హత్యాచారం కోసమే కారు దారి మళ్లించారా?


Devils Trap

దేవి మృతికి సంబంధించి అనేక సంచలన విషయాలు బట్టబయలవుతున్నాయి. దుండగులు అత్యాచారంకోసమే నిర్మానుష్యంగా ఉండే రోడ్డులోకి కారును మళ్లించారని స్పష్టమవుతున్నది. నిజానికి ప్రశాసన్‌నగర్ రోడ్డు నుంచి వచ్చి దేవి నివాసానికి వెళ్లాలంటే మెయిన్‌రోడ్డులో నేరుగా వెళ్లాలి. కానీ ఏబీపీ సొల్యూషన్స్ భవనం వద్ద కారును దారి మళ్లించి నిర్మానుష్యంగా ఉండే కొండరోడ్డులోకి మళ్లించారు. అక్కడ రోడ్డుకు పశ్చిమం వైపు అంతా అడవి. రోడ్డుకు తూర్పు వైపు మాత్రమే ఇప్పుడిప్పుడే ఇండ్ల నిర్మాణం జరుగుతున్నది. రోడ్డు చివరలో కారులో ఘర్షణ జరుగుతుంటే నిర్మాణంలో ఉన్న ఇంటి వాచ్‌మెన్ చూశాడు. రక్షించమని దేవి కేకలు వేసినట్టు వాచ్‌మెన్ చెబుతున్నాడు. దుండగులు అమ్మాయిని బలవంతంగా లాక్కెళ్లి కారులో వేసి అక్కడి నుంచి మరో చోటికి వెళ్లారు. ఆ భవనం నుంచి సుమారు 30 మీటర్లు దిగువన కారు ప్రమాదానికి గురయినట్టు సీను క్రియేట్ చేశారు. ఘర్షణ జరిగిన చోటు, ప్రమాదం జరిగినట్టుగా చెబుతున్న చోటు రెండు కూడా డెడ్‌ఎండ్ రోడ్డులోనే. దేవి ఇంటికి వెళ్లే దారి కాదు. రెండు నిమిషాల్లో వస్తున్నానని దేవి ఆఖరి కాల్‌లో తన తండ్రితో చెప్పడాన్ని బట్టి అప్పటికే కారు ఆంధ్రజ్యోతి ముందు మెయిన్‌రోడ్డులోకి వచ్చి ఉండాలి. ఆ తర్వాత కాల్స్ కట్ అయ్యాయి. ఒక మిస్డ్ కాల్ వచ్చింది. మళ్లీ ఫోను చేస్తే ఎవరూ తీయలేదు. బహుశా దుండగులు ఆ రోడ్డులోకి మళ్లించి అత్యాచార యత్నం చేసి ఉంటారు. దేవి ప్రతిఘటించడంతో ఈ వ్యవహారం ఎక్కడ బయటికి వస్తుందోనని హతమార్చి ఉంటారు. ఆ తర్వాత ప్రమాదం సీను క్రియేట్ చేసి ఉంటారు. నేరబుద్ధితోనే దుండగులు కారును ఆ దారిలోకి మళ్లించారని ఇంతకంటే ఆధారం అక్కరలేదు. అయినా పోలీసులు దీనిని కేవలం తాగి కారునడిపి, ప్రమాదానికి కారణమైన ఘటనగానే నమ్మించే ప్రయత్నం చేశారు. నిందితులకు కావలసింది కూడా అదే. ఆనవాళ్లు లేకుండా చేశారు. ఆలస్యంగానయినా ప్రత్యక్ష సాక్షి బయటకి వచ్చి చెప్పాడు కాబట్టి అనేక విషయాలు బయటికి వచ్చాయి.

స్థానిక పోలీసుల పాత్ర అనుమానాస్పదం

దేవి ఇంటికి వెళ్లే రోడ్డు అది కాదు. అది అనుమానాస్పద ప్రదేశం. కారు ప్రమాదం గురించి దుండగులు చెబుతున్నవి కూడా అతికేట్టు లేవు. కారు బద్దలయిపోయింది కానీ చెట్టుకు చిన్న బెరడు ఊడిపోయింది. పోలీసులు వచ్చారు. కానీ వెంటనే దేవి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదు. నేర ప్రదేశాన్ని చెదరకుండా చూడడానికి ప్రయత్నించ లేదు. మొత్తం శుభ్రం చేసి కారును, పిల్లలను తరలించారు. ఆ సమయంలో అక్కడ ఎవరెవరున్నారన్న ఫొటోలు, వివరాల సేకరణ జరుగలేదు. కారు ముందు వైపు డోరు విరిగిపోయింది. దేవి శవం కారు వెనుక డోరు వద్ద పడి ఉంది. కారు ఎటునుంచి ఎటుపోతుంటే ప్రమాదం జరిగిందో పోలీసులు నిర్ధారించుకోలేదు. కొండమీదికి పోతున్నప్పుడు ప్రమాదం జరుగలేదని వాచ్‌మెన్ చెబుతున్నదానిని బట్టి అర్థం అవుతున్నది. దిగుతున్నప్పుడు ప్రమాదం జరిగి ఉంటే చెట్లు కుడివైపు ఉంటాయి కాబట్టి చస్తే కారు డ్రైవరు చావాలి తప్ప దేవికి ఏమీ కాకూడదు. ఇవేవీ విచారించకుండానే పోలీసలు నేరస్థలాన్ని శుభ్రం చేశారు. దుండగులతో కుమ్మక్కయి చేశారా లేక రోటీన్ డ్రంక్ అండ్ డ్రైవ్ అని నమ్మేశారా తేలాల్సి ఉంది.

వీఐపీలెవరు

కారులో దేవితో పాటు మరో ఇద్దరు ఉన్నారని చెబుతున్నారు. ఆ ఇద్దరు ఎవరు? ఆ సమయంలో ప్రమాద స్థలం నుంచి వెళ్లిన, స్వీకరించిన సిగ్నల్స్ అన్నీ ట్రాక్ చేస్తే ఎవరెవరు అక్కడ ఉన్నారన్నది బయటికి వస్తుంది. ప్రమాదం జరిగిన మరుసటి రోజు నుంచి కొందరి ఫాన్సీ నంబర్లు కలిగిన వీఐపీ కార్లు తమ ప్రాంతానికి వచ్చాయని, కార్లలో వచ్చినవారు తాము అమ్మాయి తరపు వారమని ప్రమాదం ఎవరయినా చూశారేమో తెలుసుకుందామని వచ్చామని చెప్పారట. కొందరు చూశారని తెలిసిన తర్వాత వారి నంబర్లు సేకరించి నగరానికి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త ఫోనులో మీరు చూశారా అని వాకబు చేశారట. తాను కూడా అమ్మాయి తరపునే మాట్లాడుతున్నానని చెప్పాడట. మరుసటి రోజు నుంచి ఆ వీఐపీ బెదిరింపు ధోరణిలో మాట్లాడడం మొదలు పెట్టారని స్థానికులు చెబుతున్నారు. భరతసింహారెడ్డితోపాటు ఉన్న ఆ వీఐపీ తనయుడెవరు?

ఏ సీసీటీవీలోనూ రికార్డు కాలేదా?

ప్రమాదం జరిగిన కారు నంబరు తెలుసు. పబ్ నుంచి ఇంటికి వచ్చేదాకా ఆ కారుకు సంబంధించిన సమాచారం ఏ సీసీటీవీలోనూ నమోదు కాలేదా? పోలీసులు విచారణ జరుపాల్సి ఉంది. పబ్ దగ్గర తీసిన విడియోలను కూడా సేకరించాల్సింది. నిజానికి కొత్తగా ప్రారంభించిన ఆ పబ్‌ను రాత్రి రెండు గంటలకే మూసేశామని నిర్వాహకులు చెబుతున్నారు. కొందరు తమ పబ్ మూసేసిన తర్వాత సమీపంలోనే ఉన్న మరో పబ్ వద్దకు వెళ్లి కొంత సేపు ఉన్నట్టు చూశామని పబ్‌లో పనిచేసినవారు చెబుతున్నారు. పబ్ వద్ద బయలుదేరిన సమయం నుంచి ఎక్కడెక్కడ ఏమి జరిగిందో ఇప్పుడు కనిపెట్టాల్సి ఉంది.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad