జలమూలం ఇదం జగత్


TEL_Major Irrigation ProjectsMap (1)

మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నీటిపారుదల ప్రాజెక్టులు ఇవి పరస్పర ఆధారితాలు. ఒకటి పూర్తయి ఒకటి ఆగిపోవడానికి వీలు లేని పరిస్థితి. ఏకకాలంలో అన్నీ పూర్తయితేనే సార్థకత. ఆశించిన లక్ష్యాలను సాధించడం సాధ్యమవుతుంది. ముఖ్యమంత్రి ప్రాథమిక లక్ష్యం తాగునీరు అందించడం. ఇంటింటికీ తాగునీరు అందించాలంటే మిషన్ భగీరథ పనులన్నీ అనుకున్న లక్ష్యాల ప్రకారం పూర్తికావాలి. ఇన్‌టేక్‌వెల్స్, పైపులైను వ్యవస్థ, ఇంటింటికీ నల్లాల వ్యవస్థ అంతా ఏర్పడుతుంది సరే… నీరు ఎక్కడి నుంచి రావాలి? నీరు రావాలంటే చెరువుల్లో నీరు సమృద్ధిగా ఉండాలి. నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి కావాలి. ఇంటేక్‌వెల్స్‌కు నీరందించే ప్రాజెక్టులు పూర్తి అయితేనే మిషన్ భగీరథకు సార్థకత.

కలిమికి లేమికి మధ్య ఉన్న గీత ఏమిటి? ఈ ప్రశ్నకు చాలా మంది డబ్బు, భూములు, సంపదలు అని సమాధానం ఇస్తారు. అది కనిపించే వాస్తవం కూడా. కనిపించని వాస్తవం మరొకటి ఉంది. అది నీరు ఉండడం లేకపోవడం. తాగునీరు, సాగునీరు ఉన్నవారు సంపన్నులు, లేనివారు పేదలు. తెలంగాణ ఉద్యమ సారాంశం కూడా అదే. వాళ్లు నదుల మళ్లించుకుని, నీళ్లు ఉపయోగించుకుని ఉన్నతి సాధించారు. మనకు నీళ్లు లేక వెనుకబడిపోయాము. మా సమీపంలో ఓ పెద్దాయన చాలా అందమైన భవంతి కట్టాడు. పన్నెండు వందల అడుగుల లోతుకు బోరు వేసి, వచ్చిన కొద్ది నీటిపై ఆధారపడి ఆ మేడ నిర్మించాడు. ఇప్పుడు కరువొచ్చి బోరు ఎండిపోయింది. ఆ కాలనీకి ఇంకా ప్రభుత్వ సౌకర్యాలు రాలేదు. నల్లా లైన్లు వేయలేదు. మూడు రోజుల పాటు ఆయన తిప్పలు చూడాలి! పత్రికల్లో రాశారని ప్రైవేటు బోర్లను పోలీసులు ఆపేశారు. హైదరాబాద్ తాగునీటి సరఫరా విభాగాన్ని అడిగితే మూడు రోజులు పడుతుందని చెప్పారట. ఎక్కువ డబ్బులు ఇస్తాను వెంటనే తెండి అని కూడా చెప్పి చూశారట. ఇప్పుడు అందరూ అదే చెబుతున్నారు సార్…ఎక్కడికని వెళ్లాలి అని అవతలి నుంచి సమాధానం. ఇక చూడండి ఆయన హైరానా? మూడు రోజులపాటు ఆయనకు శాంతి లేదు. సకల సంపదలూ ఉండి ఆయన అనేక మందిని ప్రాధేయపడడం చూశాను. అనేక మంది తలుపుతట్టడం చూశాను. ఈ మూడు రోజులు ఆయన ఎక్కడ ఎవరు ఎదురుపడినా నీళ్ల గురించే మాట్లాడడం చూశాను. విషాదం ఏమంటే ఆయన డెల్టాలో కృష్ణా కాలువల పక్క పల్లెల్లో దర్జాగా బతికి వచ్చిన మనిషి. మరొక ఉదాహరణ….నాకు తెలిసిన పెద్దాయన గ్రామంలో తనకున్న పదెకరాలు అమ్మాలని మూడేండ్లుగా బేరానికి పెట్టాడు. అందులో కొన్నేళ్ల క్రితం బత్తాయి పెట్టాడు. బోరు ఎండిపోయి నీరు అందలేదు. రెండు పంటలు వచ్చిన తర్వాత బత్తాయి చెట్లను నరికేశాడు. అనేక బోర్లు వేశాడు. ప్రయోజనం లేకపోయింది. కొద్దో గొప్పో నీరు లభించినా అవి లేమిని జయించే పంటలేవీ ఇవ్వలేదు. పట్నంలో ఉద్యోగాలు చేస్తున్న కొడుకులు కూడా ఆ భూములు అమ్మేసి హైదరాబాద్ రమ్మని ఒత్తిడి చేశారు. వారికి కూడా భూములపై ప్రేమ లేక కాదు. విసిగిపోయి చెప్పిన మాటే. అయినా ఆ పెద్ద మనిషి ఆశ చావలేదు. మాధవరెడ్డి కాలువ నీరు వస్తుందని చెరువులు నిండుతాయని, బోర్లు బాగుపడతాయని చూశాడు. కాలువ ఊరిదాకా తవ్వారు. ఏడేండ్లయింది. నీరు మాత్రం రాలేదు. ఎప్పటికయినా రాకపోతుందా అని ఆ పెద్ద మనిషి మథనం. చాలా మంది ఆ భూమిని కొంటామని వస్తున్నారు. ధర పడనివ్వడు. అమ్మకం పూర్తి చేయడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. మళ్లీ ఒకరోజు ధైర్యం చేసి ఒక పెద్దబోరు తెప్పించి ఈసారి చుట్టుపక్కల ఎవరూ వేయని విధంగా 500 అడుగుల లోతుకు బోరు వేశాడు. తెల్లబండలు, నల్లబండలు అనేక పొరలు తెంపుకుని జలరాశి బయటికి వచ్చింది. మోటరు బిగించిన రోజు ఆ పెద్దమనిషి చిన్నపిల్లవాడే అయిపోయాడు. రెండించుల నీళ్లు నిరవధికంగా అరగంటపాటు బోరు పోస్తూనే ఉంది. బోరు నీళ్లు తలపై చల్లుకున్నాడు. ఆ క్షణంలో అక్కడ పనిచేస్తున్నవాళ్ల ముఖాల్లో ఒక్కసారిగా జీవకళ వచ్చేసింది. ఆనందంతో తబ్బిబ్బయిపోయాడు. అయినవాళ్లందరికీ ఫోన్లు చేసి చెప్పాడు. కొడుకు/బిడ్డ పుడితే కలిగే ఆనందమే ఆయనలో చూశాను. నీళ్లకు ఉన్న శక్తి అటువంటిది. ఆ నీటి విలువ తెలియకనే, ఆ నీటిని సాధించలేకనే, నీటిని పొదుపుకోలేకనే తెలంగాణ వెనుకబడిపోయింది.

నీటి వినియోగానికి సంబంధించి కూడా ఒక ప్రొటోకాల్ తయారు చేసుకోవలసిన అవసరం ఉంది. వ్యవసాయార్థిక శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఒక కిలో బియ్యం పండించడానికి ఉపయోగించే నీరు 2500 లీటర్లట. మొదటిసారిగా ఈ మాట విన్నప్పుడు గుండె గుభిళ్లుమన్నది. నమ్మబుద్ధి కాలేదు. మనం పంటలకు ఇంతగా నీటిని వినియోగిస్తున్నామా అనిపించింది. పంటలకే కాదు ఇంటిలో వినియోగించే నీటిపైనా దిగులు అనిపించింది. కొంతకాలం మగ్గునీరు చేతపట్టుకున్నప్పుడల్లా ఆ విషయం గుర్తుకు వస్తుండేది. వాస్తవికంగా కిలో బియ్యం పండించే నీటి ఖర్చు కాస్త ఎక్కువో తక్కువో ఉండవచ్చు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టయింది. మనం తింటున్న బువ్వ ఎంత విలువైనదో, మనం తాగుతున్న నీరు ఎంత విలువైనదో అర్థమయింది. వాటిని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో కూడా తెలుస్తున్నది.

అందుకే ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు తాగునీరు, సాగునీరు ప్రాజెక్టులపై అంతగా దృష్టిపెట్టడం. నీటి సమస్య ఆయనకు ఒక మనాది. ఉద్యమకాలంలోనూ, ముఖ్యమంత్రి అయిన తర్వాతా ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎంత మందితో ఈ అంశంపై చర్చించి ఉంటారో లెక్కలేదు. అర్ధరాత్రి అపరాత్రి గూగుల్ మ్యాప్‌లను శోధించుకుంటూ నీటి లభ్యతను, నదుల ప్రవాహగతులను, భూముల ఎత్తుపల్లాలను అధ్యయనం చేసిన ముఖ్యమంత్రి ఇంకొకరు ఉంటారనుకోను. కరెంటు ఇచ్చాము. ఇంకా బాగా ఇస్తాము సరే…నీళ్లు లేకపోతే కరెంటు ఏమి చేసుకోను? ఇప్పుడు ఆయనను తొలుస్తున్న ప్రశ్న. అందుకే ఆయన అధికారులను, ఇంజనీర్లను, కాంట్రాక్టర్లనూ ఉరుకులబెట్టిస్తున్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నీటిపారుదల ప్రాజెక్టులు ఇవి పరస్పర ఆధారితాలు. ఒకటి పూర్తయి ఒకటి ఆగిపోవడానికి వీలు లేని పరిస్థితి. ఏకకాలంలో అన్నీ పూర్తయితేనే సార్థకత. ఆశించిన లక్ష్యాలను సాధించడం సాధ్యమవుతుంది. ముఖ్యమంత్రి ప్రాథమిక లక్ష్యం తాగునీరు అందించడం. ఇంటింటికీ తాగునీరు అందించాలంటే మిషన్ భగీరథ పనులన్నీ అనుకున్న లక్ష్యాల ప్రకారం పూర్తికావాలి. ఇన్‌టేక్‌వెల్స్, పైపులైను వ్యవస్థ, ఇంటింటికీ నల్లాల వ్యవస్థ అంతా ఏర్పడుతుంది సరే… నీరు ఎక్కడి నుంచి రావాలి? నీరు రావాలంటే చెరువుల్లో నీరు సమృద్ధిగా ఉండాలి. నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి కావాలి. ఇంటేక్‌వెల్స్‌కు నీరందించే ప్రాజెక్టులు పూర్తి అయితేనే మిషన్ భగీరథకు సార్థకత. ఒక వేళ మిషన్ కాకతీయ విజయవంతంగా పూర్తయినా కాలం కాకపోతే నీటికి కటకట ఏర్పడుతున్నది. చెరువులు ఎండిపోతున్నాయి. బోర్లు ఎండిపోతున్నాయి. ఇందుకు ఈ ఏడాది మన రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యే ఉదాహరణ. ఇంత కరువు సంవత్సరంలో కూడా గోదావరి నది నుంచి 2500 టీఎంసీల నీరు బంగాళా ఖాతంలో కలిసిపోయింది. అరవయ్యేళ్ల సమైక్య పాలకుల నిర్వాకం గోదావరి నది నీటిని తెలంగాణకు మళ్లించే ప్రయత్నాలేవీ చేయకపోవడం. 2500 టీఎంసీల నీరు అంటే 5 కోట్ల 73 లక్షల ఎకరాల భూమిలో ఒక అడుగు మందం నీళ్లు మళ్లాడితే ఎంత నీరవుతుందో అంత నీరు. నీరు మళ్లించిన ఒకటి రెండు ప్రాజెక్టుల కింద ప్రజలకు కనీసం తాగునీరు లభిస్తున్నది. దేవాదుల ద్వారా ఇంత కరువు కాలంలో కూడా 40 చెరువుల దాకా నింపుకోలిగారు. జూరాల, నాగార్జున సాగర్, ఏఎంఆర్‌ల ద్వారా కూడా చెరువులు నింపుకునే అవకాశం ఉంది. కానీ నదుల్లో నీళ్లే లేవు. గోదావరిలో మనకు అటువంటి అవకాశం ఉంది. అందుకే ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒక ఎమర్జెన్సీగా ప్రకటించాలి. ముఖ్యమంత్రి డెడ్‌లైన్‌లు, ఇన్సెంటివ్‌లు, డిసెంటివ్‌లు అన్నీ చెబుతున్నారు. కానీ కాంట్రాక్టర్లు కొన్నేళ్లుగా పనులు సాగదీయడానికి అలవాటు పడిపోయారు. ఎస్కలేషన్ చార్జీలను అనుమతించడంతో ప్రాజెక్టు ఎంతకాలం నడిస్తే కాంట్రాక్టర్‌కు అంత ప్రయోజనం అన్నట్టుగా వ్యవహారం తయారైంది. కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని నియంత్రించే పరిస్థితులు నెలకొల్పిపోయారు మన పూర్వీకులు. ఇప్పుడు వాటిని రివర్సు చేయకపోతే తెలంగాణ నీటి సమస్యను ఇంకో పదేళ్లయినా పరిష్కరించుకోలేము.

