తెలంగాణ నిఘంటువుతెలంగాణ నిఘంటువు ఏమిటండి? ఉంటే తెలుగు నిఘంటువు ఉండాలి కానీ అని ఓ పండిత మిత్రుడు ప్రశ్నించాడు. తెలంగాణ పదాన్ని జీర్ణించుకోలేని తత్త్వ మే ఆ గొంతులో వినిపించిందనిపించింది. సూర్యరాయాంధ్ర నిఘంటువు ఉండగా లేనిది తెలంగాణ నిఘంటువు ఉంటే తప్పేమిటి? అని ప్రశ్నిస్తే, తెలుగు, ఆంధ్రమూ పర్యాయపదాలే కదా అని ఆ పండితుడు సమాధానం ఇచ్చారు. తెలుగు, ఆంధ్రమూ ఒకటేనని ఆధిపత్య భాషావాదులు తీర్మానించిన మాట నిజమే కానీ త్రిలింగ, తెలింగ, తెలంగాణ, తెలుంగు, తెలుగు ప్రాంతానికి, ఆ ప్రాంత ప్రజలు మాట్లాడే భాషకు రూపాంతరాలని ఎందుకు దాచిపెట్టారో ఇప్పటికీ అర్థం కాదు. 

ఆంధ్రం అనే పదాన్ని తీసుకువచ్చి తెలంగాణపైన తెలుగుపైన ఎందుకు రుద్దారో ఎట్లా రుద్దారో ఇప్పుడు కనిపెట్టాల్సి ఉంది. త్రిలింగ దేశం లేక తెలంగాణ, ఆంధ్ర దేశం ఎట్ల యిందో పరిశోధన జరుగాల్సి ఉంది. కృష్ణానది ఒడ్డున వెలసిన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఆలయం, కృష్ణుడనే రాజు ప్రతిరూపంగా వెలసిందని, తాను త్రిలింగదేశాధీశుడనని ఆయన ప్రకటించుకున్నారని చరిత్ర ఆధారాల వల్ల తెలుస్తున్నది. ఆం ధ్ర ప్రస్తావనకు ఎంత ఇతిహాసం, ఎంత చరిత్ర ఉందో త్రిలింగ దేశానికి, తెలింగ దేశానికి అంత కథ ఉంది. రిషిక, అస్సక, అస్మ క రాజ్యాలు, శాతవాహనుల కార్యభూమి తెలంగాణనే. అవేవీ చరిత్రలో తగిన స్థానం సం పాదించలేదు. తెలంగాణ గడ్డపై వర్ధిల్లిన బౌద్ధ, జైన క్షేత్రాల చరిత్ర సరిగా రికార్డు కానేలేదు. 

ఎక్కడో రాజస్థాన్‌లో స్థిరపడిన సుధీర్ తైలంగ్ నా జన్మభూమి తెలంగాణే అని చెప్పారట ఒక ఇంటర్వ్యూలో. బర్మా, థాయ్‌లాండ్‌లలో స్థిరపడిన కొన్ని జాతులు తాము తైలంగులమే అని చరిత్రలో రాసుకున్నారు. గోదావరి నదీ లోయలో పడవల ద్వారా శత్రువులను తప్పించుకుని సముద్ర మార్గాన తాము ఇక్కడికి చేరామని తైలంగులు చెప్పుకున్నారు. వాయు పురాణంలోనూ త్రిలింగ ప్రస్తావన ఉంది. విదేశీ యాత్రికుడు టోలెమీ యాత్రా కథనంలో కూడా త్రిలింగ ప్రస్తావన ఉంది. కాకతీయులకు త్రిలింగ దేశాధీశులుగానే పేరుంది. కాకతీయులతో జరిగిన యుద్ధంలో ఓడిపోయి, ఢిల్లీ సుల్తానులకు లొంగిపోయి, మతం మార్చుకున్న ఒక కాకతీ య మంత్రి ఆ తర్వాత సుల్తానుల వద్ద ప్రధాని అయ్యారు. ఆయన తన పేరు చివర తిలంగానీ పెట్టుకున్నారు. ఢిల్లీలోని ఆయన సమాధిపై ఇప్పటికీ ఆయన పేరు అలాగే ఉంది. ఇది 1375ల నాటి సమాధి. 

1812లో విలియం క్యారీ తెలింగ భాషా వ్యాకరణాల పై ఒక పుస్తకమే రాశారు. అవేవీ గత ఆరు దశాబ్దాల్లో ప్రస్తావనకు, ప్రాచుర్యానికి, చరిత్ర రచనకు నోచుకోలే దు. తెలంగాణ భాష అవమానాలపాలయింది. సం స్కారహీనులు, ప్రతినాయకులు మాట్లాడే భాషగా ముద్రవేయడానికి ప్రయత్నం జరిగింది. తెలంగాణ పదజాలం మరుగునపడిపోయింది. రెండు మూడక్షరాలతో గొప్ప అర్థాన్ని చెప్పే విశేషణాలు, క్రియలు, నామవాచకాలు ఉన్నాయి. అవి మరుగునపడిపోతున్నా యి. వాటిని నమోదు చేసి భావితరాలకు అందించవలసిన అవసరం ఉంది. ఆ ప్రయత్నంలోనే చరిత్ర, భాషా, సాంస్కృతిక పరిశోధనలపై పనిని ప్రారంభించింది. అందుకే తెలంగాణ నిఘంటువు. తెలంగాణ నిఘంటువు తెలుగు భాషకు విస్తృతి.
kattashekar@gmail.com

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad