రిజర్వాయర్లే ఎందుకు?


భౌగోళిక శాస్త్రవేత్తలు భూ ఆవరణ లక్షణాలను నాలుగు రకాలుగా విభజించా రు. పర్వతప్రాంతాలు, మైదానాలు, పీఠభూములు, కొండ ప్రాంతాలు. పర్వతాలు, కొండ ప్రాంతాల్లో జలాశయాలు సహజసిద్ధంగా ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో కొండల మధ్య నిర్మించుకునే అవకాశమూ ఉంటుంది. మైదాన ప్రాంతాల్లో ఎక్కడా జలాశయాలు పెద్దగా ఉండవు. గోదావరి, కృష్ణా డెల్టాలో కూడా ఎక్కడా వ్యవసాయానికి నీరందించడం కోసం జలాశయాలు కనిపించవు. తాగునీరు అందించడంకోసం ప్రతి ఊర్లో ఒక మంచినీటి చెరువు ఉంటుంది. దానిని భద్రంగా కాపాడుకుంటారు. హర్యానాలోనూ అంతే ఎక్కడా సాగునీటి చెరువులు కనిపించవు. ప్రతి ఊరి కీ ఒక మంచి నీటి చెరువు ఉంటుంది. సాగునీరంతా కాలువల ద్వారానే సాగుతుం ది. మైదానాల్లో నీరు బలబలా జారిపోదు. హర్యానా హిమాలయాల సానువుల్లో మొదలై ఢిల్లీదాకా ఉంటుంది. అంతా ఒక్క తీరుగా ఉంటుంది. కొండప్రాంతాలు, ఎత్తుపల్లాలు చాలా తక్కువ. హిమాలయాల సానువుల్లో హర్యానా భూమి ఎత్తు సముద్ర మట్టం నుంచి 1100 అడుగులు కాగా, కురుక్షేత్రలో 834 అడుగులు, ఢిల్లీ సమీపంలోని గుర్గాంలో 700 అడుగులు. అంటే ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చేసరికి హర్యానా వాలిపోయింది 400 అడుగులు. అక్కడా రాజులు, రాజ్యాలు ఉన్నాయి. కానీ ఏ ఒక్క రాజూ సాగునీటి కోసం చెరువులు తవ్వించిన దాఖలాలు లేవు. గోదావరి, కృష్ణా డెల్టాలో కూడా రాజులు, రాజ్యాలు నడిచాయి. అక్కడా సాగునీటి చెరువులు ఎక్కడా కనిపించవు. ఈ చెరువుల సమస్యంతా పీఠభూముల్లోనే ఉంది. వందల ఏళ్ల క్రితం నుంచి ఈ ప్రాంతాలను పరిపాలించినవారు పెద్ద పెద్ద చెరువులు నిర్మించడం ఒక యజ్ఞంగా నిర్వహించారు. చాళుక్యులు, ఇక్షాకులు, కాకతీయులు, ఏరువ, రాచకొండ రాజులు, శ్రీకృష్ణ దేవరాయలు అందరూ చెరువులు నిర్మించడానికి ఎందుకంత శ్రద్ధ కనబరిచారో అర్థం చేసుకోవలసి ఉంది. రాయలసీమలో అనేక చెరువులకు ముందుగా రాజుల పేర్లో వారి వంశ ప్రముఖుల పేర్లో చేర్చి బుక్క సముద్రం, తిమ్మసముద్రం, రామసముద్రం, రాయసముద్రం వంటి అనేక చెరువులు ఉంటాయి. కంభం చెరువు కూడా అటువంటిదే. తెలంగాణలో పాకాల, రామ ప్ప, గణపవరం, ఉదయసముద్రం చెరువులు అలా ఏర్పడినవే. వారు ఎందుకు ఇలా చెరువులపై దృష్టిని కేంద్రీకరించవలసివచ్చిందో చరిత్రకారులు కూడా తమ గ్రంథాల్లో నమోదు చేశారు. 
పీఠభూమి స్వభావం వల్ల నీరు నిల్వదని, భూమి ఒకవైపు వాలిపోవడం వల్ల నీరు జారిపోతుందని, తొందరగా ఆవిరయిపోతుందని, నేల తొందరగా పొడిబారుతుందని, వర్షాలు లేని కాలంలో నీటిని సాగు, తాగు అవసరాలకు వాడుకోవడానికి వీలుగా చెరువులు అవసరమయ్యాయని, అందుకే రాజులు చెరువులపై దృష్టిని కేంద్రీకరించారని చరిత్రకారుడు జేడీబీ గ్రిబల్ తన ద హిస్టరీ ఆఫ్ దక్కన్ పుస్తకంలో పేర్కొన్నారు. దక్కను అంతటా ఈ చెరువులు ఎక్కువగా ఉండడానికి ఇదే కారణమని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి అప్పటి రాజులు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. మొదటి నుంచి ప్రతి నాలుగేళ్లకు ఒక సంవత్సరం కరువు రావడం చూస్తున్నామని, ప్రకృతి సమతౌల్యం దెబ్బతినడం వల్ల ఇప్పుడు ప్రతి ఐదేళ్లకు రెండేళ్లు కరువు రావడం మొదలయిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో ఏటా వరుసగా కరువుబారిన పడుతున్న మండలాల జాబితా ప్రభుత్వం వద్ద ఉంది. ఎవరయినా తెప్పించి చూస్తే అర్థమవుతుంది. అటువంటి మండలాలు తెలంగాణలో సగానికిపైగా ఉంటున్నాయి. వార్షిక వర్షపా తం సగటు తక్కువగా ఉండటం వల్ల అవి కరువు ప్రాంతాలవుతున్నాయి. అతి కష్టంమీద ఒక పంట తీయ గలుగుతారు. అటువంటి ప్రాంతాలకు భగీరథ ప్రయత్నం చేసి నీరు మళ్లిస్తే తప్ప తిరిగి కోలుకోలేవు. అక్కడి ప్రజల జీవితాలు బాగుపడవు. పీఠభూమి భౌగోళిక లక్షణాలను ఆ కాలపు నాయకత్వం అర్థం చేసుకున్నంతగా, మన ప్రతిపక్ష నాయకులు అర్థం చేసుకోలేదని భావించవలసి వస్తున్నది. పీఠభూమి పేరే పీఠం నుంచి వచ్చింది. కొంత సమతలంగా, కొంత బోలుగా ఉండి ఒకవైపు వాలిపోయి ఉంటుంది. పీఠంపైన గానీ, బోలుతలంపైన గానీ నీరు నిలబడదు. జారిపోతుంది. తెలంగాణను భౌగోళికంగా అర్థం చేసుకోకపోతే ఎడ్డెమంటే తెడ్డెమనే వాదనలు జీవితాంతం ఇలాగే కొనసాగుతాయి. తెలంగాణ పశ్చిమ సరిహద్దుల్లో వికారాబాద్ కొండలు సముద్ర మట్టానికి 2304 అడుగుల ఎత్తున ఉంటే ఆంధ్రలో ప్రవేశించే నల్లబండగూడెం వద్ద పాలేరు నదిపై నిర్మించిన జాతీయ రహదారి బ్రిడ్జి సముద్ర మట్టానికి 251 అడుగుల ఎత్తున ఉంది. కృష్ణమ్మ రాష్ట్రంలో ప్రవేశించిన చోట కర్ణాటక సరిహద్దు సముద్ర మట్టానికి 1063 అడుగుల ఎతు ్తకాగా శ్రీశైలం డ్యాం సుమారు 910 అడుగులు, నాగార్జునసాగర్ వద్ద 610 అడుగులు. ఆదిలాబాద్‌లో నాగపూర్ జాతీయ రహదారి బ్రడ్జి 780 ఎత్తున ఉండగా, మహబూబునగర్ నుంచి కర్నూలులో ప్రవేశించే జాతీయ రహదారి బ్రిడ్జి 900 అడుగుల ఎత్తున ఉంది. గోదావరి తెలంగాణలో ప్రవేశించే కందకుర్తి వద్ద సముద్ర మట్టం నుంచి ఎత్తు 1097 అడుగులు కాగా, కాళేశ్వరం వద్ద కన్నెపతల్లి బ్రిడ్జి ఎత్తు 335 అడుగులు. ఖమ్మంలో భద్రాచలం వద్ద 120 అడుగులు. అంటే తెలంగాణ పశ్చిమం నుంచి తూర్పు దిక్కుగా కొన్ని చోట్ల వెయ్యి అడుగులు మరికొన్ని చోట్ల రెండు వేల అడుగులు పూర్తిగా వాలిపోయి ఉంటుంది. పీఠభూముల స్వభావం అది. వరద కూడా నిలబడి ప్రవహించదు. ఉధృతంగా సాగిపోతుంది. నీరు భూమిలోకి ఇంకదు. అందుకే మనకు జలాశయాలు నిర్మించుకోవడం తప్పనిసరి. కాలం అయినప్పుడు, వరద వచ్చినప్పుడు పట్టి పెట్టుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదు.

తెలంగాణలో నదులపై, ఉపనదులపై రిజర్వాయర్ల నిర్మాణం ఎప్పుడో చేయవలసింది. చేయలేదు. కుట్రపూరితమైన నిర్లక్ష్యం వల్ల తెలంగాణ నీళ్లకు నోచుకోలేదు. గోదావరిపై శ్రీరాంసాగర్‌ను 120 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని ముందుగా తలపెట్టారు. సమైక్యాంధ్రలో అది 90 టీఎంసీలకు తగ్గిపోయింది. పూడిక చేరి నీటి నిల్వ సామర్థ్యం ఇంకా తగ్గిపోయింది. ఎంత విడ్డూరమంటే శ్రీరాంసాగర్ నుంచి 380 కిలోమీటర్ల పొడవు నీళ్లు పారించాల్సిన కాకతీయ కాలువ నీటి విడుదల సామర్థ్యం అతికష్టం మీద 9000 క్యూసెక్కులు. సమైక్యపాలనలో అయితే అది 7000 క్యూసెక్కులు కూడా ఉండేది కాదు. కాలువల సామర్థ్యం ఎక్కువగా ఉంటే బాగా వరద ఉన్నప్పుడు వేగంగా కాలువలో చివరి భూముల దాకా నీరు తీసుకునే అవకాశం ఉండేది. కానీ అశ్వత్థామ హతః కుంజరః అన్నట్టు ప్రాజెక్టులు కట్టారు. కాలువల గొంతు పిసికారు. కాకతీయ కాలువలో వరంగల్లుకు నీరు రావడానికి నెల లు, ఇప్పుడు సంవత్సరాలు ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇచ్చంపల్లి ప్రాజెక్టు బహుళార్ధకసాధక ప్రాజెక్టుగా నిర్మించాల్సి ఉండె. నాలుగు రాష్ర్టాలూ సూత్రప్రాయంగా ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకారం తెలిపాయి. ఎత్తువిషయంలో చర్చలు జరగాల్సి ఉండె. ఆ ప్రాజెక్టు నిర్మించతలపెట్టిన నాడు గోదావరి వెంట ఇన్ని గ్రామాలు లేవు. అప్పుడు నిర్మించలేదు. ఇప్పుడు నిర్మించాలంటే నిర్వాసితుల సమస్య. అప్పుడు సమైక్యవాదులు కుట్ర చేశారు. ఇప్పుడు ప్రతిపక్షనాయకులు నిర్వాసితుల పేరుతో ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇటువైపు జూరాల విషయంలోనూ అదే జరిగింది. జూరాల కాలువలు చూడండి. 400 క్యూసెక్కులు, 600 క్యూసెక్కులు. పది హెచ్‌పీ మోటార్లు నాలుగైదు పెడితే ఆ మాత్రం నీరు పారించవచ్చు. కాలువ లు అవసరం లేదు. ఈ కాలువల నీళ్లు కాలువ చివరి భూములకు చేరాలంటే ఎన్ని రోజులు పడుతుంది? జూరాల వద్ద ఏ సంవత్సరమయినా 18 టీఎంసీల నీరు ఉపయోగించుకోగలుగుతున్నామా? ఇక్కడా అంతే తెలంగాణకు ప్రాజెక్టు కట్టినట్టు పోజు. కాలువల గొంతుమాత్రం నులిమారు. నాగార్జునసాగర్ పరిస్థితి కూడా అలాగే చేశారు. ఏడు కిలోమీటర్ల ఎగువన పెద్దగట్టుకు బంజారా గట్టుకు మధ్య నిర్మించాల్సిన ప్రాజెక్టును సమైక్య ప్రాజెక్టు పేరిట కిందికి తీసుకుపోయారు. కృష్ణాకు కుడివైపున పెద్ద గట్టుకు, ఎడమవైపున నంబాపురం గట్టుకు మధ్య నందికొండ ప్రాజెక్టును నిర్మించి ఉంటే నల్లగొండ పట్టణానికి పై నుంచి గ్రావిటీ ద్వారా నీరు వచ్చి ఉండేది. పెద్ద గట్టు ఎత్తు 830 అడుగులు కాగా, నంబాపురం గట్టు ఎత్తు 730. నల్లగొండ పట్టణం వద్ద ఇప్పుడు ప్రవహించే ఏఎంఆర్ కాలువ ఎత్తు సముద్ర మట్టం నుంచి 740 అడుగులు. సముద్ర మట్టం నుంచి సూర్యాపేట ఎత్తు 577 అడుగులు మాత్రమే. కానీ ప్రాజెక్టును ఆరేడు కిలోమీటర్లు కిందికి దింపి 600 అడుగుల ఎత్తున నిర్మించారు. తెలంగాణ గొంతుకోశారు. రెండు కాలువల కింద సమానంగా సాగుచేసుకోవచ్చని చెప్పిన పెద్ద మనుషులు తెలంగాణలో ఆరులక్షల ఎకరాలకు మాత్రం నీరిచ్చి, కాలువను మళ్లీ ఆంధ్రకు మళ్లించారు. శ్రీశైలం ఎడమ కాలువది మరీ మోసం. 1983లో శ్రీశైలంలో అటు ఎస్‌ఆర్‌బీసీ, ఇటు ఎస్‌ఎల్‌బీసీ నిర్మించాలని ఒక్కసారే నిర్ణయం జరిగింది. ఎస్‌ఆర్‌బీసీ 15000 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ పూర్తి చేసి రెండు దశాబ్దాలయింది. ఆ తర్వాత ఎస్సార్‌బీసీకి నీరిచ్చే పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని మళ్లీ మరో 45 వేల క్యూసెక్కులకు పెంచి కూడా దశాబ్దం దాటింది. కేవలం 4000 క్యూసెక్కుల సామర్థ్యంతో తలపెట్టిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెలు మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియదు.

తెలంగాణను ఇన్నేళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీ నాయకులకు ఒక్కరికయినా నీళ్ల సోయి ఉందా? సాగునీళ్లు లేకపోవడం వల్లే తెలంగాణ ఇలా ఎండిపోయిందని, సాగునీరు ఉండటం వల్లనే ఆంధ్ర అలా డెల్టా అయిందని గుర్తించారా? వీళ్లకు నీళ్లి చ్చి పొలాలు పారిస్తే మన మాట వింటారా అని భూస్వామ్య తర్కం వినిపించిన నాయకులు కాంగ్రెస్, టీడీపీలలో ఉన్నారు. అటువంటివారి నుంచి ఇంకేమి ఆశించగలం? నీటి విలువ తెలిసిన వారికి, తెలియని వారికి ఉండే తేడా ఇప్పుడు స్పష్టంగా చూస్తున్నాం. తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన నాయకులు, మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇవ్వాళ ప్రాజెక్టుల దగ్గర నిద్రలు చేస్తున్నారు. ఇంజినీర్ల దగ్గర కూర్చుని తొందరగా నీళ్లు తీసుకోవడానికి గల అవకాశాలను వారం వారం సమీక్షిస్తున్నారు. ఎవరి జిల్లాలో వారు వెంటపడి పనులు చేయించుకుంటున్నారు. నిధులు అవసరమయితే వెంటనే ముఖ్యమంత్రితో మాట్లాడి ఇప్పించుకుంటున్నారు. ఇప్పుడు జూరాలకు నీరు రావడం పండుగలా జరుపుకుంటున్నారు. గతం లో జూరాల పూర్తిగా నిండకుండానే గేట్లు ఎత్తేసిన సందర్భాలు అనేకం. ఇప్పుడు ఆచితూచి నిర్ణయాలు చేసే అధికారం తెలంగాణ చేతికి వచ్చింది. కాంగ్రెస్ నాయకులు ఎప్పుడయినా ప్రాజెక్టుల మొఖాన చూశారా. మనిషి మనుగడకు మొత్తం నీరే ఆధారమని ఎప్పుడయినా మాట్లాడుకున్నారా? ఇప్పటికయినా రాజకీయ నాయకత్వం, మేధావులు తెలంగాణ అవసరాలను తెలుసుకుని మసులుకుంటే భవిష్యత్తు తరాలకు మంచిది. రాజకీయాలకోసం, వాదాలకోసం ప్రాజెక్టులను, రిజర్వాయర్లను అదేపనిగా వ్యతిరేకిస్తూ తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతిబంధకంగా మారడం ఎవరికీ మంచిది కాదు. ప్రారంభించిన ప్రాజెక్టులకు అడ్డుపడటం, ప్రారంభించనివాటికోసం ఊరేగింపులు చేయడం రాజకీయ అజ్జకారితనం అవుతుంది తప్ప, నిర్మాణాత్మక పాత్ర అనిపించుకోదు. 

Author: kattashekar

Former Editor, Namasthe Telangana Daily

One thought on “రిజర్వాయర్లే ఎందుకు?”

Comments are closed.