ఆయుధం కాదు భస్మాసుర హస్తం


 

girl with raised hands and broken chains

 

సమాజాన్ని సోషల్ మీడియా భూతం ఆవరిస్తోందా? భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ సరే.. భావాలను, వ్యక్తులను, గోప్యత ను, మొత్తంగా కోట్లాది ప్రజల మెదళ్లను అన్యాక్రాంతం చేస్తున్న దాడి భయపెడుతున్నది. కనిపించే, మాట్లాడే సామాజిక జీవనం నుంచి కనిపించని, మాట్లాడని యంత్ర భూత జీవితంలోకి మనిషి జారుకుంటున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద సమాచార, శోధనవాహిక ఇంజినీర్ల బృందం తో ఇటీవల ఒక సమావేశం జరిగింది. తమ వాహిక రూపొందించిన విశ్లేషణాత్మక సమాచా రం వారు ఈ సమావేశంలో వెల్లడించారు. ఆ సమాచారంలో వెల్లడించిన విషయాలు వారికి చాలా గొప్ప. వారు అలాగే చెప్పారు కూడా. సామాజిక దృక్పథంతో చూసేవారికి మాత్రం విస్మయం కలిగిస్తాయి. జియో ఫోన్ వచ్చిన తర్వాత దేశంలో ఇంటర్నెట్ డేటా విప్లవం వచ్చింది. అందరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. ఎక్కడినుంచి ఏ సమాచారమైన స్వీకరించే, పంపుకునే స్వేచ్ఛ లభించింది. అంతవరకు బాగానే ఉంది. సోషల్ మీడియాను జనం సగటున రోజుకు ఎంతసేపు చూస్తున్నారో సంబంధిత ఇంజినీర్ చెప్పినప్పుడు ఆశ్చ ర్యం వేసింది. ఒక్కోమనిషి రోజుకు సగటున మూడు గంటలు సోషల్ మీడియాపై వెచ్చిస్తున్నారని, అటువంటివారు దేశంలో 40 కోట్లకు చేరారని ఆయన వివరించారు. అంటే రోజూ 120 కోట్ల పని గంటలు జనం సోషల్ మీడియాలో గడుపుతున్నారని అర్థమవుతున్నది. ఇది ఉత్పాదక సమయం కాదు. వినియోగ సమయం కాదు. వినోద సమయం లేక ఉబుసుపోకకు వెచ్చించే సమయం. కమ్యూనికేషన్ విప్లవం ఎంత మేలు చేస్తున్నదో అంత చెడు చేస్తున్నదేమోనన్న ఆందోళన నిపుణుల్లో వ్యక్తం అవుతున్నది. ఇప్పుడు ఇంటర్నెట్‌లో 4జీ సేవలు మాత్రమే, అందులో పరిమిత ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

త్వరలో ఇప్పుడున్న 4జీ వేగం కంటే 100 రెట్ల వేగంతో పనిచేసే 5జీ రాబోతున్నదట. అంటే మరింత వేగంగా విడియోలు, ఫొటోలు, సమాచారం పంపిణీ చేసుకోవచ్చు. వీక్షించవచ్చు. మంచి సమాచారం పంపిణీ అయితే ఇబ్బంది లేదు. కానీ పిచ్చోడి చేతిలో రాయిలాగా ఈ సమాచారం పంపిణీ అయితే సమాజంలో అశాంతి, నేరాలు, సంక్షోభం తలెత్తుతాయి. ప్రజలు విచక్షణతో స్పందించినంత కాలం ఇబ్బంది ఉండదు. కానీ ఉన్మాదపూరిత ప్రచారాలు బయటికి వస్తే ఏం జరుగుతున్నదో మత ఘర్షణలు, గో రక్షకుల నేరాలు, పిల్లలను ఎత్తుకుపోయేవారిగా అనుమానించి జరుగుతున్న హత్యలు, వైవాహిక సంబంధాల్లో జరుగుతున్న దారుణాలు సమాజాన్ని హెచ్చరిస్తున్నాయి. వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీసే దారుణాతి దారుణమైన ప్రచారాలకు కూడా సోషల్ మీడియా వేదికయింది. ఫేక్ న్యూస్‌కు సోషల్ మీడియా అడ్డాగా మారింది. ఈ ఫేక్ న్యూస్‌ను నమ్మి కొన్నిసార్లు ప్రధాన స్రవంతి మీడియా కూడా అవే వార్తలుగా ప్రచురిస్తున్నది. పబ్లిష్ అండ్ ఫినిష్ అన్న భావన సర్వత్రా ప్రబలుతున్నది. ఇది ప్రమాదకరమైన ధోరణి. అసత్యాలు, అర్థసత్యాలు, వక్రీకరణలు, తప్పుడు సమాచారాలు వ్యక్తులను, వ్యవస్థలను గెలువడానికి ఒక సారి ఉపయోగపడవచ్చు. కానీ అది ఎక్కువకాలం నిలువదు. ఫేక్ బుడగ తొందరగానే బద్దలవుతుంది. సత్యంపై నమ్మకం లేనివారు చేసే పని ఇది. దొంగదారిలో యుద్ధాన్ని గెలువాలనుకునే వారు చేసే అధర్మ యుద్ధం ఇది. దేశంలో ఈ తరహా యుద్ధాన్ని బీజేపీ ప్రారంభించింది. చరిత్రకు సంబంధించి పచ్చి అబద్ధాలను ప్రచా రం చేయడం, చరిత్రకు మసి బూయడం, తప్పుడు సమాచారం, తప్పుడు లెక్కలు ప్రచారం చేయడం వారికి బాగా అలవాటయింది.

అబద్ధపు యుద్ధాన్ని చేసే భారీ యంత్రాంగాన్ని ఏర్పాటుచేసి దేశంలో సమాచార కాలుష్యాన్ని, జ్ఞాన కాలుష్యాన్ని సృష్టించ డం బీజేపీ సాధించిన విజయం. అదిప్పుడు ఇంకా ఇంకా పాతాళానికి చేరుతున్నది. స్వయంగా ప్రధాని చారిత్రక అబద్ధాలు చెబుతుంటారు. ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చాలా గంభీర స్వరంతో చెబుతుంటా రు. బీజేపీ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని చేసిన ప్రచార, ప్రసారయుద్ధాల గురించి ఆ పార్టీ ఐటీ విభా గం నుంచి బయటికి వచ్చిన యువకుడే కుండబద్ధలు కొట్టారు. రాంమాధవ్ అనుచరునిగా ఈశాన్య రాష్ర్టా ల్లో తాము చేసిన ఘన కార్యాలను గురించి ఆయన ఇటీవల మీడియాకు చెప్పారు. అవే ఎత్తుగడలను తెలంగాణలో కూడా బీజేపీ నాయకత్వం అమలు చేస్తున్నది. మేధావి అని, పెద్ద నాయకుడని, వ్యూహక ర్త అని పేరున్న రాంమాధవ్ వంటి నాయకుడు తెలంగాణ నాయకుల మగతనం గురించి మాట్లాడాడంటే బీజేపీ నాయకుల అసలు స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ తెలంగాణ నాయకత్వం కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నది. పెద్దపెద్ద పారిశ్రామిక సామ్రాజ్యాలకు, వ్యాపార వర్గాలకు ఊడిగం చేస్తున్నపార్టీ, భూస్వామ్య భావజాలంలో తననుతాను బం ధించుకున్న బీజేపీ, ప్రభుత్వాన్ని, వేల కోట్ల రూపాయ ల ఆదాయాన్ని పల్లెమార్గం పట్టించిన తెలంగాణ ముఖ్యమంత్రికి గడీ పాలనను ఆపాదిస్తున్నది. ఎవరిది గడీల భావజాలం? ఎవరిది జనకేంద్రక భావజాలం? బీజేపీ నేతల స్థాయిని వర్ణించడానికి నేలబారు అనే పదం చాలదు. పాతాళ బారు అంటే వీరికి సరిపోతుం ది. విషాదం ఏమంటే కాంగ్రెస్ కూడా అదే బాటలో పయనిస్తున్నది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ఏర్పాటుచేసుకున్న యంత్రాంగం ఆ పార్టీ అజ్ఞానాన్ని మరింత బయటపెడుతున్నది.

ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేరు మీద బీజేపీ నేత శ్యామా ప్రసాద్ ముఖర్జీ బొమ్మ పెట్టి బాబూ జగ్జీవన్‌రామ్‌కు నివాళులర్పించారు. అధికారాన్ని కోల్పోయి, దానిని తిరిగి ఎలాగైనా దక్కించుకోవాలన్న ఆత్రంలో అబద్ధా ల ప్రచారానికి దిగుతున్నారు. రైతు రుణమాఫీ, రైతు బంధుపై ఆ పార్టీ సోషల్ మీడియాలో, బయటా చేస్తు న్న ప్రచారం చూస్తుంటే విచిత్రం అనిపిస్తున్నది. రైతు కు కనీసం సబ్సిడీలు కూడా మిగిల్చని చరిత్ర కాంగ్రెస్‌ది. కరెంటివ్వలేదు. విత్తనాలివ్వలేదు. ఎరువులివ్వలే దు. సబ్‌స్టేషన్లపై దాడులు, రైతులపై కేసులు అప్పట్లో నిత్యకృత్యం. విత్తనాలు, ఎరువుల కోసం చెప్పులు క్యూలో పెట్టుకొని రోజుల తరబడి ఎదురు చూడవలసిన దుస్థితి. ఇన్నేండ్ల చరిత్రలో కాంగ్రెస్ ఏనాడైనా రైతుకు రూపాయి అయినా రుణమాఫీ చేసిందా? కౌలు రైతుల సంగతి దేవుడెరుగు, అసలు రైతులపై ఎన్నడైనా కనికరం చూపించిందా? వేల కోట్ల రూపాయలు ఎగవేసిన పారిశ్రామికవేత్తలకు ఎంపీ టికెట్లు ఇచ్చి, యాభై వేలు అప్పు చెల్లించలేకపోయిన రైతుల చెంబు తపేలా, ఇంటి తలుపులు జప్తు చేసుకుపోయిన చరిత్ర కాంగ్రెస్‌ది. ఎంతో దూరం ఎందుకు? కర్ణాటక లో రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. తీరా అధికారం వచ్చాక నాలుగు వాయిదాల్లో చేస్తామని ప్రకటించారు. అదే తెలంగాణలో మాత్రం ఒకేసారి రుణమాఫీ చేయలేదెందుకని ప్రశ్నిస్తుంటారు. అక్కడో రూలు ఇక్కడో రూలా? అసలు కాంగ్రెస్‌కు ఒక విధా నం అంటూ ఉందా? తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, చెప్పని పథకాలు కూడా అనేకం అమలు చేసింది.

గ్రామీణ జీవితంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. రైతులకు, చేతివృత్తుల వారికి ప్రభు త్వం అండగా నిలబడి అన్నిరకాల సహాయం అందిస్తున్నది. రైతులు దేనికోసమూ ఎదురుచూడని రోజు లు తీసుకువచ్చింది. అన్నింటికీ మించి 45 లక్షల మం ది రైతులకు ఎకరాకు నాలుగువేల చొప్పున పంటసా యం అందించింది. మొత్తం రైతాంగానికి రైతు బీమా ను ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ఏం చేసింది? కాంగ్రెస్ నాయకత్వానికి ఇప్పుడు కోటలు, గడీలు లేవు కానీ వారి మనస్తత్వం కోటలను, గడీలను దాటి రాలేదు. ఇంకా భూస్వామ్య మనస్తత్వంతోనే సమాజాన్ని, రాజకీయాలను చూస్తున్నారు. అదే బుద్ధితోనే సోషల్ మీడియాలో, బయటా అబద్ధాలు గుప్పిస్తున్నారు. అధికారం కోసం షార్ట్‌కట్‌లు వెతుకుతున్నారు. అయి నా వారిని జనం నమ్మడం లేదు. ఎన్నికలు సమీపించేకొద్దీ సమాచార కాలుష్యం మరింత పెరిగే ప్రమాదం ఉన్నది. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌పై జరిగిన మార్ఫింగ్ దాడి అటువంటి దే. సుమన్ తన భార్య, పిల్లలతో దిగిన ఫొటోలో భార్య, బాబు ఫొటోలను ఫొటోషాప్‌లో తీసేసి, మరో అమ్మాయి ఫొటోను చేర్చి, లైంగిక వేధింపుల పేరిట సోషల్ మీడియాలో ప్రచారంలో పెట్టారు. వ్యక్తుల, నాయకుల జీవితాలపై ఇంతకంటే దుర్మార్గమైన దాడి లేదు. కుంభకోణాలను, అవినీతి ఆరోపణలనూ, నేర చరిత్ర అనీ ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారాలు ప్రారంభించారు. పత్రికల్లో ఇటువంటి ఆరోపణలు చేస్తే న్యాయ సమీక్షకు నిలబడవలసి వస్తుంది.

అందుకే వీరంతా సోషల్ మీడియాను ఎంచుకుంటున్నారు. ఈ అబద్ధపు వీడియోలు, పోస్టులు ఎక్కడ జనరేట్ అయ్యాయో తెలుసుకోవడానికి సమయం పడుతుంది. ఈ లోపు జరుగాల్సిన నష్టం జరిగిపోతుంది. తప్పుడు ప్రచారం చేసేవారికి కావలసింది కూడా అదే. ఇదంతా హిట్ అండ్ రన్ రాజకీయ కుట్ర. బీజేపీ, కాంగ్రెస్ నాయకు లు నియోజకవర్గాల స్థాయిలో ఇటువంటి ప్రచారం మరింత తీవ్రంచేసే అవకాశం ఉన్నది. సామాజిక మాధ్యమాలు ఒక ఆయుధం కాదు, అది భస్మాసుర హస్తం. అది సృష్టించిన వారిని కూడా కబళిస్తుంది.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad