గెలుస్తున్నదెవరు? ఓడుతున్నదెవరు?

వసంతం మళ్లీ వస్తుంది!

ఆకు రాలిపోయిందని చెట్టు కూలిపోతుందా
కొత్త చిగురు రాకుండా వసంతమెళ్లి పోతుందా?
ఆశలు వమ్మయ్యాయని మనిషి నేలకొరగాలా?
ఆశయాలు గెలవకుండా కాలమాగిపోతుందా?
బలిదానం బలహీనత, బలిదానం పరాజయం
బలిదానం తలొంచడం!
పోరాటం ధీరత్వం, పోరాటం వీరోచితం!
తెలంగాణ లయిస్తుంది, తెలంగాణ జయిస్తుంది!
రేపటి వెలుగులకోసం మీ తనువులు నిలపండి!
వచ్చే వసంతంకోసం మీ నవ్వులు ఆపండి!
ఆత్మహత్యలు ఓటమిని అంగీకరించడం. పరాజయ భావనతో కుంగిపోవడం. కానీ మనం ఓడిపోయామా? పరాజయభారంతో కుంగిపోవలసిన దుస్థితిలో ఉన్నామా? లేదు-మనం గెలిచాం. గెలుస్తున్నాం. ఇక ముందు కూడా గెలుస్తాం…తెలంగాణపై 30కి పైగా పార్టీలను ఒప్పించి, లేఖలు ఇప్పించి, దేశవ్యాప్త ఏకాభిప్రాయాన్ని కూడగట్టి, దీక్షలు చేసి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు కేంద్రం నుంచి ప్రకటన ఇప్పించగలిగాం. అది మనం సాధించిన తొలివిజయం. తెలంగాణకు అడ్డం పడినవాళ్లను, అడ్డంగా మాట్లాడినవాళ్లను, రాజీపడినవాళ్లను తెలంగాణ సమాజం వెలివేస్తున్నది. చీత్కరిస్తున్నది. వాళ్లను దోషులుగా చూస్తున్నది. ఈసడించుకుంటున్నది. అడుగడుగునా ఓడిస్తున్నది. ఓడిపోతున్నది  తెలంగాణ వ్యతిరేకులు! గెలుస్తున్నది తెలంగాణను ప్రేమిస్తున్నవారు. తెలంగాణ సాధనకోసం పోరాడుతున్నవారు! ఇవ్వాల తెలంగాణలో బిక్కం మొహం వేసుకుని తిరుగుతున్నది ఎవడు? తప్పు చేసిన భావనతో బిత్తర చూపులు చూస్తున్నది ఎవడు? జనం కళ్లలోకి సూటిగా చూడలేకపోతున్నది ఎవడు? విశ్వాసరాహిత్యంతో దివాళా అంచున నిలబడ్డది ఎవరు? రాళ్లు, చెప్పులు, కోడిగుడ్లు ఎవరిపై పడుతున్నాయి? జనానికి మొహాలను చాటేస్తున్నది ఎవరు? తెలంగాణలో పుట్టి, తెలంగాణలో ఎమ్మెల్యేలయి, మంత్రులయి దొంగచాటుగా పర్యటనలు చేస్తున్నది ఎవరు? వందలాది మంది పోలీసుల పహారా లేకుండా చివరికి సొంత ఊళ్లకు వెళ్లలేని దుస్థితి ఎవరిది? వాళ్లు తెలుగుదేశం, కాంగ్రెస్ నేతలు. ఓడిపోయింది వాళ్లు. ఓడిపోతున్నది వాళ్లు. పరాజయభారంతో కుంగిపోవలసింది, కుమిలిపోవలసింది వాళ్లు. చేసిన తప్పులకు చెంపలేసుకోవలసింది వాళ్లు. రాజకీయ ఆత్మహత్యలు చేసుకుంటున్నది వాళ్లు. గెలుస్తున్నది తెలంగాణవాదులు, తెలంగాణవాదం! తెలంగాణ ఇక తెలంగాణవాదులదే. రెండు కళ్లకు, వెయ్యి కాళ్లకు, వంద నాలుకలకు ఇక్కడ స్థానం లేదు. మొన్న పన్నెండు శాసనసభస్థానాల ఉప ఎన్నికలు అదే రుజువు చేశాయి.  పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నిక ఏం చెప్పింది? నిన్న ఆరు శాసనసభ స్థానాల ఉప ఎన్నికలు అదే విషయం కుండబద్ధలు కొట్టినట్టు చెప్పాయి. ఇక ముందంతా ఇదే బాట. తెలంగాణను వాళ్లివ్వడం లేదు. మనం తీసుకుందాం. తెలంగాణలో తెలంగాణవాదుల ప్రమేయం లేకుండా చీమ కూడా కదలని పరిస్థితి తీసుకొద్దాం. అసెంబ్లీలో తెలంగాణవాదులబలం పెరిగే కొద్దీ ఏమి జరుగుతుందో నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో చూశాం. భవిష్యత్తు అంతా మనదే. అందుకే తెలంగాణను ప్రేమించే బిడ్డలెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. మనం గెలుస్తున్నాం. వాళ్లు ఓడిపోతున్నారు. వాళ్లది మోసం. మనది ఆశయం. వాళ్లది ద్రోహం. మనది లక్ష్యాన్ని సాధించుకోవాలన్న పటిమ. ఏవిధంగా చూసినా మనం గెలుపు బాటలో ఉన్నాం. మనం చేయాల్సింది కుంగిపోవడం, కృశించిపోవడం కాదు. మనకు పెరగాల్సింది కసి, పట్టుదల. మనకు కావాల్సింది నిరాశా, నిస్పృహలు కాదు. వెన్నుచూపని మొండితనం, మొక్కవోని ధైర్యం.

ఏ విజయమూ యుద్ధం మొదలు పెట్టగానే రాదు. ఏ శత్రువూ పోరాడకుండా ఓటమిని అంగీకరించడు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం విఫలమయిందని భారతీయులు ఆత్మహత్యలు చేసుకుంటే మలి స్వాతంత్య్ర పోరాటం నడిచేదా? ‘స్వాతంత్య్రం నా జన్మహక్కు’ అని బాలగంగాధర తిలక్ పిలుపునిచ్చిన తర్వాత నాలుగు దశాబ్దాలకు దేశం ఆ హక్కును సాధించుకుంది. మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం మొదలు పెట్టిన తర్వాత 27 ఏళ్లకు బ్రిటిష్ పతాకం అవనతమై, ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగిరింది. ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, సంపూర్ణ సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా….ఎన్ని ఉద్యమాలు గడిచిన తర్వాత ఈ దేశం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది? జలియన్‌వాలాబాగ్ వంటి దురంతాలు, లాఠీలు, తూటాలు, స్త్రీలపై అత్యాచారాలు, వేలాది మంది జాతీయ నాయకుల అరెస్టులు ఇవేవీ యువకులను ఆత్మహత్యకు పురికొల్పలేదు. దెబ్బతిని కిందపడిన ప్రతీసారి, రెట్టించిన స్వేచ్ఛాకాంక్షతో, ఉవ్వెత్తున ఎగసిపడింది యువత. దెబ్బకు దెబ్బతీయడానికి ఉపక్రమించారే తప్ప, తనువులు చాలించలేదు. కుంగిపోలేదు. లొంగిపోలేదు. భగత్‌సింగ్ ఎలా స్పందించాడు? బ్రిటిష్ పోలీసుల దమనకాండలో లాలా లజపత్‌రాయ్ మరణానికి ప్రతీకారంగా బ్రిటిష్ సైన్యాధికారి శాండర్స్‌ను కాల్చిచంపడమే కాక, పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో పొగ బాంబులు విసిరి, బ్రిటిష్ మూకల చేతిలో ఉరికంబం ఎక్కాడు. చంద్రశేఖర్ ఆజాద్ బ్రిటిష్ సైన్యాధికారులతో వీరోచితంగా పోరాడి నేలకొరిగాడు. ఉధంసింగ్ జలియన్‌వాలాబాగ్ దురంతానికి ప్రతీకారంగా 21 సంవత్సరాల తర్వాత అప్పట్లో పంజాబ్  గవర్నర్‌గా పనిచేసిన మైకేల్ డయ్యర్‌ను కాల్చి చంపాడు. సుభాష్‌చంద్రబోస్ స్వయంగా ఒక సైన్యాన్నే ఏర్పాటు చేసి బ్రిటిషర్లపై యుద్ధం ప్రకటించారు. బొంబాయిలో నావికులు తిరుగుబాటు చేశారు. ఉద్యమాల్లో ఎగుడుదిగుళ్లు ఉంటాయి. గాంధీ ఉద్యమాన్ని ముందుకు ఉరికించిన సందర్భాలున్నాయి. అర్ధంతరంగా ఉద్యమాలను ఉపసంహరించిన సందర్బాలూ ఉన్నాయి. కానీ ఎవరి దారి వారిదే. విప్లవకారులు ఒకవైపు, అతివాదులు మరోవైపు, మితవాదులు ఇంకోవైపు విడివిడిగా జమిలిగా స్వాతంత్య్రం కోసం పోరాడారు. స్వాతంత్య్రం వచ్చింది.

హైదరాబాద్ విముక్తికోసం జరిగిన పోరాటంలోనూ తెలంగాణ ప్రజలు తెగువ చూపారే తప్ప వెన్ను చూపలేదు. ఆత్మహత్యలకు పాల్పడలేదు. పల్లెలపై దాడులు చేసిన దేశముఖుల గుండాలను, రజాకారు తండాలను దెబ్బకుదెబ్బ కొట్టారే తప్ప కుంగిపోలేదు. గెరిల్లా యుద్ధాలు, మెరుపుదాడులతో నిజాంను ఇక పరిపాలించలేని స్థితికి తీసుకువచ్చారు తెలంగాణ ప్రజలు. దేశాలు, జాతుల విముక్తి పోరాటాల చరిత్ర నిండా ఇటువంటి ఉదంతాలు కోకొల్లలు. ఎదిరించాలే తప్ప బెదిరిపోకూడదు. పోరాడాలే తప్ప పారిపోకూడదు. ఎప్పటికయినా విజయం మనదే. ప్రజాస్వామిక బలాలన్నీ తెలంగాణ పక్షాన ఉన్నాయి. తెలంగాణ ద్రోహులది మందబలం, మనీబలం, నియంతృత్వం. కానీ ప్రజాబలం ముందు వీళ్లు ఎక్కడ నిలబడతారు? కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మొన్నటి ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డాయి. డబ్బును నీళ్ల ప్రాయంగా ఖర్చుపెట్టాయి. పోలీసులను ఉపయోగించి తెలంగాణవాదులను కట్టడిచేసే ప్రయత్నం చేశాయి. అయినా టిడిపికి మూడు చోట్ల డిపాజిట్లు పోయాయి. కాంగ్రెస్ పతనం అంచున నిలబడింది. ఇదంతా తెలంగాణవాదుల గెలుపు కాదా? తెలంగాణను వ్యతిరేకిస్తున్నవారికి తెలంగాణలో భవిష్యత్తు లేకుండా చేయడం ఒక్కటే ఇప్పుడున్న పరిష్కారం. మన తుది విజయం అందులోనే ఉంది. మన రాజకీయ అస్తిత్వం అందులోనే  ఉంది.

తెలంగాణ ఉద్యమం ఇప్పుడు మధ్యలో ఉంది. అన్ని ఉద్యమాల్లో ఉన్నట్టే ఇందులో ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఒకప్పుడు ఉధృతంగా, మరోసారి మంద్రంగా ఉద్యమం సాగవచ్చు. అంతమాత్రం చేత తెలంగాణ ఉద్యమం వీగిపోదు. ఇది తాటాకు మంటకాదు. నాలుగు కోట్ల మంది హృదయాల్లో జ్వలిస్తున్న మంట. తెలంగాణ జీవనాడుల్లోకి అల్లుకుపోయిన ఉద్యమం ఇది. నిజమే, ఈ గడ్డమీద సైంధవులు, శల్యులు, శకునులకు కొదువలేదు. ఇందులో రాజకీయ నాయకులున్నారు. మేధావులున్నారు. ఒకడు సమైక్యవాది జెండా నీడన కూర్చుని పిచ్చిపట్టినవాడిలా అనునిత్యం తెలంగాణ ఉద్యమం మీదకే రాళ్లు విసురుతుంటాడు. మరొకడు నిన్నమొన్నటిదాకా తెలంగాణా ఎలా రాదో చూస్తాం అంటూ గర్జించినవాడు, చిన్నపదవి ఇవ్వగానే ఉద్యమం చల్లారిందంటాడు.  2014 నాటికి ఇంకా చప్పబడిపోతుందంటాడు. ఇంకొకడు ఒళ్లు అలవకుండా తెలంగాణకోసం నిజంగా పోరాడుతుంది తామేనని రంకెలు వేస్తుంటాడు. మరో పెద్దాయన వెర్రిని వేదాంతంగా, పిచ్చిని సిద్ధాంతంగా చెలామణిచేస్తూ కారుకూతలు కూస్తుంటాడు. బుడ్డగోచిని, పిలకజుట్టును ముడేసే ప్రయత్నం చేస్తుంటాడు. మోకాలును, బోడిగుండును కట్టేద్దామని చూస్తుంటాడు. తెలంగాణ రానేరాదు పొమ్మంటాడు. వంకరగా చూడడం ఆయన ఫిలాసఫీ. ఆ కళ్లకు విద్వేషపు పొరలు తప్ప,  సైద్ధాంతిక దృష్టిలేదు. ఆ హృదయానికి పైశాచికానందం తప్ప, తెలంగాణ గుండెను తడిమే ఉద్దేశం లేదు. ఆ మెదడుకు శ్లేష్మంలో కొట్లాడ్డంతప్ప విశాలయుద్ధ ప్రాతిపదిక ఏదీ లేదు. వీళ్లను చూసి జాలిపడాలి తప్ప, మన గుండెలు జారవిడుచుకోవద్దు. వీళ్లు మారాలని ప్రార్థించాలి తప్ప, వీళ్లకోసం చనిపోవద్దు. మారకపోతే వీళ్లను దండించాలి తప్ప, మనం బలికాకూడదు. మనం గెలుస్తున్నాం. మనం గెలుస్తాం. తెలంగాణ సాధించుకుని తీరతాం. ఉద్యమం పడింది పడినట్టే ఉండదు. 2009 ఎన్నికల తర్వాత తెలంగాణ ఉద్యమం ఇంత ఉధృతంగా ఎగసిపడుతుందని అనుకున్నామా? కేసీఆర్ దీక్ష సమయంలో కేంద్రం తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేస్తుందని ఊహించామా? మన ఉద్యోగలోకం 42 రోజులపాటు చారిత్రాత్మకంగా సమ్మె చేయగలదని అనుకున్నామా? ఇంతకంటే తీవ్రమైన ఉద్యమాలు ఇంకా చెలరేగవచ్చు. తెలంగాణ నినాదాన్ని విజయపథానికి నడిపించవచ్చు. ఆశ, ఆశయం లేకపోవడం పేదరికం. అవి రెండూ ఉంటే భవిష్యత్తు మనదే.

అఖిలేశ్, లోకేశు, చంద్రబాబు…

‘మేము మాయావతి విగ్రహాలను కూల్చం’, ‘గూండాగిరికి పాల్పడితే సొంత పార్టీవారినయినా సహించబోము’, ‘రాజకీయాలే అటువంటివి. గత ఎన్నికల్లో మేము ఓడాం, ఈ ఎన్నికల్లో గెలిచాం. వచ్చేసారి మేము ఓడిపోవచ్చు. అదే విధంగా రాహుల్ ఈసారి ఓడిపోయారు, వచ్చేసారి గెలవచ్చు. ప్రతీకార రాజకీయాలకు తావులేదు’-ఈ వ్యాఖ్యలు వింటుంటే ఎంతో పరిణతి చెందిన, తలపండిన రాజకీయ వేత్త చేసినట్లు అనిపిస్తాయి. కానీ 38 ఏళ్లకే రెండుసార్లు ఎంపీగా గెలిచిన అఖిలేశ్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడిన తర్వాత, అధికారం తమ చేతికి రావడం ఖాయమైన తర్వాత ఉడుకురక్తం ఉరకలెత్తే ఒక యువ రాజకీయ వేత్త చేసిన వ్యాఖ్యలివి. ఆయన ఈ మాటలకు కట్టుబడి ఉంటారా? భవిష్యత్తంతా ఇంతే నిబ్బరంగా ఉంటారా? అన్నది ఇప్పుడే చెప్పలేకపోవచ్చు. ఆచరణలో ఆయన పార్టీ కార్యకర్తలు గూండాగిరిని నిలిపివేయడమూ వెంటనే సాధ్యం కాకపోవచ్చు. కానీ ఒక మంచి రాజకీయ నాయకుడికి ఉండాల్సిన సంయమనం, సౌమ్యత, పరిణతి ఆయనలో ఉన్నాయని మాత్రం ఈ మాటలను బట్టి తెలుస్తున్నది. ఐదురాష్ట్రాలకు ఎన్నికలు జరిగినా ఉత్తర ప్రదేశ్ ఫలితాలే దేశ రాజకీయాలను ఎక్కువగా ప్రభావితం చేశాయి. అక్కడి గెలుపోటములే భవిష్యత్తు రాజకీయాలను నిర్ణయిస్తాయి. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 22 లోక్‌సభ స్థానాలు ఉంటే ఒక్క ఉత్తర ప్రదేశ్‌లోనే 80  స్థానాలు ఉన్నాయి. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ 21, బిఎస్‌పి 20 లోక్‌సభ స్థానాలను గెల్చుకోగా, ఎస్‌పి 23 స్థానాలను గెల్చుకుంది. 2004లో 9 లోక్‌సభ స్థానాలను మాత్రమే గెల్చుకున్న కాంగ్రెస్‌కు 2009 ఎన్నికల ఫలితాలు పెద్ద ఉత్సాహాన్నే ఇచ్చాయి. ఆ ఎన్నికల్లో 91 శాసనసభ స్థానాల పరిధిలో కాంగ్రెస్‌కు మెజారిటీ వచ్చింది. ఆ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహాన్ని ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హరించి వేశాయి.

2009 ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఆత్మవిశ్వాసం వికటించి కాంగ్రెస్ నాయకులతో అతిగా మాట్లాడించింది. దిగ్విజయ్‌సింగ్, సల్మాన్ ఖుర్షీద్, బేనిప్రసాద్ వర్మ, రీటా బహుగుణ, చివరికి రాహుల్‌గాంధీ కూడా తరచూ మాట మీరుతూ వచ్చారు. అన్నా హజారే, రాందేవ్ వంటి వారిపై దిగ్విజయ్ సింగ్ నోరుపారేసుకోవడం పట్టణ మధ్య తరగతిలో కొంత విస్మయాన్ని కలిగించినమాట వాస్తవం. రాజకీయాల్లో దురుసుతనాన్ని, అధికార దురహంకారాన్ని రెండింటినీ ఉత్తర ప్రదేశ్ ప్రజలు తిరస్కరించారు. రాజకీయ దురుసుతనానికి కాంగ్రెస్ ప్రతీకగా మారితే, అధికార దురహంకారానికి, దుర్వినియోగానికి మాయావతి తార్కాణంగా మిగిలారు. మరో విషయం ఏమంటే, రాహుల్‌గాంధీని వారసత్వ భారం ఒకటి వెంటాడుతూ వచ్చింది. ఉత్తరప్రదేశ్ వెనుకబాటుకు సంబంధించిన ప్రతిపాపంలోనూ రాహుల్‌గాంధీకీ వాటా ఉందన్న వాదాన్ని ఎస్‌పి సమర్థంగా ప్రజలకు వివరిస్తూ వచ్చింది.బుందేల్‌ఖండ్ గురించి రాహుల్ ఎంత మాట్లాడారు? ఏం చేశారు? కేంద్రంలో ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉండీ ఉత్తరప్రదేశ్‌కు ఏమీ చేయలేకపోగా ఎలా పడితే అలా, అతిగా మాట్లాడారు. ఆ అతి కొంపలు ముంచింది.

మాయావతి అతి చేష్టలను, అధికార దుర్వినియోగాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్లు, కాంగ్రెస్ నేతల అతిని కూడా జీర్ణించుకోలేకపోయారు. బిజెపి ‘న ఘర్‌కా, నఘాట్‌కా’ అన్నట్టు ఎవరికీ దగ్గర కాలేకపోయింది. బిజెపికి ఒక ఎజెండా, ఫోకస్, బలమైన, జనాకర్షణ కలిగిన నాయకత్వం లేకుండా పోయాయి. ముస్లింలను నొప్పించ కూడదన్న ధ్యాసతో నరేంద్రమోడిని సైతం ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచిన బిజెపి అగ్రనాయకత్వం, ఇటు హిందువులను, అటు ముస్లింలను ఎవరినీ పూర్తిస్థాయిలో పార్టీ వెనుక సంఘటిత పర్చలేకపోయింది. సమాజ్‌వాది పార్టీ ఈ పార్టీలు చేసిన తప్పులేవీ చేయకుండా చాలా నింపాదిగా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ పోయింది. అఖిలేశ్ యాదవ్ జనానికి అతీతమైన నాయకునిగా, ఎక్కడి నుంచో దిగివచ్చిన నాయకునిగా కాకుండా, జనంలో ఒకడిగా కలసిపోయి, వారితో ఐడెంటిఫై కావడానికి కృషి చేశారు. ప్రజలతో  హుందాగా, సౌమ్యంగా ఉండడానికి అఖిలేశ్ ప్రయత్నించారు. ప్రభుత్వ వ్యతిరేకత, సామాజిక సమీకరణలు అందుకు తోడయ్యాయి. ఇవన్నీ 2014లో కూడా అఖిలేశ్‌కు కలసి వస్తాయా? ఇప్పుడున్న ఈ ప్రతిష్ఠను కాపాడుకోవడంపైనే ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

కాంగ్రెస్‌కు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఒక గుణపాఠం. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఐదు రాష్ట్రాల్లో 36 లోక్‌సభ స్థానాలను గెల్చుకుంది. ఉత్తరప్రదేశ్‌లో గెల్చుకున్న 21తోపాటు పంజాబ్‌లో 8, ఉత్తరాఖండ్‌లో మొత్తం 5 స్థానాలను కాంగ్రెస్ గెల్చుకుంది.  2014లో ఎన్ని గెలవబోతుందన్నది యూపీఏ మనుగడను నిర్ధారిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం చూస్తే ఉత్తర ప్రదేశ్‌లో అమెథీ, రాయ్‌బరేలీతో సహా అన్ని స్థానాల్లోనూ పరిస్థితి కష్టంగానే ఉంది. పంజాబ్‌లో 2009 లోక్‌సభ ఎన్నికల్లో బలహీనపడిన అకాలీదళ్ మళ్లీ బలపడి, తిరిగి అధికారంలోకి వచ్చింది. ఉత్తరాఖండ్‌లోనూ కాంగ్రెస్ పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. గోవా ఏకపక్షంగా బిజెపిని వరించింది. కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీస్తున్నదని ఈ ఫలితాలు తేటతెల్లం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉంటే పంజాబ్, ఉత్తరాఖండ్‌లలోనయినా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ బలపడి ఉండాలి. అలా జరగలేదు. కాంగ్రెస్ మూడేళ్ల క్రితం నాటికీ నేటికీ దెబ్బతిన్నది. కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత కాంగ్రెస్‌ను దెబ్బతీసి ఉండవచ్చు. క్షీణించిన ప్రతిష్ఠను పునరుద్ధరించుకోవడానికి కాంగ్రెస్‌కు రెండేళ్ల సమయం ఉంది. నిలబెట్టుకున్నా, కూలిపోయినా కాంగ్రెస్ స్వయంకృతమే అవుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడా మెరుగుపడలేదు. పైగా గత ఎన్నికల్లో 33 లోక్‌సభ స్థానాలను అందించిన ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ పతనం అంచున ఉంది. తెలంగాణ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆంధ్ర ప్రాంతం ఎలాగూ కాంగ్రెస్‌కు దక్కే అవకాశం లేదు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం ద్వారా కనీసం ఈ ప్రాంత ప్రజల మనసులను గెల్చుకోవడానికి ఆ పార్టీకి ఇప్పటికీ అవకాశం ఉంది. కేరళలో ఐదేళ్లకు ఒకసారి తీర్పులు మార్చే అలవాటు అక్కడి ప్రజలకు ఉంది. అలా జరిగితే కాంగ్రెస్‌కు అది అశనిపాతమే. తమిళనాడు సరేసరి. ఎటొచ్చీ కాస్త మెరుగుపడే అవకాశం ఉంది కర్ణాటకలోనే.

కొత్త బెలూన్‌లలోకం

ఉత్తరప్రదేశ్‌లో సైకిల్ గెలిచింది కాబట్టి ఇక్కడ కూడా సైకిల్ వస్తుందని చంద్రబాబు ఆశపడుతూ ఉండవచ్చు. అఖిలేశ్ లాగే లోకేశ్ కూడా ఎదిగి వస్తారని ఆయన సంబరపడిపోవచ్చు. ఏ తండ్రి అయినా అలా ఆశించడం అసహజం కాదు, కానీ నిజంగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన దానికి, ఇక్కడి రాజకీయాలకు సంబంధం ఉందా? పోలిక ఉందా? చంద్రబాబు ఉందని చెబుతారు. ఎందుకంటే చెదరిపోతున్న పార్టీ శ్రేణులను కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు ఏవో బెలూన్‌లు ఎగరేస్తూ ఉండడం చంద్రబాబు రాజకీయ వ్యూహంలో భాగం. సైకిల్‌కు గెలిచిన చరిత్రతోపాటు ఓడిన వారసత్వమూ ఉంది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టిన సైకిల్ మణిపూర్‌లో ఇదే ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మణిపూర్ పీపుల్స్ పార్టీ ఇదే సైకిల్ గుర్తుతో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయింది. ఆ పార్టీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినడం వరుసగా ఇది నాలుగవసారి. అందువల్ల నాయకులు పోల్చుకోవలసింది గుర్తులను, కొడుకులను, పేర్లనూ కాదు, వారి లక్షణాలను, విధానాలను!

చంద్రబాబునాయుడు మాట్లాడుతున్న తీరు, ఉపయోగిస్తున్న భాష ఆయన లక్షణాన్ని తెలియజేస్తున్నాయి. మాయావతి విగ్రహాలపై అఖిలేశ్ చేసిన వ్యాఖ్య, చంద్రబాబుకు, ఆయనకు మధ్య తేడాను ఇట్టే పట్టిస్తుంది. ‘వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను తక్షణం తొలగించాలి. ప్రభుత్వం తొలగించకపోతే మేమొచ్చిన తర్వాత  కూల్చేస్తాం’ అని చంద్రబాబునాయుడు అధికారంలోకి రాకముందే ప్రకటించారు. ‘పందులని, గజదొంగలని, దున్నపోతులని’ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా నోటికి ఎంత మాటవస్తే అంతమాట ఉపయోగిస్తున్నారు. సభ్యత, సంస్కారం కోల్పోతున్నారు. ఆయనలో అసహనం నానాటికీ పెరుగుతున్నది.  అఖిలేశ్ అధికార పార్టీతో లేక ఇతర ప్రతిపక్ష పార్టీలతో ఘర్షణపూరిత రాజకీయాలకు దిగలేదు. మాటమార్చడం, మడమతిప్పడం చేయలేదు. అఖిలేశ్ అధికారపక్షాన్ని, ఇతర ప్రత్యర్థులను దుర్భాషలాడడం మాని, తాము ఏం చేయదల్చుకున్నారో, ఇతరులకంటే తాము ఎలా భిన్నమైన వారో చెప్పడంపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించారు. చంద్రబాబునాయుడు నిరంతరం ఘర్షణపూరిత రాజకీయాలకు దిగుతున్నారు. పాలకుర్తికి ఒక దండయాత్రగా వెళ్లారు. ప్రత్యర్థి పార్టీలపై విద్వేషపూరిత దాడులను, విష ప్రచారాన్ని చేస్తూన్నారు.

వీలైనన్ని అబద్ధాలను, ఇంకా వీలైనంత గట్టిగా, వీలైనంత ఎక్కువమందితో మాట్లాడిస్తే ఎన్నికల్లో చెలామణి కావచ్చునని, ప్రజలను బురిడీ కొట్టించవచ్చునని చంద్రబాబు భావిస్తున్నారు. ఆయన ఎంతసేపటికీ బుకాయించి, దబాయించి, గందరగోళం సృష్టిద్దామని యోచిస్తున్నారు తప్ప, హుందాగా, సౌమ్యంగా, సూత్రబద్ధ రాజకీయాలతో ప్రజల విశ్వాసాన్ని చూరగొందామన్న స్పృహలో లేరు. ఆయన ఇంకా ఆంధ్రప్రదేశ్ ఒక కంపెనీ అని, తాను సీఈఓనని భావిస్తున్నట్టున్నారు. ప్రజలను ఎలా మానేజ్ చేయాలా అని ఆలోచిస్తున్నారే తప్ప, ప్రజలతో ఎలా మమేకం కావాలా అని ఆలోచించడంలేదు. ఆశల బెలూన్‌లు ఎగరేసి, భ్రమల ఇంధ్ర ధనుస్సులను సృష్టించి పార్టీ శ్రేణులను కట్టిపడేయాలనుకుంటున్నారు తప్ప, క్షేత్రంలో నిలబడి పనిచేయాలని, పునాది ప్రజల్లో పోయిన నమ్మకాన్ని తిరిగి సాగు చేయాలని అనుకోవడం లేదు.  క్లిష్టమైన సమస్యలను దాటవేయాలని, తప్పించుకోవాలని చూస్తున్నారే తప్ప, వాటిని పరిష్కరించి దక్షుడయిన నాయకునిగా పేరు తెచ్చుకోవాలను కోవడం లేదు. ఎప్పటికప్పుడు కొత్త తప్పులు చేస్తున్నారు తప్ప, చేసిన తప్పులు దిద్దుకునే ప్రయత్నం చేయడం లేదు. అవకాశవాద వైఖరితో ఎటూ కొరగాకుండా పోతున్నారే తప్ప, ఒక స్పష్టమైన విధానాన్ని చెప్పి జనం హృదయాలను గెల్చుకోవాలని చూడడం లేదు. ఒకసారి అబద్ధం చెబితే, మాటమార్చితే ఇంట్లో వాళ్లే నమ్మరు. ఇన్ని లక్షలు, కోట్ల మంది ఎలా నమ్ముతారు? చంద్రబాబు అసలు సమస్య ఇదే. దీనిని అధిగమించకుండా ఏం చేసినా, ఎన్ని చెప్పినా ప్రయోజనం ఉండదు.

ఒకటే లక్ష్యం, ఒకటే నిర్ణయం

తెలంగాణ సాధనకోసం ఇప్పటివరకు జరిగిన ప్రయోగాలు చాలు. అన్ని పార్టీలతో తెలంగాణవాదానికి జైకొట్టించడంకోసం, క్రమంగా శక్తిని కూడగట్టుకోవడం కోసం తెలంగాణవాదులు ఒకప్పుడు కాంగ్రెస్‌తో, మరొకప్పుడు టిడీపీతో పొత్తులు పెట్టుకోవలసి వచ్చింది. తెలంగాణ వాదానికి అన్ని పార్టీల ఆమోదాన్ని సంపాదించడానికి అది ఉపయోగపడిన మాట వాస్తవం. ఎన్నికల పొత్తులే ఒక్కోసారి ఒక్కోపార్టీకి తెలంగాణకు జైకొట్టకతప్పని రాజకీయ అనివార్య పరిస్థితులను సృష్టించాయి. అటువంటి ఒకానొక రాజకీయ అనివార్యత కారణంగానే తెలుగుదేశం సైతం ఆరోజు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానం చేసింది. ఆ అనివార్యత తీరిపోగానే ఆ పార్టీ రాజకీయ, ప్రజాస్వామిక మర్యాదలనన్నింటినీ విస్మరించి అవకాశవాదంతో వ్యవహరించింది. తెలంగాణకు ద్రోహం చేసింది. కాంగ్రెస్‌ది ఇంకా దారుణం. అవసరమైనప్పుడల్లా తెలంగాణను అడ్డంపెట్టుకుని లాభపడడం, ఆ తర్వాత వంచించడం ఆ పార్టీకి అలవాటుగా మారింది. ఈ రెండు పార్టీలూ తెలంగాణలో బలంగా ఉండడం వల్లనే, రెండు పార్టీలకూ తగిన సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండడం వల్లనే ఇన్ని ఆటలు ఆడగలిగాయి. ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు సకల జనుల సమ్మె సందర్భంగా నిర్ణయాత్మకంగా వ్యవహరించి ఉంటే తెలంగాణ సమస్య అప్పుడే తేలిపోయేది. కానీ ఆ పార్టీలు అలా చేయలేవు. ఎందుకంటే ఆ పార్టీల పగ్గాలు  సీమాంధ్ర నాయకత్వాల చేతిలో ఉన్నాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆ రెండు పార్టీల ఎమ్మెల్యేలు సీమాంధ్ర నాయకత్వాల కనుసైగల ప్రకారం మాత్రమే పనిచేస్తారని అనేక సందర్భాల్లో రుజువయింది. ఆ రెండు పార్టీల తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు స్వతంత్రించి వ్యవహరించలేరని, తెలంగాణ రాష్ట్ర సాధన సంగతి దేవుడెరుగు కనీసం తెలంగాణ ప్రయోజనాలకోసమైనా పోరాడలేరని, మాట్లాడలేరని పలుసార్లు అనుభవమయింది.  సీమాంధ్ర ఆధిపత్యాల కింద ఉన్నంతకాలం ఈ పార్టీల ఎమ్మెల్యేలు ఇందుకు భిన్నంగా వ్యవహరించే అవకాశం లేదు.

