దేశ ప్రజలపై సర్జికల్ స్ట్రైక్ పెద్ద నోట్ల రద్దు విషయం వినగానే గొప్పగా అనిపించింది. బహుశా నల్ల డబ్బు మీద, దాని ప్రభావాల మీద ఏర్పడిన వ్యతిరేకతతో అలా అనిపించి ఉండవచ్చు. నా లాగే చాలా మందికి ఈ నిర్ణయం హీరోయిక్ గా అనిపించింది. అలా అనుకోవడానికి అనువైన మాయ పొరలు దేశమంతటా వ్యాపింప చేశారని అర్థమైంది. ఆ అభిప్రాయం తప్పని ఇప్పుడు తెలిసివస్తుంది. నల్లడబ్బు అరికట్టడానికి తీసుకునే చర్యలపై ఎవరికీ అభ్యంతరం ఉండనక్కరలేదు. కానీ ప్రభుత్వం అనుసరించిన పద్ధతే అప్రజాస్వామికంగా, అనుమానాస్పదంగా, ఏకపక్షంగా ఉంది. 
నల్లడబ్బును స్వచ్చందంగా వెల్లడించడానికి పెద్దలకు, గద్దలకు నాలుగు మాసాల సమయం ఇచ్చి, అనేక రక్షణలు కల్పించిన ప్రభుత్వం, దేశంలో నల్లధనానికి, తెల్ల ధనానికి సంబంధం లేకుండా సాధారణ ఆర్థిక జీవితం గడుపుతున్న 90 శాతం మంది సామాన్యులపై ఈ మెరుపు దాడి ఎందుకు చేసిందన్న ప్రశ్న ఇప్పుడు కలుగుతున్నది. దేశ జనాభాలో కేవలం ఇంకా సగం ప్రజానీకం ఆర్థిక సేవలకు దూరంగా ఉన్నారు. 

1. జనధన యోజన కింద తెరిచినా ఖాతాల్లో 60 శాతం ఖాతాలు వాడకంలో లేవు. 

2. దేశంలో ఇంకా 22 శాతం మంది ప్రభుత్వ లెక్కల ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. 

3. కేవలం 21 కోట్ల క్రెడిట్ లేక డెబిట్ కార్డులు మాత్రమే ఇప్పటివరకు ఇచ్చారు. 

4. దేశంలో 650000 గ్రామాలు ఉంటె బ్యాంకుల బ్రాంచులు ఉన్నది 40000 వేలు మాత్రమే. అయిదు లక్షల గ్రామాలకు బ్యాంకుల సేవలు అందుబాటులో లేవని కేంద్ర ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి.

 పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటె కనీసం దేశ ప్రజలకు ఒక్క మాట చెప్పకుండా ఈ రాత్రి నుంచి నోట్లు చెల్లవని చెప్పడం ఏమి మర్యాద?

‘నెల రోజులు టైమిస్తున్నాం. ఖర్చు పెట్టుకుంటారో, బ్యాంకులో వేసుకుంటారో.. మీ ఇష్టం. ఆ తర్వాత ఆ నోట్లు చెల్లవు అంటే ఏమయ్యేది? పెద్ద వాళ్లకు ఇచ్చిన టైము కూడా పేదవాళ్లకు ఇవ్వరా?’ గురువారం ఒక ఆర్థిక విశ్లేషకుని ప్రశ్న ఇది. పేదల పట్ల, సామాన్యుల పట్ల కనికరం లేకుండా ఇంత నిర్దాక్షిణ్యంగా ఎలా వ్యవహరిస్తున్నది?
మల్లయ్య యాదవ్ ఆ రోజు ఒక గొర్రెను అమ్మి 500 నోట్లు 28 తెచ్చుకున్నడు. ‘అయ్యా నాకు బ్యాంకు ఖాతా ఉందిగానీ, ఎప్పుడు డబ్బులెయ్యలే. అదెక్కడో దూరంగా ఉంది. ఇప్పుడు నేనేమి చెయ్యాలె’ అని ప్రశ్నించిండు. ఆగమాగం అయితున్నడు. 
అలాగే ఒక పత్తి రైతు, ఒక ధాన్యం అమ్మిన రైతు, ఒక కిరాణా కొట్టు యజమాని, ఒక చిన్న హోటల్ నడుపుకునే మనిషి… వీళ్లంతా ఇవ్వాళ వీధుల్లో బ్యాంకుల చుట్టూ పిచ్చి వాళ్ళలా పరుగెత్తాల్సిన పరిస్థితి. ఇంత పెద్ద నిర్ణయం కేవలం కొద్దిమంది కూర్చుని చేయవచ్చా? పార్లమెంటు, ప్రజలు, ప్రజాస్వామ్యం ఎవరికీ చెప్పనవసరం లేదా? యూరొ 500 నోటును రద్దు చేయబోతున్నట్టు యూరోపియన్ యూనియన్ రెండేళ్లు ముందుగా ప్రకటించింది. మన ప్రభుత్వం రెండు మాసాలు కూడా ఎందుకు సమయం ఇవ్వలేదు? 
ఆర్థిక నేరస్తులు, బ్యాంకులను ముంచిన వాళ్ళు కేంద్ర మంత్రి వర్గంలో ఉండగా చేసిన ఈ నిర్ణయం నిజాయితీతో కూడుకున్నదని ఎలా నమ్మడం? 
కొందరికి ముందే సమాచారం ఉందా?
నోట్ల రద్దు విషయం కొందరికి ముందే తెలుసనీ కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి తెలుస్తున్నది. అది నిజమైతే ఇది ఒక పెద్ద ఆర్థిక నేరం. దేశాన్ని వంచించడం. పెద్దలు జాగ్రత్త పడగా పేదలు బలవుతారు. ఇంకా అనేక విషయాలు వెలుగు చూడవలసి ఉంది.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad