జగన్ పిచ్చి పనులు


andhra
అమరావతి నిర్మాణ శంకుస్తాపన ఉత్సవానికి దూరంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహనరెడ్డి తీసుకున్న నిర్ణయం ఆయన రాజకీయ అపరిణకు రుజువు. ఆయన ఏమీ మారలేదనీ, గత ఎన్నికల నుంచి ఆయన ఎటువంటి గుణ పాఠాలు నేర్చుకోలేదని ఆయన ఈ తాజా నిర్ణయం తెలియజేస్తున్నది.
రాజకీయాల్లో పట్టువిడుపులు ఉండాలి. ఇది ప్రజాస్వామిక రాజకీయాల యుగం. తెగే దాకా లాగే ప్రయత్నం చేయడం అవివేకం. ఐక్యత పోరాటం అనివార్యం. ఒక కొత్త రాష్ట్రం ఏర్పడి, ఒక అసాధారణమైన సవాలు రాష్ట్రం ఎదుర్కొంటున్నప్పుడు అనుసరించవలసిన పధ్ధతి ఇది కాదు.
ఇంత పెద్ద సవాలును అధిగమించేందుకు జరుగుతున్న ప్రయత్నాలనుంచి జగన్ తనను తానూ దూరం చేసుకున్నారు. రాజకీయాల్లోకనీస అనుభవం ఉన్నవారు ఎవరైనా నెపం చంద్రబాబుపై నెట్టేందుకు ప్రయత్నించేవారు. జగన్ ఇది వీరత్వం అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఇది రాజకీయ మూర్ఖత్వం. పిల్ల చేష్ట.
రాజధాని నిర్మాణం అనివార్యం. అత్యవసరం కూడా. చంద్రబాబు రాష్ట్రంకోసం, తన రాజకీయ మనుగడకోసం వేగవంతంగా రాజధాని నిర్మించక తప్పదు. వచ్చే మూడు ఏళ్ళలో ఆయన వీలైనంత ఎక్కువ నిర్మాణాలు పూర్తి చేయక తప్పదు. చేసే పట్టుదల చంద్రబాబుకు ఉంది. అక్రమాలు సక్రమాల గురించిన లెక్క తర్వాత, పని అయిందా లేదా అన్నదే ప్రజలు చూస్తారు.

జగన్ మూడేళ్ళ తర్వాత రాజకీయ ప్రయోజనాలు ఇప్పుడే ఆశించి డక్ అవుట్ అయ్యారు.
పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం చదవడం అజ్ఞానం అవుతుంది.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad