మా ఊరికి కాలువొచ్చింది


WhatsApp Image 2018-09-04 at 9.32.12 PM(1)

ఎన్నోయేళ్ల స్వప్నం. ఎంతో నిరీక్షణ. ఎన్నో వాదవివాదాలు. నాగార్జునసాగర్ వరదకాలువ 2009లో మాడ్గులపల్లి దాకా వచ్చి ఆగిపోయింది. కొందరు రైతులు తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లారు. కోర్టు స్టే ఇచ్చింది. ఇక ఆ వైపు చూసినవారు లేరు. అధికారులు, నాయకులు ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాతనే మళ్లీ కదలిక. గత నాలుగేళ్లుగా ఆ చిక్కుముడిని విప్పేందుకు చేయని ప్రయత్నం లేదు. మంత్రి జగదీశ్‌రెడ్డి అనేక సార్లు అధికారులకు గట్టిగా చెప్పారు. మరో మంత్రి హరీశ్‌రావుగారయితే ఒకరోజు చాలా తీవ్రస్వరంతో అధికారులను మందలించారు. వారంతా కోర్టు కేసును చూపి నిస్సహాయతను వ్యక్తం చేస్తూ వచ్చారు.

ఇక మేమే కోర్టు చుట్టూ తిరిగాము. చాలా ప్రయత్నం తర్వాత ఒక సందర్భంలో న్యాయమూర్తి కేసు విని తీర్పు రిజర్వు చేస్తున్నట్టు ప్రకటించి వేసవి సెలవుల్లో వెళ్లిపోయారు. మళ్లీ కోర్టులు తెరిచే సరికి ఆయన వేరే బెంచికి మారిపోయారు. మళ్లీ మా ప్రయత్నం మొదటికొచ్చింది. కేసు బెంచీమీదకే రాదు. కోర్టు ప్రాధాన్యతలేమిటో మనకు అర్థం కావు. చూసీచూసీ విసిగిపోయాము. ఇక ఈ జన్మలో కాలువరాదని నిట్టూర్చేవారు, దెప్పిపొడిచేవారు ఎక్కువయ్యారు. నెలరోజుల కింద పరిస్థితి. వానలు బాగా పడుతున్నాయి. శ్రీశైలం నిండబోతోంది. నాగార్జునసాగర్‌కూడా నిండే అవకాశం ఉంది. మా బాధ అంతా ఇంతా కాదు. ఈసారయినా నీరు తీసుకోకపోతే…. ఊహించడానికే కష్టం అనిపించేది.

ఇక రైతులతో స్వయంగా సంప్రదింపులు జరిపి కాలువ తవ్వుకోవాలని భావించాము. అంతకుముందే కేసువేసిన ఒకరైతు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కేసు ఉపసంహరణకు ముందుకు రావడంతో మాకు మరింత ధైర్యం వచ్చింది. అధికారులు గతంలో ఏం చేసినా గత ఏడాదికాలంగా బాగా సహకరిస్తూ వచ్చారు. భూములివ్వడానికి ఒప్పుకుని వచ్చిన రైతులకు చకచకా పరిహారం చెల్లించారు. కొందరు రైతులు తమ భూమిలో తవ్వుకోవడానికి అనుమతిస్తూనే, తమకు సరైన పరిహారం ఇవ్వాలని కోరారు. మరికొందరు అందుకూ అంగీకరించలేదు.

ఇక ఒత్తిడి మంత్రం తప్పనిసరి అయింది. యువనాయకుడు సిద్ధార్థరెడ్డి దగ్గర నిలబడి కాలువ తవ్వకం మొదలు పెట్టారు. స్థానిక రైతులతో సహా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చారు. కాంట్రాక్టరు లేడు, అధికారులు లేరు. ఒకరోజు ఒక జూనియరు అధికారి వచ్చి ముగ్గుపోసి పోయారు. జనమే దగ్గరుండి పదిరోజులు రేయింబవళ్లు కాలువ తవ్వకం పనులను చూసుకున్నారు. ఒక చోట బాగా లోతు తవ్వాల్సి వచ్చింది. తెలిసిన కాంట్రాక్టరు మిత్రుడు ఒక పెద్ద తవ్వకం యంత్రం పంపి ఒక్కరోజులో పని పూర్తిచేశారు. హైవేకు సమీపంలో ఒక చోట పెద్ద రాళ్లు అడ్డం వచ్చాయి. వాటిని పేల్చి తొలగించాల్సి వచ్చింది.

తవ్వకం పూర్తయిన తర్వాత కూడా నాలుగైదు రోజుల నిరీక్షణ. ఎంతకీ నీళ్లు రావు. ఎందుకు ఆలస్యం అవుతున్నదని మంత్రి జగదీశ్‌రెడ్డి ఇంజనీర్లను గట్టిగా మందలించారు. ఎస్‌ఈ, ఇంజనీర్లు కాలువ వెంట ప్రయాణం మొదలు పెట్టారు. ఇటు నుంచి సిద్ధార్థ, మరికొందరు రైతులు కాలువ వెంట వెనుకకు వెళ్లారు. కాలువ పొడవునా తూములు, బుంగలు. నీరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అందరూ కలసి తూములు, బుంగలు మూసివేస్తూ నీరు ముందుకు తీసుకొచ్చారు. ఈరోజుకు(04.09.2018) మా ఊరికి కాలువ నీరు వచ్చింది.

స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులు దేవుళ్లు. కేసుల్లో ఉన్న భూముల రైతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. వారు మొదటిరోజు కాస్త నిరసన తెలిపినా తదుపరి వారెవరూ పనులకు అడ్డం రాలేదు. అధికారులూ అందరూ సహకరించారు. నీరు దైవంతో సమానం. నీరుతోపాటే సకల ఐశ్వర్యాలు. అందరి పుణ్యాన ఆరుదశాబ్దాలుగా కరువు కోరల్లో నలిగిపోతున్న మాడ్గులపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు కాలువ నీరు వచ్చింది. ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. సిద్ధార్థా….హాట్సాఫ్. ఈ యజ్ఞంలో సహకరించిన అధికారులు, రైతులు, పోలీసులు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.

Author: kattashekar

Former Editor, Namasthe Telangana Daily