జీవనదిగా మిగిలింది ఇక్కడే!


D95084512

గలగలా గోదారి..
విలవిలా తెలంగాణ-2

వాగులు, వంకలు, ఉప నదులతో
నిండు కుండలా గోదావరి నది
సముద్రంలో కలిసేవన్నీ ఇక్కడి నీళ్లే
ఎండిపోని ప్రాణహిత, ఇంద్రావతి
150 టీఎంసీలిస్తున్న ఆదిలాబాద్ జిల్లా
సాగు అవకాశాలు తగ్గిపోయిన ఎస్సారెస్పీ
గోదావరికి జలాలన్నీ ఆ ప్రాజెక్టు దిగువనే
ఒడిసి పట్టుకుంటే బంగారు తెలంగాణే

తెలంగాణలో గోదావరి అడుగిడిన తర్వాత తొలి మజిలీ ఎస్సారెస్పీ జలాశయం! కానీ.. మహారాష్ట్రలో అడుగడుక్కీ బరాజ్‌లు కట్టడంతో పైనుంచి వచ్చే నీరు తగ్గిపోవడం.. వరదలొస్తేగానీ ఎస్సారెస్పీ నిండకపోవడంవంటి పరిస్థితుల్లో తదుపరి గోదావరిని తెలంగాణే నింపుకొంటున్నది! 43 టీఎంసీల లోటుతో మొదలయ్యే గోదావరి ప్రయాణంలో ఆదిలాబాద్ జిల్లా మొదలుకుని.. ఖమ్మం జిల్లా భద్రాచలంవద్ద ఆంధ్రలో కలిసేవరకూ అనేక జీవనదుల్లాంటి ఉపనదులు, ఉపనదుల్లాంటి వాగులు, వాగుల్లా పొంగే వంకలు దట్టమైన అటవీ ప్రాంతాలనుంచి నీటిని తెచ్చి నిండుకుండలా మార్చుతున్నాయి! ఒక్క ఆదిలాబాద్ జిల్లానుంచే 150 టీఎంసీల నీరు కొత్తగా గోదావరిలో చేరుతున్నది! అంటే.. సగటున ఏటా సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాల్లో అత్యధిక భాగం నీళ్లు మనవే! కానీ.. ఈ నీళ్లు మనకు దక్కడం లేదు! ఎందుకంటే.. ఎలాంటి ఆటంకాల్లేకుండా గోదావరిని గోదావరి జిల్లాలకు, ఆంధ్ర ప్రాంతానికి అంకితం చేసేందుకు నాటి సమైక్య పాలకులు కుట్ర చేసినందుకు!!

శ్రీరాంసాగర్‌కు దిగువన గోదావరిలో నదీ జలాలు పుష్కలం. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పైనుంచి అసాధారణ రీతిలో వర్షాలు వచ్చినప్పుడు తప్ప తగినంత నీరు రావడంలేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి లోటును ఎదుర్కొంటున్నట్టు హైడ్రలాజికల్ అధ్యయనాల్లోకూడా వెల్లడయింది. అంటే శ్రీరాంసాగర్ ఆయకట్టు పూర్తిస్థాయిలో సాగయ్యే అవకాశాలు బాగా తగ్గిపోయాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కాలువ రెండు దశలుగా సుదీర్ఘ దూరం ప్రయాణించి నల్లగొండ జిల్లా మోతె మండలంలో ముగుస్తుంది. కాకతీయ కాలువ రెండోదశ పూర్తయి పదేండ్లు దాటుతున్నా అందులో నీటిని వదిలింది నాలుగుసార్లే. తరచూ వరంగల్‌కు మంచినీటిని తరలించటంకూడా కష్టమవుతున్నది. వెరసి ఎస్సారెస్పీపై ఆధారపడే పరిస్థితి బాగా తగ్గిపోయింది. తెలంగాణ ఇక నీటిని వినియోగించుకోవలసింది శ్రీరాంసాగర్‌కు దిగువనే. కొత్తగా ప్రాణహిత-చేవెళ్ల పథకంలో భాగంగా ఎల్లంపల్లి బరాజ్ నిర్మించారు. ఆ బరాజ్ నీటి వినియోగ సామర్థ్యం 63 టీఎంసీలు మాత్రమే. ఎన్టీపీసీ అవసరాలు తీర్చటంతోపాటు హైదరాబాద్‌కు తాగునీటిని మళ్లించటానికి, ఎల్లంపల్లి ఎడమ కాలువద్వారా కొంత ఆయకట్టుకు నీరు అందించటానికి మాత్రమే ఈ బరాజ్ ఉపయోగపడుతుంది. ఆ మేరకు శ్రీరాంసాగర్‌పై కొంత భారం తగ్గించటానికికూడా మార్గం సుగమమయింది.
శ్రీరాంసాగర్ నీటి నిల్వసామర్థ్యం తగ్గిపోవడం, ఎగువనుంచి తగినంత వరద రాకపోవటం వంటి కారణాల వల్ల ముందు ముందు వరంగల్ జిల్లా కాకతీయ కాలువ ద్వారా నీటిని పొందే అవకాశాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. అంతేగాక శ్రీరాంసాగర్ ద్వారా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో మరింత ఆయకట్టును సాగులోకి తేవాలని అక్కడి రైతాంగం చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నది. ఈ డిమాండ్లను దృష్టిలో పెట్టుకునే పశ్చిమ ఆదిలాబాద్‌లోని నిర్మల్, ముథోల్‌లలో లక్ష ఎకరాలు, తూర్పు ఆదిలాబాద్‌లో 56 వేల ఎకరాలు అదనంగా సాగులోకి తేవాలని ప్రాణహిత-చేవెళ్ల పథకంలో చేర్చారు.
ప్రాణహిత-చేవెళ్ల పథకంలో మార్పులు జరిగినా ఆదిలాబాద్ జిల్లాలో తలపెట్టిన ఆయకట్టుకు ఎట్టిపరిస్థితుల్లో నీరివ్వాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇటీవల అధికారుల సమావేశంలో స్పష్టంగాచెప్పారు. తుమ్మిడిహట్టివద్ద లోలెవల్ బరాజ్ నిర్మించి, తూర్పు ఆదిలాబాద్ జిల్లాలో తలపెట్టిన ఆయకట్టుకు యథావిధిగా ఇప్పటికే తవ్విన కాలువల ద్వారా సాగునీరు ఇవ్వాలని ఆయన కోరారు. గోదావరి జలాలను వీలైనంత సమర్థంగా ఉపయోగించుకోవటం ఎలాగో ఆలోచించండి. అందుకు అనుగుణంగా ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్ చేయండి. ఆకుకు అందని పోకకు పొందని ప్రాజెక్టులను సమీక్షించండి అని ఆయన దిశానిర్దేశం చేశారు. ఆయన సూచన మేరకే ఇటీవల నీటిపారుదల ఇంజినీర్లు గోదావరి తీరం వెంబడి ఏరియల్ సర్వే నిర్వహించారు. ఎక్కడెక్కడ నీరు లభిస్తున్నదో గుర్తించారు. ఎక్కడెక్కడ ప్రాజెక్టులు చేపట్టవచ్చునో సూచనలు చేశారు.
గోదావరికి నీరెక్కడి నుంచి వస్తున్నది?
గోదావరిలో ముందుముందు నమ్మకంగా నీరు లభించే ప్రాంతమంతా తెలంగాణలోనే ఉంది. సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలు అత్యధికంగా మన రాష్ట్రం నుంచే దిగువకు ప్రవహిస్తున్నాయి. మంజీర, హరిద్ర, లోయర్ పెన్‌గంగా, కడెం, సాత్నాల, స్వర్ణ, సుద్దవాగులు, వట్టివాగు-ఎర్రవాగు-పెద్దవాగు, రాళ్లవాగు, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి, జంపన్నవాగు, తాలిపేరు, కిన్నెరసాని, శబరి వంటి ఉప నదులన్నీ గోదావరి నది ఒడిని చేరేది తెలంగాణకు ఈ ఒడ్డున లేక ఆ ఒడ్డునే. ఈ ఉప నదులు, వాగుల్లో ఎక్కువ వాటికి అడవులు రక్షణ కవచంగా ఉన్నాయి. శ్రీరాంసాగర్‌కు దిగువన ప్రధాన ఉపనదులైన కడెం, పెద్దవాగు, ప్రాణహిత, ఇంద్రావతి, జంపన్నవాగులకు దట్టమైన అడవుల కారణంగానే ప్రతిఏటా వరదలు వస్తున్నాయి. ప్రాణహిత, ఇంద్రావతి నదులయితే ఎప్పుడూ ఎండిపోగా చూడలేదని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఆదిలాబాద్ నదులు, వాగులు వంకలతో అలరారుతున్న జిల్లా. ఒక అంచనా ప్రకారం ఒక్క ఆదిలాబాద్ జిల్లా నుంచే 150 టీఎంసీలకు పైగా నీరు గోదావరిలోకి ప్రవహిస్తున్నది. ఆదిలాబాద్‌లో మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కొన్ని ఉన్నా వాటికింద సాగవుతున్నది ఎక్కడా పదివేల ఎకరాలకు మించదు. సీడబ్ల్యూసీ హైడ్రలాజికల్ అధ్యయనాల ప్రకారం గోదావరి నదిలో ఏయే పాయింటు వద్ద ఎంత నీరు లభిస్తున్నదో చూడండి..
1. హైడ్రాలజికల్ అధ్యయనాల నివేదిక ప్రకారం శ్రీరాంసాగర్ వద్ద ఉపయోగించదలచిన నీరు 196 టీఎంసీలు కాగా ప్రస్తుతం లభిస్తున్న నీరు 152 టీఎంసీలు మాత్రమే. మహారాష్ట్ర గోదావరి పొడవునా 5 నుంచి 20 టీంఎసీల నీటిని నిల్వచేసే విధంగా పెద్ద సంఖ్యలో బరాజ్ కం బ్రిడ్జిలు నిర్మించింది. దీంతో అసాధారణంగా వర్షాలు కురిసిన సంవత్సరాల్లో తప్ప కిందికి నీరు రావడమే తగ్గిపోయింది. ఫలితంగా శ్రీరాంసాగర్ వద్ద 43 టీఎంసీల లోటు ఏర్పడినట్టు గుర్తించారు. అంటే ఈ ప్రాజెక్టు కింద ముఖ్యంగా కాకతీయ కాలువ కింద నిర్ణయించిన ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీటిని అందించలేని పరిస్థితి ఏర్పడుతున్నది. ఈ ప్రాజెక్టుపై అనివార్యంగా కొంత ఆయకట్టు భారం తప్పించి మరో ప్రాజెక్టు నుంచి నీటిని అందివ్వాల్సిన పరిస్థితి తలెత్తుతున్నది.
2. ఎల్లంపల్లి బరాజ్ వద్ద 62.74 టీఎంసీల నీరు లభిస్తున్నట్టు గుర్తించారు. కడెం నది నుంచి మొత్తం 26 టీఎంసీల నీరు లభిస్తున్నట్టు హైడ్రాలాజికల్ అధ్యయనంలో నిర్ధారణ చేశారు. ఒక్క కడెం ప్రాజెక్టు నీటి వినియోగ సామర్థ్యం 18.65 టీఎంసీలు. శ్రీరాంసాగర్- ఎల్లంపల్లి మధ్యన కడెం ప్రాజెక్టుతో సహా మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకింద మొత్తం 41 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నట్టు గుర్తించారు. అవి పోగా ఎల్లంపల్లి వద్ద ఇంకా 62.74 టీఎంసీల నీరు లభిస్తున్నట్టు నివేదిక పేర్కొంది.
3. శ్రీరాంసాగర్‌కు దిగువన కాళేశ్వరానికి ఎగువన మొత్తంగా 150 టీఎంసీల నీరు లభిస్తున్నట్టు హైడ్రలాజికల్ అధ్యయనంలో గుర్తించారు. ఎల్లంపల్లి బరాజ్‌కు దిగువన ముల్కలవాగు, రాళ్లవాగు-తోళ్లవాగు, మిట్టపల్లివాగు, జోడువాగులు ఆదిలాబాద్‌వైపు నుంచి గోదావరిలో కలుస్తుండగా, కరీంనగర్ వైపు నుంచి మానేరు నది కలుస్తుంది.
4. గోదావరిలో చేరక ముందు ప్రాణహిత నదిలో 297 టీఎంసీల నీరు లభిస్తుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. నిజానికి ఈ నదిలో ఇంకా ఎక్కువే నీరు లభిస్తుంది. ఈ మొత్తం నీటిని ఉపయోగించుకునే హక్కు కూడా తెలంగాణకు ఉంది. కాళేశ్వరంవద్ద నికరంగా 283 టీఎంసీల నీరు లభిస్తుందని హైడ్రలాజికల్ నివేదిక అంచనా. ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత సుమారు పది కిలోమీటర్ల దిగువన మేడిగడ్డవద్ద గోదావరి వెడల్పు తగ్గిపోయి రెండు చిన్నపాటి గడ్డల మధ్యనుంచి ప్రవహిస్తుంది. ఇక్కడ నీటి లభ్యత ఇంకా ఎక్కువగా ఉంటుందని ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు.
5. ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత సుమారు 40 కి.మీ. దూరంలో ఇంద్రావతి వచ్చి కలుస్తుంది. ఇంద్రావతి గోదావరిలో కలిసిన 12.కి.మీ. దిగువన ఇచ్ఛంపల్లి ప్రాజెక్టు నిర్మించాలని ఒకప్పుడు నిజాం ప్రభుత్వమే తలపెట్టింది. యాభైయ్యేళ్ల సగటు నీటి లభ్యత 75% ప్రాతిపదికగా చూస్తే ఇచ్ఛంపల్లివద్ద గోదావరిలో 553.92 టీఎంసీల నీరు లభిస్తుందని హైడ్రలాజికల్ అధ్యయనంలో తేలింది. 50% నీటిలభ్యత ప్రాతిపదికగా చూస్తే 1091 టీఎంసీలు లభిస్తుందని కూడా గుర్తించారు. ఒక్క ఇంద్రావతి నది నుంచే 237.69 టీఎంసీల నీరు లభిస్తుందని ఈ నివేదికలో బహిర్గతమైంది.
6. ఇంద్రావతి-దుమ్ముగూడెంల మధ్యన వరంగల్, ఖమ్మంల వైపు నుంచి హనుమంతునివాగు, జంపన్నవాగు (దయ్యాలవాగు), జీడివాగు, ఎర్రవాగు, గౌరారంవాగు, మల్లూరు వాగు, ముసలమ్మవాగు, పెద్దవాగు, ఛత్తీస్‌గఢ్‌వైపు దండకారణ్యంనుంచి ఖమ్మం జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, చర్ల మండలాల ద్వారా చండ్రుపట్లవాగు, లొటపిటలగండివాగు, పావురాలవాగు, ఇసుకవాగు, చల్లవాగు, చీకుపల్లివాగు, బల్లకట్టవాగు, పాలెంవాగు, కొండాపురంవాగు, రాళ్లవాగు, సంకలవాగు, తాలిపేరు, సీతమ్మవాగు, పెదబండిరేవు గోదావరి నదిలో కలుస్తాయి. రెండు వైపుల నుంచి గోదావరిలో ప్రవేశించే వాగులన్నీ అడవులను ఆలంబన చేసుకుని ప్రతిఏటా పొంగిపొర్లుతున్నవే. ఈ ఉపనదులు, వాగుల నుంచి లభిస్తున్న జలాల్లో కొంత గోదావరి జిల్లాల్లో ఉపయోగించుకోగా మిగిలిన జలాలు సముద్రం పాలవుతున్నాయి. గోదావరిలో మనకు హక్కుగా లభించే నీటిలో ఇప్పటివరకు మనం వినియోగిస్తున్నట్టుగా లెక్క చెబుతున్న నీరు 370 టీఎంసీలు. అందులో కూడా మైనర్, మీడియం ఇరిగేషన్ కిందనే 145 టీఎంసీలు చూపిస్తున్నారు. గోదావరి ట్రిబ్యునల్ మనకు హక్కుగా కేటాయించిన నీరు 857 టీఎంసీలు. అంటే ఇంకా 487 టీఎంసీల నికర జలాలను ఉపయోగించుకోవడానికి తెలంగాణకు హక్కు ఉంది. ట్రిబ్యునల్ వరద జలాలపై కూడా తెలంగాణకే హక్కులు ఇచ్చింది. సముద్రంలో కలుస్తున్న యాభైయ్యేళ్ల సగటు వరద జలాలే 1781 టీఎంసీలుగా సీడబ్ల్యూసీ గుర్తించింది. గత పదిహేనేండ్ల సగటు అయితే 2783 టీఎంసీలు.
