చెరువులతోపాటే ప్రాజెక్టులు

TEL_Major Irrigation ProjectsMap (1)

మిషన్ కాకతీయ విజవంతమయి చెరువుల పూడిక తీత పూర్తయినా తెలంగాణ పల్లెలకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందన్న ఆశలేదు. కాలమయితే పర్వాలేదు. కాలాలు కాకపోతే పరిస్థితి ఏమిటన్నదే ప్రశ్నార్థకం. ఇందుకు ఒకటే సమాధానం. తెలంగాణలో ఇప్పటివరకు ప్రారంభించిన నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ ఒక యజ్ఞంలా పూర్తి చేయడమే.

బహుశా 1976-77లలో అనుకుంటా. పదవ తరగతిలో ఉన్నా. ఇంటి గడపలో కూర్చుని చేపలు పట్టిన సందర్భం. ఆ ఏడాది భారీ వర్షాలు కురిశాయి. పది రోజులు సూర్యుడిని చూడలేదు. ఆకాశానికి చిల్లులు పడినట్టు నిరవధికంగా చినుకు పడుతూనే ఉంది. ముసురుపెట్టి, నల్లని మబ్బులు ఆకాశాన్ని కమ్మి పగటివేళ కూడా చిమ్మని చీకటి. చెరువులు వారం రోజులుగా అలుగులుపోస్తున్నాయి. కుక్కడం చెరువు నిండి నీరు వెనుకకు తంతున్నది. ఊరిపైన నల్లగుంట చెరువుదాకా ఎటు చూసినా నీరే. ఊళ్లో వీధులన్నీ ఏరుల్లా మారాయి. మా ఊరి నీళ్లన్నీ కుక్కడం చెరువుకు ప్రవహిస్తాయి. నల్లగుంట చెరువు తెగుతుందేమోనని అందరూ భయపడ్డారు. చెరువు తెగితే వరద మా ఊరు మీదే పడుతుంది. ఇంటి గడప ముందు మూడు మెట్లుంటే మొదటి మెట్టు మునిగి నీరు ప్రవహిస్తున్నది. అలా ప్రవహించబట్టి అది ఆరో రోజు. సరదాగా ఆడుకుంటూ చూస్తే చేపలు ఎగురుకుంటూ ఎదురెక్కుతున్నాయి. అవి కుక్కడం చెరువు నుంచి ఎదురెక్కుతున్నాయి. పదవరోజు తెరిపి నిచ్చిన తర్వాత చూస్తే పైన నల్లగుంట చెరువు, దిగువ పెద్దరెడ్డి చెరువు నిండు గర్భిణిలా ఉన్నాయి. పొలాలన్నీ జలాలతో నిండిపోయి కనుచూపు మేర పొలంగట్లు, భూమి కనిపించడం లేదు. మర్రిబావి, బుడిగెబావి, నల్లగుంటబావి, సౌటబావి, చిన సౌటబావి, చెర్లబావి, అలుగుబావి…ఒకటేమిటి బావులన్నీ పొంగిపొర్లుతున్నాయి. నల్లగుంట అలుగు వరదకు మా బావులతో సంబంధాలు తెగిపోయాయి. పెద్దరెడ్డి చెరువు అలుగు వరద వల్ల ఆవలిగట్టు పొలాలు, చెల్కలకు వెళ్లడం మానేశారు. ఉండబట్టలేక ఒక తాత అలుగువరదను దాటుకుని పొలం వద్దకు వెళ్లాలని ప్రయత్నించి కొట్టుకుపోయి ఎక్కడో ఒక తాటి చెట్టుకుని పట్టుకుని బతికిపోయాడు. ఈదులాగు ఉధృతంగా ప్రహించింది. నిజంగా అటువంటి సన్నివేశం మళ్లీ చూడలేదు. అంతగా కాలం మళ్లీ కాలేదు.

ఇంటి గడప ముందు మూడు మెట్లుంటే మొదటి మెట్టు మునిగి నీరు ప్రవహిస్తున్నది. అలా ప్రవహించబట్టి అది ఆరో రోజు. సరదాగా ఆడుకుంటూ చూస్తే చేపలు ఎగురుకుంటూ ఎదురెక్కుతున్నాయి. అవి కుక్కడం చెరువు నుంచి ఎదురెక్కుతున్నాయి. పదవరోజు తెరిపి నిచ్చిన తర్వాత చూస్తే పైన నల్లగుంట చెరువు, దిగువ పెద్దరెడ్డి చెరువు నిండు గర్భిణిలా ఉన్నాయి.

అప్పటికి నాకు గుర్తుకు ఉన్నమేరకు మా ఊళ్లలో భూముల స్వభావం వేరుగా ఉండేది. ప్రతి రైతుకు కొంత కంచె(అడవి వంటిదే) ఉండేది. వాటిల్లో రేగడి కంచె చాలా పెద్దగా ఉండేది. ఎండాకాలం వస్తే అందులో వేటకు వెళ్లేది. ప్రతికంచెలో పొదలు, సండ్రలే కాదు మోదుగులు, తుమ్మలు, చింతలు, వేపలు, మర్రి, జువ్వి చెట్లు ఉండేవి. నాకు తెలిసి మా ఊళ్లోనే 30-40 కంచెలు ఉండేవి. అంతేకాదు ప్రతిరైతుకు ఒక దొడ్డి పశువులు, దొడ్డి చుట్టూ వనం ఉండేది. పచ్చదనం ఉండేది. ఎండాకాలం వస్తే ఇంటింటికీ ఒక బండి కట్టుకుని ముందుగా చెరువు మట్టి తవ్వుకుపోయి చెల్కల్లో పొలాల్లో కుప్పలు కుప్పలుగా పోసి వచ్చేవాళ్లు. ఆ తర్వాత దొడ్డి మట్టిని బండ్లలో తోలుకుపోయి చెరువు మట్టి దిబ్బల మధ్య కుప్పలు పోసేవారు. రెంటినీ కలిపి దున్నితే పొలాలకు, చెల్కలకు ఎరువుల అవసరం ఉండేది కాదు. అప్పటికింకా బోర్లు వేసే అవకాశం రాలేదు. కానీ బోర్లు వేయడం వచ్చిన తర్వాత సహజంగానే రైతులు మరింత భూమిని సాగులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. క్రమంగా కంచెలు నశించిపోయాయి. బోర్లు పెరిగే కొద్దీ బావుల్లో నీరు తగ్గిపోతూ వచ్చింది. ఎండాకాలం వస్తే ఊరు చుట్టూ ఉన్న ఏడు బావులూ కలియదిరిగి ఈత కొట్టేవాళ్లం. పోటీలు పడి కామంచి కొట్టి బావుల అడుగుదాకా వెళ్లి వచ్చేవాళ్లం. అలా ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలూ ఉన్నాయి. కొందరు మిత్రులను కోల్పోయాం కూడా. 1985 నుంచి బావులలో నీరు అడుగంటి పోనారంభించింది. చెట్టూ చేమలు నశించాయి. కంచెలు చేలయ్యాయి. చాలా మంది పశువులను వదిలించుకున్నారు. దొడ్లు పడవపడిపోయాయి. చెట్లు కలపకోసం నరికేశారు. కోనసీమలో ఎటుచూసినా పచ్చదనం కనిపిస్తుందంటారే… అలా ఇక్కడ ఎటు చూసినా కిలోమీటర్ల కొద్దీ ఎర్ర చెల్క నేలలు కనిపిస్తాయిప్పుడు. ప్రకృతి విధ్వంసం, కరువు…ఒకదాని వెంట ఒకటి వచ్చాయి. ఏది ముందు ఏది వెనుక అన్న చర్చ అందరికీ తెలుసు.

ఇది ఒక ఊరి కథ కావచ్చు. కానీ చాలా ఊళ్లలో పరిస్థితి ఇదే. చెరువులు కుంచించుకుపోయాయి. రైతులు చెరువు మట్టిని పొలాలకు, చెల్కలకు తోలడం మానేశారు. పశువులు లేకపోవడంతో పెంటదిబ్బలు మాయమ్యాయి. ఎరువులకు అలవాటుపడిపోయారు. నిరంతరం ఏదో ఔషధాలు వాడే మనిషి ఎలా రోగనిరోధక శక్తిని కోల్పోతాడో, నిరంతరం ఎరువులు వాడే భూములూ అలాగే నిర్వీర్యమయి పోతాయి. చెరువు శిఖంలో భూములున్న రైతులు చెరువులోపలిదాకా సాగు చేసుకోవడం మొదలు పెట్టారు. తమ భూములను కాపాడుకోవడం కోసం చెరువులను తెగగొట్టడం, అలుగులను ధ్వంసం చేయడం, తూములను పీకేయడం వంటి పంచాయతీలు చాలా ఊళ్లలో చూశాం. ఇంకోవైపు చెరువులకు నీరు ప్రవహించే వాగులనూ, వంకలనూ(కాంటూర్లు) క్రమంగా పూడ్చేసి సాగులోకి తెచ్చారు. అసలే కాలం తక్కువ. వర్షాలు తక్కువ. దాంతో చెరువులకు నీరు రావడమే మానేసింది. అప్పుడో ఇప్పుడో కొద్దిపాటి నీరు వచ్చినా కుంచించుకుపోయిన చెరువుల్లో ఎక్కువ మోతాదులో నిలిచే పరిస్థితి లేదు. గత రెండు దశాబ్దాలుగా మా మండలమయితే కరువు మండలంగానే గుర్తింపు పొందుతున్నది. కరువు మండలాల సంఖ్య తెలంగాణలో చాలా ఎక్కువ. వర్షపాతం బాగా తక్కువగా ఉండడమే కరువు మండలాలుగా మారడానికి ప్రధాన కారణం. ఆదిలాబాద్ జిల్లా మొత్తం, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉత్తర ప్రాంతాల్లో తప్ప మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం కూడా నమోదు కావడం లేదు. మిషన్ కాకతీయ విజవంతమయి చెరువుల పూడిక తీత పూర్తయినా తెలంగాణ పల్లెలకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందన్న ఆశలేదు. కాలమయితే పర్వాలేదు. కాలాలు కాకపోతే పరిస్థితి ఏమిటన్నదే ప్రశ్నార్థకం. ఇందుకు ఒకటే సమాధానం. తెలంగాణలో ఇప్పటివరకు ప్రారంభించిన నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ ఒక యజ్ఞంలా పూర్తి చేయడమే. తెలంగాణాలో పెద్ద ఎత్తున కాలువలను తవ్వి పెట్టారు. శ్రీరాంసాగర్‌లో నీటి లభ్యతపై భరోసా లేకపోయినా వేల కోట్ల రూపాయల ఖర్చు చేసి కాకతీయ కాలువను 384 కిలోమీటర్ల పొడవున తవ్విపెట్టారు. ఆ కాలువకు అనుబంధంగా వందల కిలోమీటర్ల పొడవున ఉపకాలువలను కూడా తవ్వారు. కాకతీయ కాలువ సామర్థ్యాన్ని పెంచలేదు. మరో ప్రత్యామ్నాయ ప్రాజెక్టు నుంచి నీటిని అందించే ప్రయత్నమూ చేయలేదు. ఆ ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరయిపోయింది.

ఇలాగే వరద కాలువలు చాలా పొడవు తవ్వారు. మహబూబ్‌నగర్‌లో ఎత్తిపోతల హెడ్‌వర్క్స్ పూర్తి చేయకుండానే కాలవలయితే తవ్వుతూ పోయారు. కొన్ని చోట్ల నీళ్లొచ్చినా డిస్ట్రిబ్యూటరీల పని పూర్తి కాలేదు. మాధవరెడ్డి ప్రాజెక్టు కింద ఇంకా డిస్ట్రిబ్యూటరీలు పూర్తి కాలేదు. సాధారణంగా ఇప్పుడు డబ్బు ఖర్చు చేస్తే ఎప్పటికి ఆదాయం వస్తుందని అందరం లెక్కలు వేసుకుంటాం. ప్రభుత్వ సొమ్ము విషయంలో మాత్రం అటువంటి లెక్కలు ఏవీ వేస్తున్నట్టు కనిపించడం లేదు. నీటిపారుదల ప్రాజెక్టుల పరిస్థితి మరీ అన్యాయం. ప్రాజెక్టులను, కాలువలను పూర్తి చేసి, వాటిని గొలుసుకట్టు చెరువులకు అనుసంధానం చేసి వరుసగా మూడు నాలుగేళ్లు చెరువులను నింపితే తప్ప మళ్లీ ఊళ్లు కోల్పోయిన జవజీవాలను సంతరించుకోలేవు. ఇప్పటికే తవ్విన కాలువలకు అనుసంధానమై ఉన్న చెరువుల లెక్కలు తీయాలి. ఇంకా చెరువులను అనుసంధానం చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలి. కొన్ని చోట్ల కాలువల నీటిని మళ్లించి వాగులు, ఉపనదులను పునర్జీవింప జేయడంపై కూడా దృష్టిని కేంద్రీకరించాలి. ఈ వాగులు, ఉపనదుల కింద చాలా చెరువులు ఉన్నాయి. జలసాధన ఉద్యమంగా జరగాలి. కాలంకాకపోతే నదుల్లో నీళ్లు ఎలా వస్తాయి అని ఎవరయినా ప్రశ్నించవచ్చు. తెలంగాణలో కాలమయినా కాకపోయినా కృష్ణా, గోదావరి నదులకు వరదలు వస్తున్నాయి. శ్రీరాంసాగర్‌కు దిగువన గోదావరికి నీరు రాని సంవత్సరం లేదు. కాళేశ్వరం దిగువ నుంచి గోదావరి జీవనదే. గోదావరి ఉపనదులయిన ప్రాణహిత, ఇంద్రావతి నదుల్లో నీరు పుష్కలం. కృష్ణాలో తెలంగాణలో ఇంత కరువున్నా ఈసారి కూడా నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి నీటిని వదిలిపెట్టాల్సి వచ్చింది. కర్ణాటక, మహారాష్ట్రలలో విస్తరించి ఉన్న పశ్చిమ కనుమలు కృష్ణను బతికిస్తున్నాయి.

వరదలు వచ్చినప్పుడు అతితక్కువ కాలంలో వీలైనంత ఎక్కువ నీటిని ఈ కాలువలకు మళ్లించడం ఎలా అన్నదే ప్రధానమైన సమస్య. ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు అన్నింటినీ కలిపి ఆలోచిస్తే తప్ప తెలంగాణ తాగునీరు, సాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు.

అందుకే మిషన్ కాకతీయ ఎంత ముఖ్యమో నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడమూ అంతే ముఖ్యం. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీటిపారుదల ప్రాజెక్టులపై చేస్తున్న మేథోమధనం, ఇంజనీర్లను ఆగమేఘాలపై పరుగెత్తిస్తున్న తీరు భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగిస్తున్నది. ప్రాజెక్టులు కాంట్రాక్టర్లకోసం కాదు. ప్రజలకోసం. ప్రాజెక్టుల పనులను ఏళ్లతరబడి సాగదీయడం వల్ల ప్రజలకు, ప్రభుత్వానికి నష్టం. సాధ్యమైనంత త్వరితగతిన రైతుల పొలాలకు నీళ్లు మళ్లించడం లక్ష్యంగా పనులు జరగాలి అని ఇటీవల నీటిపారుదల ఇంజనీర్లు, అధికారులతో జరిగిన సమావేశంలో స్పష్టంగానే చెప్పారు. తెలంగాణ నీటిపారుదల ఇంజనీర్లు, పదవీవిరమణ చేసిన ఇంజనీర్లు కూడా అంకితభావంతో తెలంగాణ ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌పై పనిచేసుకుపోతున్నారు. ఎక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు నిర్మించడం కాకుండా ఎక్కువ నీటిని తీసుకునే విధంగా ప్రాజెక్టులను రూపొందించాలని ప్రయత్నిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులు అటువంటి భావన నుంచి రూపుదిద్దుకున్నవే. నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో వివిధ ప్రాజెక్టులకోసం విస్తృతంగా రకరకాల కాలువలు ఇప్పటికే తవ్వి ఉన్నాయి. ఇంకా కొన్ని కాలువలు నిర్మాణంలో ఉన్నాయి. వరదలు వచ్చినప్పుడు అతితక్కువ కాలంలో వీలైనంత ఎక్కువ నీటిని ఈ కాలువలకు మళ్లించడం ఎలా అన్నదే ప్రధానమైన సమస్య. ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు అన్నింటినీ కలిపి ఆలోచిస్తే తప్ప తెలంగాణ తాగునీరు, సాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు.

పాత భీమానే కొత్త పాలమూరు ప్రాజెక్టు

palamuru1

మూడు జిల్లాల రూపురేఖలు మార్చే పాలమూరు పథకం
పది లక్షల ఎకరాలకు నీరు,
ఏటా మూడు వేల కోట్ల పంట
నాలుగు ఉప నదులకు పునర్జన్మ
గ్రావిటీతో తరలింపు, లిఫ్టులతో రిజర్వాయర్లకు
మూడు లిఫ్టులు, మూడు రిజర్వాయర్లు
మూడు జిల్లాలు, పది లక్షల ఎకరాలు లక్ష్యం
కరువు జిల్లా రూపు రేఖలు మార్చనున్న ప్రాజెక్టు
నాలుగు ఉపనదులకు జాలుజలాలు

తెలంగాణ తనను తాను పునర్నిర్మించుకుంటున్నది. ఆరు దశాబ్దాలుగా కోల్పోయినవన్నీ వెతికి వెతికి పట్టుకుంటున్నది. దత్తపుత్రులు, ఉత్తపుత్రులు జార విడిచిన కోటి రతనాలను ఒకటొకటిగా ప్రోది చేసుకుంటున్నది. అలాంటి అమూల్య రత్నమే పాలమూరు ప్రాజెక్టు. వలసల శాపం నుంచి పాలమూరుకు విముక్తి కల్పించే వరప్రదాయని. ఒకనాటి భీమా ప్రాజెక్టు… ఇవాళ పాలమూరు ప్రాజెక్టు. సీఎం కేసీఆర్ 14 ఏండ్ల కలల పంట. కొండలు, అడవులు, సొరంగాలు చీల్చుకుని మూడు జిల్లాల్లో బీడు భూములను ముద్దాడే గంగమ్మ. 10 లక్షల ఎకరాల్లో ఏటా మూడు వేల కోట్ల రూపాయలు పండించే వరం. నాలుగు ఉపనదులకు పునర్జన్మ ప్రసాదించే యజ్ఞం. అపర భగీరథుడు కేసీఆర్ తలపెట్టిన గంగావతరణం!

సమైక్య రాష్ట్రం నిర్లక్ష్యం చేసిన భీమా ప్రాజెక్టునే ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించ తలపెట్టింది. భీమా ప్రాజెక్టుకు నాడు కేటాయించిన నీటినే నేడు పాలమూరు ప్రాజెక్టుకు ఉపయోగించుకోవాలని భావిస్తున్నది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలను సాగులోకి తేవడంతోపాటు దారి పొడవునా ఉన్న అన్ని గ్రామాలకు, హైదరాబాద్‌కు తాగునీరు అందించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టుకు 2014 ఆగస్టులోనే పాలనానుమతి ఇచ్చింది. సాధ్యమైనంత త్వరగా శంకుస్థాపన చేయాలని అందుకు అవసరమైన సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నీటిపారుదల ఇంజనీర్లను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల వ్యవసాయిక, ఆర్థిక రంగాల ముఖచిత్రం మారిపోతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అనుకున్న లక్ష్యాల మేరకు నీరందించగలిగితే ఏటా సుమారు 300- 500 కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణ రైతాంగానికి పంటల ద్వారా 3 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని వ్యవసాయ ఆర్థిక నిపుణుడు ఒకరు చెప్పారు. రిజర్వాయర్ల నిర్మాణంలో ముంపును తగ్గించే విధంగా ప్రణాళికలను రూపొందించడంతోపాటు, తప్పనిసరై భూములు నష్టపోయే రైతులకు కూడా ముందుగానే నష్టపరిహారం అందేవిధంగా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఇంజనీర్లను కోరారని తెలిసింది.

వరదనీటితోనే…
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చే ఇరవై ఐదు రోజుల కాలంలో 70 టీంఎంసీల వరద జలాలను తీసుకుని కోయిల్ సాగర్, గండీడ్ రిజర్వాయర్ల ద్వారా తెలంగాణలోనే ఎత్తైన ప్రాంతమైన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయరుకు నీటిని తీసుకురావాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. గత పద్నాలుగు సంవత్సరాల కాలంలో జూరాల ప్రాజెక్టు వద్ద నీటి ప్రవాహ లెక్కలను అధ్యయనం చేసి, ప్రతిఏటా 25 రోజులపాటు రోజుకు లక్ష క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తున్నట్టు ఇంజనీర్లు నిర్ధారణకు వచ్చారు. కోయిల్‌సాగర్ రిజర్వాయరును 76 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో, గండీడ్ రిజర్వాయరును 35 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మిస్తారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయరును 10 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తారు. జూరాల నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించి మూడు చోట్ల భారీ లిఫ్టులు ఏర్పాటు చేసి రిజర్వాయర్లను నింపుతారు. మూడు లిఫ్టులదాకా 56.6 కిలోమీటర్ల దూరం నీటిని తరలించాల్సి ఉండగా, అందులో 6.65 కిలోమీటర్ల దూరం మాత్రమే కాలువ(ఓపెన్ చానెల్) కాగా 50 కిలోమీటర్లు సొరంగం ద్వారానే నీటిని తీసుకురావలసి ఉంటుంది. ఈ కారణంగా భూసేకరణ కూడా తక్కువగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా మహబూబ్‌నగర్‌లో 7 లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 2.75 లక్షల ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 30 వేల ఎకరాలు సాగులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నది. వీలైనంత తక్కువ ముంపుతో సాధ్యమైనంత ఎక్కువ నీటి నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేసి లక్ష్యంగా పెట్టుకున్న పొలాలకు నీళ్లందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఇంజనీర్లకు లక్ష్య నిర్దేశం చేశారు.

palamuru
కోయిల్ సాగర్ దాకా గ్రావిటీ..
జూరాల రిజర్వాయరు వెనుక తట్టున ఉన్న నర్వ మండలంలోని అప్పంపల్లి సమీపం నుంచి గ్రావిటీ ద్వారానే నీటిని కోయిల్‌సాగర్ రిజర్వాయరు దిగువదాకా తరలిస్తారు. జూరాల రిజర్వాయరు నుంచి తొలి 5.3 కిలోమీటర్లు కాలువను తవ్వి అక్కడి నుంచి మరో 23 కిలోమీటర్లు సొరంగ మార్గం ద్వారా కోయిల్‌సాగర్ సమీపంలోని పంపుహౌజుదాకా నీరు వస్తుంది. ఈ పంపు హౌజు నుంచి 14 మోటార్లతో 150 మీటర్ల ఎత్తుకు లిఫ్టు చేసి కోయిల్‌సాగర్ రిజర్వాయరు నింపుతారు. ఒక్కొక్క మోటారు 160 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో 66 క్యూమెక్‌ల నీటిని లిఫ్టు చేస్తుంది. కోయిల్‌సాగర్ కుడి, ఎడమ కాలువల ద్వారా 1,45,230 ఎకరాలకు నీరందిస్తారు. కోయిల్‌సాగర్ రిజర్వాయరు నిర్మాణంలో ముంపు గ్రామాలు ఎక్కువగా ఉంటాయని తొలుత ఉంటుందని అంచనా వేసినప్పటికీ, ముంపును సాధ్యమనంత తగ్గించేందుకుగల అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఇంజనీర్లను తాజాగా ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

మూడు లిప్టులు..
కోయిల్‌సాగర్ రిజర్వాయరు వెనుక భాగంలో సూరారం గ్రామం నుంచి 850 మీటర్ల దూరం కాలువ ద్వారా నీటిని తరలించి అక్కడి నుంచి 11.2 కిలోమీటర్ల సొరంగమార్గం ద్వారా గండీడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు దిగువన నిర్మించే పంపుహౌజుకు మళ్లిస్తారు. అక్కడ ఒక్కొక్కటి 160 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు మోటార్ల ద్వారా 125 మీటర్ల ఎత్తు లిఫ్టు చేసి గండీడు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు నింపుతారు. ఈ మోటార్లు ఒక్కొక్కటి 82 క్యూమెక్‌ల నీటిని లిఫ్టు చేస్తాయి. ఈ రిజర్వాయరు కింద కుడి, ఎడమ కాలువల ద్వారా 3,23,447 ఎకరాలకు నీరందించాలని ప్రభుత్వం సంకల్పిస్తున్నది. గండీడు రిజర్వాయరు వెనుక భాగంలోని కుల్కచర్ల మండలం బండ ఎల్కచెర్ల నుంచి అర కిలోమీటరు దూరం కాలువ ద్వారా నీటిని తరలించి అక్కడి నుంచి 15.775 కిలోమీటర్ల సొరంగం ద్వారా కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయరు సమీపంలోని పంపుహౌజుదాకా నీటిని మళ్లిస్తారు. ఇక్కడ మూడో లిఫ్టును ఏర్పాటు చేసి 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు మోటార్ల ద్వారా 120 మీటర్ల ఎత్తున నిర్మించే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయరు నింపుతారు. అరవై రోజుల్లో 40 టీఎంసీల నీటిని లిఫ్టు చేసేందుకు వీలుగా ప్రణాళిక రూపొందించారు. ఈ రిజర్వాయరు నుంచి కూడా కుడి ఎడమ కాలువలు నిర్మించి 5,31,323 ఎకరాలు సాగులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నది.

ఉప నదులకు జాలుజలాలు
మొత్తం మూడు లిఫ్టుల్లో ఏర్పాటు చేసే 22 మోటార్ల స్థాపన సామర్థ్యం 3280 మెగావాట్లు కాగా ఉపయోగించేది మాత్రం 2555 మెగావాట్లు మాత్రమే. అంటే ప్రతి ఏటా ప్రాజెక్టు మీద ఖర్చయ్యే కరెంటు 2216 మిలియన్ యూనిట్లు. కేపీ లక్ష్మీదేవి పల్లి తెలంగాణలోనే ఎత్తైన ప్రాంతంగా భావిస్తున్నారు. సముద్రమట్టం నుంచి 675 మీటర్ల ఎత్తున ఉండే ఈ రిజర్వాయరు నుంచి ఎక్కడికయినా నీటిని తీసుకునే వీలుంది. ఈ ప్రాజెక్టుల కింద సాగయ్యే భూముల జాలు నీటితో డిండి, ఈసీ, కాగ్నా నదులను, పెద్దవాగును కూడా పునర్జీవింప(రీజనరేట్) జేయవచ్చునని ఇంజనీర్లు సూచిస్తున్నారు. గండీడు రిజర్వాయరును ఆనుకుని ఉన్న కొండలకు తూర్పు వైపు నుంచి డిండి నది పాయలు మొదలవుతాయి. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయరుకు సమీపంలోని ఈశాన్య గ్రామాల నుంచి హిమాయత్‌సాగర్‌కు ప్రవహించే ఈసీ నది పాయలు మొదలవుతాయి. లక్ష్మీదేవిపల్లి వెస్ట్ మెయిన్ కాలువ దిగువ నుంచి భీమా ఉపనది కాగ్నా పాయలు మొదలవుతాయి. ఈ ప్రాజెక్టు విజయవంతమయితే మహబూబ్‌నగర్ ఎగువ మండలాలు, దక్షిణ రంగారెడ్డి మండలాలు సస్యశ్యామలం కావడంతోపాటు జిల్లాల్లోని ఉపనదులు, వాగులు, వంకలు పునర్జీవం పొందుతాయని అధికారుల విశ్వాసం. గండీడు నుంచి 18 కిలోమీటర్లు సొరంగం తవ్వగలిగితే డిండి నదిని కూడా పూర్తిస్థాయిలో తిరిగి పునరుజ్జీవింప జేయవచ్చునని నీటిపారుదల ఇంజనీర్లు సూచిస్తున్నారు.

ఏ జిల్లాకు ఎంతెంత లబ్ది..
ఈ పథకం వల్ల మహబూబ్‌నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 2 లక్షల 70 వేల ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజవకర్గ పరిధిలోని అచ్చంపేట, నాగర్‌కర్నూలు, జడ్చర్ల, కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు, మహబూబ్‌నగర్ లోక్‌సభ పరిధిలో కోడంగల్, మహబూబ్‌నగర్, మక్తల్, దేవరకద్ర, నారాయణపేట, షాద్‌నగర్, వనపర్తి నియోజకవర్గాలు, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని చేవెళ్ల, ఇబ్రహింపట్నం, మహేశ్వరం, పరిగి, తాండూరు, వికారాబాద్ , నల్లగొండ లోక్‌సభ పరిధిలోని దేవరకొండ, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని భూములకు సాగునీరు అందుతుంది.
మండలాల వారీగా ఆయకట్టు వివరాలు
————————————————————————-
అసెంబ్లీ నియోజకవర్గం – మండలం – సాగులోకి రానున్న ఆయకట్టు(ఎకరాల్లో)
————————————————————————–
మహబూబ్‌నగర్ జిల్లా
————————————————————————–
అచంపేట – వంగూర్ – 1,727
దేవరకద్ర – అడ్డాకుల – 26,560
– బూత్‌పూర్ – 25,188
– దేవరకద్ర – 10,788
– కొత్తకోట – 1,017
జడ్చర్ల – బాలానగర్ – 41,889
– జడ్చర్ల – 37,510
– మిడ్జిల్ – 44,176
– నవాబుపేట – 25,084
కల్వకుర్తి – ఆమనగల్ – 15,823
– కల్వకుర్తి – 15,188
– మాడ్గుల – 5,903
– తలకొండపల్లె – 39,080
– వెల్దండ – 18,997
కొడంగల్ – బోంరాస్‌పేట్ – 23,633
– దౌల్తాబాద్ – 18,122
– కొడంగల్ – 18,409
– కోస్గి – 25,205
– మద్దూర్ – 22,757
మహబూబ్‌నగర్ – హన్వాడ – 18,237
– మహబూబ్‌నగర్ – 8,860
మక్తల్ – మంగనూర్ – 283
– మక్తల్ – 20,069
– నర్వ – 6,322
– ఊట్కూర్ – 39,888
నాగర్‌కర్నల్ – బిజినేపల్లి – 9,780
– తాండూర్ – 3,490
– తిమ్మాజిపేట్ – 19,066
నారాయణ్‌పేట్ – దామరగిద్ద – 9,041
– ధన్వాడ – 8,278
– కోయల్‌కొండ – 12,686
– నారాయణ్‌పేట్ – 21,315
షాద్‌నగర్ – ఫారూక్‌నగర్ – 22,512
– ఖాసీంపేట్ – 18,927
– కొందుర్గ్ – 14,566
వనపర్తి – ఘన్‌పూర్ – 20,043
– గోపాల్‌పేట – 3,030
– పెద్దమందాడి – 20,471
– వనపర్తి – 6,080
———————————————————————
మొత్తం -7,00,000
———————————————————————–
రంగారెడ్డి జిల్లా
———————————————————————————–
చేవెళ్ల – చేవెళ్ల – 1,507
– షాబాద్ – 267
– నవాబ్‌పేట్ – 4,083
– శంకర్‌పల్లి – 630
ఇబ్రహీంపట్నం – యాచారం – 17,809
మహేశ్వరం – కందుకూర్ – 5,505
పరిగి – దోమ – 18,462
– గండీడ్ – 21,596
– కుల్కచర్ల – 13,407
– పరిగి – 20,343
– పూడూర్ – 14,378
తాండూర్ – బషీరాబాద్ – 27,430
– పెద్దేమూల్ – 19,529
– తాండూర్ – 29,074
– యాలాల్ – 22,745
వికారాబాద్ – బట్వారం – 15,087
– ధరూర్ – 20,378
– మర్పల్లి – 5,665
– మోమీన్‌పేట్ – 548
– వికారాబాద్ – 11,557
——————————————————————————
మొత్తం -2,70,000
——————————————————————————-
నల్లొండ జిల్లా
——————————————————————————-
దేవరకొండ – చింతపల్లి – 7,129
– డిండి ఫీడింగ్ – 20,000
మునుగోడు – మర్రిగూడ – 2,871
——————————————————————————-
మొత్తం: – 30,000
——————————————————————————–

ప్రత్యేక రాష్ట్రం వల్లే సాధ్యమైంది
ప్రత్యేక రాష్ట్రం వల్లనే ఈ ప్రాజెక్టు సాధ్యపడుతున్నది. హైదరాబాద్ రాష్ర్టాన్ని విడగొట్టిన నాడే మహబూబ్‌నగర్ జిల్లా లక్షల ఎకరాలు సాగునీరు కోల్పోయింది. జిల్లాలో 35 లక్షల ఎకరాలు సాగుయోగ్యమైనా, ఇప్పటికీ అన్ని ప్రాజెక్టులు కలిపి 15 లక్షల ఎకరాలు కూడా సాగు కావడం లేదు. ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది కాబట్టే ఈ ప్రాజెక్టు వెలుగులోకి వచ్చింది. లేదంటే కాగితాలకే పరిమితం అయ్యేది
-మేరెడ్డి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి (తెలంగాణ రిటైర్డు ఇంజినీర్ల ఫోరం ప్రధాన కార్యదర్శి)

నీళ్లు నిల్వ చేసుకునే అవకాశముంది
ప్రకాశం బ్యారేజీ నుంచి ప్రతి సంవత్సరం సగటున 500 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నది. ఆ నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం, సమర్థత మన జిల్లాలకే ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో కరువు, వలసల నివారణ జరగాలంటే, సాగు పెరగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఈ జిల్లా అభివృద్ధి పట్ల ఎంతో పట్టుదలగా ఉన్నారు.
– ఖగేందర్ (మహబూబ్‌నగర్ చీఫ్ ఇంజినీర్)

బిరబిరా కృష్ణమ్మ తరలిపోయిన కథ!

Bheema Project
ఆంధ్రలో నిండిన రిజర్వాయర్లు.. పండిన పంటలు
తెలంగాణలో ఎండిన పొలాలు.. ఫ్లోరైడ్ భూతం పీడ
పాతిక లక్షల ఎకరాలకు పారాల్సిన కృష్ణమ్మ
ఏడు లక్షల ఎకరాలకు నీరదటమే గగనం
కుంట పొలాన్నీ తడుపని శ్రీశైలం జలాలు
భీమా ధీమా దక్కని పాలమూరు పొలాలు
నీళ్లు దోచుకుపోతున్న పోతిరెడ్డిపాడు
ఇంకా కుంటి నడకనే శ్రీశైలం ఎడమ కాలువ
లక్షల కోట్లలో నష్టపోయిన తెలంగాణ రైతు
కృష్ణమ్మనుంచి మన వాటా ప్రతి చుక్క రావాల్సిందే

ఒక అన్యాయం మూడు జిల్లాలు వట్టిపోయేలా చేసింది! పనిగట్టుకుని రచించిన ఒక పథకం.. న్యాయంగా దక్కాల్సిన ప్రాజెక్టులను తెలంగాణకు కాకుండా చేసింది! కరడుగట్టిన వివక్ష.. ఒక జిల్లాను తరతరాలు పీడించే ఫ్లోరైడ్ రక్కసి కోరల మధ్యకు నిర్దాక్షిణ్యంగా విసిరిపారేసింది! సమైక్య పాలకుల పట్టరానితనం.. దేశంలో ఎక్కడా లేని స్థాయిలో ఒక జిల్లాకు జిల్లానే వలసబాట పట్టించింది! కృష్ణానదిపై నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు కబ్జా కథ చదివాం! ఇది ఆ కబ్జా నేపథ్యంలో శ్రీశైలానికి ఇవతలివైపున తెలంగాణలో తలెత్తిన మహా మానవ సంక్షోభానికి మచ్చుతునకలివి! గండికొట్టుకుని మరీ తరలించుకుపోయిన నీటితో ఆంధ్ర రిజర్వాయర్లు నిండి.. అక్కడ పంటలు పండితే తెలంగాణ పొలాలు ఎండిపోయాయి! కృష్ణా జలాలపై ప్రథమ హక్కులుండి.. హక్కు ప్రకారమే కనీసం పాతిక లక్షల ఎకరాలను తడపాల్సిన జలాలు.. ఏడు లక్షల ఎకరాలను తడిపేసరికే డస్సిపోతున్నాయి! ఇది దగా పడ్డ తెలంగాణ కథ! బిరబిరా తరలిపోతున్న కృష్ణమ్మను చూసి తెల్లబోయి కూర్చున్న తెలంగాణ పొలాల వ్యథ! ఒక టీఎంసీ నుంచి కోటి రూపాయల పంట పండుతుందని అంచనా! అంటే ఈ లెక్కన ఐదున్నర దశాబ్దాల్లో తెలంగాణ రైతు నష్టపోయింది లక్షల కోట్లు! అంతటి ఆదాయం మహబూబ్‌నగర్ పంచుకుని ఉంటే మరో కోనసీమ కాకపోయేనా! అందులో కనీసవాటా పొందగలిగితే నల్లగొండను ఫ్లోరైడ్ పట్టి పీడించేదా? ఇప్పుడు ఇదే ప్రశ్న! కృష్ణా జలాల్లో రాష్ర్టానికి రావాల్సిన ప్రతి చుక్క నీటినీ సాధించాల్సిందేనన్నది దీటైన జవాబు!!

సమైక్యపాలకుల మోసానికి కృష్ణానదికి ఇవతలివైపున తెలంగాణలో మహా విధ్వంసమే చోటు చేసుకుంది. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు ఒట్టిపోయాయి. మహబూబ్‌నగర్ ఏకంగా ఎడారిగా మారే పరిస్థితులు దాపురించాయి. తాగునీరు, సాగునీరు లభించక లక్షలాదిమంది జనం వలసపోవలసి వచ్చింది. నల్లగొండ పశ్చిమ మండలాల ప్రజలు ఫ్లోరైడ్ భూతానికి బలికావలసి వచ్చింది. ఎందుకిలా జరిగింది? తలాపున కృష్ణా నది పారుతున్నా ఎందుకు నీటికోసం అలో రామచంద్రా అని అలమటించవలసి వచ్చింది? కృష్ణానది నుంచి హంద్రీ-నీవా ద్వారా ఎక్కడో 610 కిలోమీటర్ల దూరంలోని పలమనేరుకు నీరు తీసుకుపోవడానికి ప్రణాళికలు వేసిన సమైక్య పాలకులు పక్కనే ఉన్న పాలమూరును ఎందుకు వదిలేశారు? ఎందుకంటే వారెవరికీ తెలంగాణ ఆత్మ లేదుకాబట్టి. కృష్ణా నీటిపై తెలంగాణకు ప్రథమ హక్కులు ఉన్నాయన్నది వారెవరూ గుర్తించదల్చుకోలేదుకాబట్టి! తెలంగాణ ఏమైనా ఫర్వాలేదు కానీ.. వాళ్ల రిజర్వాయర్లు నిండితే చాలు.. వాళ్ల పొలాలు పండితే చాలు! పాలించే ఏ సీమాంధ్రుడైనా.. లక్ష్యం ఇదే! అక్కడే తెలంగాణకు కృష్ణమ్మను కాకుండా చేసేందుకు కుట్ర మొదలైంది. ఆ కుట్ర ఒక్కసారి.. ఒక్కరోజుది జరిగింది కాదు. కలిసిన తొలిరోజు నుంచే ఒక పద్ధతి ప్రకారం తమ కుట్రను అమలు చేస్తూ వచ్చారు. హైదరాబాద్ రాష్ట్రంలో రూపుదిద్దుకున్న ఎగువ కృష్ణా, భీమా, నందికొండ ప్రాజెక్టులు సమైక్య రాష్ట్రం కారణంగా స్థలం మారి, రూపు మారి, ఆయకట్టు తగ్గిపోయి కొరగాని ప్రాజెక్టులుగా మిగిలిపోయాయి. రెండు దశాబ్దాలుగా సీమలో పారుతున్న శ్రీశైలం ప్రాజెక్టు జలాలు ఇప్పటికీ తెలంగాణ పొలాలను తడుపలేదు.

25లక్షలు సాగులోకి వచ్చి ఉండాలి
బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా నదిలో తెలంగాణ వాటా 298 టీఎంసీలుగా తేల్చింది. అంటే అంత నీరు ఉపయోగించుకుంటే మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కనీసం 25 లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చి ఉండాలి. ఈ ఐదు దశాబ్దాల్లో నాలుగు జిల్లాల్లో కలిపి సాగులోకి వచ్చింది నికరంగా 7 లక్షల ఎకరాలు మాత్రమే. తాజాగా బ్రజేష్ మిశ్రా ట్రిబ్యునల్ మరోసారి సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు 190 టీఎంసీలు అదనంగా కేటాయించింది. గతంలో బచావత్ కేటాయించిన 811 టీఎంసీలను బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 1001 టీఎంసీలకు పెంచుతూ నివేదిక ఇచ్చింది. పరివాహక నియమాల ప్రకారం మన రాష్ట్ర నీటి వాటా తేల్చాలని మన రాష్ట్రం ఇప్పుడు న్యాయపోరాటం చేస్తున్నది. అదనపు కేటాయింపుల్లో ప్రధాన వాటా మన రాష్ర్టానికే దక్కాలి. మొత్తంగా కనీసం 400 టీఎంసీలు తెలంగాణకు రావాలి. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌లకు తాగునీరు అందించడంతోపాటు 30 లక్షల ఎకరాలకు అవసరమైన సాగునీటిని కృష్ణానుంచే తీసుకోవాలి. కృష్ణానదిలో నీళ్లు లేవన్నది బూటకం. 2010-11లో 402.78 టీఎంసీలు, 2011-12లో 209.07 టీఎంసీలు, 2012-13లో 55.58 టీఎంసీలు, 2013-14లో 433 టీఎంసీలు బంగాళఖాతం పాలయ్యాయి. మనం కరువు సంవత్సరంగా భావిస్తున్న ఈ సంవత్సరంలో కూడా 74.33 టీఎంసీలు బంగాళాఖాతంలో కలిశాయి. ఇవన్నీ అధికారిక లెక్కలే. కృష్ణాలో నీళ్లు లేవన్నది కేవలం తెలంగాణ ప్రజలను మాయం చేయడంకోసమే.
ప్రాజెక్టులే తరలిపోయాయి
సమైక్యపాలనలో తెలంగాణ ఎంతగా నష్టపోయిందంటే.. 10 లక్షల ఎకరాలను సాగులోకి తేవడానికి ఉద్దేశించిన నందికొండ ప్రాజెక్టు కాస్తా నాగార్జునసాగర్ అయింది. రెండు ప్రాంతాలకు సమానంగా 132 టీఎంసీలు ఇవ్వాలన్న పథకాన్ని కాస్తా మార్చి ఎడమకాలువ కింద కూడా సుమారు 37 టీఎంసీలను కృష్ణాజిల్లా ఆయకట్టుకు మళ్లించారు. తెలంగాణలో ఆయకట్టును తొలుత 7.9 లక్షల ఎకరాలుగా నిర్ణయించి, ఆ తర్వాత 6.65 లక్షల (నల్లగొండ జిల్లా 3.88 లక్షలు, ఖమ్మం జిల్లా 2.77 లక్షలు) ఎకరాలకు కుదించారు. నందికొండ గ్రామానికి ఎగువన నిర్మించవలసిన ప్రాజెక్టును నందికొండ దిగువకు దింపి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు అన్యాయంచేశారు. వాస్తవికంగా రెండుజిల్లాల్లో కలిపి ఇప్పుడు 5 లక్షల ఎకరాలకు మాత్రమే నీరందుతున్నది. రెండు పంటలకూ కలిపి 13 లక్షల ఎకరాలు సాగు కావలసిన నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కేవలం ఖరీఫ్ 5 లక్షలు, రబీ రెండు లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతున్నది. గ్రావిటీద్వారా మమబూబ్‌నగర్‌కు నీళ్లు ఇవ్వాల్సిన ఎగువ కృష్ణ ప్రాజెక్టు (ఆ పేరుతో వచ్చినవే ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు) మనకు కాకుండాపోయింది. ఎప్పుడో 1937లోనే రూపకల్పన చేసిన భీమా ప్రాజెక్టు కూడా మనకు దక్కలేదు. భీమా, ఎగువ కృష్ణా ప్రాజెక్టులు పూర్తయి, వాటిపై మన నీటి హక్కులను అప్పుడే సాధించుకుని ఉంటే ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే 5.5 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చి ఉండేది. ఈ రెండు ప్రాజెక్టులూ నిర్మించ తలపెట్టిన నదీప్రాంతాలు రెండూ ప్రతి ఏటా తప్పనిసరిగా విరివిగా నీరు లభించే ప్రాంతాలు.

మనకు కాకుండా పోయిన భీమా
భీమా ప్రాజెక్టు నిర్మాణాన్ని అనేక ప్రాంతాలను పరిశీలించిన తర్వాత యాద్గిర్ సమీపంలోని తంగడి వద్ద 6.66 కోట్లతో చేపట్టాలని అప్పటి నీటిపారుదల ఇంజినీర్లు నిజాం ప్రభుత్వానికి నివేదించారు. తంగడి వద్ద ఏ సంవత్సరమైనా సగటున 243 టీఎంసీల నీరు లభిస్తుందని నీటిపారుదల ఇంజినీర్లు అంచనాలు వేశారు. అయితే ఆ ప్రాజెక్టు ఆచరణకు నోచుకోలేదు. ఆ తర్వాత హైదరాబాద్ ప్రభుత్వం మరోసారి అధ్యయనంచేసి ప్రాజెక్టును తంగడి వద్దే నిర్మించాలని, 107 టీఎంసీల నీటిని ఉపయోగంలోకి తేవాలని భావించింది. 29.8 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యంతో 6.79 కిలోమీటర్ల పొడవు ఆనకట్టతో రిజర్వాయరును నిర్మించాలని, 241 కిలోమీటర్ల పొడవున కాలువ నిర్మించి 5,98,579 ఎకరాల భూమిని సాగులోకి తేవాలని అప్పటి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అంతేకాదు ఈ ప్రాజెక్టుపై ఎడమ కాలువను ఒక్కదానినే నిర్మించాలని, కుడివైపున ఉన్న భూభాగాలకు ఎగువ కృష్ణా ప్రాజెక్టు కుడికాలువ నుంచి నీరు ఇవ్వవచ్చునని కూడా ఈ ప్రాజెక్టు నివేదికలో పేర్కొన్నారు. ఎగువ కృష్ణా ప్రాజెక్టు ద్వారా అప్పటి గుల్బర్గా, రాయచూర్, బీజాపూర్ జిల్లాలకు సాగునీరు అందించడంతోపాటు అలంపురం, గద్వాల తాలుకాల్లో 54 టీఎంసీల నీటితో 1.50 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తేవాలని హైదరాబాద్ రాష్ట్రం సంకల్పించింది. 1951లో జరిగిన ఇంటర్ స్టేట్ కాన్ఫరెన్సులో ఈ మేరకు అంగీకారం కూడా కుదిరింది. కానీ 1956 రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ తెలంగాణ తలరాతను తిరగరాసింది. ఎగువ కృష్ణా ప్రాజెక్టు స్థలం కర్ణాటకలో కలసిపోవడంతో వారు ప్రాజెక్టు రూపురేఖలు మార్చేశారు. కనీసం భీమా ప్రాజెక్టు అయినా పూర్తి చేస్తారని తెలంగాణ ప్రాంతవాసులు ఆశించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా ప్రజాపనుల విభాగం(పీడబ్ల్యూడీ) భీమా ప్రాజెక్టుపై ఒక నివేదికను తయారు చేసి అప్పటి నీలం సంజీవరెడ్డి ప్రభుత్వానికి సమర్పించింది. ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని కోరింది. ఈ ప్రాజెక్టును ఐదేండ్లలో పూర్తి చేయవచ్చునని, ఈ ప్రాజెక్టువల్ల కరువు పీడిత మహబూబ్‌నగర్ దశ-దిశ మారిపోతుందని సూచించింది. సీజనుకు 3 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పండింవచ్చునని, ఎకరా పొలం సాగుకు అయ్యే నీటి ఖర్చు 15 రూపాయలుంటుందని, ఎకరా చెరకు పండించడానికయ్యే నీటి ఖర్చు 22.50 రూపాయలు మాత్రమేనని ఆ నివేదిక పేర్కొంది. ఈ ప్రాజెక్టు జిల్లా ప్రజల జీవితాలను మార్చివేస్తుందని, ఆర్థికంగా సంపద్వంతం చేస్తుందని ఆ నివేదిక సూచించింది. ఈ ప్రాజెక్టు నిర్మించే స్థలం యాద్గిర్‌కు సమీపంలోని తంగడి కన్నడ ప్రాంతంలో ఉన్నా 80 శాతం భూమి మహబూబ్‌నగర్ జిల్లాలోనే సాగులోకి వచ్చేది. మక్తల్ నుంచి కొల్లాపురం వరకు 4 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేది. ఆ ప్రాజెక్టులేవీ చేపట్టలేదు. మహబూబ్‌నగర్‌కు దక్కాల్సిన సుమారు 150 టీఎంసీల నీరు(భీమా నుంచి 100 టీఎంసీలు, ఎగువ కృష్ణ నుంచి 50 టీఎంసీలు) సమైక్య పాలన నిర్వాకం వల్ల చేజారిపోయాయి. అప్పట్లో ప్రాజెక్టులు చేపట్టకపోవడం వల్ల ఆ తర్వాత ట్రిబ్యునళ్లలో నీటి కేటాయింపులు జరుగలేదు.

జూరాలకు మాత్రం 17.84 టీఎంసీలు, రాజోలిబండకు 15.9 టీఎంసీలను కేటాయించారు. జూరాలకింద సాగు లక్ష్యం లక్ష ఎకరాలు మాత్రమే. రాజోలిబండ మళ్లింపు కాలువ కింద 87400 ఎకరాలు సాగు చేసుకునే అవకాశం ఉన్నా రాయలసీమ నేతల దౌర్జన్యాల కారణంగా ఏ సంవత్సరమూ 25000 ఎకరాలకు మించి సాగుచేసుకోలేని దుస్థితి ఏర్పడింది. రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం శ్రీశైలం వద్ద తాను చేస్తున్న అక్రమాలనుంచి దృష్టి మళ్లించడానికి కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలు ప్రారంభించింది. కల్వకుర్తి కింద 2.6 లక్షల ఎకరాలు, భీమా కింద 2,02 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు కింద 2 లక్షల ఎకరాలు మొత్తం 6.62 లక్షల ఎకరాలు సాగులోకి తేబోతున్నట్టు ప్రకటించారు. కానీ ఈ రోజుకు మూడు ప్రాజెక్టుల కింద సాగులోకి వచ్చిన భూమి నికరంగా 16000 ఎకరాలు మాత్రమే. పదేండ్లు గడచిపోయాయి. వందలకోట్లు ఖర్చు చేశారు. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న విధంగా పనులు నిలిచిపోయాయి. జిల్లాలో మొత్తంగా ఇన్నేళ్ల తర్వాత అన్ని ప్రాజెక్టుల కింద కలిపి నికరంగా 25-30 టీఎంసీల నీటిని కూడా వాడుకోలేని దుస్థితి. మొత్తం సాగయ్యే భూమి రెండు లక్షల ఎకరాలకు తక్కువే.

పోతిరెడ్డిపాడులో ప్రవాహం.. ఎస్‌ఎల్‌బీసీ కుంటి నడక
మహబూబ్‌నగర్ ఉత్తర తాలూకాలు, నల్లగొండ జిల్లా కరువు ప్రాంతమైన దేవరకొండకు నీరందించే డిండి(దుందుభి) నది ఎండిపోయి చాలా కాలమయింది. రాయలసీమకు నీరందించే పోతిరెడ్డిపాడు-శ్రీశైలం కుడికాలువ ఇరవైయ్యేండ్లుగా నీరుపారిస్తున్నా, అదేసమయంలో ఆమోదం పొందిన శ్రీశైలం ఎడమ కాలువ ఇప్పటికీ కుంటి నడక నడుస్తున్నది. శ్రీశైలం ఎడమకాలువకు ప్రత్యామ్నాయంగా తెచ్చిన మాధవరెడ్డి ప్రాజెక్టు కింద 2.2 లక్షల ఎకరాలు సాగులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇప్పటికీ అరవై వేల ఎకరాలు కూడా సాగు కావడం లేదు. మూసీ కింద సగం ఆయకట్టు మాత్రమే సాగవుతున్నది. మూసీనది మురికి కూపంగా మారిపోయింది. ఐదు దశాబ్దాల తర్వాత కూడా జిల్లాలో మొత్తం సాగవుతున్న భూమి కేవలం నాలుగు లక్షల ఎకరాలు. సుమారు 150 టీఎంసీల నీటిని వినియోగించుకునే హక్కు ఉన్న నల్లగొండ జిల్లాల్లో ఇప్పుడు వినియోగించుకుంటున్నది 70 నుంచి 80 టీఎంసీలకు మించదు. రంగారెడ్డి జిల్లా కృష్ణా పరివాహక ప్రాంతం. ఈ జిల్లాలో వికారాబాద్ కొండలకు పశ్చిమ వైపు నుంచి మొదలయ్యే కాగ్నా నది భీమా నదిలో కలుస్తుండగా, కొండల తూర్పు వైపు నుంచి మొదలయ్యే మూసీ నది నల్లగొండ మీదుగా కృష్ణా నదిలో కలుస్తుంది. అయినా ఈ జిల్లాకు నీరందించే ప్రయత్నం ఎప్పుడూ జరగలేదు.

తెలంగాణ రైతుకు లక్షల కోట్లు నష్టం
తెలంగాణలో ముందునుంచీ తలపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్ల గత ఇక్కడి రైతాంగం గతంలో కనీసం పదివేల టీఎంసీల నీటిని నష్టపోయింది. ఒక్క టీఎంసీ నీటితో పండే వరి ధాన్యం విలువ కనిష్టంగా 25 కోట్ల రూపాయంటుందని వ్యవసాయ ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఆ విధంగా చూస్తే ఇన్నేళ్లలో ఇక్కడ రైతాంగం లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు. ఇప్పటికీ నష్టపోతున్నారు. వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసిన దుస్థితికి నెట్టివేయబడ్డారు. వీటన్నింటికీ ఒకటే పరిష్కారం కృష్ణా నదిలో మనకు హక్కుగా సంక్రమించిన ప్రతి చుక్క నీటిని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు మళ్లించడమే. ఈ ప్రయత్నంలో భాగంగానే ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల ప్రాజెక్టులను త్వరిత గతిన పూర్తి చేయడంతోపాటు కొత్తగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూపకల్పన జరుగుతున్నది.

నీటికోసం కలిసి సాగాలి

TEL_Major Irrigation ProjectsMap (1)

రంగారెడ్డికి నీళ్లు తేవడానికి ప్రాణహిత-చేవెళ్ల పథకంలో మాదిరిగా 22 లిఫ్టులు 1757 మీటర్లు ఎత్తిపోయడం అవసరం లేదు. మూడు లేక నాలుగు లిఫ్టులతో 450 మీటర్ల ఎత్తువరకు నీటిని పంపింగ్ చేస్తే రంగారెడ్డి జిల్లాలోకి నీరు వస్తుంది. డిండి, మూసీ నదులతోపాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని అనేక వాగులను, రిజర్వాయర్లను పునర్జీవింప చేయవచ్చు.

ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులపై సీమాంధ్ర మీడియా, వారి అనుకూల మేధావులు చేస్తున్న వాదనలు వారి డొల్లతనాన్ని తెలియజేస్తున్నాయి. ప్రాణహిత-చేవెళ్ల పూర్తి చేయడంకోసం ప్రారంభించిన ప్రాజెక్టు కాదు. ఎప్పటికీ పూర్తి కాకుండా చూసేందుకు డిజైను చేసిన ప్రాజెక్టు. ఎప్పటికీ వివాదాల్లో నలిగిపోయే విధంగా రూపొందించిన ప్రాజెక్టు. నీళ్లు వచ్చినా రాకున్నా కాంట్రాక్టర్లకు డబ్బులు ముట్టజెప్పేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు. రాయలసీమకోసం శ్రీశైలంను కబ్జా చేసేందుకు చేవెళ్లకు గోదావరి నీటిని ఎరగా చూపిన ప్రాజెక్టు. చేవెళ్లకు రెండువందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా నది నుంచి కాకుండా 1055 కిలోమీటర్ల దూరంలోని తుమ్మిడిహట్టి నుంచి తీసుకురావాలనుకోవడం ఎంతపెద్ద కుట్ర? పోనీ అదయినా సక్కగ చేయలేదు. నీళ్లు ఎక్కడి నుంచి తీసుకోవాలో అక్కడ పనులు ప్రారంభించకుండా, హెడ్‌వర్క్స్‌కు అనుమతులు, ఒప్పందాలు చేయకుండా కాలువలు తవ్వించే దుర్మార్గమైన విధానాన్ని అమలు చేసిన కీర్తి ప్రతిష్ఠలు ఒక్క రాజశేఖర్‌రెడ్డికే దక్కుతాయి. కొందరు మేధావులు వాదిస్తున్నట్టు ప్రాణహిత-చేవెళ్లపై ఎనిమిది వేల కోట్లో తొమ్మిది వేల కోట్లో ఇప్పటికే ఖర్చు చేశారనే అనుకుందాం. ఎల్లంపల్లి రిజర్వాయరు ఎలాగూ హైదరాబాద్‌కు నీరు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఎల్లంపల్లి ఇవతల తవ్విన కాలువలూ ఉపయోగపడతాయి. కానీ నీళ్లు మళ్లించడానికి ఉద్దేశించిన తుమ్మిడిహట్టి వద్ద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, ఇవతల ఇన్నివేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినందుకు, ఏడెనిమిదేళ్ల తర్వాత కూడా ఒక్క చుక్క నీటిని కూడా పొలాలకు అందించనందుకు ఇంకో దేశంలో అయితే ఆ నాయకులను ఉరితీసేవారు. ఇది ఎంత దుర్మార్గమైన ప్రాజెక్టు అంటే 22 చోట్ల నీళ్లను లిఫ్టుల ద్వారా ఎత్తిపోసి 1757 మీటర్ల ఎత్తుకు నీటిని తీసుకురావాలి. ఇందుకయ్యే విద్యుత్ ఖర్చు 3466 మెగావాట్లు. ఈ లిఫ్టులను నడిపించడానికి ప్రతిఏటా విద్యుత్‌పై చేసే ఖర్చు ఎన్నివేల కోట్లు ఉంటుందో లెక్కలేదు. ప్రాజెక్టులు ప్రారంభించినట్టు చేయడం, అవి ముందుపడకుండా చూడడం, చివరికి అవి పనికిరాకుండా చేయడం ఆంధ్ర నాయకత్వం ఇంతకాలం అనుసరించిన పద్ధతి.

తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఆత్మతో ప్రాజెక్టులను సమీక్షిస్తున్నది. హేతుబద్ధమైన ఖర్చుతో, వీలైనంత తొందరగా, సాధ్యమైనంత ఎక్కువ నీటిని వినియోగంలోకి తెచ్చుకునే విధంగా మొత్తం ప్రాజెక్టులను సమీక్షించాలని(రీ ఇంజనీరింగ్) కృషిచేస్తున్నది. ఏ ప్రాజెక్టయినా 2018 నాటికి పూర్తి అయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నీటిపారుదల ఇంజనీర్ల వెంటపడుతున్నారు. సాధ్యంకాని పనులు ముందు పెట్టుకోకండి. మొదలు పెట్టేపనులు ఎంతకష్టమయినా పూర్తి చేయండి అని ఆయన పదేపదే చెబుతున్నారు. రాజశేఖర్‌రెడ్డి తెలంగాణలో ప్రారంభించిన ప్రాజెక్టుల లక్ష్యం అంతా కృష్ణా నదిని తెలంగాణకు కాకుండా చేయడంకోసమే జరిగింది. రాజశేఖర్‌రెడ్డి చేవెళ్లకు నీళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తే కేసీఆర్ దానిని అడ్డుకుంటున్నారని ఓ వర్గం చాలా అమాయకంగా ప్రచారం చేస్తున్నది. కృష్ణా నదిలో నీళ్లు లేవు. గోదావరిలో ఉన్నాయి. అక్కడి నుంచి తీసుకుందాం అన్నవాదన ఆంధ్ర ఆధిపత్య శక్తులు ఈ ఐదున్నర దశాబ్దాలుగా మనకు నేర్పిన అజ్ఞానం. దుమ్ముగూడెం-టెయిల్‌పాండ్ అన్నది మరో క్రిమినల్ ఆలోచన. తెలంగాణ భూముల గుండా తెలంగాణకు ఉపయోగపడకుండా సాగిపోయే ప్రాజెక్టు ఇది. దుమ్ముగూడెం ప్రాజెక్టును ఖమ్మం జిల్లాకోసం నిర్మించాల్సిందిపోయి, అక్కడి నుంచి కృష్ణానదికి నీటిని మళ్లించాలని చూశారు. ఒకవైపు పోలవరం ద్వారా గోదావరి-కృష్ణా లింకుకు కాలువలు కూడా తవ్విన పెద్ద మనుషులు రెండోవైపు ఈ లింకుకోసం కూడా పనులు ప్రారంభించారు. నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ మంత్రులు వ్యతిరేకించినా వినకుండా ఈ ప్రాజెక్టును ముందుకు తెచ్చారు. టెయిల్‌పాండును వదిలించుకోవడం, దుమ్ముగూడెం బరాజ్ కట్టుకుని ఖమ్మం జిల్లాకు నీరందించడం తెలంగాణ చేయవలసిన పని. అలాగే తుమ్మిడిహట్టి వద్ద కూడా చిన్న బరాజ్ నిర్మించి ఆదిలాబాద్‌లో ఇప్పటికే తవ్విన కాలువల ద్వారా అక్కడ తలపెట్టిన ఆయకట్టుకు నీరివ్వాలని కూడా కేసీఆర్ అధికారులను కోరారు.

ఇప్పుడు చెప్పండి- ఏది ఎండమావి? ఏది ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టు? విచిత్రం ఏమంటే కృష్ణా పరివాహక ప్రాంతంలోకి రాని కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కృష్ణా నీళ్లిచ్చేందుకు అన్ని నియమాలను ఉల్లంఘించి, కొండలు, గుట్టలు, అడవులు తొలిచి ఎంత దూరమంటే అంత దూరం నీళ్లు తీసుకెళ్లడానికి ప్రాజెక్టులు కడుతుంది ఆంధ్ర నాయకత్వం. రాజశేఖర్‌రెడ్డి మొండిగా తెగబడి కృష్ణా నీటిని మళ్లించి కుందు, గాలేరు, పెన్నా, సగిలేరులను తిరిగి బతికించాడు. తెలంగాణలోనే ఎందుకో ఈ మీనమేషాలు లెక్కించడం, కొర్రీలు వేయడం, వంకరగా ఆలోచించడం? ఇప్పటికైనా మనం మన ఆత్మతో ఆలోచించాలి. మనను ఆవహించిన ఆధిపత్యశక్తుల ప్రభావాల నుంచి బయటపడాలి.

