తెలంగాణ నిరీక్షణ

నిరాశ దూసుకొచ్చినప్పుడల్ల్లా
ఏదో ఒక ఆశల పరిమళం
దానిని కమ్ముతూనే ఉంది…
మౌనం బద్ధలవుతుందని
నిష్క్రియ అంతమవుతుందని
సందిగ్ధాన్ని పటాపంచలు చేస్తుందని
ఎదురు చూపులు ఆగిపోతాయని
ఆధిపత్య విగ్రహం కూలిపోతుందని
అస్తిత్వపతాకం రెపరెపలాడుతుందని…
తెలంగాణ ఒక వానకారు కోయిల!

నిస్సత్తువ ఆవరించినప్పుడల్లా
ఏదో ఒక కొత్త శక్తి విచ్చుకుంటూనే ఉంది…
రాజకీయాల్లో జోగుతున్న మస్తిష్కాలను మండించేందుకు
శ్రీకాంతాచారో, యాదిరెడ్డో, భోజ్యానాయకో
ఎవరో ఒకరు కొవ్వత్తులవుతూనే ఉన్నారు…
ఆధిపత్య తండాల దండయాత్రలపై
పిడికిలెత్తలేని, ప్రశ్నించలేని రాజకీయ జీవచ్ఛవాలను నిలేస్తూ
మల్లయ్యో, మల్లేషో, మహేందరో, రహీమున్నీసానో
ఎవరో ఒకరు సాయుధులవుతూనే ఉన్నారు…
అయోమయం అలుముకున్నప్పుడల్లా
ఏదో ఒక మెరుపుతీగ తళుక్కుమంటూనే ఉంది..
.
అయినా ఒక భయం. ఒక ఉత్కంఠ. ఏమవుతుందోనన్న దేవులాట. కేసీఆర్ మాట నమ్మాలని ఉంటుంది. నిజం కావాలని ఉంటుంది. కానీ నిజం కాదేమోనన్న ఆందోళన. ఇంతకుముందు చాలా సార్లు ఇలా జరిగిందన్న జ్ఞాపకం వెక్కిరిస్తూ ఉంటుంది. నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్‌కు అలవాటైన విద్య అని, మళ్లీ అలాగే చేస్తుందేమోనని అనుమానం. ఏదైనా స్పష్టమైన నిర్ణయం వచ్చేవరకు ఎవరినీ నమ్మలేని పరిస్థితి వచ్చేసింది. కేసీఆర్ మాటను కూడా నమ్మకపోవడానికి, శంకించడానికి, ఎగతాళి చేయడానికి ఈ నేపథ్యమే కారణం. మరి కేసీఆర్ ఎందుకు ఇలా చెబుతున్నారు? కారణాలు ఏమై ఉంటాయి. ఒకటి, నిజంగానే ఆయనకు స్పష్టమైన సంకేతం ఉండవచ్చు. కేంద్రం నుంచి ఎవరో ఒకరు రాయబారం జరుపుతూ ఉండవచ్చు. రెండు, కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచడానికి ఇలా చేయడం ఒక వ్యూహంగా అయన భావిస్తూ ఉండవచ్చు.  ఇలా చెప్పి చెప్పి, కొంత దూరం వెళ్లాక కాంగ్రెస్ ఇస్తానని చెప్పి, ఇవ్వలేదని, మళ్లీ మోసం చేసిందని చెప్పడానికి ఒక ప్రాతిపదిను నిర్మించడానికి ఆయన ఈ సంకేతవాదాన్ని ముందుకు తెచ్చి ఉండవచ్చు.  మూడు, ఒక విశ్లేషకుడి అంచనా ప్రకారం-‘తెలంగాణ అదిగో అల్లంతదూరంలో ఉంది…ఇక వచ్చేసినట్టే అని నమ్మించగలిగితేనే తెలంగాణవాదం సజీవంగా ఉంటుంది. ఎర్రను చూపి చేపను పట్టడం వంటి విన్యాసం ఇది. అలా కాకుండా తెలంగాణ ఇక వచ్చే అవకాశమే లేదు అనుకున్నప్పుడు వాదం బలహీనపడవచ్చు లేద విపరీత రూపాలు తీసుకోవచ్చు. తెలంగాణ ఇవ్వం, ఇక రాదు అని కేంద్రం ప్రకటిస్తే ప్రజల మనస్తత్వంలో చాలా మార్పువస్తుంది. తెలంగాణవాదులు మరింత సంఘటితమై తీవ్రరూపంలో పోరాడనూవచ్చు లేదా చెల్లా చెదరై బలహీనపడిపోనూవచ్చు. అందుకే కేసీఆర్ పదేపదే అదిగో వస్తోందన్న వాదాన్ని ముందుకు తెస్తూ ఉండవచ్చు’. కారణం ఏదైనా కావచ్చు కానీ తెలంగాణ ఇప్పుడు ఒక సందిగ్ధం ఒడ్డున నిలబడి ఉంది. కేసీఆర్ మాట నాన్నా పులి ఆట కాకూడదని అందిరి హృదయాల్లో తన్లాట. ఈసారి దెబ్బతింటే ఇంకా ఎంత నష్టపోవలసివస్తుందోనని దిగులు!

