ట్రంపా? టెడ్రోసా?


కరోనాను నిర్లక్ష్యం చేసిందెవరు?

(రాజ సిద్ధార్థ)

పావర్టీ అఫ్‌ జర్నలిజం శిఖరాలకు ఎగబాకుతున్నది. అధికారంలో ఉన్నవారి పాదస్పర్షకోసం తహతహలాడడం, ఉన్నవీలేనివీ తెలిసినవీ తెలియనివీ రాసిపారేయడం, అసత్యాలు అర్ధసత్యాలు వాగిపారేయడం…ఎంతకాలుష్యమో…ఇది కరోనా వైరస్‌కంటే ప్రమాదకరంగా మారుతున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వైఫల్యాల గురించి నిన్న నేడు ఒక చానెల్‌లో, ఒక పత్రికలో కథనాలు వచ్చాయి. పచ్చి అబద్ధాలు. ఇక్కడ కేసీఆర్‌కోసం అబద్ధాలు రాశారంటే అర్థం చేసుకోవచ్చు. ఎక్కడో ఉన్న ట్రంపుకోసమూ పరమ అసహ్యకరమైన అసత్య ప్రవచనమేనా!

ట్రంపు అనే పెద్దమనిషి కరోనా అసలు తమకు పెద్ద సమస్య కాదన్నట్టు బిల్డప్‌ ఇచ్చాడు. తీసుకోవాల్సిన చర్యలేవీ తీసుకోలేదు. ఎన్నికల ప్రచారం, ప్రపంచదేశాలలో కరచాలనాలు చేసుకుంటూ తిరిగాడు. ఒక్క ట్రంపే కాదు ఏ దేశమూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను పట్టించుకోలేదు. ఎందుకంటే చులకనభావం. తామిచ్చిన చిల్లరతో నడిచే సంస్థలని చిన్న చూపు. భారతదేశమూ అలాగే వ్యవహరించింది.

వాస్తవం ఏమంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ జనవరి 31న ప్రపంచ ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటించింది. ఆరోజు నాటికి 18 దేశాలలో 96 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్చి 11న కోవిద్‌-19ని ఒక మహమ్మారిగా ప్రకటించింది. ‘ ఇప్పటికే 119 దేశాలకు తాకింది. ఇది ప్రపంచ మంతా వేగంగా విస్తరిస్తున్నది.  ఒకరి నుంచి మరొకరికి పాకుతున్నది. ఇది కేవలం ప్రజారోగ్య సంక్షోభం కాదు, అన్ని రంగాలను తాకే సంక్షోభం. ప్రతి ఒక్కరిని కోవిద్‌ వ్యతిరేక పోరాటంలోకి తీసుకురావాలి’ అని టెడ్రోస్‌ ప్రకటించారు.

లాక్‌డౌన్‌ అవసరం లేదు. వ్యాపారాలు కుప్ప కూలుతాయి అని చెప్పినవారు ఇప్పుడు నాలుక మడతేసి మాట్లాడుతున్నారు. కరనోపై ‘నేనెందుకు బాధ్యత తీసుకోవాలి. అది మహమ్మారి అని నాకు ముందే తెలుసు’ అని మార్చి 12న రోజ్‌ గార్డెన్‌ సభలో ట్రంపు ప్రకటన చేశారు. కరోనాపై డెమాక్రాట్స్‌ అబద్ధాలు చెబుతున్నారని, మనకు పెద్ద ప్రమాదమే లేదు అని కూడా మరో సభలో చెప్పారు. మన దేశానికి పెద్దగా రిస్కు లేదని సర్జన్‌ జనరల్‌ చెప్పారని స్వయంగా ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇప్పుడేమో ‘నేను యుద్ధకాలపు అధ్యక్షుడిని’ అని ప్రకటించుకుంటున్నారు.  ‘మావాళ్లు ఈస్టర్‌కల్లా(ఏప్రిల్‌12) విధులకు రావాలనికోరుకుంటున్నా’ అని కూడా ట్రంపు మార్చి 24న ప్రకటిస్తారు. ఇది చిన్న జలుబు సమస్య ఏమీ కాదు మాకు రోధ నిరోధక శక్తి ఎక్కువ అని బ్రెజిల్‌ అధ్యక్షడు బోల్సనారో చెప్పారు. నిక్షేపంగా రెస్టారెంట్లకు వెళ్లండి తినండి అని మెక్సికో అధ్యక్షుడు తన ప్రజలకు చెప్పారు. ఇంకా ఎవరెవరు ఏమి చెప్పారు రాస్తే పెద్ద లిస్టు అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌మార్కెట్లు ఫిబ్రవరి 24నాటికే కుప్పకూలడం మొదలుపెట్టాయి. ఫిబ్రవరి 29న అమెరికాలో తొలిపౌరుడు కరోనాతో మరణించారు. మార్చి 17 నాటికి కోవిడ్‌ మృతుల సంఖ్య 100కు చేరింది. మార్చి 20 నాటికి ఒక్క న్యూయార్కులోనే 5600 కేసులు నమోదయ్యాయి. అమెరికా ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఎన్‌95 మాస్కులకు ఆర్డరిచ్చింది మార్చి 21న. జనవరి 3 నుంచి మార్చి 21 వరకు చాలా విలువైన సమయాన్ని ట్రంపు ప్రభుత్వం వృధా చేసింది.

Ashish Jha, director of the Harvard Global Health Institute, described the Trump administration’s messaging so far as “deeply disturbing,” adding that it’s “left the country far less prepared than it needs to be for what is a very substantial challenge ahead.”

ట్రంపు వ్యాపారి. మాటకారి. వాగరి. ఎటుబడితే అటు మాట్లాడతాడు. దేనినీ లెక్క చేయడు. తీరా ఏదైనా సమస్య మీదపడితే అప్పుడు ఎవరో ఒకరిపై నెపం మోపుతాడు. ప్రపంచంలోని వాగుబోతులందరి శైలి ఇలాగే ఉంటుంది. పోనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైంది అనుకోండి…ప్రపంచ పోలీసుగా, ప్రపంచ గూఢచారిగా వ్యవహరించే నీ నిఘా వ్యవస్థలన్నీ ఏమయ్యాయి? నీ పోలీసులు ఏమయ్యారు? ఎవరినయినా మాట్లాడనిచ్చావా? ఒక మెడికల్‌ జర్నలిస్టు అట. ఇథియోపియా కమ్యూనిస్టు ప్రభుత్వంలో టెడ్రోస్‌ మంత్రి అట. అందుకే కమ్యూనిస్టు చైనాతో కుమ్మక్కయి సమస్యను బయటికి చెప్పకుండా దాచారట. ఇలా అబద్ధాలను పోగేసేవారు కరోనాకంటే ప్రమాదకారులు. అసలు ఇథియోపియాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉన్నదెప్పుడు? టెడ్రోస్‌ కమ్యూనిస్టు అయినదెప్పుడూ?  ఇథియోపియాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఎప్పుడో 1991లోనే కూలిపోయింది. ఇప్పుడంత నడుస్తున్నది డెమాక్రాట్స్‌ జమానా. సంస్కరణవాదుల ప్రభుత్వం. ఫెడరల్‌ డెమాక్రాట్‌ ప్రభుత్వంలో 2016 వరకు విదేశాంగ మంత్రిగా ఉన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే కుక్కకు బొక్కదొరికిన చందంగా కొన్ని కాల్పనిక చెత్త బుర్రలు ప్రతిసందర్భాన్ని కమ్యూనిస్టు వ్యతిరేకతను ప్రదర్శించడానికి, వారిపై దుమ్ముపోయడానికి ప్రయత్నిస్తున్నారు.

 

 

Author: kattashekar

Former Editor, Namasthe Telangana Daily