నగరం ఓ పద్మవ్యూహం: ఛేదించడమెలా?


రోడ్లు సరిపోను ఉంటే కదా ఎవరయినా నియంత్రించగలిగేది? రోడ్లు విస్తరిస్తున్నాం. విస్తరించే లోపే రోడ్డుపైకి వచ్చే కొత్త వాహనాల సంఖ్య అసాధారణంగా పెరిగిపోతున్నది. ప్రధాన రోడ్లన్నీ ఇక విస్తరించడానికి వీలులేని పరిస్థితికి చేరుకున్నాయి.ఇక ఇప్పుడు మిగిలిన పరిష్కారం రద్దీ రోడ్లపైకి వచ్చే ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించడం. ప్రత్యామ్నాయ మార్గాలున్న చోట ఆ పని చేస్తున్నారు. కొన్నిచోట్ల నత్తనడక నడుస్తున్నాయి. కొన్నిచోట్ల కొత్తగా ప్రత్యామ్నాయ మార్గాలు నిర్మించాల్సి ఉన్నది.


హైదరాబాద్‌లో ఇవ్వాళ ఎవరయినా ఎక్కువగా మాట్లాడుకునే అంశం, ప్రభుత్వాన్నో, జీహెచ్‌ఎంసీనో, పోలీసులనో తిట్టుకునే అంశం గుంతలుపడిన రోడ్లు, విపరీతమైన ట్రాఫిక్ జామ్‌లు, నీళ్లు మళ్లాడటం, పావుగంటలో వెళ్లగలిగిన చోటుకు కూడా గంటల సమయం పట్టడం వంటి సమస్యలే. ఈ సమస్యలన్నీ ఇప్పటికిప్పుడు సంక్రమించినవి కాదు. ఐదారు దశాబ్దాల ప్రణాళికారాహిత్యం, అడ్డగోలు అభివృద్ధి ఫలితం. కానీ ఈ సమస్య రోజురోజుకు పెరుగుతున్నది. జనం, వాహనాలు పెరగడం ఒకవైపు, నాసిరకం రోడ్ల నిర్మాణం మరోవైపు, అనేకచోట్ల వివాదాల వల్ల విస్తరించలేకపోయిన ఇరుకురోడ్లు(బాటిల్‌నెక్స్) ఇంకోవైపు ఈ సమస్యలను జటిలం చేస్తున్నాయి. ఇవి పరిష్కరించలేని సమస్యలు కాదు. మానవసాధ్యం కానిదంటూ ఏదీ లేదు. కావలసింది ఒక్కటే – సంకల్పం. నాయకులు, అధికారుల సమిష్టి కృషి. మొదటిసారిగా మన రాష్ర్టానికి కాస్మోపాలిటన్ నగరం అంటే ఏమిటో నిర్వచనం తెలిసిన యువనాయకుడు నగరపాలన మంత్రి అయ్యారు. ఆయన మాటలు ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. కానీ చేయాల్సింది చాలా ఉన్నది. చేయవలసిన యంత్రాంగం తరతరాలుగా పాతుకుపోయి ఉన్నది. ఎంత గొప్ప ప్రణాళిక ఉన్నా, ఎంత మంచి ఆలోచనలున్నా అవి ఆచరణలో పెట్టాల్సిన యంత్రాంగం అధికారుల చేతుల్లోనే ఉన్నది. అధికారులు తలుచుకుంటే పనులు సాఫీగా వేగంగా పూర్తి చేయగలరు. పనులు ఆపదల్చుకుంటే అవతలివాడు కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకునేదాకా, లేదంటే సంబంధిత వర్గాలు వీధి పోరాటాలకు దిగేదాకా సాగదీయగలరు. నగరజీవనం ఒక పద్మవ్యూహంగా భావిస్తున్నవారున్నారు. నిజానికి సకల సౌకర్యాలు అందుబాటులో ఉండే నగర జీవితం సుఖమయం కావాలి. కానీ సగటు మనిషి రోజూ తిట్టుకుంటూ బతుకుతున్నాడు. బెంజికారున్నవారు కూడా తిట్టుకుంటూనే జీవనం సాగిస్తున్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ చిత్రపటంపై పెట్టిన అని పదేపదే డబ్బాకొట్టుకునే వారిని, ఇవ్వాళ హైటెక్ సిటీ జంక్షన్‌లో కాసేపు నిలబెడితే పరిస్థితి తెలిసి వస్తుంది. సైబర్ టవర్స్ ప్రహారీ గోడను అనేకసార్లు వెనుకకు జరిపి కట్టుకోవలసిన పరిస్థితి. రెండు మూడేండ్లకు ఒకసారి రోడ్ల విస్తరణ చేసుకోవడం తప్ప, ఇరవయ్యేండ్లకో, ముప్పయ్యేండ్లకో ప్రణాళికలు రూపొందించుకోవడం అన్న ది గత ప్రభుత్వాలకు తెలియని విషయం. ఇవ్వాళ నగరం ముందున్న ప్రధాన ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవడానికి సరైన నాయకత్వం ఉన్నది. ఈ నగరానికి ఉన్న ప్రధానమైన సమస్య ఇప్పుడు ట్రాఫిక్ సమస్యే. విద్యుత్ కొరత లేదు. తాగునీటి సమస్య కూడా కొలిక్కి వచ్చింది. ఇతరత్రా వ్యవస్థలన్నీ దారిలో పడుతున్నాయి. పోలీసులు కూడా కొన్ని కూడళ్లను మూసేసి, వాహనాలను అటు మలిపి ఇటు మలిపి వీలైనంత వరకు ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ కాస్త వర్షం వస్తేనే మొత్తం అతలాకుతలం అవుతున్నది. 

నగర జీవితం ఆగమవుతున్నది. హైదరాబాద్‌ను ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కించడానికి ఇప్పుడు ప్రధానంగా పట్టించుకోవలసింది రోడ్లు, ట్రాఫిక్ ఈజ్ గురించే. రోడ్లు సరిపోను ఉంటే కదా ఎవరయినా నియంత్రించగలిగేది? రోడ్లు విస్తరిస్తు న్నాం. విస్తరించే లోపే రోడ్డుపైకి వచ్చే కొత్త వాహనాల సంఖ్య అసాధారణంగా పెరిగిపోతున్నది. ప్రధాన రోడ్లన్నీ ఇక విస్తరించడానికి వీలులేని పరిస్థితికి చేరుకున్నాయి. ఇక ఇప్పుడు మిగిలిన పరిష్కారం రద్దీ రోడ్లపైకి వచ్చే ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించడం. ప్రత్యామ్నాయ మార్గాలున్న చోట ఆ పని చేస్తున్నారు. కొన్నిచోట్ల నత్తనడక నడుస్తున్నాయి. కొన్నిచోట్ల కొత్తగా ప్రత్యామ్నాయ మార్గాలు నిర్మించాల్సి ఉన్నది. ఉదాహరణకు అమీర్‌పేట నుంచి సికింద్రాబాద్ రోడ్డు. సికింద్రాబాద్ వెళ్లాలంటే ఒక్కటే దారి. ప్రత్యామ్నాయ మార్గం లేదు. ఎంత ట్రాఫిక్ ఉన్నా కుంటుతూ కునుకుతూ పోవలసిందే. ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోడ్డు ద్వారా వెళ్లవచ్చు. కానీ అక్కడ రాష్ట్రపతి రోడ్డును దాటడం కూడా కష్టమే. సికింద్రాబాద్‌కు చేరేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమి నిర్మించగలమో ఆలోచించాలి. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం నుంచి బేగంపేట ైఫ్లెఓవర్ వరకు నిర్మించిన రోడ్డు ద్వారా ైఫ్లె ఓవర్ కింది నుంచి పోస్టాఫీసు పక్క నుంచి రైల్వే ట్రాక్ దాకా వెళ్లేందుకు దారి ఉంది. అక్కడ నాలాపై ఒక వంతెనవేసి మినిస్టర్ రోడ్డు దాకా మార్గం వేయడానికి అవకాశం ఉంది. మినిస్టర్ రోడ్డు నుంచి ప్యారడైజ్‌కు వెళ్లే అవకాశం ఉన్నది. అలాగే పంజాగుట్ట నుంచి హైటెక్ సిటీదాకా బంజారా హిల్స్ రోడ్డు నంబర్ 2, జూబ్లీ హిల్స్ 36లకు ప్రత్యామ్నాయంగా ఎర్రగడ్డ నుంచి బోరబండ, అల్లాపూర్ రోడ్డును కూకట్‌పల్లి హైటెక్‌సిటీ రోడ్డుకు కలిపి ట్రాఫిక్ మళ్లించవచ్చు. కూకట్‌పల్లి- లింగంపల్లి రోడ్డుకు ప్రత్యామ్నాయంగా మూసాపేట నుంచి చందానగర్ దాకా రోడ్డు ప్రతిపాదించారు. కొంతపూర్తి చేశారు. చాలా పనులు పెండింగులో పెట్టారు. ట్రాఫిక్ అంతంతమాత్రంగా వెళుతోంది. ఇలా నగరంలో ప్రతి రద్దీరోడ్డుకు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించి కనీసం చిన్నవాహనాలనయినా సాఫీగా వెళ్లిపోయేట్టుగా చేయాల్సి ఉన్నది. మూసీకి ఇరువైపుల రోడ్లు వేసి వాటిని ఇన్నర్, ఔటర్ రింగు రోడ్డులకు అనుసంధానం చేయడం కూడా ఒక ప్రత్యామ్నాయం. 

మరో ముఖ్యమైన అంశం రోడ్లు వేసే విధానం. అమెరికా, యూరప్‌లలోని రోడ్ల ను చూసి మన రోడ్లను చూస్తే విస్మయం కలుగుతుంది. నార్వే రాజధాని ఓస్లోలో అడిగాను ఇక్కడ ఎంతకాలానికి ఒకసారి రోడ్డు వేస్తారని. మేము చూడగా ఎప్పుడూ వేయలేదు. ఎప్పుడు వేస్తారో తెలియదు. మాకైతే రోడ్లపై ఎప్పుడూ ఇబ్బంది కలుగలేదు అని అక్కడ పనిచేస్తున్న పౌరుడొకరు చెప్పారు. పారిస్‌లో కూడా రోడ్లపై గుంతలు చూసిన దాఖలా లేదు. దుబాయ్, బ్యాంకాక్..రోడ్లు రన్‌వేల మాదిరిగా ఉంటాయి. మరి మనదగ్గరో. ఇలా వేసి వెళతారు. అలా లేచిపోతుంది. ఇక్కడ రోడ్లు కాంట్రాక్టర్ల కోసం ఉన్నట్టుగా ఉంది కానీ ప్రజల కోసం ఉన్నట్టుగా అనిపించదు. కాంట్రాక్టరుకు బాధ్యత లేదు. కాలపరిమితి లేదు. మెయింటెనెన్సు లేదు. రోడ్డుకు గ్యారెంటీ లేదు. ఇప్పుడున్న కాంట్రాక్టు విధానంలో గయన్నీ యాడ కుదురుతయ్ అని మొన్న ఓ కాంట్రాక్టర్ నిస్సంకోచంగా చెప్పారు. రోడ్డు కాంట్రాక్టు అంటే పిట్టకింతబెల్లం నాకింత బెల్లం అన్నట్టుగా పంచుకోవడమే అవుతున్నది. పంచుకోగా మిగిలింది రోడ్డు వేయడానికి ఖర్చు పెడుతున్నారు. అందుకే నాసిరకం రోడ్లు వస్తున్నాయి. జనం ఇక్కట్లు పడుతున్నారు. వాహనాలు ధ్వంసం అవుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎవరూ ఎవరికీ బాధ్యులు కారు అనే ధోరణి జనానికి విసుగుపుట్టిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఈ ధోరణికి అడ్డుకట్ట వేసే ప్రయత్నంలోనే వైట్ టాప్ రోడ్లను ప్రయోగాత్మకంగా వేసి చూసింది. సిమెంటు ఉత్పత్తిదారులు ముందుకు వచ్చి బంజారాహిల్స్ సిటీ సెంటర్ నుంచి జహీరానగర్ వరకు రోడ్డు వేశారు. ఆ రోడ్డు వేసి ఏడాది అవుతున్నది. ఇప్పటివరకు చిన్న గుంతపడింది లేదు. నీరు నిలిచింది లేదు. ఆ రోడ్డుపై ఎక్కడయినా వాహనం ఆపాలంటే కూడా వాహనదారులకు సిగ్గనిపిస్తుంది. ఆ రోడ్డు అంత బాగా ఉంది మరి. ఇరవైయ్యేళ్లు ఆ రోడ్డు చెక్కు చెదరదని సిమెంటు ఉత్పత్తిదారులు చెబుతున్నారు. ప్రభుత్వం అందుకే ఇటీవల నగరంలో మూడు వేల కిలోమీటర్ల రోడ్డును వైట్ టాపింగ్ చేయించే విషయమై సంప్రదింపులు జరుపుతున్నది. ైఫ్లె ఓవర్లు నిర్మించడంలో కూడా మనం ఇప్పటికీ బండపద్ధతులే అనుసరిస్తున్నాం. బండ దిమ్మలతోనే పైరోడ్లు వేస్తున్నాం. ఆధునికతను అందిపుచ్చుకోవడం లేదు. ఒక రిజర్వాయరులో తట్టెడు మట్టిపోయకుండా, పక్కనే ఉన్న కొండను పగులగొట్టకుండా సన్నని పిల్లర్ల మీద ఒక జాతీయ రహదారిని నిర్మించారంటే నమ్మగలమా? నగరంలో చాలాచోట్ల ఇటువంటి వంతెనలు నిర్మించవచ్చు. 

