తెల్లనోటు నల్లధనంగా ఎలా మారుతుంది?


img_4334

నల్లధనం వెలికి తీయడం ఉదాత్తమైన ఆలోచన. దేశ ప్రజలందరినీ బ్యాంకులవైపు నడిపించడం కూడా మంచిదే. అందరినీ ఫైనాన్సియల్ ఇన్‌క్లూజన్‌లో భాగం చేయడం కూడా ఎవరూ కాదనలేరు. కానీ అందుకు అనుసరించే మార్గం కూడా ఉత్తమంగా ఉండాలి కదా. దేశ ప్రజల పొదుపుపై దాడి చేయడం ఏమిటి? ఏది నల్లధనం?

రైతులు, కార్మికులు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు, సాధారణ ప్రజానీకం వద్ద నల్లధనం ఉండదు. పొదుపు చేసుకున్న డబ్బు తప్ప. పన్ను పరిమితిలోకి రానంతవరకు వారి ఆదాయం నల్లధనంగా పరిగణించడానికి వీలు లేదు. వ్యవసాయ ఆదాయంపై పన్ను లేదు. ఒక రైతు పత్తి పండించో, బత్తాయి తోటపైనో పది లక్షల ఆదాయం సంపాదించవచ్చు. అంతమాత్రం చేత అది నల్లడబ్బు అనడానికి వీలు లేదు. అది కష్టార్జితమే. మరి నల్లడబ్బు ఎలా వస్తున్నది? అడ్డగోలు సంపాదనల ద్వారా వచ్చేది మాత్రమే నల్లడబ్బుగా మారుతుంది. పెద్ద పెట్టుబడుల నుంచి లేదంటే పెద్ద రాబడుల నుంచి మాత్రమే నల్లడబ్బు అవతరిస్తుంది. మార్చి 2016 నాటికి బ్యాంకుల వద్ద 5,94,929 కోట్ల మొండి బకాయిలు పేరుకుపోయినట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. కేవలం 55 మంది కార్పొరేట్ ఖాతాదారులు ఎగవేసిన మొత్తమే 85,000 కోట్ల రూపాయలని రిజర్వు బ్యాంకు సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా సమర్పించింది. బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని ఎగవేసిన వారిలో 80 శాతంమంది పారిశ్రామిక వేత్తలేనని, అత్యధికం కోటి రూపాయలు ఆపైబడిన రుణాలే. అంటే పరిశ్రమలు పెడతామని, ఉత్పత్తులు చేస్తామని, లాభాలు గడించి తిరిగి చెల్లిస్తామని హామీలు ఇచ్చి రుణాలు తీసుకుని ఆరు మాసాలు కూడా పూర్తి కాకుండానే జెండా ఎత్తేసిన వాళ్లే అధికం. ఒక్క 2015-16 చివరి త్రైమాసికంలోనే 2,00,000 కోట్లు మొండి పద్దులకింద మారినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే నరేంద్ర మోడీ ప్రధానిగా వచ్చిన తర్వాత జరిగిన పరిణామమే. ఇలా బ్యాంకులకు పెద్ద మొత్తాల్లో ఎగవేసిన వారంతా రెండు మూడు లక్షల మంది ఉండవచ్చని ఒక అంచనా. వాళ్ల వివరాలను ఇప్పటివరకు ప్రభుత్వం బయటపెట్టలేదు. బయటపెట్టడానికి ఏవో నిబంధనలు అడ్డం వస్తున్నాయని చెబుతున్నది రిజర్వు బ్యాంకు.

కొద్ది మంది కోసం కోట్ల మంది బలి

ఇలా బ్యాంకుల వద్ద భారీ మొత్తాలు తీసుకుని ఎగవేసిన వారే ఆ పెట్టుబడులను అసలు ఉత్పత్తులు, సేవలపై ఖర్చు చేయకుండా దారి మళ్లించి సొంతంగా ఆస్తులు, బినామీ ఆస్తులు సంపాదించడమో, పెద్ద మొత్తాల్లో ధనం వెనుకేయడమో జరుగుతున్నది. ఇలా వెనుకేసిన ధనమే నల్లడబ్బుగా మారుతున్నది. అక్రమంగా సంపాదించి పోగేసిన ధనమే నల్లధనం. అంతెందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం నాలుగు మాసాలపాటు నల్లధనం స్వచ్ఛందంగా వెల్లడించడానికి ఒక పథకం ప్రకటించింది. ఆ ప్రకటనకు స్పందించి 65,000 మంది తమ వద్ద ఇప్పటిదాకా లెక్కచెప్పని ధనం 65,000 కోట్ల రూపాయలు ఉన్నట్టు ప్రకటించారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పథకం ముగిసిన సందర్భంగా వెల్లడించింది. 65,000 మంది అంటే 127 కోట్ల దేశ జనాభాలో ఎంత శాతమో ఎవరికయినా లెక్కలు తెలిస్తే కనుక్కోవచ్చు. నాకు తెలిసి 0.005 శాతం. నల్లధనం పోగేసిన వారు దేశంలో రెండు మూడు లక్షల మందికి మించరని అంచనా వేయడం అందుకే. పోనీ పది లక్షల మంది ఉన్నారని లెక్క వేసినా వారి శాతం 0.07 శాతం మాత్రమే. అంటే కేవలం కొద్ది మంది నల్లడబ్బు నరకాసురులకోసం ప్రధాని నరేంద్ర మోడి మొత్తం దేశ జనాభాను వీధులపాలు చేశారు.

పెద్ద నోట్లు చెల్లవని ప్రకటించకుండా డెడ్‌లైన్ పెట్టి ఉంటే…

ప్రధాని చేసిన పెద్ద తప్పిదం ఏమంటే ఈ రోజు రాత్రి నుంచి 500, వెయ్యి నోట్లు చెల్లని కాగితాలు అని ప్రకటించడం. రెండో తప్పిదం రెండున్నర లక్షలు దాటి బ్యాంకులో వేస్తే తాటతీస్తామని ప్రకటించడం. మోడీ ప్రభుత్వం ఏ సందర్భంలోనూ క్లీన్‌గా వ్యవహరించిన దాఖలాలు లేవు. బ్యాంకులను ముంచిన వారిని కేబినెట్‌లో కొనసాగించడం మొదలు, అక్రమ వ్యాపార సామ్రాజ్యాలకు వత్తాసు పలకడం దాకా ఆయన ఎక్కడా నిజాయితీని కనబర్చలేదు. నల్లధనం తెల్లధనంగా మార్చుకోవడానికి ఒక పథకం ప్రకటించి, 65వేల మందికి నాలుగు మాసాల సమయం ఇచ్చిన ప్రధాని 99 శాతం మంది నల్లధనంతో సంబంధంలేని ప్రజల జీవితాలను విపరీతంగా ప్రభావితం చేసే నిర్ణయం తీసుకునేముందు ఎందుకు యోచించలేదు? ఖర్చు పెడతారో బ్యాంకులో వేస్తారో మీ ఇష్టం. డిసెంబరు 31 తర్వాత ఆ నోట్లు చెల్లవు. కొత్త నోట్లు వస్తాయి అని ప్రభుత్వం చెప్పి ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదు. నల్లడబ్బు వీరులు ఈలోపు మార్చుకుంటారు కదా అని కొందరి అనుమానం. పెద్ద మొత్తాల లావాదేవీలన్నీ ఏరోజైనా కనిపెట్టి పన్ను కట్టించునే వ్యవస్థ ఇప్పటికే ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ఆ పని చేయలేదన్నదే ప్రశ్న. సామాన్య ప్రజలకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు.

నగదు లావాదేవీల దేశం

మన దేశంలో 65 శాతం లావాదేవీలు డబ్బు రూపంలోనే జరుగుతాయని సీఎల్‌ఎస్‌ఏ నివేదిక వెల్లడించింది. నగదు లావాదేవీలు నిర్వహించే దేశాల్లో భారత దేశం మూడోస్థానంలో ఉంది. మొదటి దేశం జపాన్, రెండో దేశం రష్యా. నాలుగో దేశం స్విట్జర్‌లాండ్. అంటే దేశంలో అత్యధిక ప్రజానీకం దాచుకోవడం, ఖర్చు పెట్టుకోవడం, కొనుగోలు చేయడం….అన్నీ నగదు రూపంలోనే నిర్వహిస్తున్నారని అర్థం. అటువంటప్పుడు ప్రభుత్వం ఎంత ఆలోచించి ఉండాలి? ఒక్క దెబ్బతో దేశ ప్రజలందరినీ భయభ్రాంతులకు గురిచేసే నిర్ణయం తీసుకోవడం ఏమి స్వచ్ఛత?

1.74 కోట్ల వలస కార్మికులు విలవిల

దేశంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ర్టానికి వెళ్లి పనిచేసి పొట్టపోసుకుంటున్న వలస జీవులు కోటీ 74 లక్షల మంది ఉన్నారని 2011 సెన్సస్ ప్రకటించింది. వీరంతా ఉపాధికోసం వలసవెళ్లినవారుగా సెన్సస్ ప్రకటించింది. తెలంగాణ నుంచి ముంబై వెళ్లినవారు, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా వంటి రాష్ర్టాల నుంచి తెలంగాణకు వచ్చినవారికి బ్యాంకు ఖాతాలుగానీ, లావాదేవీలు కానీ ఉండే అవకాశాలు తక్కువ. రెండు నెలలు మూడు నెలలు పనిచేసి కాంట్రాక్టరు వద్దే 20 వేలో ముప్పై వేలో దాచుకుని స్వరాష్ర్టాలకు వెళ్లి వస్తుంటారు. వారంతా ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం ఇవన్నీ ఆలోచించాల్సింది. వర్చువల్ భారతంలో కూరుకుపోయిన కొద్ది మంది అసలు భారతాన్ని విస్మరించారనిపిస్తున్నది. అట్టడుగు జీవితాలకు సంబంధించిన కనీస అవగాహన లేకుండా ఈ నిర్ణయం చేశారనిపిస్తున్నది.

బ్యాంకులను, బ్యాంకుల్లో ఉన్న ప్రభుత్వ వాటాలను కాపాడుకోవడానికేనా?

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండిపద్దులు గత రెండేళ్లలో భారీగా పెరిగిపోయాయి. 56 వేల కోట్ల రూపాయలు బ్యాడ్ లోన్స్ మాఫీ చేశారు. బ్యాంకుల లాభాలు పడిపోయాయి. బ్యాంకుల వద్ద నిధులు గణనీయంగా పడిపోయాయి. ఆ కారణంగా బ్యాంకులలో ప్రభుత్వ వాటాల విలు పడిపోయింది. బ్యాంకులు సాధారణ కార్యకలాపాలు నిర్వహించాలంటే పెద్ద మొత్తాల్లో కేంద్రమే నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. రీకాపిటలైజేషన్‌కు బడ్జెట్‌లో నిధులు పెంచాల్సి వస్తుంది- ఇది ఇటీవల బ్యాంకుల పరిస్థితిపై వచ్చిన ఆర్థిక విశ్లేషణ. దీనిని బట్టి బ్యాంకుల ఖజానాలు నింపడానికి ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

మన దేశ ఆర్థిక బలమే పొదుపు

మన దేశం బలమే మన ప్రజల వద్ద దాచుకున్న పొదుపు సొమ్ము, బంగారం. 1990 నాటి నుంచి ఇప్పటిదాకా అనేక దేశాల్లో ఆర్థిక సంక్షోభాలు వచ్చి కుప్పకూలాయి. ఏషియన్ టైగర్స్‌గా ప్రసిద్ధి చెందిన దక్షిణ కొరియా, మలేషియా, హాంకాంగ్, సింగపూర్, ఇండొనేషియా దేశాలు ఆర్థిక సంక్షోభంతో కుప్పకూలినప్పుడు అందరూ చేసిన విశ్లేషణ అదే. ఎన్ని ఆర్థిక ఒడిదుడుకులు ఎదురయినా దేశంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకపోవడానికి కారణం ప్రజల వద్ద ఉన్న పొదుపు సొమ్ము, బంగారమే. ఇప్పుడు ప్రజల వద్ద దాచుకున్న మొత్తాన్నీ లెక్క చెప్పాలని మోడీ అడుగుతున్నారు. ఇవన్నీ బ్యాంకులకు చేరాలని ఇప్పుడు ప్రభుత్వం కోరుకుంటున్నదా? అది మంచిదేనా?

Author: kattashekar

Former Editor, Namasthe Telangana Daily