దీక్షాదినమా? ఏడుపుదినమా?


IMG_2386

అవతరణ దినోత్సవాలను దీక్షాదినం పేరిట సంతాపదినాలుగా పాటించిన ఘనత దేశ చరిత్రలో ఆంధ్రముఖ్యమంత్రి ఒక్క చంద్రబాబునాయుడుకే దక్కుతుంది. దేశంలో గత యాభైయ్యేళ్లలో అనేక రాష్ర్టాలు విడిపోయాయి. కొత్త రాష్ర్టాలు ఏర్పడ్డాయి. కొత్త రాష్ర్టాలన్నీ రాజధానులు లేకుండానే ఏర్పడ్డాయి. విడిపోయిన రాష్ర్టాలేవీ పాతరాజధానుల్లో వాటాలు అడుగలేదు. వాటాలు ఇచ్చిన సంప్రదాయం కూడా లేదు. రాజధాని లేని రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయినవారిలో చంద్రబాబు ఏ పదమూడోవాడో అవుతాడు. వాళ్లెవరూ ఇలా ఏడవలేదు. అస్తమానం శాపనార్థాలు పెడుతూ కూర్చోలేదు. జనాన్ని ఎల్లకాలం మోసం చేయాలని చూడలేదు. విభజన సమయంలో చేసిన మోసం, చెప్పిన అబద్ధాలు ఇవ్వాళ ఆంధ్రలో చంద్రబాబునాయుడును కట్టికుడుపుతున్నాయి. విభజన సమయంలో చంద్రబాబు ఏమి డిమాండ్లు చేశారో ఒక్కసారి పాత పత్రికలు తిరిగేసి చూడండి. విభజన అన్యాయం అన్నాడు. విభజనకు అంత తొందరేమిటన్నాడు. అన్ని రాష్ర్టాలు తిరిగి ఎలాగైనా విభజన ఆపాలని చూశాడు. ఒక్కసారయినా మా రాష్ర్టానికి ఫలానాది కావాలని అడగలేదు. జనంలో విభజన వ్యతిరేకతను, తెలంగాణ వ్యతిరేకతను పెంచి పోషించి, ఆంధ్రప్రజల్లో పెల్లుబికిన అశాంతికి చాంపియన్‌గా మారి ఓట్లు దండుకోవాలని చూశారే తప్ప కించిత్ కూడా ముందు చూపుతో వ్యవహరించలేదు. ఆంధ్రకు ఎవరయినా మేలు చేశారంటే అది ఒక్క వెంకయ్యనాయుడే చేశాడు. ఆంధ్ర తరఫున అదికావాలి ఇదికావాలి అని పార్లమెంటులో చివరిదాకా కొట్లాడిన మనిషి ఆయన ఒక్కరే. తెలంగాణ నుంచి అన్యాయంగా ఏడు మండలాలను లాగేయడంలో కూడా ఆయనదే కీలకపాత్ర. కానీ చంద్రబాబు ఎంతటి సమర్థుడంటే వెంకయ్యనాయుడుకు ఆంధ్రలో ఆ క్రెడిట్ కూడా దక్కనివ్వలేదు. అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయి. ఆయన అలక వహించి ఎక్కడో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపిక కావలసి వచ్చింది.

