పెప్పర్‌స్ప్రే ప్రజాస్వామ్యం


IMG_2681

ఆంధ్రా థాట్ పోలీసింగ్ దారుణం

పార్లమెంటు చరిత్రలో మరో సంచలనమట. సోమవారం రాజ్యసభలో ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి చర్చను కొనసాగించారు సభాధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు. పిల్లిమొగ్గలకు, అప్రజాస్వామిక ప్రవర్తనకు ప్రసిద్ధిగాంచిన ఆంధ్రా నాయకత్వం తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి పార్లమెంటుకు కళంకం అంటగడుతున్నది. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటు తలుపులు మూసి, ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి, అప్రజాస్వామికంగా విభజన చట్టాన్ని ఆమోదించారని ఆంధ్ర నాయకులు ఒక పచ్చి అబద్ధపు ప్రచారాన్ని పదేపదే వల్లెవేస్తున్నారు. నిజానికి అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరించింది ఆంధ్ర ఎంపీలు. పెప్పర్ స్ప్రేలు తెచ్చి, సభకు భంగం కలిగించాలని చూశారు. వెల్‌లోకి దూసుకొచ్చి సభా కార్యక్రమాలు జరుగకుండా అడ్డుకోవాలని చూశారు. సభాధ్యక్షులపై కాగితాలు, పుస్తకాలు విసిరారు.

అధికార కాంగ్రెస్, బీజేపీలతో పాటు మరో 30కి పైగా పార్టీల మద్దతుతో ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుపై సభలో చర్చ జరుగుతున్నప్పుడు పట్టుమని పదిహేను మంది ఎంపీలు మొత్తం సభను అడ్డుకోవాలని చూడడం ప్రజాస్వామికమా? టీడీపీ తెలంగాణ ఏర్పాటుకు మద్దతుగా లేఖ ఇచ్చి, తీరా నిర్ణయం జరిగాక అడ్డుకోవాలని ప్రయత్నించడం నీతమంతమా? అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చివరిదాకా చెబుతూ వచ్చిన కాంగ్రెస్ నాయకులు నాలిక తిప్పేసి, విభజన చట్టాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామికమా? ఆంధ్ర, టీడీపీ ఎంపీలు ఇంత క్రూరంగా వ్యవహరించారు కాబట్టే ఆ రోజు పార్లమెంటు ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేయాల్సి వచ్చింది. పెప్పర్ స్ప్రే ప్రయోగించి సభా కార్యకలాపాలను ఆపాలని చూసినవారు కుట్రదారులు. ఆ ఘటన పార్లమెంటు చరిత్రలో మాయనిమచ్చ.

అబద్ధాన్ని నిజంగా, నిజాన్ని అబద్ధంగా, ప్రజాస్వామ్యాన్ని అప్రజాస్వామ్యంగా, అప్రజస్వామ్యాన్ని ప్రజాస్వామ్యంగా నమ్మించడంలో, ప్రచారం చేయడంలో ఆంధ్ర మీడియా, ఆంధ్ర నాయకత్వం సిద్ధహస్తులు. ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని నిలువునా చీల్చిన నాదెండ్ల భాస్కర్‌రావు అప్రజాస్వామిక వాది ఎలా అయ్యాడు? అదే ఎన్‌టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, ఆయన గుండెపగిలి చావడానికి కారణమైనవాడు ప్రజాస్వామ్య పరిరక్షకుడు ఎలా అయ్యాడు? మీ థాట్ పోలీసింగుకు అంతే లేదా?

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad