అసలు మీకు కావలసిందేమిటి?


palamuru

అప్పుడలా ఇప్పుడిలా…ఏమిటీ గోల

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జూరాల జలాశయం నుంచి ఎత్తిపోసి కొడంగల్, రంగారెడ్డి జిల్లాదాకా నీరు తీసుకురావడానికి ప్రభుత్వం తొలుత ప్రయత్నించింది. డిజైన్ల రూపకల్పన కూడా జరిగింది. ఎక్కడెక్కడ రిజర్వాయర్లు నిర్మించాలో, ఎంత భూమిని సేకరించాలో నిర్ణయించారు. అయితే ప్రతిపక్షాలు ఈ ప్రాజెక్టుకు ఇంకా పని మొదలు కాక ముందే ఆందోళన మొదలు పెట్టాయి. రేవంత రెడ్డి, ఇతర టీడీపీ నాయకులు ముంపుగ్రామాల్లో ముందుగానే సభలు పెట్టి తమ శవాల మీదనే ప్రాజెక్టులు కట్టాల్సి ఉంటుందని శపథాలు చేశారు. జనాన్ని రెచ్చగొట్టారు. ఈ లోగా నీటి లభ్యతకు గల అవకాశాలపై పునస్సమీక్ష చేసి జూరాల కంటే శ్రీశైలం జలాశయం నుంచి ఎక్కువ రోజులు ఎక్కువ నీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని ఇంజనీరింగు నిపుణులు సూచన చేశారు. అది పరిశీలించిన తర్వాత ప్రభుత్వం కల్వకుర్తి సమీపం నుంచి రంగారెడ్డి దాకా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. పనులు మొదలు పెట్టారు. అప్పుడు జూరాల-రంగారెడ్డికి అడ్డం పడినవారు ఇప్పుడు అదే ప్రాజెక్టు కావాలని యాగీ చేస్తున్నారు.

మొదలు పెట్టిన వాటిని కట్ట నీయరు. అడ్డగోలు అవాంతరాలు కల్పిస్తారు. కొత్త డిమాండ్లను ముందుకు తెస్తారు. మల్లన్నసాగరం వద్దా ఇదే పరిస్థితి. పనికి అడ్డం పడడం తప్ప పనికి వచ్చే వాదన ఒక్కటీ ఉండదు. ఎప్పటివో కాలం చెల్లిన వాదనలు చేస్తారు. మోకాలికి బోడిగుండుకు ముడిపెడతారు. పోతిరెడ్డిపాడును సమర్థించిన హనుమంతరావు, రాయలసీమ ప్రాజెక్టులకు, వాటికింద నిర్మించిన రిజర్వాయర్లకు నీరందించాలంటే పోతిరెడ్డపాడు సామర్థ్యం నలభైనాలుగు వేల క్యూసెక్కులకు పెంచకతప్పదని చెప్పిన హనుమంతరావు, అందుకు పత్రాలు రూపొందించిన హనుమంతరావు తెలంగాణకు మాత్రం రిజర్వాయర్లు వద్దంటాడు. పెద్ద పెద్ద మేధావులు ఆయన తోకపట్టుకుని ఎప్పటివో డెబ్బైల నాటి హర్యానా నమూనా గురించి మనకు చెబుతారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లడడానికి ప్రాజెక్టులు తప్ప ఇంకేమీ దొరకడం లేదా? ఏమిటీ వీళ్ల బాధ? వీళ్లకు కావలసిందేమిటి? అరవయ్యేళ్లు తెలంగాణను దగా చేసిన ప్రభుత్వాల్లో ఇంతకాలం అంటకాగిన వారంతా ఇప్పుడు ఉద్ధారకుల్లా పోజు పెట్టడం, కొందరు మేధావులు సైతం వారి బాణీలను అందిపుచ్చుకోవడం విడ్డూరంగా ఉంది. ఇది తెలంగాణకు మేలు చేసే ధోరణి కాదు. కీడు చేసే ప్రయత్నం.

Author: kattashekar

Former Editor, Namasthe Telangana Daily