మొదట రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఏదో జరుగుతుందన్నారు. తర్వాత ఉప రాష్ట్రపతి ఎన్నికల తర్వాత నిర్ణయం వచ్చేస్తుందన్నారు. ఇలా ఎప్పటికప్పుడు ఒక ఉద్విగ్నత తెలంగాణ ప్రజలను తరుముతూనే ఉంది. ఇప్పుడు వెంటనే పార్లమెంటు సమావేశాలు మొదలయ్యాయి. పార్లమెంటు సమావేశాల్లో టీ కాంగ్రెస్ ఎంపీలు తమవంతుగా ఏదో ఆందోళన చేయాలని చూశారు. కానీ అమ్మవారి ఆగ్రహంతో తొలిరోజే చల్లారిపోయారు. ఆమె ఆశాజనకంగా మాట్లాడిందని ఒక వాదన, లేదు చీదరించుకుందని మరొక వాదన బయటికి వచ్చాయి. మిగిలినవారెవరూ ఏమీ మాట్లాడడం లేదు. టీడీపీ చేతులు కట్టుకుని కూర్చుంది. టీఆరెస్‌కు ఉన్న ఇద్దరు ఎంపీలు ఇంకా ఢిల్లీ వెళ్లలేదు. అసలు ఢిల్లీలో ఏ అలికిడీ లేదు. అయినా సందర్భం వచ్చిన ప్రతిసారీ కేసీఆర్ ధీమాగా తెలంగాణ కల సాకారం కాబోతోందని చెబుతున్నారు. అసలేం జరుగబోతోంది? అంతటా ఇదే ప్రశ్న. ఇటీవల ఎక్కడ పదిమంది కలసినా ఇదే మాట. ప్రతి విందు కార్యక్రమంలోనూ ఇదే చర్చ. ‘ఇంతదూరం వచ్చాక, ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణపై వెనుకడుగు వేస్తే కేసీఆర్ ఏమని సమాధానం చెబుతారు? ఇదిగో అదిగో అని చేసిన ప్రకటనలను ఎలా సమర్థించుకుంటారు?’- ఒక పెద్ద మనిషి ప్రశ్న. ‘ఉద్యమాలు చేయకుండా ఈ  ఉత్తమాటలు ఎందుకు? కొట్లాడేవారితో చర్చలు జరుపుతారు కానీ మాట్లాడేవారిని ఎవరు పట్టించుకుంటారు?’- ఇంకో న్యాయవాది నిస్పృహ. ‘కేసీఆర్ చొరవ తీసుకోకపోవడం వల్ల తెలంగాణ ఉద్యమం నీరుగారిపోతోంది. నిర్లిప్తత కారణంగా ఉద్యమంపై, టీఆరెస్‌పై విశ్వాసం సడలిపోతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2014 నాటికి మనల్ని ఎవరూ నమ్మని పరిస్థితి వస్తుంది?’- మరో మేధావి సూత్రీకరణ. ‘మీరేమయినా చెప్పండి. ఏదయినా కేసీఆర్‌తో జరగాల్సిందే. ఏమీ లేకుండానే ఆయన ఇవన్నీ మాట్లాడి ఉండడు. కాంగ్రెస్ తేల్చకపోతే ఉద్యమిస్తామని కూడా చెబుతున్నారు కదా.’- ఒక విద్యావంతుని సమర్థన.

కేసీఆర్ చెబుతున్నట్టు తెలంగాణ వస్తే, ఈ వాదనలన్నీ వాటంతట పూర్వపక్షం అయిపోతాయి. ఏదైనా తేడా వస్తేనే సమస్య.  ఈ సంధికాలంలో ఒకటి మాత్రం జరుగుతున్నది. తెలంగాణలో రాజకీయ శక్తుల పునరేకీకరణ లేక సమీకరణ ఆగిపోయింది. తెలంగాణ ఉద్యమం సంఘటితం కావడం నిలిచిపోయింది. ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా తయారయింది. తెలంగాణకోసం పోరాడాలన్న జీల్ మరుగుగునపడుతున్నది. ఉద్యమ స్ఫూర్తి అడుగునపడిపోయి జేఏసీకి, టీఆరెస్‌కు మధ్య విభేదాలు తెరమీదకు వస్తున్నాయి. తెలంగాణపై వైఖరి చెప్పాలని కాంగ్రెస్, చంద్రబాబు, జగన్‌లపై ఇంతకాలంగా వస్తున్న ఒత్తిడి బలహీనపడిపోయింది. ఇంతకాలం సమయం చూసుకుని తెలంగాణ ఉద్యమం వైపు దూకుదామని కాచుకు కూర్చున్న తెలంగాణ తెలుగుదేశం తమ్ముళ్లు, కొంత మంది కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు  ఎక్కడివాళ్లు అక్కడే సర్దుకుంటున్నారు. తెలంగాణకోసం క్రియాశీలంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ఎంపీలు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనుకకు వేస్తున్నారు. తెలంగాణ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం నుంచి బయటికి వచ్చిన నాగం జనార్దనరెడ్డి వంటి వారు సొంత ప్రత్యామ్నాయాల గురించి యోచిస్తున్నారు. ఇంకొందరు కాంగ్రెస్, తెలుగుదేశం ఎమ్మెల్యేలు జగన్ వెంట వెళితే ఎలా ఉంటుందని అంచనాలు వేయడంలో మునిగిపోయారు. కొండా సురేఖ లేక ఇతర వైఎస్సార్‌సీపీ నాయకులు స్వయంగా తెలంగాణకోసం కొట్లాడరట. తెలంగాణ రాకపోతే మాత్రం కేసీఆర్‌పై పోరాడతారట. తెలంగాణపై కేంద్రానికి మరోసారి లేఖ ఇప్పిస్తామని చెబుతున్న తెలుగుదేశం తమ్ముళ్లు క్రమంగా మెత్తబడుతున్నారు. కొందరయితే తెలంగాణ రాకపోతే కేసీఆర్‌పై పడి రక్కుదామని కాచుకు కూర్చున్నారు.  తెలంగాణ అంశాన్ని పక్కనబెట్టి, ‘బీసీలకు పెద్దపీట, ఎస్సీల వర్గీకరణ నినాదాల’తో ప్రజల ముందుకు పోతే నెగ్గుకురాగలమని చంద్రబాబు యోచిస్తున్నారు. మొత్తంగా తెలంగాణ ప్రధాన ఎజెండాగా ఉండాల్సిన సమయంలో, అనేక ఇతర అంశాలు ఎజెండాలోకి వస్తున్నాయి.  తెలంగాణపై స్పష్టత ఇవ్వకుండానే తెలుగుదేశంలోనో, జగన్ పార్టీలోనో ఉండి ఎన్నికల్లో గెలవగలమన్న ధీమా కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీల్లో బలపడుతున్నది. తెలంగాణ కాక తగ్గడం వల్లనే ఈ ఆలోచనలు పురివిప్పుతున్నాయి. కాక తగ్గడం అంటే తెలంగాణవాదం బలహీనపడిపోవడం కాదు. తెలంగాణపై ఏదో ఒకటి తేల్చకుండా ఇక్కడ రాజకీయాలు చేయలేమన్న భయం తగ్గిపోవడం.

తెలంగాణలో ఎవరి పనుల్లో వాళ్లు, ఎవరి లెక్కల్లో వాళ్లు మునిగి తేలుతుంటే, అటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన పాచికలు తాను కదుపుతున్నారు. చంద్రబాబు పాలకుర్తి యాత్ర, విజయమ్మ సిరిసిల్ల దీక్షను వేలాది మంది రక్షక భటుల మధ్య విజయవంతంగా నడిపించిన ముఖ్యమంత్రి, సాధ్యమైనంత త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నారట. కోర్టు అనుమతిస్తే నవంబరులోనో డిసెంబరులోనో ఎన్నికలు తేవాలన్నది ప్లాను. లేదూ 2011 జనాభా లెక్కల ప్రకారమే నిర్వహించాలని కోర్టు తేల్చి చెబితే మాత్రం 2013 ఏప్రిల్ దాకా ఎన్నికలు ఉండకపోవచ్చు. కానీ అంతకాలం వాయిదావేయడానికి కోర్టు కూడా అనుమతించకపోవచ్చునన్నది ప్రభుత్వం అంచనా. అందుకే నవంబరు-డిసెంబరు మాసాల్లో 2001 జనాభా లెక్కల ప్రాతిపదికగా ఎన్నికలకు వెళ్లవలసి రావచ్చు. తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బకొట్టడానికి లేక తెలంగాణ పల్లెపల్లెలో సంఘటితంగా తెలంగాణవాదులను విడదీయడానికి ఈ ఎన్నికలను ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ పెద్దల వ్యూహం. ముందెప్పుడయినా ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత సర్పంచి ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సారి రివర్సులో ఈ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికల్లో పార్టీల గుర్తులు ఉంటాయి. ముందుగా ఆ ఎన్నికలు నిర్వహిస్తే తెలంగాణవాదులకు అడ్వాంటేజ్ రావచ్చు. దానిని అడ్డుకోవాలంటే పార్టీల గుర్తులతో నిమిత్తం లేకుండా జరిగే సర్పంచి ఎన్నికలు నిర్వహించాలని వారు యోచిస్తున్నారని ఒక ఉన్నతాధికారి ఇటీవల చెప్పారు. సర్పంచి ఎన్నికలనగానే ఊర్లన్నీ చీలిపోతాయి. తె లంగాణవాదం వెనుకపట్టు పడుతుంది. పాత పార్టీల అఫిలియేషన్లు, వ్యక్తిగత ఎజెండాలు ముందుకు వస్తాయి. అప్పటిదాకా ఒక్కటిగా ఉన్న తెలంగాణ శ్రేణులు గ్రూపులుగా చీలిపోతారు. ఆ తర్వాత జడ్‌పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే తెలంగాణవాదానికి, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర సమితికి రావలసిన ప్రయోజనం రాదని ప్రభుత్వ పెద్దల ఎత్తు. కానీ రాజకీయాలు గోడకట్టినట్టు, గీత గీసినట్టు, ముందుగా ప్లాను చేసినట్టు జరగకపోవచ్చు. చంద్రబాబు అయినా కిరణ్‌కుమార్‌రెడ్డి అయినా ఇలా ఆలోచిస్తున్నారూ అంటే వాళ్లకు ఆలోచించే సమయం, అవకాశం మనమే ఇచ్చాం. తెలంగాణ చుట్టూనే ఆలోచించే పరిస్థితులు లేకుండా చేశాం. ఉప ఎన్నికల విజయం తెలంగాణ ఉద్యమం ఊపును, కాకను పెంచాల్సిందిపోయి ఆశ్చర్యకరంగా ఒక స్తబ్దతను సృష్టించుకున్నాం. ఆ స్తబ్దతనుంచి బయటపడడం అవసరం. ఉద్యమం వేడి ఎంతగా ఉంటే తెలంగాణ సమస్య పరిష్కార సమయం అంతగా తగ్గుతుంది. ఇనుము వేడిగా ఉన్నప్పుడు ఎలా అంటే అలా మల్చుకోవచ్చు. చల్లారిన తర్వాత దానిని మల్చుకోవడం సాధ్యం కాదు. వెంటనే ఏదో ప్రళయం సృష్టించలేకపోవచ్చు, కానీ మరోలా జరిగితే తెలంగాణలో అందరం ఒక్కటే అని ఒక స్పష్టమైన సందేశం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. చర్చలకు, పరిష్కారానికి ద్వారాలు తెరిచి ఉంచుకోవడం ఎంత అవసరమో, తేడా వస్తే మిన్నూ మన్నూ ఏకం చేయడానికి సన్నద్దులుగా ఉండడమూ అంతే అవసరం.