అసలు చంద్రబాబు వద్ద బీజేపీ రాజ్యసభ సీటే తీసుకోవద్దనుకుంది. రాజ్యసభ సీటిచ్చి చాలా చాల డిమాండ్లు పెట్టాలనుకున్నాడు చంద్రబాబు. బతిమాలిచ్చుకోవాలనుకున్నాడు. కానీ బీజేపీ చంద్రబాబుకు లొంగదల్చుకోలేదు. గతంలో ఇక్కడ గెలిచిన నిర్మలా సీతారామన్‌ను కూడా బయటి రాష్ర్టాల్లోనే సర్దుబాటు చేసింది. చంద్రబాబు నిజంగా బాధితుడు కాదు. బాధితుడిగా నటిస్తూ, ప్రజలను వంచిస్తూ లబ్ధిపొందాలనుకుంటున్న ఫక్తు అవకాశవాద రాజకీయ నాయకుడు. మొన్నటిదాకా కాంగ్రెస్‌ను బద్నాం చేసినట్టే రేపు తమను కూడా బద్నాం చేస్తాడన్న అవగాహనకు వచ్చేసింది బీజేపీ. అందుకే రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కఠినంగా ఉండదల్చుకుంది. చివరికి చంద్రబాబే హడలిపోయారు. రాష్ట్ర బీజేపీ మంత్రిని రాయబారిగా పంపి రాజ్యసభ సీటు తీసుకోవాలని ఈయనే ఎదురు బతిమాలుకోవలసి వచ్చింది. బీజేపీ కూడా తలుపులు ఇప్పుడే మూసేయకూడదనుకుని చివరికి సురేశ్ ప్రభును ఆంధ్ర నుంచి ఎంపిక చేసింది. సురేశ్ ప్రభు పోటీ చేయడం వల్లనే టీడీపీ నాలుగో అభ్యర్థిని సిద్ధం చేసి కూడా మానుకుంది. వైసీపీని ఆగంపట్టించే ఉద్దేశంతో రంగంలోకి దించాలనుకున్న నాలుగో అభ్యర్థి వల్ల సురేశ్ ప్రభుకు ఏదైనా నష్టం జరిగితే ఇక బీజేపీతో నూకలు చెల్లిపోతాయని చంద్రబాబు భయపడ్డారు. అందుకే నాలుగో అభ్యర్థిని చివరి నిమిషంలో ఆపారు. చంద్రబాబు, బీజేపీలది పరస్పర అవసరానుగత బంధం. పరస్పర నమ్మకాలు గానీ గౌరవాలుగానీ ఉండవు. చంద్రబాబునాయుడు గతంలో తమతో ఎంత అతుక్కుని ఉన్నాడో చివరికి ఎలా ప్లేటు ఫిరాయించాడో నరేంద్రమోడీకి బాగా తెలుసు. అందుకే ఇద్దరూ ఒకరినొకరు నమ్మలేని పరిస్థితి. మా బట్టలు ఎప్పుడు విప్పబోతున్నారు అని ఇటీవల ఢిల్లీ వెళ్లిన ఒక టీడీపీ దూతతో ప్రధాని నరేంద్రమోడి నేరుగానే ప్రశ్నించినట్టు చెబుతున్నారు. త్వరలోనే కేంద్రం బట్టలిప్పుతాం అని ఆంధ్రలో టీడీపీ నాయకులు చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ ప్రధాని ఆ ప్రశ్న వేసినట్టు చెబుతున్నారు. టీడీపీతో ఉన్నంతకాలం ఒక ప్రధానమైన శక్తిగా ఎదగలేమని, చంద్రబాబు ఎదగనీయడని మోడీకి బాగా అర్థమయింది. ఆంధ్రలో సొంతంగా 1998 ఎన్నికల్లో 18.5 శాతం ఓట్లు నాలుగు లోక్‌సభ సీట్లు సంపాదించిన బీజేపీ ఆ తర్వాత ఎందుకు వెనుకబడిపోయిందో ఆయన అడిగి తెలుసుకున్నారని కూడా చెబుతున్నారు.

అందుకే బీజేపీ చంద్రబాబుతో ఈ అపనమ్మక మైత్రిని కొనసాగిస్తూనే అనేక అవకాశాలకు ద్వారాలు తెరిచి ఉంచుతోంది. చంద్రబాబుకు దన్నుగా ఉన్న సామాజిక వర్గం ఎట్టిపరిస్థితుల్లో తెలుగుదేశంను వదలి తమకు అండగా ముందుకు రాబోరని బీజేపీ అవగాహనకు వచ్చింది. ఆంధ్రలో బలమైన సామాజిక వర్గాలైన రెడ్డి, కాపు, కమ్మ వర్గాలలో ఏదో ఒక సామాజిక వర్గం పునాదిగా లేకుండా ఏ రాజకీయ పార్టీ నిలబడలేదని బీజేపీ నాయకత్వం భావిస్తున్నది. అందుకే పవన్ కల్యాణ్‌తో జట్టుకట్టి దున్నేయడానికి గల అవకాశాలను వదులుకోవడం లేదు. కొందరు బీజేపీ నాయకులు ఆయనతో కూడా మంతనాలు జరుపుతున్నారని చెబుతున్నారు. మరోవైపు వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డిలో ఆశల విత్తనాలను అలా సజీవంగా ఉంచుతున్నారు. ఆయనకు కావలసిన పనులు కొన్ని కేంద్రంలో చేసిపెడుతున్నారని చెబుతున్నారు. ఈ మూడేళ్లకాలం అక్కడ అందరికీ పరీక్షా సమయం. చంద్రబాబు కోలుకున్నా, కూలుకున్నా ఆయన స్వయంకృతమే అవుతుంది. విభజనను ఒక అవకాశంగా, గొప్ప నాయకత్వాన్ని అందించే సందర్భంగా మల్చుకోకుండా నిరంతరం పితూరీలు చెప్పే నాయకునిగా మిగిలిపోతే ఆంధ్ర ప్రజలు కూడా క్షమించరు. తెలంగాణలో కేసీఆర్ చేసినట్టే, ఆంధ్రలో తాను చేస్తున్నానని చంద్రబాబు పొరబడుతున్నట్టున్నారు. తెలంగాణ సందర్భం వేరు. కేసీఆర్ తెలంగాణ సాధకుడు. తెలంగాణకు స్వయంపాలన రుచి చూపించినవారు. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నది వేరు. ఇక్కడ ప్రజల విశ్వాసాన్ని నానాటికీ పెంపొందించుకుంటూ కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఇతర పార్టీల నాయకులు మరో దశాబ్దంపాటు ఇంకోపార్టీకి దిక్కు ఉండదేమోనని ఆందోళన చెంది టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. చంద్రబాబు పరిస్థితి వేరు. అక్కడ ఇతర పార్టీల నాయకులు వచ్చి చేరుతున్న మాట వాస్తవమే, కానీ జనంలో అడుగులు ఊడిపోతున్న విషయం కూడా వాస్తవం. ఎందుకంటే చంద్రబాబు రాష్ట్రం పునర్నిర్మాణాన్ని ఒక గొప్ప అవకాశంగా, కొత్త అవకాశాలు, భారీ పెట్టుబడులు తీసుకొచ్చిన అదృష్టంగా చంద్రబాబు ఇంతవరకు చెప్పలేదు.

ప్రతిసందర్భంలో ఏడుపే వినిపిస్తున్నారు. ఒక బాధితునిలా మాట్లాడుతున్నారు. నాయకుడు అంత బేలగా, దిక్కుమాలిన మాటలు మాట్లాడితే జనం జీర్ణించుకోలేరు. డిమాండ్లు పెట్టడం, కొట్లాడడం వేరు. కానీ ఒకే ఫిర్యాదుతో తరతరాలు జనాన్ని మభ్యపెట్టాలని చూడడం వేరు. విభజన వల్ల ఇవ్వాళ ప్రభుత్వం, రాజధాని, ముఖ్యమంత్రి అందరూ అక్కడి ప్రజలకు చేరువయ్యారు. వేల కోట్ల పెట్టుబడులు వచ్చిపడుతున్నాయని చంద్రబాబే చెబుతున్నారు. విజయవాడ, గుంటూరు మధ్య చాలా నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నాయి. అనేక కేంద్రీయ సంస్థలు ఆంధ్రలో వెలిశాయి. కేంద్రం కూడా ఇతర రాష్ర్టాలతో పోల్చితే ఎక్కువ సాయమే అందిస్తున్నది. ఐఐటీ, ఐఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్, విమానాశ్రయాల అభివృద్ధి, రహదారుల అభివృద్ధి వేగవంతమైంది. అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతున్నది. విభజన వికాసానికే అని చెప్పకుండా ఎంతసేపూ ప్రతికూల అంశాలనే చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ఇప్పటిదాకా విభజనను, కేంద్రంలో కాంగ్రెస్‌ను తిడుతూ గడిపారు సరే, వచ్చే ఎన్నికల్లో ఏమని చెబుతారు? ఎవరిని తిడతారు? ఎవరినో ఒకరి తిట్టి గెలవడం తప్ప, ఏదో ఒకటి చేసి గెలవడం చేతకాదా? చంద్రబాబు ఆలోచించుకోవలసింది అదే. చత్తీస్‌ఘడ్, జార్ఖండు రాష్ర్టాలు కొత్త రాజధానులు నిర్మించుకుని అభివృద్ధిని సాధించడం లేదా? అభివృద్ధి రేటులో చాలా పెద్ద రాష్ర్టాల కంటే ముందడుగు వేయడం లేదా? మహారాష్ట్ర నుంచి విడిపోయిన గుజరాత్ తొలుత అహ్మదాబాద్‌లో రాజధాని పెట్టుకుని, తర్వాత గాంధీనగర్ కట్టుకుని ఇవ్వాళ ఎందుకు గణనీయమైన అభివృద్ధిని సాధించింది? ప్రతికూలతలను కూడా అనుకూలతలుగా మల్చుకుని నెగ్గుకురాగలిగినాడే గొప్పనాయకుడవుతాడు.

చంద్రబాబు కోల్పోతున్న ఆదరణ ఏదీ వైసీపీ నేత జగన్‌కు కలిసి రావడం లేదు. జగన్‌పై జనానికి నమ్మకం లేదు. అతని ప్రవర్తనపై చాలా మంది సొంత పార్టీ నాయకులే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన దక్షతపై కూడా ఎవరికీ నమ్మకం కుదరడం లేదు. ఆయన మాట్లాడుతున్న తీరు కూడా ఆయన ప్రతిష్ఠను పెంచేదిగా లేదు. కడుపుమంట, ఉక్రోషం కలగలిపి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. రాజకీయ పరిభాషను మార్చేస్తున్నాడు. రాజశేఖర్‌రెడ్డిపై కూడా ఒకప్పుడు ఇటువంటి అభిప్రాయాలే ఉండేవి. కానీ ఆయన తనకున్న పాతముద్రలను చెరిపేసుకోవడం కోసం 2003లో పాదయాత్ర చేశారు. జనంలో ఒకడుగా చెమటోడ్చిన నేతగా మారిన మనిషిగా ఆయన మన్ననలు పొందారు. అందుకే 2004 ఎన్నికల్లో ఆయనకు పట్టం కట్టారు. ఆయన మారిన మనిషిగా ఆ తర్వాత ఉన్నారా లేదా అన్నది మళ్లీ చర్చనీయాంశమే. జగన్ జనంతో కలుస్తున్నారు కానీ ఆయన నాయకులను విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. రాజశేఖర్‌రెడ్డి తనకు అండగా నిలిచిన చిన్న నాయకుడు ఎదురయినా పేరు పెట్టి పిలిచి, భుజాల మీద చేయి వేసి ఆప్యాయంగా పలుకరించేవాడు. బాగా తెలిసినవారు అన్నా ఆప్యాయంగా పిలిస్తే ఆయన చాలా సంతోషించేవాడు. ముఖ్యమంత్రిని అన్నా అంటావా అని ఎప్పుడూ మనిషిని దూరం చేసుకోలేదు. సమయం వచ్చినప్పుడు వారికి ఎటువంటి సాయం అవసరమయినా చేసేవాడు. జగన్‌కు అటువంటి పేరేదీ లేదు. ఆయనకు ఏ బంధాలపై నమ్మకం లేదని ఆయనతో కొంతకాలం కలిసి తిరిగినవారు చెబుతున్నారు. అందుకే ఆయనకు మనుషులు దూరమవుతున్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో మరి.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad