నిశ్శబ్దవిప్లవం కాదు, శబ్దవిప్లవమే


కాంగ్రెస్ నాయకులు నిశ్శబ్ద విప్లవం గురించి మాట్లాడుతుంటే వీళ్లు ప్రజలకు ఎంత దూరంగా ఉండి మాట్లాడుతున్నారో అర్థమవుతున్నది. కళ్లుండీ చూడలేని, చెవులుండీ వినలేని వాళ్లకు నిశ్శబ్ద విప్లవాలే కనిపిస్తాయి. తమ రాజకీయ జీవితంలో ఏనాడూ ఒక నిర్మాణాత్మక విధానాన్ని అమలు చేయని పార్టీ కాంగ్రెస్. ఏనాడూ ప్రజలకు చేరువగా వచ్చి నిలబడని పార్టీ కాంగ్రెస్. ఏనాడూ స్వతంత్రించి తమ ప్రజలకు ఏమి కావాలో అది చేసే సాహసం చేయని ఉపగ్రహ నాయకులు కాంగ్రెస్ నాయకులు. నీతులన్నీ వదలి, తప్పులన్నీ చేసి, ఆరు దశాబ్దాలుగా ఒకే కుటుంబానికి సేవ చేస్తూ ఇప్పుడు నీతుల గురించి, కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ నాయకుల భావ దారిద్య్రం అర్థం చేసుకోవచ్చు. ఏ విలువల పట్లనైనా వీరికి నిబద్ధత ఉన్నదీ లేనిది వీరి రాజకీయ జీవితాల్లోకి తొంగిచూస్తే చాలు చాలా సులువుగా అర్థమవుతుంది. కేసీఆర్ కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని పదేపదే మాట్లాడుతున్న ఉత్తమ్ కుమారునికి, కోమటిరెడ్డి సోదరులకు, జానారెడ్డి…ఇంకా చాలా మంది కాంగ్రెస్ నాయకులకు ఒకటే ప్రశ్న. ఉత్తమ్‌కుమారుని ఇంట్లో ఇద్దరికి, కోమటిరెడ్డి ఇంట్లో ఇద్దరికి, రేపు జానారెడ్డి ఇంట్లో ఇద్దరికి…రాజకీయ వారసత్వాలు ఇస్తే తప్పులేదు, కానీ ఒక సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో ముందుండి కొట్లాడి, నలిగి నలిగి ఎదిగి వచ్చిన నాయకులు ఒకే కుటుంబం నుంచి వచ్చిన వారయితే తప్పేమిటి? ఉత్తమ్ కుమార్‌రెడ్డికి, జానారెడ్డికి, కోమటిరెడ్డికి, దామోదర్‌రెడ్డికి ప్రజలంటే ఒక ఓటు వేసే యంత్రాలు. ఎన్నికలప్పుడు మాత్రమే పనికివచ్చే ఈవీఎంలు. వారిపట్ల ఎటువంటి సేవాదృక్పథం, సహృదయం, సహానుభూతి లేని నాయకులు వీరు. ప్రజలకు మేలు చేసి, పనులు చేసి, అభివృద్ధి చూపించి వారిని గెలుచుకోవడం, వారి హృదయాల్లో స్థానం సంపాదించుకోవడం కాకుండా, ప్రజలను ఎన్నిక ఎన్నికకూ ఎలా బురిడీ కొట్టించాలో మాత్రమే తెలిసిన రాజకీయ విద్యాపారంగతులు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ పాత ఒరవడిని రద్దు చేసింది. జనం మధ్య జనం కోసం పనిచేయడం అన్నది ఎలా ఉంటుందో గత నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రుజువు చేశారు. టీఆర్‌ఎస్ నాయకులు జనంలో ఒకరుగా ఉన్నారు. పిలిస్తే పలికేట్టుగా పల్లెలు పట్టుకుని తిరిగారు. పోటీపడి అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. కాంగ్రెస్ నాయకత్వానికి టీఆర్‌ఎస్ నాయకత్వానికి అసలు పోలికే లేదు. టీఆర్‌ఎస్ నాయకులు ఉద్యమంలో రాటుదేలి, ప్రజల సమస్యలను ఆకళింపు చేసుకుని, పోరాడి రాజకీయాల్లో ఎదిగి వచ్చినవారు. కాంగ్రెస్ నాయకులు పైరవీలు చేసి పైకి వచ్చినవారు. ధన రాజకీయాలతో ఎదిగి వచ్చినవారు. రెండు పార్టీల మధ్య ఇంత స్పష్టమైన అంతరం ఉన్నది. ఇక నిశ్శబ్ద విప్లవం అవసరం ఉంటే గింటే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే ఉండాలి. టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా జనం గొంతెత్తి మాట్లాడుతున్నారు. వారు తమ ఇష్టాయిష్టాలను దాచుకోవడం లేదు. బాహాటంగానే టీఆర్‌ఎస్‌ను ఎందుకు సమర్థిస్తున్నారో చెబుతున్నారు. అక్కడో ఇక్కడో కొద్ది మంది నాయకులపై అసంతృప్తి ఉంటే ఉండవచ్చు. కానీ ప్రభుత్వం, మెజారిటీ టీఆర్‌ఎస్ నాయకత్వం కష్టపడుతున్న తీరును అందరూ గమనిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నిశ్శబ్ద విప్లవం ఎందుకు? ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చినందుకా? విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చేసినందుకా? చెరువులు బాగుచేయించినందుకా? ఎప్పుడూ లేనంతగా కాలువలలో నీరు పారించినందుకా? ఊరూరా రోడ్లు, భవనాలు నిర్మించినందుకా? పంటపెట్టుబడికింద ఎనిమిది వేల రూపాయల సాయం అందిస్తున్నందుకా? పైసా ఖర్చు లేకుండా రెవెన్యూ రికార్డులను సరిచేసి, పట్టా పుస్తకాలు ఇస్తున్నందుకా? నలభై లక్షల మందికి పించన్లు అందిస్తున్నందుకా? మున్సిపాలటీల స్వీపర్లు మొదలుకుని వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు, హోంగార్డులు, అంగన్‌వాడీ కార్యకర్తలు…ఇలా అతితక్కువ భత్యాలతో పనిచేస్తున్న వర్గాలకు పెద్ద మనసుతో భత్యాలను పెంచినందుకా? ఉద్యోగులకు అడిగిందే తడవుగా డిమాండ్లను నెరవేర్చుతున్నందుకా? ఏ కారణం చేత ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవం వస్తుంది? అని మొన్న పాస్ పుస్తకాలు తీసుకోవడానికి వెళ్లిన సందర్భంగా ఇష్టాగోష్టి సమావేశంలో ఒక రైతు నాయకుడు ప్రశ్నించాడు. కాంగ్రెస్ నాయకులకు ఒక ప్రాజెక్టు అంటే నాలుగైదు పంచవర్ష ప్రణాళికలపాటు పండుగ. ప్రాజెక్టు మొదలు పెట్టి, అందులో నీళ్లు వచ్చే నాటికి ఒక తరం గతించి పోయే పరిస్థితి. నిధులివ్వరు. భూసేకరణ చేయరు. జనం నీళ్లు వస్తాయని కొండకు ఎదురు చూసి నట్టు ఎదురు చూడడం, తరాలు మారిపోవడం….అదొక అంతులేని వ్యధ. మాధవరెడ్డి ప్రాజెక్టు కింద ఉదయ సముద్రం పూర్తి చేసి దశాబ్దం గడచిపోయింది. ఈరోజుకూ ఉదయ సముద్రం రిజర్వాయరును పూర్తిస్థాయిలో నింపని పరిస్థితి. సగం డిస్ట్రిబ్యూటర్లకు నీరివ్వని పరిస్థితి. ఎందుకంటే ముంపు గ్రామాల ప్రజలకు నష్టపరిహారం ఇవ్వరు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పనులు కదలడం మొదలయింది. నష్టపరిహారం ఖరారయింది. ఒక్క మాధవరెడ్డి ప్రాజెక్టే కాదు, కాళేశ్వరం నుంచి పాలమూరు రంగారెడ్డి వరకు డెడ్‌లైన్‌లు పెట్టుకుని, రాత్రి జాగారాలు చేసి, ఒకటికి పదిసార్లు ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల వెంటపడి పనులు వేగంగా పూర్తి చేయించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వానికి ప్రాజెక్టు నిర్మించడం అంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పొలాలకు నీళ్లివ్వడం. మొబిలైజేషన్ అడ్వాన్సులు, బ్రోకర్లు, కమీషన్లు, ఎస్కలేషన్లు, ఏళ్ల తరబడి సాగదీసుడు, ధనయజ్ఞాలు…ఇది కాంగ్రెస్ సృష్టించిన ఇరిగేషను ప్రాజెక్టుల

పదజాలం. తెలంగాణ ప్రభుత్వం నీటి పారుదల విజ్ఞాన సర్వస్వాన్ని పునర్లిఖించింది. నీళ్లివ్వడం ఒక్కటే లక్ష్యంగా ప్రాజెక్టుల పనులను నడిపిస్తున్నది. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పనివిధానానికి, తెలంగాణ ప్రభుత్వ పనివిధానానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని పదవీ విరమణ చేసిన నీటిపారుదల ఇంజనీరు వివరించారు. కొన్ని ప్రాజెక్టుల కింద ఫలితాలు కనిపిస్తున్నాయి. జనం ఆనందంగా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులే అక్కసుతో రగిలిపోతున్నారు అని ఆయన అన్నారు.

ఇప్పటిదాకా మమ్మల్ని పట్టించుకున్న నాయకుడు కేసీఆర్ ఒక్కరే. రైతు బిడ్డ. రైతు కష్టం తెలిసినోడు. అందుకే ఆయన ఇంతపెద్ద పని ముందేసుకుని చేయిస్తుండు. నాకు పెట్టుబడి వచ్చినా రాకున్నా పర్వాలేదు. కానీ మూడెకరాలోళ్లు, నాలుగెకరాలోళ్లు, పేద రైతులు పండుగ చేసుకుంటుండ్రురా. ఇసోంటి ముఖ్యమంత్రిని చూడలేదని చెప్పుకుంటుండ్రురా అని లింగయ్య తాత చెప్పాడు. ఆయన పుట్టి బుద్ధెరిగిన నాటి నుంచి కాంగ్రెస్ వాది. నాయనా నా చెక్కు రాలేదురా. ఇస్తరా ఇవ్వరా. ఒక్కసారి కనుక్కుని చెప్పు అని ఒక పెద్దావిడ ప్రశ్నించింది. రికార్డుల్లో కొన్ని తప్పులు దొర్లాయి సరిచేసి త్వరలోనే ఇచ్చేస్తామని ఎమ్మార్వో చెప్పారు. డబ్బులు ఎంత ఇస్తున్నామని కాదు, రైతులోకంలో అది సృష్టించిన ఆత్మవిశ్వాసం, ప్రజల్లో వెల్లువెత్తిన హర్షాతిరేకాలు ప్రభుత్వ విధానం సాధించిన విజయానికి సూచికలు. ఇవ్వాళ పల్లెలు కళకళలాడుతున్నాయి. పించను డబ్బులతో, పంటపెట్టుబడి డబ్బులతో ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలను చేరుకునే ప్రయత్నం, ఆదుకునే ప్రయత్నం చేసింది. నెలనెలా వచ్చే పించను డబ్బులు కాకుండా సుమారు ఆరువేల కోట్ల రూపాయలు పంట పెట్టుబడి రూపంలో పల్లెలకు ఇన్‌ఫ్యూజ్ అయిందంటే దాని ప్రభావం ఎంతగా ఉంటుందో ఊహించండి. ఇంతగా నిధులు ప్రజలకు అందజేసిన చరిత్ర దేశంలో ఏపార్టీకయినా, ఏ రాష్ర్టానికయినా ఉందా? కంపెనీలు 30 వేల కోట్లు, 40 వేల కోట్లు రుణాలు తీసుకుని ఎగవేస్తున్న కాలంలో, దివాలా ప్రకటిస్తున్న కాలంలో, విదేశాలకు పారిపోతున్న కాలంలో కేవలం ఆరు వేల కోట్ల రూపాయలతో తెలంగాణ ప్రభుత్వం పల్లెల్లో ఒక గుణాత్మక మార్పునకు పునాదులు వేసింది. ఈ పెట్టుబడిదేముంది, గిట్టుబాటు ధర ఇవ్వాళని, అలా రైతుకు ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుందని  కొందరు మాట్లాడుతున్నారు. అసలు మార్కెట్లను గతంలో ఏ ప్రభుత్వం అన్నా పట్టించుకుందా? జోక్యం చేసుకుని రైతు పంటలను కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుందా? తెలంగాణ ప్రభుత్వమే ఆ విషయంలో అందరికంటే ముందుగా స్పందిస్తున్నది. ఈ సారి అసాధారణ రీతిలో వరిపంట పండించారు. మొన్న సంగారెడ్డి నుంచి సింగూరు వెళుతుంటే దాదాపు పది కిలోమీటర్ల పొడవున రైతులు ధాన్యం రాశులు రోడ్డుపై ఆరబెట్టుకుంటున్నారు. అంతధాన్యం నేనెప్పుడూ చూడలేదు. ఎక్కడ చూసినా వందలు వేల బస్తాలు నింపి నెట్టుకట్టి పెట్టారు. అక్కడ ఒక రైతును అడిగాను…ఎన్నేళ్లుగా ఇలా పండిస్తున్నారు? అని. అయ్యో ఎన్నో ఏళ్లు ఎక్కడ. ఇంతకుముందు మాకు నీళ్లు ఎక్కడివి? తెలంగాణ వచ్చినంక ఈ రెండు మూడేళ్ల నుంచే ఈ పంట. సింగూరు నుంచి మాకు నీళ్లిస్తున్నరు. అందుకే ఇంత పంట దిగుబడి వచ్చింది అని ఆ రైతు చెప్పారు. అందరూ వరే పండిస్తే ఎలా? పంటలు మార్చవచ్చు కదా? అని అంటే ఇగ చెయ్యాలె. మేమూ అదే అనుకుంటున్నం అని ఆ రైతు సమాధానం చెప్పాడు. పంట పెద్ద ఎత్తున మార్కెట్‌లోకి రావడం వల్ల కొనుగోళ్ల సమస్య ఏర్పడ్డ మాట వాస్తవమే. అయినా ప్రభుత్వమే మిల్లర్లతో, మార్కెట్ వర్గాలతో మాట్లాడి ధాన్యం కొనుగోలుకు మార్గం సుగమం చేస్తున్నది. కాంగ్రెస్ హయాంలో రైతులది అరణ్య రోదన. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి సందర్భంలోనూ స్పందించి దిద్దుబాటు చర్యలు, సహాయక చర్యలు చేపడుతున్నది.

అందుకే కాంగ్రెస్ నాయకత్వం ఎంత గింజుకున్నా ప్రజల్లో స్పందన రావడం లేదు. ఇంతకాలం ఎటువంటి బాధ్యత లేకుండా అనుభవించిన అధికారం చేజారిపోయిందన్న అక్కసు, ద్వేషం, ఆక్రోషం కాంగ్రెస్ నాయకులను వివశులను చేస్తున్నది. మంచిని మంచి చెడును చెడు అనాలనే కనీస నిజాయితీ కూడా వారిలో లోపించింది. అడ్డగోలు మాటలు, ఆరోపణలు ఆ వివశత్వం నుంచి వస్తున్నవే. వాస్తవాలు తెలుసుకునే పరిస్థితిలో కానీ ప్రజాస్పందనను గుర్తించే పరిస్థితుల్లోగానీ వారు లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ నాయకత్వానికి కాలం చెల్లిపోయింది. ఈ కాలానికి పనికివచ్చే  ఆలోచనలు కానీ, ఆహార్యం కానీ, వర్తన కానీ, ఆధునికత కానీ వారికి లేవు, ఇక రావు. సమీప భవిష్యత్తులో టీఆర్‌ఎస్‌ను మరిపించే మంత్ర దండమేదీ వారివద్ద లేదు. రాదు. ఆ పార్టీ నాయకత్వం ఉత్త భ్రమల దుర్గాలు నిర్మించుకుని విహరించవలసిందే.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad