలంగాణ ప్రభుత్వం ఆలోచన ఏమిటి? తెలంగాణ ప్రభుత్వం గోదావరి నీటిని వినియోగంలోకి తీసుకురావడానికి చేస్తున్న పునర్నిర్మాణ ప్రణాళికలేమిటి.. తదుపరి కథనంలో చూద్దాం.

ఒక టీఎంసీ నీటి విలువ

godavaribesin

గోదావరిలో ఇప్పటివరకు మనం ఉపయోగించుకోగా ఇంకా మనకు హక్కుగా మిగిలి ఉన్న నికరజలాలు 487 టీఎంసీలు. గోదావరిలో వరద జలాలపై కూడా రాష్ర్టానికి పూర్తి హక్కులున్నాయి. ఇప్పుడు సీడబ్ల్యుసీ అంచనాల ప్రకారం 75 శాతం నీటి లభ్యత ప్రాతిపదికన ప్రతి ఏటా సముద్రంలో కలుస్తున్న నీరు గత యాభైయ్యేళ్ల సగటు 1781 టీఎంసీలు. సముద్రంలో కలిసిన జలాలు గత పదిహేనేళ్ల సగటు 2783 టీఎంసీలు. వరద జలాలు ప్రతిఏటా సుమారు మరో 500 నుంచి 1000 టీఎంసీలు ఉపయోగించుకునే హక్కు, అవకాశం మనకు ఉంది.

-ఒక శతకోటి ఘనపుటడుగుల (థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్స్-టీఎంసీ) నీరు అంటే

-2.80 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు.
-2831.6 కోట్ల లీటర్ల నీరు.
-22,956.84 ఎకరాల్లో ఒక అడుగు మందం నిలుకోగలిగిన నీరు.
-6000 ఎకరాల్లో ఖరీఫ్‌లో వరి పండించవచ్చు.
-రూ.25కోట్లనుంచి రూ.30కోట్ల విలువచేసే 2,40,000 బస్తాల ధాన్యం పండించవచ్చు.
-10,000 ఎకరాల్లో ఆరుతడి పంటలు పండించవచ్చు.
-15,000-20,000 ఎకరాల్లో బిందుసేద్యం చేయవచ్చు.
-56,63,200 వాటర్ ట్యాంకర్లు (5000 లీటర్లవి) నింపవచ్చు.

గలగలా గోదారి.. వలవలా తెలంగాణ

godavaribesin

నీటి దోపిడీకి నిలువెత్తు సాక్ష్యం
గోదావరి తీరాన ఎండిపోయిన చేలు
1495 టీఎంసీల నీటి కేటాయింపులున్నా..
కేవలం 168.5 టీఎంసీల నిల్వ సామర్థ్యమే!
ఏండ్లుగా కునారిల్లుతున్న పెండింగ్ ప్రాజెక్టులు
పదుల సంఖ్యలో ఉపనదులు.. ఉధృతమైన వాగులు
ఒక్క ఆదిలాబాద్ అడవులనుంచే గోదావరికి 150 టీఎంసీలు
సమైక్య రాష్ట్రంలో పట్టని తెలంగాణ నీటి అవసరాలు
లెక్క సరి చేసేందుకు నడుం బిగించిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణలో పది జిల్లాలుంటే అందులో ఐదు జిల్లాలను తాకుతూ ప్రవహించే గోదావరి.. తెలంగాణ మాగాణాన్ని తడుపకుండానే తరలిపోయిన విషాద గాథ ఇది! ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన నాలుగు అనకట్టల్లో ఒకటిగా నిలువాల్సిన ఇచ్ఛంపల్లి అతీగతీలేకుండా పోయిన కుట్రలను అన్వేషించే ప్రయత్నమిది! ఎప్పుడో ప్రతిపాదనలు వచ్చిన ఇచ్ఛంపల్లి ఇంకా ఎందుకు కునారిల్లుతున్నదో.. దేవనూరు ఏమైందో.. లోయర్ పెన్‌గంగా చిరునామా ఎక్కడుందో కనిపెట్టే కథనమిది! 1495 టీఎంసీల నీటి కేటాయింపులుంటే.. అత్యంత దయనీయంగా కేవలం 168.5 టీఎంసీల నీటినే నిల్వ చేసుకునే రిజర్వాయర్లు ఉండటం వెనుక పన్నాగాలేంటి? ఏటా 2783.6 టీఎంసీలు వృథాగా సముద్రం పాలువుతున్నా.. వాటిని నిలిపి.. పొలాలను తడిపి తెలంగాణను పండించాలన్న ఆలోచనే రాకపోవడం వెనుక నిర్లక్ష్యపూరిత కుట్రలేంటి? ఆంధ్రప్రాంతంలో ప్రాజెక్టులు కట్టడానికి లేని పొరుగు రాష్ర్టాలతో వివాదాలు తెలంగాణ ప్రాజెక్టులను కట్టేటప్పుడే నాటి పాలకులకు ఎందుకు గుర్తొచ్చాయి? వరద వస్తే తప్ప పనికిరాని దేవాదుల లిఫ్టుతో తెలంగాణ బావుకునేదేంటి? మన ఖర్చుతో.. మన భూములు ముంచి.. మన నుంచి.. మన నీటిని మళ్లించుపోయేందుకు ఉద్దేశించిన దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ తోక కత్తిరించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? సవాలక్ష సందేహాలు.. ప్రతి సందేహానికి సమాధానం! తెలంగాణను ఎండబెట్టి.. ముంచి.. ఆంధ్రను పండించాలనే నాటి సమైక్య పాలకుల వివక్షాపూరిత విధానా కుట్రల సమ్మేళనమిది! మన నేలపై గలగలా పారే గోదారమ్మ.. మనకు కాకుండా పోతే.. ఎండుతున్న నోళ్లు.. బీళ్ల అంతులేని వ్యథ ఇది!!

(కట్టా శేఖర్‌రెడ్డి)

ఇది తెలంగాణలో గోదావరి కథ! దక్షిణ గంగ (Ganges of The South)గా ప్రసిద్ధిగాంచిన గోదారమ్మ గలగలాపారుతూ.. తెలంగాణ గొంతులను తడుపకుండానే ముందుకు సాగిపోయింది. దేశంలోనే అతి పెద్ద నదుల్లో రెండవది గోదావరి. దక్షిణ భారతదేశంలో ఇదే అతిపెద్ద నది. నాసిక్ వద్ద త్రయంబకేశ్వరం సమీపంలో సహ్యాద్రి పర్వతాల్లో జన్మించిన గోదావరి మహారాష్ట్రలో 695 కిలోమీటర్లు ప్రయాణించి మన రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. తెలంగాణ గడ్డపై సుమారు 550 కిలోమీటర్లు ప్రయాణించి భద్రాచలం వద్ద ఆంధ్రలో ప్రవేశిస్తుంది. ఉత్తర తలాపున ఆదిలాబాద్, దక్షిణ తలాపున నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలను ఒరుసుకుని ప్రవహించే గోదావరి తెలంగాణ నేలలపై కరుణ చూపకుండానే తరలిపోయింది. గోదావరి ఐదున్నర దశాబ్దాల సమైక్య నిర్వాకాలకు, నిర్లక్ష్యాలకు మౌనసాక్షి. కృష్ణా నదిలో తెలుగు ప్రజలకు లభించే నీటికంటే రెండు రెట్లు అదనంగా నీరు లభించే గోదావరి బీళ్లు పడిన తెలంగాణ ముఖం చూడకుండానే బంగాళాఖాతంలో కలిసిపోయింది. దేవనూరు రాలేదు. ఇచ్ఛంపల్లి రాలేదు. లోయర్ పెన్‌గంగా కాలేదు. పోచంపాడు హైడ్యాం ప్రణాళికను తుంగలో తొక్కి, సగానికి సగం కుదించి నిర్మించారు. అది కూడా బక్క చిక్కి, నానాటికీ కుంచించుకుపోతున్నది. నిజాంసాగర్ ఎండిపోయింది. సమైక్య రాష్ర్టానికి 1495 (3565) టీఎంసీలు కేటాయిస్తే అందులో తెలంగాణలో ఈ ఐదున్నర దశాబ్దాల్లో నిర్మించిన ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం కేవలం 168.5 టీఎంసీలు. మైనర్ ఇరిగేషన్‌కింద మరో 175 టీఎంసీల వినియోగిస్తున్నట్టు గోదావరి ట్రిబ్యునల్ తన తీర్పులోనే గుర్తించింది. మైనర్ ఇరిగేషను కింద చూపించినవన్నీ చెరువులే. సమైక్య ప్రభుత్వ నేరపూరితమైన నిర్లక్ష్యం కారనంగా చెరువులు పూడిపోయి తగినంత నీటిని నిలుపుకోలేని పరిస్థితి తలెత్తింది. ట్రిబ్యునల్ రికార్డుల ప్రకారమే గోదావరిలో మొత్తం 854.7 టీఎంసీల నీటిని ఉపయోగించుకునే హక్కు తెలంగాణకు ఉంది. ఇవికాకుండ వరద జలాలు ఎంతయినా ఉపయోగించుకునే అవకాశం మన రాష్ర్టానికి ఉంది. గోదావరిలో నీటి లభ్యత ఉండేది శ్రీరాంసాగర్ దిగువ భాగంలోనే. ఆదిలాబాద్‌లో ఉపనదులు, వాగులు అనేకం వచ్చి గోదావరిని చేరతాయి. మానేరు పొంగినా చేరేది గోదావరికే. ప్రాణహిత జీవనది. మహారాష్ట్రలోని గడ్చిరోలి అభయారణ్యాలను, ఆదిలాబాద్ సిర్పూర్-చెన్నూరు అడవులను చీల్చుకుంటూ ప్రవహించే ప్రాణహితలో నీటికి కొదువలేదు. అక్కడ వేరే ప్రాజెక్టులు వచ్చే అవకాశం కూడా లేదు.

గోదావరి నిండుకుండ..

ప్రతిపాదిత ఇచ్ఛంపల్లి ప్రాజెక్టుకి పన్నెండు కిలోమీటర్ల ఎగువన గోదావరిలో కలిసే ఇంద్రావతి నది కూడా జీవనదే. దట్టమైన అబూజ్‌మాడ్ కొండలు, ఇంద్రావతి అభయారణ్యం, మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవులను చీల్చుకుంటూ ప్రవహించే ఈ నదిలో కూడా నీటి లభ్యత ఎక్కువే. ఇంకా దిగువన జంపన్నవాగు, తాలిపేరు కూడా గోదావరి నదికే వన్నెతెస్తాయి. ఇక్కడెక్కడా నీటి లభ్యతకు సంబంధించిన సమస్యలేదు. పైగా రాష్ర్టానికి కేటాయించిన నీటిని వాడుకోవలసిన వాటా చాలా ఉంది. అధికారిక లెక్కల ప్రకారమే ఇప్పటికీ గోదావరి నుంచి బంగాళాఖాతంలో కలిసే నీరు సగటున ఏటా 1781 టీఎంసీలు. ఇది గత యాభైయ్యేళ్ల సగటు. 1999 నుంచి గత పదిహేనేండ్ల సగటును పరిశీలిస్తే ఏటా 2783.6 టీఎంసీలు బంగాళాఖాతంలో కలిసిపోతున్నాయి. నిజానికి 2012-13లో 3013 టీఎంసీలు, 2013-14లో 5069 టీఎంసీలు సముద్రం పాలయినట్టు సీడబ్ల్యూసీ లెక్కలు చెబుతున్నాయి.

సంవత్సరం బంగాళాఖాతంలో కలిసిన టీఎంసీలు
1999-00 2561.7
2000-01 2448.8
2001-02 2631.7
2002-03 1593.4
2003-04 2918.7
2004-05 1562.0
2005-06 3540.3
2006-07 4432.2
2007-08 3089.7
2008-09 1840.8
2009-10 800.6
2010-11 3913.4
2011-12 1746.8
2012-13 3013.9
2013-14 5069.8
పదిహేనేండ్ల సగటు 2783.6

అనేక నాగరికతలు వర్ధిల్లిన నదీ తీరం. జ్యోతిర్లింగ త్రయంబకేశ్వరుని సన్నిధిన జన్మించి, నాసిక్, కోపర్‌గాం, పైఠాన్, నాందేడ్‌ల ద్వారా వందల కిలోమీటర్లు ప్రయాణించి నిజామాబాద్-ఆదిలాబాద్ సరిహద్దులో కందకుర్తి వద్ద తెలుగునేలను పునీతం చేస్తుంది. కందకుర్తి వద్ద మంజీర, హరిద్ర నదులు గోదావరి నదితో కలిసి త్రివేణి సంగమంగా ముందుకు సాగుతాయి. తెలుగునేలను పాలించిన శాతవాహనులు పుట్టిందీ, పెరిగింది, రాజధానులను నిర్మించిందీ, సామ్రాజ్యాన్ని విస్తరించిందీ ఈ నది తీరాన్ని అనుకునే. తొలుత ప్రతిష్ఠానపురం(నేటి పైఠాన్), ఆ తర్వాత కోటిలింగాల వర్ధిల్లిందీ ఈ నదీతీరం వెంబడే. మానేరు, ప్రాణహితలు గోదావరిలో లీనమై కాళేశ్వరుడిని అభిషేకం చేసే త్రివేణి సంగమం ఇక్కడే. నాగరికతలు, రాజులు, రాజ్యాలు నదీ జలాలు ఆలంబనగా చేసుకునే తమ పాలన సాగించారు.

సమైక్య పాలకుల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం

సమైక్య ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే గోదావరిపై ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశాయి. పోచంపాడు ప్రాజెక్టువద్ద 330 టీఎంసీల నీటిని నిల్వచేసే హైడ్యాం నిర్మించాలని తొలుత ప్రతిపాదించగా దానిని కుదించి, కుదించి 110 టీఎంసీలకు తగ్గించి నిర్మించారు. ఇసుక మేట వేసి డ్యాం నీటి నిల్వ సామర్థ్యం క్రమంగా 90 టీఎంసీలకు, ఇప్పుడు 76టీఎంసీలకు తగ్గిపోయిందని నీటిపారుదల ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. పోచంపాడు తర్వాత గోదావరి నదిపై ఇంకే ప్రాజెక్టు రాకుండా చూడాలన్న కుట్రలో భాగంగానే ఇంతకాలం మరో భారీ ప్రాజెక్టు ఏదీ చేపట్టలేదు. ప్రాణహిత-చేవెళ్ల పథకంలో భాగంగా చేపట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ఒక విధంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. పరిమిత నీటి నిల్వ సామర్థ్యం కలిగినది. ప్రాణహిత నీరు మొత్తం 70 కిలోమీటర్లకు దిగువన కాళేశ్వరంవద్ద గోదావరి నదికే వచ్చి చేరుతుండగా కావాలని అంతర్రాష్ట్ర వివాదాల్లో ఇరికించి ప్రాజెక్టును పూర్తి చేయకుండా సతాయించడంకోసం తుమ్మిడిహట్టినుంచి నీటిని తరలించాలని ప్రాజెక్టును రూపొందించారు. గోదావరిపై నిర్మిస్తే పోలవరానికి, గోదావరి డెల్టాకు అడ్డం అవుతుందని భావించి ఇటువంటి ఎత్తులు జిత్తులు ఎన్నో సమైక్య ప్రభుత్వాలు చేశాయి. ఎంత విడ్డూరమంటే గోదావరి నదిపై దేవాదుల వద్ద ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. కానీ నదీ ప్రవాహం నుంచి ఎవరూ లిఫ్టు చేయరు. నది నిండుగా ప్రవహించిన రోజులలో అలా లిఫ్టు చేయడం సాధ్యం కావచ్చు. కానీ కనీస మట్టాల్లో ప్రవహించే రోజుల్లో అలా చేయడం సాధ్యం కాదు. నదిపై బరాజ్ నిర్మించి నీటిని నిల్వచేసి, అందులోనుంచి నీటిని లిఫ్టు చేస్తారు. అటువంటి ఆలోచన కూడా గత ప్రభుత్వాలు చేయలేదు.

మనసంతా ఆంధ్ర పైనే

ఎంత అడ్డగోలు అంటే పైన తెలంగాణకు అత్యంత అవసరమైన ప్రాజెక్టులపై శ్రద్ధ చూపించలేదు, సరికదా దిగువన దుమ్ముగూడెం-టెయిల్‌పాండ్, పోలవరం-ప్రకాశం బరాజ్‌లకు ఆగమేఘాలపై అనుమతులు ఇవ్వడం, కాలువలు తవ్వించడం మొదలుపెట్టారు. గోదావరి నదినుంచి ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా కృష్ణా నదికి నీటిని మళ్లించి శ్రీశైలం నదిని మొత్తానికి మొత్తం కాజేయాలన్నది అప్పటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం కుతంత్రం. వాళ్ల పరిపాలన మాత్రమే హైదరాబాద్ నుంచి, మనుషులు, మనసులు అంతా ఆంధ్రాపైనే. ఇప్పటికే అధికారికంగా 224 టీఎంసీల నీటిని వాడుకుంటున్న గోదావరి డెల్టాకు అండగా పోలవరం వద్ద 194.6 నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించేందుకు ఇప్పటికే ఐదువేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టుద్వారా మొత్తం 301 టీఎంసీలను ఉపయోగించుకోవాలని, ఇందులో 80 టీఎంసీలు ప్రకాశం బరాజ్ వద్ద కృష్ణా నదికి చేర్చాలని, మొత్తం 7.5 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని ఆంధ్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇది కాకుండా ఇప్పుడు పట్టిసీమ నుంచి గోదావరి నీటిని లిఫ్టు చేయడానికి అదనంగా మరో ప్రాజెక్టును నిర్మిస్తున్నది. ఒడిశాతో ఒప్పందం లేదు. ఛత్తీస్‌గఢ్‌తో చర్చించింది లేదు. తెలంగాణతో అంగీకారం లేదు. కానీ కేంద్రం ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తుంది. ఆంధ్ర ప్రభుత్వం ఆగమేఘాలపై నిర్మాణాలు చేపడుతుంది.

దండగమారి టెయిల్‌పాండ్

దుమ్ముగూడెం-టెయిల్‌పాండ్ తెలంగాణకు అత్యంత దండగమారి ప్రాజెక్టు. నాగార్జునసాగర్‌నుంచి ఎడమకాలువ ఖమ్మం జిల్లా చివరి భూములదాకా నీటిని కొనిపోతుంటే, దానికి రివర్సులో దుమ్ముగూడెం నుంచి నాగార్జునసాగర్‌కు దిగువన అడవిదేవులపల్లి సమీపంలో కృష్ణానదిలో నిర్మించి టెయిల్‌పాండ్‌కు నీళ్లు మళ్లించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీనికోసం సేకరించే భూములు మనవి. దీని నిర్మాణం ఖర్చు మనది. అప్పుమనది. ఈ ప్రాజెక్టుద్వారా ఏకంగా 135 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా నదికి మళ్లించాలని రాజశేఖర్‌రెడ్డి ప్లాన్ వేశారు. అంటే భారం తెలంగాణది, నీరు ఆంధ్రకు. అంటే మొత్తం 215 టీఎంసీలు కృష్ణాకు మళ్లించాలన్నది ప్రణాళిక. ఈ నీటిని మళ్లిస్తే రాయలసీమ-తెలంగాణలకు సాగర్, శ్రీశైలంలో 175 టీఎంసీలు అదనంగా నికర జలాలు వస్తాయని ఆయన ఆశ చూపారు.

వాటానే ఉపయోగించుకోని తెలంగాణ

విషాదం ఏమంటే రెండు నదుల్లో తెలంగాణకు ఇప్పటికి కేటాయించిన వాటా జలాలనే వినియోగించలేదు. రాయలసీమవైపు కృష్ణా నదిపై ఆయన అనుకున్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకున్నారు. నీళ్లు మళ్లించుకుంటున్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. సమైక్యపాలకులు తెలంగాణ ప్రాజెక్టుల విషయం వచ్చే సరికి అన్ని అంతర్రాష్ట్ర వివాదాలు గుర్తుకు తెచ్చేవారు. అన్ని ఒప్పందాలు పూర్తయిన ఇచ్చంపల్లికి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ఒప్పుకోవడం లేదంటారు. ఏ ఒప్పందాలు లేకుండానే ప్రాణహిత-చేవెళ్లను ప్రారంభిస్తారు. ఇదంతా తెలంగాణ ప్రజలను మోసం చేసే కుట్రలో భాగమే.
కానీ నీటి లభ్యత అధికంగా ఉండే ప్రాణహిత, ఇంద్రావతి నదీ సంగమాలకు దిగువన మరో ప్రాజెక్టు రాకుండా సమైక్య ప్రభుత్వం కుట్ర చేస్తూ వచ్చింది. గోదావరి నది గలగలాపారుతూ ఆంధ్రలో ప్రవేశించాలన్నది వారి కుతంత్రం. ఇంజినీరింగ్ నిపుణుల సలహాలను పెడచెవినపెట్టి కాళేశ్వరాన్ని వదలి తుమ్మిడిహట్టిని ఎంచుకోవడంలో కూడా ఇదే కుట్ర దాగి ఉంది. 1955లోనే అంగీకారానికి వచ్చిన ఇచ్చంపల్లి ప్రాజెక్టును పనిగట్టుకుని తొక్కిపెట్టారు. సమైక్యాంధ్ర నాయకత్వం తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఒక పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తూ వచ్చింది. అవి ఏమంటే 1.వీలైన మేరకు ప్రాజెక్టులు చేపట్టకుండా చూడడం. 2.ఒక వేళ తప్పనిసరై ప్రాజెక్టులు చేపట్టాల్సివస్తే అంతర్రాష్ట్ర వివాదాలు ఉండేట్టు చూడడం. 3.ముందే వివాదాలు ఉంటే సంతోషం. లేకుంటే కొత్తగా వివాదాలు తలెత్తే విధంగా చర్యలు తీసుకోవడం. ప్రాణహిత-చేవెళ్ల విషయంలో కూడా అదే జరిగింది. ప్రాణహిత నదిపై తుమ్మిడి హట్టి వద్ద బరాజ్ నిర్మిస్తే మహారాష్ట్రలో 25 గ్రామాలు మునుగుతాయి. అక్కడ ఒక సంరక్షణ కేంద్రం(శాంక్చువరీ) మునుగుతుంది. అటవీ భూములు మునుగుతాయి. మహారాష్ట్రతో కనీస చర్చలు జరుపలేదు. రెండు రాష్ర్టాల ఉన్నతాధికారులతో ఒక బోర్డు ఏర్పాటు చేయాలని ఒకసారి ముఖ్యమంత్రులు అంగీకారానికి వచ్చారు. కానీ బోర్డులు వేయడం కానీ, చర్చలు జరుపడం కానీ, అంగీకారానికి రావడం కానీ జరుగలేదు. పైగా వేల కోట్ల రూపాయలు వెచ్చించి పనులు మొదలు పెట్టారు. ఈ పనులేవీ నీళ్లిచ్చే ఉద్దేశంతో చేసినవి కాదు. వీలైనంత ఎక్కువకాలం కాలయాపన చేయడం. వీలైనంత ధనాన్ని కాజేయడం. ఇది చాలా ఇష్టంగా, శ్రద్ధగా, ఒక పద్ధతి ప్రకారం చేసిన మోసం.