నదుల్లో ఎండమావులు ఉండవు. నీళ్లుంటాయి. కృష్ణా నదిలో నీళ్లు లేవా? కృష్ణా నీటిలో తెలంగాణకు హక్కులు లేవా? బచావత్ ట్రిబ్యునల్ నివేదిక ప్రకారమే తెలంగాణకు 298 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తాజాగా అదనంగా కేటాయించిన ఇచ్చిన నీటిలో కూడా 100 టీఎంసీల దాకా మనకే రావాలి. అంటే 398 టీఎంసీల నీటికి మనం లెక్కలు చూసుకోవాలా లేదా? ఇందులో 90 టీఎంసీలను చిన్న నీటిపారుదల ప్రాజెక్టుల కింద చూపించారు. అంటే కృష్ణా పరివాహక ప్రాంతంలోని చెరువులు, కుంటలు, చిన్న చిన్న రిజర్వాయర్లలో నిలుపుకునే నీటిని లెక్కగట్టి ఈ 90 టీఎంసీలు మన ఖాతాలో చూపించారు. ఉదాహరణకు డిండి రిజర్వాయరు ఖాతలో 3.5 టీఎంసీలను, మూసీ రిజర్వాయరులో 9.40 టీఎంసీలను, కోటిపల్లివాగు 2.0 టీఎంసీలు, ఓకచెట్టివాగు 1.9 టీఎంసీల కింద చూపుతారు. కానీ ఈ రిజర్వాయర్లు నిండక చాలా కాలమవుతున్నది. ఒక్క మూసీ రిజర్వాయరుకు మాత్రం రెండేళ్లకోసారి నీళ్లొస్తున్నాయి. మహబూబనగర్, నల్లగొండ, రంగారెడ్డి, జిల్లాల్లో కరువు ప్రభావం వల్ల కృష్ణా ఉపనదులు, వాగులు ఎండి బీటవారుతున్నాయి. ఈ కారణంగా ఆ ప్రాంతాల్లో చెట్టూ చేమా గొడ్డూ గోదా అన్నీ అంతరించిపోతున్నాయి. ఈ 90 టీఎంసీల నీటిని కృష్ణా నుంచి తీసుకునే హక్కు మనకు ఉంది. ఇవే కాదు మిగిలిన 308 టీఎంసీలకు కూడా లెక్క తేలాలి కదా? నాగార్జునసాగర్ ఎడమకాలువ, మాధవరెడ్డి ప్రాజెక్టు, జూరాల, రాజోలిబండ…ఇవేకదా మనకున్న కాలువలు. వీటి నుంచి ఎంత ఉపయోగిస్తున్నామో లెక్కలు వేస్తే మొత్తం 100 టీఎంసీలకు మించడం లేదు. అంటే కృష్ణా నదిలో మనకున్న నికరజలాలనే మనం ఇంతవరకు ఉపయోగించుకోవడం లేదు. ఎప్పుడో ఆలోచన చేసిన భీమా ప్రాజెక్టు, ఎగువ కృష్ణా ప్రాజెక్టుల ద్వారా మనకు రావలసిన నీటి హక్కులను మనం రాబట్టుకోలేదు. జూరాల నుంచి ఈ నీటిని తీసుకుని ఎండి వట్టిపోయిన ఉపనదులను, వాగులను పునర్జీవింప(రీజెనరేషన్) చేయాలి. డిండి, పెద్దవాగు, మూసీ, ఓకచెట్టువాగులను పునర్జీవింపజేయగలిగితే మహబూబ్‌నగర్ జిల్లా, నల్లగొండ జిల్లా దేవరకొండ, మునుగోడు తాలుకాలు తిరిగి కళకళలాడుతాయి. అంతేకాదు వీటిపై ఉన్నఅన్ని రిజర్వాయర్లను కృష్ణా నీటితో నింపాలి. వరుసగా రెండుమూడేళ్లు ఈ రిజర్వాయర్లను నింపగలిగితే ఈ ప్రాంతమంతా తిరిగి సస్యశ్యామలమవుతుంది. జీవితం తొణికిసలాడుతుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టాలని మన ఇంజినీర్లు చాలా కాలంగా కోరుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అందుకు అంగీకరించి కార్యరంగంలోకి దిగారు. రంగారెడ్డికి నీళ్లు తేవడానికి ప్రాణహిత-చేవెళ్ల పథకంలో మాదిరిగా 22 లిఫ్టులు 1757 మీటర్లు ఎత్తిపోయడం అవసరం లేదు. మూడు లేక నాలుగు లిఫ్టులతో 450 మీటర్ల ఎత్తువరకు నీటిని పంపింగ్ చేస్తే రంగారెడ్డి జిల్లాలోకి నీరు వస్తుంది. డిండి, మూసీ నదులతోపాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని అనేక వాగులను, రిజర్వాయర్లను పునర్జీవింప చేయవచ్చు.

ఇప్పుడు చెప్పండి- ఏది ఎండమావి? ఏది ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టు? విచిత్రం ఏమంటే కృష్ణా పరివాహక ప్రాంతంలోకి రాని కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కృష్ణా నీళ్లిచ్చేందుకు అన్ని నియమాలను ఉల్లంఘించి, కొండలు, గుట్టలు, అడవులు తొలిచి ఎంత దూరమంటే అంత దూరం నీళ్లు తీసుకెళ్లడానికి ప్రాజెక్టులు కడుతుంది ఆంధ్ర నాయకత్వం. రాజశేఖర్‌రెడ్డి మొండిగా తెగబడి కృష్ణా నీటిని మళ్లించి కుందు, గాలేరు, పెన్నా, సగిలేరులను తిరిగి బతికించాడు. తెలంగాణలోనే ఎందుకో ఈ మీనమేషాలు లెక్కించడం, కొర్రీలు వేయడం, వంకరగా ఆలోచించడం? ఇప్పటికైనా మనం మన ఆత్మతో ఆలోచించాలి. మనను ఆవహించిన ఆధిపత్యశక్తుల ప్రభావాల నుంచి బయటపడాలి. వారు నేర్పిన ఆలోచనాధారల నుంచి విముక్తి కావాలి. కృష్ణా నది మనది. ఈ నాలుగేళ్లలో నీటి హక్కులను సాధించుకోకపోతే ఇక ఎప్పటికీ మనకు కృష్ణా దక్కదు. తొలి తెలంగాణ ప్రభుత్వం నీటి సమస్యపై మనసుపెట్టి పని చేస్తున్నది. తెలంగాణలో పనిచేస్తున్న మీడియా మేధావులు, రాజకీయ నాయకులు, అధికారులు, ఇంజినీర్లు అందరూ ఈ విషయంలో ఒక్క బాట పట్టాలి. మిగతా విషయాల్లో భిన్నాభిప్రాయాలు, సంఘర్షణలు ఉండనీయండి. కానీ తాగునీరు, సాగునీరు విషయంలో తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతిబిడ్డ ఒక్కమాటగా నిలబడాలి.

తెలంగాణలో వ్యవసాయ సంక్షోభానికి కారణం కేవలం సాగునీరు లేకపోవడమే. రైతుల ఆత్మహత్యలు తెలంగాణ, రాయలసీమల్లోనే ఎందుకు జరుగుతున్నాయి? ఆంధ్ర డెల్టా ప్రాంతంలో ఎందుకు జరగడం లేదు? ఎందుకంటే అక్కడ వ్యవసాయం లాభాసాటి. ఇక్కడ మోయలేని భారం. ఆంధ్ర డెల్టా ప్రాంతంలో రైతు ఎకరా పొలానికి ఏడాదికి 350(ఖరీఫ్‌కు 200 రూ., రబీకి 150 రూ.) రూపాయల ఖర్చుతో నీరు పారించుకుని రెండు పంటలు తీస్తాడు. కరెంటు ఖర్చు లేదు. బోరు ఖర్చు లేదు. రిపేర్ల ఖర్చు లేదు. అర్ధరాత్రి అపరాత్రి కరెంటుకోసం కాపలా లేదు. అప్పులు లేవు. తెలంగాణలో అక్కడక్కడా ప్రాజెక్టుల కింద భూములు ఉన్న కొద్ది శాతం మంది రైతులు తప్ప, అత్యధికశాతం రైతులు ఎకరా పొలం పండించాలంటే నీటికోసం సగటున 20-25 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనికి పెట్టుబడులు తోడై పంట చేతికి వచ్చే సరికి రైతు నష్టాలతో ఇంటికి చేరుతున్నాడు. ఎప్పుడు ఏ ఖర్చులు మీదపడతాయో తెలియదు. దైవాధీనం వ్యవసాయమైపోయింది. డెల్టాలో రైతు తన కష్టానికి అదనపు సొమ్మును సంపాదించగలుగుతున్నాడు. ఆ అదనపు సొమ్మును నాణ్యమైన జీవితానికి ఖర్చు చేయగలుగుతున్నాడు. వివిధ రకాలుగా పెట్టుబడులు పెట్టగలుగుతున్నాడు. తెలంగాణ రైతు మనుగడకోసం పోరాడుతున్నాడు. తెలంగాణలో ముందునుంచీ తలపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్ల ఇక్కడి రైతాంగం కనీసం పదివేల టీఎంసీల నీటిని నష్టపోయింది. ఒక్క టీఎంసీ నీటితో పండే వరి ధాన్యం విలువ కనిష్టంగా 25 కోట్ల రూపాయలు. ఆ విధంగా చూస్తే ఇక్కడ రైతాంగం లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు. ఇప్పటికీ నష్టపోతున్నారు. వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసిన దుస్థితికి నెట్టివేయబడ్డారు. వీటన్నింటికీ ఒకటే పరిష్కారం కృష్ణా నదిలో మనకు హక్కుగా సంక్రమించిన ప్రతి చుక్క నీటిని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు, గోదావరి నీటిని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు మళ్లించడమే. ఇందుకు అనుగుణంగా ప్రాజెక్టుల రీఇంజనీరింగ్, నదులు, వాగుల రీజెనరేషన్ ఒక యజ్ఞంలా జరగాలి.

Andhra Capital named after Amaravathi

  

Andhra Chief Minister Chandrababu Naidu announced his state capital name as Amaravathi. His anouncement invited applause from all sections of the society. Amaravathi is a existing small town on the banks of Krishna River, which has rich historical and cultural heritage. 

Epicenter of capital Thullur is a nearby village of Amaravathi.   It is said that one of the historical capital of Andhra kingdoms is Dhanyakataka or Dhanyakheta or Dharanikota, which is very close to Amaravathi. 

Once abode of Buddhist preachings, wish Amaravathi shall give all the positive energies to develop the state. Hope Andhra State will flourish Amaravathi as its capital.  CHandrababu has taken a sensible decision