Its Telangana, Gayatri Water fall

Unknown Beauties of Adilabad Forests:

A photo by Srikanth Reddy Peerlapally, Bengaluru

  
Near Gundi forests, Icchoda mandal, Adilabad Districts.

గోదావరి మళ్లింపు చంద్రబాబు చేసిన మంచిపని

godavaribesin
ఒక రోజు ఒక సభలో వెనుకబాటు తనం గురించి గంపెడు ఉపన్యాసాలు ఇస్తుంటే నా పక్కన కూర్చున్న ఓ పెద్ద మనిషి ఒక మాట అన్నాడు. ‘ఇన్ని మాటలు అనవసరం. ఒక్కో రైతుకు ఒక్క ఎకరాకు ఖర్చు లేకుండా సాగు నీరివ్వండి. వెనుకబాటుతనం, మూఢ నమ్మకాలు, ఆత్మహత్యలు…. అన్నీ అవే కనుమరుగవుతాయి’ అన్నాడు. అది నిజమనిపించింది. కృష్ణ, గోదావరి జిల్లాలోని పరిస్తితులను, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలను పోల్చి చూస్తె తేడా అర్థమవుతుంది. గోదావరిలో నిన్నటి రోజు కూడా 83000 క్యుసెక్ల నీరు అంటే రోజుకు 7.5 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నది. గత రెండు మాసాలుగా ఇలాగే జరుగుతున్నది. ఈ ఏడాది ఇప్పటికే 1000 టీ ఎంసీ ల నీరు బంగాళా ఖాతంలో కలిసిపోయింది.

కృష్ణాలో పైనుంచి నీరు వచ్చే అవకాశాలు తగ్గిపోయాయి. కృష్ణ నీటి నుంచి డెల్టాను పాక్షికంగా నైనా విముక్తి చేయగలిగితే తెలంగాణకు, రాయలసీమలకు మేలు జరుగుతుంది. నదీ జలాల వివాదం, పట్టిసీమ పంచాయతీ పక్కన పెడితే….గోదావరి నీటిని కృష్ణాకు తరలించుకు రావడం కచ్చితంగా చంద్రబాబు సాధించిన విజయమే. అందునా ఇప్పుడున్న కరువు పరిస్తితుల్లో ఇంత తొందరగా నీరు తీసుకు రావడం ఆయన చేసిన గొప్ప పనుల్లో ఒకటిగా మిగిలిపోతుంది.

గోదావరి కృష్ణ అనుసంధానం వల్ల ఎగువ రాష్ట్రాలకు కృష్ణా నీటిలో అదనంగా 80 టీఎంసీల వాటా దక్కుతుంది. తెలంగాణా ప్రాజెక్టులకు ఈ నీటిని కేటాయిన్చుకోవచ్చు. చంద్రబాబు ఎవరి విమర్శలనూ లెక్క చేయకుండా పని పూర్తి చేసుకు పోయారు. తెలంగాణా ప్రభుత్వం కూడా త్వరితగతిన నీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంపైనే ద్రిష్టిని కేంద్రీకరించాలి.

సెప్టెంబరు 17 తెలంగాణ స్వేచ్ఛాదినం!

14.09.2014

Reblogged

సీమాంధ్ర ఆధిపత్య శక్తులను ఖండించే క్రమంలో చాలా మంది నిజాం ప్రభువును ఊరేగించేదాకా వెళ్లారు. సీమాంధ్ర పెట్టుబడిదారుల కంటే నిజామే గొప్పవారని చెప్పేదాకా వెళ్లారు. భూస్వామ్య ప్రభువులెప్పుడూ ఆధునిక పెట్టుబడి దారుల కంటే ఉత్తముడూ ఉన్నతమైనవాడూ కాలేడు…మార్క్సిస్టు గతి తర్కం ప్రకారం. ఒకరిని ఖండించడంకోసం మరొకరిని ఎత్తుకోవడం మంచిది కాదు.

అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రజలకు సెప్టెంబరు 17 ఒక ప్రత్యేకమైన రోజు. తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఆ రోజును విద్రోహ దినమని కొందరు, విలీనదినమని మరికొందరు, స్వాతంత్య్రదినమని ఇంకొందరు వాదిస్తున్నారు. కానీ అందరూ ఒక మౌలిక అంశాన్ని విస్మరిస్తున్నారు. పార్టీలు, వారి రాజకీయ సిద్ధాంతాలు, వాదోపవాదాలతో నిమిత్తం లేకుండా ఆరోజు తెలంగాణ ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. నిజాం ప్రభువుకు మనం ఎంత గొప్ప భుజకీర్తులు పెట్టాలని ప్రయత్నించినా భూస్వామ్య, రాజరిక ప్రభువు ప్రజాస్వామిక ప్రభువు కాలేడు. సమాజం అభ్యున్నతికి అత్యవసరమైన రెండు అంశాల విషయంలో నిజాం ప్రభువువల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది.

మొదటి అంశం: 1948కి ముందు తెలంగాణ ప్రజలకు మాతృభాషలో చదువుకునే అదృష్టం కలుగలేదు. జిల్లాకు రెండు మూడు మల్టీపర్పస్ హైస్కూళ్లు ఉన్నా మెజారిటీ జన బాహుళ్యానికి చదువు అందుబాటులోకి రాలేదు. అప్పటి బోధనా భాష ఉర్దూ. ఇందుకు భిన్నంగా సీమాంధ్రలో ఆంగ్లేయుల పాలన కారణంగా మనకంటే వందేళ్ల ముందునుంచే చదువుకునే అవకాశాలు మెండుగా లభించాయి. తెలంగాణ, సీమాంధ్రల మధ్య ఈ వందేళ్ల వెనుకబాటు అంతరం నిన్నమొన్నటి వరకు కొనసాగుతూనే వచ్చింది. కృష్ణా జిల్ల గుడివాడ సమీపంలోని ఒక పల్లెటూరిలో 1950లోనే ఆడపిల్లలకోసం ఒక ప్రత్యేక పాఠశాలను ప్రారంభించగా, మా ఊళ్లో పదవ తరగతి చదువుకునే అవకాశం మాకు 1977లో మాత్రమే వచ్చింది. అంతకుముందు ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకో వలసిన దుస్థితి. అందువల్ల నిజాం హయాంలో విద్యావికాసం, సాంస్కృతిక జీవనానికి సంబంధించి మనం అహో ఒహో అని కీర్తించవలసింది ఏమీ కని పించదు. హైదరాబాద్‌లో నిర్మించిన మహాసౌధాలు, విశ్వవిద్యాలయ భవనాలు ఎస్టాబ్లిష్‌మెంట్ కోసమే, సామాన్య జనంకోసం కాదు. అవి ఇప్పుడు మనకు ఉపయోగపడినంత మాత్రాన నిజాం పరిపాలన అసలు స్వభావాన్ని నిందించ కుండా వదలివేయలేము. నిజాం కృషికి తగిన గుర్తింపునివ్వాలను కోవడం వరకు సమంజసమే కావచ్చు, కానీ గడచి కాలమంతా మంచిది కాదు. చెరువులు తవ్వించి ఉండవచ్చు, ప్రాజెక్టులు కట్టించి ఉండవచ్చు…కానీ అవి ఎవరికి ఉపయోగపడ్డాయన్నదే కీలకమవుతుంది. ప్రజలకా, రాజు, ఆయన తాబేదార్లకా? సీమాంధ్ర ఆధిపత్య శక్తులను ఖండించే క్రమంలో చాలా మంది నిజాం ప్రభువును ఊరేగించేదాకా వెళ్లారు. సీమాంధ్ర పెట్టుబడిదారుల కంటే నిజామే గొప్పవారని చెప్పేదాకా వెళ్లారు. భూస్వామ్య ప్రభువులెప్పుడూ ఆధునిక పెట్టుబడి దారుల కంటే ఉత్తముడూ ఉన్నతమైనవాడూ కాలేడు…మార్క్సిస్టు గతి తర్కం ప్రకారం. ఒకరిని ఖండించడంకోసం మరొకరిని ఎత్తుకోవడం మంచిది కాదు.

రెండవ అంశం: తెలంగాణలో నిజాం పాలనలో ఉన్నది పచ్చి భూస్వామ్య సమాజం. అత్యంత హేయమైన వెట్టిచాకిరీ, దాస్యం, దోపిడీ, అప్రజాస్వామిక ధోరణులకు తెలంగాణ ఆలవాలం. పటేల్, పట్వారీ, భూస్వామి ఏది చెప్పితే అదే చెలామణి కావడం అప్పటి రివాజు. ఎన్నికలు లేవు, ప్రజాప్రతినిధులు లేరు. అంతా ఏలికల ఇష్టం. దొరలు, భూస్వాములు, దేశ్‌ముఖులు జనాన్ని ఎంతగా పీడించుకుతిన్నారో, ఎంతగా పెత్తనం చెలాయించారో ఆనాటి చరిత్ర పుటలు చెబుతున్నాయి. ఇందుకు మినహాయింపులు ఉండవచ్చు. భూస్వామ్య కుటుంబాల నుంచి వచ్చినవారే కొందరు పుచ్చిపోయిన రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా గళమెత్తి గర్జించి ఉండవచ్చు. ప్రజల పక్షాన నిలబడి పోరాడి ఉంవచ్చు. కానీ ఒక వ్యవస్థ గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు మెజారిటీ భూస్వాములు, దేశ్‌ముఖులు ఎలా ఉన్నారన్నదే కొలమానమవుతుంది. ఈ వ్యవస్థ పునాదులపై వెలసింది ఏదైనా ఉత్తమమైనదే. స్వాగతించదగినదే. నిజాం ప్రజాస్వామిక వాది కాదు. ఆ రోజు అటు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కానీ, ఇటు కమ్యూనిస్టు పార్టీగానీ పోరాడింది నిజాం నుంచి విముక్తి పొందడం కోసమే. అందుకే 1948 సెప్టెంబరు 17న కేంద్రం పంపిన సేనలు హైదరాబాద్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు తెలంగాణ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ ఏర్పడిన సందర్భంగా 2014 జూన్ 2న ఎంత ఆనందపడ్డారో అరోజు కూడా అంతే ఆనందించారు. ఒక్క కమ్యూనిస్టులు మాత్రం కన్ఫ్యూజ్ అయిపోయారు. సైనిక చర్య నేపథ్యంలో కొందరు కమ్యూనిస్టు నాయకులు సాయుధపోరాటాన్ని విరమించాలని ప్రతిపాదించారు. మరికొందరు లేదు లేదు కొనసాగించాల్సిందేనని పట్టుబట్టారు, పంతానికి దిగారు. మావో సేటుంగ్ చైనాను విముక్తి చేసినట్టు మనం తెలంగాణను విముక్తి చేద్దామని కొందరు కామ్రేడ్స్ దుస్సాహసిక దుందుడుకు వాదానికి దిగారు. బ్రిటన్ భారత్‌కు వదిలేసిపోయిన సైన్యాల బలాన్ని కమ్యూనిస్టు నాయకత్వం తక్కువ అంచనా వేసింది. పర్యవసానంగా నిజాం నుంచి తెలంగాణ విముక్తిని కమ్యూనిస్టు పార్టీ ఒక ఉత్సవంగా జరుపుకోలేకపోయింది. కొత్తగా పెట్టుకున్న లక్ష్యాలు ఆ పార్టీని చాలా దూరం తీసుకెళ్లాయి. భారత సైనిక జనరల్ చౌధరి కమ్యూనిస్టులను ఊచకోత కోయించారు. సుమారు 4000 మంది మెరికల్లాంటి సాయుధ పోరాటయోధులను కోల్పోవలసి వచ్చింది. చివరికి ఎప్పుడో 1952లో సాయుధ పోరాటాన్ని విరమించి, ఎన్నికల రాజకీయాలకు దిగాల్సి వచ్చింది. అదేపనిని 1948 సెప్టెంబరు 17న చేసిన ఉంటే కమ్యూనిస్టులు తెలంగాణలో బలమైన శక్తులుగా ఎదిగి ఉండేవారు. మొత్తంగా సైనిక చర్య వల్ల ఒక భూస్వామ్య ప్రభుత్వం అంతరించి, ఒక జాతీయ ప్రజాస్వామిక ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే సివిల్ పాలన, ఆ తర్వాత ప్రజాస్వామిక పాలన వచ్చాయి. ఈ మార్పును ఎలా తిరస్కరించగలరు? ఈ మార్పులకు పునాది సెప్టెంబరు పదిహేడే అంటే ఎవరు కాదనగలరు?

సైనిక చర్య లక్ష్యం నిజాం కానే కాదని, కమ్యూనిస్టుల అణిచవేతేనని, అందుకే ఇది విద్రోహదినమని కొందరు అతివాద వామపక్ష మిత్రులు వాదిస్తున్నారు. అయితే వారు కొన్ని పరిణామాలను కావాలని విస్మరించి, మిగిలిన పరిణామాలను గురించే మాట్లాడుతున్నారు. నిజాంకు, భారత ప్రభుత్వానికి మధ్య ఏ దశలోనూ సయోధ్య లేదు. నిజాం ఆఖరి వరకు తనది స్వతంత్ర దేశమని, తన స్వతంత్ర ప్రతిపత్తిని కావాడాలని ఐక్యరాజ్యసమితిపైన, బ్రిటన్‌పైన, ఇతర ప్రపంచదేశాలపైన ఒత్తిడి తెస్తూనే ఉన్నాడు. అందువల్ల ఆయనకోసం కాకుండా కేవలం కమ్యూనిస్టులకోసమే జనరల్ చౌధరి వచ్చారని చెప్పడం వాస్తవ దూరం అవుతుంది. ఒక రాజకీయ వాదన మాత్రం చాలా కాలంగా ప్రచారంలో ఉంది. దీనికి చారిత్రక ఆధారాలు లేవు. కానీ సర్‌కమ్‌స్టాన్సియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. హైదరాబాద్‌లో స్టేట్ కాంగ్రెస్ నాయకత్వం బ్రాహ్మణ వర్గాల చేతుల్లో ఉంది. కాంగ్రెస్‌లో కొండా వెంకటరంగారెడ్డి, చెన్నారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, నూకల నరోత్తమరెడ్డి వంటి వారు ఉన్నప్పటికీ పెత్తనం బూర్గుల, స్వామి రామానందతీర్థ, ఉమ్మెత్తల నరసింగరావు, మాడపాటి హనుమంతరావు వంటివారు అనేక మంది పార్టీపై పెత్తనం చేస్తూ వచ్చారు. బ్రాహ్మణ నాయకత్వానికి ఢిల్లీలో లాబీయింగ్ కూడా ఎక్కువే. రెండు వర్గాల మధ్య అధికారం కోసం ఘర్షణలు జరుగడం కూడా అప్పటికే ఉంది. మరోవైపు కమ్యూనిస్టుల నాయకత్వం రెడ్ల చేతిలో ఉంది. ఇంకోవైపు రజాకార్లు కూడా యధేచ్ఛగా చెలరేగుతున్నారు. నిజాంను అంకెకు తేవడంతపాటు కమ్యూనిస్టులను, రజాకార్లను అణచివేయడంకోసం సైనిక చర్య జరిగిందని చెబుతారు. 1956లో కూడా బూర్గుల రామకృష్ణారావును విశాలాంధ్రకు ఒప్పించడానికి ఢిల్లీలోని బ్రాహ్మణ సామాజిక వర్గం ఇదే సూత్రీకరణను ఉపయోగించుకుంది. రెడ్డీస్, రెడ్స్ అండ రజాకార్స్- వీళ్లను తట్టుకుని నిలబడలేవు. సొంతపార్టీలో రెడ్లు నిన్ను నెగలనీయరు. విడిగా ఉంటే ఎప్పుడో ఒకప్పుడు కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. రజాకార్లను కూడా నీవు అదుపు చేయలేవు. అందుకే విశాలాంధ్రలో కలిస్తే అక్కడ ఇక్కడ ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గం సంఘటితమవుతుంది అని అప్పట్లో బూర్గులకు చెప్పి ఒప్పించారని సీనియర్ రాజకీయ నాయకులు చెబుతారు.

హైదరాబాద్ కర్ణాటక, హైదరాబాద్ మరాట్వాడాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలు జరుపుతున్నదని, ఇక్కడ సీమాంధ్ర ప్రభుత్వం సెప్టెంబరు 17ను గుర్తించకపోవడం అన్యాయమని నిన్నమొన్నటిదాకా మనమే నిందించాం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏ కారణాలు చెప్పి ఉత్సవాలకు దూరంగా ఉంటుంది? తెలంగాణ అస్తిత్వం ప్రతీకలను పునరుద్ధరించేందుకు కృషిచేస్తున్న ప్రభుత్వం రాష్ట్రానికి స్వాతంత్య్రం వచ్చిన రోజును ఎలా విస్మరించగలదు. మనకు రాని స్వాతంత్య్ర దినం ఆగస్టు పదిహేనును ఘనంగా నిర్వహించే మనం, మనకు స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబరు 17ను ఎలా విస్మరించగలం? ఇప్పుడు సెప్టెంబరు 17ను జరుపుకోకపోవడం రాజకీయ అవకాశవాదం అవుతుంది. చరిత్రను అవమానించడం అవుతుంది. రాజకీయ పునరుజ్జీవనం గురించి మాట్లాడుతున్నవాళ్లం, మొన్నమొన్నటి వాస్తవాలను ఎలా దాచిపెట్టగలం? అందుకే తెలంగాణ రాష్ట్ర సమితి ఒక ప్రధాన స్రవంతి రాజకీయ పక్షంగా సెప్టెంబరు 17ను స్వేచ్ఛాదినంగా జరుపుకోవాలి.

గారపాటికి జోహార్

అది 1991. హైదరాబాద్ ఆంధ్రజ్యోతిలో ఒకరోజు ఒక కొత్త పర్సనల్ ఆఫీసరు సెలవుల చీటీపై ఏదో తిరకాసు పెట్టి పై అంతస్తుకు కింది అంతస్తుకు రెండు సార్లు తిప్పాడు. అది గమనించిన గారపాటి నరసింహారావుగారు ఏం జరిగిందని అడిగారు. చెప్పాను. ఉన్నఫళంగా ఆ పర్సనల్ ఆఫీసరును గుర్రపు నాడా బల్లవద్దకు పిలిచి చెడామడా చీవాట్లు పెట్టి జర్నలిస్టులంటే తమాషాగా ఉందా? ఇంకోసారి ఇలా చేస్తే బాగుండదని హెచ్చరించి పంపాడు. జర్నలిస్టులపై ఈగ వాలనిచ్చేవారు కాదు. మరోసారి ఒక చోటా నాయకుడు ప్రెస్‌నోటు సార్ అంటూ ఒక కవరు ఆయన చేతిలో పెట్టి వెనుదిరిగాడు. కవరు తీసి చూసి ఆయన ఆగ్రహోదగ్రుడయ్యారు. అందులో ప్రెస్‌నోటుతోపాటు 500ల నోటు ఉంది. సెక్యూరిటీకి చెప్పి ఆ మనిషిని వెనుకకు పిలిచి మరోసారి ఈ ఆఫీసు మెట్లెక్కవద్దని హెచ్చరించి పంపాడు. ఒంటినిండా దర్పం, ఇస్త్రీ చెదరని తెల్లని చొక్కా, గంభీరమైన మాటతీరు, ఎవరినీ లెక్క చేయనితనం, జేబులో ఎంత ఉంటే అంత ఖర్చు చేసే లెక్కలేని తనం, రాసేవాళ్లను ప్రోత్సహించే సహృదయం…నరసింహారావు నిరంతరం ఒక సందడి. కాల్చుకు తినే న్యూస్ ఎడిటర్లను చూశాం. ఏమీ తెలియకపోయినా పెత్తనాలు చేసే వాళ్లను చూశాం. కానీ ఆయన మంచి నాయకుడు. పనిచేయించుకోవడం తెలిసిన నాయకుడు. విజయవాడ నుంచి కొత్తగా వచ్చిన మా బృందంపై ఆయన చూపిన ప్రేమను ఎప్పటికీ మరువలేము. పంజాగుట్ట ఆంధ్రజ్యోతి చుట్టూ సంసారాలు ఉండడం వల్ల ఒకరి కష్టనష్టాలు మరొకరికి తెలియడం, పరుగెత్తుకెళ్లడం, ఒకరికి ఒకరు సాయపడడం… ఉద్యోగాలు, జీవితాలు కలగాపులగంగా సాగిపోయేవి. 2000లో ఆంధ్రజ్యోతి మూత తర్వాత తలా ఓ దిక్కు వెళ్లిపోయాం. ఆయన అక్కడక్కడా ఉద్యోగాలు చేస్తూ ఎప్పుడయినా ప్రెస్‌క్లబ్‌లో కలిసేవారు. ఎప్పుడు కలిసినా అదే వాత్సల్యం. అదే పలకరింపు. ఇవ్వాళ చితిపై పెడుతున్నప్పుడు కూడా ఆయన ముఖంలోకి చూశాను. చనిపోయినట్టుగా లేదు. నిద్రపోతున్నట్టుగా అనిపించింది. ఉన్నప్పుడు ఎక్కడో ఒకచోట ఉన్నారులే అనుకుంటాం. వెళ్లిపోయినప్పుడు ఆయనకు సంబంధించి మనలో ఒక ఖాళీ ఆవరిస్తుంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ….

మిత్రులారా అటువెళ్లకండి

అది ఎండమావి అని తెలిసీ, తెలిసీ, పదే పదే పరుగెడుతూ పడుతూ లేస్తూ ఎంతకాలమీ అంతులేని ప్రయాణం? ఎందరిని బలిచేసుకుంటూ, ఎంతకాలం ప్రయోగాలు చేద్దాం అమాయకుల ప్రాణాలతో…వద్దు మిత్రులారా… అటు వెళ్ళకండి… మీ ధైర్యం గొప్పది. మీ తెగింపు అసాధారణం…మీ లక్ష్యం ఉన్నతమైనది…. మీరు అనుసరిస్తున్న మార్గమే ఈ ఆధునిక రాజ్యం ముందు నిలబడలేదు. తుపాకీ పట్టిన రాజ్యం ఏదైనా…. కాంగ్రేసుదా, బీజేపీదా, మావోఇస్టులదా నిర్దాక్షిణ్యంగానే వ్యవహరిస్తుంది.

మీ త్యాగాలు వృధా….

ఒక పాట, ఒక స్మరణ, ఒక స్తూపం, పది కవితల్లో మిగిలి ఉంటారు. మేము ఎటువంటి త్యాగాలు చేయకుండా, మిమ్మల్ని హీరోలుగా కీర్తించి మిమ్మల్ని మోసం చేయలేం. ఒక కన్నీటి చుక్క జార్చి, ఒక ఉద్వేగ పూరిత ప్రసంగం చేసి, మరికొందరిని ఉద్వేగాల మంటల్లో తోసి మరికొన్ని తరాలను బలిచేయలేము… మేము భద్రలోకంలో, ఎవరికీ చిక్కని లౌక్యంలో జీవిస్తూ మీ త్యాగాలను ఆకశానికెత్తలేము. మిత్రులారా మీ ప్రాణాలు విలువైనవి….

శ్రుతి, సాగర్లకోసం కలత చెందుతూ ఈ నాలుగు మాటలు…