ఇప్పుడు అవసరం మిషన్ తెలంగాణ


ప్రభుత్వమంటే విమర్శలు ఎదుర్కోవడానికి, ప్రతిపక్షమంటే అడ్డంగా మాట్లాడడానికి ఉందన్న ఒక అధ్వాన్నమైన భావన మన రాజకీయాల్లో పాతుకుపోయింది. ఎడ్డెమంటే తెడ్డెమనడమే మొనగాని తనం అనుకునే మరుగుజ్జులు అనేక మంది ఉన్నారు. తెలంగాణ సమున్నతంగా ఎదగడం ఒక్కటే ఈ శక్తుల వెన్నువిరిచే మార్గం.

తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఒక్కరి తపన చాలదు. పదిమంది మంత్రులు పనిచేస్తే చాలదు. మిషన్ కాకతీయ, మిషన్ జలహారం చాలవు. కొత్త రాష్ట్ర నవనిర్మాణాన్ని  ఒక మిషన్‌గా భావించి అందరూ నడుం బిగించినప్పుడే తెలంగాణ అన్ని సవాళ్లను, అన్ని పరీక్షలను అధిగమించి పురోగమించగలదు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్న చారిత్రక సంధిలో మనం అందరం ఉండడం ఒక అదృష్టం. తెలంగాణ రాష్ర్టానికి తెలంగాణ ఆత్మతో ఆలోచించి ఆచరించే నాయకత్వం లభించడం మనకు దక్కిన సదవకాశం. తెలంగాణ రాష్ట్రం విఫలమవుతుందని, విఫలం కావాలని చూసేవాళ్లు, అందుకోసం కుట్రలు చేసేవాళ్లు ఇప్పటికీ ఉన్నారు. ఇక ముందు కూడా ఉంటారు. తెలంగాణతనం ఇంకా ఒంటబట్టని సమైక్యవాదుల అనుచరగణం ఇక్కడ యథావిధిగా మన కళ్లలో కారం కొట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. నడిచేవాడిని పడేయడానికి, కిందపడితే నవ్వడానికి ఈ మూక ఎప్పుడూ కాచుకునే ఉంటుంది. వాళ్లు సమైక్యవాద ఆత్మతోనే ఇప్పటికీ తెలంగాణను చూస్తున్నారు. వారికి సొంత ఆత్మలు లేవు.  వారు ఏనాటికైనా నిర్మాణాత్మక పాత్ర పోషించే అవకాశాలు కనిపించవు. సమైక్యవాదుల నిధులు, దీవెనలమీద ఆధారపడి రాజకీయాలు చేసేవారు తెలంగాణ నిర్మాణంలో ఎప్పటికీ భాగస్వాములు కాలేరు. వంకరతనం వారి మేధస్సును ఏలుతూ ఉంటుంది. ప్రభుత్వమంటే విమర్శలు ఎదుర్కోవడానికి, ప్రతిపక్షమంటే అడ్డంగా మాట్లాడడానికి ఉందన్న ఒక అధ్వాన్నమైన భావన మన రాజకీయాల్లో పాతుకుపోయింది. ఎడ్డెమంటే తెడ్డెమనడమే మొనగాని తనం అనుకునే మరుగుజ్జులు అనేక మంది ఉన్నారు. తెలంగాణ సమున్నతంగా ఎదగడం ఒక్కటే ఈ శక్తుల వెన్నువిరిచే మార్గం. ప్రభుత్వంలో ఉన్న నాయకులు, అధికారులు మామూలు పద్ధతుల్లో పనిచేస్తే ఈ సవాలును అధిగమించడం సాధ్యం కాదు. ప్రజలు సత్వర ఫలితాలు ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి అధికారుల సమావేశంలో చెప్పినట్టు తెలంగాణ ఎన్నో పెనుగులాటల నుంచి విముక్తి అయి స్వేచ్ఛను పొందింది. తెలంగాణ వస్తే ఏమి జరుగుతుందో ఏమేమి సాధించుకోగలమో ఉద్యమకారులుగా అనేక అంశాలు మాట్లాడుకుని ఉన్నాం. ఇప్పుడు అధికారం మన చేతిలో ఉంది. ఫలితాలు చూపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నిజానికి సొంత రాష్ట్రం, సొంత ప్రభుత్వం, సొంత నాయకుడు ఉంటే ఎలా ఉంటుందో ఈ పదిమాసాల్లో చంద్రశేఖర్‌రావు పదేపదే రుజువు చేశారు. పరిపాలనలో తెలంగాణతనం అంటే ఏమిటో చూపిస్తున్నారు. అయినా చేయాల్సింది, నడవాల్సింది చాలా ఉంది. అసలు లక్ష్యాలు చాలా ముందున్నాయి.

ఇంటింటికీ తాగునీరు చేరాలంటే జలహారం, నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుదుత్పత్తి లక్ష్యాలను ఏకకాలంలో  సాధించాలి. జలహారానికి అవసరమైన నీటిని కాలమయితే, చెరువుల నుంచి, ఇప్పుడున్న నీటిపారుదల వసతుల నుంచి ఉపయోగించుకోవచ్చు. కానీ కాలం కాని పరిస్థితుల్లోనే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నీరు అవసరమవుతుంది. చాలా చోట్ల నీటిని నదుల నుంచి లిఫ్టు చేయాల్సి ఉంటుంది కాబట్టి తగినంత విద్యుత్తు కూడా అందుబాటులో ఉండాలి. ఇవన్నీ పరస్పరాధారితాలు.


నాయకుడు ఎంత అద్భుతంగానయినా ఆలోచించనీయండి. ఎంత మనసుపెట్టి పని చేయనీయండి. ఎంత గొప్ప పథకాలనయినా రూపకల్పన చేయనీయండి. వాటిని ఆచరణలో ప్రజలకు చేర్చాల్సింది ఉన్నతాధికార యంత్రాంగమే. ఉదాహరణకు ఆసరా పథకమే తీసుకోండి. తెలంగాణ ప్రభుత్వం సమైక్య ప్రభుత్వాలకంటే 2.2 లక్షల మందికి అదనంగా పింఛన్లు ఇస్తున్నది. పింఛను పథకంపై వారు ఖర్చు చేసినదానికంటే 1700 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేస్తున్నది. ఎటువంటి అరమరికలు లేకుండా ఏ నెలకానెల పింఛను అందే ఏర్పాటు చేస్తున్నది. కానీ  పథకాన్ని అమలులోకి తేవడంలో జరిగిన లోపాల వల్ల ప్రభుత్వం తొలుత బాగా బద్నాం కావలసి వచ్చింది. మార్గదర్శకాల రూపకల్పన, అమలు దగ్గర విపరీతమైన గందరగోళం సృష్టించారు. పైస్థాయి నుంచి మండలస్థాయి దాకా అధికార యంత్రాంగం కష్టపడింది, కానీ ప్రభుత్వానికి రావలసిన మంచి పేరు రాలేదు. ఏ చిన్న లోపం జరిగినా నానా అల్లరి చేసేందుకు సమైక్యవాదులు ఇక్కడ ఒక రాజకీయ నాయకత్వాన్ని, మీడియా యంత్రాంగాన్ని పోషిస్తున్నారు. వాళ్ల ఎజెండా తెలంగాణ ప్రభుత్వాన్ని బజారుకీడ్చడమే. ఈ రచ్చ కేవలం అధికార యంత్రాంగం తగినంత ఆలోచన, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే జరిగింది. చాలా చోట్ల స్వయంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అధికార యంత్రాంగం కూడా పించనుదారులపట్ల సానుభూతి భావనతో కాకుండా ఒక వ్యతిరిక్త భావనతో పనిచేశారు. అదికాస్తా ఇబ్బందులపాలు చేసింది. సాధారణ పద్ధతులకు భిన్నంగా ఆలోచించి (ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్) పనిచేయండని ముఖ్యమంత్రి ఉన్నతాధికారుల సమావేశంలో కోరింది తెలంగాణ ప్రజలకు సత్వర ఫలితాలు సాధించిపెట్టడం కోసమే.  ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రూళ్ల పుస్తకాన్ని ముందేసుకుని పనిచేస్తూ పోతే ప్రభుత్వం సంకల్పించిన పథకాలు, పనులు ఎప్పటికీ పూర్తికావు. గత ప్రభుత్వాలు అక్రమాలు చేయడానికి, అడ్డగోలు పంపకాలు చేయడానికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను యథేచ్ఛగా వాడుకున్నాయి. వాళ్లను వివాదాల్లో ఇరికించి జైళ్లపాలు చేశాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి చెబుతున్నది అతిక్రమణలు, అక్రమాలు చేయడం కోసం కాదు. ప్రభుత్వం సంకల్పించిన బృహత్పథకాలను సాధ్యమైనంత త్వరితగతిన సాకారం చేయడానికి.
అధికారులు తలుచుకుంటే సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? తలుచుకోకపోతే ఎలా పెండింగులో పడిపోతుంది? ఒక చిన్న ఉదాహరణ. ఒక కాలువ నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. ఒక ఇళ్లస్థలం యజమాని నష్టపరిహారం చాల లేదని కోర్టుకు వెళ్లాడు. ఆ కొద్ది దూరం తప్ప అవతల, ఇవతల కాలువ తవ్వకం అయిపోయింది. ఈ ప్లాటు దాకా కాలువ నీళ్లు వస్తున్నాయి. ఈ కేసు కారణంగా ఆ కొద్ది దూరం కాలువ తవ్వకం ఆగిపోయింది. ఆ కొద్ది దూరం తవ్వితే అవతల ఏడు చెరువులకు నీళ్లు వెళతాయి. సుమారు పదివేల ఎకరాలకు సాగునీరు, పదిగ్రామాలకు తాగునీరు గ్యారంటీగా అందుతుంది. కానీ నాలుగేళ్లుగా ఆ కాలువ అక్కడే ఆగిపోయింది. ఈ నాలుగేళ్లుగా ఆ పదివేల ఎకరాల పంట నష్టం ఎంత? తాగునీటి సమస్యల విలువ ఎంత? ఆ గ్రామాలు తరతరాల కరువు నుంచి విముక్తి అయితే ఎవరిని గుర్తుపెట్టుకుంటారు?  ఆ గ్రామాలకు జరిగిన నష్టంతో పోల్చి చూస్తే ఆ ప్లాటు విలువ అసలు ఏమూలకూ చాలదు. ప్రజలయినా అదనపు ధర పెట్టి ఆ ప్లాటు పంచాయితీ చేసుకుని ఉండవచ్చు. చీఫ్ ఇంజనీర్లు, జిల్లా రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్…ఎవరయినా చొరవతీసుకుని ఆ పని పూర్తి చేసి ఉండవచ్చు. కానీ ఆ సమస్య నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. జనానికి మేలు చేయాలన్న తపన ఉన్నవాళ్లు, నీటి విలువ తెలిసినవాళ్లు మాత్రమే చొరవ చేయగలరు. ఒక్క టీఎంసీ నీటిని ఇస్తున్నామూ అంటే 25 కోట్ల విలువ చేసే పంటను ఇస్తున్నామని గుర్తించాలి. కానీ అధికార యంత్రాంగంలో ఆ చొరవే కనిపించడం లేదు. సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, సంక్షేమం, పారిశ్రామికాభివృద్ధి…ఈ ఐదు అంశాలు తన ప్రాధాన్యాలుగా ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఎంత రిస్కు తీసుకుంటున్నారూ అంటే వచ్చే నాలుగేళ్లలో ఇంటింటికీ మంచినీరు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడుగను అని చెబుతున్నారు. ఇది ముమ్మాటికీ సాహసం. లక్ష్యాన్ని సాధించగలనన్న పూర్తి నమ్మకంతో ఆయన ఈ మాటచెబుతూ ఉండవచ్చు. కానీ ఈ నమ్మకాన్ని నిలబెట్టాల్సింది అధికార యంత్రాంగమే. ఇంటింటికీ తాగునీరు చేరాలంటే జలహారం, నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుదుత్పత్తి లక్ష్యాలను ఏకకాలంలో  సాధించాలి. జలహారానికి అవసరమైన నీటిని కాలమయితే, చెరువుల నుంచి, ఇప్పుడున్న నీటిపారుదల వసతుల నుంచి ఉపయోగించుకోవచ్చు. కానీ కాలం కాని పరిస్థితుల్లోనే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నీరు అవసరమవుతుంది. చాలా చోట్ల నీటిని నదుల నుంచి లిఫ్టు చేయాల్సి ఉంటుంది కాబట్టి తగినంత విద్యుత్తు కూడా అందుబాటులో ఉండాలి. ఇవన్నీ పరస్పరాధారితాలు.
ఈ పథకాలు, ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోవడంలో ఎటువంటి అరమరికలు లేకుండా పనిచేయాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశం. ఈ లక్ష్యాల సాధనకు ఒక మిషన్ జీల్‌తో ముందుకు సాగాలన్నదే ఆయన తాపత్రయం. మొత్తం అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ల సమావేశానికి పిలువడంలోని ఆంతర్యం కూడా అదే. ఆయన లెక్కలు పత్రాలు నివేదికల గురించి మాట్లాడడం లేదు. యాంత్రిక సమీక్షలు చేయడం లేదు. కొత్త రాష్ట్రంలో కొత్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులతో ఒక ఆత్మిక సంభాషణ మొదలుపెట్టారు. తాను ఆలోచిస్తున్నదేమిటో, ఆశిస్తున్నదేమిటో వారి ముందు ఆవిష్కరిస్తున్నారు. అధికార యంత్రాంగం కూడా అంతే నిమగ్నతతో సమావేశంలో పాలుపంచుకుంటున్నారు. ఈ సమావేశం మిషన్ తెలంగాణకు స్ఫూర్తిని ఇవ్వాలి. పనులు పెండింగులో పెట్టడం కాకుండా, పనులు పూర్తి చేయడానికి ఏమి చేయాలన్నదే లక్ష్యంగా అధికార యంత్రాంగం చొరవ తీసుకోవాలి. కొంత మంది అధికారుల్లో ఇంకా పాత పద్ధతులు పోలేదు. ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఫైళ్లతో బంతాట ఆటాడుకుంటున్న అధికారులు ఉన్నారు. ఫైళ్ల పరిష్కారంలో సచివాలయంలోనే విపరీతమైన జాప్యం జరుగుతున్నదన్న విమర్శలు వస్తున్నాయి. నిజమే పూర్తిస్థాయిలో అధికారుల విభజన జరుగకపోవడం, సిబ్బంది ఎవరు ఎక్కడ ఉంటారో తేలకపోవడం ఇప్పటికీ సమస్యలు సృష్టిస్తున్న మాట వాస్తవమే. కానీ అది ప్రభుత్వానికి, నాయకత్వానికి సంబంధించిన సమస్య. తమకు పనులు కావడం లేదన్నది పౌరుల సమస్య. వీటిని అధిగమించడానికే ముఖ్యమంత్రి అన్నట్టు ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ కావాలి. తెలంగాణ ప్రజలకు సత్వర ఫలితాలు అందించే దిశగా అందరూ కంకణబద్ధులై ముందుకు సాగాలి.

Author: kattashekar

Former Editor, Namasthe Telangana Daily

One thought on “ఇప్పుడు అవసరం మిషన్ తెలంగాణ”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s