వాళ్లు మనోళ్ల్లు కాదు


తెలంగాణకు పనికొచ్చే పార్టీ ఏదో, పనికిరాని పార్టీ ఏదో ఇక్కడి ప్రజలు మునుపటి ఎన్నికల్లోనే నిర్ణయించారు. ఇప్పుడింత చర్చ అవసరం లేదు. ప్రజలకు స్పష్టత ఉన్నది. నాయకులకే లేదు. కాం గ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు ఎంత గొంతు పెంచి మాట్లాడినా పరిస్థితి మారదు. ఎందుకంటే తెలంగాణ విషయంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు ప్రయోజన వైరుధ్యం ఉన్నది. టీడీపీ ప్రథమ ప్రాధాన్యం సహజంగానే ఆంధ్రప్రదేశ్. చంద్రబాబునాయుడు ఎన్నిమాటలు చెప్పినా ఆయన ఆంధ్ర ప్రయోజనాల విషయంలో రాజీపడి తెలంగాణకు మేలుచేయడం అన్నది జరుగని పని. ఆయ న నాగార్జునసాగర్, శ్రీశైలం నుంచి తెలంగాణకు ఎన్ని నీళ్లు ఇస్తున్నామన్నది పట్టించుకునే అవకాశమే లేదు. గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లు తెచ్చుకుంటున్నా, శ్రీశైలం నుంచి నీటి దోపిడీని ఆపలే దు. ఆయనకు పోతిరెడ్డిపా డు నుంచి ఎంత వీలైతే అం త నీరు రాయలసీమకు తరలించుకుపోవడమే ముఖ్యం. మహబూబ్‌నగ ర్, నల్లగొండ జిల్లాలకు కృష్ణా నీటిపై ప్రాథమిక హక్కు ఉందన్న విషయమే ఆయన గుర్తించరు. హైకోర్టు ను విభజించడానికి అంగీకరించరు. విభజించేలోపే జ్యుడీషియల్ ఉద్యోగాల భర్తీని, ప్రమోషన్లను పూర్తి చేయడానికి ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేస్తారు. తెలంగాణకు నష్టం జరిగే పనులు ఎన్ని ఉంటే అన్ని చేస్తూపోతారు. చంద్రబాబుకు స్పష్టత ఉన్నది. ఆయన మనిషి, మనసూ రెండూ అమరావతిలోనే. తెలంగాణ గురించి మాట్లాడేదంతా నటన మాత్రమే. ఆయనే కాదు, ఆయనకు మద్దతుగా నిలిచే మీడియా, మేధావులు అంతా మనుషులే ఇక్కడ, మనసంతా అక్కడే. ఎటొచ్చీ స్పష్టతలేనిది తెలంగాణలోని కొద్దిమంది టీడీపీ నాయకులకు మాత్రమే. ఇంకా పసుపు పతాకాన్ని తెలంగాణ పల్లెల్లో ఊరేగిస్తున్న వీళ్లను చూస్తే జాలేస్తున్నది. వారికి ఇంకా ఓట్లేవో ఉన్నాయని భ్రమించి వారితో జట్టు కడుతున్న పార్టీలను చూస్తే ఇంకా సిగ్గేస్తున్నది. తెలంగాణకు అడ్డంపడ్డనాడే టీడీపీ పతనం ఆరంభమైంది. 2014 ఎన్నికల్లో దాని స్థానం దానికి చూపించారు. గత నాలుగున్నరేండ్లలో తెలంగాణలో కాస్త బుద్ధి జీవులనుకున్న తెలుగు తమ్ముళ్లంతా ఇతర పార్టీల్లోకి మారిపోయారు. చంద్రబాబు ఇచ్చే టికెట్లకు, ఆయన ఇచ్చే ఎన్నికల నిధులకు, మొత్తంగా రాజకీయ బానిసత్వానికి అలవాటుపడ్డ కొద్దిమంది నాయకులు మాత్రమే ఇప్పటికీ ఆయన సేవ లో తరిస్తున్నారు. ఆ పార్టీని ఎవరూ అంతం చేయవలసిన పనిలే దు. దానికి తెలంగాణలో సహజ మరణం తథ్యం. ఈ ఎన్నికలు ఆ విషయాన్ని రుజువు చేయబోతున్నాయి.

కాంగ్రెస్ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. వాళ్ల మనుసులిక్కడ, మనసు ఢిల్లీలో. కాంగ్రెస్ ప్రథమ ప్రాధాన్యం కూడా జాతీయ రాజకీయాలు. జాతీయ రాజకీయ అవసరాలు. తెలంగాణలో ఏది చేయాలన్నా పక్క రాష్ర్టాల్లో లేదా జాతీయస్థాయిలో అది చేయగలమా లేదా అని ఆలోచించుకోవలసిన పరిస్థితి. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు వారి మనసంతా అప్పటి ముఖ్యమంత్రుల చుట్టూ. ముఖ్యమంత్రి రైటంటే రైటు, రాంగంటే రాంగు. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ సామర్థ్యాన్ని అడ్డగోలుగా పెంచుతూ ఉంటే పి.జనార్దనరెడ్డి వంటి కొందరు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఉంటే నీటిపారుదల మంత్రి పొన్నాల లక్ష్మయ్య వెళ్లి ఆ పనులకు జెండా ఊపి వస్తారు. పోతిరెడ్డిపాడు రైటే అని ఒక తెలంగాణ నాయకుడు సమర్థిస్తూ మీడియాకు ఎక్కుతారు. ఈ ఏడాది ఈ సీజనులో కృష్ణా జలాల్లో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలు ఎన్ని నీళ్లు వాడుకున్నాయి, పోతిరెడ్డిపాడు, హంద్రీ నీవాల ద్వారా ఎన్ని నీళ్లు వెళ్లిపోయాయో లెక్కలు తీస్తే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేసిన పాపాలేమిటో ప్రజలకు అర్థమవుతాయి. ఈ సీజనులో తెలంగాణ ఉపయోగించుకున్న నీటి మొత్తమే 77.311 టీఎంసీలయితే, ఆంధ్ర లెక్కచెప్పకుండా, లెక్కకు దొరుకకుండా తరలించిన నీరే 90 టీఎంసీలు. ఆ రాష్ట్రం మొత్తం తరలించిన నీరు 229 టీఎంసీలు. తెలంగాణ వైపు కృష్ణా ప్రాజెక్టులను తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన నిర్వాకం ఫలితమి ది. అందుకే ఆ పార్టీలకు తెలంగాణ మొదటి ప్రాధాన్యం కాదు. ఇప్పుడు అవసరార్థం రుణమాఫీ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ 2014లోనే ఆ పనిచేసి ఉండవచ్చు. దేశమంతా తమ పార్టీని ప్రజ లు తిరస్కరించిన తర్వాత రైతులకు ఏమి చేయాలో గుర్తొచ్చిందా? రైతులు సంక్షోభంలో కూరుకుపోవడానికి ఆర్థిక సంస్కరణల పేరిట సబ్సిడీలు ఎత్తివేయడం కారణం కాదా!

కాంగ్రెస్ విధానాలు రాజకీయ అవసరార్థం, ఆపదమొక్కులకోసం జనించేవి తప్ప, ప్రజల అవసరాలు గుర్తించి రూపొందించే వి కాదు. కాంగ్రెస్‌కు ప్రజలను కేంద్రంగా చేసుకొని ఆలోచించే విధానమే లేదు. అటువంటి ఆలోచనావిధానం ఉంటే తెలంగాణ రాష్ర్టాన్ని 2004లోనో 2005లోనో ఏర్పాటుచేసి ఉండేవారు. ఇన్ని ఉద్యమాలు, ఇంత గోస తెలంగాణ ప్రజలు పడి ఉండేవారు కాదు. ఇప్పుడు కూడా దేశమంతా ఒక విధానం లేదు. ఇక్కడ ఒకేసారి రుణమాఫీ చేస్తామంటారు. ఇప్పటికే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన రాష్ర్టాల్లో మాత్రం అనేక వాయిదాలు పెడుతారు. ఆర్థిక పరిస్థితి బాగోలేదని సన్నాయి నొక్కులు నొక్కుతారు. విధాన నిర్ణయా లు చేయడానికి, వాటిని అమలుచేయడానికి ఒకే పార్టీ, ఒకే నాయకుడు కావాలి. బహునాయకత్వం, బలహీనమైన పార్టీ కాదు. ఎం తో దూరం ఎందుకు? ఉద్యోగాల భర్తీ విషయమై కాంగ్రెస్ నాయ కులు ఎన్నిరకాల మాటలు మాట్లాడుతున్నారో గమనించండి. ఒకాయన లక్ష ఉద్యోగాలిస్తామంటే ఇంకొగాయన రెండు లక్షల ఉద్యోగాలిస్తామంటాడు. ఇదే కాంగ్రెస్ నాయకులు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు వ్యతిరేకంగా, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్లకు వ్యతిరేకంగా అదేపనిగా కేసులు వేయిస్తారు. కాంగ్రెస్ నాయకులది విచిత్రమైన మనస్తత్వం. వాళ్ల కార్యస్థలం ప్రజల మధ్య కాదు. కోర్టుల వద్ద. ప్రజల కోసం కొట్లాడరు. ప్రజలకు వ్యతిరేకంగా కోర్టులకు వెళతారు. ఉద్యోగాల భర్తీ, సాగునీటి ప్రాజెక్టులు, పాలనాసంస్కరణలు అన్నింటి మీద కేసులే. ప్రజలకు ఏదైనా చేయమని డిమాండు చేసేవాళ్లు నాయకులు. ఏదీ చేయకుండా ఆపేవాళ్లు పేచీకోరులు. మర్రి శశిధర్‌రెడ్డి అని ఒక నాయకుడున్నాడు. ఆయన ప్రజల మధ్య కనిపించేది తక్కువ. కోర్టుల్లో కనిపించేది ఎక్కువ. విషాదమేమంటే వీళ్లకు ప్రజలను ఎక్కడ గెలువాలో, ఎలా గెలువాలో తెలియకపోవడం.

బీజేపీది కూడా దాదాపు కాంగ్రెస్ వంటి పరిస్థితే. వారు పక్క రాష్ట్రంతో కొట్లాడలేరు. ఢిల్లీతో కొట్లాడటం అసలు సాధ్యం కాదు. తెలంగాణ డిమాండ్లను ఒక్కటి కూడా నెరవేర్చుకు రాలేకపోయిన పార్టీ బీజేపీ. తెలంగాణకు అత్యంత అవసరమైన ఏడు మండలాలను ఆంధ్రకు అప్పగించే విషయం మొదలు ఇప్పుడు హైకోర్టు విభజన వరకు అన్ని సందర్భాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా ఇక్కడి బీజేపీ నేతలు నోరు మెదపలేరు. మన సీలేరు విద్యుత్ ప్రాజెక్టును చంద్రబాబు తన్నుకుపోయినా వారికి ఇసుమంతైన బాధ కలుగదు. ఢిల్లీ ఆదేశాలు పాటించాలి కదా. ఇక మిగిలిన పార్టీలు పెద్దగా లెక్కపెట్టవలసినవి కాదు. తెలంగాణ కోసం కొట్లాడినా సీపీఐ, టీజేఎస్‌లు టీడీపీ జెండా పక్కన చేరడంతోనే ఆ పార్టీలు సామంజస్యాన్ని కోల్పోయాయి. విరుద్ధ రాజకీయ ప్రయోజనాలు కలిగిన పార్టీ పక్కన చేరిన తర్వాత, ఈ పార్టీలు తమకున్న కొద్దో గొప్పో సానుభూతిని కోల్పోయాయి. టీఆర్‌ఎస్ ఒకప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకోలేదా అని కొందరు ప్రశ్నిస్తున్నా రు. తెలంగాణకు అనుకూలంగా తీర్మానాలు చేయించడం కోసం, లేఖలు ఇప్పించడం కోసం గొంగలిపురుగునైనా కౌగిలించుకుం టామని ఆరోజు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించి మరీ అన్ని పార్టీలను కలుపుకొచ్చారు. తెలంగాణ పదాన్ని ఉచ్చరించడాన్ని నిషేధించిన పార్టీని తెలంగాణ బాటకు తీసుకురావడానికి ఆరోజు కేసీఆర్ అటువంటి సాహసం చేశారు. ఆ పొత్తు సందర్భంగా కూడా టీఆర్‌ఎస్‌కు పెద్ద ఎత్తున వెన్నుపోటు పొడిచింది టీడీపీ.

వైఎస్‌ఆర్ 2009లో రెండవసారి అధికారంలోకి రావడానికి టీడీపీ టీఆర్‌ఎస్‌కు చేసిన ద్రోహమే ప్రధాన కారణం. తెలంగాణకు అడ్డంగా నిలబడిన వైఎస్‌ను ఓడించడానికి తెలంగాణ వాదులంతా మనస్ఫూర్తిగా టీడీపీ ఓట్లు వేశారు. కానీ టీఆర్‌ఎస్‌ను, తెలంగాణవాదాన్ని ఓడించాలన్న కుట్రతో టీఆర్‌ఎస్ పోటీచేసిన చోట్ల ఓట్లు బదిలీకాకుండా అన్ని చర్యలు తీసుకున్నారు చంద్రబాబు. దాని పర్యవసానమే తెలంగాణలో వైఎస్ 50కి పైగా సీట్లు గెలువడం. కానీ కాలచక్రం ఒకచోట ఆగదు. నిరంతరం ఆకాశానికీ భూమికీ మధ్య తిరుగుతూ ఉంటుంది. పైకెళ్లినవాడు ఎప్పుడూ పైనే ఉండ డు. కింద పడినవాడెప్పుడూ కిందనే ఉండడు. ఆ స్ఫూర్తితోనే తెలంగాణ విజయం సాధించింది. 2009 డిసెంబర్‌లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన తర్వాత చంద్రబాబు నిజస్వరూపం అనేకసార్లు రుజువైంది. తెలంగాణ నిర్ణయం వచ్చిన నాటినుంచి చంద్రబాబు, ఆయన అనుకూ ల మీడియా ఎన్ని వేషాలు వేశాయో తెలంగాణ ప్రజలు మరిచిపోలేదు. టీడీపీ తెలంగాణలో బతుక తగని పార్టీ. అటువంటి పార్టీతో ఇప్పుడు కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్‌లు పొత్తుకు వెంపర్లాడుతున్నాయంటే అంతకంటే హీనం మరొకటి లేదు. అందుకే ఆ పార్టీలు మన పార్టీలు కాదు. నూటికి నూరు శాతం టీఆర్‌ఎస్ మాత్రమే తెలంగాణ పతాకాన్ని, ప్రయోజనాలను కాపాడే పార్టీ. తెలంగాణ మాత్రమే ప్రాధాన్యం కలిగిన పార్టీ. మనసా వాచా కర్మణా తెలంగాణ బాగే తన బాగుగా చూసుకునే పార్టీ. ఎప్పటికప్పుడు వేషాలు మార్చుకొని వచ్చే బహురూపులను ఒకే ఒక ఓటుతో ప్రజలు తిరస్కరించాలి.

kattashekar@gmail.com

Author: kattashekar

Former Editor, Namasthe Telangana Daily