ఇటువంటి పరిస్థితుల్లో ఇకపై ఏం చేయాలి? తెలంగాణకు అడ్డం పడకుండా ఈ పార్టీలను కట్టడి చేయడం ఎలా? అవకాశవాద వైఖరితో తెలంగాణ ప్రజలతో ఆటలాడుకుంటున్న ఈ పార్టీలను దారికి తేవడం ఎలా? ఇందుకు మిగిలిన ఏకైక మార్గం – తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పక తప్పని అనివార్య పరిస్థితులను సృష్టించడం. అందుకు రెండు మార్గాలు- మొదటిది, రెండు పార్టీలలోని తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వాలపై మరోసారి ఒత్తిడి తెచ్చి నిర్ణయం చేయించడం. రెండవది, ఈ రెండు పార్టీలకు తెలంగాణలో రాజకీయ భ విష్యత్తు లేకుండా చేయడం. గతంలో ఎటువంటి రాజకీయ అనివార్యత సృష్టించి చంద్రబాబు మెడలు వంచారో ఇప్పుడు అటువంటి అనివార్యతే మరోసారి సృష్టించాలి. తెలంగాణ తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాగస్వరానికి తోకలు ఆడించడం మానుకుని, ఎన్నికల మ్యానిఫెస్టోకు కట్టుబడి ఉండే విధంగా చంద్రబాబును ఒప్పించడానికి ప్రయత్నించాలి. 2008లో కూడా దేవేందర్‌గౌడ్ వంటివారు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం చేయాలని గట్టిగా కొట్లాడి ఒత్తిడి పెంచారు కాబట్టే చంద్రబాబు కమిటీ వేసి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం చేశారు. ఇప్పుడు అటువంటి ప్రయత్నమే మరోసారి జరగాలి.

తెలుగుదేశాన్ని కాపాడుకోవడం కోసమైనా తెలంగాణ నేతలు చంద్రబాబును ఒప్పించక తప్పదు. తెలంగాణపై చంద్రబాబు తన వైఖరిని మరోసారి స్పష్టం చేయనంతకాలం ఇక్కడి ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందే అవకాశమే లేదు. కాంగ్రెస్‌కు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. అధిష్ఠానాలను ఒప్పించడం లేకపోతే రాజకీయంగా అస్తిత్వాన్ని కోల్పోవడం ఏదో ఒకటి తేల్చుకోవలసిన అగత్యం తెలుగుదేశం, కాంగ్రెస్ నాయకుల ముందుంది.  తెలుగుదేశం, కాంగ్రెస్‌లు తెలంగాణపై తేల్చనప్పుడు ఇక ఇక్కడి ప్రజలకు మిగిలిన ప్రత్యామ్నాయం ఏమిటి- తెలంగాణ విషయంలో స్పష్టమైన విధానాన్ని తీసుకోవడమే కాకుండా, రాజీలేకుండా పోరాడుతున్న పార్టీలను గెలిపించడం. టీఆరెస్, బిజెపి, సిపిఐ, న్యూడెమోక్రసీ, బిఎస్‌పి…..ఏపార్టీ అయినా పర్వాలేదు. కేవలం ఉప ఎన్నికల్లోనే కాదు, ఇకముందు జరిగే ప్రతి ఎన్నికలోనూ తెలంగాణ ఓటరు నిర్ణయాత్మకంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. తెలంగాణపై స్పష్టమైన వైఖరిని అవలంబించలేని నాయకుడెవరూ తెలంగాణలో గెలవడానికి వీలులేని పరిస్థితి రావాలి.

తెలంగాణపై స్పష్టత, ఏకీభావం ఉన్న శక్తులన్నీ ఒక వేదిక మీదకు రావాలి. టీఆరెస్, సిపిఐల మైత్రి ఈ దిశగా ఒక మంచి ముందడుగు. తెలంగాణలో ఇవ్వాల ఒక్క సిపిఎం తప్ప మిగిలిన వామపక్ష శక్తులన్నీ తెలంగాణ కోరుకుంటున్నాయి. సిపిఐ, న్యూడెమోక్రసీ చాలా స్పష్టమైన వైఖరితో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం కృషి చేస్తున్నాయి. ఎన్ని అవరోధాలు ఎదురయినా అదరక బెదరక ఒకే విధానాన్ని కొనసాగిస్తున్న పార్టీలు అవి. అటువంటి శక్తులతో టీఆరెస్ ఒక దీర్ఘకాలిక విధానంతో కలసి పనిచేయవలసిన అవసరం ఉంది. పరస్పర విశ్వాసం ప్రాతిపదికగా ఈ సంబంధాలు కొనసాగాలి. రాజకీయ సంబంధాల్లో పరస్పర ప్రయోజనమూ ముఖ్యమే. ఇచ్చి పుచ్చుకునే ధోరణి కూడా ఇరుపక్షాలకూ అవసరం. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న పార్టీగా ఈ విషయంలో టీఆరెస్సే చొరవ, విశాల దృష్టిని ప్రదర్శించాలి. ఈ దోస్తీ 2014 దాకా కొనసాగాలి.

తెలుగుదేశానికి మద్దతు ఇవ్వలేకపోవడం బాధాకరమే అని నారాయణ అన్నట్టు కొన్ని పత్రికల్లో వచ్చింది. ఆయన నిజంగానే బాధ పడ్డారో లేక ఆయన తరఫున ఆ పత్రికలు బాధపడ్డాయో తెలియదు అచ్చులో అయితే వచ్చింది. నారాయణ బాధ పడవలసింది ఏముందో అర్థం కాదు. ఇది బంధుత్వాల వ్యవహారం కాదు. చంద్రబాబు చిరకాల మిత్రుడూ కాదు. రాజకీయ సంబంధాల విషయంలో చంద్రబాబునాయుడు ఎంత నిర్దయగా వ్యవహరిస్తారో 1998, 1999లలోనే రుజువైంది. రాత్రికిరాత్రి యునైటెడ్ ఫ్రంట్ జెండా దించేసి, ఎన్‌డిఎ జెండా ఎలా పట్టుకున్నారో రాష్ట్ర ప్రజలకు అందరికీ ఇప్పటికీ జ్ఞాపకమే. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ ఒక్క సీటు కూడా గెలవలేదు. అప్పుడు చంద్రబాబు తన విశ్వరూపం చూపించారు. సిపిఐని కనీసం అఖిలపక్ష సమావేశాలకు కూడా పిలువకుండా అవమానించిన పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకి చంద్రబాబు. కమ్యూనిజానికి కాలం చెల్లిందని, ఇక టూరిజమే మిగిలిందని సిద్ధాంతీకరించిన చంద్రబాబును నారాయణ ఎలా మరచిపోగలరు?

1985, 1994, 1995లలో టీడీపీ-వామపక్షాల స్నేహం పరస్పర అవసరాలపై ఆధారపడ్డదే. 1995లో వామపక్షాలు సూత్రవిరుద్ధంగా, ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించి, వెన్నుపోటు అప్రదిష్ట నుంచి చంద్రబాబునాయుడును కాపాడాయి.  తాచెడినప్పుడల్లా మంచివాళ్లను ముందుపెట్టుకుని ఆత్మరక్షణ చేసుకోవడం చంద్రబాబు వ్యూహం. ఎవరితోనయినా పొత్తు పెట్టుకోవడానికి, నిరాకరించడానికి చంద్రబాబుకు ప్రయోజనమే ప్రాతిపదిక. సూత్రబద్ధత ఏమీ ఉండదు. 2009లో కూడా మహాకూటమి ఆవిర్భావానికి అవసరమే ప్రాతిపదిక అయింది. ఆశల వల విసరడం, పొత్తులోకి లాగడం, తర్వాత వెన్నుపోటు పొడవడం….ఇవన్నీ చంద్రబాబు పాచికలు. 2009లో టీఆరెస్ విషయంలో చంద్రబాబు చేసింది ఇదే. మహాకూటమి విఫలం కావడానికి చంద్రబాబు, ఒక పత్రికాధిపతి ఎలా దోహదం చేశారో, తెరవెనుక ఎంత కుట్ర జరిగిందో సిపిఐ అగ్రనాయకులకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఉప ఎన్నికల్లో కూడా చంద్రబాబు మళ్లీ అదే పాచికతో ప్రయత్నాలు చేశారు. తెలుగుదేశం ప్రతినిధులు సిపిఎం వద్దకు వెళ్లి మనం మనం సమైక్యవాదులం అన్నట్టు మాట్లాడారు. సిపిఐ వద్దకు వెళ్లి మేమూ తెలంగాణవాదులమే అన్నట్టు మాట్లాడారు. ఇలా రెండు నాల్కలు వినిపించడంలోని జాణతనం చంద్రబాబుకు మొదటి నుంచీ అలవాటే.

ఏ సూత్రానికీ కట్టుబడకుండా, ఏ విధానానికీ నిబద్ధుడు కాకుండా, ఎన్ని అడ్డదారులు తొక్కయినా, ఎన్ని రకాలుగా మభ్యపెట్టి అయినా, ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసి అయినా, అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకుని అయినా రాజకీయాల్లో చెలామణి కావాలన్నది చంద్రబాబు సరళి. ఇటువంటి నీతి కొంతకాలం నడుస్తుంది. కొన్నిసార్లు ఫలిస్తుంది. ఎల్లకాలం ఎలా పనిచేస్తుంది. అందుకే చంద్రబాబుకు ఇవి దుర్దినాలు. ఇటువంటి నేతతో ఏ పార్టీ అయినా ఎలా చేతులు కలుపుతుంది? సిపిఐకి సూత్రబద్ధమైన వైఖరి ఉండాలి. ఒక ఉద్యమం మధ్యలో, సంక్షోభ సమయంలో, ఆకాంక్షల విఫలభూమిలో నిలబడి నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర డిమాండు విషయంలో పిల్లిమొగ్గలు వేస్తున్నవారితో చేతులు కలిపితే చేసుకున్న పుణ్యం కాస్తా చెరువుపాలవుతుందని ఆ పార్టీకి తెలుసు. తెలంగాణ రాకపోవడంలో తెలుగుదేశం పాపమూ ఉందని తెలంగాణవాదులందరూ నమ్ముతున్నట్టుగానే తెలంగాణ ప్రాంతంలోని సిపిఐ నాయకత్వమూ నమ్ముతుంది. కష్టమయినా నష్టమయినా సూత్రబద్ధమయిన విధానంతో ముందుకు పోవాలని వారు భావించారు. 2014 ఎన్నికల్లో  ఏం జరుగబోతోందన్న వాదనతో నిమిత్తం లేకుండా ప్రస్తుతానికి ధర్మబద్ధంగా వ్యవహరించాలని వారు నిర్ణయించారు.

తెలంగాణ ప్రజలు కూడా పాలను నీళ్లను వేరు చేసినట్టు ద్రోహులెవరో, చిత్తశుద్ధితో నిలబడినవారెవరో గుర్తించి ఓటు వేయవలసిన అవసరం ఉంది. ఒకటే లక్ష్యం-తెలంగాణ సాధన, ఒకటే నిర్ణయం-అందుకు నిజాయితీగా కృషి చేసే వాళ్లను గుర్తించి ఎన్నుకోవడం. ఉద్యమం ముందా ఓటు ముందా అన్న మీమాంస  ఇప్పుడు అనవసరం. విడివిడిగా జమిలిగా అన్ని ప్రవాహమై సాగాల్సిందే. ఉద్యమం చేసేవారిని ఎవరూ ఆపలేరు. ఓటును అర్థవంతంగా ఉపయోగించడమూ ఉద్యమమే. ఓటు కూడా ఆయుధమే. ఇకపై ప్రతి సందర్భమూ తెలంగాణపై తీర్పు చెప్పే సందర్భమే కావాలి. నోరుపెట్టుకుని బతకాలనుకుంటున్న వాళ్లకు కీలెరిగి వాతపెట్టాలి.