వనసంపదే జలసంపదకరువొస్తేగానీ నీటి విలువ తెలియడం లేదు. పెద్ద వాళ్లు చెబుతుంటే లెక్క చేయలేదు. గంజి కరువొచ్చింది. అప్పుడెప్పుడో జొన్నల కరువు వచ్చిందట. మరోసారి పంటలు పండక, తిండి లేక, రేగడి బురద తినవలసిన దుస్థితీ వచ్చిందని చెబుతారు పెద్దవాళ్లు. కొన్నేళ్లుగా నీళ్ల కరువూ తరచూ వస్తున్నది. గతంలో ప్రతి నాలుగేళ్లకు ఒకసారి కరువు వచ్చేదట. ఇప్పుడు ప్రతి నాలుగేళ్లకు రెండేళ్లు కరువు వస్తోంది. అయినా పరిస్థితి ఇలా ఎందుకు దిగజారుతున్నదో గుర్తించలేకపోతున్నాం. ఈ కరువు కాటకాలకు ఉమ్మడి బాధ్యత ఉందని మరచిపోయాం. ప్రభుత్వాన్నో, రాజకీయ వ్యవస్థనో తిట్టుకుంటున్నాం. అవకాశం వస్తే ఓట్ల దగ్గర ప్రతీకారం తీర్చుకుంటున్నాం. కానీ సమాజమంతా కలసి ఇవ్వాళ్టి పరిస్థితికి కారణమయ్యామని తెలివి తెచ్చుకోవడం లేదు. చెట్టు ఉంటే వాన. చెట్టు ఉంటే నీడ. చెట్టు ఉంటే గాలి. చెట్టు ఉంటేనే ప్రాణవాయువు. ఇండ్లు కట్టుకుంటాం. అందంగా అనేక అంతస్తులు కడతాం. చుట్టూ ప్రహారీ నిర్మిస్తాం. భవంతి అందరికీ కనిపించడం కోసం బయట ఒక్క చెట్టునూ బతకనివ్వం. చెట్టు ఉండటం మొరటుతనంగా భావించే దుస్థితికి చేరుకున్నాం. కానీ చెట్టు ప్రాణాధారం అన్న సంగతి మరచిపోతాం. ఇళ్లను ఇరుకుగా కట్టుకుని పార్కుల్లోకి వచ్చి వాకింగ్ చేస్తాం. 
ఆ మధ్య యూరపు పర్యటనకెళ్లినప్పుడు చూశాం. కొన్ని నగరాల్లో తప్ప మామూలు పట్టణాలు, గ్రామాల్లో ఒక్క ఇంటికీ ప్రహారీ గోడ లేదు. ప్రాంగణాల విభజన అంతా మొక్కలతోనే. గుబురు పొదలు లేదా పూల మొక్కలతోనే. ఎటు చూసినా ఇళ్లకు పచ్చని పూలమొక్కల హారాలు వేసినట్టు సరిహద్దులు ఉంటాయి. ప్రతి ప్లాటులో 30 నుంచి 40 శాతం స్థలం మాత్రమే నిర్మాణం ఉంటుంది. మిగిలిన స్థలమంతా పచ్చదనం కోసమే కేటాయించడం చూశాం. థాయిలాండ్‌లో తైలంగ్( క్రీస్తు శకం తొలి శతాబ్దాల్లో తెలంగాణ నుంచి బర్మా ద్వారా వెళ్లినవారని చెబుతారు) తెగవారు పాలించినట్టుగా చెబుతున్న లాంఫూన్ ప్రాంతానికి వెళ్లాం. అక్కడ వేల సంవత్సరాల నాటి చెట్లను దేవతల్లా పూజిస్తున్నారు. అవి ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టు పెరిగాయి. చియాంగ్మయి నుంచి లాంఫూన్ వెళ్లే దారి వెంట ముగ్గురు మనుషులు చేతులు చాచినా అందనంత పెద్ద చెట్లు ఇప్పటికీ ఉన్నాయి. వాటికి పసుపు పచ్చని గుడ్డలు కట్టి పూజలు చేయడం కనిపించింది. సుమారు ఐదారు కిలోమీటర్ల పొడవున ఈ చెట్ల బారు కనిపించింది. రోడ్లను విస్తరించవలసి వచ్చినా ఆ చెట్లను మాత్రం కదిలించబోరని గైడు చెప్పాడు. అక్కడ చాలా ఊర్లు, ఇండ్లు చెట్ల మధ్య నుంచి లీలగా కనిపిస్తాయి.

నీళ్లు-నిజాలు

-నిల్వ ఉన్న నీటిని టీఎంసీలలో, ప్రవహించే నీటిని క్యూసెక్కులలో లెక్కగడతారు.
-ఒక సెకనులో ప్రవహించే ఘనపుటడుగుల నీరు అంటే ఒక క్యూసెక్ అంటే 28.3 లీటర్లు. 

-ఒకరోజంతా 11000 ఘనపుటడుగుల నీరు వచ్చి చేరితే అది ఒక టీఎంసీ అవుతుంది. 

-టీఎంసీ అంటే శతకోటి ఘనపుటడుగుల నీరు(థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్స్). 
-ఒక టీఎంసీ అంటే రెండు కోట్ల 80 లక్షల క్యూబిక్ మీటర్లు.

-ఒక టీఎంసీ అంటే 2831 కోట్ల 68 లక్షల 46 వేల 592 లీటర్ల నీరు. 

అంటే 2831 హెక్టార్లలో ఒక మీటరు ఎత్తున నీటిని నిల్వ చేస్తే అదొక టీఎంసీఅవుతుంది. 

-22,956.8 ఎకరాల్లో ఒక అడుగు ఎత్తున నీటిని నిల్వ చేస్తే అది ఒక టీఎంసీ అవుతుంది.

   తెలంగాణ ఒకప్పుడు పచ్చని తివాచీయే. 1909 గెజిట్ ప్రకారం 37.38 శాతం అడవి ఉండేది. 42,929 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు ఉండేవి. తెలంగాణ అడవుల్లో ఒకప్పుడు ఏనుగులతో సహా అన్ని రకాల వన్యమృగాలు ఉండేవి. ఎర్రచందనం, టేకు, నల్లమద్ది, జిట్రేగి, ఇప్పతో సహా వందలాది వనజాతి మహావృక్షాలు ఉండేవి. ఇప్పుడు ఆ అడవి 20 శాతానికి పతనమైంది. ఉన్న అడవిలో కూడా భారీ వృక్షాలు ఉండటం లేదు. అడవుల నరికివేత యథేచ్ఛగా కొనసాగుతున్నది. ముప్పైయ్యేళ్ల కింద ఒకాయన టేకు కలప తెచ్చి ఉప్పల్‌లో అమ్ముతున్నాడు. ఎక్కడి నుంచి తెచ్చావని అడిగితే వరంగల్ అడవుల నుంచి అని చెప్పాడు. చాలా మంది కొత్తగా ఇండ్లు కట్టుకుంటున్నవాళ్లు ఆర్డరు చేశారట. నాలుగు లోడ్లు తెచ్చాడట. తెల్లవారే సరికి ఎవరి ఇంటివద్ద ఎంత ఆర్డరు చేశారో అంత దింపేసి వెళ్లిపోయాడు. మరుసటిరోజు ఒక అధికారిని అడిగాను. ఇదేమిటండీ వరంగల్‌లో అడవి మిగలదా? ఇంత దారుణంగా నరికేస్తుంటే ఎవరికీ పట్టదా? అని అడిగాను. మీరు అనవసరమైన విషయాలు పట్టించుకోకండి. వాళ్లు చాలా ప్రమాదకారులు అని నన్ను హెచ్చరించారు. మూడు రోజుల తర్వాత ఆ కలప స్మగ్లరు మా కాలనీకి వచ్చి పిచ్చిపిచ్చి వేషాలేస్తే బాగుండదని హెచ్చరించిపోయాడు. అంటే నేను ఏ అధికారితో మాట్లాడానో ఆ అధికారి వాళ్లకు చెప్పేశాడన్నమాట. తాజాగా అప్పటి అడవి మ్యాపులు ఇప్పటి అడవి మ్యాపులూ మా స్పెషల్ కరెస్పాండెంట్ తెచ్చి చూపించాడు. వరంగల్ జిల్లాలో వాస్తవానికి ఇరవై శాతం కూడా అడవి మిగలలేదు. ఈ విధ్వంసం ఇప్పటికీ కొనసాగుతున్నది. మొన్నమొన్న కూడా ఏటూరు నాగారం వద్ద అక్రమ కలప తరలిస్తున్న అరడజను ఎడ్ల బండ్లను పట్టుకున్నారు. ఆదిలాబాద్‌లోనూ నరికివేత కొనసాగుతున్నది. గోదావరిలో కలప దుంగల ప్రయాణం యథావిధిగా కొనసాగుతున్నది. కలప స్మగ్లింగులో ఉన్నవాళ్లలో చాలామంది రాజకీయ నాయకులయ్యారు. ఉత్తుత్త కేసులు వారిని ఏమీ చేయలేవు. ఏదైనా చెట్టును నరకడాన్ని పూర్తిగా నిషేధిస్తే తప్ప, నరమేధాన్ని, వనమేధాన్ని సమానంగా పరిగణిస్తే తప్ప ఈ ధ్వంసరచన ఆగేటట్టు లేదు.
ఇప్పుడు ఒక్కొక్క చినుకునూ లెక్కించుకోవలసిన పరిస్థితి. అనుక్షణం ఆకాశంలోకి ఆశగా ఎదురు చూడవలసిన దుస్థితి. ఎక్కడ ఎంత వానపడిందో ఏరోజుకారోజు ఆత్రంగా తెలుసుకోవలసిన పరిస్థితి. గోదావరిలో గత రెండు రోజులుగా రోజుకు లక్షా 30 వేల క్యూసెక్కులు అంటే సుమారు పన్నెండు టీఎంసీల నీరు…అంటే 2 లక్షల 76 వేల ఎకరాల్లో ఒక అడుగు మందం నిలిచే నీరు- బంగాళాఖాతంలో కలుస్తున్నది. గోదావరికి ఆ గట్టున ఈ గట్టున మిగిలిన ఉన్న అభయారణ్యాల పుణ్యాన, అక్కడ అడవిలో ఇంకా అక్కడక్కడా దట్టంగా మిగిలి ఉన్న వనసంపద కారణంగా గాలిలో తేమ ఎక్కువగా ఉన్న మూలాన, మబ్బులు అక్కడ ద్రవించి, చినుకులు కుమ్మరిస్తున్నాయి. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా గోదావ రి గట్టున ఉన్న వాగులు, వంకలు అన్నీ ప్రవహిస్తున్నాయి. గడ్డెన్న జలాశయం నుం చి కిన్నెరసాని జలాశయం దాకా అన్నింటిలోకి నీరు చేరాయి. పొచ్చెర, కుంటాల జలపాతాలు మొదలు బొగత జలపాతం వరకు అన్నీ కనువిందు చేస్తున్నాయి. మిగిలిన రాష్ట్రమంతటా నేల తడిసింది, అక్కడక్కడా చిన్నచిన్న చెరువులు నిండాయి. వాగులు, వంకలకు ఓ మోస్తరుగా నీరొచ్చింది. కానీ పెద్ద జలాశయాల్లోకి ఎక్కడా నీరు చేరలేదు. కొన్నిచోట్ల ఇప్పటికీ లోటు వర్షపాతమే నమోదయింది. 
తెలంగాణ మొదటిసారి నీటి విలువ తెలుసుకుంటున్నది. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఇతర ఉద్యమ శక్తులు రాష్ట్ర సాధన ఉద్యమంలో రగిలించిన చైతన్యం, ఇప్పుడు ప్రాజెక్టుల నిర్మాణానికి, చెట్ల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తున్న తీరు, శ్రద్ధపెట్టి మాట్లాడుతున్న తీరు, పనులు చేసుకుపోతున్న తీరు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. రాష్ర్టానికి ఎంత శాతం అడవి ఉండాలో, అందుకు ఎన్ని కోట్ల మొక్కలు పెంచాలో లెక్కలు వేసిన ముఖ్యమంత్రి ఇంతకుముందు ఎవరున్నారు? నదుల నుంచి వరదవచ్చినప్పుడే నీరు ఎత్తిపోసుకోవాలని ఇంత పెద్ద ఎత్తున రిజర్వాయర్లను రూపొందించిన ముఖ్యమంత్రి ఎవరున్నారు? హరితహారం, జలసంరక్షణ పరస్పర ఆధారితాలు. నీళ్లుంటే గానీ చెట్లు పెంచలేము. చెట్లు వీలైనంత పెంచితే కానీ వర్షాలు పడవు. అందుకే లభించే చోటు నుంచి నీటిని తరలించి సంరక్షించుకుని కరువుకాలంలో ఉపయోగించుకోవడం అవసరం. తెలంగాణలో ఇప్పటిదాకా ఇటువంటి ఆలోచన చేసిన నాయకత్వం లేదు.

సమైక్య ప్రభుత్వాలు జలయజ్ఞాన్ని ధన యజ్ఞాలుగా మార్చాయి. ఎక్కడపడితే అక్కడ కాలువలు తవ్వారు. కానీ వాటికి నీళ్లివ్వడానికి అవసరమైన ఏర్పాట్లు చేయ డం మరిచారు. ఎక్కడయినా నదుల్లో హెడ్‌వర్క్స్ మొదలు పెట్టి తర్వాత కాలువలు తవ్వుతారు. కానీ సమైక్య పాలనలో అంతా ఇందుకు రివర్సులో జరిగింది. ప్రభుత్వంలో ఉన్నవారు, కాంట్రాక్టర్లు కుమ్మక్కయి తేలికగా పూర్తయ్యే కాలువ తవ్వకం పనులు పూర్తి చేశారు. వాటికి అడ్వాన్సులు ఇచ్చారు. కమీషన్లు తీసుకున్నారు. కానీ పదేళ్ల తర్వాత కూడా చుక్క నీరు రాలేదు. పదివేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన కాలువల ద్వారా పదేళ్ల తర్వాత కూడా పైసా అదనపు ఆదాయం రాలేదంటే అది ఎంత నేరం? అటువంటి నేరం జరుగుతుంటే అందుకు భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీల నాయకులు ఇప్పుడు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉద్యమాలంటూ బయలుదేరడం ఆశ్చర్యంగా ఉన్నది. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల ప్రాధాన్యం వారికి ఇప్పటికీ బుర్రకెక్కలేదని అర్థమవుతున్నది. మహారాష్ట్ర, కర్ణాటక రాజకీయ నాయకత్వాల నుంచి తెలంగాణ నాయకులు ఎటువంటి గుణపాఠాలూ నేర్చుకోలేదని అర్థం అవుతున్నది. ఆ రెండు రాష్ర్టాల్లో కృష్ణా, గోదావరి నదులపై ఎన్ని ప్రాజెక్టులు నిర్మించారో లెక్కలేదు. కానీ వారు ఏనాడూ వీధిన పడి గోల చేసుకున్న సందర్భం కనిపించలేదు. ప్రాజెక్టులను అడ్డుకున్న దాఖలాలు లేవు. కానీ ఇక్కడ మాత్రం కొందరు నాయకులు ఏవో వివాదాలు, పేచీలు లేవనెత్తి సంవత్సరాల తరబడి ప్రాజెక్టులను సాగదీసే దుర్మార్గపు ఎత్తుగడలను అవలంబిస్తున్నారు. గతంలో తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర నాయకులు ఉపయోగించిన కుయుక్తులనే ఇప్పుడు కొందరు తెలంగాణ నాయకులు కూడా పన్నుతుండటం దారుణం. 
గోదావరి, కృష్ణానదులపై వివిధ ప్రాజెక్టుల కింద సుమారు 382 టీఎంసీల నీటి రిజర్వాయర్లను ప్రభుత్వం నిర్మించతలపెట్టింది. ఈ రిజర్వాయర్లు పూర్తయితే తెలంగాణ అంతా సస్యశ్యామలం అవుతుంది. అనేక ఉపనదులు, వాగులు, వంకలు పునర్జీవం పొందుతాయి. ఆరేడు జిల్లాల్లో వ్యవసాయ రంగ రూపురేఖలు మారిపోతాయి. జీవన ప్రమాణాలు మారతాయి. రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో నీరు అందుబాటులోకి వస్తే చెట్లు పెంచడం కూడా జీవితంలో భాగమవుతుంది. హరితహారం సహజంగానే ద్విగుణీకృతం అవుతుంది.

Author: kattashekar

Former Editor, Namasthe Telangana Daily