నీటి వినియోగానికి సంబంధించి కూడా ఒక ప్రొటోకాల్ తయారు చేసుకోవలసిన అవసరం ఉంది. వ్యవసాయార్థిక శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఒక కిలో బియ్యం పండించడానికి ఉపయోగించే నీరు 2500 లీటర్లట. మొదటిసారిగా ఈ మాట విన్నప్పుడు గుండె గుభిళ్లుమన్నది. నమ్మబుద్ధి కాలేదు. మనం పంటలకు ఇంతగా నీటిని వినియోగిస్తున్నామా అనిపించింది. పంటలకే కాదు ఇంటిలో వినియోగించే నీటిపైనా దిగులు అనిపించింది. కొంతకాలం మగ్గునీరు చేతపట్టుకున్నప్పుడల్లా ఆ విషయం గుర్తుకు వస్తుండేది. వాస్తవికంగా కిలో బియ్యం పండించే నీటి ఖర్చు కాస్త ఎక్కువో తక్కువో ఉండవచ్చు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టయింది. మనం తింటున్న బువ్వ ఎంత విలువైనదో, మనం తాగుతున్న నీరు ఎంత విలువైనదో అర్థమయింది. వాటిని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో కూడా తెలుస్తున్నది. కాలమయిన సంవత్సరాల్లో చాలా ప్రాజెక్టుల కింద సీజను రాగానే కాలువలకు నీళ్లొదులుతారు. నీళ్ల వాడకంపై కూడా ఒక నియంత్రణ అంటూ ఏదీ ఉండదు. దీని పర్యవసానం ఏమంటే కాలువలను దాపుకుని ప్రవహించే వాగులన్నీ జాలు నీళ్లతో జీవనదుల్లా ప్రవహిస్తుంటాయి. కాలువల మొదట ఉన్నవాళ్లు మొత్తం భూమి సాగు చేసుకుంటారు. కాలువ చివరి భూములకు వచ్చేసరికి నీళ్లు తగినంతరావు. వచ్చినా కొద్దిపాటి భూమికి సరిపోతాయి. ఈ పరిస్థితి మారాలి. నీటి నియంత్రణ యంత్రాంగం మళ్లీ ఏర్పాటు చేయాలి. నీటిని ఎట్లాబడితే అట్లా ఎవరు పడితేవారు మళ్లించుకునే పరిస్థితి పోవాలి. ముందుగా కాలువల వెంట ఉన్న అన్ని చెరువులు, జలాశయాలు పూర్తి మట్టం నింపడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. తెలంగాణలో అడుగంటిపోయిన భూగర్భ జలాలను పునరుద్ధరించడానికి వరుసగా నాలుగైదేళ్లపాటు చెరువులకు నీరు పారించడం ఒక ఉద్యమంగా సాగాలి. చెరువులు, జలాశయాలుకు నీరు సరిపోయిన తర్వాతనే పొలాలకు నీరు మళ్లించే విధంగా రైతులను ఒప్పించాలి. నదిలో నీరు బాగా ప్రవహిస్తున్నప్పుడు కాలువలను పూర్తిగా చెరువులకోసమే పారిస్తే రెండు మూడు వారాల్లో అన్ని చెరువులూ నిండిపోతాయి. చెరువుల నీటిని వినియోగించడాన్ని కూడా కొంతకాలం నిషేధించాలి. తూములు కట్టేసి వీలైనన్ని ఎక్కువ రోజులు చెరువులో నీరుండే విధంగా చర్యలు తీసుకోవాలి. తద్వారా భగర్భ జలమట్టం గణనీయంగా పెరుగుతుంది. శాశ్వత ప్రాతిపదికన విధానాలను రూపొందించుకోకపోతే ఏ ఏడాదికాఏడాది ఆకాశానికి ఎదురు చూసే దుస్థితి వస్తూ ఉంటుంది.

బంగారు తెలంగాణ నిర్మించడం అంటే కొద్ది మంది శిఖరాలకు ఎదగడం కాదు, సమాజాన్ని రెక్కలకింద పొదుపుకుని మనతో సమానంగా తీసుకుపోవడం. కరెంటు, తాగునీరు, సాగునీరు అందిస్తే రైతు కంప్యూటర్ తెచ్చుకుంటాడు. పల్లెలన్నీ పట్టణాలవుతాయి. పల్లెలు స్వయం సమృద్ధిని సాధిస్తాయి. పట్టణాలకు వలసలు ఆగిపోతాయి. వ్యవసాయానికి కూడా ఆధునిక హంగులు అద్దాలి. పాలీ హౌజ్‌లు, పంటమార్పిడి విధానాలు, జీవరసాయన వ్యవసాయ పద్దతులు, ఆధునిక వ్యవసాయ పరికరాలు పల్లెలను చేరాలి. ఇప్పుడు అక్కడో ఇక్కడో కొద్ది మంది వివేకులు వ్యవసాయం చేసి విజయం సాధిస్తున్నారు. తగ్గువ నీటితో ఎక్కువ పంట, అధిక రాబడి సాధించే విధంగా వ్యవసాయాన్ని సంస్కరించుకోవాలి. నీరు తరిగేదే కానీ పెరిగేది కాదు. అందుకే తక్కువ నీటితో మనుగడ సాగించే జీవన పద్ధతులను అన్ని రంగాల్లో అలవర్చుకోవడం నేటి అవసరం.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

One thought on “జలమూలం ఇదం జగత్”

Comments are closed.