ప్రతిపక్షాలకు లెక్కలు రావా?


ఒక అబద్ధం వందసార్లు చెప్పినా నిజం కాదు. అబద్ధం గొంతు పెంచి చెప్పినంత మాత్రాన జనం వినిపించుకోరు. నీటిపారుదల ప్రాజెక్టులపై కాంగ్రెస్, టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలు, అడ్డగోలు ఆరోపణలు చూస్తుంటే వారికి వాస్తవాల పట్ల, నిజమైన వివరాల పట్ల కనీసం శ్రద్ధ లేదని అర్థమవుతున్నది. వారికి లెక్క లు కూడా సరిగా తెలిసినట్టు లేదు. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలంటారు. అతికినట్టు కాదుకదా ఏకోశానా నమ్మేటట్టు లేవు. నీటిపారుదల ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఓ కాంగ్రెస్ నాయకుడు రెండు లక్షల కోట్ల అవినీతి జరిగిందని నోరుపారేసుకున్నారు. మరో నాయకుడు లక్ష కోట్లని వాగారు. అసలు తెలంగాణ ప్రభు త్వం నీటిపారుదల ప్రాజెక్టులు మొదలుపెట్టింది ఎప్పడు? ఆ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం ఎంత? అందులో ఇప్పటివరకు ఖర్చు పెట్టింది ఎంత? పాత ప్రాజెక్టులపై గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఖర్చు చేసింది సుమారు 11 వేల కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్టులకు కేటాయించింది సుమారు 30 వేల కోట్లు. మిషన్ భగీరథ మొత్తం అంచనా వ్యయం 36,976 కోట్లు. ఇందులో ఇంకా 30 శాతం కూడా ఖర్చు చేయలేదు. మిషన్ కాకతీయ మొత్తం అంచనాయే 26,651 కోట్లు. అందులో ఇప్పటివరకు అయిన ఖర్చు 10 వేల కోట్లకు మించదు. ఇలా చూస్తే గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలపై ఖర్చు చేసిన మొత్తమే 30 వేల కోట్లకు మించదు. మరి లక్ష కోట్లు, రెండు లక్షల కోట్లు అవినీతి ఎలా జరిగినట్టు? పోనీఈ మూడు రకాల ప్రాజెక్టుల అంచనాల మొత్తం కలిపినా లక్ష 20 వేల కోట్లు మాత్ర మే. అది కూడా వచ్చే నాలుగైదేళ్లలో చేయవలసిన వ్యయం. ఏటా ఆ నిధుల కేటాయింపు జరగాలి. పనులు జరగాలి. నిధులు విడుదల చేయాలి. అప్పుడు గానీ ఏదో ఒకటి జరగాలి. కానీ ప్రతిపక్ష కోయిలలు ముందే ఎందుకు కూస్తున్నాయి? రాబోయే సంవత్సరాల్లో కాబోయే ఖర్చు కూడా లక్ష కోట్లు దాటనప్పుడు అయిన అవినీతి లక్ష కోట్లు అని ఎందుకు విషవూపచారం చేస్తున్నాయి? అబద్ధాలకు అలవాటు పడిపోయి అలా మాట్లాడుతున్నారా? లెక్కలు రాకనా? లేక అధికారం చేజారిపోయిందన్న ఆక్రోశ ఉక్రోశాలా? రాజకీయాల్లో హుందాతనం ఎందుకు కోల్పోవాలి? అధికారపక్షాన్ని విమర్శించే అధికారం ప్రతిపక్షాలకు ఉంటుంది నిజమే. కానీ అందుకోసం కనీసం హోంవర్కు చేయాల్సిన పనిలేదా? నోటికి ఎంత వస్తే అంత? ఏది తోస్తే అది మాట్లాడేస్తే వాళ్లను ఎప్పటికయినా నాయకులుగా జనం గుర్తిస్తారా? అడ్డంగా మాట్లాడటమే నాయకత్వ లక్షణమైతే అటువంటివాళ్లకు వాళ్లకు ఏగతి పట్టిందో గతం నుంచి గుణపాఠాలు ఎందుకు నేర్చుకోవడం లేదు?
చంద్రబాబునాయుడు గతంలో తెలంగాణలో కొందరు మైకాసురులను తయారుచేసి కేసీఆర్‌పై, తెలంగాణ ఉద్యమంపై ఇష్టంవచ్చినట్టు దాడి చేయించారు. వ్యక్తిగతంలో అనరాని మాటలు అనిపించారు. తెలంగాణ టీడీపీ నాయకులకు ఏవేవో పదవులు ఆశచూపి రెచ్చగొట్టి మరీ మాట్లాడించారు. కేసీఆర్‌ను ఎంత తిడితే అంత గొప్పనాయకునిగా ఆరోజు చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా వారిని ఆకాశానికెత్తింది. ఇప్పుడేమయింది. చంద్రబాబు వారికి ఎంత విలువ ఇచ్చారు? ఒక్క రాజ్యసభ సీటుకు అవకాశం ఉంటే ఎప్పుడూ నోరు విప్పని తన నమ్మినబంటుకు ఇచ్చుకున్నారు. గవర్నర్ పదవి గాలానికి కట్టిన ఎరలా ఎగురుతూనే ఉంది. తిట్టీ తిట్టీ అలసిపోయిన ఆ పెద్దమనిషి ఇప్పుడు మౌనమువూదలోకి వెళ్లారు. ఇప్పుడో కొత్త బిచ్చగాడు బయలుదేరాడు. ఆయన ఇంకా చెండాలంగా నోరుపారేసుకుంటున్నారు. ఈయనేదో రాజకీయాల్లోకి పవిత్ర గర్భం నుంచి ఊడిపడినట్టు అందరిపై తిట్లు కుమ్మరిస్తున్నాడు. ‘గోదావరి-కృష్ణ లింకు వల్ల ఎగువ కృష్ణలో లభించే 45 టీఎంసీల నీళ్లు తెలంగాణకు ఇవ్వబోవడం లేదు. డెల్టా ఆధునీకరణ వల్ల మిగిలే 20 టీఎంసీల నీళ్లు కూడా బీమాకు ఇవ్వం’ అని ఢంకా బజాయించి చెబుతున్న పార్టీ టీడీపీ. అటువంటి పార్టీని ఇంకా తెలంగాణలో మోయడమే దుర్మార్గం. పైగా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి విచారణ ఎదుర్కొంటున్న నిందితుడు. అటువంటి మనిషి తనేదో పవివూతుడయినట్టు అందరికీ కాండక్టు సర్టిఫికెట్లు ఇవ్వాలని చూస్తున్నాడు. చంద్రబాబుకు ఈయనేమిటో అర్థమయినా ఇంకా దుకా ణం ఎందుకు నడిపిస్తున్నాడంటే, ఆ కేసు అటో ఇటో తేలాలి. ఓటుకు నోటు కేసు లో తనను ఇరికించిన నాయకునికంటే చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన ఎమ్మెల్యేలు సైతం ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. వారంతా చంద్రబాబుతో మాట్లాడకుండానే, ఆయనతో ఏదో సర్దిచెప్పుకోకుండా చేరారని అనుకోలేము. చంద్రబాబుకు, ఆయన సన్నిహితులకు తెలంగాణలో ఇంకేమి మిగిలిఉందో, ఏమి జరుగబోతున్నదో అర్థమయింది. అందుకు అనుగుణంగానే వారు నడుచుకుంటున్నారు. ఎటొచ్చీ నడమంవూతపు నాయకత్వంతోనే సమస్య. చంద్రబాబుకు మరికొంతకాలం ఈయన అవసరం ఉంది. ఆ అవసరాన్ని అడ్డుపెట్టుకుని ఈయన ఎగిగిరి పడుతున్నారు. ఓటుకు నోటు కేసు కొలిక్కి వచ్చిన మరుక్షణం ఈ నాయకులను నేలకేసి కొడతారని వేరే చెప్పనవసరం లేదు. యూజ్ అండ్ త్రోలో చంద్రబాబు ప్రసిద్ధుడు అని అందరికీ తెలిసిన విషయమే. అది అందరికీ అర్థం అవుతున్న విషయమే. కానీ ఖాళీ విస్తరి చప్పుడెక్కువ చేస్తుంది కదా. ఎగిగిరి పడుతున్నది. ఆ చప్పుడే ఇప్పుడు తెలంగాణ వింటున్నది.

కాంగ్రెస్ నాయకులయితే ఒక్కసారే వయసుమీద పడి గతమంతా మరచిపోయి, ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చినవారిలా మాట్లాడుతున్నారు. వారు ప్రాజెక్టులు, కాంట్రాక్టులు, ముంపులు, ప్రజాందోళనలు ఏమీ తెలియనట్టు, తమకు ఏమీ గుర్తుకు లేనట్టు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నాయకులకు ఎంత గొప్ప చరిత్ర ఉందంటే ‘పులిచింతల ప్రాజెక్టు కట్టనివ్వం’ అని భీషణ ప్రతిజ్ఞలు చేసి, ప్రాజెక్టు సైటుకు వెళ్లి అక్కడ పనిచేస్తున్న కరెంటు మోటార్లను ధ్వంసం చేసి వచ్చా రు. కానీ ఆ ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లు పిలవగానే ఎవరికి కావలసినవి వారు తీసుకుని చల్లగా జారుకున్నారు. పులిచింతల కింద చుక్క నీరు తెలంగాణకు రాదు. కానీ ఆ ప్రాజెక్టు కింద 14 నల్లగొండ గ్రామాలు మునుగుతున్నా, వేలాది మంది నిరాక్షిశయులవుతున్నా రాజశేఖర్‌డ్డి ముందు చేతులు కట్టుకు కూర్చున్నారు తప్ప ఒక్కరూ నోరు మెదిపిన పాపాన పోలేదు. ఎందుకంటే అందరికీ కాంట్రాక్టులు, పదవులు, పందేరాలు చేసిపెట్టారు. పులిచింతల కింద ఇప్పటికీ పలు గ్రామాల ప్రజలకు పరిహారం అందలేదు. పోయినసారి పరిహారం చెల్లించకుండానే రిజర్వాయరు నింపితే కొన్ని గ్రామాల్లోకి నీరు వచ్చింది. ప్రజలు గగ్గోలు పెట్టవలసి వచ్చిం ది. అప్పుడు కూడా అక్కడి మంత్రి ఉత్తమ్‌కుమార్‌డ్డి ఒక్కటంటే ఒక్క ప్రకటన చేయలేదు. ఉత్తమ్‌కు అంత నిజాయితీ ఉంటే పరిహారం చెల్లించేదాకా పులిచింత ల నింపకుండా అక్కడ కొట్లాడాలి. నాగార్జునసాగర్ ఎల్‌ఎల్‌సి కాలువను తవ్వి దాదాపు తొమ్మిదేళ్లవుతున్నది. నీళ్లొస్తాయి కదా అని రైతులు అభ్యంతర పెట్టలేదు. కానీ ఆ రైతులకు ఇప్పటికీ పరిహారం చెల్లించలేదు. మరి పెద్దమనిషి జానాడ్డి అప్పుడెప్పుడూ కొట్లాడలేదు. కోమటిడ్డి బ్రదర్స్ పీపుల్ ఫ్రెండ్లీ లీడర్స్ కాదు, కాంట్రాక్టు ఫ్రెండ్లీ లీడర్స్. కాంట్రాక్టులు ఇచ్చేవాళ్లతో మంచిగా ఉండాలన్నది వారి నియమం. అందుకే వారు తమకు కావలసినవేవో తీసుకుని, తమ పనులేవో తాము చేసుకుంటున్నారు. పార్టీలో పదవులు కాపాడుకోవడం కోసం ఒకసారి అధికార పార్టీని తిడతారు, ఇంకోసారి కేసీఆర్ ప్రభుత్వం బ్రహ్మాండంగా పని చేస్తున్నదని పొగుడుతారు. వారివన్నీ నిలకడలేని చేష్టలు. అవసరార్థ సంబంధాలు, అవకాశవాద ప్రకటనలు. రెండులక్షల కోట్ల అవినీతి గురించి మాట్లాడిన నాయకుడయితే రాజశేఖర్‌డ్డి జలయజ్ఞానికి అధికార ప్రతినిధిగా పనిచేసివారు. ఆయనకు అప్పుడూ ప్రాజెక్టుల గురించి తెలియదు, ఇప్పుడూ ప్రాజెక్టుల గురించి తెలియదు. ప్రతిపక్ష నాయకుడంటే ప్రతిదీ అడ్డంగా మాట్లాడటం అని మాత్రమే తెలుసు. అందుకే ఆయనకు లక్ష కోట్లకు రెండు లక్షల కోట్లకు తేడా తెలియదు. రాజశేఖర్‌డ్డికి నీడగా పనిచేసినవారు. ఆయన కూడా ఇవ్వాళ తెలంగాణ ప్రభుత్వంపై రాళ్లు విసురుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పరిహారం ఇవ్వడానికి కూడా కమీషన్లు తీసుకున్న చరిత్ర ఉంది. ఇళ్లు పోతే ఇందిరా ఆవాస్ యోజన కింద ఇళ్లు ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తున్నది. పరిహారం కూడా కాంగ్రెస్ ఇచ్చినదానికంటే రెండు మూడు రెట్లు ఇస్తున్నది.

ఈ ఆరు దశాబ్దాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాలకు, ఇక్కడ జరిగిన అవినీతికి భాగస్వాములుగా, ప్రత్యక్షసాక్షులుగా అద్దాల మేడలు నిర్మించుకున్నవారు తెలంగాణ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తయ్యాయో లేదో ఏదో కొంపలు మునిగిపోయినట్టు యాగీ చేయడం మొదలుపెట్టారు. అద్దాల మేడల్లో ఉన్నవారు ఇతరులపై రాళ్లు విసిరితే ఏమవుతుందో వారికి తెలుసు. అయినా విసురుతామంటే, నువ్వొక్కటి విసరితే బయటివాళ్లు నాలుగు విసురుతారు. ఎందుకంటే మీకు అంత చరిత్ర ఉంది. మీ వెనుక అన్ని పాపాలు ఉన్నాయి. ప్రతిపక్షం ఇప్పటికయినా పునరాలోచించుకోవాలి. తిట్టి పెరగలేరు. నిర్మాణాత్మక పాత్ర, అర్థవంతమైన చర్చ, విమర్శ మాత్రమే వారి మర్యాదను పెంచగలవు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ వినూత్న ప్రాజెక్టులపై ఏదైనా మాట్లాడే ముందు వాటి గురించి సమక్షిగంగా అధ్యయనం చేయాలి. వివరాలు లెక్కలు పత్రాలు తెలిసి ఉండాలి. గాలి మాటలు, పిచ్చి కూతలతో ప్రతిపక్షం గౌరవాన్ని పెంచలేరు.

Author: kattashekar

Former Editor, Namasthe Telangana Daily