పాత రష్యన్ కథ

జీవితంలో డబ్బే ముఖ్యము కాదు

IFWT_Coins

ఒకతను వున్నంతలో భార్యా పిల్లలతో ఆనందంగా బతుకుతుంటాడు..
ఒకరోజు అతడు బజార్లో నడుస్తూ వుంటే ఒక నాణెం దొరుకుతుంది..
మకిలి పట్టి మధ్యలో చిల్లు వున్న రాగి నాణెం..అది…!!
అతడు దాన్ని రుద్ది చూస్తాడు..ఆశ్చర్యం..!!

ఇంకో రాగి నాణెం వస్తుంది..

మళ్ళీ రుద్దుతాడు..

మరోటి వస్తుంది..

మళ్ళీ రుద్దితే మళ్ళీ ఒకటి..!!

అప్పుడు ఆకాశవాణి వినిపిస్తుంది..

ఓ మనిషీ..!
ఇది మాయానాణెం..
దీన్ని ఎన్నిసార్లు రుద్దితే అన్ని నాణేలు ఇస్తుందీ..

అయితే మధ్యలో ఒక్కసారి ఆపినా ఆమాయ పోతుందీ…!!
అని చెప్తుంది..

అంతే ఆ మనిషి తన ఇంటిలో వున్న నేలమాళిగలోకి వెళ్ళి నాణేన్నిరుద్దటం మొదలు పెడతాడు..
తనను తాను మర్చిపోతాడు.. కుటుంబాన్ని మర్చిపోతాడు..

పిల్లల్ని మర్చిపోతాడు..

ప్రపంచాన్ని మర్చిపోతాడు.

.అలా రుద్దుతునే వుంటాడు..

గుట్టలుగా సంపదను పోగెస్తునే వుంటాడు..!!

ఒకరోజు అతడికి ఇక చాలనిపిస్తుంది..
రాగినాణేన్ని పక్కన పడేసి..బయటికి వస్తాడు..

అతడిని ఎవ్వరూ గుర్తు పట్టరు..

పిల్లలకు పిల్లలు పుట్టి వుంటారు..

కొత్త భవనాలు వెలసి వుంటాయి..

కొత్త సంగీతాలు వినిపిస్తుంటాయి..

స్నేహితులు..

చుట్టాలు..

పుస్తకాలు..

ప్రేమ,పెళ్ళి…

జీవితం ప్రసాదించిన అన్ని సంతోషాలనూ అనుభవిస్తుంటారు..

ఆ మనిషికి ఏడుపు వస్తుంది.

ఇంతకాలం ఇవన్నీ వదిలెసి నేను చేసింది ఏమిటా అని కుప్పకూలుతాడు..!!

ఒక్కోసారి మనం కూడా చేతిలో ఇలాంటి మాయానాణెం పట్టుకొని వుంతున్నామా అనిపిస్తుంది…

సంపాదనలో పడి ..

కెరీర్ లో పడి..

కీర్తి కాంక్షలో పడి..

లక్ష్య చేధనలో పడి,

బంగారు నాణెం వంటి జీవితాన్ని..

మకిలి రాగినాణెం లా మార్చుకుంటున్నామా అనిపిస్తుంది..!!

అమ్మ చేతి ముద్ద..

భార్య ప్రేమ..

పిల్లల అల్లారు ముద్దు..

స్నేహితుడి మందలింపు..

ఆత్మీయుడి ఆలింగనం..

ఈ బంగారు నాణేలు మన జేబులో తగినన్ని వుండాలి..

ఈ బంగారు ముచ్చట్లు గుండె అంతా నిండాల.

(రచయిత పేరు తెలియదు)

Political Musings

2015/01/img_2549.jpg

* NO MORE POLES IN THE WORLD…ALL POLES MERGED TO SINGLE AXIS. CAN INDIA SURVIVE THIS UNIPOLE DYNAMICS OF THE World.

* Is it going to be Indianisation of politics and economy or Americanisation of India?

* When our saffron intellectuals are boasting everything is in Vedas, including nuclear weapons and aircrafts technology, Modi is signing pacts with Obama.

దిగ్విజయుని అకాలజ్ఞత

ప్రాప్తకాలజ్ఞత లేకపోవడం ఎంత దరిద్రమో, గతజల సేతు బంధమూ నిరర్థకమే. కాంగ్రెస్ ఇంకా అదే బాటలో పయనిస్తున్నది. తెలుగు నేలపై కాంగ్రెస్‌ను తన మహాద్భుత వ్యూహాలతో పాతాళాన దించిన ఆ పార్టీ అగ్రనాయకుడు దిగ్విజయ్ సింగ్ ఇప్పటికీ అవే పాఠాలు బోధిస్తున్నారు. శిథిలమైన ఇంటిని పునర్నిర్మించుకునే పని చేయమని చెప్పడం లేదు. విరిగిన డాలూ కత్తులు తీసుకుని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంపై, అక్కడ చంద్రబాబు ప్రభుత్వంపై దాడి చేయాలని ఉసిగొల్పుతున్నారు.

Digvijay-Singh

ముందు చేయాల్సిన పని వెనుక, వెనుక చేయాల్సిన పని ముందు చేస్తే ఏమవుతుంది. చిప్ప చేతికొస్తుంది. ఎప్పుడు ఏది చేయాలో తెలియకపోవడం వల్లనే కాంగ్రెస్‌కు ఉభయ భ్రష్టత్వం ప్రాప్తించింది. ప్రాప్తకాలజ్ఞత లేకపోవడం ఎంత దరిద్రమో, గతజల సేతు బంధమూ నిరర్థకమే. కాంగ్రెస్ ఇంకా అదే బాటలో పయనిస్తున్నది. తెలుగు నేలపై కాంగ్రెస్‌ను తన మహాద్భుత వ్యూహాలతో పాతాళాన దించిన ఆ పార్టీ అగ్రనాయకుడు దిగ్విజయ్ సింగ్ ఇప్పటికీ అవే పాఠాలు బోధిస్తున్నారు. శిథిలమైన ఇంటిని పునర్నిర్మించుకునే పని చేయమని చెప్పడం లేదు. విరిగిన డాలూ కత్తులు తీసుకుని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంపై, అక్కడ చంద్రబాబు ప్రభుత్వంపై దాడి చేయాలని ఉసిగొల్పుతున్నారు. విషాదం ఏమంటే కాంగ్రెస్ ఇంతవరకు ఆత్మవిమర్శ చేసుకున్నది లేదు. ఇంత ఘోర పరాజయం తర్వాత ఏ పార్టీ అయినా ముందుగా చేయాల్సింది ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవడం. ఇంతకష్టపడి తెలంగాణ ఇచ్చినా తెలంగాణ ప్రజలు ఎందుకు ఆదరించలేదో, మంత్రిపదవులు ఇచ్చి, ప్రాజెక్టులు ఇచ్చి, అప్పులు మాఫీ చేసి అంత బుజ్జగించినా ఆంధ్రా నాయకత్వం ఎందుకు నిలబడలేదో కాంగ్రెస్ ఇంతవరకు గుర్తించనే లేదు. తప్పులు తెలుసుకుని, ఒప్పుకుని, చెంపలు వేసుకుని జనం ముందుకు వెళితేనే ఏ నాయకుడినయినా మళ్లీ జనం గుర్తించేది. అప్పుడు మొదలు పెట్టాలి మళ్లీ రాజకీయ పోరాటం. కానీ కాంగ్రెస్ ఇంత వరకు ఆ దిశగా ప్రజలకు ఎటువంటి సందేశమూ ఇవ్వలేదు. చింతన్ బైఠకులు పెట్టుకున్నారు కానీ వాటి సారాంశం ఏమిటో ప్రజలకు చేరనేలేదు. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా తాము చేసిన తప్పులను గుర్తించ లేదు. ముఖ్యంగా దిగ్విజయ్ సింగ్ సారథ్యంలో ఏం జరిగిందో ఆయనా చెప్పలేదు, పార్టీ చెప్పలేదు. తెలంగాణ ప్రజలు మాత్రం రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును శిక్షించారు. మూడు నాలుగేళ్లపాటు తాము అనుభవించిన విపరీత మానసిక క్షోభకు ప్రతీకారం తీర్చుకున్నారు. అయినా దిగ్విజయ్ సింగ్‌ను తెలంగాణ, ఆంధ్ర బాధ్యతల నుంచి తప్పించలేదు.

చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినవారు, చెప్పగలిగినవారు దిగ్విజయ్ సింగే. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, తెలంగాణ ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోకుండా ఆయన ఏం మాట్లాడినా దండగే. ఎంతమంది మేధావుల సలహాలు తీసుకునా వృధా ప్రయాసే.

రాష్ట్ర విభజన అనివార్యమైన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధపడ్డారు. ఢిల్లీ వెళ్లారు. సోనియాగాంధీని కలిసి అదే మాట చెప్పారని అప్పట్లో వార్తలు వచ్చాయి. సోనియాగాంధీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా బొత్సా సత్యనారాయణను పిలిపించమని దిగ్విజయ్‌కి కబురు పెట్టారు. మరుసటిరోజు ఉదయమే బొత్సా ఢిల్లీకి వెళ్లారు కూడా. కానీ తెల్లారేసరికి సీను మారిపోయింది. కిరణ్‌కుమార్‌రెడ్డి తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని చెప్పారట. దిగ్విజయ్‌సింగ్ మేడమ్‌ను ఒప్పించారట. తర్వాత జరిగిన కథ షరా మామూలే. కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ వచ్చిన తర్వాత ఓ పక్షం రోజుల నుంచి సీఏం పేషీ కేంద్రంగా తెలంగాణకు వ్యతిరేకంగా చెలరేగిపోయారు. పరమ దుర్మార్గమైన వాదనలన్నీ గుప్పిస్తూ వచ్చారు. ఉన్నవీ లేనివీ, జ్ఞానమూ, అజ్ఞానమూ అన్నీ కలగలిపి గంటలు గంటలు వలపోస్తూ వచ్చారు. రాష్ట్రం ఇస్తూ ఇస్తూ తెలంగాణ హృదయాలను ఛిద్రం చేస్తూ వచ్చారు. తెలంగాణ ప్రజల గుండెలు మండిపోతూ వచ్చాయి. పిల్లల ఆత్మహత్యలు పెరుగుతూ వచ్చాయి. ఇంత జరుగుతున్నా తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు బుద్ధావతారాల్లా సంచులు మోసుకుంటూ తిరిగారు. పల్లెత్తి ఒక్క మాటా అనలేకపోయారు. కాంగ్రెస్ ఎంపీలు కొందరు పోరాడుతూ వచ్చినా, జనంతో నేరుగా సంబంధాలుండే వాళ్లు, ప్రభుత్వంలో కిరణ్ పక్కన కూర్చునే మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడకపోయే సరికి సహజంగానే జనానికి మండిపోయింది. వీళ్లేం మనుషులు? వీళ్లేం నాయకులు? వీళ్లేం మంత్రులు? అని జనం బాహాటంగానే తిట్టిపోస్తూ వచ్చారు. కిరణ్‌కుమార్‌రెడ్డి మొదటి పత్రికా సమావేశం పెట్టిన రోజే తెలంగాణ మంత్రులు ఆయనను సవాలు చేసి ఉంటే పరిస్థితులు మరో విధంగా ఉండేవి. ‘నిన్ను ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదు. నువ్వు ఆంధ్రా నాయకునివి మాత్రమే’ అని తిరగబడి ఉంటే తెలంగాణలో ఆ పార్టీకి ఇన్ని నూకలు దక్కి ఉండేవి. ఈ మొత్తం పరిణామంలో కిరణ్‌ను కొనసాగించడం అన్నది కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన పెద్ద తప్పు. ఆయనను కొనసాగించడానికి కారణమైన వారెవరో బయటపడలేదు. ఎందుకు కొనసాగించాల్సివచ్చిందో చెప్పుకోలేదు. కొనసాగించినవారు ఆయనకు ఎందుకు ముకుతాడు వేయలేకపోయారో వివరణ ఇచ్చుకోలేదు. అసలు తెరవెనుక ఏమి గూడుపుఠానీ జరిగిందో బయటికి రాలేదు. బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రిగా వచ్చి ఉంటే? ఆయన మొండోడు. ఓడిపోయినా పోరాడి ఓడిపోయేవాడు. ఆంధ్ర కాంగ్రెస్ చరిత్రలో కిరణ్ ఒక బ్రూటస్. ఇవ్వాళ తెలంగాణలో, ఆంధ్రలో కాంగ్రెస్‌ను విజయవంతంగా సర్వనాశనం చేసిన ఘనత కిరణ్‌దే. ఒక రకంగా టీఆరెస్, టీడీపీలు ఆయనకు రుణపడి ఉండాలి.

ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ఏపార్టీలో ఉన్నారో తెలియదు. ఏ పార్టీలో చేరతారో తెలియదు. చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినవారు, చెప్పగలిగినవారు దిగ్విజయ్ సింగే. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, తెలంగాణ ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోకుండా ఆయన ఏం మాట్లాడినా దండగే. ఎంతమంది మేధావుల సలహాలు తీసుకునా వృధా ప్రయాసే. ఆయన సంప్రదించిన మేధావులెవరూ కాంగ్రెస్ మేలు కోరేవారు కాదు. అసలు వాళ్ళు ఎవరి మేలూ కోరే అవకాశం లేదు. వారిలో చాలా మంది ఆశోపహతులు. తెలంగాణ సాధనలో చెప్పుకోవడానికి తమకు ఏమీ మిగలలేదే అని బాధపడుతున్నవారు. వారు సహజంగానే ప్రతిపక్షాలన్నీ ఉన్న పళాన తెలంగాణ ప్రభుత్వంపై ఒంటికాలుపై ఉరకాలని ఆశిస్తారు. ఇది సమయం, సందర్భం కాదన్న విచక్షణ లోపించినవాళ్లు. కేవలం అక్కసుతో మండిపోతున్నవాళ్లు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలని చెప్పరు. చెదరిపోయిన పార్టీ శ్రేణుల్లో ముందుగా ఆత్మవిశ్వాసం పెంచాలని చెప్పరు. పార్టీని తిరిగి అట్టడుగు నుంచి నిర్మించుకుంటూ రావాలని చెప్పరు. సమయోచితంగా స్పందించాలని చెప్పరు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం ఎనిమిది మాసాలు. విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడిప్పుడే అధికారులు వచ్చి చేరుతున్నారు. సిబ్బంది విభజన ఇంకా ఎంతకాలం పడుతుందో తెలియడం లేదు. అయినా తెలంగాణ ప్రభుత్వం ఈ కొద్దికాలంలోనే చేయగలిగిన మంచినంతా చేస్తున్నది. కాంగ్రెస్ రెండు రాష్ట్రాలను ఏలింది ముప్పై ఆరేళ్లు. టీడీపీ ఏలింది పదిహేడేళ్లు. పొన్నాల లక్ష్మయ్య, డి.శ్రీనివాస్, జీవన్‌రెడ్డి, డి.కె.అరుణ వంటివారు చాలాకాలం మంత్రిపదవుల్లో, కీలక శాఖల్లో ఉన్నవారు. వారు ఏం చేశారో, ఏం చేయలేదో జనం చూశారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించి ఎంతో కాలం కాలేదు. హైదరాబాద్, రంగారెడ్డిలలో తప్ప టీడీపీని తెలంగాణ అంతటా ఛీకొట్టారు. అక్కడో ఇక్కడో పొల్లుబోయి గెలిచినవారికైనా సోయి రాలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతయినా స్వతంత్రంగా, నిర్మాణాత్మకంగా వ్యవహరించాలన్న సద్బుద్ధి కలుగలేదు. అటు పొన్నాల నుంచి ఇటు రేవంత్ దాకా వెకిలి వేషాలు, వెకిలి మాటలు. కొత్త రాష్ట్రం సాధించుకున్నాం. కొత్తగా రాజకీయ నిర్మాణం చేసుకుందాం. స్వతంత్రంగా, నిర్మాణాత్మకంగా, హుందాగా వ్యవహరిద్దాం అన్న తెలివిడి లేకుండా పోయింది. ఏదో దుగ్ధతోనో, ఎవడో కీ ఇస్తేనో మాట్లాడడం కాకుండా సొంత సోయితో తిరిగి ఎదుగుదాం అన్న స్పృహ లేకుండా పోయింది.

తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీలు ఆంధ్రా పార్టీలుగా అవి స్థానికతను, సంబద్ధతను రెండూ కోల్పోయాయి. ఆంధ్ర ప్రయోజనాలకోసం మాత్రమే పనిచేసే పార్టీలుగా అవి రోజురోజుకూ తమను తాము మల్చుకుంటున్నాయి. ఆంధ్రాలో మనుగడ సాగించడానికి చంద్రబాబుకు, జగన్‌మోహన్‌రెడ్డికి అంతకంటే మార్గం లేదు. తెలంగాణతో కయ్యాన్ని సజీవంగా ఉంచడం చంద్రబాబు అవసరం. అందుకే నేరని నల్లిలాగా ఆయన ఎక్కడెక్కడ మెలికలు పెట్టాలో అక్కడ పెట్టుకుంటూ వస్తున్నారు.

తెలంగాణలో ఒక్క కాంగ్రెస్ మాత్రమే కాదు, తెలుగుదేశం, బీజేపీ, వైఎస్సార్‌సీపీ తెలంగాణ సాధన సందర్భంగా జరిగిన తప్పులకు, వైఫల్యాలకు తెలంగాణ ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకుని తీరాలి. కాంగ్రెస్ తెలంగాణలో లోకస్ స్టాండీ ఉన్న పార్టీ. ప్రజలను సమాధానపరిస్తే ఎప్పటికయినా ఎదిగే అవకాశం ఉంది. తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీలు ఆంధ్రా పార్టీలుగా అవి స్థానికతను, సంబద్ధతను రెండూ కోల్పోయాయి. ఆంధ్ర ప్రయోజనాలకోసం మాత్రమే పనిచేసే పార్టీలుగా అవి రోజురోజుకూ తమను తాము మల్చుకుంటున్నాయి. ఆంధ్రాలో మనుగడ సాగించడానికి చంద్రబాబుకు, జగన్‌మోహన్‌రెడ్డికి అంతకంటే మార్గం లేదు. తెలంగాణతో కయ్యాన్ని సజీవంగా ఉంచడం చంద్రబాబు అవసరం. అందుకే నేరని నల్లిలాగా ఆయన ఎక్కడెక్కడ మెలికలు పెట్టాలో అక్కడ పెట్టుకుంటూ వస్తున్నారు. ‘మాపై రాజకీయ ఒత్తిడి ఉంది. ఇది తప్పని తెలిసినా, కోర్టుల్లో సమస్యలు వస్తాయని అనుభవం ఉన్నా కొన్ని (తెలంగాణకు) అప్రియ నిర్ణయాలు చేయాల్సి వస్తున్నది’ ఒక సీనియర్ ఆంధ్రా అధికారి అంతర్గత సంభాషణల్లో చెప్పారు. చంద్రబాబు శైలి అది. చంద్రబాబుకు ఉన్న అనివార్యత కూడా. అటువంటి నేత నీడలో నడుస్తూ తెలంగాణ ప్రభుత్వంపైకి ఎన్ని బాణాలు వేస్తే మాత్రం ఏమవుతుంది? చాలా చిన్న లాజిక్ ఇది. మహబూబ్‌నగర్ ప్రాజెక్టులను వ్యతిరేకించే పార్టీలు, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కొల్లగట్టాలన్న ద్రోహబుద్ధిని ఎండగట్టని పార్టీలు తెలంగాణలో ఎలా రాజకీయాలు చేస్తాయి? బీజేపీది కర్ణుడి పరిస్థితి. చంద్రబాబుతో కలిసి నడవడం వారి బలహీనత. చంద్రబాబుతో ఆ పార్టీని కలిసి చూసినంతకాలం తెలంగాణలో అనుకున్నంతగా ఆ పార్టీ ఎదగలేదు. ఈ పరిమితులను అధిగమించనంతకాలం ఏ పార్టీ అయినా తెలంగాణలో పెను మార్పులు సృష్టించే అవకాశమే లేదు.

తెలంగాణ తేజమే నిజం

IMG_2293

‘తెలుగు తేజం, ఆంధ్ర తేజం అని ఇంతకాలం వాళ్లు చెప్పినదంతా తెలంగాణ తేజమే. తెలంగాణ బలమే ఆంధ్రప్రదేశ్ బలంగా చెలామణి అయింది. తెలంగాణ సొమ్ములు, భూములు, వనరులతో రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడు అధికార చక్రాలు తిప్పారు’

తెలంగాణా ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజులు గుర్తున్నాయా? తొలుత రాజశేఖర్‌రెడ్డి, తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడు, ఉండవల్లి, లగడపాటి….వంటివారు తెలంగాణ గురించి ఏమన్నారో జ్ఞాపకం ఉందా? వీళ్లసలు ముందుగా తెలంగాణ ఉద్యమాన్నే గుర్తించలేదు. తెలంగాణ ఉద్యమ నాయకులను గుర్తించలేదు. పైగా ఎగతాళి చేసి, ఆగంపట్టించాలని చూశారు. తెలంగాణకు అసలు నాయకులే లేరన్నారు. పరిపాలించుకోలేరన్నారు. విడిగా తెలంగాణ బతకలేదన్నారు. సంపన్న ఆంధ్ర జిల్లాలతో కలిసి ఉంటేనే తెలంగాణకు బతుకుదెరువన్నారు. అక్కడి నిధులు తెచ్చి ఇక్కడ పెడుతున్నామన్నారు. తెలంగాణకు తీరప్రాంతం లేదన్నారు. సమైక్యపాలనలో తెలంగాణలోనే ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. తెలుగుతేజాన్ని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారన్నారు….ఇక తెలంగాణ ఇవ్వక తప్పదని తేలిపోయిన తర్వాత, కేంద్రం రాష్ట్ర విభజన దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టిన తర్వాత, విడిపోతే మాకు నష్టం, కష్టం అని వాదించడం మొదలు పెట్టారు. హైదరాబాద్ లేకపోతే మాకు మనుగడ లేదన్నారు. తెలంగాణను అడ్డుకోవడానికి అడ్డగోలు ప్రయత్నాలన్నీ చేశారు. తెలంగాణ వచ్చినా ప్రశాంతంగా పనిచేసుకోలేని, పరిపాలించుకోలేని మెలికలెన్నో పెట్టి కూర్చున్నారు. ఇప్పుడు అదే చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి, ‘జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నాం ఆదుకోండ’ని కేంద్రాన్ని ప్రాధేయపడుతున్నారు. సమైక్య రాష్ట్రంలో సమస్త రాష్ట్రాన్ని పోషించామని చెప్పుకున్న నాయకులు ఇప్పుడు ఈ బేలతనాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారు? రాష్ట్రంలోని అందరికీ జీతాలు తామే చెల్లించామని చెప్పుకున్న నాయకత్వం ఇప్పుడు ఇలా ఎందుకు వాపోతున్నది? ఆంధ్ర ప్రాంతం దన్నుతో తెలంగాణను ఉద్ధరించామని చెబుతున్నదంతా నిజం కాదన్నమాట. ‘తెలుగు తేజం, ఆంధ్ర తేజం అని ఇంతకాలం వాళ్లు చెప్పినదంతా తెలంగాణ తేజమే. తెలంగాణ బలమే ఆంధ్రప్రదేశ్ బలంగా చెలామణి అయింది. తెలంగాణ సొమ్ములు, భూములు, వనరులతో రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడు అధికార చక్రాలు తిప్పార’ని ఒక తెలంగాణ రచయిత, కవి చెప్పిన మాటలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అబద్ధాల సేద్యం కొసెల్లదు. అన్యాయపు వాదాలు నిలబడవు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పేర్చిన అబద్ధాల పేక మేడ కూలిపోవడానికి ఎంతో కాలం పట్టలేదు. చంద్రబాబే దానిని కూల్చివేస్తుండడం ఇంకా ఆసక్తిని కలిగించే విషయం.

‘విలువైన వస్తువులు, వాహనాలు, యంత్రాలు ఏవైనా కొనాల్సి వస్తే ఆంధ్రలో కొనండి. ఇక్కడ దొరకకపోతే చెన్నయ్, బెంగళూరులలో కొనండి. హైదరాబాద్‌లో, తెలంగాణలో మాత్రం కొనవద్దని మా అగ్ర నాయకులు చెబుతున్నారు. ఈ ధోరణి మరీ రోతపుట్టిస్తున్నది’

ఆంధ్ర రాష్ట్రం ఇబ్బందులు పడడం తెలంగాణకు వినోదం కాదు. అక్కడి ఉద్యోగులు, ప్రజలు సమస్యల్లో పడడం తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షా కాదు. ఆంధ్ర నాయకత్వం వాస్తవిక దృష్టితో తెలంగాణ ఉద్యమాన్ని చూడలేకపోవడం, అబద్ధాలతో, ఆవేశకావేశాలతో ఉద్యమాన్ని తప్పుదోవపట్టించాలని చూడడం ఇవ్వాల్టి పరిస్థితికి కారణం. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రజానీకాన్ని ఎగదోయాలని చూడడం ఇంకా విషాదం. సామరస్యంగా విభజన జిరిగి ఉంటే ఆంధ్ర ప్రాంతానికి కూడా మరింత న్యాయం జరిగి ఉండేది. సీమాంధ్ర నాయకత్వం తెలంగాణను ప్రతిఘటిస్తున్నామన్న రాజకీయ భ్రమలో పడిపోయి, తమ ప్రాంతానికి సాధించుకోవాల్సిన హక్కులు, నిధులు… అన్నింటినీ గాలికి వదిలేశారు. అవాస్తవిక నినాదాలతో వాస్తవిక సమస్యలను వదిలేశారు. ఆ పాపంలో సీమాంధ్ర నాయకులందరూ భాగస్వాములే. చంద్రబాబు ఇప్పటికయినా వాస్తవిక దృష్టికి రావడం మంచిదే. వరుస వాయి, సమయమూ సందర్భమూ తెలియని ఒక రాజకీయ అజ్ఞాన గుంపును వెంటేసుకుని, తెలంగాణలో ఇంకా ఏదో బావుకుందామని ఇక్కడ సమస్యలు సృష్టిస్తున్నారు. ఇటువంటి చిల్లర పనులు మాని ఆంధ్ర ప్రాంత హక్కులకోసం పోరాడితే తెలంగాణ ప్రజానీకం కూడా ఆయనకు సంఘీభావం ప్రకటిస్తుంది. పోలవరం కోసం ఆరు మండలాలను కలిపేయడమే బలవంతంగా జరిగింది. కొత్తగా బూర్గంపాడును కూడా కొట్టేయాలని చూడడం చంద్రబాబు దుర్భుద్ధికి నిదర్శనం. ఉమ్మడి సంస్థలు, ఉమ్మడి నిధులు, ఎంసెట్ వంటి అంశాలలో కూడా చంద్రబాబు ఇంకా తెలంగాణపై వంకర దృష్టితోనే స్వారీ చేయాలని చూస్తున్నారు. ఇంకా విడ్డూరం ఏమంటే, ‘విలువైన వస్తువులు, వాహనాలు, యంత్రాలు ఏవైనా కొనాల్సి వస్తే ఆంధ్రలో కొనండి. ఇక్కడ దొరకకపోతే చెన్నయ్, బెంగళూరులలో కొనండి. హైదరాబాద్‌లో, తెలంగాణలో మాత్రం కొనవద్దని మా అగ్ర నాయకులు చెబుతున్నారు. ఈ ధోరణి మరీ రోతపుట్టిస్తున్నది’ అని తెలుగుదేశం సీనియర్ నాయకుడే ఒకాయన ఇటీవల వాపోయాడు. చంద్రబాబునాయుడు తన ‘గీత’ను బాగుచేసుకోవడానికి బదులు ఎదుటివారి ‘గీత’ను చెరిపేయాలని చూస్తున్నారు. ఇట్లా ఆలోచించినవాళ్లెవరూ బాగుపడిన దాఖలాలు చరిత్రలో లేవు. రెండు ప్రాంతాల మధ్య సయోధ్యను పెంచడానికి ఇవి ఏమాత్రం దోహదం చేయవు. ఇప్పుడు తెలంగాణతో కొట్లాడి ఆంధ్రలో బావుకునేది ఏమీ లేదు.

భూస్వామ్యం నుంచి తొందరగా బయటపడింది, సామాజిక సామరస్యాన్ని సాధించింది తెలంగాణనే. దళితులు, పేదలపై సీమాంధ్రలో జరిగినన్ని దారుణాలు తెలంగాణలో జరుగలేదని పౌరహక్కుల ఉద్యమాల నివేదికలే బట్టబయలు చేశాయి. తెలంగాణలో జరిగిన అన్ని రకాల ఉద్యమాలు తెలంగాణ సమాజాన్ని మరింత ప్రజాస్వామ్యీకరిస్తూ వచ్చాయి.

తెలంగాణ నాయకత్వాన్ని పలుచన చేయడానికి, ప్రజల ముందు విలన్లుగా నిలబెట్టడానికి సీమాంధ్ర ఆధిపత్య వ్యవస్థలు చేసిన ప్రయత్నమే ఇంకా ఇక్కడ కొందరు కొనసాగిస్తున్నారు. తెలంగాణలోనే దొరలు, భూస్వాములు ఉంటారని, ఇక్కడే అన్నిరకాల అణచివేతలు ఉంటాయని చారిత్రకంగా ఒక ప్రచారం జరిగింది. తెలంగాణ వస్తే మళ్లీ భూస్వాముల పాలన వస్తుందని ప్రచారం అప్పుడూ, ఇప్పుడూ కొనసాగుతున్నాయి. సీమాంధ్ర ఆధిపత్య వ్యవస్థలు సృష్టించిన మేధో భావజాలం ఇప్పటికీ ఇక్కడి మేధావులు, సామాజిక వేత్తల మెదళ్లను ఏలుతున్నది. భూస్వాములు, అణచివేత, దుర్మార్గాలు ఒక్క తెలంగాణలోనే కాదు, ఆంధ్రలోనూ ఉన్నాయి. కానీ విశాలాంధ్రవాదులు ఉద్దేశపూర్వకంగా ఒక సత్యాన్ని మరుగున పడేశారు. తెలంగాణను భూస్వాముల నుంచి, నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి చేయడానికి ముందుగా రంగంలోకి దూకిన నేతల సామాజిక నేపథ్యాలు ఒక్కసారి ఎవరియినా అధ్యయనం చేశారా? రావి నారాయణ రెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వర్‌రావు, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, రేణికుంట రాంరెడ్డి, గొట్టిముక్కల గోపాల్‌రెడ్డి, యానాల మల్లారెడ్డి, అల్గుబెల్లి వెంకటనర్సింహారెడ్డి, ఎలమరెడ్డి గోపాలరెడ్డి, అనభేరి ప్రభాకర్‌రావు, బోయినపల్లి వెంకట్రామారావు, చెన్నమనేని రాజేశ్వర్‌రావు, బద్దం ఎల్లారెడ్డి, కట్కూరి రామచంద్రారెడ్డి, పశ్య ఇంద్రసేనారెడ్డి, కొండవీటి జగన్‌మోహన్‌రెడ్డి, గురునాథరెడ్డి, మంచికంటి రాంకిషన్‌రావు, చిర్రావూరి లక్ష్మీనర్సయ్య, గాండ్లూరి కిషన్‌రావు, కాంచనపల్లి వెంకటరామారావు, కాకి చంద్రారెడ్డి, దాయం రాజిరెడ్డి, వెదిరె రాజిరెడ్డి, పులిజాల రాఘవరంగారావు….ఇలా రాస్తూ పోతే ఈ జాబితాకు అంతులేదు. తెలంగాణ సాయుధ పోరాటమే తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసింది. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన అనేక మందిని మహాయోధులుగా మలిచింది. ఆ తర్వాత జరిగిన విప్లవోద్యమాలు కూడా భూస్వామ్యానికి వ్యతిరేకంగా పైకొచ్చినవే. ఆ ఉద్యమాల్లో కూడా అత్యధికులు భూస్వామ్య, అగ్రకుల కుటుంబాల నుంచి వచ్చినవారే. భూస్వామ్యం నుంచి తొందరగా బయటపడింది, సామాజిక సామరస్యాన్ని సాధించింది తెలంగాణనే. దళితులు, పేదలపై సీమాంధ్రలో జరిగినన్ని దారుణాలు తెలంగాణలో జరుగలేదని పౌరహక్కుల ఉద్యమాల నివేదికలే బట్టబయలు చేశాయి. తెలంగాణలో జరిగిన అన్ని రకాల ఉద్యమాలు తెలంగాణ సమాజాన్ని మరింత ప్రజాస్వామ్యీకరిస్తూ వచ్చాయి.

తెలంగాణ ఉద్యమం కూడా అటువంటి ప్రజాస్వామిక ఆకాంక్ష పర్యవసానమే. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు, హక్కులకు ప్రతీకగా కేసీఆర్ ముందుకు వచ్చారు. కేసీఆర్ ఏనాడూ భూస్వామ్య వర్గానికి ప్రతినిధిగా రాజకీయాల్లోకి రాలేదు. తెలంగాణ ఉద్యమం రావడానికి ముందే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సిద్ధిపేట నియోజకవర్గంలో ఆయన కులానికి చెందిన వారు వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత మంది. ప్రజల మనిషిగానే ఆయన రాజకీయ సోపానంలో ఎదిగారు. సిద్ధిపేటను ఒక నమూనాగా అభివృద్ధి చేశారు. ప్రజాకేంద్రక అభివృద్ధిని నమ్మి ఆచరించిన నాయకునిగా ఆయనకు పేరుంది. పేదల వాడల్లో తిరిగి, వారి అభివృద్ధికి ప్రణాళికలు వేయడం ఆయన మొదటి నుంచీ చేస్తున్నదే. ‘చలనశీలత ఆయన స్వభావంలోనే ఉంది. నిత్యనూతనంగా ఆలోచించడం, ఆలోచనలను ఆచరణలో పెట్టేదాకా విశ్రమించకపోవడం ఆయన తత్వమ’ని ఆయనను దగ్గరగా చూస్తున్నవారందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమ నిర్మాణానికి, ప్రస్థానానికి ఆయనకు ఆ అనుభవమే పునాదిగా పనిచేసింది. అయినా తెలంగాణ ఉద్యమ నైతికతను దెబ్బతీయడానికి, తెలంగాణ ఉద్యమం భూస్వాముల ఉద్యమమని నిందించడానికి సీమాంధ్ర ఆధిపత్య వ్యవస్థలు ఆయనకు దొర బిరుదును ప్రసాదించాయి. ఆ పేరుతో నిందించడానికి తెలంగాణ లోపలా బయటా కొన్ని పెంపుడు చిలుకలను తయారు చేశాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆ చిలుకలు ఇంకా ఆ పలుకులు మానలేదు. ఆ వంకర దృష్టి నుంచి విముక్తి కాలేదు. ఇటువంటి వారి నుంచి తెలంగాణ సమాజమే విముక్తి కావాలేమో.

సురవరం ప్రతాపరెడ్డి పద్యం

తెలుగు విశిష్టత

poem3
…..
హాలికుడను గాని పట్టలేదు హలమునెపుడు
సీత తల్లికి సేవలు సేయలేదు
కలము గిర గిరా తిప్పితి తెలివి కొలది
పాళి కొలువుననే గడిచె ప్రాయమెల్ల…

-సురవరం ప్రతాపరెడ్డి స్వగతం

Ramoji and Reality

2015/01/img_2539-0.jpg

YS Rajashekar Reddy, the sworn enemy of Ramoji Rao, is in power for six years, but could not take back an inch land in Film City? Why?

When YSR can get the Margadarshi Finance closed and settle the accounts, why not about land? May be no proof of misappropriation is reason? When Ramoji Rao stood as# symbol of anti Telangana thought policing, there may e number slogans against him, but not necessary all the way.

Telangana will continue to fight back Ramoji or some other media baron, who stoops to humiliate Telangana. Whenever Eenadu tries to write for the interests of Andhra, Telangana will continue to bombard on it by exposing.

Ramoji Rao and His Film City is a reality, which will continue to do business and brand Hyderabad. Telangana is against his thought policing, not against his business. Its hard reality to live with. With same emotional approach of movement days, Hyderabad cannot grow as a advanced and global city.

My intention is not finding fault with my friends or trying to justify everything, but to put out some points to discussion.

Is religion greater than humanity?

మతాలు మనిషిని మించినవా?

13-mumbai-terror-attack-455

మనిషిలో కలిగే అన్ని రకాల స్పందనలు, విశ్వాసాలు దేశకాల పరిస్థితులను బట్టి సంక్రమిస్తాయి. ఎక్కడయినా మనిషి మాత్రమే సత్యం. మనిషి ఆనందంగా ఉండడం మాత్రమే మౌలిక తత్వం. దానికి భంగం కలిగించేవి విశ్వాసాలు కాదు, మానవ విద్రోహాలు, కరడుగట్టిన ఉన్మాదాలు.

‘భారతీయ తత్వంలో ఉన్న గొప్పతనం మరే తత్వంలోనూ లేదు. సహిష్ణుత, వైవిధ్యం, సహజీవనం భారతీయ తత్వానికే సాధ్యమైంది’-చాలాకాలం క్రితం ఒక ఆచార్యుడు చెప్పిన మాటలివి. మా తత్వశాస్త్ర తరగతి గదిలో ఆ ఆచార్యుడు అలా ఒక తత్వాన్ని అంతగా కీర్తించడం ఎందుకో రుచించలేదు. ‘మీకు ఇలా అనిపించినట్టే, అమెరికాలోని మరో తత్వశాస్త్ర ఆచార్యునికి ప్రాగ్మాటిజంపయోజనవాదం) గొప్పగా అనిపించవచ్చు. అరబ్బు విశ్వవిద్యాలయంలోని ఆచార్యులకు ఇస్లామిక్ తత్వశాస్త్రానికి మించింది లేదనిపించవచ్చు. చైనాలోని తత్వశాస్త్ర ఆచార్యునికి కన్ఫ్యూసియన్ తత్వం అపూర్వం అనిపించవచ్చు. టిబెట్ ఆచార్యునికి బౌద్ధాన్ని మించిన తత్వం లేదనిపించవచ్చు. భారత దేశంలోనే ఇంకా నాగరిక ప్రపంచంలోనికి రాని గిరిజన ప్రజల్లో, లాటిన్ అమెరికా, ఆఫ్రికా అడవుల్లో నేటికి ఈ ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉన్న గిరిజన తెగల్లో ఏ తత్వాన్ని, ఏ దేవున్ని, ఏ శక్తిని ఎక్కువ ఇష్టపడతారో, కొలుస్తారో తెలియదు. పుట్టిన పరిస్థితులు, పెరిగిన వాతావరణం, ఎదుర్కొన్న సవాళ్లు ఏ మనిషికి ఏ తత్వాన్ని, ఏ మతాన్ని ఇస్తుందో తెలియదు. మనమే గొప్ప అనుకోవడం ఎలా సార్?’. ఆయన వెంటనే వాస్తవంలోకి వచ్చి ‘తత్వానికి మతం లేదు, స్థలంలేదు, కాలం లేదు. ప్రజలకు ఇష్టమయిందాన్ని బట్టి, అర్థమయిందాన్ని బట్టి అది మనుగడ సాగిస్తుంది. లేదా వెనుకబడిపోతుంది. నాకు ఇష్టమయింది కాబట్టి భారతీయ తత్వాన్ని ఎక్కువగా భావించాను. మన ఇష్టాయిష్టాలకు అతీతంగానే తత్వాలను చూడాలి’ అని ఆచార్యులు సమాధానపరిచారు. ఈ ప్రశ్నలు, చర్చలు ఎడతెగనివి. ఏ దేవుడు గొప్ప? ఏ మతం గొప్ప? అన్న ప్రశ్నలు ముందుకు తేవడమే అనర్థం.

‘భారత దేశంలోని వారంతా మూలంలో హిందువులేన’ని ఒక నాయకుడంటే, ‘ప్రపంచంలోని వారంతా అల్లాహ్ బిడ్డలే’ అని ఒక నాయకుడన్నారు. క్రైస్తవులు కూడా తమ దేవుడిని ‘దేవుళ్లకు దేవుడు, ప్రభువులకు ప్రభువు’ అని భావిస్తారు. మన దేవుళ్లను పూజించడం, ఆరాధించడం, కీర్తించడం మన జీవన విధానం నుంచి వచ్చింది. ఎవరినీ పూజించకుండా జీవించేవాళ్లు, ప్రకృతిని ఆరాధించి బతికేవాళ్లూ ఉన్నారు. ఉంటారు. అవి వారివారి సాంస్కృతిక జీవన విధానాలు. ఇటువంటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైవిధ్యం మొన్న ఉంది, నిన్న ఉంది, రేపూ ఉంటుంది. వేదాలు రాసిన ఈ గడ్డపైనే వేదాలను తిరస్కరించిన చార్వాకులూ ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ సహజీవనం కొనసాగుతూనే ఉన్నది. ఎటొచ్చీ ఎవరు గొప్ప అన్న ప్రశ్నలు వేసుకుని, ఒక మతంతో మరో మతాన్ని, ఒక దేవునితో మరో దేవుడిని పోటీ పెట్టాలని చూసినప్పుడు మాత్రమే ఘర్షణ పుడుతుంది. ఇటువంటి ఘర్షణలన్నీ చరిత్రలో అధికారంకోసం, రాజకీయాలకోసం మొదలయి యుద్ధాలదాకా వెళ్లాయి. మనం నాగరికులం అనుకుంటున్నాం. ఎదిగామనుకుంటున్నాం. ఖగోళ మూలాలను ఛేదించే బాటలో పయనిస్తున్నాం. సృష్టికి ప్రతిసృష్టి చేయడం గురించి పరిశోధనలు చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఇటువంటి మధ్యయుగాల వాదాలతోనే యుద్ధాలకు దిగుదామా?

భవిష్యత్తులో ‘నాగరికతల సంఘర్షణ(clash of civilizations)’ జరిగే ప్రమాదం ఉందంటూ అమెరికన్ రాజనీతి శాస్త్రవేత్త హంటింగ్టన్ రెండున్నర దశాబ్దాల క్రితం చెప్పిన జోస్యం ఆచరణ రూపం తీసుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. మరో ప్రపంచయుద్ధం అంటూ వస్తే, అది క్రైస్తవ, ఇస్లామిక్ ప్రపంచాల మధ్య యుద్ధంగా జరుగుతుందని పాశ్చాత్య రాజనీతిజ్ఞులు కొంతకాలంగా విశ్లేషణలు చేస్తున్నారు. మనిషి, మానవత్వం కంటే రాజకీయ అధికారం, ఆధిపత్యం మత లక్ష్యాలుగా మారడం ఇవ్వాళ ఇటువంటి దుస్థితికి కారణం. ఈ ధోరణి విస్తరించి, వికటించే కొద్ది మానవాళికి ముప్పు పెరుగుతుంది. ఈసారి అటువంటి యుద్ధమంటూ వస్తే మిగిలేది నాగరికతలు, మతాలు, దేశాలు కాదు…బూడిద.

విచిత్రం ఏమంటే అన్ని మతాలూ దేవుడిని కీర్తించే విషయాలు ఒకే విధంగా ఉంటాయి. ‘దేవుడు ఒక్కడే, సర్వవ్యాపి, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, దయామయుడు’-అన్ని మతాలూ దాదాపూ ఇలాగే కీర్తిస్తాయి. కొన్ని మతాలు దేవుడిని ‘నిరాకారుని’గా భావిస్తాయి. ‘నిర్గుణుడి’గానూ భావిస్తాయి. మరికొన్ని మతాలు దేవుడిని విశ్వరూపుడు, తేజోరూపుడు, సద్గుణ సంపన్నునిగా భావిస్తాయి. మనిషి పుట్టుక నుంచి, దేశకాల పరిస్థితుల నుంచి, వారివారి అనుభవాల నుంచి, ఒక్కో కాలానికి, ఒక్కో ప్రాంతానికి, ఒక్కో దేవుడు అవతరించాడు. ఇప్పుడు ప్రపంచమంతటా వందలు, వేల దేవుళ్లు ఉన్నారు. ఎవరి దేవుడు వాళ్లకు. ఎవరి గొప్ప వారిదే. ఎవరి నమ్మకం వారిదే. ప్రపంచమంతటా మనుషులు తమకు రక్షణగా దేవుడిని ఆశ్రయించారు. దేవుడు అదే మనుషులను చంపమంటాడా? చంపి సాధించేది భక్తి కాదు, ఆధిపత్యం, అధికారం. మతం, విశ్వాసం మనిషి, మనసుకు సంబంధించినవి. వాటిని అనుభవించనీయండి. ఆసరా పొందనివ్వండి. ఆ మనుషులను రాక్షసులను చేసే దిశగా మతం, విశ్వాసం ఎదగకుండా చూడండి. ‘త్యాగరాజ కీర్తనలు వింటే నేను ప్రపంచాన్ని మరచిపోతాను. అందులో ఎంత తాదాత్మ్యత? ఎంత తాత్వికత? ఎంత భక్తి? ప్రపంచమంతా తిరిగాను. ఇంకే సంగీతం విన్నా నాకు ఇలా అనిపించలేదు’ అని ఒకసారి మా తత్వశాస్త్ర ఆచార్యులు అన్నారు. నేను పుట్టుకతో త్యాగరాజు కీర్తనలు వినలేదు. గుమ్మడికాయ బుర్రతో తయారు చేసుకున్న తంబురపై ఊరంతా తిరుగుతూ మా మాబాయి పాడిన రామదాసు కీర్తనలే నాకు బాగా గుర్తు. ఏక్‌తారతో సన్నని గొంతు కలిపి ఆయన పాడుతుంటే ఎంతో మైమైరచిపోయేవాళ్లం. ఆదిలాబాద్ అడవుల్లో గుస్సాడి నృత్యానికి, వారి పాటలకు అక్కడి గిరిజనం ఊగిపోతుంది. రష్యాలో జాజ్, రాక్, యూరప్‌లో పాప్, అమెరికాలో రాక్, జాజ్, తూర్పు ఆసియాలో బుద్ధిస్టు సంగీతమంటే చెవులుకోసుకుంటారు. ఇంకా దేశంలో ఎక్కడెక్కడి ప్రజలను ఏయే సంగీతాలు ఎలా కదిలిస్తాయో తెలియదు. మన నరాల్లో ఇంకిపోయిన సంగీత తంత్రులు మనకు మన జీవితం నుంచి సంక్రమించినవి. అంటే మనిషిలో కలిగే అన్ని రకాల స్పందనలు, విశ్వాసాలు దేశకాల పరిస్థితులను బట్టి సంక్రమిస్తాయి. ఎక్కడయినా మనిషి మాత్రమే సత్యం. మనిషి ఆనందంగా ఉండడం మాత్రమే మౌలిక తత్వం. దానికి భంగం కలిగించేవి విశ్వాసాలు కాదు, మానవ విద్రోహాలు, కరడుగట్టిన ఉన్మాదాలు.

పెషావర్, బెంగళూరు, పారిస్, వజీరిస్థాన్… ప్రపంచంలో ఎక్కడ తూటాలు పేలుతున్నాయన్నా, ఎక్కడ బాంబులు పేలుతున్నాయన్నా, ఎక్కడ టార్పెడోలు రాలుతున్నాయన్నా….మత ప్రేరిత యుద్ధోన్మాదాలే కారణం. ఈ మతం ఆ మతం అన్న భేదం అక్కర లేదు. అమెరికా, పాశ్చాత్య దేశాలు లక్షల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి ఒకప్పుడు మతోన్మాద భూతాన్ని సృష్టించి భూమండలంపై వదిలాయి. మధ్యయుగాల్లో మట్టికలసి పోయిన మతోన్మాద భూతాన్ని తట్టి లేపి కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఉసిగొల్పారు. ‘కమ్యూనిజం పీడ’ నుంచి ప్రపంచాన్ని విముక్తి చేయడంకోసమని ఇస్లామిక్ ఉగ్రవాదులను చిన్నపిల్లల్లా సాకారు. తుపాకి గొట్టం నుంచి అధికారం ఎలా సాధించుకోవచ్చో వారికి రుచి చూపారు. మతం పేరుతో రాజ్యాలను ఎలా కొల్లగొట్టవచ్చో అఫ్ఘనిస్థాన్‌లో వారికి అనుభవంలోకి వచ్చింది. అదే సూత్రాన్ని ప్రపంచమంతటికీ విస్తరిస్తున్నారు. ఆ ఉగ్రవాదమే సర్వవ్యాప్తతమై ప్రపంచాన్ని వణికిస్తున్నది. ఇప్పుడు అదే అమెరికా ఉగ్రవాదాన్ని అణచివేత పేరుతో ఇస్లామిక్ దేశాలకు వ్యతిరేకంగా గిల్లి గిల్లి యుద్ధాలు చేస్తున్నది. చివరికి ఇది మతయుద్ధంగా పరిణమిస్తుందా అన్న భయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. భవిష్యత్తులో ‘నాగరికతల సంఘర్షణ(clash of civilizations)’ జరిగే ప్రమాదం ఉందంటూ అమెరికన్ రాజనీతి శాస్త్రవేత్త హంటింగ్టన్ రెండున్నర దశాబ్దాల క్రితం చెప్పిన జోస్యం ఆచరణ రూపం తీసుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. మరో ప్రపంచయుద్ధం అంటూ వస్తే, అది క్రైస్తవ, ఇస్లామిక్ ప్రపంచాల మధ్య యుద్ధంగా జరుగుతుందని పాశ్చాత్య రాజనీతిజ్ఞులు కొంతకాలంగా విశ్లేషణలు చేస్తున్నారు. మనిషి, మానవత్వం కంటే రాజకీయ అధికారం, ఆధిపత్యం మత లక్ష్యాలుగా మారడం ఇవ్వాళ ఇటువంటి దుస్థితికి కారణం. ఈ ధోరణి విస్తరించి, వికటించే కొద్ది మానవాళికి ముప్పు పెరుగుతుంది. ఈసారి అటువంటి యుద్ధమంటూ వస్తే మిగిలేది నాగరికతలు, మతాలు, దేశాలు కాదు…బూడిద.