నీటి విలువ తెలుసుకుందాం


06MBR-11
Jurala Project-05.08.2016

రాజకీయాలు, వీధిపోరాటాలు తర్వాత చేసుకోవచ్చు. తిట్లు దీవెనలు నింపాదిగా పంచుకోవచ్చు. పార్టీలు, పంచాయితీలు, కోర్టు వివాదాలు తీరికగా కొట్లాడవ చ్చు. నీటివిలువ తెలుసుకోవడం తెలంగాణకు చాలా ముఖ్యం. నీటి ఎజెండా ముం దు మిగిలిన ఎజెండాలన్నీ దిగదుడుపే. నీరు లేకనే తెలంగాణ ఇన్ని ఇక్కట్లు పడుతున్నది. నీరు లేకనే తెలంగాణ రైతులు బోర్లు, మోటార్లు, అప్పులు, ఆత్మహత్యల సుడిగుండంలో కొట్టుకుపోతున్నారు. నీరు లేకనే లక్షలాది మంది పొట్టచేతపట్టుకుని వలసపోతున్నారు. నీరు సకల సంపదలకు మూలం. నీరు లేక నాగరికత లేదు. నీరు లేక విద్య, విజ్ఞానం, సంస్కృతీ వికాసం లేవు. నీరు లేకపోతే ఆర్థిక ఎదుగుదల లేదు. నీరు ఉండటం, లేకపోవడం మధ్య ఉన్న అంతరాన్ని తెలంగాణ కొన్ని దశాబ్దాలపాటు అనుభవించింది. మీకేందయ్యా కాలువకిందోళ్లు. మాకు తాగేందుకు చుక్క దిక్కులేదు అని మా తాతలు తండ్రులు మాట్లాడగా విన్నాం. కాలువ కిందోళ్లు మన పిల్లలను చేసుకోరు. వాళ్ల హైసతెక్కడ మనమెక్కడ అని మన పెద్దవాళ్లు మాట్లాడుకోవడమూ విన్నాం. ఎంతో దూరం ఎందుకు? మొన్నటికి మొన్న ఎల్లంపల్లి నుంచి గేట్లు ఎత్తి నీరు కిందికి వదులుతుంటే గుండెలు పిండినట్టయింది. కరీంనగర్ జిల్లాలోనే ఎల్లంపల్లికి అల్లంత దూరంలో ఉన్న మా మానేరులో నీళ్లు లేవు. తాగునీటికోసం కూడా తన్లాడాల్సిన పరిస్థితిలో ఉన్నాం. సింగూరు, మంజీర, నిజాంసాగర్, ఎగువ మానేరు నీళ్లు లేక వెలవెలపోతుండె. ఇలా వృథాగా నీటిని వదలవలసి వచ్చె. ఎంతకాలం ఈ గోస అని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బాధపడ్డారు. ఇవ్వాళ తెలంగాణలో ప్రతి గుండె తడి ఇది. ఇక్కడ ఇలా ఉంటే మహబూబ్నగర్లో ఒక ప్రాంతమంతా పండుగ చేసుకుంటున్నది. గత రెండు వారాలుగా రోజుకు 4000 నుంచి 5000 క్యూసెక్కుల నీరు ఆ ప్రాంత పొలాలు చెరువులను చేరుతున్నది. చివరి భూములదాకా నీటిని తీసుకెళ్లగలుగుతున్నారు. మన ప్రాజెక్టు లు మన నియంత్రణలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో జూరాల వద్ద మన అధికారులు రుజువు చేస్తున్నారు. గతంలో నీరివ్వడానికి అనేక జీవోలు అడ్డంకులు. ఇంత లెవల్ వచ్చేదాకా నీరు విడువద్దు అని కాలయాపన చేసేవారు. శ్రీరాంసాగర్ దగ్గరా అదే పరిస్థితి. రిజర్వాయరు నీటి మట్టం 1080 వచ్చే దాకా కిందికి నీరిచ్చేవారు కాదు. ఎందుకంటే జీవోలో అలా ఉందని చెప్పేవారు. ఆ నీటిమట్టం వచ్చేసరికి పుణ్యకాలం అయిపోయేది. ఆ నీటిమట్టం వచ్చిన తర్వాత వరద వస్తే కిందికి వదలాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అంటే కాలువలకు, నదిలోకి ఒకే సారి నీరు వదిలే పరిస్థితి. కాలువల నీరు కింది రిజర్వాయర్లకు ఎప్పుడు చేరాలి?

