తెలంగాణ సోయి ఇంకెప్పుడొస్తుంది?


IMG_2684

స్వరాష్ట్రం దక్కించుకున్నా తెలంగాణ ఆత్మగౌరవంపై ఆధిపత్య శక్తుల దాడులు ఆగలేదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా తెల్లోడే నయం అన్నవాళ్లున్నారు. ఇప్పుడు కూడా రాజశేఖర్‌రెడ్డే నయం, చంద్రబాబే నయం అనే బానిస రాజకీయ సంతతి ఇంకా తెలంగాణలో కొనసాగుతున్నది. వీళ్లకు ఇంకా సొంత తెలివి రాలేదు. ఆత్మగౌరవ చైతన్యం అసలే లేదు. ఇంకా ఎవరో రాసిచ్చిన స్క్రిప్టులను చదవడమే. ఎవరో కీ ఇస్తే ఆడడమే. ఎవరో రెచ్చగొడితే వాగడమే. విచిత్రం ఏమంటే మోత్కుపల్లి, ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డి, ఒక పత్రికాధిపతి, ఒక మావోయిస్టు ప్రతినిధి, కొందరు బీజేపీ నేతలు అందరూ ఒకే బాణీలో ఒకే తీవ్రతలో మాట్లాడుతుండడం. వారికి మచ్చలు తప్ప చంద్రుడు కనిపించడం లేదు. తెలంగాణ సాధించుకుని మనం ఏమి ప్రయోజనం పొందామో వారు చూడదల్చుకోలేదు. మాట్లాడదల్చుకోలేదు. తెలంగాణ అంతా సాఫీగా జరిగిపోతుండడం చూసి వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అజీర్తితో అస్తమానం మీడియాముందు వాంతులు చేసుకుంటున్నారు. కొందరయితే తమ రాజకీయ సైజును మించి ఊహించుకుంటున్నారు, ఎట్లబడితే అట్ల మాట్లాడుతున్నారు. ఇందులో ఒకటే సూత్రం చంద్రబాబుకు అక్కడ ఏమి చేసినా ప్రతిష్ఠ పెరగడం లేదు. నేరుగా ప్రజలను ఆదుకునే పని ఏదీ జరగడం లేదు కూడా. రుణమాఫీ కంపుకంపు చేసి వదిలిపెట్టారు. డ్వాక్రా మహిళలను నట్టేట ముంచారు. అక్కడ రైతుల ఆత్మహత్యలు యథాతథం. పాత ప్రాజెక్టులతో మరోసారి శంకుస్థాపనలు చేయించడం తప్ప పారిశ్రామిక ప్రగతి కూడా గొప్పగా ముందుకు సాగడం లేదు. ఇంతకాలం ఆంధ్ర ఆదాయంతో తెలంగాణను పోషించినట్టుగా బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు తేలిపోయింది. ఆంధ్ర లోటు రాష్ట్రమని. ఆయనకు సమస్యలు తలెత్తడం సహజం. వాటిని ఎదుర్కోవడానికి ఎక్కడ కొట్లాడాలో అక్కడ కొట్లాడడం లేదు. వాటిని పరిష్కరించుకోవడానికి ఎక్కడ దృష్టిని కేంద్రీకరించుకోవాలో అక్కడ కేంద్రీకరించడం లేదు.

చంద్రబాబు తన ప్రాధాన్యం, తన ప్రాంతం అంధ్ర అని విభజనకు ముందే రుజువు చేసుకున్నారు. తెలంగాణలో ఇంక తనకేమీ మిగలదన్న చైతన్యం ఆయనకు అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది. ఇక్కడ ఈ మాత్రం ఎమ్మెల్యేలు గెలుస్తారని చంద్రబాబు కూడా ఊహించలేదు. ఇప్పుడు కూడా తెలంగాణ వ్యతిరేకతను ఆయన ఎప్పుడూ దాచుకోలేదు. దాచుకోలేడు. మన ప్రాజెక్టులను, మన ప్రయోజనాలను, మన కరెంటును, మన నిధులను అన్నీ కైంకర్యం చేయడానికి ఆయన ఎటువంటి దాపరికం లేకుండా వ్యవహరిస్తూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా ఆంధ్ర నాయకత్వంలోని పార్టీలో ఉండి, తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న పార్టీలో ఉండి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన నాయకులపై దాడి చేస్తున్నప్పుడు ఎవరికయినా కలిగే అనుమానమే ఇది.

అందుకే ఆయన పక్క రాష్ట్రంపై దృష్టిని మళ్లించారు. మనం పెరగకపోయినా పర్వాలేదు, పక్క వాడి ప్రతిష్ఠను తగ్గించాలి. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును బద్నాం చేయడం ఎలా అన్న అంశంపై ఆయన చాలా యాతన పడుతున్నాడు. మీకు తెలుసా వారు డెయిలీ వేజెస్ తీసుకుని మాట్లాడుతారు. ఏ రోజుకారోజే చంద్రబాబు దగ్గరికెళ్లి చెయ్యి చాపుతారు. చంద్రబాబు ఏమీ చెయ్యకపోతే నాలుగురోజులు మాటలు బందు. కూలీ ఇస్తేనే ప్రెస్ కాన్ఫరెన్సులు. చంద్రబాబు ఎంత డబ్బయినా ఖర్చు చేసి తెలంగాణలో దుకాణం కాపాడుకోవాలనుకుంటున్నాడు అని టీడీపీ వార్తలు రాసే ఒక జర్నలిస్టు చేసిన వ్యాఖ్య విన్నప్పుడు విస్మయం కలిగింది. అమర్యాదకరంగా అనిపించింది. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎవరికయినా అలా అనిపించే అవకాశం ఉంది. చంద్రబాబు తన ప్రాధాన్యం, తన ప్రాంతం అంధ్ర అని విభజనకు ముందే రుజువు చేసుకున్నారు. తెలంగాణలో ఇంక తనకేమీ మిగలదన్న చైతన్యం ఆయనకు అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది. ఇక్కడ ఈ మాత్రం ఎమ్మెల్యేలు గెలుస్తారని చంద్రబాబు కూడా ఊహించలేదు. ఇప్పుడు కూడా తెలంగాణ వ్యతిరేకతను ఆయన ఎప్పుడూ దాచుకోలేదు. దాచుకోలేడు. మన ప్రాజెక్టులను, మన ప్రయోజనాలను, మన కరెంటును, మన నిధులను అన్నీ కైంకర్యం చేయడానికి ఆయన ఎటువంటి దాపరికం లేకుండా వ్యవహరిస్తూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా ఆంధ్ర నాయకత్వంలోని పార్టీలో ఉండి, తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న పార్టీలో ఉండి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన నాయకులపై దాడి చేస్తున్నప్పుడు ఎవరికయినా కలిగే అనుమానమే ఇది. వీళ్లకు ఏమి ఖర్మవచ్చింది? ఎందుకిలా మాట్లాడుతున్నారు? తెలంగాణ సోయి ఎందుకు రాలేదు? అని ఎవరయినా ప్రశ్నిస్తారు.

తెలంగాణలో అసలు విమర్శ ఉండకూడదా అని కొందరు ప్రశిస్తున్నారు. ముఖ్యమంత్రిలో ప్రతికూలాంశాలు లేవా అని మరొకాయన ప్రశ్నించారు. విమర్శ ఉండాలి, విచక్షణ కూడా ఉండాలి. విమర్శ వినేవాళ్లకూ సహేతుకం అనిపించాలి. ఎవడో ఎక్కించిన కుళ్లును ఇక్కడ కుమ్మరించడం కాదు. ప్రతికూలాంశాలు మాట్లాడడానికి ఇంకా చాలా సమయం ఉంది. తెలంగాణ వచ్చిన పదిమాసాల్లో సాధించిన ఎన్నో మంచి పనుల గురించి ఎందుకు మాట్లాడరు? మన హక్కులను మనం ప్రకటించుకంటున్నాం. మన ప్రయోజనాలను మనం కాపాడుకుంటున్నాం. మన ప్రభుత్వం మన మనసుతో పనిచేస్తున్నది. అది ఎందుకు చూడడం లేదు? ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు సైతం మనం రాష్ట్రం చేస్తున్న మంచి పనులను, చేపట్టిన పథకాలను మెచ్చుకుంటున్నారు. మీరు అదృష్టవంతులు. మీకు మంచి ముఖ్యమంత్రి దొరికారు. రాష్ర్టానికి సంబంధించి ఆయనకున్న అవగాహన, ఆలోచనలు అద్భుతం. మీరు చేయవలసిందల్లా మరో పదేళ్లపాటు ఆయన చల్లగా ఉండేట్టు, అధికారంలో ఉండేట్టు చూసుకోవడమే అని ఢిల్లీ నుంచి వచ్చిన ఒక అత్యున్నత అధికారి ఇటీవల వరంగల్ పర్యటన సందర్భంగా జిల్లా అధికారులతో జరిగిన ఇష్టాగోష్టి సమావేశంలో చెప్పారు. చంద్రశేఖర్‌రావు అందరిలాగా అధికారం అనుభవించవచ్చు. కానీ ఆయన తెల్లవారుజామున రెండుగంటల దాకా ప్రాజెక్టుల గురించి శోధిస్తారు. నెట్ ప్రపంచంలో చొరబడి గూగుల్ మ్యాప్‌లను ముందేసుకుని తెలంగాణలో ఏ నీరు ఎటు ప్రవహిస్తుంది? ఏ ప్రాంతం సముద్రమట్టం నుంచి ఎంత ఎత్తున ఉంది? ఏ నది వెడల్పు ఎంత? ఎక్కడ ప్రాజెక్టులు కడితే ఎంత ప్రయోజనం? ఏ వాగులు ఎక్కడ ఉన్నాయి అని గంటల తరబడి చూస్తారు. ఆయన గూగుల్ చేసి, గుర్తులు పెట్టి, కాపీ చేసిన మ్యాపులు చూస్తే ఆయన పడుతున్న ఆరాటం, తపన ఎంతో తెలుస్తాయి. మ్యాపుల ముందు నిలబడి బడిపంతులులాగా తమ పార్టీ నాయకులందరికీ పాఠాలు చెబుతుంటే ఢిల్లీ అధికారులు చేసిన వ్యాఖ్యల్లోని సామంజస్యం అర్థమవుతుంది. కంప్యూటర్లు, ల్యాపుటాపులు, మొబైలు ఫోన్లు తెలుగు ప్రజలకు నేనే పరిచయం చేశానని చెబుతున్న నాయకులకు రాష్ట్రంలో ఏ నది ఎక్కడ, ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉందో తెలుసని అనుకోలేం.

నిన్నగాక మొన్న రాష్ట్రం వచ్చింది. కొత్తగా విద్యుత్ ఉత్పాదన ఏదీ ప్రారంభం కాలేదు. కేసీఆర్ చేతిలో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏదీ లేదు. కానీ ఆరు మాసాల్లోనే కరెంటు కోతలు లేని తెలంగాణను చూపించారు.

అంతేకాదు చంద్రశేఖర్‌రావు విద్యుత్ రంగంలో ప్రారంభించింది ఒక విప్లవమే. చంద్రబాబు అధికారంలోకి రాగానే పీపీఏలను తెచ్చాడు. ఇష్టారాజ్యంగా ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వ ధనాన్ని, భూములను దారాదత్తం చేసి కమిషన్లు నొక్కేసి విద్యుత్ ఉత్పాదన రంగం జుట్టును ప్రైవేటు పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టాడు. విద్యుత్ రంగంలో గవర్నమెంట్ టు గవర్నమెంటు(జీటుజీ) విధానాన్ని తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌దే. ఇప్పటివరకు రూపకల్పన చేసిన ప్రధాన విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టులన్నీ ప్రభుత్వ రంగ సంస్థల చేతుల్లోనే పెట్టారు. జెన్‌కో, సింగరేణి, ఎన్‌టిపీసీలు ఉత్పాదన చేస్తాయి. వాటికి అవసరమైన వ్యవస్థాపన యంత్రాలన్నీ బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించారు. చంద్రబాబు నుంచి ఇటువంటిది కలలోనైనా ఊహించగలమా? అన్నింటినీ మించి విద్యుత్ సరఫరాలో అంతరాయం రాకుండా ఆయన తీసుకున్న చర్యలు అసాధారణమైనవి. నిన్నగాక మొన్న రాష్ట్రం వచ్చింది. కొత్తగా విద్యుత్ ఉత్పాదన ఏదీ ప్రారంభం కాలేదు. కేసీఆర్ చేతిలో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏదీ లేదు. కానీ ఆరు మాసాల్లోనే కరెంటు కోతలు లేని తెలంగాణను చూపించారు. విద్యుత్ ఇవ్వగలిగితే గ్రామాల్లో రైతులకు ఎంత ఊరట లభిస్తుందో ఈ వేసవి అనుభవం చెబుతున్నది. ఈసారి ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంటు మోటార్లు పదేపదే కాలిపోవడాలు, సబ్ స్టేషన్ల చుట్టూ, మెకానిక్‌ల చుట్టూ తిరగడాలు బాగా తగ్గిపోయాయి. ఇది ఎలా సాధ్యమైంది? అంటే మన రాష్ట్రం, మన ముఖ్యమంత్రి, మన మనసుతో ఆలోచిస్తే మార్గం ఉంటుంటుదని ఆయన రుజువు చేశారు. ఇంకో విచిత్రం కూడా గమనించాలి. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను కరెంటు కోతలతో నరకయాతనకు గురి చేసిన ఆంధ్ర నాయకత్వం, విడిపోగానే ఆంధ్రలో 24 గంటల కరెంటు ఎలా ఇవ్వగలుతున్నారు? ఇప్పుడు ఆంధ్రలో 24 గంటలు కరెంటు ఇవ్వగలిగిన ప్రభువులు గతంలో తెలంగాణలో ఆరుగంటలు కరెంటు కూడా ఎందుకు ఇవ్వ లేకపోయారు? సమైక్యపాలనలో ఎండాకాలం రాకముందే జనవరిలోనే కరెంటుకోతలు మొదలయ్యేవి. జనవరిలో నగరాల్లో ఒక గంట కోతతో మొదలయి, మే వచ్చే సరికి నాలుగు గంటలు కోతలు విధించేవారు. రైతులనయితే పూర్తిగా గాలికి వదిలేసేవారు. మరి ఇప్పుడెలా సాధ్యమైంది? మనవాడైతే కడపంక్తిలో కూర్చున్నా పెడతాడని సామెత. పరాయివాడు ముందు వరుసలో కూర్చున్నా పెట్టడు. సమైక్య ముఖ్యమంత్రులు తెలంగాణకు ఎప్పుడూ పరాయివాళ్లే. కేసీఆర్ మన ముఖ్యమంత్రి, మనసు పెట్టి మన వాళ్లకు ఇబ్బంది రాకుండా చూడాలని తపించాడు కాబట్టి సాధ్యమైంది.