అయితే ఇందులో అనేక సమస్యలున్నాయి. రోడ్ల నిండ డ్రైనేజీ లైన్లు, కేబుల్స్ ఎక్కడ ఏది ఉందో తెలియదు. వరదనీరు, డ్రైనేజీ నీటికి ఒకటే కాలువ. రోడ్డుపైన కరెంటు తీగలు, కేబుల్ టీవీల తీగలు, ఇంటర్‌నెట్ తీగలు గందరగోళంగా అల్లుకుపోయి ఉంటాయి. వీటన్నింటినీ సింక్రనైజ్ చేసి ఒక పరిష్కారం కనుక్కోవలసి ఉం ది. ఈ వ్యవస్థలన్నింటినీ ఒక క్రమపద్ధతిలో డక్టులు, డ్రైనేజీ, వరద కాలువలు అన్నీ భూగర్భంలో నిర్మించి పైన శాశ్వత ప్రాతిపదిక రోడ్లు నిర్మించాల్సి ఉన్నది. ఆచరణ లో ఇదంతా సాధ్యమవుతుందా? ఇన్ని వ్యవస్థలను ఏకీకరించేది ఎవరు? ఎలా? అన్న సమస్యలు నగరపాలన యంత్రాంగాన్ని వెంటాడుతున్నాయి. ముందే అనుకున్నట్టు సంకల్పం ఉంటే కానిది ఏదీ లేదు. ఆధునిక నగరాలన్నీ ఎవరో ఒకరు పూనుకుని నడుంబిగిస్తేనే దారికి వచ్చాయి. ముఖ్యంగా అధికార యంత్రాంగం సహకరించడం సహకరించకపోవడం చాలా తేడా తీసుకువస్తుంది. ఒక అధికారి ఉన్నా రు. రోడ్డుపై ఒక ప్రార్థనా మందిరం తొలగించి, పక్కనే ప్రతిష్ఠించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. అందరూ భయపడుతున్నారు. ఆ అధికారి ముందుకు వచ్చారు. అన్ని వ్యవస్థల సహకారమూ తీసుకున్నారు. పోలీసులు, రోడ్డు వేసేవారు మొదలు తాపీ మేస్త్రీ వరకు అందరూ అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత పని మొదలుపెట్టారు. తెల్లవారు జామున ఐదు గంటలకు పని పూర్తయింది. ప్రార్థనా మందిరం రోడ్డు పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలోకి మారింది. రోడ్డు క్లియర్ అయింది. అక్కడ ప్రార్థనా మందిరం ఉన్నట్టు, తొలగించినట్టు ఆనవాళ్లు లేకుండా తారురోడ్డు వేసి ఉంది. ఉదయం పూట చూసిన కొందరు భక్తులు ముందుగా ఆవేశపడ్డారు. తర్వాత పక్కనే ఇంకా మెరుగైన స్థలంలో మందిరాన్ని చూసి సంతోషపడ్డారు. మరో అధికారి ఉన్నారు. మా భూమిలోంచి రోడ్డు పోవద్దని ఒక రైతు వచ్చాడు. నోటిఫికేషన్ ఇచ్చాము ఇప్పుడేమీ చేయలేము అని ఆ అధికారి చెప్పాడు. ఎట్లయినా చేసి రోడ్డు ఆపాలి మీరే మార్గం చెప్పండి అని నాలుగు డబ్బులు చేతిలో పెట్టారు. కోర్టుకెళ్లు అప్పటిదాకా పని జరుగకుండా నేను చూస్తా అని చెప్పాడా అధికారి. వేరే పొలం నుంచి వెళ్లాల్సిన రోడ్డును నా పొలంలోకి తిప్పారని కేసు వేయండి అని ఒక సలహాకూడా పారేశాడు.ఆ కేసు వేసి స్టే తెచ్చుకున్నాడు రైతు. ఇప్పటికి దశాబ్దం గడుస్తున్నది. స్టే వేకేషన్ కోసం ప్రభుత్వం నుంచి అప్పీలు వేసినవారు లేరు. ఆ రైతు మాత్రం సదరు అధికారికి వీలైనప్పుడల్లా దావతులు, దక్షిణలు అందిస్తూ పోతున్నా డు. ఎవరు బాగుపడ్డారు? రైతూ బాగుపడి ఉండడు. అధికారి బాగుపడి ఉంటా డు. ఆ రోడ్డు కోరుకున్న వందలాది మంది ప్రజలు నష్టపోతారు. మనకు కావలసిన అధికారులెవరో అర్థమయిందనుకుంటాను. హైదరాబాద్‌లో ఈ పద్మవ్యూహాన్ని ఛేదించాలంటే మెరికల్లాంటి, మెరుపుల్లాంటి అధికారులు కావాలి. ఒక్క కమిషనర్ మంచివారయితే, సమర్థుడయితే ప్రయోజనం లేదు. క్షేత్రంలో పనిచేసే అధికారులే ముఖ్యం. వాళ్లు నిజాయితీపరులూ, మంచి వాళ్లూ కావాలి. ప్రజాప్రయోజనమే పరమావధిగా భావించేవారు కావాలి.
-kattashekar@gmail.com

Author: kattashekar

Former Editor, Namasthe Telangana Daily