టీఎంసీల లెక్కలు..
* ఒక టీఎంసీ నీళ్లు అంటే: వంద కోట్ల ఘనపుటడుగుల నీళ్లు.
* ఒక ఘనపుటడుగు నీరు అంటే: అడుగు పొడవు, అడుగు ఎత్తు, అడుగు లోతులో నిలిచి వుండే నీరు.
* 1030 టీఎంసీలు: ఈ ఏడాది ఇప్పటివరకు గోదావరి నుంచి బంగాళాఖాతంలో కలిసిన నీరు.
* 26,249 చెరువులు: తెలంగాణలోని మొత్తం 43,189 చెరువులు, కుంటల్లో ఇంకా నీరు చేరని చెరువుల సంఖ్య.
* 76 మండలాలు: ఇంతగా వర్షాలు పడుతున్నాయనుకుంటున్నా ఇప్పటికీ సరిపోను వర్షాలు పడక కరువు ఛాయలు కనిపిస్తున్న మండలాలు.
* 175 మండలాలు: తెలంగాణలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయిన మండలాలు.
* 15 రిజర్వాయర్లు: నాగార్జునసాగర్, డిండి, సింగూరు, నిజాంసాగర్, మంజీర, మిడ్ మానేరు, ఎగువ మానేరులకు ఈ సీజనులో వచ్చిన జలాలు చాలా స్వల్పం. శ్రీరాంసాగర్, శ్రీశైలం, మూసీ, పాలేరు, అక్కంపల్లి, కోటిపల్లి…… వరద రాక
మొదలైనా ఇంకా పూర్తిస్థాయిలో నిండ లేదు.
* 225 టీఎంసీలు: రాష్ట్రంలోని మొత్తం 43,189 చెరువుల నీటి నిల్వ సామర్థ్యం.

* ఒక టీఎంసీ అంటే పదివేల ఎకరాల్లో సుమారు 25 కోట్ల పంటను పండించగలిగిన నీరు.
* ఒక టీఎంసీ అంటే 22,956 ఎకరాల విస్తీర్ణంలో ఒక అడుగు ఎత్తున నిల్వచేసే నీరు.
* సముద్రంలో కలిసిన 1030 టీఎంసీల నీటి విలువ వ్యవసాయార్థిక శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 25000 కోట్లు.

n ఒక టీఎంసీ అంటే 2831 కోట్ల లీటర్లు.
* ఒక టీఎంసీ నీటి విలువ ఐదు రూపాయలకు లీటరు చొప్పున 14155 కోట్లు.
* ఒక టీఎంసీ అంటే 18.87 కోట్ల మందికి ఒక రోజుకు సరిపోయే నీరు.
* ఒక టీఎంసీ అంటే 5.17 లక్షల మందికి ఏడాదిపాటు సరిపోయే నీరు.
* ఒక టీఎంసీ అంటే 56.62 లక్షల వాటర్ ట్యాంకర్లు (5000 లీటర్లు పట్టేవి)

3 adb 5a

Yellampalli Reservoir-03.08.2016

గోదావరిలో నీటి లభ్యత ఉంది. ఎల్లంపల్లి నుంచి భద్రాచలం దాకా నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. ఎత్తిపోతలు ఖరీదైనవని ఒక దురభిప్రాయం ఉంది. విద్యుత్తు ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుందని ప్రచారంలో ఉంది. రెండూ అబద్ధమే. గోదావరి పొడవునా బరాజులు నిర్మిస్తే అక్కడ విద్యుత్తు తయారు చేసుకోవచ్చు. నీటినీ ఎత్తిపోసుకోవచ్చు. పైగా విద్యుత్తు ఛార్జీల ధరలు అంతర్జాతీయంగా స్టాగ్నేషన్కు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. సౌరవిద్యుత్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే విద్యుత్తు కొనుగోలు చేసేవారుండరని వారు అంచనా వేస్తున్నారు. రైతులు నీటికోసం బోరు బావులపైన, మోటార్లపైన పెడుతున్న వ్యయంతో పోల్చితే ప్రాజెక్టులపై పెట్టే ఖర్చు చాలా తక్కువని కూడా నిపుణులు చెబుతున్నారు. పైగా ప్రాజెక్టులపై పెట్టేది ఒక్కసారి పెట్టే పెట్టుబడి. వరద ఎక్కువ రోజులు ఉండదు. ఉన్నప్పుడు నీటిని ఎత్తిపోసుకుని నిల్వచేసుకోవాలి. అందుకు రిజర్వాయర్లు కావాలి. అందుకు భూసేకరణా అవసరమే. భూసేకరణ చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధంగా కేంద్ర చట్టాన్నే అమలు చేయాలని ఏమీ లేదు. అంతకంటే మెరుగైన పునరావాసం, ప్రయోజనాలు కల్పించే చట్టం ఏదైనా చేసుకోవచ్చు, అమలు చేయ-వచ్చు అని 2013 చట్టం నిర్దేశించింది. నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలన్న విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. తక్షణం క్షోభకు గురయ్యేది వారే. భూములతో, గ్రామాలతో తరతరాల అనుబంధాన్ని కోల్పోయేది వారే. అందుకు ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చినా తప్పు లేదు. అదే సమయంలో భూసేకరణ అనివార్యతనూ అందరూ అంగీకరించి తీరాలి. అరవయ్యేళ్ల తర్వాత మన తలరాతను మనమే రాసుకునే అవకాశం వచ్చింది. మన భవిష్యత్తును మనమే నిర్మాణం చేసుకునే వీలుచిక్కింది. పరాయి ఆధిపత్యవర్గాలు అవి సృష్టించిన భావజాలాల నుంచి బయటపడి వేగంగా మనలను మనం బాగుచేసుకోవలసిన తరుణం వచ్చింది. కాలయాపనకు మనం చెల్లించే మూల్యం తిరిగి బాగుచేసుకోలేనిది. ఇందుకు నల్లగొండ జిల్లా ఫ్లోరోసిస్ బాధితులే సాక్ష్యం. 1985లో శ్రీశైలం కుడి ఎడమ కాలువలను ఒకేసారి ప్లాను చేశారు. ఒకేసారి మొదలు పెట్టారు. రెండు వైపులా అడవులున్నాయి. కానీ కుడికాలువ ఇరయ్యేళ్ల క్రితమే పూర్తయింది. ఒకసారి కాదు రెండు సార్లు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపునకు కూడా ఎటువంటి అనుమతులు లేవు. కానీ వారు చేయగలిగారు. తెలంగాణకు మాత్రం అడవులు, నిబంధనలు అడ్డం వచ్చాయి. కుడికాలువకు నీరొచ్చినట్టే ఎడమకాలువకు గ్రావిటీ ద్వారా నీరు వచ్చిఉంటే ఫ్లోరోసిస్ గ్రామాలు ఈపాటికి విముక్తి అయి ఉండేవి. కనీసం తాగునీరు అందించి ఉండేవారు. ఎడమకాలువను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించి చివరికి సాగర్ నుంచి ఎత్తిపోసుకునే దాకా తీసుకెళ్లారు. పోతిరెడ్డిపాడును వెడల్పు చేసే పనితోనే మొదలు పెట్టిన ఎడమకాలువ టన్నెలు పని ఇంకా కుంటి నడక నడుస్తూ ఉంది. ఇంకా ఎన్నేండ్లు పడుతుందో తెలియదు. టన్నెలు పూర్తయితే ఏడాదికి 30 టీఎంసీల నీరు తీసుకునే అవకాశం ఉంది. ఆ నీటి విలువ ఏడాదికి సుమారు 750 కోట్ల రూపాయలు. సుమారు 3 లక్షల ఎకరాలు సాగుచేసుకునే అవకాశం ఉంది. జిల్లాలోని చెరువులన్నీ నింపగలిగిన నీరు అది. ఒక్కో ఏడాది ఆలస్యమయ్యే కొద్దీ ఎంత నష్టం జరుగుతూ ఉన్నదో తెలుసుకోవడానికే ఇదంతా.

గోదావరి ప్రాజెక్టుల విషయంలోనూ అంతే. శ్రీరాంసాగర్ నుంచి కరీంనగర్, వరంగల్ మీదుగా అటు మునగాల దాకా, ఇటు మహబూబాబాద్ దాకా కాలువలు తవ్వి రెడీగా ఉన్నాయి. వరదకాలువ కరీంనగర్, మెదక్, చేర్యాల, జనగామ, ఆలేరు, భువనగిరి దాకా తవ్వి సిద్ధంగా ఉంది. అక్కడక్కడ చిన్నచిన్న ప్యాకేజీలు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ కాలువలకు శ్రీరాంసాగర్ నుంచి తగినంత నీరు లభించే అవకాశం లేదు. ఓ మోస్తరుగా కాలం అయిన సంవత్సరాల్లో నిజామాబాద్, కరీంనగర్లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే సరిపోయే నీరు శ్రీరాంసాగర్ నుంచి తీసుకునే అవకాశం ఉంది. ఇక మిగిలిన ప్రత్యామ్నాయం దిగువ గోదావరి నుంచి నీటిని ఒడిసిపట్టుకోవడం. ఎక్కడికక్కడ నీటిని ఎత్తిపోసుకోవడం. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తయింది. కానీ దాని నుంచి నీటిని ఉపయోగించుకోవడానికి వీలైన ఎత్తిపోతలు, కాలువల యంత్రాంగం పూర్తి కాలేదు. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తయి ఉంటే కాకతీయ కాలువకు, వరదకాలువకు, మానేరుకు నీరు ఇచ్చి ఉండవచ్చు. కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాలకు నీరిచ్చేందుకు మరో ప్రత్యామ్నాయం చేతికి వచ్చి ఉండేది. రేపు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, తుపాకుల గూడెం, దుమ్ముగూడెం ఎక్కడ వీలైతే అక్కడ నీటిని ఎత్తిపోసుకునే ఏర్పాటు చేసుకోవాలి. నీటిని ఎత్తిపోసుకుని అప్పటికప్పుడు పొలాలు పారించుకోవచ్చని ఒక కాంగ్రెస్ మేధావి, ఒక కాలం చెల్లిన ఇంజినీరు చెబుతుంటే నవ్వొస్తుంది. ప్రభుత్వంపై, టీఆర్ఎస్పై కోపతాపాలు ఉంటే తీర్చుకోవడానికి ప్రాజెక్టులను అడ్డంపెట్టుకోవడం తెలంగాణకు ప్రతిపక్షాలు చేస్తున్న మహాద్రోహం. భూనిర్వాసితులను రెచ్చగొట్టి, అయోమయం పాలు చేసి, కోర్టుల్లో వ్యాజ్యాలు నడిపించి, తెలంగాణ-లోని మెజారిటీ ప్రజానీకాని కి ద్రోహం చేస్తున్నారన్న విషయం వారు గుర్తించాలి. రిజర్వాయర్లు లేకుండా కాలువలు శుద్ధ దండుగ. రైతులు కూడా వివరించి చెబితే అర్థం చేసుకుంటున్నారు. మెజారిటీ రైతాంగం సహకరిస్తున్నది. కొన్ని పార్టీల నాయకులు, కొందరు మేధావులే అర్థం లేని అక్కసుతో రోజూ ఏదో ఒకటి అడ్డంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ విశాల ప్రయోజనాల దృష్టితో కాకుండా కేసీఆర్నో, తెలంగాణ ప్రభుత్వాన్నో ఇరకాటంలో పెట్టి సంబురాలు జరుపు-కొనే సంకుచితదృష్టితో ఆలోచిస్తున్నారు. అవితక్షణం వారికి అనందం కలిగించవచ్చు. కానీ దీర్ఘకాలికంగా ఏ విధంగానూ ఉపయోగపడవు.
kattashekar@gmail.com

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad