ఉత్తమ్ ప్రతిజ్ఞల కథ


ఉత్తమ్ గడ్డం తీసి ప్రచారానికి వెళితే బాగుండేది అని ఆ మధ్య రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఒక సీనియర్ సిటిజన్ అన్నారు. ఆయన కాంగ్రెస్ గెలిపించే దాకా గడ్డం తీయనన్నారని చెబుతారు. అంత తీవ్రమైన ప్రతిజ్ఞ ఎందుకు చేశారో తెలియదు.

ఇది ఇలా ఉండంగానే మొన్న మీట్ ప్రెస్ కూటమి గెలవకపోతే నేను గాంధీభవన్ అడుగుపెట్టను అని మరో ప్రతిజ్ఞ చేశారు. మరుసటిరోజు మరో మీట్ ప్రెస్ తూచ్ నేను తమాషాకు అన్నాను అన్నారు. బహుశా గెలవదని గ్రహించి తూచ్ అన్నాడేమోనని ప్రత్యర్థులు కామెంటు చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించే ఒక సీనియర్ నాయకుడు ఇటువంటి ఆషామాషీ ప్రకటనలు చేయడం విడ్డూరం. ఆయన తమ పార్టీ శ్రేణులకు భరోసా ఇవ్వడం కోసం ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారేమో, కానీ నవ్వుల పాలు కావడం తథ్యం.

ప్రతిజ్ఞలతోకాదు సమర్థవంతమైన నాయకత్వంతో భరోసా ఇవ్వాలి. ఒట్టిమాటలు ఎంత గట్టిగా చెప్పినా జనం లెక్కచేయరు. అంచనాలు, సర్వేలు అన్నీ టీఆర్ విజయావకాశాలను సూచిస్తున్నాయి. అదేగనుక జరిగితే ఉత్తమ్ గడ్డం కథ ఎలా ముగుస్తుందని అందరూ ప్రశ్నిస్తున్నారు.

Author: kattashekar

Former Editor, Namasthe Telangana Daily