మోదీ ఉత్తరాదితో కనెక్టు కాలేదా?


Namasthe Telangana | 16 October 2016
ఆప్ గానీ, టీఆర్‌ఎస్ గానీ జనంతో కనెక్టు అయ్యే అంశాలపై పనిచేస్తున్నాయి. సామాన్యులకు పెద్ద పెద్ద విషయాలతో పనిలేదు.రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలే వారికి ముఖ్యం. ఏ పార్టీ అయి నా అది తెలుసుకుని మసలుకుంటే తప్ప రాజకీయ భవిష్యత్తు ఉండదు. లోక్‌సభ ఎన్నికలకు పెద్దపెద్ద విషయాలు ఉపయోగపడతాయి కావచ్చు. కానీ రాష్ర్టాలు, అసెంబ్లీలు గెలువాలంటే ఎక్కడికక్కడ స్థానిక ఆత్మను పట్టుకోవడమే అవసరం. దేశభక్తి, జాతీయవాదం, గోరక్షణ, ఉగ్రవాదంపై పోరాటం వంటివి పెద్ద పెద్ద విషయాలు.పింఛన్లు, ఉపాధిఅవకాశాలు, రైతులకు అప్పులు, సబ్సిడీలు, విద్యవైద్యం వంటి అంశాలు, వివిధ సామాజిక వర్గాల ప్రయోజనాలు స్థానిక ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. అందుకే 2014కు 2016కు ఈ తేడా.


ప్రధాని నరేంద్రమోదీ చాలా కష్టపడుతున్నట్టు కనిపిస్తున్నది. ప్రపంచ దేశాలు చుట్టి వచ్చారు. దేశ ప్రతిష్ఠను అంతర్జాతీయం చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. పాకిస్థాన్‌తో యుద్ధానికి కూడా సిద్ధపడ్డారు. మెరుపు దాడులు చేసి ఉగ్రవా ద స్థావరాలను ధ్వంసం చేయించారు. ఆర్థిక రంగంలో మంచివీ చెడువీ అనేక కఠిన నిర్ణయాలు చేస్తున్నారు. విదేశాల్లోని నల్లధనం వచ్చినా రాకున్నా మన దేశంలోని నల్లధనం 65 వేల కోట్లను బయటికి తీసుకురాగలిగారు. ఆయనపై వ్యక్తిగత అవినీతికి సంబంధించిన ఆరోపణలు లేవు. ఆయనకు మరే లోకం లేదు, అస్తమానం ప్రభుత్వం, పార్టీ తప్ప. అయినా ఆయన ప్రభ తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నా యి. 2014 ఎన్నికల్లో బీజేపీని ఏకధాటిగా గెలిపించిన ప్రాభవం ఇప్పుడు తగ్గిపోతున్న జాడలు బయటపడతున్నాయి. ఎన్నికల సర్వేలు, నిపుణుల విశ్లేషణలు ఇదే విష యం స్పష్టం చేస్తున్నాయి. మార్చి 2017లో నాలుగు రాష్ర్టాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ సర్వేలు మొదలయ్యాయి. ఈ సర్వేలను ప్రామాణికంగా తీసుకోనక్కరలేదు కానీ అవి మారుతున్న పరిస్థితులకు సూచికలుగా మాత్రం ఉపకరిస్తాయి. బీజేపీ నాడు నరేంద్ర మోదీ ప్రభంజనంలో ఉత్తరప్రదేశ్‌లో 42.63 శాతం ఓట్లతో 71 లోక్‌సభ స్థానాలను గెల్చుకుంది. నేడు ఇండియా టుడే మరికొన్ని సర్వేలు బీజేపీ ఓట్ల శాతం 31కి పడిపోయినట్టుగా అంచనావేస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో కూడా నాడు బీజేపీ మొత్తం లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుం ది. ఇప్పుడు అక్కడ పరిస్థితి మారినట్టు సర్వేలు చెబుతున్నాయి. పంజాబ్‌లో మెజారి టీ లోక్‌సభ స్థానాలను గెల్చుకున్న బీజేపీ-అకాలీదళ్ ఇప్పుడు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. మోదీవన్నీ ఉపరితల విన్యాసాలు. ఉన్నతవర్గాలకు ఉపయోగపడే చర్యలు అని ఓ సామాజిక మాధ్యమ వ్యాఖ్యాత ఇటీవల పేర్కొన్నారు. ఆయన ఎలా ఉంటే ఏం? ఆయనకు పునాది శక్తులుగా ఉన్నవాళ్లు జాతీయవాదాన్ని రెచ్చగొట్టడానికి, సమాజంలో వీలైనంత గందరగోళం సృష్టించడానికి, వివిధ సామాజిక వర్గాలను బీజేపీ నుంచి దూరం చేయడానికి సంకల్పితంగానో, అసంకల్పితంగానో ప్రయత్నిస్తున్నారు అంటారాయన.

పాకిస్థాన్ చుట్టూ దేశ రాజకీయాలను మలిపేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. ఉగ్రవాద మూకల ఆటను కట్టించడంలో విఫలమై, ఆ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి మెరుపుదాడులు, యుద్ధ పరిభాషను ఉపయోగించడం ఏమిటి? మరో సామాజికుడి ప్రశ్న. దేశభక్తితో, భావోద్వేగంతో ఈ వాదనలన్నింటినీ కొట్టిపారేయవచ్చు. కానీ ప్రజలంతా అలా అనుకోలేరు కదా? ఉగ్రవాదులు దేశంలో ప్రవేశించి, పఠాన్‌కోట్ స్థావరంలో చొరబడినదాకా ఈ ప్రభుత్వం, ఇంటలిజెన్స్, సైనిక నిఘా విభాగాలు ఏమి చేస్తున్నాయి? పంజాబ్‌లో మిత్ర ప్రభుత్వం, దేశంలో సొంత ప్రభుత్వమే కదా ఉన్నాయి? యురీ సరిహద్దు స్థావరం. అక్కడ ఎంత అప్రమత్తంగా ఉం డాలో సైన్యానికి తెలుసు. ఇంటలిజెన్సుకు తెలిసే ఉండాలి. కానీ శిబిరంలోకి చొరబడి 21 మందిని ఊచకోత కోసేదాకా ఈ వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నట్టు? ఇలా ఒకటేమిటి? అనేక ఉదాహరణలు. అనేక వైఫల్యాలు. వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి యుద్ధ పరిభాష. దేశ ప్రజల్లో ఆవేశకావేశాలు రెచ్చగొట్టడానికి ఉగ్రవాద దాడులను ఒక సందర్భంగా ఉపయోగించుకోవడం. కార్గిల్ సమయంలో జరిగింది దాదాపు ఇటువంటి పరిస్థితే. పాకిస్థాన్ సైన్యం, ఉగ్రవాదులు జమిలిగా మన భూభాగంలోని శిఖరాలను ఆక్రమించి యుద్ధానికి పొజిషన్స్ తీసుకునేదాకా మనం నిద్రపోయి ఉన్నాం. ఆ తర్వాత ఎన్నో త్యాగాలు చేసి ఆ శిఖరాలను విడిపించుకున్నాం. మన దేశభక్తి కోసం ఎంత మంది సైనికులు బలవుతున్నారు? హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, ముంబై వంటి పట్టణాల్లో ఉగ్రవాదుల కార్యకలాపాలను నిత్యం కనిపెట్టి కట్టడి చేయగలిగినప్పుడు సరిహద్దుల్లో చేయలేమా? అన్నది ఒక విధాన నిపుణుడి ప్రశ్న. లోతుల్లోకి వెళ్లే కొద్దీ మోడీ వ్యక్తిగత నిజాయితీ కూడా మసకబారుతుంది. వ్యక్తిగత నిజాయితీ ప్రభుత్వ నిజాయితీగా, వ్యవస్థ నిజాయితీగా ఉండాలి. సం స్కరణలను మునుపెన్నడూ లేనంత వేగంగా అమలు చేస్తున్నారు. రక్షణరంగంలో వందశాతం విదేశీ పెట్టుబడులు అనుమతించారు. స్వదేశీ రక్షణ రంగ సంస్థల పాత్ర ను కుదించేందుకు చేయవలసిందంతా చేస్తున్నారు. నిజానికి, ఈ విధానం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వదేశీ విధానాలకూ విరుద్ధం. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వివాదాస్పదం కావడం అందుకే. బేషరతుగా అడిగిన ధర(ఎక్కువ ధర) ఇచ్చి విమానాలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఒప్పుకున్నది. యూపీఏ ప్రభుత్వం జరిపిన సంప్రదింపులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. టెక్నాలజీ బదిలీ నిబంధనను వదిలేసింది. ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ త్వరితగతిన జరుగుతున్నది. వ్యవస్థలో ఆర్థిక క్రమశిక్షణను తీసుకురావడానికి చాలా చర్యలే తీసుకున్నారు. విధానాలు, చట్టాలు వస్తే ఏం ప్రయోజనం? ఇంకా అవేవీ ఫలితాలివ్వలేదు. ప్రభుత్వరంగ బ్యాంకులను ముంచేవాళ్లు ముంచుతూనే ఉన్నారు. తప్పించుకుతిరిగేవాళ్లు తిరుగుతూనే ఉన్నారు. ప్రభుత్వమే చాలా మందికి ఛత్రం పడుతున్నది. సామాన్యులకు అప్పు లభించదు. పెద్దలు తీసుకున్న అప్పులు చెల్లించరు. సామాన్యుడికి ఈ అనుభవంలో మార్పు రానంతవరకు క్రమశిక్షణ ఫలితాలు జనానికి చేరనట్టే. మోదీ వల్ల నాకు ఈ మేలు జరిగింది అని చెప్పుకునే పరిస్థితి ఇంకా రాలేదు. కొన్ని పథకాలు ప్రజలకు చేరినా అవి మోడీ చేసినవా, స్థానిక ప్రభుత్వాలు చేసినవా, బ్యాంకులు చేసినవా తెలియని పరిస్థితి. ఇటీవల ఒక పల్లెటూరులో ఒక బ్యాంకుకు వెళితే మేనేజరు ఒక బాధితురాలికి చెక్కు అందజేస్తున్నారు. ఆమె భర్త ప్రమాదవశాత్తు చనిపోయారు. ప్రధాని బీమా యోజన కింద రెండు లక్షల బీమా ఇస్తున్నాం అని ఆయన చెప్పారు. బ్యాంకులో ఖాతా ఉన్నవాళ్లకు ఈ పథకం వర్తిస్తుందట. ఎంత మందికి ఇచ్చారు ఇప్పటివరకు? అడిగితే, మా బ్యాంకు పరిధిలో పది మంది వరకు వచ్చి ఉంటాయి అని ఆయన సమాధా నం ఇచ్చారు. ఇంటి యజమానిని కోల్పోయిన కుటుంబానికి రెండు లక్షల రూపాయలు గొప్ప ఆసరా. కానీ ఆ బాధితురాలికి ఎవరిస్తున్నారన్న విషయం తెలియదు. టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో, పత్రికల్లో ఎంత యుద్ధాలు చేసినా అట్టడుగుస్థాయిలో జనాన్ని చేరుతున్నామా లేమా అన్నదే ముఖ్యమవుతుంది. అట్టడుగు ప్రజానీకాన్ని చేరడానికి వారిని పరామర్శించే ఒక పార్టీ, ఒక యంత్రాంగం సజీవంగా నడుస్తూ ఉండాలి. ఇన్ని ఉండగా కూడా జనం జై కొట్టాలని లేదు. చాలా తేలికగా అభిప్రాయాలు మార్చుకునే స్వేచ్ఛ, పరిస్థితి జనానికి ఉంటుంది. చంద్రబాబు పరిస్థి తి కూడా మోదీ మాదిరిగానే ఉంది. పైన అట్టహాసం, లోన గందరగోళం.ఏ రాజకీయ నాయకుడూ మాట్లాడగూడని మాటలు కొన్ని ఇటీవల చంద్రబాబునాయుడు మాట్లాడాడు. ఆయన రాజకీయ వాస్తవికతల నుంచి దూరమవుతున్నారేమో అనిపించింది. ఇళ్లిచ్చి, పింఛను ఇచ్చి, బియ్యమిచ్చి,… ఇలా ఇంకా చాలా చాలా ఇచ్చినా ఓటర్లు స్వార్థపరులై ఆఖరులో ఇచ్చే ఐదొందల రూపాయల నోటుకే ఓటు వేస్తున్నారని ఒక పెద్ద బండ ప్రజలపై వేశారు. రాజకీయాల్లో డబ్బు ప్రభావం గురించి చంద్రబాబు అస్సలు మాట్లాడగూడని మాట. ఎందుకంటే ఓట్ల ధరలు చంద్రబాబు రాజకీయాలు చేయడం మొదలైన తర్వాతనే విపరీతంగా పెరిగాయి. ఓట్లను ప్లాట్లను వేలం వేసినట్టు వేలం వేసి కొనుక్కునే పరిస్థితులు వచ్చాయి. తెలంగాణలో చాలా నయం. ఊరుకు పది పార్టీలు ఉంటాయి. అన్ని పార్టీలు పోటీ చేస్తాయి. జనం తమకు తోచినవారికి వేస్తారు. నచ్చడం నచ్చకపోవడం ముఖ్యం. ఆ తర్వాతనే ఏ ప్రయోజనమైనా. రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా జనం చేరువ కావ డం ముఖ్యం. జనం హృదయాలను గెల్చుకోవడం ముఖ్యం. ఇటీవల ఒక సంస్థ కొన్ని నియోజకవర్గాలలో సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో ఇప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీకి ఓటేస్తారు? అని ప్రశ్నిస్తే 52 శాతం మంది టీఆర్‌ఎస్‌కు వేస్తామని చెప్పా రు. మీ ఎమ్మెల్యే పనితీరుపై మీ అభిప్రాయం ఏమిటి అంటే 35 శాతం మంది బాగుంది అని చెప్పారు. అంటే అక్కడ ఓటు కేసీఆర్‌కు. ప్రభుత్వం పనితీరుకు వేసినట్టు. అంటే ప్రభుత్వం ప్రజలను చేరుతున్నట్టు, ప్రజల హృదయాలను చేరుతున్న ట్టు, నాయకులే ఇంకా కేసీఆర్ అనుకూల పవనాలను అందుకోలేకపోతున్నట్టు భావించాలి. ఈ పరిస్థితినే కేంద్రంలో మోదీకి అన్వయించి చూస్తే పూర్తి భిన్నమైన అంచనాలు వస్తున్నాయి. 2014 ఎన్నికలతో పోల్చితే టీఆర్‌ఎస్ బాగా బలపడినట్టు సర్వేలు చెబుతున్నాయి. అదే కేంద్రంలో మోదీ బలహీనపడినట్టు వివిధ రాష్ర్టాల నుంచి వస్తున్న ట్రెండ్సు తెలియజేస్తున్నాయి. విచిత్రంగా కొన్ని రాష్ర్టాల్లో ఆప్ కూడా విస్తరించింది. పంజాబ్‌లో ఆప్ ఒక బలమైన శక్తిగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నా యి. నాయకులు, ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలు, చేపట్టే పనులు ప్రజలకు ఎంతవరకు కనెక్టు అవుతున్నాయన్నదే ముఖ్యం. ఆప్ గానీ, టీఆర్‌ఎస్ గానీ జనంతో కనె క్టు అయ్యే అంశాలపై పనిచేస్తున్నాయి. సామాన్యులకు పెద్ద పెద్ద విషయాలతో పనిలేదు. రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలే వారికి ముఖ్యం. ఏ పార్టీ అయి నా అది తెలుసుకుని మసలుకుంటే తప్ప రాజకీయ భవిష్యత్తు ఉండదు. లోక్‌సభ ఎన్నికలకు పెద్దపెద్ద విషయాలు ఉపయోగపడతాయి కావచ్చు. కానీ రాష్ర్టాలు, అసెంబ్లీలు గెలువాలంటే ఎక్కడికక్కడ స్థానిక ఆత్మను పట్టుకోవడమే అవసరం. దేశభక్తి, జాతీయవాదం, గోరక్షణ, ఉగ్రవాదంపై పోరాటం వంటివి పెద్ద పెద్ద విషయాలు. పింఛన్లు, ఉపాధిఅవకాశాలు, రైతులకు అప్పులు, సబ్సిడీలు, విద్యవైద్యం వంటి అంశాలు, వివిధ సామాజిక వర్గాల ప్రయోజనాలు స్థానిక ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. అందుకే 2014కు 2016కు ఈ తేడా.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad