చంద్రబాబుకు సరైనోడు కేసీఆరే


వైస్రాయ్ సిద్ధాంత కర్త కేసీఆరేనని 2001లో చెప్పి ఉంటే బాగుండేది. అప్పుడేమో నేనే మొనగాడినని చెప్పుకున్నవు. కేసీఆర్ పక్కనబెట్టి అవమానించినవు. ఇప్పుడేమో కేసీఆర్ అంటున్నవు. నిజంగానే అది నాలుకా తాటిమట్టా? కులగజ్జిని మహావృక్షంలా పెంచిన చంద్రబాబు, ఆయన బాకా మీడియా కేసీఆర్ కులాన్ని అంటగట్టాలని చూశాయి. చంద్రబాబు దేశమంతా తిరిగి ఏ చక్కానయినా కలవవచ్చు, అది తప్పు కాదట, కేసీఆర్ తిరిగి రాష్ర్టాల ముఖ్యమంత్రులను కలవడం, ఆ తర్వాత నరేంద్ర మోడీని కలవడం తప్పట. బ్రీఫింగ్ చేయడానికి కలిశావా అని నువ్వు ప్రశ్నిస్తే జనం నవ్విపోరా చంద్రబాబూ. బ్రీఫింగ్ గురించి ‘బ్రీఫ్డు మీ’ సాక్షిగా నీకు ఎంత అనుభవం ఉందో ఎవరికి తెలియదు చంద్రబాబూ. ఇంతకాలం మీరంతా కట్టగట్టుకుని ఏది చేస్తే అది రాజకీయం. మీరు చెప్పేది వేదం. మీరు ఆడింది ఆట. పాడింది పాట. ఇక నడవదు బాబూ. మీరు తప్పు చేసినా రైటే. దొంగతనం చేసినా రైటే. కేసులు కొట్టేయించుకున్నా రైటే. మీకు అలా సాగింది. ఇంక కష్టం బాబూ.

ఇంతకాలానికి మీకు సరైనోడు దొరికాడు. నీగురించి కేసీఆర్ అన్నవన్నీ అక్షర సత్యాలు. వెన్నుపోటు పొడవలేదా? మాటలు మార్చలేదా? పార్టీలు మార్చలేదా? పిల్లిమొగ్గలెయ్యలేదా? ఆంధ్రప్రజల మనోభావాలతో ఇష్టమొచ్చినట్టు ఆడుకోలేదా? మోడీతో నాలుగేళ్లు అంటకాగి ఇప్పుడు అడ్డం తిరిగావు. కాంగ్రెస్ సర్వనాశనం కావాలని శాపనార్థాలు పెట్టినోడివి ఆ పార్టీ కొంగుపట్టుకున్నావు. నీకు విలువలు లేవన్నది అందుకే. పచ్చి మోసగాడివి అన్నదీ అందుకే. హైటెక్ సిటీ నేనే కట్టాను అన్నావు. అంతమొనగాడివైతే సొంత రాజధాని నాలుగేళ్లలో ఎందుకు కట్టలేదు. ఇప్పుడు బున్యాదులు తీసి, ఇంత సిమెంటు కాంక్రీటు బోసి అదేదో ఘనకార్యం చేసినట్టు బిల్డప్ ఇచ్చుడు ఏంది? నీ డబ్బాలు, బాకాలు దానికి అంతగా జోకుడేంది?

చంద్రబాబూ నీకు మర్యాద కావాలా? పార్టీ పెట్టి, ప్రజలను గెలిచి, ప్రభుత్వాన్ని సాధించి, మీ అందరికీ పదవులు ఇచ్చి, అధికారంలో కూర్చో బెడితే ఆయనకు వెన్నుపోటు పొడిచి, ఆయనపై చెప్పులు వేయించి, ఆయనను దారుణంగా అవమానించి, గుండె పగిలి చనిపోయేలా చేసిన ఘాతక చరిత్ర నీది. చంద్రబాబు ఇప్పుడు కూడా తాను బాధితుడి ఫోజు పెట్టి మరోసారి జనాన్ని మోసం చేయాలని చూస్తున్నడు. నరేంద్రమోడీ, జగన్, పవన్, కేసీఆర్ అందరూ ఒక్కటయ్యారని అబద్ధపు ప్రచారం చేసి, తానొక్కడినే కొట్లాడుతున్నానని జనాన్ని నమ్మించాలని చూస్తున్నడు. పవన్ కల్యాణ్ కొంపలు కూల్చడానికి ఇప్పటికే కొందరు కోవర్టులను ఆయన పార్టీలో చేర్పించాడు. ఎన్నికల వేళ వాళ్లు తమ నిజస్వరూపం ప్రదర్శిస్తారు. కుళ్లు, కుతంత్రాలు, కుట్రలు అబ్బో చంద్రబాబు రాజకీయ డిక్షనరీలో వాడని పదం లేదు.

చంద్రబాబుకు ఆంధ్రను బాగుచేసే ఉద్దేశం ఏమీ ఉండదు. ఎప్పటికప్పుడు వచ్చే ఎన్నికల్లో గెలవడం ఒక్కటే ఆయన ఎజెండా. అందుకోసం ఎంతకయినా తెగించడమే ఆయన నైజం. మళ్లీ ఆంధ్ర ప్రజలను పిచ్చోళ్లను చేసి ఆడించాలని చూస్తున్నడు. ఆయన పాతకాలను సమర్థించేందుకు బాకాలు, డబ్బాలు మళ్లీ మోపయినయి.

Author: kattashekar

Former Editor, Namasthe Telangana Daily