శకునాల బల్లి చంద్రబాబు


img_4885-3

తెలుగుదేశం చంద్రబాబునాయుడు అంతటి రాజకీయ అవకాశవాది, మాటలు మార్చే వాడు దేశంలో మరొకరు ఉండరు. ఏమాత్రం వెన్నెముక లేని రాజకీయ జీవి. నాలుగేళ్లపాటు ప్రధాని నరేంద్రమోడీతో అంటకాగిన చంద్రబాబు ఇప్పుడు ఏమీ తెలియనట్టు, ఏమీ జరగనట్టు వీరావేశాలు ప్రదర్శిస్తున్నారు. మూడో ఫ్రంటుకు అవకాశమే లేదని, నరేంద్రమోడీకి మేలు చేయడంకోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలలో ఏదో పార్టీకి దూరంగా ఫ్రంటులు మనుగడ సాగించలేవని చెబుతున్నారు. మరి 1989లో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు, ఆ తర్వాత 1996లో ఏర్పాటైన యునైటెడ్ ఫ్రంట్ ఎలా వచ్చాయి? ఎలా ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి?

చంద్రబాబునాయుడు దివాళాకోరు కాబట్టి అవేవీ గుర్తు లేవు. కాంగ్రెస్, బీజేపీలు ఒంటరిగా లేక కూటములుగా ఈసారి 150 నుంచి 200 స్థానాలలోపే గెల్చుకుంటాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 225 లోక్ స్థానాలు ఉన్నాయి. ఈ రాష్ర్టాలలోని ప్రాంతీయ పార్టీలన్నీ జట్టు కడితే కాంగ్రెస్, బీజేపీ కూటమిలకంటే ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉంది. ఈ స్థానాల బలంతో కేంద్రంలో నిర్ణాయక పాత్ర పోషించవచ్చు. కాంగ్రెస్, బీజేపీలను ఫెడరల్ ఫ్రంటుకే మద్దతు ప్రకటించాలని కోరే అవకాశం ఉంది. అది వదిలేసి నోటికి వచ్చినట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారు. తనకు అనువైతే ఒకరకంగా కాకపోతే మరో రకంగా నాలుక మడతేయడం చంద్రబాబుకు అలవాటే.

Author: kattashekar

Former Editor, Namasthe Telangana Daily