అతీగతీలేని ఇచ్ఛంపల్లి
ఇచ్ఛంపల్లిని అంగీకారం జరిగిన తొలిరోజుల్లోనే నిర్మాణం చేపట్టి ఉంటే ఇవాళ తెలంగాణ పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఇచ్ఛంపల్లి ఎగువన గోదావరి పొడవున అప్పట్లో ఇన్ని గ్రామాలు లేవు. తెలంగాణ ప్రాజెక్టులు అనుకున్న సమయంలో చేపట్టకపోవడం వల్ల ఈలోపున మహారాష్ట్ర ఎడాపెడా ప్రాజెక్టులు, బరాజ్‌లు నిర్మించుకుని నీటి హక్కులు దక్కించుకుంది. దిగువన ఆంధ్రా ప్రాజెక్టుల విషయంలో కూడా అంతే హడావిడి జరిగింది. మధ్యలో తెలంగాణ ప్రాజెక్టులే ఇవ్వాళ నీటి హక్కులకోసం, అంతర్రాష్ట వివాదాల పరిష్కారం కోసం నానాతంటాలు పడాల్సిన పరిస్థితి దాపురించింది. ఇచ్ఛంపల్లి ప్రాజెక్టును ప్రపంచంలోనే అత్యంత అధికంగా నీటిని నిలువచేసే నాలుగవ డ్యాంగా నిర్మించాలని తలపెట్టారు. 125 మీటర్ల ఎత్తుతో డ్యాంను నిర్మించి 1000 టీఎంసీల నీటిని నిలువ చేయవచ్చునని తొలుత అంచనా వేశారు. ఈజిప్టులోని అశ్వాన్ డ్యాంను 4600 టీఎంసీలు, ఘనాలోని లేక్ ఓల్టా డ్యాంను 4200 టీఎంసీలు, చైనాలోని త్రీ గార్జెస్ డ్యాంను 1350 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఉదాహరణలున్నాయి. కానీ పెద్ద ఎత్తున అడవులు మునుగుతాయని, బొగ్గు నిక్షేపాలు మునిగిపోతాయని కారణం చూపి ఇక్కడ ఇచ్ఛపల్లి డ్యాం ఎత్తును 122 మీటర్లకు, ఆ తర్వాత 90 మీటర్లకు తగ్గించి నిర్మించాలని సమైక్య ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. చివరకు 95 మీటర్ల ఎత్తుతో డ్యాం నిర్మించాలని నిర్ణయించి ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. ఈ ప్రతిపాదనలకు మహారాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తూ సమైక్య ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. ఛత్తీస్‌గఢ్ మాత్రమే స్పందించాల్సి ఉంది. కానీ ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడలేదు.

Hating Andhrites means Hating Brothers

IMG_2293

Some of my friends on social network and other forums are accusing me of causing hatred against Andhrites. It pains me a lot. I don’t believe in hating people of any region or any religion or any caste. But I do criticise establishments which cause hurt. Establishments are not people. May be they evolve from people. But people as whole cannot think of causing harm to one region or one caste.

The establishments which yield power from popular vote, can scheme, design and plan harm to certain regions. This is happen all the way in the last 55 years. Establishments are embodiment of hegemonistic thinking. Once Kasu Brahmananda Reddy, later Nara Chandrababu Naidu , finally YS Rajashekar Reddy or many ministers and officers they are called establishment.

Once an Irrigation Minister, who is now playing an important role in Andhra Assembly, shelved SLBC project meant for drought prone Nalgonda district. He announced in Kodad press conference that it is a waste project. On that day the then Home Minister Madhava Reddy resigned for his minister post and handed over the letter to Chandrababu. Chandrababu solved the crisis by shifting Andhra Irrigation Minister to Panchayathiraj and and also began the SLBC lift works.

It is the only project Chandrababu initiated at that time. Hence the project was named after Madhava Reddy as it was pushed froward by his initiation. Like this hundreds of examples are there. When there is flood in Sriram Sagar Chief Minister reliuctant to release water to Kakatiya Canal or Flood Flow Canal, but he let the water released to Godavari to save the Godavari Delta.

I have been pointing out these aspects of Andhra establishment. Andhra People are in no way related to these schemes. I had my entire early friends in Andhra as I studied my MA and MPhil in S V University. They are loving and caring. Hating Andhra people means hating my brothers and friends. I had that concious. People as such never never conspire against each other, but the evil power and its holders makes the difference.

Writing some thing about river water losses is not promoting hate. Without knowing what happened all these years in this front, we cannot rework on Projects. My point is limited to that. Its not an apologetic explanation. Only I can say is I love the people who hate me. But I will continue to write..write..on right issues.

ఇప్పుడు అవసరం మిషన్ తెలంగాణ

ప్రభుత్వమంటే విమర్శలు ఎదుర్కోవడానికి, ప్రతిపక్షమంటే అడ్డంగా మాట్లాడడానికి ఉందన్న ఒక అధ్వాన్నమైన భావన మన రాజకీయాల్లో పాతుకుపోయింది. ఎడ్డెమంటే తెడ్డెమనడమే మొనగాని తనం అనుకునే మరుగుజ్జులు అనేక మంది ఉన్నారు. తెలంగాణ సమున్నతంగా ఎదగడం ఒక్కటే ఈ శక్తుల వెన్నువిరిచే మార్గం.

తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఒక్కరి తపన చాలదు. పదిమంది మంత్రులు పనిచేస్తే చాలదు. మిషన్ కాకతీయ, మిషన్ జలహారం చాలవు. కొత్త రాష్ట్ర నవనిర్మాణాన్ని  ఒక మిషన్‌గా భావించి అందరూ నడుం బిగించినప్పుడే తెలంగాణ అన్ని సవాళ్లను, అన్ని పరీక్షలను అధిగమించి పురోగమించగలదు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్న చారిత్రక సంధిలో మనం అందరం ఉండడం ఒక అదృష్టం. తెలంగాణ రాష్ర్టానికి తెలంగాణ ఆత్మతో ఆలోచించి ఆచరించే నాయకత్వం లభించడం మనకు దక్కిన సదవకాశం. తెలంగాణ రాష్ట్రం విఫలమవుతుందని, విఫలం కావాలని చూసేవాళ్లు, అందుకోసం కుట్రలు చేసేవాళ్లు ఇప్పటికీ ఉన్నారు. ఇక ముందు కూడా ఉంటారు. తెలంగాణతనం ఇంకా ఒంటబట్టని సమైక్యవాదుల అనుచరగణం ఇక్కడ యథావిధిగా మన కళ్లలో కారం కొట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. నడిచేవాడిని పడేయడానికి, కిందపడితే నవ్వడానికి ఈ మూక ఎప్పుడూ కాచుకునే ఉంటుంది. వాళ్లు సమైక్యవాద ఆత్మతోనే ఇప్పటికీ తెలంగాణను చూస్తున్నారు. వారికి సొంత ఆత్మలు లేవు.  వారు ఏనాటికైనా నిర్మాణాత్మక పాత్ర పోషించే అవకాశాలు కనిపించవు. సమైక్యవాదుల నిధులు, దీవెనలమీద ఆధారపడి రాజకీయాలు చేసేవారు తెలంగాణ నిర్మాణంలో ఎప్పటికీ భాగస్వాములు కాలేరు. వంకరతనం వారి మేధస్సును ఏలుతూ ఉంటుంది. ప్రభుత్వమంటే విమర్శలు ఎదుర్కోవడానికి, ప్రతిపక్షమంటే అడ్డంగా మాట్లాడడానికి ఉందన్న ఒక అధ్వాన్నమైన భావన మన రాజకీయాల్లో పాతుకుపోయింది. ఎడ్డెమంటే తెడ్డెమనడమే మొనగాని తనం అనుకునే మరుగుజ్జులు అనేక మంది ఉన్నారు. తెలంగాణ సమున్నతంగా ఎదగడం ఒక్కటే ఈ శక్తుల వెన్నువిరిచే మార్గం. ప్రభుత్వంలో ఉన్న నాయకులు, అధికారులు మామూలు పద్ధతుల్లో పనిచేస్తే ఈ సవాలును అధిగమించడం సాధ్యం కాదు. ప్రజలు సత్వర ఫలితాలు ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి అధికారుల సమావేశంలో చెప్పినట్టు తెలంగాణ ఎన్నో పెనుగులాటల నుంచి విముక్తి అయి స్వేచ్ఛను పొందింది. తెలంగాణ వస్తే ఏమి జరుగుతుందో ఏమేమి సాధించుకోగలమో ఉద్యమకారులుగా అనేక అంశాలు మాట్లాడుకుని ఉన్నాం. ఇప్పుడు అధికారం మన చేతిలో ఉంది. ఫలితాలు చూపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నిజానికి సొంత రాష్ట్రం, సొంత ప్రభుత్వం, సొంత నాయకుడు ఉంటే ఎలా ఉంటుందో ఈ పదిమాసాల్లో చంద్రశేఖర్‌రావు పదేపదే రుజువు చేశారు. పరిపాలనలో తెలంగాణతనం అంటే ఏమిటో చూపిస్తున్నారు. అయినా చేయాల్సింది, నడవాల్సింది చాలా ఉంది. అసలు లక్ష్యాలు చాలా ముందున్నాయి.

ఇంటింటికీ తాగునీరు చేరాలంటే జలహారం, నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుదుత్పత్తి లక్ష్యాలను ఏకకాలంలో  సాధించాలి. జలహారానికి అవసరమైన నీటిని కాలమయితే, చెరువుల నుంచి, ఇప్పుడున్న నీటిపారుదల వసతుల నుంచి ఉపయోగించుకోవచ్చు. కానీ కాలం కాని పరిస్థితుల్లోనే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నీరు అవసరమవుతుంది. చాలా చోట్ల నీటిని నదుల నుంచి లిఫ్టు చేయాల్సి ఉంటుంది కాబట్టి తగినంత విద్యుత్తు కూడా అందుబాటులో ఉండాలి. ఇవన్నీ పరస్పరాధారితాలు.