అదొక్కటే కాదు నాగార్జున సాగర్ ఎడమకాలువ నుంచి మన వాటా నీరు మనం తీసుకోగలిగామన్నా, రాజోలిబండ మళ్లింపు కాలువ నుంచి రబీలో కూడా మన వాటా తుంగభద్ర నీరు తెచ్చుకున్నామన్నా, తాగునీటి, సాగునీటి ప్రాజెక్టులను వేగిర పర్చామన్నా, మిషన్ కాకతీయను ఒక యజ్ఞంలా చేస్తున్నామన్నా తెలంగాణ చైతన్యం, అంకిత భావం కలిగిన మన నాయకులు ఉన్నారు కాబట్టే సాధ్యమయింది. సంక్షేమ పథకాల అమలులో కూడా తెలంగాణ ప్రభుత్వం పూర్తి మానవీయ దృక్పథంతో వ్యవహరించింది. అమలులో కొన్ని లోటుపాట్లు జరిగి ఉండవచ్చు. కానీ మునుపెన్నడూ లేనంత మందికి పింఛన్లు ఇస్తున్నారు. మునుపెన్నడూ ఖర్చు చేయనన్ని నిధులు సంక్షేమంపై పెడుతున్నారు. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు మంచి అన్నం పెట్టాలన్న ఆలోచన గతంలో ఎప్పుడయినా చేశారా? తెలంగాణ ఏర్పడి పది మాసాలే అవుతున్నది. అయినా ఒక గణనీయమైన, గుణాత్మకమైన మార్పును చూపించగలిగారు కేసీఆర్. అయినా తెలంగాణకు చేసుకోవాల్సిన మేలు ఇంకా చాలా చాలా ఉంది. అందుకు ఒక నిర్మాణాత్మక రాజకీయ వాతావరణం అవసరం. విధ్వంసకర రాజకీయాలు, ఉన్మాద దాడులు రాష్ర్టానికి మేలు చేయవు. అటువంటి శక్తులను తెలంగాణ సమాజం ఇప్పటికే నేలకేసి కొట్టింది. అయినా వారు మళ్లీ మళ్లీ వెర్రితలలు వేస్తూనే ఉన్నారు. కష్టపడి త్యాగాలు చేసి సాధించుకున్న రాష్ట్రం ఇటువంటి నక్కలను చూసి చలించదు. వారి కూతలను, రాతలను లెక్కపెట్టదు.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

2 thoughts on “తెలంగాణ సోయి ఇంకెప్పుడొస్తుంది?”

  1. చేదు నిజమా..కాదు..ఉగాది పఛ్డీ ;; నేరుగా ప్రజలను ఆదుకునే పని ఏదీ జరగడం లేదు కూడా. రుణమాఫీ కంపుకంపు చేసి వదిలిపెట్టారు. డ్వాక్రా మహిళలను నట్టేట ముంచారు. అక్కడ రైతుల ఆత్మహత్యలు యథాతథం. పాత ప్రాజెక్టులతో మరోసారి శంకుస్థాపనలు చేయించడం తప్ప పారిశ్రామిక ప్రగతి కూడా గొప్పగా ముందుకు సాగడం లేదు. ఇంతకాలం ఆంధ్ర ఆదాయంతో తెలంగాణను పోషించినట్టుగా బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు తేలిపోయింది. ఆంధ్ర లోటు రాష్ట్రమని. ఆయనకు సమస్యలు తలెత్తడం సహజం. వాటిని ఎదుర్కోవడానికి ఎక్కడ కొట్లాడాలో అక్కడ కొట్లాడడం లేదు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s