గోదావరి పొడవునా బరాజ్‌లు, ప్రాజెక్టులు


godavari610

-ఇక ఎక్కడి నీళ్లు అక్కడే వాడకం
-వీలున్నచోటల్లా జల విద్యుదుత్పత్తి
-రాష్ర్టానికి ఉపయోగకరంగా ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్
-సీమాంధ్ర అన్యాయానికి తెలంగాణ పరిష్కారం
-మన నీళ్లు మనకే దక్కేలా ప్రాజెక్టులు
-ప్రాజెక్టుగా కాళేశ్వరం-పాములపర్తి
-సాహసోపేత నిర్ణయాలతో కేసీఆర్ సర్కార్

ప్రాజెక్టులు మొదలుపెట్టాలి.. తమవారైన కాంట్రాక్టర్లు మొబిలైజేషన్ అడ్వాన్సులతో సొమ్ము చేసుకోవాలి.. కానీ ప్రాజెక్టు పూర్తికాకూడదు.. నీరు పారకూడదు! అదీ సిద్ధాంతం!! తెలంగాణ దాటేలోపు గోదావరికి అడ్డంకులు ఉండకూడదు! అదీ లోగుట్టు! అత్యంత భారీ.. అత్యంత క్లిష్టమైన.. అత్యంత అసాధ్యమైన ప్రాజెక్టుగా తయారైన ప్రాణహిత-చేవెళ్ల మొదలు.. ఏ చిన్నాచితక ప్రాజెక్టు చూసినా నాటి సమైక్య పాలకుల కుట్రలన్నింటికీ ఈ రెండు అంశాలే మెట్లు! ఎప్పుడో పూర్తయిపోయినా.. ఇంకా దిగువ ప్రాంతాలకు కనీస స్థాయిలో నీళ్లందించలేకపోతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టే సాక్ష్యం! ఎస్సారెస్పీ కాలువల్లో నీళ్లు కాదు.. రైతుల కన్నీళ్లు పారుతున్నాయి! గోదావరి పక్కనే ప్రవహిస్తున్నా తెలంగాణ పొలాలు ఎండిపోయాయి! దశాబ్దాలుగా అనుభవించిన ఈ నీటి గోసను తీర్చేందుకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పంతం పట్టింది! ఇక గోదావరి నీళ్లు ఎక్కడికక్కడే వినియోగమయ్యేలా సాహసోపేత నిర్ణయాలకు సిద్ధమవుతున్నది! గోదావరి, దాని ఉపనదుల పొడవునా.. వీలున్నచోట ప్రాజెక్టులు.. కాదంటే బరాజ్‌లు! వాటినుంచి సమీప గ్రామాలు.. పట్టణాలకు, అక్కడి పొలాలకు అవసరమైన తాగు.. సాగునీరు! పనిలోపనిగా అదనంగా జల విద్యుత్ ఉత్పత్తి! ఇప్పటికే మన హక్కుగా మిగిలి ఉన్న 487 టీఎంసీల నీటి వినియోగంతోపాటు.. వరద జలాల్లో 500 టీఎంసీల నుంచి వెయ్యి టీఎంసీలు ఉపయోగించుకునే అవకాశం! ఈ సత్సంకల్పం పూర్తయితే.. ఇంక బంగారు తెలంగాణ నిర్మాణానికి అడ్డెవ్వరు?

గోదావరిలో నీళ్లున్నా ఇంతకాలం తెలంగాణ నెత్తిపై శని ఉంది. సమైక్య ప్రభుత్వాలు ప్రాజెక్టులు చేపట్టలేదు. చేపట్టినా వివాదాలలో ఇరికించేందుకు ప్రయత్నించాయి. వివాదాలు లేకపోతే సృష్టించాయి. ప్రాజెక్టులు మొదలు పెట్టాలి కానీ పూర్తి కావద్దు. కాలువలు తవ్వాలి కానీ నీళ్లు పారొద్దు. సమైక్య ప్రభుత్వాల కుట్రలను గుర్తుపట్టిన తెలంగాణ ప్రభుత్వం గోదావరిపై ప్రాజెక్టులను పునఃసమీక్షిస్తున్నది. వీలైనంత ఎక్కువ నీటిని వినియోగంలోకి తీసుకురావడానికి, వీలైనంత ఎక్కువ ఆయకట్టును సృష్టించడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పంతంగా పనిచేస్తున్నారు.

గోదావరి నదిపై వీలైనన్ని బరాజ్‌లు నిర్మించి నీటిని లిఫ్టు చేయడమే కాకుండా, పెద్ద ఎత్తున జలవిద్యుత్ ప్రాజెక్టులు చేపట్టే విషయమూ పరిశీలిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏం చేసినా వ్యతిరేకించేవాళ్లు, తొర్రలు వెతికేవాళ్లు కొందరున్నారు. ప్రాణహిత-చేవెళ్ల పథకాన్ని ఎత్తేస్తున్నారని ఒకరు, ఆదిలాబాద్‌కు అన్యాయం చేస్తున్నారని మరొకరు, కంతానపల్లి ఎలా కడతారని ఇంకొందరు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఉన్నవీలేనివీ పోగేసి ఆంధ్రా మీడియాలో కుప్పపోస్తున్నారు.

ప్రాజెక్టుల రీ-ఇంజినీరింగ్
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కొత్త ఆలోచనలవల్ల ఏదో భారం పెరగబోతున్నదని, ప్రాజెక్టులు ఆచరణ సాధ్యం కావని, ఇంకా ఏవేవో ప్రచారాలు ప్రారంభించారు. ఆంధ్రా మీడియాకు, నాయకత్వానికి కావలసింది తెలంగాణ ప్రాజెక్టులు ముందుపడొద్దు. వాళ్లు తెలంగాణ వారినే కొందరిని కవచంగా పెట్టుకుని ప్రచార యుద్ధాలు సాగిస్తున్నారు. మీరు పాత ఆలోచనలు వదిలేయండి.

ఇప్పుడు మనం స్వరాష్ట్రంలో ఉన్నాం. కొత్తగా ఆలోచించండి. స్వేచ్ఛగా ఆలోచించండి. మన ప్రాంతానికి మనం ఎక్కువగా ఏం చేయగలమో పరిశీలించండి. ఎవరో ఏదో అంటారని మరచిపోండి. ప్రజలకు నీళ్లిస్తే అన్నీ వాళ్లే చూసుకుంటారు అని ముఖ్యమంత్రి నీటిపారుదల ఇంజినీర్లతో పదేపదే చెప్తున్నారు. ఇటువంటి ఆలోచనలనుంచి పుట్టిందే ప్రాజెక్టుల రీ-ఇంజినీరింగ్. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు సమీక్ష కూడా అందులో భాగమే. దానికంటే మంచి ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా? అన్న ఆలోచనను ప్రభుత్వం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్‌కు అధ్యయనం బాధ్యత అప్పగించింది.

ప్రాణహిత-చేవెళ్లపై మహారాష్ట్ర ఆందోళన
ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత నదిపై కౌటాల మండలం తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించి అక్కడినుంచి ఎల్లంపల్లికి, ఎల్లంపల్లినుంచి మిడ్‌మానేరుకు నీటిని మళ్లించాలన్నది ప్రస్తుత ప్రాజెక్టు లక్ష్యం. దీనివల్ల మొత్తం 6140 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని అంచనా.

అందులో 5247 ఎకరాలు మహారాష్ట్రలోనే ఉన్నాయి. అందుకే బ్యారేజీ ఎత్తు తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. గతంలో ఈ ప్రాజెక్టు విషయంలో ఆందోళనలు చేసిన ఫడ్నవీస్ ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, తమ ప్రాంతానికి మేలు చేయాలనే సంకల్పంతో, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా మహారాష్ట్రలో ముంపు తగ్గే అవకాశాన్ని పరిశీలించాని విజ్ఞప్తి చేస్తూ స్వయంగా ఓ వినతిపత్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు అందజేసినట్లు నీటిపారుదలవర్గాలు తెలిపాయి.

మహారాష్ట్రలో ముంపు తగ్గించగలిగితే 160 టీఎంసీలే కాదు, అంతకన్నా ఎక్కువ వినియోగించుకున్నా తమకు అభ్యంతరం లేదని ఈ సందర్భంగా కేసీఆర్‌తో ఫడ్నవీస్ అన్నట్లు తెలిసింది. ప్రాణహిత బ్యారేజీవద్ద నుంచి 90 రోజుల పాటు నీటిని మళ్లించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కొత్తగా మేడిగడ్డ వద్ద ప్రతిపాదిస్తున్న బ్యారేజీ నుంచి ఆరు మాసాల పాటు నీటిని మళ్లించుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాణహిత-చేవెళ్ల ఏడు జిల్లాల రైతాంగానికి సాగు, తాగునీరు అందించే ప్రాజెక్టు కనుక, ప్రభుత్వం ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నది. ఏది ఏమైనా వ్యాప్కోస్ సంస్థ అధ్యయనం చేసి ఇచ్చే నివేదికలోని సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని నీటిపారుదల వర్గాలు తెలిపాయి.

ప్రాణహిత-చేవెళ్ల పూర్తి చేసే ప్రాజెక్టు కాదు
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో చాలా సమస్యలున్నాయి. నిజానికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయడంకోసం మొదలుపెట్టిన ప్రాజెక్టు కాదు. పూర్తికాకుండా ఉండడంకోసం రూపొందించిన అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టు. 28 ప్యాకేజీలు, 206 కిలోమీటర్ల టన్నెళ్లు, 849 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 22 లిఫ్టులు, 3466 మెగావాట్ల విద్యుత్ అవసరం, 1757 మీటర్ల ఎత్తిపోత.. ఎప్పటికి పూర్తి కావాలి? చేవెళ్లకు ఎప్పుడు నీరందించాలి? చేవెళ్లకు సూటిగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న జూరాలనుంచి కాకుండా 1055 కిలోమీటర్ల దూరంలోని ప్రాణహితనుంచి నీటిని తీసుకురావాలని ప్రణాళిక రూపొందించడమే పెద్ద కుట్ర. కృష్ణానదిలో తెలంగాణ వాటాను కాజేసే దూరదృష్టితో రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం నడిపించిన కుతంత్రం. శ్రీశైలంను కబ్జా చేయడంకోసమే ఆయన పోలవరంను హడావిడిగా మొదలుపెట్టారు. కృష్ణా నదిని రాయలసీమకు మళ్లించడం కోసమే ఆయన దుమ్ముగూడెం-టెయిల్‌పాండ్ ప్రాజెక్టును ప్రారంభించారు.

చివరి భూములకు నీళ్లివ్వలేని ఎస్సారెస్పీ
విచిత్రం ఏమంటే శ్రీరాంసాగర్ నుంచి కరీంనగర్ జిల్లాలోనే చివరి భూములకు నీళ్లు రావడం ఆగిపోయింది. వరంగల్ జిల్లాకు ఎప్పుడో ఒకసారి కాకతీయకాలువ నీళ్లు వస్తాయి. ఎండాకాలమయితే మంచినీటికోసంకూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి. వరంగల్ జిల్లా నిండా కాలువలైతే తవ్విపెట్టారు. ఒకటికాదు రెండు కాదు. శ్రీరాంసాగర్ రెండో దశ. రెండు పాయలుగా చీలి ఒకటి సూర్యాపేట సమీపంలోని మోతెదాకా వెళుతుంది. మరో కాలువ మహబూబాబాద్‌దాకా వెళుతుంది.

మరోవైపునుంచి వరద కాలువకూడా చేర్యాల ప్రాంతంలో ప్రవేశించి దేవరుప్పలదాకా వచ్చింది. ఇంకోవైపు దేవాదులకోసం వేసిన పైపులైన్లు. కాలువల మీద కాలువలు. కాలువలమీద పైపులైన్లు. ఒక పద్ధతి లేదు, పాడు లేదు, ప్లాను లేదు. రైతులకు నీళ్లు మాత్రం రావడం లేదు. కాలువలు మాత్రం కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల చెట్లు మొలుస్తున్నాయి. గోదావరి నీటిని ఇక్కడెక్కడా ఇద్దామని ఆలోచన చేయని రాజశేఖర్‌రెడ్డి ప్రాణహితకు ఎందుకు వెళ్లాడో ఎవరికీ ఎందుకు అర్థం కావడం లేదు? పోనీ అదయినా సక్కగా చేశారా? తుమ్మిడిహట్టి వద్ద తట్టెడు మట్టి పోయకుండానే అక్కడి నుంచి చేవెళ్లదాకా కాలువల తవ్వకం కాంట్రాక్టులు ఇచ్చేశారు. తుమ్మిడిహట్టి బరాజ్‌పై మహారాష్ట్రతో అవగాహనకు రాకుండానే దిగువన వందల కోట్లు ఖర్చుచేశారు.

మొబిలైజేషను అడ్వాన్సులు ఇచ్చేశారు. ఒక వరుసక్రమం, ప్రాధాన్యతాక్రమం ఏదీ లేదు. ఏరోజుకు నీళ్లివ్వాలన్న కాల నిర్ణయ ప్రణాళిక లేదు. గోదావరి నీటితో నిమిత్తం లేకుండా 16.4 లక్షల ఎకరాలను సాగులోకి తేగలమని అప్పటి ప్రభుత్వం నమ్మబలికింది. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 2,46,704 ఎకరాలను సాగులోకి తేనున్నట్టు రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టు నివేదికను ఖరారు చేసింది. మనవాళ్లు కూడా చాలా మంది నిజమే కాబోలు అనుకున్నారు. కానీ అసలు విషయం ఎవరికీ అర్థం కాలేదు. వాళ్లకు కావలసింది గోదావరిపై మరో ప్రాజెక్టు ఏదీ లేకుండా చూడడమేనని లోతుగా పరిశీలిస్తే తప్ప తెలియదు.

ఇప్పుడు ఏం చేయబోతున్నారు?
వ్యాప్కోస్ నివేదిక చేసే సూచనల ప్రకారం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో మార్పులు చేస్తే ప్రాజెక్టు కాళేశ్వరానికి దిగువకు మారుతుంది. ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టివద్ద చిన్న ఆనకట్ట నిర్మించి పశ్చిమ ఆదిలాబాద్ జిల్లాలో ముందు నిర్ణయించిన ప్రకారం 56,200 ఎకరాల ఆయకట్టుకు నీరిస్తారు. తుమ్మిడిహట్టి వద్ద నదిపై ఇప్పటివరకు ఎటువంటి నిర్మాణాలు చేయలేదు. ఇప్పటివరకు తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి లోపు 900 కోట్లు ఖర్చు పెట్టి కాలువలు, కొంత టన్నెల్ తవ్వారు.

ఇంకా రూ.4500 కోట్ల విలువచేసే పనులు పెండింగులో ఉన్నాయి. ఆ నిధులను కొత్త ప్రాజెక్టుకు మళ్లించవచ్చు. ముంపు వివాదానికి తావివ్వని రీతిలో ఆనకట్టను నిర్మించి, నీటిని మళ్లించి, ఇప్పటికే తవ్విన కాలువల ద్వారా పైన పేర్కొన్న ఆయకట్టుకు నీరందించాలి. ఆనకట్ట నిర్మాణానికి, ఈ ఆయకట్టును సాగులోకి తీసుకురావడానికి 300 నుంచి 400 ఖర్చవుతాయని ఇంజినీర్లు చెప్తున్నారు. అలాగే చేవెళ్లనుకూడా ప్రాణహిత ప్రాజెక్టునుంచి విడదీయాలి. చేవెళ్లకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుద్వారా నీరివ్వడం సులువు. తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. చేవెళ్ల కృష్ణా పరివాహక ప్రాంతం కూడా అని రిటైర్డు చీఫ్ ఇంజినీరు ఒకరు చెప్పారు.

అంటే ప్రాణహిత, చేవెళ్ల రెండు కూడా ఈ ప్రాజెక్టునుంచి డీలింక్ అయ్యే అవకాశాలున్నాయి అని ఆయన చెప్పారు. ఈ మార్పులు జరిగితే కాళేశ్వరం-పాములపర్తి ప్రాజెక్టుగా రూపుదిద్దుకోబోతున్నదా లేక మరో రూపం తీసుకుంటుందా అన్నది వ్యాప్కోస్ నివేదికపై ఆధారపడి ఉంటుంది. ఇక ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు జరిగిన పనులు కూడా వరదల కాలంలో ఉపయోగపడతాయి. మెదక్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయరుగా ఉపయోగపడే మిడ్‌మానేరుకు కాళేశ్వరంతోపాటు ఎల్లంపల్లి కూడా అదనపు ఫీడరుగా పనిచేస్తుంది. మిడ్‌మానేరు నుంచి పాములపర్తి దాకా ప్రాజెక్టు రూపు రేఖల్లో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు లేవు.

కాళేశ్వరం ఎందుకు?
తుమ్మిడిహట్టి వద్ద లభించే ప్రాణహిత నీరే వందకిలోమీటర్లు దిగువన కాళేశ్వరం వద్ద కూడా లభిస్తుంది. చుట్టూ దట్టమైన అడవులనుంచి వచ్చే అనేక వాగులు తుమ్మిడిహట్టికి దిగువనే ప్రాణహితలో కలుస్తాయి. పెద్దవాగు, రాళ్లవాగుదాకా అరడజనుకు పైగా ఆదిలాబాద్ వాగులు అటు ప్రాణహిత ఒడిని, ఇటు గోదావరి ఒడిని చేరతాయి. కాళేశ్వరం వద్ద నీటి లభ్యత ఎక్కువ. కాళేశ్వరానికి దిగువన మేడిగడ్డ వద్ద నది సన్నగా మారుతుంది. అక్కడినుంచి కాళేశ్వరందాకా నది వెడల్పుగా ఉంటుంది. అక్కడ నదీగర్భంలోనే వీలైనంత ఎక్కువ నీటిని నిల్వచేసే అవకాశాలు ఉన్నాయని ఇంజినీర్లు చెప్తున్నారు. ముంపు వివాదానికి ఎక్కువగా ఆస్కారం ఉండదని వారంటున్నారు. అక్కడ ఒక్క చోట లిఫ్టు చేసి టన్నెల్ ద్వారా కరీంనగర్ పట్టణానికి ఎగువన వరద కాలువదాకా తీసుకువస్తే అక్కడ మరో లిఫ్టుద్వారా వరద కాలువలోకి నీటిని మళ్లించవచ్చునని వారు ప్రస్తుతానికి అంచనా వేస్తున్నారు. రెండే లిఫ్టులతో మిడ్ మానేరు దాకా నీరు తేవచ్చునని ఇంజినీర్లు ప్రాథమిక అంచనాలు వేశారు. నీటిలభ్యత, ఫీజిబులిటీ ఇక్కడ ఎక్కువగా ఉంటుందని వారు భావిస్తున్నారు.

వరుసగా బరాజ్ కం రోడ్డు బ్రిడ్జిలు
మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలించడంతోపాటు దుమ్ముగూడెందాకా వరుసగా బరాజ్ కం రోడ్డు బ్రిడ్జిలు నిర్మించేందుకు ప్రయత్నం చేయాలని ఇంజినీర్లు సూచించారు. ఇంద్రావతి గోదావరిలో కలిసిన తర్వాత పన్నెండు కిలోమీటర్లు దిగువన ఇచ్ఛంపల్లి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ప్రారంభించాలని, కంతానపల్లి, దుమ్ముగూడెంలలో బరాజ్‌లు నిర్మించాలని ఇంజినీర్లు ప్రతిపాదిస్తున్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకానికి ఇప్పుడు పూర్తిస్థాయిలో నీరందండం లేదని, అవసరమైతే ఇక్కడ కూడా ఒక చిన్న బరాజ్‌ను నిర్మించడం కానీ కంతానపల్లి ఎత్తుపెంచి నిర్మించడం కానీ వాంఛనీయమని వారు సూచిస్తున్నారు.

జలవిద్యుత్
తుమ్మిడిహట్టినుంచి కాళేశ్వరం వచ్చేసరికి ప్రాణహిత సుమారు 80 మీటర్లు దిగువకు ప్రవహిస్తుంది. ఇంద్రావతి 70 మీటర్లు దిగువకు ఉధృతితో ప్రవహించి ప్రతాపగిరి వద్ద గోదావరిలో కలుస్తుంది. తుమ్మిడిహట్టినుంచి దుమ్ముగూడెందాకా పెద్ద ఎత్తున జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలున్నాయి. వెయ్యి టీఎంసీల నీటినుంచి సుమారు 50వేల మిలియన్ యూనిట్‌ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది అని విద్యుత్ నిపుణుడు వెంకట్ గాంధీ చెబుతున్నారు. ఇంద్రావతి చాలా వేగంగా ప్రవహించేనది. ప్రాణహిత కూడా ఉధృతి ఎక్కువే. కాళేశ్వరం నుంచి దుమ్ముగూడెం వరకు నదీ ప్రవాహం మంద్రంగా ఉంటుంది. ఇక్కడ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లతో కలసి పెద్ద ఎత్తున విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించవచ్చు. రామగుండంనుంచి భద్రాచలందాకా మంచి జలమార్గాన్ని కూడా నిర్మించవచ్చు అని ఆయన సూచించారు.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

2 thoughts on “గోదావరి పొడవునా బరాజ్‌లు, ప్రాజెక్టులు”

  1. Most of your posts are great eye-openers to maximum no. of T people. In fact, one of my uncles, (your late mother-in-law’s cousin, belonging to P.Pally), spoke to me at length recently appreciating your views in Namasthe. I was in Nalgonda, Malakapatnam and Dondavani Gudem for almost 15 days in March-April. The sight of full flow water in the Left Canal of N. Sagar, and almost uninterrupted power supply in our villages in March-April almost changed my entire outlook about the T government, KCR in particular. I almost stopped writing and contributing to Metro India and other newspapers b/c of a paradigm shift and a totally new approach on the T government due to these changes in me.- Dr. K. Indrasena Reddy

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s