సూక్ష్మ పాలన-సత్వర ఫలితాలు


IMG_2796

అభివృద్ధి సోపానంలో అట్టడుగున ఉన్న వర్గాలకు నిజమైన స్వావలంబన చేకూరాలి. అవి సాధించాలంటే రాజకీయ నాయకులు, అధికారులు ప్రజలకు దగ్గరగా ఉండాలి. అభివృద్ధి పథకాల అమలును దగ్గరగా చూడాలి. చేసే ప్రతిపనిలో నాణ్యతా కొలమానాలు ఉండాలి. అటువంటప్పుడే ఎన్నదగిన, గమనించదగిన, దీర్ఘకాలిక అభివృద్ధి సాధ్యం. జిల్లాలు పెరిగితే అధికారులు పెరుగుతారు. ఖర్చులు పెరుగుతాయి అని చేస్తున్న వాదన అర్థరహితమైనది. జిల్లాలు పెరిగితే పాలన పెరుగుతుంది. దృష్టిపెట్టి పనిచేయడం జరుగుతుంది. లీకేజీలకు, అవినీతికి అడ్డుకట్టపడుతుంది. ప్రభుత్వం వెచ్చించే నిధులు ప్రజలకు చేరతాయి. ఒక పురోగామి రాష్ట్రంగా, ఉన్నత జీవన ప్రమాణాలను సాధించే రాష్ట్రంగా ముందుకు సాగుతుంది.

ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు లబ్దిదారులకు చేరడం లేదు. ప్రభుత్వం రూపాయి ఖర్చుపెడితే లబ్దిదారులకు చేరుతున్నది 15 శాతానికి మించి చేరడం లేదు అని నాడు రాజీవ్‌గాంధీ మొదలు మొన్న బీజేపీ నాయకత్వం వరకు పదే పదే చెబుతున్న మాట. ఆరు దశాబ్దాలుగా పేదరిక నిర్మూలన పథకాలు అమలు చేస్తున్నా ఇప్పటికీ 20 శాతానికి పైగా ప్రజలు పేదరికంలో ఉన్నారని కేంద్ర ప్రభుత్వమే అంగీకరిస్తున్నది. అవినీతి సహజం దానిని ఏమీ చేయలేమని ఒకప్పుడు ఇందిరాగాంధీ, ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు చెబుతున్నారు. ఈ పరిస్థితులను మార్చలేమా? ప్రభుత్వం చేతుల్లో ఏమీ లేదా? నాయకులు రాజనీతిజ్ఞులయితే, దీర్ఘదృష్టి, ప్రజాసంక్షేమాపేక్ష, పట్టుదల ఉంటే ఎందుకు మార్చలేము? సంక్షేమ పథకాల్లో 85 శాతం వృథాను అరికడితే పేదరికాన్ని జయించలేమా? అవినీతిని కట్టడి చేస్తే ప్రజలపై భారాన్ని తగ్గించి ప్రజారంజక పాలన అందించలేమా? సర్క్యులర్ రాజ్యాన్ని మార్చి ప్రజలు, పారిశ్రామిక వేత్తలు తేలికగా పనులు చేసుకునే వెసులుబాటు తేలేమా?అభివృద్ధిని ఉరకలు వేయించలేమా? తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సరిగ్గా ఇదే అంశంపై సంస్కరణలు మొదలు పెట్టారు. ఆలోచించడం, ప్రశ్నలు వేసుకోవడం, అందరిచేతా ఆలోచింపజేయడం, సమాధానాలు రాబట్టడం, విధానాలు రూపొందించడం, ఆచరణలో పెట్టడం తెలంగాణలో ఇవన్నీ ఒక పరంపరగా జరుగుతున్నాయి. ప్రజలకు గరిష్ట ప్రయోజనం కలిగించగల మార్గాలను అన్వేషించడంలో ఆయన నిత్య శోధకుడు. అస్తమానం ఏదో ఒక దేవులాటతో తపించే ముఖ్యమంత్రిని నేనింతవరకు చూడలేదు. పత్రికలు చదవడం, చానెళ్లు ఫాలోకావడం, సామాజిక మాధ్యమాల్లో ఏం జరుగుతున్నదో కనిపెట్టడం, నిరంతరం ఏవో కొత్తకొత్త ఆలోచనలు చేయడం, అందరితో ఆ ఆలోచనలను పంచుకోవడం, ఆచరణకు ఉద్యుక్తులను చేయడం…ఒక ముఖ్యమంత్రి ఇంతగా శ్రమపడడం అసాధారణం. గతంలో ముఖ్యమంత్రులకు పౌరసంబధాల అధికారులు పత్రికలు, చానెళ్లు చూసి సంక్షిప్త నివేదికలు ఇచ్చేవారు. వాటిని పైపైన చూసి పక్కన పడేసేవారు. కేసీఆర్ అలాకాదు వార్తలు చదివి, వాటిపై అప్పటికప్పుడు సూచలు చేయడం, ఆదేశాలు ఇవ్వడం ఆయనకు రివాజు. ఆయన చుట్టూ ఉండే అధికారులు, సిబ్బంది అందరూ నిరంతరం అప్రమత్తంగా ఉండవలసిందే. ఒక్కోసారి అనిపిస్తుంది-తెలంగాణ రాష్ట్రం, స్వయం పాలన, అసాధారణ అభివృద్ధి, సంక్షేమ విజయాలను సాధించిన ఒక ముఖ్యమంత్రి ఇంతగా కష్టపడడం అవసరమా అని. కానీ ఆయన విశ్రమించరు. ఎవరినీ విశ్రమించనీయరు. ఒక్కోసారి ఇబ్బంది అనిపించినా ఆయన ఓపిక, ఆయా అంశాలపై ఆయన చూపే శ్రద్ధ మనలను ఆశ్చర్యపరుస్తుంది. ఉద్యుక్తులను చేస్తుంది. అది ఆయన తత్వం. శోధించాలి, సాధించాలి…ఆయన కార్యాచరణలో కనిపించే తత్వం. ఆయన మనస్తత్వం. కొత్తగా ఆయన మారే అవకాశమే లేదు. ఆయన అసాధారణ ఆలోచనల పుట్ట. ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేయండి అని తన సహచరులకు పురమాయించడం ఆయన ఉద్యమకాలం నుంచీ చెబుతున్న మాట. ఇప్పుడూ అదే ఒరవడి.

దేశంలో 29 రాష్ర్టాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 687 జిల్లాలు ఉంటే అందులో 250 జిల్లాలు పది లక్షలు అంతకంటే తక్కువ జనాభా కలిగి ఉన్నాయి. ఐదు లక్షలు అంతకంటే తక్కువ జనాభా కలిగిన జిల్లాలు సుమారు 100 ఉన్నాయి. చత్తీస్‌గడ్‌లో 24 జిల్లాలు ఉంటే 19 జిల్లాలు సుమారు పదిలక్షలు అంతకంటే తక్కువ జనాభా కలిగిన జిల్లాలున్నాయి. మధ్యప్రదేశ్‌లో 16 జిల్లాలు ఐదు నుంచి పదిలక్షల జానాభా కలిగి ఉన్నాయి. పంజాబ్‌లో పది జిల్లాలు పదిలక్షలు అంతకంటే తక్కువ జనాభాతో ఉన్నాయి. గుజరాత్‌లో పది, జార్కండులో 11, ఉత్తరాఖండ్‌లో 9 పదిలక్షల కంటే తక్కువ జనాభాతో జిల్లాలు ఉన్నాయి. తక్కువ జనాభాతో ఎక్కువ జిల్లాలు కలిగిన రాష్ర్టాలన్నీ అభివృద్ధి సూచికలో పైమెట్టులో ఉండడమో, పైస్థానానికి ఎదగడానికి గట్టిగా పోరాడుతుండడమో చేస్తున్నాయని వేరేచెప్పనవసరం లేదు.

జిల్లాల ఏర్పాటు నిర్ణయం కూడా ఆ ఆలోచనా స్రవంతిలో భాగమే. తెలంగాణ సాధించడమే కాదు, సాధించిన తర్వాత ఏమి చేయాలో ఆయన చాలా కాలం నుంచి ప్రణాళికలు ఆలోచిస్తూ వచ్చారు. కొత్త జిల్లాల ఆలోచన కూడా అటువంటిదే. తెలంగాణ సాధించినంత గొప్ప చరిత్రాత్మక పరిణామం. మార్పు దిశగా వేసిన ఒక గొప్ప ముందడుగు. చిన్న జిల్లాలు లక్ష్యాల సాధనకు దగ్గరి మార్గం. ఫలితాలపై దృష్టిపెట్టి పనిచేయడానికి, సత్వర ఫలితాలు సాధించడానికి ఒక ప్రగతిశీల పాలనా సంస్కరణ. నిర్వహణ, తనిఖీ, పర్యవేక్షణ, ఫలితాల సమీక్షకు అందనంత పెద్ద జిల్లాలు ఇంతకాలం కొనసాగాయి. కాలంచెల్లిన రాజకీయ ఆలోచనలతో, అభివృద్ధి నిరోధక ఆధిపత్య ధోరణులతో జిల్లాల్లో తరతరాలుగా పాతుకుపోయిన రాజకీయ పెత్తందారీ వ్యవస్థల పట్టునుంచి ప్రాంతాలను విముక్తి చేసే ప్రజాస్వామిక ప్రక్రియ జిల్లాల ఏర్పాటు. ప్రజలకోసం, ప్రజలకు చేరువగా ప్రభుత్వం ఉండాలని యోచించేవారెవరూ కొత్త జిల్లాలను వ్యతిరేకించరు. వెనుకటికి ఎన్‌టిఆర్ మండలాల వ్యవస్థను తెచ్చినప్పుడు అప్పటిదాకా నిద్రాణమై ఉన్న సామాజిక శక్తులు ఒక్కసారిగా స్వేచ్ఛను పొంది రాజకీయాధికార సౌధాల్లో అడుగుపెట్టగలిగారు. కేసీఆర్ జిల్లాల సంస్కరణ అంతకంటే గొప్ప మార్పు. ఎన్ని జిల్లాలు, ఎంత జనాభా అన్న పంచాయతీ కూడా అర్థరహితమైనది. తెలంగాణకంటే తక్కువ వైశాల్యం కలిగిన బీహార్‌లో 38, పశ్చిమబెంగాల్‌లో 20, జార్కండులో 24, అస్సాంలో 35, పంజాబ్‌లో 22, హర్యానాలో 22 జిల్లాలు ఉన్నాయి. దేశంలో 29 రాష్ర్టాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 687 జిల్లాలు ఉంటే అందులో 250 జిల్లాలు పది లక్షలు అంతకంటే తక్కువ జనాభా కలిగి ఉన్నాయి. ఐదు లక్షలు అంతకంటే తక్కువ జనాభా కలిగిన జిల్లాలు సుమారు 100 ఉన్నాయి. చత్తీస్‌గడ్‌లో 24 జిల్లాలు ఉంటే 19 జిల్లాలు సుమారు పదిలక్షలు అంతకంటే తక్కువ జనాభా కలిగిన జిల్లాలున్నాయి. మధ్యప్రదేశ్‌లో 16 జిల్లాలు ఐదు నుంచి పదిలక్షల జానాభా కలిగి ఉన్నాయి. పంజాబ్‌లో పది జిల్లాలు పదిలక్షలు అంతకంటే తక్కువ జనాభాతో ఉన్నాయి. గుజరాత్‌లో పది, జార్కండులో 11, ఉత్తరాఖండ్‌లో 9 పదిలక్షల కంటే తక్కువ జనాభాతో జిల్లాలు ఉన్నాయి. తక్కువ జనాభాతో ఎక్కువ జిల్లాలు కలిగిన రాష్ర్టాలన్నీ అభివృద్ధి సూచికలో పైమెట్టులో ఉండడమో, పైస్థానానికి ఎదగడానికి గట్టిగా పోరాడుతుండడమో చేస్తున్నాయని వేరేచెప్పనవసరం లేదు. అధికార వికేంద్రీకరణ, సమర్థ నిర్వహణ, సూక్ష్మస్థాయి పర్యవేక్షణ, ఆశించిన ఫలితాల సాధన చిన్న పాలనా కేంద్రాల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలు. తెలంగాణ కూడా అభివృద్ధి దిశగా వేసిన ఒక పెద్ద ముందడుగు జిల్లాల ఏర్పాటు. గాంధీ జయంతిరోజు ముఖ్యమంత్రి మరికొన్ని జల్లాలను కూడా అంగీకరించి ఆందోళన చేస్తున్నవారిని సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు. పంతాలు పట్టింపులకు పోకుండా వీలైనంత విస్తృత ఆమోదంతో నిర్ణయాలు చేశారు. అయినా అక్కడక్కడా డిమాండ్లు, అలకలు, అసంతృప్తులు మిగిలిపోవడం సహజం. అందులో న్యాయమైనవీ, ఆచరణ సాధ్యం కానివీ ఉండవచ్చు. ఏదో ఒక పేచీ లేవనెత్తేవారు ఎప్పుడూ ఉంటారు. విశాలదృష్టితో ఏం జరుగుతున్నదన్నదే ముఖ్యం.

తెలంగాణ ప్రభుత్వం దేశంలో మునుపెన్నడూ ఏ ప్రభుత్వమూ చేయని సాహసాలు చేసింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ జాతి దృష్టిని ఆకర్షించాయి. అందరి మన్ననలూ పొందుతున్నాయి. నీటి విలువ తెలిసిన రాష్ట్రంగా అత్యంత వేగంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నది. సుమారు 50 వేల కోట్ల రూపాయలు సంక్షేమ రంగాల్లో ఖర్చు చేస్తున్నది. రాష్ట్ర జనాభాలో పది శాతం మందికి పించన్లు ఇవ్వడం ద్వారా సామాజిక భద్రత కల్పిస్తున్నది. ఆహార భద్రత విషయంలో విప్లవాత్మక నిర్ణయాలు చేసింది. రెండు పడక గదుల ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి వంటి పథకాలను ప్రారంభించినా అవి ఇంకా వేగంగా అమలు చేయవలసి ఉంది. కేజీ టూ పీజీ, సంక్షేమ గురుకులాల ఏర్పాటు వేగంగా కార్యరూపం దాల్చాల్సి ఉంది. ఇవన్నీ త్వరితగతిన అమలు చేయడానికి, నిర్వహించడానికి, ఫలితాలు సాధించడానికి దృష్టిని కేంద్రీకరించి పనిచేసే యంత్రాంగం కావాలి. ఒక అధికారి అరవై మండలాలు చూడడం వేరు. ఒక అధికారి పది నుంచి ఇరవై మండలాలు చూడడం వేరు. ఏళ్ల తరబడి పేదరిక నిర్మూలన పథకాలు అమలు చేస్తూ ఉంటే లాభం లేదు. అవి ఫలితం ఇవ్వాలి. ప్రజలకు పేదరికాన్ని జయించే సాధన సంపత్తి సమకూర్చాలి. ప్రభుత్వం అమలు చేసే పథకాల్లో 85 శాతం లీకేజీలను అరికట్టగలిగితే ఈదేశంలో పేదరికం ఎప్పుడో అంతమయ్యేది. పేదలకు పూరిగుడిసెల్లాంటి ఇండ్లు, ఏవో పప్పు బెల్లాలు అందించి చేతులు దులుపుకోవడం, రాజకీయ నాయకత్వం అంతకంతకూ ఎదగడం ఇప్పటిదాకా జరుగుతున్న తంతు. ఇదే మూస ధోరణితో పనిచేస్తే ఇంకెన్ని దశాబ్దాలు పేదరిక నిర్మూలన పథకాలు అమలు చేసినా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉండిపోతుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం గత నాలుగు దశాబ్దాల్లో కట్టించిన ఇళ్లన్నీ సరిగా ఉండి ఉంటే ఇప్పుడు సొంత ఇళ్లకు ఇంత డిమాండు ఉండేది కాదు. నాణ్యత లేని ఇండ్లు ఇవ్వడం, అవి నాలుగు రోజులకే పాడైపోవడం, పేదలు మళ్లీ వీధుల్లో పడడం, మళ్లీ ఇండ్లకోసం దరఖాస్తులు చేసుకోవడం ఇదో చక్రభ్రమణంలాగా తయారైంది. ఈ పరిస్థితి పోవాలంటే ప్రభుత్వం ఖర్చు చేసే నిధులు ప్రజలకు నాణ్యమైన, దీర్ఘకాలం మన్నగలిగే ఆస్తిని సమకూర్చాలి. అభివృద్ధి సోపానంలో అట్టడుగున ఉన్న వర్గాలకు నిజమైన స్వావలంబన చేకూరాలి. అవి సాధించాలంటే రాజకీయ నాయకులు, అధికారులు ప్రజలకు దగ్గరగా ఉండాలి. అభివృద్ధి పథకాల అమలును దగ్గరగా చూడాలి. చేసే ప్రతిపనిలో నాణ్యతా కొలమానాలు ఉండాలి. అటువంటప్పుడే ఎన్నదగిన, గమనించదగిన, దీర్ఘకాలిక అభివృద్ధి సాధ్యం. జిల్లాలు పెరిగితే అధికారులు పెరుగుతారు. ఖర్చులు పెరుగుతాయి అని చేస్తున్న వాదన అర్థరహితమైనది. జిల్లాలు పెరిగితే పాలన పెరుగుతుంది. దృష్టిపెట్టి పనిచేయడం జరుగుతుంది. లీకేజీలకు, అవినీతికి అడ్డుకట్టపడుతుంది. ప్రభుత్వం వెచ్చించే నిధులు ప్రజలకు చేరతాయి. ఒక పురోగామి రాష్ట్రంగా, ఉన్నత జీవన ప్రమాణాలను సాధించే రాష్ట్రంగా ముందుకు సాగుతుంది.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad