కాంగ్రెస్‌ది రాజకీయ ఆత్మహత్య


TDP-And-Congress-To-Form-An

చంద్రబాబు పార్టీని తిరిగి నిలబెట్టే ప్రయత్నం చేయడం కాంగ్రెస్‌కు ఆత్మహత్యా సదృశం. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీ. తెలంగాణకు అన్నిరకాలుగా నష్టం కలిగించిన పార్టీ. ఆంధ్రా ప్రయోజనాలకు అంకితమైన పార్టీ. అటువంటి పార్టీ కాబట్టే గత ఎన్నికల్లోనే ప్రజలు తిరస్కరించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్ని పార్టీలతోపాటు టీడీపీనీ తిరస్కరించారు. చాలామంది ఆ పార్టీ నాయకులు ఇప్పటికే వివిధ పార్టీలలో చేరిపోయారు. ఈ ఎన్నికల్లో ఎవరూ పట్టించుకోకపోయి ఉంటే ఈ పాటికి ఆ పార్టీ పూర్తిగా ఖాళీ అయి ఉండేది. కొందరు టీఆర్‌ఎస్‌లో, ఇంకొందరు కాంగ్రెస్‌లో చేరిపోయేవారు. ఇంకా ఎవరయినా మిగిలి ఉంటే ఎన్నికల తర్వాత దుకాణం మూసేసుకుని ఇటో అటో చేరిపోయేవారు.

ఏమాత్రం కామన్‌సెన్సు, ఆత్మాభిమానం లేని కాంగ్రెస్, జేయేసీ నాయకత్వాలు చంద్రబాబు పంచన చేరడానికి సిద్ధపడ్డాయి. చచ్చిపోవడానికి సిద్ధంగాఉన్న టీడీపీని ఊతకర్ర పెట్టి నిలబెట్టడానికి ముందుకు వచ్చాయి. కాంగ్రెస్-టీడీపీల అక్రమ సంబంధం చాలు తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌ను గెలిపించడానికి. పరాయి పెత్తనం నుంచి విముక్తి పొందిన తెలంగాణ మరోసారి పరాయి నాయకులకు పెత్తనం అప్పగించే పని ఎప్పటికీ చేయదు. టీడీపీకి ఓటు వేయడమంటే తెలంగాణతల్లి గుండెలపై తన్నడమే.

కాంగ్రెస్ నాయకులు కలలు కంటూ ఉండవచ్చు, అసత్యాలు గుప్పించవచ్చు, ముఠాలు కట్టి తెలంగాణలో యాత్రలు చేయవచ్చు కానీ వారీ జన్మకు తెలంగాణ ప్రజలను మెప్పించలేరు. వారు ప్రజల్లో గడిపిన కాలం తక్కువ. కోర్టుల చుట్టూ తిరిగిన కాలం ఎక్కువ. టీడీపీతో జట్టుకట్టడంతోనే కాంగ్రెస్ అంతిమ పతనం మొదలయింది. ఎన్నికలు ఆ పార్టీకి దింపుడు కల్లమే.

Author: kattashekar

Former Editor, Namasthe Telangana Daily