Say no to KiKi while plowing

8x10-01

కికి వంటి వెర్రిమొర్రి వేషాలను ఎండగట్టడం మంచిదే, కానీ నాగలి అలా వదిలేసి ఎగరడం వాంఛనీయం కాదు. ఎద్దుకు కాలుగర్ర అయ్యే ప్రమాదం ఉంది. అలా నాగలి వదిలేసి దున్నడం సాంధ్యమ్ కాదు. దున్నబోయి ఎద్దు కాలుకు గాయం చేసినందుకు మా తాత నాపై చాలా కోపం చేసిండు.  నాగలి లేక గొర్రు లేక గుంటుక యేదయినా, మేడిపై నియంత్రణ లేకపొతే యెడ్ల కాళ్లకు ప్రమాదం. జరజాగ్రత్త మిత్రులారా.

కాళేశ్వరమే ఎందుకు?

Kaleshwaram

సీడబ్ల్యూసీ అంచనాల ప్రకారం మేడిగడ్డ వద్ద నీటి లభ్యత 283.4 టీఎంసీలు. అందులో నుంచి మొదటి దశలో 180 టీఎంసీలను మళ్లించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పనులు జరిపిస్తున్నది. ఎల్లంపల్లి, ఇతర చెరువులు, రిజర్వాయర్లలో లభించే నీటితో కలిపి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తం 225 టీఎంసీల నీరు వినియోగంలోకి వస్తుంది. ఇందుకోసం ప్రాజెక్టు పొడవునా 141 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు కూడా నిర్మిస్తున్నది. ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్, వామపక్షాలు, కొందరు మేధావులు కేసులు వేయడం, చర్చాగోష్టులు నిర్వహించడం, సవాళ్లు విసరడం చేస్తున్నారు. వాళ్లు నిజంగానే ఏమి తెలుసని, ఏమి చూసుకుని సవాళ్లు విసురుతున్నారో అర్థం కాదు.

తుమ్మిడిహట్టి నుంచి తలపెట్టిన ప్రాణహిత – చేవెళ్లే ఉత్తమమైనదని కాంగ్రెస్ నాయకులు, కొందరు మేధావులు మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతున్నది. తుమ్మిడిహట్టి వద్ద కేవలం 5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయరు నిర్మించి, మొత్తం ప్రాజెక్టు పొడవునా మరో 11.4 టీఎంసీల నిల్వసామర్థ్యంగల రిజర్వాయర్లు మాత్రమే నిర్మించి 160 టీఎంసీలను తెలంగాణ పొలాలకు మళ్లించి 16 లక్షల ఎకరాలకు నీరిస్తామని అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి చెప్పడం, వీరంతా నమ్మడం, ఇప్పటీకీ అవే సుద్దులు మళ్లీ మళ్లీ చెబుతుండడం విస్మయం కలిగిస్తున్నది. వీరికి తెలంగాణ భౌగోళిక పరిస్థితులపైన, నదులు, వాగులు, నీటి లభ్యతపైన ఇసుమంతైనా అవగాహనలేదని అర్థమవుతున్నది.

తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత తక్కువగా ఉంటుందని, మేడిగడ్డ వద్ద ఎక్కువ నీరు లభిస్తుందని అధ్యయనం చేసి, నిర్ధారించి, ప్రాజెక్టులను పునరాకృతి చేసింది. తుమ్మిడిహట్టి వద్ద లేని నీరు మేడిగడ్డ వద్ద ఎలా లభిస్తుందని ఆదిలాబాద్ జిల్లాకే చెందిన ఒక మేధావి, నీటి వాలూ వీలూ తెలియని కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. వీరందరినీ ఒకసారి తుమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డదాకా ప్రాణహిత-గోదావరి నదుల్లో తిప్పితే ఏమైనా జ్ఞానం కలుగుతుందేమో చూడాలి. తుమ్మిడి హట్టి దాటిన తర్వాత ఇటు ఆదిలాబాద్ జిల్లా నుంచి, అటు మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా నుంచి, అందునా దట్టమైన అటవీ ప్రాంతాల నుంచి 13 పెద్ద చిన్న వాగులు ప్రాణహిత-గోదావరి నదుల్లో వచ్చి కలుస్తాయి. ఆదిలాబాద్ నుంచి పెద్దవాగు, గొల్లవాగు, రాలి వాగు, రాళ్లవాగు, తోళ్లవాగు, ఎర్రవాగు, నిప్పువాగు, నాగులవాగులు ప్రాణహిత-గోదావరి నదుల్లో కలుస్తాయి. భూపాలపల్లి జిల్లా అడవుల నుంచి పెద్దవాగు, చండ్రుపల్లివాగు, నల్లవాగు, పుసుకుపల్లివాగు, కుదురుపల్లివాగులు గోదావరి నదిలో వచ్చి కలుస్తాయి. గడ్చిరోలి వైపు తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డలోపు ఏడు వాగులు వచ్చి ప్రాణహిత-గోదావరి నదుల్లో కలుస్తాయి. ఏమాత్రం వాన వచ్చినా ఈ వాగులకు నీరొస్తుంది. ఇదంతా తుమ్మిడిహట్టివద్ద లభించే నీరుకు అదనపు నీరు కాదా?

ఎల్లంపల్లి రిజర్వాయరు గత ఏడాది ఆదిలాబాద్ అడవుల నుంచి ప్రవహించిన వాగులు, ఉపనదుల నీటితోనే నిండింది. అంటే సుమారు 20 టీఎంసీలకుపైగా జలాలు శ్రీరాంసాగర్‌కు దిగువ నుంచే ఎల్లంపల్లికి వచ్చాయి. అదీ ఏడు టీఎంసీల కడెం నిండిన తర్వాత. అటువంటప్పుడు తూర్పు, దక్షిణ ఆదిలాబాద్ నుంచి గడ్చిరోలి నుంచి, భూపాలపల్లి నుంచి వచ్చే నీరు ఎంత ఉండాలి? పదిరోజుల క్రితం అన్నారం బ్యారేజీ వద్ద 20 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదయింది. అదేసమయంలో తుమ్మిడిహట్టి వద్ద చాలా స్వల్పంగా మాత్రమే ప్రవాహం వచ్చింది. కామన్ సెన్సు ఉన్నవారికి ఇది అర్థం అవుతుంది. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ రిజర్వాయర్లు ప్రధాన నదిపైన ఉంటాయి. ఈ వాగుల నీళ్లను ఎక్కడికక్కడ ఆపిపెడతాయి. వీలైనంత ఎక్కువ నీటిని నిలుపుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సాధ్యమవుతుంది. ప్రాణహిత-చేవెళ్ల నమూనానే కొనసాగించినట్టయితే నీళ్లున్నన్ని రోజులు మోటార్లు నడుపుకుని నేరుగా పొలాలకు మళ్లించుకోవడం తప్ప మరో గత్యంతరం ఉండేది కాదు. నీటిని నిల్వచేసుకుని పొలాలకు మళ్లించే వ్యవస్థే ప్రాణహిత నమూనాలో లేదు. ప్రాణహిత-చేవెళ్ల పరమ చెత్తగా రూపొందించిన ప్రాజెక్టు. ప్రధాన నదీ ప్రవాహనం నుంచి తెలంగాణను వీలైనంత దూరం ఉంచడంకోసం జరిగిన ప్రయత్నం. తెలంగాణ ప్రభుత్వం ఆ కుట్రలను వమ్ము చేసి, తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ఆదిలాబాద్‌కు పరిమితం చేసి, ప్రధాన ప్రాజెక్టును కాళేశ్వరానికి మార్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యతను అర్థం చేసుకోవడానికి రాజకీయ కళ్లద్దాలు పనికిరావు. దానికి తెలంగాణ ఆత్మ కావాలి.