నాయకుడు ఎంత అద్భుతంగానయినా ఆలోచించనీయండి. ఎంత మనసుపెట్టి పని చేయనీయండి. ఎంత గొప్ప పథకాలనయినా రూపకల్పన చేయనీయండి. వాటిని ఆచరణలో ప్రజలకు చేర్చాల్సింది ఉన్నతాధికార యంత్రాంగమే. ఉదాహరణకు ఆసరా పథకమే తీసుకోండి. తెలంగాణ ప్రభుత్వం సమైక్య ప్రభుత్వాలకంటే 2.2 లక్షల మందికి అదనంగా పింఛన్లు ఇస్తున్నది. పింఛను పథకంపై వారు ఖర్చు చేసినదానికంటే 1700 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేస్తున్నది. ఎటువంటి అరమరికలు లేకుండా ఏ నెలకానెల పింఛను అందే ఏర్పాటు చేస్తున్నది. కానీ  పథకాన్ని అమలులోకి తేవడంలో జరిగిన లోపాల వల్ల ప్రభుత్వం తొలుత బాగా బద్నాం కావలసి వచ్చింది. మార్గదర్శకాల రూపకల్పన, అమలు దగ్గర విపరీతమైన గందరగోళం సృష్టించారు. పైస్థాయి నుంచి మండలస్థాయి దాకా అధికార యంత్రాంగం కష్టపడింది, కానీ ప్రభుత్వానికి రావలసిన మంచి పేరు రాలేదు. ఏ చిన్న లోపం జరిగినా నానా అల్లరి చేసేందుకు సమైక్యవాదులు ఇక్కడ ఒక రాజకీయ నాయకత్వాన్ని, మీడియా యంత్రాంగాన్ని పోషిస్తున్నారు. వాళ్ల ఎజెండా తెలంగాణ ప్రభుత్వాన్ని బజారుకీడ్చడమే. ఈ రచ్చ కేవలం అధికార యంత్రాంగం తగినంత ఆలోచన, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే జరిగింది. చాలా చోట్ల స్వయంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అధికార యంత్రాంగం కూడా పించనుదారులపట్ల సానుభూతి భావనతో కాకుండా ఒక వ్యతిరిక్త భావనతో పనిచేశారు. అదికాస్తా ఇబ్బందులపాలు చేసింది. సాధారణ పద్ధతులకు భిన్నంగా ఆలోచించి (ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్) పనిచేయండని ముఖ్యమంత్రి ఉన్నతాధికారుల సమావేశంలో కోరింది తెలంగాణ ప్రజలకు సత్వర ఫలితాలు సాధించిపెట్టడం కోసమే.  ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రూళ్ల పుస్తకాన్ని ముందేసుకుని పనిచేస్తూ పోతే ప్రభుత్వం సంకల్పించిన పథకాలు, పనులు ఎప్పటికీ పూర్తికావు. గత ప్రభుత్వాలు అక్రమాలు చేయడానికి, అడ్డగోలు పంపకాలు చేయడానికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను యథేచ్ఛగా వాడుకున్నాయి. వాళ్లను వివాదాల్లో ఇరికించి జైళ్లపాలు చేశాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి చెబుతున్నది అతిక్రమణలు, అక్రమాలు చేయడం కోసం కాదు. ప్రభుత్వం సంకల్పించిన బృహత్పథకాలను సాధ్యమైనంత త్వరితగతిన సాకారం చేయడానికి.
అధికారులు తలుచుకుంటే సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? తలుచుకోకపోతే ఎలా పెండింగులో పడిపోతుంది? ఒక చిన్న ఉదాహరణ. ఒక కాలువ నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. ఒక ఇళ్లస్థలం యజమాని నష్టపరిహారం చాల లేదని కోర్టుకు వెళ్లాడు. ఆ కొద్ది దూరం తప్ప అవతల, ఇవతల కాలువ తవ్వకం అయిపోయింది. ఈ ప్లాటు దాకా కాలువ నీళ్లు వస్తున్నాయి. ఈ కేసు కారణంగా ఆ కొద్ది దూరం కాలువ తవ్వకం ఆగిపోయింది. ఆ కొద్ది దూరం తవ్వితే అవతల ఏడు చెరువులకు నీళ్లు వెళతాయి. సుమారు పదివేల ఎకరాలకు సాగునీరు, పదిగ్రామాలకు తాగునీరు గ్యారంటీగా అందుతుంది. కానీ నాలుగేళ్లుగా ఆ కాలువ అక్కడే ఆగిపోయింది. ఈ నాలుగేళ్లుగా ఆ పదివేల ఎకరాల పంట నష్టం ఎంత? తాగునీటి సమస్యల విలువ ఎంత? ఆ గ్రామాలు తరతరాల కరువు నుంచి విముక్తి అయితే ఎవరిని గుర్తుపెట్టుకుంటారు?  ఆ గ్రామాలకు జరిగిన నష్టంతో పోల్చి చూస్తే ఆ ప్లాటు విలువ అసలు ఏమూలకూ చాలదు. ప్రజలయినా అదనపు ధర పెట్టి ఆ ప్లాటు పంచాయితీ చేసుకుని ఉండవచ్చు. చీఫ్ ఇంజనీర్లు, జిల్లా రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్…ఎవరయినా చొరవతీసుకుని ఆ పని పూర్తి చేసి ఉండవచ్చు. కానీ ఆ సమస్య నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. జనానికి మేలు చేయాలన్న తపన ఉన్నవాళ్లు, నీటి విలువ తెలిసినవాళ్లు మాత్రమే చొరవ చేయగలరు. ఒక్క టీఎంసీ నీటిని ఇస్తున్నామూ అంటే 25 కోట్ల విలువ చేసే పంటను ఇస్తున్నామని గుర్తించాలి. కానీ అధికార యంత్రాంగంలో ఆ చొరవే కనిపించడం లేదు. సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, సంక్షేమం, పారిశ్రామికాభివృద్ధి…ఈ ఐదు అంశాలు తన ప్రాధాన్యాలుగా ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఎంత రిస్కు తీసుకుంటున్నారూ అంటే వచ్చే నాలుగేళ్లలో ఇంటింటికీ మంచినీరు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడుగను అని చెబుతున్నారు. ఇది ముమ్మాటికీ సాహసం. లక్ష్యాన్ని సాధించగలనన్న పూర్తి నమ్మకంతో ఆయన ఈ మాటచెబుతూ ఉండవచ్చు. కానీ ఈ నమ్మకాన్ని నిలబెట్టాల్సింది అధికార యంత్రాంగమే. ఇంటింటికీ తాగునీరు చేరాలంటే జలహారం, నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుదుత్పత్తి లక్ష్యాలను ఏకకాలంలో  సాధించాలి. జలహారానికి అవసరమైన నీటిని కాలమయితే, చెరువుల నుంచి, ఇప్పుడున్న నీటిపారుదల వసతుల నుంచి ఉపయోగించుకోవచ్చు. కానీ కాలం కాని పరిస్థితుల్లోనే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నీరు అవసరమవుతుంది. చాలా చోట్ల నీటిని నదుల నుంచి లిఫ్టు చేయాల్సి ఉంటుంది కాబట్టి తగినంత విద్యుత్తు కూడా అందుబాటులో ఉండాలి. ఇవన్నీ పరస్పరాధారితాలు.
ఈ పథకాలు, ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోవడంలో ఎటువంటి అరమరికలు లేకుండా పనిచేయాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశం. ఈ లక్ష్యాల సాధనకు ఒక మిషన్ జీల్‌తో ముందుకు సాగాలన్నదే ఆయన తాపత్రయం. మొత్తం అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ల సమావేశానికి పిలువడంలోని ఆంతర్యం కూడా అదే. ఆయన లెక్కలు పత్రాలు నివేదికల గురించి మాట్లాడడం లేదు. యాంత్రిక సమీక్షలు చేయడం లేదు. కొత్త రాష్ట్రంలో కొత్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులతో ఒక ఆత్మిక సంభాషణ మొదలుపెట్టారు. తాను ఆలోచిస్తున్నదేమిటో, ఆశిస్తున్నదేమిటో వారి ముందు ఆవిష్కరిస్తున్నారు. అధికార యంత్రాంగం కూడా అంతే నిమగ్నతతో సమావేశంలో పాలుపంచుకుంటున్నారు. ఈ సమావేశం మిషన్ తెలంగాణకు స్ఫూర్తిని ఇవ్వాలి. పనులు పెండింగులో పెట్టడం కాకుండా, పనులు పూర్తి చేయడానికి ఏమి చేయాలన్నదే లక్ష్యంగా అధికార యంత్రాంగం చొరవ తీసుకోవాలి. కొంత మంది అధికారుల్లో ఇంకా పాత పద్ధతులు పోలేదు. ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఫైళ్లతో బంతాట ఆటాడుకుంటున్న అధికారులు ఉన్నారు. ఫైళ్ల పరిష్కారంలో సచివాలయంలోనే విపరీతమైన జాప్యం జరుగుతున్నదన్న విమర్శలు వస్తున్నాయి. నిజమే పూర్తిస్థాయిలో అధికారుల విభజన జరుగకపోవడం, సిబ్బంది ఎవరు ఎక్కడ ఉంటారో తేలకపోవడం ఇప్పటికీ సమస్యలు సృష్టిస్తున్న మాట వాస్తవమే. కానీ అది ప్రభుత్వానికి, నాయకత్వానికి సంబంధించిన సమస్య. తమకు పనులు కావడం లేదన్నది పౌరుల సమస్య. వీటిని అధిగమించడానికే ముఖ్యమంత్రి అన్నట్టు ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ కావాలి. తెలంగాణ ప్రజలకు సత్వర ఫలితాలు అందించే దిశగా అందరూ కంకణబద్ధులై ముందుకు సాగాలి.

చెరువులతోపాటే ప్రాజెక్టులు

TEL_Major Irrigation ProjectsMap (1)

మిషన్ కాకతీయ విజవంతమయి చెరువుల పూడిక తీత పూర్తయినా తెలంగాణ పల్లెలకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందన్న ఆశలేదు. కాలమయితే పర్వాలేదు. కాలాలు కాకపోతే పరిస్థితి ఏమిటన్నదే ప్రశ్నార్థకం. ఇందుకు ఒకటే సమాధానం. తెలంగాణలో ఇప్పటివరకు ప్రారంభించిన నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ ఒక యజ్ఞంలా పూర్తి చేయడమే.

బహుశా 1976-77లలో అనుకుంటా. పదవ తరగతిలో ఉన్నా. ఇంటి గడపలో కూర్చుని చేపలు పట్టిన సందర్భం. ఆ ఏడాది భారీ వర్షాలు కురిశాయి. పది రోజులు సూర్యుడిని చూడలేదు. ఆకాశానికి చిల్లులు పడినట్టు నిరవధికంగా చినుకు పడుతూనే ఉంది. ముసురుపెట్టి, నల్లని మబ్బులు ఆకాశాన్ని కమ్మి పగటివేళ కూడా చిమ్మని చీకటి. చెరువులు వారం రోజులుగా అలుగులుపోస్తున్నాయి. కుక్కడం చెరువు నిండి నీరు వెనుకకు తంతున్నది. ఊరిపైన నల్లగుంట చెరువుదాకా ఎటు చూసినా నీరే. ఊళ్లో వీధులన్నీ ఏరుల్లా మారాయి. మా ఊరి నీళ్లన్నీ కుక్కడం చెరువుకు ప్రవహిస్తాయి. నల్లగుంట చెరువు తెగుతుందేమోనని అందరూ భయపడ్డారు. చెరువు తెగితే వరద మా ఊరు మీదే పడుతుంది. ఇంటి గడప ముందు మూడు మెట్లుంటే మొదటి మెట్టు మునిగి నీరు ప్రవహిస్తున్నది. అలా ప్రవహించబట్టి అది ఆరో రోజు. సరదాగా ఆడుకుంటూ చూస్తే చేపలు ఎగురుకుంటూ ఎదురెక్కుతున్నాయి. అవి కుక్కడం చెరువు నుంచి ఎదురెక్కుతున్నాయి. పదవరోజు తెరిపి నిచ్చిన తర్వాత చూస్తే పైన నల్లగుంట చెరువు, దిగువ పెద్దరెడ్డి చెరువు నిండు గర్భిణిలా ఉన్నాయి. పొలాలన్నీ జలాలతో నిండిపోయి కనుచూపు మేర పొలంగట్లు, భూమి కనిపించడం లేదు. మర్రిబావి, బుడిగెబావి, నల్లగుంటబావి, సౌటబావి, చిన సౌటబావి, చెర్లబావి, అలుగుబావి…ఒకటేమిటి బావులన్నీ పొంగిపొర్లుతున్నాయి. నల్లగుంట అలుగు వరదకు మా బావులతో సంబంధాలు తెగిపోయాయి. పెద్దరెడ్డి చెరువు అలుగు వరద వల్ల ఆవలిగట్టు పొలాలు, చెల్కలకు వెళ్లడం మానేశారు. ఉండబట్టలేక ఒక తాత అలుగువరదను దాటుకుని పొలం వద్దకు వెళ్లాలని ప్రయత్నించి కొట్టుకుపోయి ఎక్కడో ఒక తాటి చెట్టుకుని పట్టుకుని బతికిపోయాడు. ఈదులాగు ఉధృతంగా ప్రహించింది. నిజంగా అటువంటి సన్నివేశం మళ్లీ చూడలేదు. అంతగా కాలం మళ్లీ కాలేదు.

ఇంటి గడప ముందు మూడు మెట్లుంటే మొదటి మెట్టు మునిగి నీరు ప్రవహిస్తున్నది. అలా ప్రవహించబట్టి అది ఆరో రోజు. సరదాగా ఆడుకుంటూ చూస్తే చేపలు ఎగురుకుంటూ ఎదురెక్కుతున్నాయి. అవి కుక్కడం చెరువు నుంచి ఎదురెక్కుతున్నాయి. పదవరోజు తెరిపి నిచ్చిన తర్వాత చూస్తే పైన నల్లగుంట చెరువు, దిగువ పెద్దరెడ్డి చెరువు నిండు గర్భిణిలా ఉన్నాయి.

అప్పటికి నాకు గుర్తుకు ఉన్నమేరకు మా ఊళ్లలో భూముల స్వభావం వేరుగా ఉండేది. ప్రతి రైతుకు కొంత కంచె(అడవి వంటిదే) ఉండేది. వాటిల్లో రేగడి కంచె చాలా పెద్దగా ఉండేది. ఎండాకాలం వస్తే అందులో వేటకు వెళ్లేది. ప్రతికంచెలో పొదలు, సండ్రలే కాదు మోదుగులు, తుమ్మలు, చింతలు, వేపలు, మర్రి, జువ్వి చెట్లు ఉండేవి. నాకు తెలిసి మా ఊళ్లోనే 30-40 కంచెలు ఉండేవి. అంతేకాదు ప్రతిరైతుకు ఒక దొడ్డి పశువులు, దొడ్డి చుట్టూ వనం ఉండేది. పచ్చదనం ఉండేది. ఎండాకాలం వస్తే ఇంటింటికీ ఒక బండి కట్టుకుని ముందుగా చెరువు మట్టి తవ్వుకుపోయి చెల్కల్లో పొలాల్లో కుప్పలు కుప్పలుగా పోసి వచ్చేవాళ్లు. ఆ తర్వాత దొడ్డి మట్టిని బండ్లలో తోలుకుపోయి చెరువు మట్టి దిబ్బల మధ్య కుప్పలు పోసేవారు. రెంటినీ కలిపి దున్నితే పొలాలకు, చెల్కలకు ఎరువుల అవసరం ఉండేది కాదు. అప్పటికింకా బోర్లు వేసే అవకాశం రాలేదు. కానీ బోర్లు వేయడం వచ్చిన తర్వాత సహజంగానే రైతులు మరింత భూమిని సాగులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. క్రమంగా కంచెలు నశించిపోయాయి. బోర్లు పెరిగే కొద్దీ బావుల్లో నీరు తగ్గిపోతూ వచ్చింది. ఎండాకాలం వస్తే ఊరు చుట్టూ ఉన్న ఏడు బావులూ కలియదిరిగి ఈత కొట్టేవాళ్లం. పోటీలు పడి కామంచి కొట్టి బావుల అడుగుదాకా వెళ్లి వచ్చేవాళ్లం. అలా ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలూ ఉన్నాయి. కొందరు మిత్రులను కోల్పోయాం కూడా. 1985 నుంచి బావులలో నీరు అడుగంటి పోనారంభించింది. చెట్టూ చేమలు నశించాయి. కంచెలు చేలయ్యాయి. చాలా మంది పశువులను వదిలించుకున్నారు. దొడ్లు పడవపడిపోయాయి. చెట్లు కలపకోసం నరికేశారు. కోనసీమలో ఎటుచూసినా పచ్చదనం కనిపిస్తుందంటారే… అలా ఇక్కడ ఎటు చూసినా కిలోమీటర్ల కొద్దీ ఎర్ర చెల్క నేలలు కనిపిస్తాయిప్పుడు. ప్రకృతి విధ్వంసం, కరువు…ఒకదాని వెంట ఒకటి వచ్చాయి. ఏది ముందు ఏది వెనుక అన్న చర్చ అందరికీ తెలుసు.

ఇది ఒక ఊరి కథ కావచ్చు. కానీ చాలా ఊళ్లలో పరిస్థితి ఇదే. చెరువులు కుంచించుకుపోయాయి. రైతులు చెరువు మట్టిని పొలాలకు, చెల్కలకు తోలడం మానేశారు. పశువులు లేకపోవడంతో పెంటదిబ్బలు మాయమ్యాయి. ఎరువులకు అలవాటుపడిపోయారు. నిరంతరం ఏదో ఔషధాలు వాడే మనిషి ఎలా రోగనిరోధక శక్తిని కోల్పోతాడో, నిరంతరం ఎరువులు వాడే భూములూ అలాగే నిర్వీర్యమయి పోతాయి. చెరువు శిఖంలో భూములున్న రైతులు చెరువులోపలిదాకా సాగు చేసుకోవడం మొదలు పెట్టారు. తమ భూములను కాపాడుకోవడం కోసం చెరువులను తెగగొట్టడం, అలుగులను ధ్వంసం చేయడం, తూములను పీకేయడం వంటి పంచాయతీలు చాలా ఊళ్లలో చూశాం. ఇంకోవైపు చెరువులకు నీరు ప్రవహించే వాగులనూ, వంకలనూ(కాంటూర్లు) క్రమంగా పూడ్చేసి సాగులోకి తెచ్చారు. అసలే కాలం తక్కువ. వర్షాలు తక్కువ. దాంతో చెరువులకు నీరు రావడమే మానేసింది. అప్పుడో ఇప్పుడో కొద్దిపాటి నీరు వచ్చినా కుంచించుకుపోయిన చెరువుల్లో ఎక్కువ మోతాదులో నిలిచే పరిస్థితి లేదు. గత రెండు దశాబ్దాలుగా మా మండలమయితే కరువు మండలంగానే గుర్తింపు పొందుతున్నది. కరువు మండలాల సంఖ్య తెలంగాణలో చాలా ఎక్కువ. వర్షపాతం బాగా తక్కువగా ఉండడమే కరువు మండలాలుగా మారడానికి ప్రధాన కారణం. ఆదిలాబాద్ జిల్లా మొత్తం, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉత్తర ప్రాంతాల్లో తప్ప మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం కూడా నమోదు కావడం లేదు. మిషన్ కాకతీయ విజవంతమయి చెరువుల పూడిక తీత పూర్తయినా తెలంగాణ పల్లెలకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందన్న ఆశలేదు. కాలమయితే పర్వాలేదు. కాలాలు కాకపోతే పరిస్థితి ఏమిటన్నదే ప్రశ్నార్థకం. ఇందుకు ఒకటే సమాధానం. తెలంగాణలో ఇప్పటివరకు ప్రారంభించిన నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ ఒక యజ్ఞంలా పూర్తి చేయడమే. తెలంగాణాలో పెద్ద ఎత్తున కాలువలను తవ్వి పెట్టారు. శ్రీరాంసాగర్‌లో నీటి లభ్యతపై భరోసా లేకపోయినా వేల కోట్ల రూపాయల ఖర్చు చేసి కాకతీయ కాలువను 384 కిలోమీటర్ల పొడవున తవ్విపెట్టారు. ఆ కాలువకు అనుబంధంగా వందల కిలోమీటర్ల పొడవున ఉపకాలువలను కూడా తవ్వారు. కాకతీయ కాలువ సామర్థ్యాన్ని పెంచలేదు. మరో ప్రత్యామ్నాయ ప్రాజెక్టు నుంచి నీటిని అందించే ప్రయత్నమూ చేయలేదు. ఆ ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరయిపోయింది.

ఇలాగే వరద కాలువలు చాలా పొడవు తవ్వారు. మహబూబ్‌నగర్‌లో ఎత్తిపోతల హెడ్‌వర్క్స్ పూర్తి చేయకుండానే కాలవలయితే తవ్వుతూ పోయారు. కొన్ని చోట్ల నీళ్లొచ్చినా డిస్ట్రిబ్యూటరీల పని పూర్తి కాలేదు. మాధవరెడ్డి ప్రాజెక్టు కింద ఇంకా డిస్ట్రిబ్యూటరీలు పూర్తి కాలేదు. సాధారణంగా ఇప్పుడు డబ్బు ఖర్చు చేస్తే ఎప్పటికి ఆదాయం వస్తుందని అందరం లెక్కలు వేసుకుంటాం. ప్రభుత్వ సొమ్ము విషయంలో మాత్రం అటువంటి లెక్కలు ఏవీ వేస్తున్నట్టు కనిపించడం లేదు. నీటిపారుదల ప్రాజెక్టుల పరిస్థితి మరీ అన్యాయం. ప్రాజెక్టులను, కాలువలను పూర్తి చేసి, వాటిని గొలుసుకట్టు చెరువులకు అనుసంధానం చేసి వరుసగా మూడు నాలుగేళ్లు చెరువులను నింపితే తప్ప మళ్లీ ఊళ్లు కోల్పోయిన జవజీవాలను సంతరించుకోలేవు. ఇప్పటికే తవ్విన కాలువలకు అనుసంధానమై ఉన్న చెరువుల లెక్కలు తీయాలి. ఇంకా చెరువులను అనుసంధానం చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలి. కొన్ని చోట్ల కాలువల నీటిని మళ్లించి వాగులు, ఉపనదులను పునర్జీవింప జేయడంపై కూడా దృష్టిని కేంద్రీకరించాలి. ఈ వాగులు, ఉపనదుల కింద చాలా చెరువులు ఉన్నాయి. జలసాధన ఉద్యమంగా జరగాలి. కాలంకాకపోతే నదుల్లో నీళ్లు ఎలా వస్తాయి అని ఎవరయినా ప్రశ్నించవచ్చు. తెలంగాణలో కాలమయినా కాకపోయినా కృష్ణా, గోదావరి నదులకు వరదలు వస్తున్నాయి. శ్రీరాంసాగర్‌కు దిగువన గోదావరికి నీరు రాని సంవత్సరం లేదు. కాళేశ్వరం దిగువ నుంచి గోదావరి జీవనదే. గోదావరి ఉపనదులయిన ప్రాణహిత, ఇంద్రావతి నదుల్లో నీరు పుష్కలం. కృష్ణాలో తెలంగాణలో ఇంత కరువున్నా ఈసారి కూడా నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి నీటిని వదిలిపెట్టాల్సి వచ్చింది. కర్ణాటక, మహారాష్ట్రలలో విస్తరించి ఉన్న పశ్చిమ కనుమలు కృష్ణను బతికిస్తున్నాయి.

వరదలు వచ్చినప్పుడు అతితక్కువ కాలంలో వీలైనంత ఎక్కువ నీటిని ఈ కాలువలకు మళ్లించడం ఎలా అన్నదే ప్రధానమైన సమస్య. ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు అన్నింటినీ కలిపి ఆలోచిస్తే తప్ప తెలంగాణ తాగునీరు, సాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు.

అందుకే మిషన్ కాకతీయ ఎంత ముఖ్యమో నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడమూ అంతే ముఖ్యం. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీటిపారుదల ప్రాజెక్టులపై చేస్తున్న మేథోమధనం, ఇంజనీర్లను ఆగమేఘాలపై పరుగెత్తిస్తున్న తీరు భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగిస్తున్నది. ప్రాజెక్టులు కాంట్రాక్టర్లకోసం కాదు. ప్రజలకోసం. ప్రాజెక్టుల పనులను ఏళ్లతరబడి సాగదీయడం వల్ల ప్రజలకు, ప్రభుత్వానికి నష్టం. సాధ్యమైనంత త్వరితగతిన రైతుల పొలాలకు నీళ్లు మళ్లించడం లక్ష్యంగా పనులు జరగాలి అని ఇటీవల నీటిపారుదల ఇంజనీర్లు, అధికారులతో జరిగిన సమావేశంలో స్పష్టంగానే చెప్పారు. తెలంగాణ నీటిపారుదల ఇంజనీర్లు, పదవీవిరమణ చేసిన ఇంజనీర్లు కూడా అంకితభావంతో తెలంగాణ ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌పై పనిచేసుకుపోతున్నారు. ఎక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు నిర్మించడం కాకుండా ఎక్కువ నీటిని తీసుకునే విధంగా ప్రాజెక్టులను రూపొందించాలని ప్రయత్నిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులు అటువంటి భావన నుంచి రూపుదిద్దుకున్నవే. నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో వివిధ ప్రాజెక్టులకోసం విస్తృతంగా రకరకాల కాలువలు ఇప్పటికే తవ్వి ఉన్నాయి. ఇంకా కొన్ని కాలువలు నిర్మాణంలో ఉన్నాయి. వరదలు వచ్చినప్పుడు అతితక్కువ కాలంలో వీలైనంత ఎక్కువ నీటిని ఈ కాలువలకు మళ్లించడం ఎలా అన్నదే ప్రధానమైన సమస్య. ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు అన్నింటినీ కలిపి ఆలోచిస్తే తప్ప తెలంగాణ తాగునీరు, సాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు.

పాత భీమానే కొత్త పాలమూరు ప్రాజెక్టు

palamuru1

మూడు జిల్లాల రూపురేఖలు మార్చే పాలమూరు పథకం
పది లక్షల ఎకరాలకు నీరు,
ఏటా మూడు వేల కోట్ల పంట
నాలుగు ఉప నదులకు పునర్జన్మ
గ్రావిటీతో తరలింపు, లిఫ్టులతో రిజర్వాయర్లకు
మూడు లిఫ్టులు, మూడు రిజర్వాయర్లు
మూడు జిల్లాలు, పది లక్షల ఎకరాలు లక్ష్యం
కరువు జిల్లా రూపు రేఖలు మార్చనున్న ప్రాజెక్టు
నాలుగు ఉపనదులకు జాలుజలాలు

తెలంగాణ తనను తాను పునర్నిర్మించుకుంటున్నది. ఆరు దశాబ్దాలుగా కోల్పోయినవన్నీ వెతికి వెతికి పట్టుకుంటున్నది. దత్తపుత్రులు, ఉత్తపుత్రులు జార విడిచిన కోటి రతనాలను ఒకటొకటిగా ప్రోది చేసుకుంటున్నది. అలాంటి అమూల్య రత్నమే పాలమూరు ప్రాజెక్టు. వలసల శాపం నుంచి పాలమూరుకు విముక్తి కల్పించే వరప్రదాయని. ఒకనాటి భీమా ప్రాజెక్టు… ఇవాళ పాలమూరు ప్రాజెక్టు. సీఎం కేసీఆర్ 14 ఏండ్ల కలల పంట. కొండలు, అడవులు, సొరంగాలు చీల్చుకుని మూడు జిల్లాల్లో బీడు భూములను ముద్దాడే గంగమ్మ. 10 లక్షల ఎకరాల్లో ఏటా మూడు వేల కోట్ల రూపాయలు పండించే వరం. నాలుగు ఉపనదులకు పునర్జన్మ ప్రసాదించే యజ్ఞం. అపర భగీరథుడు కేసీఆర్ తలపెట్టిన గంగావతరణం!

సమైక్య రాష్ట్రం నిర్లక్ష్యం చేసిన భీమా ప్రాజెక్టునే ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించ తలపెట్టింది. భీమా ప్రాజెక్టుకు నాడు కేటాయించిన నీటినే నేడు పాలమూరు ప్రాజెక్టుకు ఉపయోగించుకోవాలని భావిస్తున్నది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలను సాగులోకి తేవడంతోపాటు దారి పొడవునా ఉన్న అన్ని గ్రామాలకు, హైదరాబాద్‌కు తాగునీరు అందించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టుకు 2014 ఆగస్టులోనే పాలనానుమతి ఇచ్చింది. సాధ్యమైనంత త్వరగా శంకుస్థాపన చేయాలని అందుకు అవసరమైన సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నీటిపారుదల ఇంజనీర్లను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల వ్యవసాయిక, ఆర్థిక రంగాల ముఖచిత్రం మారిపోతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అనుకున్న లక్ష్యాల మేరకు నీరందించగలిగితే ఏటా సుమారు 300- 500 కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణ రైతాంగానికి పంటల ద్వారా 3 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని వ్యవసాయ ఆర్థిక నిపుణుడు ఒకరు చెప్పారు. రిజర్వాయర్ల నిర్మాణంలో ముంపును తగ్గించే విధంగా ప్రణాళికలను రూపొందించడంతోపాటు, తప్పనిసరై భూములు నష్టపోయే రైతులకు కూడా ముందుగానే నష్టపరిహారం అందేవిధంగా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఇంజనీర్లను కోరారని తెలిసింది.

వరదనీటితోనే…
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చే ఇరవై ఐదు రోజుల కాలంలో 70 టీంఎంసీల వరద జలాలను తీసుకుని కోయిల్ సాగర్, గండీడ్ రిజర్వాయర్ల ద్వారా తెలంగాణలోనే ఎత్తైన ప్రాంతమైన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయరుకు నీటిని తీసుకురావాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. గత పద్నాలుగు సంవత్సరాల కాలంలో జూరాల ప్రాజెక్టు వద్ద నీటి ప్రవాహ లెక్కలను అధ్యయనం చేసి, ప్రతిఏటా 25 రోజులపాటు రోజుకు లక్ష క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తున్నట్టు ఇంజనీర్లు నిర్ధారణకు వచ్చారు. కోయిల్‌సాగర్ రిజర్వాయరును 76 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో, గండీడ్ రిజర్వాయరును 35 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మిస్తారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయరును 10 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తారు. జూరాల నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించి మూడు చోట్ల భారీ లిఫ్టులు ఏర్పాటు చేసి రిజర్వాయర్లను నింపుతారు. మూడు లిఫ్టులదాకా 56.6 కిలోమీటర్ల దూరం నీటిని తరలించాల్సి ఉండగా, అందులో 6.65 కిలోమీటర్ల దూరం మాత్రమే కాలువ(ఓపెన్ చానెల్) కాగా 50 కిలోమీటర్లు సొరంగం ద్వారానే నీటిని తీసుకురావలసి ఉంటుంది. ఈ కారణంగా భూసేకరణ కూడా తక్కువగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా మహబూబ్‌నగర్‌లో 7 లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 2.75 లక్షల ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 30 వేల ఎకరాలు సాగులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నది. వీలైనంత తక్కువ ముంపుతో సాధ్యమైనంత ఎక్కువ నీటి నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేసి లక్ష్యంగా పెట్టుకున్న పొలాలకు నీళ్లందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఇంజనీర్లకు లక్ష్య నిర్దేశం చేశారు.

palamuru
కోయిల్ సాగర్ దాకా గ్రావిటీ..
జూరాల రిజర్వాయరు వెనుక తట్టున ఉన్న నర్వ మండలంలోని అప్పంపల్లి సమీపం నుంచి గ్రావిటీ ద్వారానే నీటిని కోయిల్‌సాగర్ రిజర్వాయరు దిగువదాకా తరలిస్తారు. జూరాల రిజర్వాయరు నుంచి తొలి 5.3 కిలోమీటర్లు కాలువను తవ్వి అక్కడి నుంచి మరో 23 కిలోమీటర్లు సొరంగ మార్గం ద్వారా కోయిల్‌సాగర్ సమీపంలోని పంపుహౌజుదాకా నీరు వస్తుంది. ఈ పంపు హౌజు నుంచి 14 మోటార్లతో 150 మీటర్ల ఎత్తుకు లిఫ్టు చేసి కోయిల్‌సాగర్ రిజర్వాయరు నింపుతారు. ఒక్కొక్క మోటారు 160 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో 66 క్యూమెక్‌ల నీటిని లిఫ్టు చేస్తుంది. కోయిల్‌సాగర్ కుడి, ఎడమ కాలువల ద్వారా 1,45,230 ఎకరాలకు నీరందిస్తారు. కోయిల్‌సాగర్ రిజర్వాయరు నిర్మాణంలో ముంపు గ్రామాలు ఎక్కువగా ఉంటాయని తొలుత ఉంటుందని అంచనా వేసినప్పటికీ, ముంపును సాధ్యమనంత తగ్గించేందుకుగల అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఇంజనీర్లను తాజాగా ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

మూడు లిప్టులు..
కోయిల్‌సాగర్ రిజర్వాయరు వెనుక భాగంలో సూరారం గ్రామం నుంచి 850 మీటర్ల దూరం కాలువ ద్వారా నీటిని తరలించి అక్కడి నుంచి 11.2 కిలోమీటర్ల సొరంగమార్గం ద్వారా గండీడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు దిగువన నిర్మించే పంపుహౌజుకు మళ్లిస్తారు. అక్కడ ఒక్కొక్కటి 160 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు మోటార్ల ద్వారా 125 మీటర్ల ఎత్తు లిఫ్టు చేసి గండీడు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు నింపుతారు. ఈ మోటార్లు ఒక్కొక్కటి 82 క్యూమెక్‌ల నీటిని లిఫ్టు చేస్తాయి. ఈ రిజర్వాయరు కింద కుడి, ఎడమ కాలువల ద్వారా 3,23,447 ఎకరాలకు నీరందించాలని ప్రభుత్వం సంకల్పిస్తున్నది. గండీడు రిజర్వాయరు వెనుక భాగంలోని కుల్కచర్ల మండలం బండ ఎల్కచెర్ల నుంచి అర కిలోమీటరు దూరం కాలువ ద్వారా నీటిని తరలించి అక్కడి నుంచి 15.775 కిలోమీటర్ల సొరంగం ద్వారా కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయరు సమీపంలోని పంపుహౌజుదాకా నీటిని మళ్లిస్తారు. ఇక్కడ మూడో లిఫ్టును ఏర్పాటు చేసి 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు మోటార్ల ద్వారా 120 మీటర్ల ఎత్తున నిర్మించే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయరు నింపుతారు. అరవై రోజుల్లో 40 టీఎంసీల నీటిని లిఫ్టు చేసేందుకు వీలుగా ప్రణాళిక రూపొందించారు. ఈ రిజర్వాయరు నుంచి కూడా కుడి ఎడమ కాలువలు నిర్మించి 5,31,323 ఎకరాలు సాగులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నది.

ఉప నదులకు జాలుజలాలు
మొత్తం మూడు లిఫ్టుల్లో ఏర్పాటు చేసే 22 మోటార్ల స్థాపన సామర్థ్యం 3280 మెగావాట్లు కాగా ఉపయోగించేది మాత్రం 2555 మెగావాట్లు మాత్రమే. అంటే ప్రతి ఏటా ప్రాజెక్టు మీద ఖర్చయ్యే కరెంటు 2216 మిలియన్ యూనిట్లు. కేపీ లక్ష్మీదేవి పల్లి తెలంగాణలోనే ఎత్తైన ప్రాంతంగా భావిస్తున్నారు. సముద్రమట్టం నుంచి 675 మీటర్ల ఎత్తున ఉండే ఈ రిజర్వాయరు నుంచి ఎక్కడికయినా నీటిని తీసుకునే వీలుంది. ఈ ప్రాజెక్టుల కింద సాగయ్యే భూముల జాలు నీటితో డిండి, ఈసీ, కాగ్నా నదులను, పెద్దవాగును కూడా పునర్జీవింప(రీజనరేట్) జేయవచ్చునని ఇంజనీర్లు సూచిస్తున్నారు. గండీడు రిజర్వాయరును ఆనుకుని ఉన్న కొండలకు తూర్పు వైపు నుంచి డిండి నది పాయలు మొదలవుతాయి. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయరుకు సమీపంలోని ఈశాన్య గ్రామాల నుంచి హిమాయత్‌సాగర్‌కు ప్రవహించే ఈసీ నది పాయలు మొదలవుతాయి. లక్ష్మీదేవిపల్లి వెస్ట్ మెయిన్ కాలువ దిగువ నుంచి భీమా ఉపనది కాగ్నా పాయలు మొదలవుతాయి. ఈ ప్రాజెక్టు విజయవంతమయితే మహబూబ్‌నగర్ ఎగువ మండలాలు, దక్షిణ రంగారెడ్డి మండలాలు సస్యశ్యామలం కావడంతోపాటు జిల్లాల్లోని ఉపనదులు, వాగులు, వంకలు పునర్జీవం పొందుతాయని అధికారుల విశ్వాసం. గండీడు నుంచి 18 కిలోమీటర్లు సొరంగం తవ్వగలిగితే డిండి నదిని కూడా పూర్తిస్థాయిలో తిరిగి పునరుజ్జీవింప జేయవచ్చునని నీటిపారుదల ఇంజనీర్లు సూచిస్తున్నారు.

ఏ జిల్లాకు ఎంతెంత లబ్ది..
ఈ పథకం వల్ల మహబూబ్‌నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 2 లక్షల 70 వేల ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజవకర్గ పరిధిలోని అచ్చంపేట, నాగర్‌కర్నూలు, జడ్చర్ల, కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు, మహబూబ్‌నగర్ లోక్‌సభ పరిధిలో కోడంగల్, మహబూబ్‌నగర్, మక్తల్, దేవరకద్ర, నారాయణపేట, షాద్‌నగర్, వనపర్తి నియోజకవర్గాలు, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని చేవెళ్ల, ఇబ్రహింపట్నం, మహేశ్వరం, పరిగి, తాండూరు, వికారాబాద్ , నల్లగొండ లోక్‌సభ పరిధిలోని దేవరకొండ, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని భూములకు సాగునీరు అందుతుంది.
మండలాల వారీగా ఆయకట్టు వివరాలు
————————————————————————-
అసెంబ్లీ నియోజకవర్గం – మండలం – సాగులోకి రానున్న ఆయకట్టు(ఎకరాల్లో)
————————————————————————–
మహబూబ్‌నగర్ జిల్లా
————————————————————————–
అచంపేట – వంగూర్ – 1,727
దేవరకద్ర – అడ్డాకుల – 26,560
– బూత్‌పూర్ – 25,188
– దేవరకద్ర – 10,788
– కొత్తకోట – 1,017
జడ్చర్ల – బాలానగర్ – 41,889
– జడ్చర్ల – 37,510
– మిడ్జిల్ – 44,176
– నవాబుపేట – 25,084
కల్వకుర్తి – ఆమనగల్ – 15,823
– కల్వకుర్తి – 15,188
– మాడ్గుల – 5,903
– తలకొండపల్లె – 39,080
– వెల్దండ – 18,997
కొడంగల్ – బోంరాస్‌పేట్ – 23,633
– దౌల్తాబాద్ – 18,122
– కొడంగల్ – 18,409
– కోస్గి – 25,205
– మద్దూర్ – 22,757
మహబూబ్‌నగర్ – హన్వాడ – 18,237
– మహబూబ్‌నగర్ – 8,860
మక్తల్ – మంగనూర్ – 283
– మక్తల్ – 20,069
– నర్వ – 6,322
– ఊట్కూర్ – 39,888
నాగర్‌కర్నల్ – బిజినేపల్లి – 9,780
– తాండూర్ – 3,490
– తిమ్మాజిపేట్ – 19,066
నారాయణ్‌పేట్ – దామరగిద్ద – 9,041
– ధన్వాడ – 8,278
– కోయల్‌కొండ – 12,686
– నారాయణ్‌పేట్ – 21,315
షాద్‌నగర్ – ఫారూక్‌నగర్ – 22,512
– ఖాసీంపేట్ – 18,927
– కొందుర్గ్ – 14,566
వనపర్తి – ఘన్‌పూర్ – 20,043
– గోపాల్‌పేట – 3,030
– పెద్దమందాడి – 20,471
– వనపర్తి – 6,080
———————————————————————
మొత్తం -7,00,000
———————————————————————–
రంగారెడ్డి జిల్లా
———————————————————————————–
చేవెళ్ల – చేవెళ్ల – 1,507
– షాబాద్ – 267
– నవాబ్‌పేట్ – 4,083
– శంకర్‌పల్లి – 630
ఇబ్రహీంపట్నం – యాచారం – 17,809
మహేశ్వరం – కందుకూర్ – 5,505
పరిగి – దోమ – 18,462
– గండీడ్ – 21,596
– కుల్కచర్ల – 13,407
– పరిగి – 20,343
– పూడూర్ – 14,378
తాండూర్ – బషీరాబాద్ – 27,430
– పెద్దేమూల్ – 19,529
– తాండూర్ – 29,074
– యాలాల్ – 22,745
వికారాబాద్ – బట్వారం – 15,087
– ధరూర్ – 20,378
– మర్పల్లి – 5,665
– మోమీన్‌పేట్ – 548
– వికారాబాద్ – 11,557
——————————————————————————
మొత్తం -2,70,000
——————————————————————————-
నల్లొండ జిల్లా
——————————————————————————-
దేవరకొండ – చింతపల్లి – 7,129
– డిండి ఫీడింగ్ – 20,000
మునుగోడు – మర్రిగూడ – 2,871
——————————————————————————-
మొత్తం: – 30,000
——————————————————————————–

ప్రత్యేక రాష్ట్రం వల్లే సాధ్యమైంది
ప్రత్యేక రాష్ట్రం వల్లనే ఈ ప్రాజెక్టు సాధ్యపడుతున్నది. హైదరాబాద్ రాష్ర్టాన్ని విడగొట్టిన నాడే మహబూబ్‌నగర్ జిల్లా లక్షల ఎకరాలు సాగునీరు కోల్పోయింది. జిల్లాలో 35 లక్షల ఎకరాలు సాగుయోగ్యమైనా, ఇప్పటికీ అన్ని ప్రాజెక్టులు కలిపి 15 లక్షల ఎకరాలు కూడా సాగు కావడం లేదు. ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది కాబట్టే ఈ ప్రాజెక్టు వెలుగులోకి వచ్చింది. లేదంటే కాగితాలకే పరిమితం అయ్యేది
-మేరెడ్డి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి (తెలంగాణ రిటైర్డు ఇంజినీర్ల ఫోరం ప్రధాన కార్యదర్శి)

నీళ్లు నిల్వ చేసుకునే అవకాశముంది
ప్రకాశం బ్యారేజీ నుంచి ప్రతి సంవత్సరం సగటున 500 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నది. ఆ నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం, సమర్థత మన జిల్లాలకే ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో కరువు, వలసల నివారణ జరగాలంటే, సాగు పెరగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఈ జిల్లా అభివృద్ధి పట్ల ఎంతో పట్టుదలగా ఉన్నారు.
– ఖగేందర్ (మహబూబ్‌నగర్ చీఫ్ ఇంజినీర్)

బిరబిరా కృష్ణమ్మ తరలిపోయిన కథ!

Bheema Project
ఆంధ్రలో నిండిన రిజర్వాయర్లు.. పండిన పంటలు
తెలంగాణలో ఎండిన పొలాలు.. ఫ్లోరైడ్ భూతం పీడ
పాతిక లక్షల ఎకరాలకు పారాల్సిన కృష్ణమ్మ
ఏడు లక్షల ఎకరాలకు నీరదటమే గగనం
కుంట పొలాన్నీ తడుపని శ్రీశైలం జలాలు
భీమా ధీమా దక్కని పాలమూరు పొలాలు
నీళ్లు దోచుకుపోతున్న పోతిరెడ్డిపాడు
ఇంకా కుంటి నడకనే శ్రీశైలం ఎడమ కాలువ
లక్షల కోట్లలో నష్టపోయిన తెలంగాణ రైతు
కృష్ణమ్మనుంచి మన వాటా ప్రతి చుక్క రావాల్సిందే

ఒక అన్యాయం మూడు జిల్లాలు వట్టిపోయేలా చేసింది! పనిగట్టుకుని రచించిన ఒక పథకం.. న్యాయంగా దక్కాల్సిన ప్రాజెక్టులను తెలంగాణకు కాకుండా చేసింది! కరడుగట్టిన వివక్ష.. ఒక జిల్లాను తరతరాలు పీడించే ఫ్లోరైడ్ రక్కసి కోరల మధ్యకు నిర్దాక్షిణ్యంగా విసిరిపారేసింది! సమైక్య పాలకుల పట్టరానితనం.. దేశంలో ఎక్కడా లేని స్థాయిలో ఒక జిల్లాకు జిల్లానే వలసబాట పట్టించింది! కృష్ణానదిపై నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు కబ్జా కథ చదివాం! ఇది ఆ కబ్జా నేపథ్యంలో శ్రీశైలానికి ఇవతలివైపున తెలంగాణలో తలెత్తిన మహా మానవ సంక్షోభానికి మచ్చుతునకలివి! గండికొట్టుకుని మరీ తరలించుకుపోయిన నీటితో ఆంధ్ర రిజర్వాయర్లు నిండి.. అక్కడ పంటలు పండితే తెలంగాణ పొలాలు ఎండిపోయాయి! కృష్ణా జలాలపై ప్రథమ హక్కులుండి.. హక్కు ప్రకారమే కనీసం పాతిక లక్షల ఎకరాలను తడపాల్సిన జలాలు.. ఏడు లక్షల ఎకరాలను తడిపేసరికే డస్సిపోతున్నాయి! ఇది దగా పడ్డ తెలంగాణ కథ! బిరబిరా తరలిపోతున్న కృష్ణమ్మను చూసి తెల్లబోయి కూర్చున్న తెలంగాణ పొలాల వ్యథ! ఒక టీఎంసీ నుంచి కోటి రూపాయల పంట పండుతుందని అంచనా! అంటే ఈ లెక్కన ఐదున్నర దశాబ్దాల్లో తెలంగాణ రైతు నష్టపోయింది లక్షల కోట్లు! అంతటి ఆదాయం మహబూబ్‌నగర్ పంచుకుని ఉంటే మరో కోనసీమ కాకపోయేనా! అందులో కనీసవాటా పొందగలిగితే నల్లగొండను ఫ్లోరైడ్ పట్టి పీడించేదా? ఇప్పుడు ఇదే ప్రశ్న! కృష్ణా జలాల్లో రాష్ర్టానికి రావాల్సిన ప్రతి చుక్క నీటినీ సాధించాల్సిందేనన్నది దీటైన జవాబు!!

సమైక్యపాలకుల మోసానికి కృష్ణానదికి ఇవతలివైపున తెలంగాణలో మహా విధ్వంసమే చోటు చేసుకుంది. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు ఒట్టిపోయాయి. మహబూబ్‌నగర్ ఏకంగా ఎడారిగా మారే పరిస్థితులు దాపురించాయి. తాగునీరు, సాగునీరు లభించక లక్షలాదిమంది జనం వలసపోవలసి వచ్చింది. నల్లగొండ పశ్చిమ మండలాల ప్రజలు ఫ్లోరైడ్ భూతానికి బలికావలసి వచ్చింది. ఎందుకిలా జరిగింది? తలాపున కృష్ణా నది పారుతున్నా ఎందుకు నీటికోసం అలో రామచంద్రా అని అలమటించవలసి వచ్చింది? కృష్ణానది నుంచి హంద్రీ-నీవా ద్వారా ఎక్కడో 610 కిలోమీటర్ల దూరంలోని పలమనేరుకు నీరు తీసుకుపోవడానికి ప్రణాళికలు వేసిన సమైక్య పాలకులు పక్కనే ఉన్న పాలమూరును ఎందుకు వదిలేశారు? ఎందుకంటే వారెవరికీ తెలంగాణ ఆత్మ లేదుకాబట్టి. కృష్ణా నీటిపై తెలంగాణకు ప్రథమ హక్కులు ఉన్నాయన్నది వారెవరూ గుర్తించదల్చుకోలేదుకాబట్టి! తెలంగాణ ఏమైనా ఫర్వాలేదు కానీ.. వాళ్ల రిజర్వాయర్లు నిండితే చాలు.. వాళ్ల పొలాలు పండితే చాలు! పాలించే ఏ సీమాంధ్రుడైనా.. లక్ష్యం ఇదే! అక్కడే తెలంగాణకు కృష్ణమ్మను కాకుండా చేసేందుకు కుట్ర మొదలైంది. ఆ కుట్ర ఒక్కసారి.. ఒక్కరోజుది జరిగింది కాదు. కలిసిన తొలిరోజు నుంచే ఒక పద్ధతి ప్రకారం తమ కుట్రను అమలు చేస్తూ వచ్చారు. హైదరాబాద్ రాష్ట్రంలో రూపుదిద్దుకున్న ఎగువ కృష్ణా, భీమా, నందికొండ ప్రాజెక్టులు సమైక్య రాష్ట్రం కారణంగా స్థలం మారి, రూపు మారి, ఆయకట్టు తగ్గిపోయి కొరగాని ప్రాజెక్టులుగా మిగిలిపోయాయి. రెండు దశాబ్దాలుగా సీమలో పారుతున్న శ్రీశైలం ప్రాజెక్టు జలాలు ఇప్పటికీ తెలంగాణ పొలాలను తడుపలేదు.

25లక్షలు సాగులోకి వచ్చి ఉండాలి
బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా నదిలో తెలంగాణ వాటా 298 టీఎంసీలుగా తేల్చింది. అంటే అంత నీరు ఉపయోగించుకుంటే మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కనీసం 25 లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చి ఉండాలి. ఈ ఐదు దశాబ్దాల్లో నాలుగు జిల్లాల్లో కలిపి సాగులోకి వచ్చింది నికరంగా 7 లక్షల ఎకరాలు మాత్రమే. తాజాగా బ్రజేష్ మిశ్రా ట్రిబ్యునల్ మరోసారి సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు 190 టీఎంసీలు అదనంగా కేటాయించింది. గతంలో బచావత్ కేటాయించిన 811 టీఎంసీలను బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 1001 టీఎంసీలకు పెంచుతూ నివేదిక ఇచ్చింది. పరివాహక నియమాల ప్రకారం మన రాష్ట్ర నీటి వాటా తేల్చాలని మన రాష్ట్రం ఇప్పుడు న్యాయపోరాటం చేస్తున్నది. అదనపు కేటాయింపుల్లో ప్రధాన వాటా మన రాష్ర్టానికే దక్కాలి. మొత్తంగా కనీసం 400 టీఎంసీలు తెలంగాణకు రావాలి. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌లకు తాగునీరు అందించడంతోపాటు 30 లక్షల ఎకరాలకు అవసరమైన సాగునీటిని కృష్ణానుంచే తీసుకోవాలి. కృష్ణానదిలో నీళ్లు లేవన్నది బూటకం. 2010-11లో 402.78 టీఎంసీలు, 2011-12లో 209.07 టీఎంసీలు, 2012-13లో 55.58 టీఎంసీలు, 2013-14లో 433 టీఎంసీలు బంగాళఖాతం పాలయ్యాయి. మనం కరువు సంవత్సరంగా భావిస్తున్న ఈ సంవత్సరంలో కూడా 74.33 టీఎంసీలు బంగాళాఖాతంలో కలిశాయి. ఇవన్నీ అధికారిక లెక్కలే. కృష్ణాలో నీళ్లు లేవన్నది కేవలం తెలంగాణ ప్రజలను మాయం చేయడంకోసమే.
ప్రాజెక్టులే తరలిపోయాయి
సమైక్యపాలనలో తెలంగాణ ఎంతగా నష్టపోయిందంటే.. 10 లక్షల ఎకరాలను సాగులోకి తేవడానికి ఉద్దేశించిన నందికొండ ప్రాజెక్టు కాస్తా నాగార్జునసాగర్ అయింది. రెండు ప్రాంతాలకు సమానంగా 132 టీఎంసీలు ఇవ్వాలన్న పథకాన్ని కాస్తా మార్చి ఎడమకాలువ కింద కూడా సుమారు 37 టీఎంసీలను కృష్ణాజిల్లా ఆయకట్టుకు మళ్లించారు. తెలంగాణలో ఆయకట్టును తొలుత 7.9 లక్షల ఎకరాలుగా నిర్ణయించి, ఆ తర్వాత 6.65 లక్షల (నల్లగొండ జిల్లా 3.88 లక్షలు, ఖమ్మం జిల్లా 2.77 లక్షలు) ఎకరాలకు కుదించారు. నందికొండ గ్రామానికి ఎగువన నిర్మించవలసిన ప్రాజెక్టును నందికొండ దిగువకు దింపి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు అన్యాయంచేశారు. వాస్తవికంగా రెండుజిల్లాల్లో కలిపి ఇప్పుడు 5 లక్షల ఎకరాలకు మాత్రమే నీరందుతున్నది. రెండు పంటలకూ కలిపి 13 లక్షల ఎకరాలు సాగు కావలసిన నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కేవలం ఖరీఫ్ 5 లక్షలు, రబీ రెండు లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతున్నది. గ్రావిటీద్వారా మమబూబ్‌నగర్‌కు నీళ్లు ఇవ్వాల్సిన ఎగువ కృష్ణ ప్రాజెక్టు (ఆ పేరుతో వచ్చినవే ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు) మనకు కాకుండాపోయింది. ఎప్పుడో 1937లోనే రూపకల్పన చేసిన భీమా ప్రాజెక్టు కూడా మనకు దక్కలేదు. భీమా, ఎగువ కృష్ణా ప్రాజెక్టులు పూర్తయి, వాటిపై మన నీటి హక్కులను అప్పుడే సాధించుకుని ఉంటే ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే 5.5 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చి ఉండేది. ఈ రెండు ప్రాజెక్టులూ నిర్మించ తలపెట్టిన నదీప్రాంతాలు రెండూ ప్రతి ఏటా తప్పనిసరిగా విరివిగా నీరు లభించే ప్రాంతాలు.

మనకు కాకుండా పోయిన భీమా
భీమా ప్రాజెక్టు నిర్మాణాన్ని అనేక ప్రాంతాలను పరిశీలించిన తర్వాత యాద్గిర్ సమీపంలోని తంగడి వద్ద 6.66 కోట్లతో చేపట్టాలని అప్పటి నీటిపారుదల ఇంజినీర్లు నిజాం ప్రభుత్వానికి నివేదించారు. తంగడి వద్ద ఏ సంవత్సరమైనా సగటున 243 టీఎంసీల నీరు లభిస్తుందని నీటిపారుదల ఇంజినీర్లు అంచనాలు వేశారు. అయితే ఆ ప్రాజెక్టు ఆచరణకు నోచుకోలేదు. ఆ తర్వాత హైదరాబాద్ ప్రభుత్వం మరోసారి అధ్యయనంచేసి ప్రాజెక్టును తంగడి వద్దే నిర్మించాలని, 107 టీఎంసీల నీటిని ఉపయోగంలోకి తేవాలని భావించింది. 29.8 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యంతో 6.79 కిలోమీటర్ల పొడవు ఆనకట్టతో రిజర్వాయరును నిర్మించాలని, 241 కిలోమీటర్ల పొడవున కాలువ నిర్మించి 5,98,579 ఎకరాల భూమిని సాగులోకి తేవాలని అప్పటి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అంతేకాదు ఈ ప్రాజెక్టుపై ఎడమ కాలువను ఒక్కదానినే నిర్మించాలని, కుడివైపున ఉన్న భూభాగాలకు ఎగువ కృష్ణా ప్రాజెక్టు కుడికాలువ నుంచి నీరు ఇవ్వవచ్చునని కూడా ఈ ప్రాజెక్టు నివేదికలో పేర్కొన్నారు. ఎగువ కృష్ణా ప్రాజెక్టు ద్వారా అప్పటి గుల్బర్గా, రాయచూర్, బీజాపూర్ జిల్లాలకు సాగునీరు అందించడంతోపాటు అలంపురం, గద్వాల తాలుకాల్లో 54 టీఎంసీల నీటితో 1.50 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తేవాలని హైదరాబాద్ రాష్ట్రం సంకల్పించింది. 1951లో జరిగిన ఇంటర్ స్టేట్ కాన్ఫరెన్సులో ఈ మేరకు అంగీకారం కూడా కుదిరింది. కానీ 1956 రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ తెలంగాణ తలరాతను తిరగరాసింది. ఎగువ కృష్ణా ప్రాజెక్టు స్థలం కర్ణాటకలో కలసిపోవడంతో వారు ప్రాజెక్టు రూపురేఖలు మార్చేశారు. కనీసం భీమా ప్రాజెక్టు అయినా పూర్తి చేస్తారని తెలంగాణ ప్రాంతవాసులు ఆశించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా ప్రజాపనుల విభాగం(పీడబ్ల్యూడీ) భీమా ప్రాజెక్టుపై ఒక నివేదికను తయారు చేసి అప్పటి నీలం సంజీవరెడ్డి ప్రభుత్వానికి సమర్పించింది. ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని కోరింది. ఈ ప్రాజెక్టును ఐదేండ్లలో పూర్తి చేయవచ్చునని, ఈ ప్రాజెక్టువల్ల కరువు పీడిత మహబూబ్‌నగర్ దశ-దిశ మారిపోతుందని సూచించింది. సీజనుకు 3 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పండింవచ్చునని, ఎకరా పొలం సాగుకు అయ్యే నీటి ఖర్చు 15 రూపాయలుంటుందని, ఎకరా చెరకు పండించడానికయ్యే నీటి ఖర్చు 22.50 రూపాయలు మాత్రమేనని ఆ నివేదిక పేర్కొంది. ఈ ప్రాజెక్టు జిల్లా ప్రజల జీవితాలను మార్చివేస్తుందని, ఆర్థికంగా సంపద్వంతం చేస్తుందని ఆ నివేదిక సూచించింది. ఈ ప్రాజెక్టు నిర్మించే స్థలం యాద్గిర్‌కు సమీపంలోని తంగడి కన్నడ ప్రాంతంలో ఉన్నా 80 శాతం భూమి మహబూబ్‌నగర్ జిల్లాలోనే సాగులోకి వచ్చేది. మక్తల్ నుంచి కొల్లాపురం వరకు 4 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేది. ఆ ప్రాజెక్టులేవీ చేపట్టలేదు. మహబూబ్‌నగర్‌కు దక్కాల్సిన సుమారు 150 టీఎంసీల నీరు(భీమా నుంచి 100 టీఎంసీలు, ఎగువ కృష్ణ నుంచి 50 టీఎంసీలు) సమైక్య పాలన నిర్వాకం వల్ల చేజారిపోయాయి. అప్పట్లో ప్రాజెక్టులు చేపట్టకపోవడం వల్ల ఆ తర్వాత ట్రిబ్యునళ్లలో నీటి కేటాయింపులు జరుగలేదు.

జూరాలకు మాత్రం 17.84 టీఎంసీలు, రాజోలిబండకు 15.9 టీఎంసీలను కేటాయించారు. జూరాలకింద సాగు లక్ష్యం లక్ష ఎకరాలు మాత్రమే. రాజోలిబండ మళ్లింపు కాలువ కింద 87400 ఎకరాలు సాగు చేసుకునే అవకాశం ఉన్నా రాయలసీమ నేతల దౌర్జన్యాల కారణంగా ఏ సంవత్సరమూ 25000 ఎకరాలకు మించి సాగుచేసుకోలేని దుస్థితి ఏర్పడింది. రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం శ్రీశైలం వద్ద తాను చేస్తున్న అక్రమాలనుంచి దృష్టి మళ్లించడానికి కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలు ప్రారంభించింది. కల్వకుర్తి కింద 2.6 లక్షల ఎకరాలు, భీమా కింద 2,02 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు కింద 2 లక్షల ఎకరాలు మొత్తం 6.62 లక్షల ఎకరాలు సాగులోకి తేబోతున్నట్టు ప్రకటించారు. కానీ ఈ రోజుకు మూడు ప్రాజెక్టుల కింద సాగులోకి వచ్చిన భూమి నికరంగా 16000 ఎకరాలు మాత్రమే. పదేండ్లు గడచిపోయాయి. వందలకోట్లు ఖర్చు చేశారు. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న విధంగా పనులు నిలిచిపోయాయి. జిల్లాలో మొత్తంగా ఇన్నేళ్ల తర్వాత అన్ని ప్రాజెక్టుల కింద కలిపి నికరంగా 25-30 టీఎంసీల నీటిని కూడా వాడుకోలేని దుస్థితి. మొత్తం సాగయ్యే భూమి రెండు లక్షల ఎకరాలకు తక్కువే.

పోతిరెడ్డిపాడులో ప్రవాహం.. ఎస్‌ఎల్‌బీసీ కుంటి నడక
మహబూబ్‌నగర్ ఉత్తర తాలూకాలు, నల్లగొండ జిల్లా కరువు ప్రాంతమైన దేవరకొండకు నీరందించే డిండి(దుందుభి) నది ఎండిపోయి చాలా కాలమయింది. రాయలసీమకు నీరందించే పోతిరెడ్డిపాడు-శ్రీశైలం కుడికాలువ ఇరవైయ్యేండ్లుగా నీరుపారిస్తున్నా, అదేసమయంలో ఆమోదం పొందిన శ్రీశైలం ఎడమ కాలువ ఇప్పటికీ కుంటి నడక నడుస్తున్నది. శ్రీశైలం ఎడమకాలువకు ప్రత్యామ్నాయంగా తెచ్చిన మాధవరెడ్డి ప్రాజెక్టు కింద 2.2 లక్షల ఎకరాలు సాగులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇప్పటికీ అరవై వేల ఎకరాలు కూడా సాగు కావడం లేదు. మూసీ కింద సగం ఆయకట్టు మాత్రమే సాగవుతున్నది. మూసీనది మురికి కూపంగా మారిపోయింది. ఐదు దశాబ్దాల తర్వాత కూడా జిల్లాలో మొత్తం సాగవుతున్న భూమి కేవలం నాలుగు లక్షల ఎకరాలు. సుమారు 150 టీఎంసీల నీటిని వినియోగించుకునే హక్కు ఉన్న నల్లగొండ జిల్లాల్లో ఇప్పుడు వినియోగించుకుంటున్నది 70 నుంచి 80 టీఎంసీలకు మించదు. రంగారెడ్డి జిల్లా కృష్ణా పరివాహక ప్రాంతం. ఈ జిల్లాలో వికారాబాద్ కొండలకు పశ్చిమ వైపు నుంచి మొదలయ్యే కాగ్నా నది భీమా నదిలో కలుస్తుండగా, కొండల తూర్పు వైపు నుంచి మొదలయ్యే మూసీ నది నల్లగొండ మీదుగా కృష్ణా నదిలో కలుస్తుంది. అయినా ఈ జిల్లాకు నీరందించే ప్రయత్నం ఎప్పుడూ జరగలేదు.

తెలంగాణ రైతుకు లక్షల కోట్లు నష్టం
తెలంగాణలో ముందునుంచీ తలపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్ల గత ఇక్కడి రైతాంగం గతంలో కనీసం పదివేల టీఎంసీల నీటిని నష్టపోయింది. ఒక్క టీఎంసీ నీటితో పండే వరి ధాన్యం విలువ కనిష్టంగా 25 కోట్ల రూపాయంటుందని వ్యవసాయ ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఆ విధంగా చూస్తే ఇన్నేళ్లలో ఇక్కడ రైతాంగం లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు. ఇప్పటికీ నష్టపోతున్నారు. వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసిన దుస్థితికి నెట్టివేయబడ్డారు. వీటన్నింటికీ ఒకటే పరిష్కారం కృష్ణా నదిలో మనకు హక్కుగా సంక్రమించిన ప్రతి చుక్క నీటిని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు మళ్లించడమే. ఈ ప్రయత్నంలో భాగంగానే ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల ప్రాజెక్టులను త్వరిత గతిన పూర్తి చేయడంతోపాటు కొత్తగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూపకల్పన జరుగుతున్నది.