ప్రాజెక్టులు కట్టకుండా కుట్ర
సమైక్య పాలకులు ఉద్దేశపూర్వకంగానే తెలంగాణలో ప్రాజెక్టు నిర్మించకుండా కుట్రలు చేస్తూ వచ్చారు. గోదావరి చాలా లోతునుంచి ప్రవహిస్తుందని, తెలంగాణ ఎత్తున ఉండడంవల్ల నీళ్లందించడం సాధ్యంకాదని తెలంగాణ ప్రజలకు నమ్మబలుకుతూ వచ్చారు. సమైక్య పార్టీలలోని కొందరు తెలంగాణ నాయకులు కూడా అదే నిజమని నమ్ముతూ ఎత్తున ఉన్నోళ్లకు నీళ్లెలా వస్తాయి? అని ప్రశ్నిస్తూ వచ్చారు. శ్రీశైలంవద్ద 269.78 మీటర్ల ఎత్తు డ్యాం నిర్మించి ఎక్కడో పాతాళంలో ప్రవహిస్తున్న కృష్ణానది నుంచి నల్లమల కొండలను తొలిచి, సొరంగాలు చేసి వందల కిలోమీటర్ల దూరం నీరు మళ్లించుకుపోగలిగిన సమైక్యాంధ్ర ప్రభుత్వాలు గోదావరి నదిపై 125 మీటర్ల ఎత్తుతో ఇచ్ఛంపల్లి డ్యాం నిర్మించడానికి మనకు వంద అబద్ధాలు చెప్పారు. వంద వివాదాలు ప్రచారం చేశారు. రాయలసీమలో 250 మీటర్ల ఎత్తున ఉన్న భూభాగాలకు నీరు మళ్లించడం సాధ్యమైనప్పుడు, దాదాపు అంతే ఎత్తున ఉన్న తెలంగాణ భూభాగాలకు నీరు మళ్లించడం ఎందుకు సాధ్యం కాలేదో వాళ్ల వద్ద సమాధానం ఉండదు.
ఎల్లపల్లి-దుమ్ముగూడెం మధ్య లభించే జలాలే ఆధారం
తెలంగాణ భవిష్యత్తు అంతా ఎల్లంపల్లి, దుమ్ముగూడెంల మధ్య లభించే నదీజలాలపైనే ఆధారపడి ఉంది. కరీంనగర్‌లో కొంతభాగం, మెదక్, వరంగల్, నల్లగొండ కొంతభాగం, ఖమ్మం జిల్లాలకు సాగునీరు, తాగునీరు అవసరాలు తీర్చాల్సింది ఈ జలాలతోనే. ఏం చేయాలిప్పుడు? తెలంగాణ ప్రభుత్వం ఆలోచన ఏమిటి? తెలంగాణ ప్రభుత్వం గోదావరి నీటిని వినియోగంలోకి తీసుకురావడానికి చేస్తున్న పునర్నిర్మాణ ప్రణాళికలేమిటి.. తదుపరి కథనంలో చూద్దాం.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s